Friday, 22 August 2014

అష్టాదశ శక్తిపీఠాలఅష్టాదశ (18) శక్తిపీఠాల క్షేత్ర వివరణలంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండీ క్రౌంచపట్టణే |
అలంపురీ జోగులాంబా శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మి మహూర్యే ఏకవీరికా ||
ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికాయాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే |
హరిక్షేత్ర కామరూప ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్య గౌరికాః ||
వారణస్యాం విశాలాక్షీ కాశ్మీరేతు సరస్వతి…

1. లంకాయాం శాంకరీదేవి :

”లంకాయాం శాంకరీదేవి”, అష్టాదశ శక్తిపీఠాల్లో మొదటిది. భారతదేశమునకు పొరుగున గల సింహళద్వీపం (శ్రీలంక) నందు ఉండేది. శ్రీలంక ద్వీపం నందు తూర్పు తీరప్రాంతములో ట్రింకోమలిపుర (ట్రింకోమ్‌లీ) పట్టణము వుంది. ఇది సతీదేవి కాలిగజ్జెలు పడిన ప్రదేశముగా ప్రసిద్ధి. ఇక్కడ శాంకరీదేవి మందిరము ఉండేది అని పూర్వీకుల వాదన. బౌద్ధమతం, క్రైస్తవమతం అభివృద్ధితో హిందూమతమునకు రాజపోషణ కరువయింది. దీనితో ప్రజల ఆదరణ కూడా క్షీణించింది. కొంతకాలమునకు హిందూ దేవాలయములు శిథిలముగా మారినాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి. శాంకరీదేవి మందిరము కూడా కాలగర్భంలో కలిసిపోయి వుండవచ్చును. నేడు శ్రీలంకను శోధిస్తే, ఎక్కడా శాంకరీదేవి ఆలయం కనిపించుటలేదు. ప్రస్తుతం శాంకరీదేవి దర్శనం దుర్లభమే. శ్రీలంకలో తమిళులపై దాడులు హింసాత్మకమవటంతో, వాటిని తట్టుకోలేక పారిపోయి కెనడా, ఇండియా మొదలగు దేశములకు చేరిన హిందువుల సంఖ్య అధికం. క్రమక్రమంగా శ్రీలంకలో హిందూమతమునకు, హిందూ దేవాలయములకు ఆదరణ కరువయింది.

త్రేతాయుగంలో రావణాసురుడు, లోకనాథుడైన పరమేశ్వరునితో పాటు శాంకరీదేవిని నిత్యం పూజించినట్లు పురాణ కథనం. ట్రింకోమలీ నందు శాంకరీదేవి ఆలయ దర్శనం నేడు శూన్యం అయినా, క్షేత్ర మహాత్యం, క్షేత్ర దర్శనము ఆనందదాయకమే. కొలంబో పట్టణము పశ్చిమతీరంలో వుండగా, ట్రింకోమలీ పట్టణము తూర్పుతీరంలో వుంది. రెండు పట్టణముల మధ్య రవాణా సదుపాయములు కలవు. మహాపట్టణం, గలోయపట్టణం మీదుగా శ్రీలంక ప్రభుత్వ రైలు మార్గం వుండగా, కాండిపట్టణం, గలోయ పట్టణముల మీదుగా రోడ్డు మార్గం కలదు. భారతీయులకు శ్రీలంకలోని పర్యాటక స్థలసందర్శనకై రూ. 35,000/- లు పైగా ఖర్చు అవుతుంది.

2. కామాంక్షీ కాంచికాపురే :
కాంచీపురం మోక్షదాయకమైన పట్టణాలలో ఒకటిగా ప్రసిద్ధి. కామాక్షీదేవి పీఠం అష్టాదశ శక్తి పీఠాలలో శ్రీ కామాక్షి అమ్మవారు రెండవ పీఠంగా పరిగణింపబడుతుంది. సతీదేవి కంకాళము పడినచోటుగా ప్రసిద్ధి. ”కామాక్షీ కామదాయినీ” అని లలితా సహస్రనామాలు పేర్కొన్నాయి. తన కరుణామయైన కంటి చూపుతోనే భక్తుల కోర్కెలను తీర్చగలిగే మహాశక్తి. అమ్మను ఆరాధించి మూగవాడైన భక్తుడు వాక్కును సంపాదించుకొని అయిదు వందల శ్లోకాలతో అమ్మను కీర్తించాడు.

పురాణ కాలంలో పార్వతీదేవి, పరమశివుని కనులు తన హస్తములతో మూయగా ప్రపంచమంతా చీకటితో నిండిపోయింది. పాప పరిహారానికై మట్టితో శివలింగము తయారుచేసి పూజించెను. అంతట శివుడు పార్వతిని అనుగ్రహించాడు. నాటినుంచి కాంచీపురమున ఫాల్గుణమాసంలో పార్వతీదేవి కళ్యాణం అత్యంత వైభముగా జరుపుచున్నారు. కాంచీ క్షేత్రమును సత్యవ్రతక్షేత్రమని, భాస్కరక్షేత్రమని, తేజసక్షేత్రమని, శివశక్తి క్షేత్రమని, శక్తి క్షేత్రమని పేర్కొనబడింది. క్షేత్రంలో వెలసిన శైవ, వైష్ణవ, జైన, బౌద్ధ దేవాలయములు భారతీయ కళా సంస్క ృతికి ప్రతీకలుగా నిలిచాయి.

