Thursday, 28 November 2013

కార్తీకమాసంలో పంచారామ సందర్శనం

కార్తీకమాసంలో పంచారామ సందర్శనం 

సాధారణంగా రద్దీ సమయాలలో పుణ్యక్షేత్ర సందర్శనం నాకు ఇష్టం ఉండదు. పుణ్యం మాట దేవుడెరుగు. ఆ ఇబ్బందులు పడలేమనే అలా వెళ్ళం. అందుకే ఖాళీ సమయాలలో ఆయా క్షేత్రాలు దర్శించి సావకాశంగా చూడటం అలవాటైంది. పంచారామాలను ఇది వరకు రెండు మూడు సార్లు అన్నీ ఒక్కసారే కాక పోయినా వీలుని బట్టి చూశాము. ఎందుకో ఈ సారి కార్తీక మాసంలో పంచారామ సందర్శనం చేయాలని అనిపించింది. మొదటి మూడు వారాలలో కుదరలేదు. ఇక నాల్గవ వారంలో ఆదివారం రాత్రికి ఉయ్యూరు నుంచి RTC వాళ్ళు ఈ స్పెషల్ బస్ ఏర్పాటు చేశారని తెలిసి మా అబ్బాయి రమణతో వివరాలు కనుక్కోమని చెప్పాం. వాడు అడిగి తెలుసుకొని బుక్ చేస్తే ఆయన ఇంటికే వచ్చి బుక్ చేస్తాడని చెప్పాడు. అట్లాగే RTC ఉద్యోగి వెంకటేశ్వర రావు మా ఇంటికి వచ్చి డబ్బు కట్టించుకొని నాకు, మా శ్రీమతి ప్రభావతికి, మా మనుమరాలు రమ్యకు టికెట్స్ బుక్ చేశాడు. పెద్దలకు 490 రూపాయలు పిల్లలకు 380 రూపాయలు. మొత్తం రాను పోను 700 కిలోమీటర్ల ప్రయాణం. చౌకే అనిపించింది. ఆదివారం రాత్రి పదకొండున్నరకు బస్సు బస్సుస్టాండులో బయల్దేరుతుందని అన్నీ చూసిన తర్వాత సోమవారం రాత్రి పన్నెండుకు ఉయ్యూరు చేరుతుందని చెప్పాడు. సోమవారం పంచారామ దర్శనం అని ఏంతో సంతోషించాం.

ఆదివారం రాత్రి ఎనిమిదింటికే భోజనాలు పూర్తీ చేసుకొని పదకొండు గంటలకు ఆటోలో ముగ్గురం బస్ స్టాండ్ చేరాం. "పల్లె వెలుగు బస్సు". రాత్రి పన్నెండు గంటలకు ఉయ్యూరులో బయల్దేరింది. మొత్తం 53 మంది, ఇద్దరు డ్రైవర్లు జోగేశ్వరరావు వెంకటేశ్వర రావు. ఆదివారం రాత్రికి బెజవాడ, అక్కడి నుండి అమరావతికి రాత్రి రెండుమ్బావుకు చేరింది. దర్శనం చేసి ఎప్పుడు మళ్ళీ తిరిగి రావాలో డ్రైవర్లు ఎవరికీ చెప్పలేదు. ఇది ఒక లోపం.

దేవాలయం ఆవరణలో ఉన్న పంపుల దగ్గరే ఆడ, మగా అందరం స్నాలు చేశాం. అక్కడే ఉన్న రావి, ఉసిరి చెట్ల కింద ఆడవాళ్ళు దీపాలు వెలిగించుకొన్నారు. ఇదంతా అయ్యే సరికి మూడున్నర అయింది. వెంటనే అక్కడే ఉన్న దర్శనం లైనులో నిల్చున్నాం. ఒక్కో టికెట్టు నూట పాతిక రూపాయలు. కొని వెంటనే ముందుకెళ్ళాం. అక్కడి నుండి సరాసరి మెట్లు ఎక్కి శ్రీ అమరేశ్వర స్వామిని సందర్శించాం. దివ్య దర్శనంగా భాసించింది. ఉషోదయానికి పూర్వమే ప్రభాత శివ దర్శనం అయినందుకు ఏంతో సంతృప్తిగా ఉంది. అమ్మ వారు శ్రీ బాలచాముండీ దేవిని, క్షేత్ర పాలకుడు శ్రీ వేణు గోపాల స్వామిని దర్శించి బయటికి వచ్చేసరికి తెల్లవారు ఝామున నాలుగుమ్బావు మాత్రమే అయింది. బస్సు సత్తెన పల్లి రోడ్డులో ఉందని తెలుసుకొని అక్కడికి చేరాం. అక్కడ ఒక బడ్డీ కొట్లో మంచి కాఫీ తాగాం. ఆరురూపాయలు ఒక్కో కాఫీ. వెంటనే బస్ తలుపు తీసి అందులో ఎక్కి కూర్చున్నాం. ఇలాంటి అవకాశం రాదు అనుకోని నాతొ తెచ్చుకొన్న పుస్తకాలు తీసి సంధ్యా వందనం నిత్య పూజ చదువుకొని తర్వాత మహాన్యాసం చదివినాక చమకాలతో ఏక రుద్రాభిషేకం చదివి, దశ శాంతులు సామ్రాజ్య పట్టాభిషేకం పూర్తీ చేసి, శివ అష్టోత్తర, శతనామావళి పూర్తీ చేశా. ఆ తర్వాత "బిల్వ అస్తోత్తరం" కూడా చదివి పూర్తీ చేశాను. ఇదంతా అయ్యే సరికి ఆరు గంటలయింది. కొందరు అక్కడి రోడ్ మీద ఉన్న దుకాణాలలో టిఫిన్లు చేశారు. మేము మాత్రం ఇంటి నుంచి తెచ్చుకొన్న గారేలు, బిస్కట్లు తిని, కమలాలు తిని మందులు వేసుకోన్నాం. ఉదయం తొమ్మిదింటికి అందరు చేరారు. డ్రైవర్లు ఇద్దరూ మంచి వాళ్ళే. బస్సు కూడా కత్తి లాగా ఉంది. డ్రైవర్లూ కత్తులే. అందుకే యెంత దూరం అయినా యిట్టె నరికేసి నట్లు ..బస్ ను బాగా నడిపించారు. ముద్దు ముద్దుగా తొమ్మిదింటికి అంటే మేము దిగిన ఏడు గంటల తర్వాత బయల్దేరింది. ఈ ఆలస్యం రోజంతా ఇబ్బంది పెట్టింది.

