Saturday, 14 June 2014

పెంచలకోన లక్ష్మీనరసింహ క్షేత్రం

పెంచలకోన లక్ష్మీనరసింహ క్షేత్రం
లక్ష్మీనరసింహస్వామి చెంచులక్ష్మిని మనువాడిన క్షేత్రం!


నమ్మిన భక్తుల పాలిట కొండంత అండగా... దుష్టసంహారం చేయాల్సి వచ్చినప్పుడు పరమ రౌద్రంగా... దర్శనమిచ్చే స్వామి లక్ష్మీనారసింహుడు. నరమృగ శరీరంతో శత్రువులను చీల్చిచెండాడడమేకాదు ధైర్యంగా తనముందు నిలుచున్న అమ్మవారిని వలచి వరించడమూ స్వామికి వెన్నతో పెట్టిన విద్యే. ఇందుకు నిదర్శనమే నెల్లూరులోని పెంచలకోన లక్ష్మీనరసింహ క్షేత్రం.

పెంచలకోన... చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి సంచరించిన నాటి చెంచులకోనే నేటి పెంచలకోనగా మారిందని చెబుతారు. తూర్పుకనుమల మధ్య సుందరమైన పర్వత శ్రేణుల్లో, సముద్రమట్టానికి సుమారు మూడువేల అడుగుల ఎత్తులో, నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి అందాలకు నెలవు. దక్షిణభారతదేశంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న ఈ ఆలయం భక్తులకే కాదు ప్రకృతిప్రేమికులకు కూడా ఇష్టమైన ప్రదేశమనడంలో సందేహంలేదు. చెంచులక్ష్మిని వలచి వరించిన ఉగ్రనారసింహుడు ఈ ప్రాంతంలోనే లక్ష్మీనారసింహుడిగా పూజలందుకుంటున్నాడు. అంతేకాదు, కులమతాలకు అతీతంగా ముస్లింలు సైతం అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకోవడం విశేషం.

ఇదీ కథ...
దశావతరాల్లోని నాలుగో అవతారమే లక్ష్మీనరసింహస్వామి అవతారం. దుర్మార్గుడైన హిరణ్యకశిపుని వధించి, భక్త ప్రహ్లాదుడిని రక్షించిన అనంతరం వెలిగొండ కీకారణ్యంలో గర్జిస్తూ, సంచరిస్తూ ఉంటాడు ఉగ్రనారసింహుడు. ఆ సమయంలోనే చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తూ ఉంటుంది. స్వామివారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పరుగులు తీయగా చెంచులక్ష్మి మాత్రం నారసింహుడి ఉగ్రరూపాన్ని చూస్తూ అలా నిలబడిపోతుంది. దీంతో ఆమె ధైర్యసాహసాలకూ అందచందాలకూ నారసింహుడు ముగ్ధుడౌతాడు. చెంచురాజుకు కప్పం చెల్లించి మరీ చెంచులక్ష్మిని వివాహమాడతాడు. అటుపై వారిద్దరూ పెనవేసుకుని ఉన్న శిలావిగ్రహం ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లు పురాణకథనం.

ఈ కారణంగానే ఇక్కడ కొలువైన స్వామి పెనుశిల లక్ష్మీనరసింహస్వామిగా పూజలందుకుంటున్నాడు. ఈ పర్వతశ్రేణుల్లో కొలువైన నారసింహుడి జయంతి ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచీ అధికసంఖ్యలో భక్తులు వస్తారు. ఇక్కడ సేవ చేసిన వారికి సర్వగ్రహ దోషాలూ పోతాయని ఒక నమ్మకం. స్వామివారికి వరపడు సేవచేయిస్తే సంతానం లేని దంపతులకు తప్పక సంతానం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