శ్రీ కామాక్షి దేవాలయము నందు అమ్మవారి గర్భాలయము వెనుక భాగమున శ్రీ ఆదిశంకరుల ప్రతిమ ప్రతిష్ఠించబడింది. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు కాంచీపురము నందు శంకరమఠమును క్రీ.పూ. 482 సంవత్సరములో స్థాపించారు. శ్రీ ఆదిశంకరాచార్యులు తొలి పీఠాధిపతి. భారతీయ ధార్మిక జీవనంలో అవ్యవస్థ నెలకొన్నప్పుడు అజ్ఞానం ముసురుకొన్నప్పుడు, ఆచార కొండల పేరిట ఆర్భాటాలు తోడయినప్పుడు శ్రీ ఆదిశంకర భగవత్పాదులు ఉదయించారు. కేరళ రాష్ట్రంలోని, త్రిచూర్‌ సమీపమున, పవిత్ర పూర్ణానది తీరంలో గల కాలడి గ్రామం నందు జన్మించారు శ్రీ శివగురు, ఆర్యాంబ దంపతులకు లేకలేక కలిగిన సంతానం జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యులు. శ్రీ శంకరుడు సకల విద్యలనూ నభ్యసించి, దేశం నలుదిక్కులా మూడుమాట్లు పర్యటించి, అద్వైత ప్రభలను ఉజ్జ్వలంగా నిలిపారు. భారత ఖండంలో నాలుగువైపుల నాలుగు పీఠాలు స్థాపించారు. ఉత్తరాన గల హిమాలయ పర్వతాల్లో జోషీమఠమును, అలకనంద తీర్థమున గల బదరికాశ్రమం నందు స్థాపించారు. ఇచ్చట శ్రీ నారాయణుడు మరియు శ్రీ పున్నాకరీ అమ్మవారి దర్శనం లభ్యమవుతుంది. దక్షిణాన కర్ణాటక రాష్ట్రంలోని తుంగానది తీరం నందు శ్రీ శృంగేరీ మఠమును స్థాపించారు. ఇచ్చట శ్రీ ఆది వరాహమూర్తి మరియు శ్రీ కామాక్షి అమ్మవారు కొలువైనారు. తూర్పున ఒరిస్సా రాష్ట్రంలోని, పూరి క్షేత్రము నందు మహారధి తీర్థమున గోవర్ధన మఠమును స్థాపించారు. క్షేత్రం నందు శ్రీ జగన్నాథుడు మరియు శ్రీ విమలాదేవిని దర్శించగలము. పడమరన గుజరాత్‌ రాష్ట్రమున ద్వారకా క్షేత్రం నందలి గోమతి నదీ తీరంలోగల శ్రీ ద్వారకాధీశుని ఆలయమునకు ఎడమవైపున శ్రీ శారదాపీఠం స్థాపించారు. ఇచ్చట శ్రీ సిద్ధేశ్వరుడు మరియు శ్రీ భద్రకాళి అమ్మవారు వెలిశారు. ఇవిగాక సన్యాసీ సంప్రదాయంతో సుమారు 1200 మఠాలున్నట్లుగా తెలుస్తోంది. శ్రీ ఆదిశంకరాచార్యులు దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలను దర్శించి, శ్రీ చ్రకములను స్థాపించారు.

3. ప్రద్యుమ్నే శృంఖలాదేవి :
ఒక సాధువు ఆరాధ్యదైవముగా వెలసిన తారమాత, బెంగాలు నివాసులతోపాటు దేశంలోని వారందరికి ఆరాధ్య దైవమయింది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారమయింది. నమ్మినవారికి కొండంత శక్తిని ప్రసాదించే శక్తి స్వరూపిణి. ప్రతి నిత్యం యాత్రికులతో క్రిక్కిరిసి వుంటుంది. తారనది తీరంలో, కొంత ఎత్తైన ప్రదేశములో అమ్మవారి ఆలయం వుంది. బస్‌ హాల్ట్‌ నుంచి సుమారు అరకిలోమీటరు నడక ప్రయాణము చేయగా తారమాత దర్శనమిస్తుంది. ఆలయ రహదారి నిండా పూజా సామాగ్రీలు విక్రయించు షాపులు, పండాల నివాసములతో నిండి వుంటుంది. ఆలయం నందు పూజలు, హోమాలు మొదలగునవి పండాలు నిర్వహించుతారు. తారామాతకు భక్తులు భక్తిశ్రద్ధలతో పాలకోవా, మందారపువ్వులు మొదలగునవి సమర్పించుకుంటారు.