పంచారామాలు, వాటి వివరాలు

  1. అమరావతి గుంటూరు జిల్లాలో ఉంది. దీనిని అమరారామం అంటారు. స్వామి అమరేశ్వర స్వామి. ఇంద్రుడు ప్రతిస్టించాడు. ఆయన ముఖం అఘోరం. స్వరూపం శాంతి స్వరూపం. అమ్మవారు బాలచాముండేశ్వరి .
  2. రెండోది పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలోని భీమేశ్వరవామి. అలాగే ప్రక్కనే గునుపూడిలో ఉన్న సోమేశ్వర స్వామి. స్వామి పేరు సోమేశ్వరుడు. సద్యోజాత ముఖం. స్వరూపం నిత్య నూతనం. చంద్ర ప్రతిష్టితం. అమ్మ వారు పార్వతి దేవి. ఈ క్షేత్రాన్ని సోమారామం అంటారు.
  3. మూడవది పశ్చిమగోదావరిలోనే పాలకొల్లులో ఉన్న క్షీరారామం. స్వామి రామలింగేశ్వరుడు. ఈశాన ముఖం. లోకమంతా తానే అయిన స్వరూపం. శ్రీ రాముడు ప్రతిష్ట చేసిన లింగం. అమ్మవారు పార్వతి దేవి.
  4. నాల్గవది ద్రాక్షారామం. తూర్పు గోదావరి జిల్లాలో దాక్షారంలో ఉంది. స్వామి భీమేశ్వరుడు. తత్పురుష ముఖం. స్వరూపం ఆత్మ. స్వయంభువు . అమ్మ వారు మాణిక్యాంబ.
  5. అయిదవది కుమారారామం. తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోటలో ఉంది. స్వామి కుమారారామ భీమేశ్వరుడు. వామ దేవ ముఖం. సత్య సుందర స్వరూపం. కుమార స్వామి ప్రతిష్టితం. అమ్మవారు బాలా త్రిపుర సుందరి.
అమరారామం
కృష్ణానదీ తీరంలో ఉన్న మహా మహిమాన్విత పుణ్యక్షేత్రం అమరారామం. ఇంద్ర ప్రతిష్ట కనుక అమరేశ్వరుడు అయాడు. తారకాసుర కంఠాన్నిశివుడు చేదించినప్పుడు శివుని అమృత లింగం అయిదు భాగాలుగా విడిపోయి ఒక భాగం అమరావతిలో పడింది. దీనిని ఇంద్రుడు ప్రతిస్తించాడు. మిగిలినవి పైన చెప్పిన నాలుగు చోట్లపడి ఆరామాలయ్యాయి. కృష్ణానది పడమటి దిశ నుంచి తూర్పుకు మలుపు తిరిగిన చోట ఆలయం నిర్మించారు. ఈ క్షేత్ర మహాత్మ్యాన్ని గురించి స్కాంద, బ్రహ్మ, పద్మ పురాణాలలో ఉంది. ఈ ఆలయానికి మూడు ప్రాకారాలున్నాయి. నాలుగుదిక్కులా నాలుగు ధ్వజ స్తంభాలున్నాయి. దక్షిణ ద్వారంలో ముఖ మండపం ఉంది. తూర్పు ద్వారానికి ఎదురుగా కృష్ణా నదీ ప్రవాహం ఉంటుంది. ఇది పంచాయతన క్షేత్రం కూడా అంటే గణపతి, అంబిక, సూర్యనారాయణ, శ్రీ మహా విష్ణువు అంశ అయిన వేణు గోపాలస్వామి ఉంటారు. క్షేత్ర పాలకుడు కాల భైరవుడు. ఇది శివ కేశవులకు అభేదమైన క్షేత్రం. మూల విరాట్ శ్రీ అమర లింగేశ్వర స్వామి 36 అడుగుల ఎత్తున్న లింగాకారం. పై అంతస్తులో 9 అడుగులు ఎత్తైన శ్వేత లింగాకారం ఉండగా, మిగిలిన 23 అడుగుల లింగం కింది అంతస్తులో గోడ కట్టి మూసి వేయ బడి ఉంది.ఏకాదశ లింగాలు మూడు ప్రాకారాలలో ప్రతిస్తింపబడ్డాయి. ముఖ మండపం దక్షిణ ముఖం గాను, గర్భాలయం తూర్పు ముఖంగా ఉంది. మొదటి ప్రాకారంలోకి ప్రవేశించగానే ప్రాకార దేవతలు ప్రణవేశ్వరుడు, శంకరాచార్యులు, కాశీవిశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, దత్తాత్రేయుడు, రుద్రపాదాలు, జ్వాలాముఖీదేవి, అగస్త్యేశ్వరుడు, పార్దివేశ్వరుడు, సోమేశ్వరుడు, నాగేశ్వరుదు, మహిషాసుర మర్దిని, కోసలేశ్వరుడు, వీరభద్రుడు అనే దేవతామూర్తులను సందర్శించాలి.తూర్పు ద్వారానికి ఎదురుగా కృష్ణానది స్నానఘట్టం కనీపిస్తుంది. ఇక్కడి నుంచి మొదటి ప్రాకారంలోకి వస్తే పశ్చిమ ద్వారం వైపు ఉత్తరాభి ముఖంగా లింగాకారంలో అన్నపూర్ణా సహిత కాశీ విశ్వేశ్వరుడు, గణపతి, నందిని దర్శించాలి. తూర్పు ముఖంగా ఉన్న జ్వాలాముఖి అమ్మ వారిని దర్శించాలి. మారేడు వృక్షాలు, పున్నాగ వృక్షాలు పవిత్రతకు చిహ్నాలుగా ఉంటాయి. కృష్ణానది మరొక వైపు ఎదురుగా కనీపించే "వైకుంఠ పుర క్షేత్రం" చూస్తె పంచారామాలలో ఉన్న మొదటి క్షేత్రమైన అమరావతి వైభవం, ప్రత్యేకత తెలుస్తాయి.

రెండో ప్రాకారం తూర్పు ద్వారం గుండా ప్రవేశిస్తే కృష్ణమ్మ పరవళ్ళు ఒళ్ళు గగుర్పోడుస్తాయి. ప్రాకారం లోపల ప్రదక్షిణంగా వెళ్తే విఘ్నేశ్వరుడు, కాలభైరవుడు మధ్య నవగ్రహమండపం, అక్కడే శ్రీ కృష్ణ దేవ రాయలు, అమరావతి ప్రభువు వాసి రెడ్డి వెంకటాద్రి కాలాలలో, తులాభారం తూగిన మండపాలున్నాయి. తర్వాత నవగ్రహమండపం, దానికెదురుగా యాగాశాల చూడచ్చు. పడమటి వైపు సంతాన వేణుగోపాలస్వామి, వాయవ్యంలో కుమారస్వామి, ఈశాన్యంలో సిందూరం రంగులో శ్రీ ఆంజనేయస్వామి.మూడవ ప్రాకారంలో 23 మెట్లు ఎక్కి పైకి వెళ్లి ఆగ్నేయంలో పస్చిమాభి ముఖంలో ఉన్న కాళహస్తీశ్వర స్వామిని దర్శించ వచ్చు. కొంత దూరం కిందికి నడిస్తే మెట్ల దారి కనీపించి నైరుతికి వెడితే తూర్పు ముఖంగా శ్రీశైలమల్లేశ్వర స్వామిని దర్శించవచ్చు. ప్రదక్షిణం చేస్తూ వెడితే ధ్వజ స్తంభం కనీపిస్తుంది. అక్కడ గోడ పై ఉన్న జ్యోతిర్లిన్గాలను చూడాలి. తూర్పు ముఖంగా కాశీ విశ్వేశ్వరుడు ఉంటాడు. తూర్పు ధ్వజ స్తంభం వద్ద సూర్య భగవానుడిని చూడాలి. ఇక్కడి నుంచి సభా మండపంలోకి వెళ్ళాలి. ఉత్త్తర దక్షిణాభి ముఖంగా ఉన్న బాలచాముండేశ్వరి అమ్మ వారిని దర్శించి తరించాలి. నంది మండపం, నందిని చూసి, గర్భాలయంలో ఉన్న 9 అడుగుల లింగాకార అమరేశ్వర స్వామి మూల విరాట్టును దర్శించి జన్మ చరితార్ధం చేసుకోవాలి. స్వామికి అభిషేకాలు నిర్వహించుకో వచ్చు, శుద్ధ స్పటిక లింగాకార శివ లింగమే అమరేశ్వర లింగం. వెనక్కి వెళ్లి నంది మండపంలో శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించి శివ కేశవులకు భేదం లేదని గ్రహించాలి. తర్వాత నిలుచున్నా ప్రమాణంలో ముఖం అంతా పసుపు, ముఖం పై యెర్ర కుంకుమ బొట్టులో ఉన్న బాల చాముండీ శ్వరి అమ్మ వారిని దర్శించి అనుగ్రహం పొందాలి. మూడవ ప్రాకారం పైన తారకాసుర వధ ఘట్టం మొత్తం రంగు చిత్రాలలో చిత్రింప బడి ఉండటం చూస్తాం. కార్తీకంలో ను, మహా శివరాత్రి నాడు ఇక్కడ విశేష కార్య క్రమాలు జరుగుతాయి.

అమరావతి పూర్వపు పేరు ధాన్య కటకం. ఒకప్పటి ముఖ్య పట్నం. కోట్ల రాజ వాఆఅమ్శస్తులు పాలించారు. వెంకటాద్రి నాయుడు వల్ల ఇక్కడ పట్నం ఏర్పడింది. 1795లో రాజధానిని చింతపల్లి నుంచి అమరావతికి మార్చాడు. తన పరగణాలో ఒకే ముహూర్తంలో 108శివ లింగాలను వెంకటాద్రి నాయుడు ప్రతిస్టించాడు. శాతవాహనులు మొదలైన రాజులెందరో స్వామిని దర్శించి కానుకలందించారు. ఆలయంలో ఎక్కడ చూసినా శిలాశాసనాలు కనిపిస్తాయి. మూడవ ప్రాకారంలో ఉత్తర దక్షిణ ద్వారాల వద్ద, రాజా వెంకటాద్రి నాయడి ముఖ మండపం ఉంది. కొమ్మ నాయుని శాసనం, కోట కేత రాజుల శాసనాలు, అనవేమా రెడ్డి శాసనం, కృష్ణ దేవరాయ శాసనం, హాద్రికం పెద్దప్పం గారి శాసనం ముఖ్యం గా అందరూ చూడాలి.

