Saturday, 14 June 2014

మంగళగిరి - త్రి నారసింహ క్షేత్రం

మంగళగిరి త్రి నారసింహ క్షేత్రం


మంగళగిరి:
నవ నారసింహ క్షేత్రాలలో మంగళాద్రి క్షేత్రం ప్రముఖమైంది. అత్యంత ప్రాచీనమైంది. దీనిని త్రి నారసింహ క్షేత్రంగా కూడా చెబుతుంటారు. ఇక్కడి కొండపై స్వయంభువుగా వెలిసిన స్వామిని యుగయుగాల దేవుడిగా పరిగణిస్తున్నారు. మంగళగిరి పట్టణానికి ఈశాన్యంగా హ్రస్వశృంగి పర్వతం పేరుతో ఉన్న కొండకు దక్షిణ నైరుతికి మధ్యస్తంగా శ్రీ పానకాల నృసింహస్వామి ఆలయం కనిపిస్తుంది. కొండకు దిగువన ధర్మరాజు ప్రతిష్టితమైన శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం, కొండకు పూర్తి పైభాగంలో జ్వాలా నృసింహస్వామి పేరుతో శిఖరం లేని గూడు మాదిరి ఆలయం ఉన్నాయి. దీంతో మంగళగిరిని త్రి నారసింహ క్షేత్రంగా వ్యవహరిస్తారు. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం తరువాత రెండో అతిపెద్ద ఆలయం మంగళాద్రి క్షేత్రమే. రాజధానికి అత్యంత చేరువలో ఉన్న అతి పెద్ద వైష్ణవ క్షేత్రం ఇదే. ప్రస్తుతం జిల్లాలో పెదకాకాని శివాలయం తరువాత ఎక్కువ ఆదాయం కలిగిన క్షేత్రం మంగళాద్రే. ఈ ఏడాది ఆదాయం రూ.మూడున్నర కోట్లను మించిపోయింది. మరో రెండేళ్లలో జిల్లాలో మిగతా అన్ని ఆలయాలకన్నా మంగళగిరి నృసింహుని ఆదాయమే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.

పానకం ఒలికినా..
భక్తులు భగవంతునికి నివేదించే ద్రవ్యాన్ని స్వయంగా ఆరగించే లీలా విన్యాసం భువి పై ఒక్క మంగళగిరి క్షేత్రంలోనే చూడగలుగుతాము. పానకాల నృసింహస్వామికి భక్తులు మొక్కుబడి ప్రకారం నివేదించే పానకం ఎన్ని బిందెలయినప్పటికీ అందులో సగ భాగాన్ని మాత్రమే స్వామి స్వీకరిస్తారు. మిగతా భాగాన్ని తన ప్రసాదంగా కక్కివేస్తారు. ఇదే ఈ క్షేత్ర విశిష్టత. స్వామికి నివేదించే పానకాన్ని ఆలయ సన్నిధిలోనే ప్రత్యేక మండపంలో రోజూ డ్రమ్ముల కొద్దీ విరివిగా తయారు చేస్తారు. ఇక్కడ ఎంత పానకం ఒలికిపోయినా ఈగ వాలదు, చీమ కనిపించదు. ఇక్కడ ఆలయ దర్శనం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే. ఆ తరువాత ఆలయ ద్వారం బంధనం చేస్తారు. అప్పటి నుంచి తిరిగి తలుపులు తెరిచేంత వరకు దేవతలు స్వామివారిని అర్చిస్తుంటారని ప్రతీతి.

స్థల పురాణం ఇదీ..
మంగళాద్రి క్షేత్రాన్ని గురించి బ్రహ్మ వైవర్త పురాణంలో వివరించారు. కృతయుగంలో నమూచి అనే రాక్షసుణ్ని సంహరించేందుకు మహావిష్ణువు సుదర్శన చక్ర రూపంలో వెంబడించగా ఆ రాక్షసుడు ఇక్కడి కొండపై వున్న ఓ చిన్న బిలంలో దాగినాడట! శ్రీ విష్ణువు సుదర్శన చక్రంలో సూక్ష్మ రూపాన్ని ధరించి బిలంలో ప్రవేశించి ఆ రాక్షసుడ్ని సంహరించినట్టు పురాణ కథనం. ఆనక ఉగ్రరూపంలో ఉన్న మహావిష్ణువును శాంతింపజేసేందుకు శ్రీమహాలక్ష్మితో కలిసి దేవతలందరూ స్తోత్రం చేస్తూ శ్రీవారికి అమృతాన్ని నివేదించారట. ఇక్కడ శ్రీ స్వామివారు ఉగ్రరూపంలో దర్శనమిచ్చి దేవతాది మునుల అభ్యర్థన మేరకు శాంతించి బిలం ముఖద్వారం వద్ద రెండువైపులా శంకుచక్రాలతో స్వయం వ్యక్తమై భక్తుల పూజలందుకుంటున్నట్టు బ్రహ్మ వైవర్త పురాణం వివరిస్తోంది. శ్రీ మహావిష్ణువు ఉగ్రరూపం నృసింహరూపమే అయినందున స్వయం వ్యక్తమై ఉన్న ఈ స్వామిని నృసింహస్వామిగా వ్యవహరిస్తున్నారు. త్రేతాయుగంలో ఆవుపాలు, ద్వాపర యుగంలో నేయి, కలియుగంలో బెల్లం పానకాన్ని స్వామివారు నైవేద్యంగా స్వీకరిస్తున్నట్టు చెబుతారు. ఆ కారణంగానే ఈ స్వామికి పానకాల నృసింహస్వామిగా పేరువచ్చింది.

No comments:

Post a Comment