ఆలయము నందు అమ్మవారి స్వరూపం దేదీప్యమానంగా, తేజోవంతంఆ దర్శనమిస్తుంది. అమ్మవారి నాలుక బయటకు వచ్చి నోరంతా రక్తపుమరకలతో నిండి వుంటుంది. తారమాత నిజరూపం మరోవిధముగా వుంటుంది. నల్లటి రాతిమీద ఒక దృశ్యం కానవచ్చును. దానవులతో యుద్ధంచేసి శక్తిహీనుడైన పరమేశ్వరుడుని, శక్తిరూపిణియగు ఆదిశక్తి తన ఒడిలో పరుండపెట్టి చన్నుబాలు నిచ్చి తిరిగి శక్తివంతుడ్ని చేయు దృశ్యమును చూడగలము. తిరిగి రాత్రి 8 గంటలకు నిజరూప దర్శనము లభ్యమవుతుంది. భక్తులు అమ్మవారికి అభిషేకములు, కానుకలు మొదలగునవి సమర్పించుకుంటారు. పండాలు నిజరూప దృశ్య వివరణ భక్తులకు తెలియచేస్తారు. నిజరూప దర్శనాంతరము పండాలు అమ్మవారిని అలంకరించుతారు.

ఆలయ ప్రాంగణములో శివాలయం, గణపతి మందిరము, సాధువు మూర్తి విగ్రహం, వాసుదేవ మందిరము కలవు. అమ్మవారికి ఎదురుగా మూడు మండపములు కలవు. మొదటి మండపమునందు భక్తులు మాత తారను దర్శించుటకు, రెండవ మండపము నందు హోమం మొదలగునవి నిర్వహించుటకు, మూడవ మండపమునందు బలిపీఠమునకు సదుపాయములు కలవు. వీటితోపాటు పూజా సామాగ్రీలు విక్రయించుశాలలు కూడా కలవు. తారమాతను మొదటి మండపము నుంచి దర్శించుకుంటారు. నిజరూప దర్శన సమయము నందు అమ్మవారికి కుడివైపున గల ద్వారం నుంచి గర్భాలయములోనికి ప్రవేశము కల్పిస్తారు.

శంథియ రైలు జంక్షన్‌కు పశ్చిమవైపుగా సియూరి మీదగా అండల్‌ వరకు బ్రాంచి రైలు మార్గము కలదు. శంథియ రైలు జంక్ష్‌కు 19 కి.మీ. దూరమున సియూరి రైలు స్టేషన్‌ వస్తుంది. దీనికి పశ్చిమంవైపుగా, సుమారు 15 కి.మీ. దూరమున బక్రేశ్వర్‌ క్షేత్రం కలదు. ఇది శక్తి పీఠంగా ప్రసిద్ధి. సతీదేవి అమృత హృదయం పడిన ప్రదేశంగా ఖ్యాతి చెందినది. అహ్మద్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి కూడా బస్సులో ప్రయాణము చేయవచ్చును. శంథియ రైల్వే జంక్షన్‌కు దక్షిణం వైపున 14 కి.మీ. దూరమున అహ్మదాపూర్‌ రైల్వే జంక్షన్‌ వస్తుంది. దీనికి పశ్చిమం వైపుగా బక్రేశ్వర్‌ క్షేత్రం కలదు.
బర్ధమాన్‌ జిల్లాలో రెండు శక్తిపీఠాలున్నాయి. మొదటి లాభపూర్‌ – ఖాట్వారోడ్‌ మార్గములో లాభపూర్‌కు 35 కి.మీ. దూరమున కేతుగ్రామ్‌ అను క్షేత్రం నందు కలదు. క్షేత్రంలోని శక్తిరూపమును దేవిబహులుగా పిలుస్తారు. అష్టాదశ శక్తిపీఠాల్లో మూడవ పీఠముగా పరిగణించబడుతోంది. సతీదేవి ఎడమ భుజముపడినట్లుగా ప్రతీతి. ఆలయమునకు ఎదురుగా మండపము వుంది. పందాలు మండపము నందు హోమములు మొదలగునవి నిర్వహించుతారు. ఆలయమునకు మండపమునకు మధ్యన బలిపీఠం వుంది. విజయదశమి మొదలగు పర్వదినముల నందు అమ్మవారికి పశుబలి సమర్పించుకుంటారు.

4. చాముండీ క్రౌంచ పట్టణే :
కర్ణాటక రాష్ట్రమునకు ప్రధాన నగరం బెంగుళూరు. దీనికి సుమారు 140 కి.మీ. దూరమున ఆగ్నేయం వైపున మైసూరు పట్టణం వుంది. ఇది ఒడయార్‌ వంశీయులకు రాజధానిగా వుండేది. చక్కటి తోటలు, గొప్ప భవనములతో కూడిన మైసూరు పట్టణము పర్యాటకుల మనస్సును ఆహ్లాదం కలిగిస్తుంది. మైసూర్‌ పట్టణమునకు సుమారు 13 కి.మీ. దూరమున చాముండీ పర్వతం వుంది. సతీదేవి దివ్యాభరణాలు పడిన ప్రదేశముగా ప్రసిద్ధి. మార్కండేయ పురాణంలో దేవి ఉత్పత్తిని గురించి ప్రస్తావించబడింది. మాత మూడవ అవతారంలో మహామాయ, మహాసరస్వతీ రూపిణిగా శుంభ, నిశుంభలనే రాక్షసులను వధించింది. ఆమె దేహం నుంచి వెలువడిన కాళికాదేవి చండు, ముండులను సంహరించి ”చాముండి”గా ప్రసిద్ధి పొందినది.