దీనికి దగ్గరలో ధరణి కోటలో బౌద్ధ స్తూపం, మ్యూజియం తప్పక చూడాల్సినవి. స్తూపం శాలి వాహనుల కాలంలో 100అడుగుల ఎత్తు 138 అడుగుల వ్యాసం, 521 అడుగుల చుట్టు కొలత గల జాతక కదా విశేషాలతో ఉన్న శిల్ప కళా వైభవం వర్ణనా తీతం. నాగ రాజుల కాలం నుండి నాగార్జునుని కాలం వరకు నాల్గు దశల్లో ఇది పూర్తీ అయింది. ఇక్కడి విశ్వ విద్యాలయంలో శిల్పం చిత్ర లేఖనం, సంగీతం వాస్తు శాస్త్రం, ఆరోగ్య శాస్త్రం, వైద్య శాస్త్రం మొదలైనవి బోధించే వారు. చైనా టిబెట్, బర్మా, సింహళం నుంచి కూడా విద్యార్ధులు ఇక్కడికి వచ్చి విద్య నేర్చే వారు.అమరావతి మ్యూజియం మన దేశం లోనే మొదటి శ్రేణికిచెందింది. ఆలయం దగ్గరే షిర్డీ సాయి, సత్యశాయి, కపోతేశ్వర ధ్యాన మందిరాలు చూడదగినవి. కృష్ణానదికి ఎదురుగా ఎత్తైన తిన్నె మీద ధ్యాన ముద్రలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామిభారీ విగ్రహం దర్శనీయమైంది. అందువల్ల అమరావతి హిందువులకు, బౌద్ధులకు ప్రధాన ఆరాధనా స్తలం అయింది.మా పంచ రామములు బస్సు అమరావతిలో దాదాపు నాలుగు గంటలు ఆలస్యంగా ఉదయం తొమ్మిదింటికి బయల్దేరింది. బెజవాడ బెంజ్ సర్కిల్ కు పదిన్నరకు చేరి అక్కడి నుండి కంకిపాడు వచ్చి అక్కడ పావుగంట రీసెస్ కోసం ఆగి, మానికొండ గుడివాడ, కైకలూరు, ఆకివీడు, అర్తమూరు, ఉండి మీదుగా భీమవరంకు మధ్యాహ్నం రెండు గంటలకు సుమారు అయిదు గంటలు ప్రయాణించి చేరింది. డ్రైవర్లు అరగంటలో దర్శనం చేసుకొని రావాలని చెప్పారు. బస్ ఆగిన చోటు నుండి గుడికి వెళ్ళటానికే పావు గంట పట్టింది. దారిలో వినాయక స్వామి గుడి షిర్డీ సాయి బాబా గుడి అయ్యప్ప గుడులు చూసి శ్రీ భీమేశ్వరాలయం చేరాం. విపరీత మైన రద్దీ గా ఉంది. యాభై రూపాయల టికెట్ కొని ముగ్గురం లైన్ లో నిలబడి ఉన్నాం. దాదాపు గంట ఇరుకు క్యూలో కాళ్ళు నెప్పి పుట్టేలా నిలబడి భీమేశ్వర స్వామిని దర్శించాం. అమ్మ వారు పార్వతి దేవిని సందర్శించాం. అసలు ఇక్కడ చూడాల్సింది గునుపూడిలో ఉన్న సోమేశ్వరాలయం అందుకే దీనికి సోమారామం అని పేరొచ్చింది. కానిమా బస్ వాడు దీనినే చూపించాడు. ఇది వరకే మేం సోమారామం చూశాం కనుక నిరాశ పడలేదు.

చాళుక్య భీముడు అనే రాజు పేర భీమవరం ఏర్పడింది. భీమవరం దగ్గర ఉండి రాజులు వీర శైవులు. వీరికాలంలో నూజివీడు జల్లి సీమలలో భీమవరం శోభాయమానంగా విలసిల్లింది. 1434 లో దేవకుమారుడు శింగన అనే భక్తుడు గునుపూడి భీమవరం సోమేశ్వర స్వామికి ఎన్నో కానుకలు సమర్పించాడు. ఒకసారి జటాజూట రాజుకు ఓంకార స్వామి ప్రత్యక్షమై గునుపూడిలో సోమరామంలో శివుని అమృత లింగ శకలం పడి ఉందని, అక్కడికి వెళ్లి చంద్ర పుష్కరిణిలో స్నానం చేసి అన్నపూర్ణా సమేత సోమేశ్వర దర్శనం చేస్తే మూగతనం పోతుందని చెప్పాడు. అలాగే మాటలు వచ్చాయి. రాజ్యానికి చేరాడు రాజుగా పట్టాభి షిక్తుదయ్యాడు.

SOMESWARA SWAMY TEMPLE SOMESWARA SWAMY TEMPLE

సోమేశ్వర ఆలయం ముందున్న చంద్ర పుష్కరిణిలో స్నానం చేయాలి. దానికి ఎదురుగా పదిహేను అడుగుల నందీశ్వర దర్శనం చేయాలి. నందిని దాటి ఏడు అంతస్తుల ముఖ మండపం దాటి లోపలికి వెడితే, దక్షిణంలో సూర్య నారాయణుడు ఉత్తరంలో సుబ్రహ్మణ్య స్వామి, ఈశాన్యంలో నవగ్రహాలూ చూసి ధ్వజ స్తంభం దాటి తూర్పు ముఖంలో గణపతి, ఉత్తరాన కుమార స్వామి, సభా మండపం దాటి అంతరాలయం చేరితే దక్షిణ ముఖంగా ఉత్తరం వైపున్న పార్వతీ అమ్మవారు కోటికాంతులతో విరాజిల్లుతూ దర్శన మిస్తారు. గర్భాలయంలో సోమేశ్వర లింగం రెండు అడుగుల ఎత్తున కన్పిస్తాడు. దక్షిణ ద్వారం గుండా బయటికి వచ్చి మెట్ల మీదుగా రెండో అంతస్తు చేరితే సోమేశ్వర స్వామి శిరసు పై రెండో అంతస్తులో నాలుగు అడుగుల ఎత్తున్న అన్నపూర్ణ అమ్మవారు దర్శన మిస్తారు. దక్షిణాన కళ్యాణ మండపం ఉంది.

క్షేత్ర పాలకుడైన జనార్దన స్వామి పశ్చిమంలో తూర్పు ముఖంగా ఉంటాడు. అందువల్ల ఇక్కడ వివాహాది శుభ కార్యాలు చేసుకోవచ్చు. శ్రీ నాదకవి సార్వ భౌముడు భీమపురాణంలో అగస్త్య మహర్షి సోమారామాన్ని సందర్శించినట్లు రాశాడు.

రోహిణి మీద అధిక ప్రేమతో చంద్రుడు మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేస్తే దక్షుడు కోపగించి శపిస్తాడు. శాప విమోచనం తెలపమంటే చంద్రపుష్కరిణిలో స్నానం చేసి అక్కడి శివుడిని అభిషెఏకిస్తే విమోచనం జరుగుతుందని చెప్పాడు. అలాగే చేశాడు. అందుకే అది చంద్రపుష్కరిణి అని పేరొచ్చింది. స్వామికి సోమేశ్వర స్వామి అని పేరొచ్చింది.

మళ్ళీ బస్సు దగ్గరకు చేరే సరికి మూడున్నర అయింది. అందరు వచ్చేసరికి అయిదు దాటింది. అప్పుడు బయల్దేరి మావూళ్ళమ్మ అమ్మవారిని దర్శించాం. మేము తెచ్చుకొన్న పూరీలను కూరతో పాటు కడుపు నిండా లాగించాం. కమలాలు కొని తిన్నాం. ఇక్కడ రోడ్లు ఇరుకు. అక్కడి నుండి బయల్దేరి రాత్రి ఏడున్నరకు పాల కోల్లు చేరాం. ఇక్కడ క్షీరామమం ఉంది.

క్షీరారామం
శ్రీ మహా విష్ణువు చే ప్రతిస్తింప బడి బ్రహ్మ చేత సేవింపబడిన దివ్య క్షేత్రం క్షీరారామం. పావు తక్కువ ఎనిమిదికి బస్ ఆగిన చోటు నుండి మేమిద్దరం నడుచుకొంటూ వచ్చి క్షీరారామ రామలింగేశ్వర్ఫా స్వామిని దర్శించాం. మా మనవరాలు రమ్య భీమవరం దెబ్బకు అలసిపోయి రాలేనంది. మిగిలిన రెండు క్షేత్రాలకూ రమ్య రాలేదు బస్సులోనే ఉంది. వందలాది పంచారామ స్పెషల్ బస్సులు రాష్ట్రం నలుమూలల నుండి ఈ నాల్గవ సోమవారం నాడు పంచారామ దర్శనం కోసం వేలాది భక్తులు తరలి వచ్చారు. అన్నీ లక్సరీ బస్సులే. రామ లింగేశ్వర దర్శనం తర్వాత పార్వతీ అమ్మవారిని గణపతి మొదలైన దేవతామూర్తులను జనార్దనస్వామిని దర్శించం. ఆలయం బయట పాలకొల్లు స్పెషల్ పాపడి పావుకిలో నలభై రూపాయలు పెట్టి కొన్నాం. అక్కడి నుండి బస్ దగ్గరకు చేరాం. దగ్గరలో ఉన్న హోటల్లో రెండు ప్లేట్ల ఇడ్లీ లు తెచ్చాను. నేను మా ఆవిడా చెరో ప్లేట్ తిన్నాం. ప్లేట్ పది రూపాయలు రెండిడ్లీలు. ఒక ప్లేట్ కింద లెక్క. బాగున్నాయి. ఇప్పుడు క్షేత్ర మహాత్మ్యాన్ని తెలుసు కొందాం.