తొలిపూజ భక్తుడికే
పూర్వం గోనుపల్లి గ్రామానికి సమీపాన ఉన్న అరణ్యంలో ఆవులను మేపుకొనే గొల్లబోయుడికి స్వామివారు మొదటగా దర్శనమిచ్చి, తను ఈ ప్రాంతంలోనే శిలా రూపంలో వెలసి ఉన్నానని చెప్పి, ఈ విషయాన్ని గ్రామంలోనివారికి తెలియజేసి తనకు ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆదేశించాడు. అయితే వెనుతిరిగి చూడకుండా గ్రామానికి వెళ్లమని చెప్పగా, గొల్లబోయుడు కుతూహలాన్ని ఆపుకోలేక  మార్గమధ్యంలోనే వెనుదిరిగి చూశాడు. తన మాటను ధిక్కరించినందుకు ఆగ్రహించిన నారసింహుడు శిలగా మారమని బోయుడుని శపించాడు. దీంతో తను చేసిన తప్పును తెలుసుకున్న గొల్లబోయుడు మన్నించి, అనుగ్రహించమని ప్రార్థించాడు. భక్తసులభుడైన ఆ స్వామి శాంతించి, ‘నన్ను దర్శించడానికి వచ్చే భక్తులు మొదటగా నిన్ను దర్శిస్తారు. ఆ తర్వాతే నా దర్శనానికి వస్తారు’ అని వరమిస్తాడు. ఈ గొల్లబోయుడి ఆలయం గోనుపల్లి గ్రామం సమీపంలోనే ఉంది. సప్త రుషుల నామాలతో ఏడు గుండాలు ఈ ప్రాంతంలో కనువిందు చేస్తాయి. ఈ క్షేత్రానికి 5 కి.మీ. దూరంలో భైరవకోన ఉంది. ఉత్సవాల సమయంలో ఇక్కడి కొండల్లోని గుండంలో స్వామివారి విగ్రహానికి చక్రస్నానం చేయిస్తున్న సమయంలో సప్తరుషులు దివ్యఛత్రం పడతారని భక్తుల విశ్వాసం. ఈ కారణంగానే ఇక్కడి స్వామికి ఛత్రవటి నారసింహస్వామి అనే పేరు వచ్చింది.

ఇలా చేరుకోవచ్చు...
పెంచలకోన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన బస్‌స్టేషన్ల నుంచీ నెల్లూరుకు బస్సు సౌకర్యం ఉంది. అక్కడి నుంచి పెంచలకోన దేవస్థానానికి బస్సు సదుపాయం ఉంది. అలాగే బ్రహ్మోత్సవాల సమయంలో ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. రైలు మార్గంలో వచ్చే భక్తులు నెల్లూరు స్టేషన్‌లో దిగి, అక్కడి నుంచి రాపూరు మీదుగా రోడ్డుమార్గంలో ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు.

- కోదాటి కిరణ్‌రెడ్డి 

శ్రీ పెనుశిల లక్ష్మీనృసింహస్వామిశ్రీ నవ నారసింహ పుణ్యక్షేత్రములలో శ్రీ పెనుశిల లక్ష్మీనృసింహస్వామి క్షేత్రము మిక్కిలి ప్రసిద్దమయినది. ఈ క్షేత్రము నెల్లూరు జిల్లా, రాపూరు మండలము, గోనుపల్లి గ్రామమునకు 7 కీమీ దూరమున, నెల్లూరు పట్టణమునకు పశ్చిమభాగమున 80 కీమీ దూరంలో ఉంది . ఇక్కడ లక్ష్మి నారసింహ ఒకరిగా పిలవబడుతున్నారు . శ్రీ స్వామి వారు చెంచులక్ష్మి సమేతుడై నిరాకార రూపమున స్వయంభువుగా వెలిసి ఉన్నారు. అల్లంత దూరాన ఆదిలక్ష్మి అమ్మవారునూ స్వయంభువుగా వెలిసి ఈ దేవ దేవేరుల భక్తాభిష్టఫలప్రదులై బ్రోచవారలను కరుణించి వారి కోరికలు నెరవేర్చుచున్నారు.