పురాణ కాలములో మహిషాసురుడు పాలించిన పురమును మహిషాసురపురముగా పిలిచెడివారు. కాలక్రమేణా మైసూరుగా మారిందని ప్రతీతి. మహిషాసురుడు మహాబలవంతుడు. మరణంలేని వరాన్ని కోరుతూ ఘోరతపము చేసెను. అది అసాధ్యమని బ్రహ్మ తెలుపగా అంతట మహిషాసురుడు స్త్రీని అబలగా భావించి, స్త్రీ తప్ప ఇతరుల చేతిలో మరణంలేని వరం పొందినాడు. బ్రహ్మ యిచ్చిన వర ప్రభావంతో ముల్లోకములను జయించి దేవతలను, ఋషులను బాధించసాగెను. దుష్టపాలనతో ప్రజాకంటకుడుగా మారిన మహిషాసురుడు సంహరించుటకు జగన్మాత చాముండేశ్వరిగా అవతారము దాల్చి, రాక్షస సంహారము చేసెను. రాక్షస సంహారానంతరం చాముండేశ్వరి మాత మహిషాసురమర్ధినిగా ఖ్యాతి పొందినది. చాముండేశ్వరిదేవి అష్టాదశ శక్తి పీఠాలలో నాలుగవది. మాత మైసూరు ప్రభువులకు కులదైవము మరియు ఆరాధ్యదైవమయినది.

చాముండి పర్వతము సముద్ర మట్టానికి సుమారు 1200 మీటర్లు ఎత్తుగా వున్నది. కొండమీదకి మెట్లు మార్గంతోపాటు రోడ్డు మార్గము కూడా కలదు. మూడోవంతు మెట్టెక్కేసరికి సమున్నతరగా కనబడు ప్రదేశములో 16 అడుగుల ఎత్తుగల ఏకశిలా నిర్మితమైన నంది విగ్రహం వుంది. నందీశ్వర శిలా విగ్రహం చూపరులను విశేషముగా ఆకర్షించుతుంది. కొండపైకి మహిషాసుర విగ్రహమును చూడవచ్చును. వీటితోపాటు ఒడయారు మహారాజు, మహారాణి విగ్రహములు కూడా దర్శనీయం. నేటి చాముండేశ్వరాలయం 1827వ సంవత్సరములో పునరుద్ధరింపబడింది.

చాముండి పర్వతమున, తూర్పువైపుగా ”దేవకెరె” అను తీర్థం కలదు. దేవికెరెకు సంబంధించిన కథ ఒకటి గలదు. పాపహరిణియగు గంగానదిలో స్నానమాచరించిన భక్తులు పుణ్యం సంపాదించి, విష్ణులోకం చేరుకొనుచున్నారు. వారి పాపములను గంగామాత స్వీకరించి, తాను మాత్రము క్షీణించుచుండెను. ఒకనాడు గంగామాత బ్రహ్మతో తన బాధను మొరపెట్టుకుంది. బ్రహ్మ ఆజ్ఞ ప్రకారము దక్షిణ భారతదేశమున, పవిత్రమైన కావేరినది ప్రాంతమున గల మహాబలాద్రి పర్వతమున జన్మించి, మహాబలేశ్వర లింగమును ఆరాధించి, తిరిగి స్వచ్ఛత తెచ్చుకుంది. ఇంతటి పుణ్యత గలిగిన జలము నందు స్నానమాచరించి, ఆషాడమాసంలోని కృష్ణపక్షము నందు, రేవతి నక్షత్రం వున్న శుక్రవారం దినమున శ్రీ చాముండేశ్వరి మాతను చంపకమాలతో ఆరాధించిన భక్తుల యొక్క సకలబాధలు తొలగి, వారి కోర్కెలు తీరగలవు. సూర్యుడు మేషరాశిలో వుండగా, శుక్లపక్ష సప్తమి దినమున పాతాళ వాహినిలో స్నానమాచరించి, మహాబలాద్రి క్షేత్రమున గల మహాబలేశ్వర స్వామిని ఆరాధించిన వారి కోర్కెలను స్వామి తీర్చగలడు. వైశాఖమాసం, శుక్లపక్ష, శుక్రవారం దినము పాతాళవాహినిలో స్నానమాచరించి రామనాధగిరిలోని స్వామిని ఆరాధించినా సర్వపాపములు తొలగి, సుఖసంతోషములతో జీవించగలరు. మాఘమాసం, శుద్ధపూర్ణిమ, ఆదివారం దినమున పాతాళగంగలో స్నానమాచరించి, రామనాధగిరిలోని స్వామిని ఆరాధించిన సూర్యలోకమును పొందగలరు.