Kshira rama temple main entrance inside temple view

పూర్వం వ్యాఘ్ర పాడుదు అనే మహర్షికి ఉపమన్యువు అనే కుమారుడు పుట్టాడు. కొడుకు సర్వ వేదం విదుడై పవిత్రంగా జీవించేవాడు. సరైన యోగాభ్యాసం చెయ్యక పోవటం వల్ల యోగ భ్రస్టూడై నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో పుడతాడు. తల్లి పాలు కొని పోయ్యలేక పిండి పాలు పోసి పెంచుతుంది. ఒక సారి తల్లితో మేనమమల ఇంటికి వెడితే అక్కడ మంచి ఆవుపాలు తాగి ఆ రుచి మరిగి ఇంటికి వచ్చిన తర్వాత పిండి పాలు తాగనని మారాం చేస్తాడు. రోజు రోజుకీ చిక్కి పోతున్నాడు. తండ్రి కొడుక్కి శివ పంచాక్షరి బోధించి జపించమంటాడు. ఉపమన్యువు మహా నిష్టతో జపిస్తాడు. భక్తికి మెచ్చిన శివుడు మారు వేషంలో వచ్చి శివ నింద చేస్తాడు. యితడు మంత్రించిన విభూతిని శివుడి పై జల్లగా వేష దారి శివుడు అర్ధ నారీశ్వరుడై పోతాడు. ఉపమన్యువును ఎత్తుకొని పార్వతీ దేవికి ఇచ్చి పెంచమంటాడు. ఆమె హస్తం నుంచి పాలు ప్రవహిస్తాయి. అప్పుడు ఆ ప్రాంతం అంతా క్షీరకొలను అంటే పాలకొలనుగా మారిపోయింది. అదే పాలకొల్లు క్షీరారామ అయింది. ఈ గ్రామం ఉపమన్యు పురం అయింది. పాలుకారే మర్రి, రావి చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల కూడా పాలకొల్లు అయింది అంటారు.

త్రిమూర్తి ఆలయం గా క్షీరారామం ప్రసిద్ధి చెందింది. ఆలయం లో పార్వతీ పర మేశ్వరులు, లక్ష్మీ నారాయణులు, సరస్వతీ సహిత బ్రహ్మ దేవుడు కొలువై ఉన్నారు. దేవాలయ శిఖరం 120 అడుగుల ఎత్తు ఉండి దూరానికీ దర్శన మిస్తుంది. గోపురం పై తపోనిస్టలో ఉన్న శివుడు ఇంద్రాది అష్ట దిక్పాలకులు, పంచ ముఖ పరమేశ్వరుడు, నాట్య గణపతి, లక్ష్మీ గణ పాటి, సరస్వతి గజ లక్ష్మి, కాలియా మర్దనం, శివలీలలు, దశావతారాలు మొదలైన ఎన్నో శిల్పాలు కను విందు చేస్తాయి. 1774ఏప్రిల్ 14నశ్రీ బచ్చు అమ్మయ్య గారు గోపుర నిర్మాణానికి పూనుకోన్నారని స్తానికులు అంటారు.


Carvings on the wall

దేవాలయ రాజగోపురం దాటి లోపలి వెడితే శివుని సిమెంటు విగ్రహం పెద్ద సైజ్లో కనీ పిస్తుంది. ధ్వజస్తంభం ఉత్తరాన ఆంజనేయ స్వామి గుడి, దక్షిణంలో వీరభద్రుని గుడి ఉంటాయి. ఉత్తర దక్షిణంగా విశాల మండపం వివాహాది శుభ కార్యాలకు యజ్ఞాలకు ఉపయోగ పడేట్లుగా నిర్మించారు . దీనినే " పంచముఖ ప్రాంగణం " అంటారు . శ్రీ క్షీరా రామ లింగేశ్వర స్వామి చుట్టూ జనార్దన స్వామి, వినాయకుడు సుబ్రహ్మణ్యుడు, గోకర్నేశ్వరుడు వేర్వేరు విమాన శిఖరాల తో కొలువై దర్శన మిస్తారు. స్పెషల్ దర్శనం పది రూపాయలు . శ్రీ రాముడు ప్రతిష్ట చేసిన రామ లింగేశ్వర స్వామి స్పటిక లింగం తారకాసుర వధలో అతని కంఠంలో ఉన్న అమృత లింగాన్ని కుమార స్వామి చేదిన్చినప్పుడు పడిన నొక్కులే పంచారామాలలో లింగాలపై నొక్కులుగా కనీ పిస్తాయి ఇక్కడి శివలింగం మొన దేలి ఉండటం వల్ల " కొప్పు " భాగాన్ని సూచిస్తోందని అంటారు . శాసనాలలో ఈ స్వామిని " కొప్పు రామ లింగేశ్వరుడు "గా పేర్కొన్నారు . ఈ లింగం అమృత లింగం లోని శిరస్సుభాగమే నని అందరూ చెబుతారు.

ఉత్తరాయణ, దక్షిణాయన కాలాలో సూర్యోదయాన సూర్య కిరణాలు పెద్ద గోపురం రెండ వ అంతస్తు నుండి ప్రాకారాలను దాటి రామ లింగేశ్వర లింగం పై ప్రసరించటం ఇక్కడి విశేషం . ఆలయ ముఖ ద్వారం పై విష్ణు మూర్తికి క్షీరా రామేశ్వరుడు " సుదర్శన చక్రం " ప్రసాదించే సుందర శిల్పం చూడ ముచ్చటగా ఉంటుంది . ఇక్కడి శివుని అర్చిస్తే దారిద్ర బాధ ఉండదని నమ్మకం . ప్రాకార మండపంలో శిల్ప కళా విరాజమాన నందీశ్వర విగ్రహం ఉంది . పడమర " రుణహర గణపతి" ని దర్శించి నందీశ్వరుని కి ప్రదక్షిణం చేసి, శ్రీ క్షీరారామ లిన్గేశ్వరుడిని దర్శించాలి . ఈ గణపతిని దర్శిస్తే అప్పుల బాధలు ఉండవు అని నమ్మకం . స్వామి పవళింపు సేవ గది చూడాల్సిందే నటరాజ విగ్రహం ఆకర్ష ణీయం.

ఇక్కడి అమ్మ వారు పార్వతీ దేవి . స్వామికి ఎదురుగా దక్షిణాన ఉత్తర ముఖం గా, స్వామికి కుడి వైపు ఉంటుంది . శంకర భగవత్పాదులు ఇక్కడ శ్రీ చక్రమును ప్రతిష్టించారు . అమ్మవారిని " త్రిపుర సుందరీ దేవి "గా కూడా పిలుస్తారు . జనార్దన స్వామి లక్ష్మీ దేవి సమేతంగా ఇక్కడ లింగాన్ని ప్రతిష్టించి, పూజించి, కొలువైనాడు శంఖ, చక్ర గద, పద్మ ధరుడై, దశావతారాలు చెక్కిన మకర తోరణాలతో భక్త వత్సలుడై ఉంటాడు .

ప్రాకారంలో దుండి గణపతి, లలితా దేవి, వాసవీ కన్యకా పరమేశ్వరి, వీర భద్రుడు, సప్త మాతృకలు, బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి వైష్ణవి, వారాహీ, చాముండీ వాహనాల తో దర్శన మిస్తారు . నైరుతిలో సరస్వతి అమ్మ వారు పుస్తక పాణి యై దర్శన మిస్తుంది . శ్రీ సంతోష రూపా దేవి, దుర్గా దేవీలనూ చూడ వచ్చు పడమర తూర్పు ముఖంగా నెమలి వాహనం పై కార్తికేయుడున్నాడు . వాయవ్యంలో మహిషాసుర మర్దిని ఉత్తరాన కంచి కామాక్షి, నాగేంద్రస్వామి, సుందోప సుందులు, నట రాజు, దత్తాత్రేయ స్వామి, ఆది శంకరా చార్యులు, శనీశ్వరుడు రాధ కృష్ణుల విగ్రహాలు చూడ వచ్చు .