దశవతారాలలో మేటియై, కౄతయుగంలో అవతరించిన నాల్గవ అవతారం నృసింహ అవతారం. ఈ అవతారంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణలు అనగా దుష్ట రాక్షసుడయిన హిరణ్యకశిపుని వధ, భక్తప్రహ్లద రక్షణ చేసి తనచే సృజించబడు ముక్త జీవులను తరింపజేయుటకు ఇలపై నవ నారసింహులుగా స్థిరమయినారు. ఇట్టి క్షేత్రాలలో ఈ ఛత్రవటి నారసింహ క్షేత్రం అత్యంత మహిమాన్వితమయింది. నృసింహ అవతారంలో హిరణ్యకశిపుని వధ అనంతరం ఉగ్రరూపుడైన నారసింహుడు 'సర్వం విష్ణుమయం జగత్' అను రీతిగా ఈ జగత్తునంతటా సర్వవ్యాప్తియే భక్తుల అభీష్టం మేరకు అచ్చటచ్చట అవతరించినారు. కృతయుగంలో, వైషాఖమాసంలో, స్వాతినక్షత్రంలో సాయంసంధ్య సమయంలో స్వామివారు ఆవిర్భవించారు.

ఈ క్షేత్రము చెంచురాజులకు నిలయమైనందున ఉగ్రరూపుడయిన నారసింహుడు సుందరాంగి అయిన చెంచువనిత చెలిమితో శాంతించి చెంచు రాజులకు కప్పము చెల్లించి, చెంచుపట్టిని చేపట్టి వివాహం చేసుకుని, ఆ సుందర వనితను పెనవేసుకుని నిరాకార శిలరూపమున ఇక్కడ స్థిరమయినట్లు చరిత్ర వలన తెలుస్తోంది.

శిలరూపంలో కుడి భాగమంతా నారసింహస్వామిగానూ, ఎడమ భాగమంతా చెంచులక్ష్మి అమ్మవారిగానూ, వక్షస్థలంలో బిలరూపంలొ ఉన్న రంధ్రం వైకుంఠానికి మార్గంగాను, ఆ మార్గం గుండా రాత్రాది కాలలందు దేవతలు వచ్చి స్వామివార్లను అర్చిస్తారని భక్తుల ప్రగాడ విశ్వాసం. స్వామివారు ఉగ్రరూపం దాల్చి కిందకు వచ్చినందుకు గుర్తుగా చంద్రాయుధం గీచినటువంటి గీం ఇప్పటికీ కనిపిస్తుంటుంది.

ఈ క్షేత్రం తూర్పు కనుమల మధ్య పర్వత పాదమున, సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో ఉంది. ఈ స్వయమవాతారమూర్తి వెనుక భాగంలో మహాశిలగిరి (గొప్ప పర్వతరాజం) ఉంది. ఇది పన్నగాకృతిగా నెల్లూరూ, కడప జిల్లాల మధ్యభాగంలొ, హిమగిరి తూర్పూ పశ్చిమ సముద్రాలకు కొలబద్దమానముగ ఉన్నట్లు, ఉత్తర దక్షిణముగా, శ్రీశైల వరాహ (వేంకటాచల) క్షేత్రమునకు కొలబద్ద వలె కనిపిస్తుంది. ఈ సర్పాకృతి గల పర్వతముల యొక్క శిరోభాగంలో వరాహ క్షేత్రమున వేంకటేశ్వరుడు వెలిశాడు. కటి భాగమున ఈ క్షేత్రమున (శ్రీ పెనుశిల క్షేత్రం) చత్రవటి నారసింహుడు వెలసి, స్థితికారకుడై తనను ఆరాధించు భక్తులకు వరాలను ఇస్తూ, లయచక్రవర్తి అయిన పార్వాతీశుడు శ్రీశైల క్షేత్రమున వాల (అంత్య) భగమున వెలిసి ఆర్తులను ఆరాధింపచెయుచున్నడు.

No comments:

Post a Comment