పురాణ, ఇతిహాసకాలము నందు చాముండిపర్వతమును మహాబలాద్రి పర్వతముగా పిలిచెడివారు. దీనినే మహాబలగిరి అని కూడా సంబోధించేవారు. మహాబలద్రి పర్వతమున స్వయంభువ లింగముగా వెలసిన శ్రీ మహాబలేశ్వర ఆలయం కూడా పురాతనమైనది. శివాలయం నందలి లింగము చాల మహిమాన్వితమైనది. భక్తులు తమ కోర్కెల సాఫల్యం కోసం, నియమంగా స్వామిని ఆరాధించుదురు. వారి సర్వబాధలు తొలగి, సమస్యలకు పరిష్కారం లభించగలదు అని గట్టి నమ్మకం. శ్రీ చాముండేశ్వరి ఆలయమునకు కుడివైపున, కొంతదూరమున శ్రీ మహాబలేశ్వరాలయం వుంది. జీర్ణావస్థలో వున్నా, నిత్యం పూజాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. శ్రీ మహాబలేశ్వర దర్శనం పుణ్యదాయకం. శివాలయమునకు వెనుక భాగమున శ్రీ నారాయణ స్వామి ఆలయం కూడా కలదు. శ్రీ నారాయణస్వామి దర్శనము కూడా పుణ్యదాయకం.

5. అలంపురీ జోగులాంబా :
తెలంగాణాలోని మహబూబ్‌నగర్‌జిల్లాలో అలంపురం క్షేత్రంనందు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ జోగులాంబాదేవి మరియు శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి కొలువైనారు. క్షేత్రమున సతీదేవి శరీరాంతర్గత వజ్రాస్తికులు పడినట్లు ప్రతీతి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ పీఠముగా పరిగణించబడుతోంది. శ్రీ జోగులాంబను ”విశృంఖలా” అని లలితాసహస్రనామములో చెప్పబడింది. నిత్యానాధ సిద్ధుని ”రసరత్నాకరము” నందు అమ్మను యోగాంబాగాను, తాంత్రికుడగు మహాభైరవుడు తన ”ఆనందకరము”లో యోగేశ్వరిగాను పేర్కొన్నారు. శ్రీ బాల బ్రహ్మేశ్వరాలయమునకు ఆగ్నేయ దిశలో శ్రీ జోగులాంబా ఆలయం వుండేది. పూర్వకాలము నాటి ఆలయం శిథిలముకాగా, అమ్మవారి మూలవిగ్రహమును, శ్రీ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయము నందు భద్రపరచినారు. శ్రీ జోగులాబా అమ్మవారి నూతన ఆలయమునకు దేవస్థానము వారు సంకల్పముచేసి, శ్రీశైలదేవస్థానము మరియు కంచి కామాక్షీపీఠం తాలూకా సహాయముతో ఆలయమును పూర్తిచేసినారు. శ్రీబాల బ్రహ్మేశ్వరాలయములోని శ్రీ జోగులాంబా మూల విగ్రహమును నూతన ఆలయం నందు తిరిగి ప్రతిష్ఠించినారు.

అలంపుర క్షేత్రంలోని ఆలయ సమూహం నందు శ్రీ జోగులాంబా ఆలయముతోపాటు బాలబ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, తారకబ్రహ్మ మరియు పద్మబ్రహ్మ అను నవబ్రహ్మాలయాలున్నాయి. వీటిలో తారకబ్రహ్మ ఆలయం ధ్వంసమైనది. ఆలయములోని శివలింగము రక్షింపబడినది. మిగిలిన ఎనిమిది ఆలయాలల్లో శ్రీ బాలబ్రహ్మేశ్వరాయలము ప్రధానమైనది. నవబ్రహ్మాలయముల నందు ప్రతిష్ఠించిన శివలింగాలు ప్రాచీనమైనవి. ఆలయ సమూహమునకు పశ్చిమదిశలో మహాద్వారం వుంది. శిల్పసృష్టితో మహాద్వారమును చాలా ప్రశస్తమైనది. నాటి ముస్లింపాలకులు పశ్చిమద్వారమును ఆక్రమించి, దర్గా నిర్మించినారు. శ్రీ బాల బ్రహ్మేశ్వరాలయమునకు చుట్టు కట్టబడిన ప్రాకారములపై, బండలమీద కొన్ని సంకేతములు చెక్కబడినవి. తాంత్రిక చిహ్నముల నెరిగినవాటి సంకేతముల భావములను గ్రహింపగలరు. ఆలయసమూహంలోని శిల్పాలు, కళాఖండాలు తాంత్రిక చిహ్నములు కొన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి. ఆలయం బయట గల పురాతన వస్తు ప్రదర్శనశాల నందు మరికొన్ని దర్శించగలము. శ్రీ జోగులాంబా సిద్ధులకు ఆరాధ్యదైవం. మంత్ర సిద్ధిని పొందగోరినవారు, అలంపుర క్షేత్రమున జపమొనరించినా, సిద్ధి కాగలదని ఆర్యులు నమ్మకం.