తూర్పు ప్రాకారంలో పశ్చిమ ముఖంగా సూర్య బగ వానుడు, కాశీ విశ్వేశ్వరుడు, నగరేశ్వరుడు బాణాసురుడు, కాల భైరవ విగ్రహాలున్నాయి . ఇక్కడి నాగేశ్వర స్వామిని దర్శించి చిమ్మిరి నైవేద్యం పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం . తూర్పున శనీశ్వరుడు లింగా కారంలో ఉండటం విశేషం . నగరేశ్వరుడిని అగస్త్య మహర్షి ప్రతిష్టించాడని చెబుతారు . శ్రీరాముడు రావణ వధ దోషాన్ని పోగొట్టుకోవటానికి చేసిన 108శివలింగ ప్రతిస్టలలో 106వ లింగాన్ని ఇక్కడే ప్రతిష్టించినట్లుస్థల పురాణం . .అందుకే పాలకొల్లు అపర కాశి అని పించు కొంటున్నది .

క్రీ శ. 918లో మొదటి చాళుక్య భీముడు ఈ పంచారామాలను గుర్తించి ఆలయాలు నిర్మించాడని చారిత్రిక కధనం. ఈ గుడిలో 75 శిలాశాసనాలున్నాయి. వాటిపై రంగులు పూయటంతో చరిత్ర కనుమరుగౌతోంది. 1136-1640 మధ్య కాలంలో చాళుక్యులు, రెడ్డి రాజులు, కాకతి రాజులు మరెందరో భక్తులు విశేషంగా దానాలు ఇచ్చారు అలయాభి వృద్ధికి కృషి చేశారు. 1176లో వెలనాటి చోడరాజు భార్య గుందాంబిక అఖండ దీపారాధన కోసం భూదానం ఇచ్చింది. 1276లో కోట గణపతిదేవ మహారాజు నాట్య మండపానికి కంచు తలుపులు పెట్టించాడు. 1296లో ఇతని రాణి ఒడయ మహాదేవి దీపావళికి దీపోత్సవానికి శివరాత్రి రోజు బ్రాహ్మణ అన్న సంతర్పనకు 10పుట్ల భూదానం చేసింది. 1316 లో శ్రీ రామనారాయణ చక్రవర్తి శనివార మండపాన్ని కట్టిస్తే, 1385లో కాటయ వేమారెడ్డి ప్రభువు పుష్ప వాహనాన్ని ఏర్పాటు చేశాడు. 1388లో అల్లారెడ్డి రెడ్డి ప్రభువు శివాలయాన్ని కట్టించి "అల్లాడేశ్వరుడు" పేర లింగ ప్రతిష్ట చేశాడు. 1415-1416లో బెళ్ళాపిన్నమనేని, నరహరినేని అనే భక్తులు బంగారు రధాన్ని, కళ్యాణ మండపాన్ని ఇచ్చారు 1596కే పవళింపు సేవ మందిరం ఉంది . 1714లో పాలకొల్లు నిజాం పాలనలోకి వెళ్ళింది. క్షీరారామం పంచారామమే కాకుండా "శిల్పా రామ క్షేత్రం" గా ప్రసిద్ధి చెందింది .

చైత్ర శుద్ధ దశమి నాడు స్వామి వారల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు . ఏకాదశి నాడు రధోత్సవం చేస్తారు 1972 లో శ్రీ రామలింగేశ్వర’’ ఓరిఎంటల్ కాలేజి " ని ఏర్పరచి సంస్కృతవిద్యా బోధన ను ఉచిత భోజన వసతి సదుపాయాలతో కల్పించారు .

పాలకొల్లులో బయల్దేరి రాత్రిపదకొండు నలభై అయిదు నిమిషాలకు ద్రాక్షారామం చేరాము. అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఇరవై రూపాయల స్పెషల్ దర్శనం టికెట్లు కొని భీమేశ్వర స్వామి దర్శనం కన్నుల పండువుగా చేసుకోన్నాం. ఆ తర్వాత అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారిని సందర్శించి పునీతులయ్యాం. ఆలయం చాలా పెద్ద ప్రాకారంలో ఉంది. ఇప్పుడు ఆలయ విశేషాలు తెలుసు కొందాం .

"ద్రాక్షారామాత్పరం క్షేత్రం – న భూతో న భవిష్యతి" అని వ్యాస భగవానుడు భీమఖండమహా పురాణంలో చెప్పాడు. పంచారామాలలో రెండవదిగా త్రిలింగ క్షేత్రాలలోను రెండవదిగా, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఉపలింగ క్షేత్రంగా ద్రాక్షా రామం వర్ధిల్లింది .

శివుడి అమృతలింగం రెండవ భాగం ఇక్కడ పడింది . దీన్ని పవిత్ర గోదావరి జలాలతో సంప్రోక్షణ చేసి ఇక్కడ ప్రతిష్టించాలని సప్త ఋషులు భావించారు . కాని ఇక్కడ అప్పుడు నదిలేదు . గోదావరిని ప్రార్ధించారు . ఆమె మహర్షులతో ప్రయాణమై వచ్చింది . కాని మార్గ మద్యంలో ఋషుల, రాక్షసుల ఆశ్రమాలన్నీ మునిగి పోయాయి దీనికి కోపించిన వారాంతా గోదావరిని అదృశ్యం అయేలా శపించారు . అప్పుడు " తుల్య భాగుడు " అనే రాక్షస రుషి మధ్య వర్తిగా ఉండి గోదావరిని అంతర్వాహినిగా ప్రవహించేట్లు చేస్తాడు . సప్తరుషులైన కశ్యప, అత్రి, జమదగ్ని, విశ్వా మిత్ర, గౌతమ, వసిష్ట, భారద్వాజుల చేత తీసుకొని రా బడింది కనుక దీనిని " సప్త గోదావరి " అంటారు . రాక్షసులతో వివాదం కారణంగా గోదావరి రాక ఆలస్యం అయి నందున శివుడు బ్రహ్మాది దేవతలా అభ్యర్ధన మేరకు ఇక్కడ ముహూర్త సమయానికి " భీమేశ్వరుడు " అనే పేరు తో మార్గ శిర శుద్ధ చవితి నాడు " స్వయంభు "గా వెలిశాడు . సప్తర్షులు వచ్చి విషయం తెలిసి నివ్వెర పోతారు. ఆలయం లోపలి వెళ్లాలని ప్రయత్నిస్తే అక్కడ విపరీత మైన వేడిగా ఉండటం గమనించారు . ఇంతలో ఆశీర వాణి’’ఇక్కడ స్వయంభుగా శివుడు వెలిశాడు . సూర్యుడు మొదటి సారిగా స్వామిని అర్చించాడు ఈ వేడి తగ్గటానికి ఈ గ్రామంలో ఎనిమిది దిక్కులలోను ఎనిమిది సోమ లింగాలను ప్రతిస్టిం చండి . అప్పుడు ఈ వేడి తగ్గు తుంది " అని వినబడింది.

అప్పుడు సప్తర్షులు తూర్పున కోలంకలో సూర్యుడు, ఆగ్నేయంలో దంగేరులో కశ్యపుడు, దక్షిణాన కోటి పల్లిలో అత్రి మహర్షి, నైరుతి కోరు మిల్లిలో భరద్వాజుడు, పడమర వెంటూరులో విశ్వా మిత్రుడు వాయవ్యం సోమేశ్వరంలో గౌతముడు, ఉత్తరాన వెల్ల గ్రామంలో వసిస్టూడు, ఈశాన్యం పెను మళ్ళలో జమదగ్ని మహర్షులు సోమేశ్వరుని పేర అష్ట లింగాలను ప్రతిష్టించారు . వీటినే " అష్ట సోమేశ్వర క్షేత్రాలు " అంటారు .

ద్రాక్షారామం పంచారామమే కాక పన్నెండవ శక్తి పీఠం కూడా . నవ బ్రహ్మ లలో ఒకరైన దక్ష ప్రజా పతి . ఇక్కడే యజ్ఞం చేశాడు అందువల్ల " దక్ష వాటిక " అయింది . ఇక్కడే పార్వతీ దేవిని అవమానించి అల్లుడు శివుడిని నిందించటం వల్ల పార్వతి యోగాగ్నిలో దహనం చెందింది శివుడిఆజ్న తో వీర భద్రుడు దక్షయ యజ్న విధ్వంసం చేసింది ఇక్కడే ఇక్కడే విష్ణువు చక్రాన్ని తినేశాడు భద్రుడు. సూర్యుని పళ్ళు రాల గొట్టాడు . బతిమాలితే మళ్ళీ ఇచ్చాడు . శివుడు భార్యా వియోగం తో పార్వతీ దేవి సతీదేవి శరీరాన్ని భుజం పై వేసుకొని విలయ తాండవం చేస్తుంటే విష్ణువు చక్రం తో ఆమె దేహాన్ని పద్దెనిమిది ఖండాలు చేశాడు అవి పడిన చోటల్లా శక్తి పీఠం అయింది. ఇది పన్నెండవ శక్తి పీఠం అయింది.

ద్రాక్షారామం ఎత్తైన రాతి ప్రహరీతో నాలుగు వైపులా నాలుగు రాజ గోపురాలతో, అయిదు ప్రాకారాల మధ్య ఉంది. మొదటి ప్రాకారంలో కొబ్బరి తోటలో నైరుతి భాగంలో మంగళవార మండపం, వాయవ్యంలో 70 స్తంభాల సోమవార మండపం, ఈశాన్యములో రుద్ర తీర్ధం, కాల భైరవుడు, అష్ట భైరవులు, తూర్పున అశ్వత వృక్షం మొదలులో శంకర నారాయణులుంటారు. తూర్పున నందీశ్వరుడు ధ్వజ స్తంభం ఉన్నాయి. దక్షిణాన శ్రీ అన్నపూర్ణాసమేత విశ్వేశ్వర స్వామి, మేధా దక్షిణామూర్తి ఆలయాలున్నాయి.భక్తులు మొదట ప్రధాన ప్రాకార మండపం వద్ద కుడి వైపు నాట్యగణపతిని దర్శించి, ఎడమ వైపున డుండిగణపతిని చూసి, లోపలి వెళ్లి కుడివైపు శ్రీ రామ ప్రతిష్టితమైన క్షేత్రపాలకుడు లక్ష్మీ నారాయణులను దర్శించి, ఎడమ వైపున శ్రీ కృష్ణ దేవరాయలు ప్రతిష్టించిన విరూపాక్ష స్వామిని చూసి ఆలయ నమూనాను చూడాలి. బాల భీమేశ్వరుడు, నటరాజస్వామి, సప్త మాతృక దర్శనం చేయాలి. సూర్య నారాయణ, సుబ్రహ్మణ్య స్వాములని చూడాలి. మహిషాసుర మర్దిని, చండీశ్వర స్వామి నవగ్రహ, అష్ట దిక్పాలక మండపాలు, శ్రీ వీరభద్రేశ్వరాలయం, వటుక భైరవుడు, లక్ష్మీ గణపతి, నకులేశ్వరుడు, చతుర్ముఖ బ్రాహ్మలు, మొదలైన ప్రాకార దేవతలను చూడాలి.

స్వామి ప్రధాన ఆలయంలో కింది భాగంలో 14 అడుగుల ఎత్తుతో స్పటిక లింగాకారంగల స్వామి లింగ స్వరూపంగా కింది అంతస్తు నుండి పై అంతస్తుకు ఉంటుంది. ప్రధాన ఆలయం కింద భాగంలో శ్రీ సూరేశ్వర స్వామి, శ్రీ దుర్గా దేవి, శ్రీ ఆంజనేయ స్వామి, 108 శివ సాల గ్రామాలతో కూడిన "భీమ సభ". మధ్య ఉన్న స్వామి వారి మూల విరాట్ కు (దీనినే "చీకటి కోణం" అంటారు )ప్రదక్షిణం చేసి, మూడవ ప్రాకారం చుట్టి ప్రవేశించాలి. నాల్గవ ప్రాకారం చూసి, కింది అంతస్తులో మూల విరాట్ కి నమస్కరించాలి. ఇక్కడ పూజ, అభిషేకాలుండవు. వెనక్కి వచ్చి దక్షిణంలో మొదటి ప్రాకారం దగ్గర పది మెట్లు ఎక్కి, పై అంతస్తులో నంది మండపం చేరి మళ్ళీ అయిదవ ప్రాకార ప్రదక్షిణ చేసి తూర్పు ఆగ్నేయంగా కైలాస గణపతిని చూసి ఈశాన్యాన పంచలోహ నటరాజ స్వామిని దర్శించి పార్వతి మందిరాలను చూడాలి. కింది భాగంలో పానవట్టం నుండి 14 అడుగుల ఎత్తు ఉంది పై అంతస్తు వరకు వ్యాపించిన భీమేశ్వర స్వామి పై భాగం మూడు అడుగుల లింగాన్ని దర్శించాలి. ప్రదక్షిణ మండపం లో దక్షిణ నైరుతి లో రాతి స్తంభం పై శ్రీ వ్యాస భగ వానుని విగ్రహం తప్పక దర్శించాలి. అంతరాలయం లో పార్వతీ అమ్మ వారు ఉత్సవ మూర్తులు ఉంటారు.

పై అంతస్తు గర్భాలయం లో మూడు వైపులా విశాల మైన కిటికీలతో కింది నుండి పైకొచ్చిన భీమేశ్వర మహా లింగాన్ని దర్శించ వచ్చు. ప్రక్కనే ఉన్న మాణిక్యాంబ అమ్మ వారిని దర్శించాలి. తూర్పు వైపు మెట్ల మీదుగా కిందికి దిగాలి. పది మెట్లు దిగితే శ్రీ చక్రస్థిత అష్టాదశ శక్తి పీఠాలలో పన్నెండవది అయిన మాణిక్యాంబ అమ్మ వారిని ప్రత్యెక ఆలయం లో దర్శించాలి.

మాఘ శుద్ధ ఏకాదశికి, భీష్మ ఏకాదశికి, మాణిక్యాంబ సహిత భీమేశ్వర స్వామికి, లక్ష్మీ నారాయణులకు ఒకే ముహూర్తంలో కల్యాణం నిర్వహించటం విశేషం. శివ కేశవ అభేదాన్ని ఇక్కడ చూడగలం.

ఈశాన్యంలో వెలుపలి ప్రాకారంలో డెబ్భై స్తంభాలతో సోమవార మండపంలో ఉత్సవాలు జరుగుతాయి. ఆలయానికి రెండు కిలో మీటర్ల దూరంలో వేగాయమ్మ పేటలో మాణిక్యాంబ అమ్మ వారి పుట్టిల్లు., అక్కడే అమ్మవారి పన్నెండవ శరీర భాగం పడిందని అంటారు. కల్యాణం రోజున స్వామి వారు ఊరేగింపుగా వేగాయమ్మ పేటకు వచ్చి వెళ్తారు.

క్రీ పూ. ఒకటవ శతాబ్ది నుండి ఈ క్షేత్రం ప్రసిద్ధమైంది. హాల శాత వాహనుడు హాలుడు గాదా సప్తసతిని సంకలనం చేశాడు. ఆయన సింహళ రాకుమారి లీలావతిని ఇక్కడే సప్త గోదావరి తీరంలో శ్రీ భీమేశ్వరాలయంలో వివాహం చేసుకొన్నట్లు లీలావతి కావ్యంలో రాశాడు.
గోరఖ్ పూర్ కళ్యాణ తీర్దాన్కాలులో లలితా రాగంలో జ్ఞాన పద శివ లింగ ప్రాదుర్భావ పటలంలో అష్టోత్తర దివ్య శత క్షేత్రాలలో "ద్రాక్షారామేత్ భీమేశం" అని వర్ణన ఉంది.
రాజశేఖర కవి రాసిన బాల రామాయణంలో ఈ స్వామి స్తుతి వర్ణన ఉంది.
కవి సార్వ భౌముడు శ్రీనాధుడు భీమఖండంలో ఈ స్వామి మహాత్మ్యాన్ని పరవశించి వర్ణించాడు.
"విభావంబునకు ప్రభవంబును, విలాసంబునకు నివాసంబును, నవ వర్గంబునకు వర్గంబును, ధర్మంబునకు మర్మంబును, దానంబునకు నిదానంబును, విద్యలకు నిలయమై " ద్రాక్షా రామ క్షేత్రం విలసిల్లిందని వర్ణించాడు.
కవి భయంకరుడు వేములవాడ భీమకవి " ద్రాక్షా రామ భీమేశ నందనుడన్ " అని చెప్పుకొన్నాడు.
ప్రౌఢ కవి మల్లన్న తన "రుక్మాంగద చరిత్ర" ను ఈ స్వామికి అంకితమిచ్చాడు.
పదహారవ శతాబ్ది వాడిన సూరన్న కవి "ధనభి రామ కావ్యం" ను ద్రాక్షారామ స్వామికి అర్పణ చేశాడు.
ఈ క్షేత్రానికి ఎందరెందరో రాజులు భూస్వాములు విలువైనవి దానం చేసినట్లు ఇక్కడున్న400 శాసనాల ద్వారా తెలుస్తోంది.