శ్రీ జోగులాంబా అమ్మవారికి ప్రత్యేకముగా ఆలయం వుండేది. శ్రీ జోగులాంబా మహోగ్రురాలై యుండేది. శ్రీ ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రాన్ని తగ్గించుటకు తగిన ప్రక్రియ యంత్రశక్తిని స్థాపించి, అమ్మవారి ఉగ్రరూపాన్ని తగ్గించారని ప్రతీతి. 16వ శతాబ్దంలో బహమనీసుల్తాన్‌ శ్రీ జోగులాంబా ఆలయ విధ్వంసానికి పూనుకొన్నాడు. ధ్వంసమైన ఆలయంలో శ్రీ జోగులాంబా విగ్రహమును, శ్రీ బాలబ్రహ్మేశ్వరాలయములోని నవగ్రహములు సమీపమున శ్రీ ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించినారు. సుమారు 630 సంవత్సరములు తరువాత దేవస్థానంవారు, అదే పవిత్ర స్థలము నందు నూతన ఆలయం నిర్మించి, 13 ఫిబ్రవరి 2005వ సంవత్సరములో శ్రీ జోగులాంబా విగ్రహమును పునఃప్రతిష్ఠ చేశారు. నూతన ఆలయం చక్కటి ఆహ్లాదకరమైన ప్రాంతములో నిర్మించబడినది. ఆలయమంతా ఎర్రని ఇసుకరాయితో నిర్మించారు. ఆలయమండపము నందు అష్టాదశ శక్తి పీఠాలను పొందుపరచినారు. ఆలయం చుట్టూ చక్కటి ఉద్యాన వనము వుంది. తూర్పున 5 అంతస్తులు మరియు పశ్చిమాన 3 అంతస్తులు గాలిగోపురములు కలవు. శ్రీ జోగులాంబా కుడివైపున పవిత్రమైన తుంగభద్రానది మరియు ఎడమవైపున శ్రీ బాలబ్రహ్మేశ్వరాలయ సమూహం కలవు. అమ్మవారి ఆలయం ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 8 గంటల వరకు తెరచివుండును. సర్వదర్శనము ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు లభ్యమవుతుంది. అర్చనలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించుతారు. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు ప్రత్యేక అర్చనలు మరియు 7 గంటలకు మహామంగళహారతి సేవ జరుగుతాయి. ఆలయం బయట పూజాసామాగ్రీలు విక్రయించు షాపులు కలవు. ఆశ్వయుజ మాసమున దేవీనవరాత్రులు, రథోత్సవాలు జరుగుతాయి. ప్రతి మంగళవారం, శుక్రవారం సేవలు విశేషముగా వుంటాయి.

6. శ్రీశైలే భ్రమరాంబికా
ఆంధ్రప్రదేశ్‌, కర్నూలు జిల్లా, నందికొట్కూరు తాలూకా, నల్లమల్ల అడవులతో నిండిన కొండల ప్రాంతము నందు శ్రీశైలం కలదు. ఇది పురాణ ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగములలో రెండవది అయిన శ్రీ మల్లిఖార్జున లింగము మరియు అష్టాదశ శక్తిపీఠాలలో ఆరవది అయిన శ్రీ భ్రమరాంబికా పీటమును శ్రీశైలం నందు దర్శించగలము. సతీదేవి కంఠభాగము పడినచోటుగా ప్రసిద్ధి చెందినది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవ పీఠముగా పరిగణించబడుతోంది. ఆలయ ప్రశస్తి స్కందపురాణం, శ్రీశైలఖండము, బ్రహ్మాండపురాణం, శివపురాణం, శేషధర్మము మొదలగు పురాణాల్లో వుంది. మార్కండేయ పురాణంలో, దేవి సర్వోత్పత్తి గురించి ప్రస్తావించబడింది. దేవి తన తొమ్మిదవ అవతారంలో అరుణుడు అనే రాక్షసుని భ్రమరాలు (తుమ్మెదలు) సహాయంతో వధించి, జగతికి శాంతి చేకూర్చినందున, భక్తులు దేవిని ”భ్రామరి”గా కీర్తించారు. ప్రకృతి రూపిణియగు పరాశక్తిని ”భ్రమారాంబికా”గా వర్ణించారు.

శ్రీశైల స్థలపురాణములు అనేకం. శిలాదుడు అను మహర్షి మహాశివభక్తుడు. అతనికి యిద్దరు కుమారులను పరమేశ్వరుడు అనుగ్రహించినాడు. వారే నందికేశుడు మరియు పర్వతుడు. వీరు కూడా గొప్ప శివభక్తులు. వారి కోర్కెల ప్రకారము నందికేశుడు స్వామివారికి వాహనము గాను, పర్వతుడు స్వామివారి నివాస స్థలముగాను సేవలు చేయుచున్నారు. స్వామివారు వెలిసినప్పటి నుంచి పర్వతుడు ”శ్రీ పర్వతము”గా ప్రసిద్ధిచెందినాడు. కైలాసం నందు విఘ్నేశ్వరునిచే పరాభవం పొందిన కుమారస్వామి కోపించి, శ్రీ పర్వతానికి చేరుతాడు. పుత్రుని ఎడబాటు సహించలేని ఆదిదంపతులు శ్రీ పర్వతము చేరి నివాసం ఏర్పర్చుకొంటారు.