ఇక్కడి పంచ తీర్దాలైన – దక్ష యజ్ఞం జరిగిన దక్ష తీర్ధం, సతీదేవి శరీర భాగం పడిన ముక్తి క్షేత్రమైన వేగాయమ్మ పేట ఎల్లారమ్మ గుడి, పాప హారిణి అయిన భీమపేటలోని సోమ తీర్ధం, హిమవంతుడు తపస్సు చేసి శంకర వరం పొందిన హైమావతి క్షేత్రం, సప్త ఋషులచే గౌతమిని అంతర్వాహినిగా తీసుకురాబడిన సప్త గోదావరి తీర్ధ క్షేత్రం అందరు ఓపికగా చూడ దగినవి.

ఇక్కడే ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇంద్రేశ్వర, సిద్దేశ్వర, యోగీశ్వర, కాళేశ్వర, యమేశ్వర, వీరభద్రేశ్వర, బ్రహ్మేశ్వర, కపాలేశ్వర, కుక్కుటేశ్వర, సోమేశ్వర మహేశ్వర,సప్త కోటి రామ లింగేశ్వర క్షేత్రాలన్నీ ద్రాక్షా రామం చుట్టూ ఉన్నాయి. భీమేశ్వరాలయం మొదటి ప్రాకారం లో కాల భైరవాలయం వెనక రుద్ర తీర్ధం ఉంది. ఇక్కడ స్నానం చేస్తే పంచ మహా పాతకాలు నశిస్తాయి. ఆలయ వంశ పారం పర్య ట్రస్టీలు వేగాయం పేట జమీన్ దార్లు వాడ్రేవు రంగ నాయకమ్మ గారి కుమారులు వాడ్రేవు విశ్వ సుందర రావు బహద్దర్ ఆలయాన్ని అభి వృద్ధి చేశారు. 125 ఎకరాల ఈనాం భూమిని స్వామికి సమర్పించారు. వీరి మనుమడు రాజా వాడ్రేవు సుందర రత్నాకర రావు ఈ విషయాలను చూస్తున్నారు. ఆలయం దేవాదయ శాఖ ఆధ్వర్యం లో నిర్వ హింప బడుతోంది.

ద్రాక్షారామ సందర్శనం తర్వాత బస్సు బయల్దేరి రాత్రి రెండు గంటలకు సామర్ల కోటలో ఉన్న "కుమారారామం" చేరింది.

ఈ సోమవారం అర్ధ రాత్రి పన్నెండు దాకా దర్శనం ఇచ్చి ఒక పావుగంట మాత్రమే ఆలయ దర్శనం ఆపేసి మళ్ళీ రాత్రి పన్నెండుంబావుకు దర్శనం ఏర్పాటు చేశారు. సామర్ల కోట కుమారారామంలో. రెండు గంటలకు బస్సు దిగి ఒక వంతెన దగ్గర ఆటోలో మనిషికి అయిదు రూపాయలిచ్చి ఆలయం దగ్గరకు చేరాం. ముప్ఫై రూపాయల స్పెషల్ దర్శన టికెట్లు కొని లైన్లో నిలబడి కుమారాభీమేశ్వర స్వామిని దర్శించాం. అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిని దర్శించాం. మిగతా దేవతా మూర్తులను దర్శించి, లడ్డు ప్రసాదం కొని, అప్పుడే వచ్చిన వేడి వేడి పులిహోర ప్రసాదం కూడా కొని తిన్నాం. అందరు వచ్చేసరికి మూడు అయింది. అప్పుడు బస్సు బయల్దేరింది. ఇప్పుడు ఆలయ విశేషాలను తెలుసు కొందాం."మున్ను చాళుక్య భీమ రాత్పున్గవుండు-భక్తీ వెలయింప, నాభీమ వరము నందు –నిల్చి యార్తుల కోర్కెల నించు నట్టి –సదయు జాళుక్య భీమేశు సంస్తుతింతు" అన్నాడు శ్రీనాధుడు భీమఖండం లో ఈక్షేత్రాన్ని గురించి.
దీన్ని చాళుక్య భీమవరం అని కూడా అంటారు. సామర్లకోట రైల్వే స్టేషన్ దగ్గర ఉంది. చాళుక్య భీముడు ఈ పట్నాన్ని కట్టించి రాజధానిగా పాలించి, ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఇక్కడ కుమార స్వామి అమృత లింగ శకలాన్ని ప్రతిస్టించాడు. కనుక ఈ క్షేత్రం కుమారారామభీమేశ్వరం అయింది. స్కంధా రామం అని పేరు కూడా ఉంది.
సామర్లకోటకు శ్యామల కోట అని పేరు. ఇక్కడ చాళక్య భీముడు కట్టిన కోట ఉంది. అది శిధిలమైంది. కుమారగిరి బావమరది కాటయ వేముడు దీన్ని జయించి శ్యామలా దుర్గాన్ని పునర్నిర్మించ బూనాడు. త్రవ్వుతూ ఉంటే మహిషాసుర మర్దిని అమ్మవారి విగ్రహం దొరికింది. దాన్ని శ్యామల దేవి పేరుతో కాటయ వేముడు ప్రతిస్టించాడు. దీనికి దక్షిణంగా గ్రామ నిర్మాణం చేసి దానికి శ్యామలా దుర్గం అని పేరు పెట్టాడు. అది క్రమంగా మారి సామర్లకోట అయింది. శ్యామలా దేవి ఇప్పుడు ఈ భీమేశ్వరాలయంలో ప్రాకార దేవతగా కొలువై ఉన్నారు. ఈ శ్యామలకోట బొబ్బిలి యుద్ధంలో ఒక ప్రధాన పాత్ర వహించింది. ఒకప్పుడు స్వాములు ఇక్కడ ఉండే వారు. అందుకని స్వాముల కోట అయింది అదే సామర్ల కోట అయింది.

దేవాలయం చుట్టూ 18అడుగుల ఎత్తు ప్రాకారం ఉంది. నాలుగు వైపులా గోపురాలున్నాయి. ఇక్కడి శిల్పకళ ద్రాక్షారామాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ కూడా నమూనా దేవాలయం ఉంది. దక్షిణంగా ప్రదక్షిణ చేస్తూ వెడితే తూర్పున ఉన్న కోనేటిలో స్నానమో పాదప్రక్షాళనో చేసి ఆలయ ప్రవేశం చేయాలి కోనేరుకు భీమగుండం అని, పుష్కరిణి అని పేర్లు. కుమారనది లేక కుమార సరస్సు అంటారు. కుమారారామానికి దగ్గరలో కొమరేరు ప్రవహిస్తోంది. శ్రీ నాధుడు బాదరాయణు డత్యంత భక్తీ నియతి –దివ్య వాహిని గోమరేట దీర్ద మాడి –శిష్య వర్గంబు దాను దర్శించి, మ్రొక్కి –శాశ్వతునకు జాళుక్య భీమేశ్వరునకు అన్నాడు

శివుడు వ్యాస మహర్షిని కాశీ నుంచి వెళ్ళ గొట్టిన తర్వాత ద్రాక్షారామాన్ని, కుమారారామాన్ని సందర్శించి నట్లు భీమ ఖండం లో ఉంది.

ధ్వజ స్తంభం దాటి లోపలికొస్తే నల్ల రాతి నంది విగ్రహం కనిపిస్తుంది ప్రాకార దేవతలను సూర్య దేవుడిని చూసి మహా గణపతి, సప్త మాతృకలు దాటితే దక్షిణ ద్వారం వస్తుంది. ఇది దాటి తూర్పుకు వెడితే సరస్వతీ దేవి కుమార స్వామి కనీ పిస్తారు. వాయవ్యం లో మహిషాసుర మర్దిని, ఉత్తర తూర్పులో శ్రీ మహా విష్ణువు, దక్షిణాన లక్ష్మీదేవి దర్శించి, ఉతర ద్వారం దగ్గరకు చేరాలి. దాన్నిదాటి ప్రాకార మండపం చేరితే చండీశ్వర స్వామి, వీరభద్ర స్వామి, ఈశాన్యాన వల్లీ సుబ్రహ్మన్య స్వామిని దర్శించాలి. ఇక్కడే ఉయ్యాల మండపం ఉంది. ఈ మండపం " ఊపితే కదులుతుంది " ఇదీ విశేషం. ప్రాకారం లో బాలా త్రిపురసుందరి దేవి పశ్చిమాభి ముఖం గా దివ్య కాంతులతో దర్శన మిస్తారు.