మల్లిఖార్జున సామ్రాజ్యమును చంద్రగుప్తుడు అను రాజు పాలించుచుండెను. ఇతని కుమార్తె చంద్రావతి కూడా తండ్రివలె గొప్ప శివభక్తురాలు. యౌవనదశలో నున్న చంద్రావతిపై చంద్రగుప్తుడు అమానుష చర్యకు పూనుకొంటాడు. తండ్రి అమానుష చర్యకు భయపడి శ్రీశైలం చేరి, స్వామిని మల్లెపూలతో అర్చించి, అత్యంత ప్రీతిపాత్రమైనది. మల్లెపూలతో అర్చించుటవలన స్వామికి మల్లిఖార్జునుడుగా పేరు వచ్చింది. ఒకనాడు పరమేశ్వరుడు సాక్షాత్కరించి ఆమె ప్రార్ధనను అంగీకరించి, చంద్రమాంబ అనుపేరిట తన దేవేరిగా స్వీకరించాడు. చంద్రావతి శ్రీ భ్రమరాంబికాదేవే అని కొంతమంది వాదన.

పూర్వం నల్లమల్ల అడవులతో నిండిన కొండల ప్రాంతము నందు గల శివాలయం చుట్టుప్రక్కల చెంచుజాతివారు నివసించుచుండెడివారు. చెంచుజాతి వారి కన్యను స్వామి వివాహమాడాడని ఒక గాథ వుంది. చెంచుజాతి వారు స్వామిని చెంచు మల్లయ్యగా పిలుస్తారు. శివరాత్రి పర్వదినాన జరిగే ఉత్సవాలలో రథంలాగే కార్యక్రమమును చెంచుజాతివారు తమ వంతుగా చేపట్టి, తమ భక్తిని ప్రదర్శించుతారు. కర్ణాటక రాష్ట్ర ప్రాంతములో మరో గాథకలదు. వీరు మల్లయ్యను చెవిటి మల్లయ్యగా సంబోధించుతారు.

7. కొల్హాపురీ మహాలక్ష్మి
దక్షిణ మహారాష్ట్రము నందు కొల్హాపూర్‌ జిల్లా కలదు. జిల్లా ముఖ్యకేంద్రమైన కొల్హాపూర్‌ పట్టణం పంచగంగానది ఒడ్డున వుంది. ఇది దక్షిణకాశీగా ప్రఖ్యాతి చెందినది. ఒకానొప్పుడు మరాఠా రాజ్యానికి ప్రధాన రాజధానిగా విలసిల్లిన క్షేత్రరాజ్యం. ప్రాచీనకాలం నందు ఈ పట్టణము కరవీరపురంగా పిలిచేవారు. నేడు కొల్హాపూర్‌గా వ్యవహరించుచున్నారు. కొల్హాపూర్‌ అనగా కనుమలోయలోని పట్టణము అని అర్థం. క్షేత్రంలోని శ్రీమహాలక్ష్మి అష్టాదశ శక్తి పీఠాలల్లో ఏడవదిగా గణ్యత చెందినది. సతీదేవి వామహస్తం పడిన ప్రదేశముగా ప్రసిద్ధి గాంచినది. శక్తిరూపమైన శ్రీ మహాలక్ష్మితోపాటు శ్రీ మహాదేవలింగము కలదు. అమ్మవారితోపాటు శ్రీ మహాదేవ లింగమునకు ప్రాముఖ్యత వుంది. శ్రీ మహాలక్ష్మి ఆలయం 9వ శతాబ్దంలో నిర్మించారు. ఆలయముపైన ఐదు గోపురాలు దర్శనమిస్తాయి. ప్రధానాలయమునందు శ్రీ మహాలక్ష్మికి ఇరువైపుల శ్రీమహాకాళి, శ్రీమహాసరస్వతి కొలువైనారు. వీరితోపాటు శ్రీమహాగణపతి దర్శనము కూడా లభ్యమవుతుంది. శ్రీ మహాదేవలింగమునకు ప్రత్యేకముగా, ఆలయ ప్రాంగణములో స్థానము వుంది. జగన్మాత మహాలక్ష్మి గర్భాలయ బయట, శ్రీయంత్రం వుంది. భక్తులు శ్రీయంత్రమునకు పూజలు నిర్వహించుతారు. అమ్మవారికి ఎదురుగా సింహవాహనము దర్శనమవుతుంది. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి బంగారు పాదుకులున్నాయి. వీటిని భక్తులు దర్శించటానికి వీలుగా, బయటకు తీసి మరల అలంకరించడానికి వీలుగా వుండును. దేవి శిరస్సు మీద ఒక నాగపడగ, పడగనందు శివలింగము యోని ముద్ర వున్నాయి.

ప్రధానాలయం తెల్లవారి 4 గంటలకు తెరచి తిరిగి రాత్రి 10 గంటలకు మూయబడును. ప్రతి నిత్యము అమ్మవారికి ఐదు పర్యాయములు హారతి సేవ జరుగుతుంది. ఆలయం తెరచినప్పుడు జరుగు హారతి సేవ కాగడ హారతిగా పిలుస్తారు. ఉదయం 8 గంటలకు జరుగు మహాపూజ సమయంలో మంగళహారతి సేవ జరుగుతుంది. మధ్యాహ్నం 11 గంటలకు నైవేద్యం సమర్పించు సమయములో పరిమళమైన పుష్పములు, కుంకుమ, కర్పూరముతో హారతి సేవ జరుగుతుంది. అమ్మకు నైవేద్యంగా ఘనమైన వంటకాలు, పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె మొదలగునవి సమర్పించుకుంటారు. నైవేద్య సేవ ప్రతి శుక్రవారం రాత్రి కూడ జరుగుతుంది. ప్రతి నిత్యం రాత్రి 7 గంటలకు జరుగు సేవను భోగహారతిగా పిలుస్తారు. రాత్రి 10 గంటలకు సేజ హారతి సేవ (పవళింపు హారతి సేవ) జరుగుతుంది. కర్పూర హారతి సేవ అనంతరము అమ్మవారి ఆభరణములు దేవస్థాన ఖజానాలో జమ చేయుదురు. ప్రతి గురువారం, శుక్రవారం మరియు పండుగలకు హారతి సేవల సంఖ్యయే అధికమవుతుంది.