అమ్మ వారి దర్శనం తర్వాత రెండు మెట్లు దిగి చతురస్రాకార గర్భ గుడి లో భీమేశ్వర స్వామి పాను వట్టం పై తెల్ల పాల రాతి రంగులో ఉన్న పన్నెండు అడుగుల ఎత్తున్న శివ లింగం పై అంతస్తు దాకా ఉంటుంది. దీనినే " యోగ లింగం " అంటారు. కింది అంతస్తు గర్భ గుడి కి దక్షిణ ప్రాకారం ఉంది. ఇది చాలా చీకటి ప్రాకారం. కింది అంతస్తులో శివలింగాన్ని దర్శించటమే కాని పూజాదికాలుండవు. పై అంతస్తులో రుద్రభాగంలో అభిషేకాలు, పూజాలు నిర్వహించాలి. కింది అంతస్తులోకి గర్భగుడి నుండి కిందికి దిగి దక్షిణంలో ఉన్న మెట్ల ద్వారా పై అంతస్తుకు చేరచ్చు. ఈ మెట్లు చిన్నవి తల వంచి వెళ్ళాలి లేకుంటే పై అంతస్తుకు తల తగులుతుంది. ఈ దక్షిణ ఆగ్నేయ ద్వారాన్ని సూర్య ద్వారం అంటారు. కిందికి దిగటానికి ఉత్తరాన మెట్లుంటాయి. ఈ ఉత్తర ఈశాన్య ద్వారమే చంద్ర ద్వారం. ఈ సూర్య, చంద్ర ద్వారాలు రెండు గర్భగుడికి నాశికారంధ్రాలు అంటారు. మానవుడి నాసికా ద్వారాల్లలో ఎడమ వైపుది చంద్రనాడి, కుడిది సూర్యనాడి. యోగీశ్వరుడు ఈ రెండు నాడుల గుండా ప్రాణాయామ ప్రక్రియ ద్వారా ప్రాణ వాయువును సహస్రారంలో అంటే శిరస్సులో చేర్చి పరమాత్మ అనుభూతి పొంది ఆనందమయమైన జీవికి ఇది యోగ మార్గం గా నిర్మించిన ద్వారాలు గా వీటిని భావిస్తారు.

గర్భాలయానికి నాలుగు దిక్కులా ద్వారాలుంటాయి. చైత్ర, వైశాఖ మాసాల్లో సూర్య భగవానుడి ఉషః కిరణాలు ఉదయాన స్వామి పాదాల పైన సాయంత్రం అమ్మ వారి పాదాల మీద పడటం విశేషం. కార్తీక మాసం లో, మార్గ శిర మాసం లో, మహా శివ రాత్రి నాడు విశేష పూజలు అభి షెకాలు నిర్వహిస్తారు. శరన్నవ రాత్రులలో శ్రావణ మాసం లో అమ్మ వారికి కుంకుమ పూజ విశేషం. మాఘ బహుళ ఏకాదశి నాడు స్వామికి గ్రామోత్సవం కల్యాణోత్సవం రధోత్సవం వైభవం గా జరుగుతాయి.

అనేక మంది రాజులు పాలించిన ప్రదేశం ఇది. నంద వంశ రాజుల నుంచి తూర్పు చాళుక్యుల వరకు దీన్ని పాలించి స్వామిని దర్శించి కానుకలర్పించారు. కాళింగ దేశం నుండి పిఠాపురం రాజ మండ్రి వరకు పాలించిన చాళుక్యులు ఈ ప్రాంతాన్ని దర్శించిన వారే. కుబ్జ విష్ణు వర్ధనుడి దగ్గర నుంచి మేడ విజయాదిత్యుని వరకు ముప్ఫై మంది పాలించారు. చాళుక్య భీముడు కుమారా రామ భీమేశ్వరాలయాన్ని నిర్మించాడు. తన యుద్ధాలవిజయాలకు ప్రతీక గా దీన్ని నిర్మించాడు. ఈయన 300 యుద్ధాల విజేత ఈయన. కుమారారామ భీమేశ్వరాన్నిరాజధానిగా చేసుకొని పాలించాడు. వీర చాళుక్యుడు అని పించుకొన్నాడు. అందుకే చాళుక్య కుమారారామభీమేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందాడు.

ఈ రంతం కొంతకాలం గోల్కొండ నవాబుల అధీనం లోను ఉంది. ఈ నాటి హుసేన్ పురం వరకు వ్యాపించి ఉండేది. కొంతకాలం పెద్దాపురం సంస్థానంలో, పిఠాపురం సంస్థానంలోను ఉండేది. ఆలయ పశ్చిమ ద్వారం వద్ద పశ్చిమ గోడకు ఒక గణ పతి విగ్రహం ఉంది. ఈ విగ్రహం నాభిలో ఒక వజ్రం ఉండేదని, రాత్రి పూట ఆ వజ్రం నుంచి కాంతి పుంజాలు వెలువడి భక్తులకు మార్గదర్శకంగా ఉండేది. దాన్నెవరో దొంగిలించారు. వ్యాసుడు హీమేశ్వరుని, రాజ నారయుణుడి ని దర్శించాడుఅని భీమేశ్వర పురాణం లో ఉంది.

" రాజ నారాయణ స్వామి రమ్య భావన – తార్క్ష్య కేతన పతికి నర్తనము గారపు –కుమారా రామ మాహర్మరేఖయ –చాళుక్య భీమేశు సదన వాటి " అని వర్ణించాడు శ్రీ నాధుడు.
ఆలయానికి పడమర రెండు కిలో మీటర్ల దూరం లో మాండవ్య లక్ష్మి దేవి సహిత నారాయణ స్వామి ఆలయం ఉంది. దీనికే " రాజ నారాయణ స్వామి ఆలయం " అంటారు.

కాటన్ దొర ఏర్పాటు చేసిన నీటి కాలువల వల్ల ఈ గ్రామానికి సామర్లకోటతో సంబంధం తెగిపోయింది. గ్రామం నామ మాత్రం గా మిగిలింది. అయితే వంతెనలు నిర్మించటం వల్లసామర్ల కోటకు రాక పోకలు జరుగుతున్నాయి.

ఇలా పంచారామాలను ఈ కార్తీక మాసంలో, అందునా సోమవారం నాడు దర్శించే అరుదైన అవకాశం లభించి, జీవితం ధన్యమైనదనిపించింది. తెల్లవారుజామున మూడు గంటలకు మా బస్సు బయల్దేరి మళ్ళీ వచ్చిన దారిలోనే పాలకొల్లు, భీమవరం దాటి కైకలూరు చేరేసరికి మంగళవారం ఉదయం ఎనిమిదింటికి చేరింది. అక్కడ ఒక అరగంట "రిసెస్" కు సమయం కోసం బస్ స్టాండ్ లో ఆపారు డ్రైవర్లు. ’’ఒకటి రెండు’’ కానిచ్చి ఎనిమిదిన్నరకు బయల్దేరి గుడివాడ మీదుగా ఉయ్యూరు ఉదయం పది పది కి చేరాం. న్యాయంగా సోమవారం రాత్రి ఉయ్యూరు చేరాలి. కాని పది గంటలు ఆలస్యం గా ఉయ్యూరు చేరాము. మా మనుమరాలును ఇంటి దగ్గర దింపి ఇంటికి వచ్చి పళ్ళు తోముకొని, స్నానం చేసి, సంధ్య పూజాదికాలు నిర్వహించాను, మా కోడలు రాణికి ముందే ఫోన్ చేసి మాకు కూర పచ్చడి చేసి పంపమని చెప్పాను. అలాగే మేము వచ్చేసరికి కారియరులో మా మనవడు చరణ్ చేత పంపింది. టిఫిన్ గా సీరియల్ తిన్నాం. అన్నం వండుకొని ఆ కూరా పప్పు పులుసుతో తిన్నాం. మధ్యాహ్నం పన్నెండు గంటలకు బయల్దేరి బెజవాడ వెళ్లి బస్సులో తణుకు సాయంత్రం నాలుగింటికి చేరి అక్కడ నన్నయ భట్టారక పీఠంలో "రామాయణ భారతాలలో మానవ విలువలు" పై ప్రసంగించి రాత్రి ఒంటి గంటకు ఇంటికి చేరాను. ఇలా ఆదివారం నుండి మంగళ వారం దాకా మూడు రాత్రులు నిద్రలేకుండా గడిపాను. అయినా ఆనందంగా హాయిగా ఉంది.
పంచారామ సందర్శనం సర్వం సంపూర్ణం.