8. మహూర్యే ఏకవీరికా
మహారాష్ట్రం నందలి నాందేడ్‌ జిల్లాకు ముఖ్యకేంద్రము నాందేడ్‌ పట్టణము. నాందేడ్‌కు ఈశాన్యంగా, సుమారు 135 కి.మీ. దూరమున మహూర్‌గడ్‌ అను క్షేత్రం కలదు. క్షేత్రరాజ్యం పర్వతారణ్యయ ప్రాంతములోని ఒక గ్రామం. మహూర్‌గడ్‌ నిత్యం భక్తులతో యాత్రికులతో కోలహాలముగాను, తిరునాళ్ళుగాను దర్శనమిస్తుంది. మహూర్‌ బస్‌స్టాండ్‌కు సుమారు 3 కి.మీ. దూరమున ఎత్తైన పర్వతము మీద శ్రీ రేణుకాదేవి శక్తిపీఠం వుంది. శ్రీ ఏకవీరికాదేవి శక్తి పీఠంగా భక్తులు కొలుస్తారు. అష్టాదశశక్తి పీఠములలో ఎనిమిదవదిగా ఖ్యాతి పొందినది. సతీదేవి కుడిస్తనం పడినచోటుగా భక్తులు భావించుతారు. మహారాష్ట్రములోని మూడున్నర శక్తిపీఠములలో ఒకటిగా ప్రసిద్ధి. మిగిలిన కొల్హాపూర్‌ నందలి శ్రీ మహాలక్ష్మిపీఠం, తుల్జాపూర్‌ నందలి శ్రీభవాని పీఠం మరియు నాసిక్‌ నందలి పంచవటి తీరమునగల శ్రీధరాదేవి పీఠం (అరశక్తిపీఠం) వీటిని మహారాష్ట్ర ప్రజలు భక్తి విశ్వాసములతో సందర్శించుకుంటారు.

మహూర్‌ బస్టాండ్‌ నుంచి 3 కి.మీ. ఘాట్‌రోడ్‌ మార్గములో ప్రయాణము. ఆలయ దిగువ భాగము వరకు రవాణా సదుపాయములు హెచ్చు సంఖ్యలో లభ్యమవుతాయి. దిగువ భాగము నుంచి 250 మెట్లు ద్వారా శ్రీ రేణుకాదేవి మందిరము చేరవచ్చును. మెట్లు మార్గమునకు రెండు ప్రక్కలా పూజా సామాగ్రీలు, అమ్మవారి చిత్ర పఠములు మొదలగునవి విక్రయించు షాపులు కలవు. శ్రీ ఏకవీరికాదేవి మందిరము చాల ప్రాచీనమైనది. ఆలయమంతా సింధూర రంగులో దర్శనమిస్తుంది. చిన్న ముఖద్వారం నుంచి ఆలయ ప్రవేశం చేయాలి. ముందుగా శ్రీ పరశురామ్‌ గణేష్‌ దర్శనము చేయాలి. పిదప రేణుకామాత (ఏకవీరికాదేవి) దర్శనము చేసుకోవాలి. మెడగాని, భుజనాలు గాని లేని రేణుకాదేవి శిరోభాగం మాత్రమే దర్శనమిస్తుంది. అమ్మవారి ముఖమంతా సింధూరం పూస్తారు. అమ్మవారి ముక్కు, నోరు, కళ్ళు స్పష్టముగా చూడవచ్చును. రేణుకాదేవి మహా తేజోమహిమతో అలరారుతుంది. మందిరంలో ఒక ప్రక్క యజ్ఞపీఠిక వుండగా, మరోప్రక్క ఉయ్యాలలో పరశురాముని విగ్రహం దర్శనమిస్తుంది. భక్తులు అమ్మవారి ప్రతిమకు కుంకుమార్చన మొదలగునవి జరుపవచ్చును.

శ్రీ ఏకవీరికా మాత దర్శనానంతరము ఆలయము బయటకు వస్తే ఆలయ ప్రాంగణము నందు శ్రీలక్ష్మి, శ్రీభవానీమాత మరియు శివలింగము మొదలగునవి దర్శనమిస్తాయి. రేణుకాదేవి (ఏకవీరికాదేవి) నూతన ఆలయ నిర్మాణములో వుంది. మహూర్‌గడ్‌ క్షేత్రం శ్రీ రేణుకాదేవి మందిరంతో పాటు శ్రీ దత్తపీఠం, శ్రీ అనసూయమాత మందిరములు చూడదగినవి. క్షేత్రము నందలి శ్రీ పరశురామమందిరం, శ్రీ సర్వతీర్థ, శ్రీకైలాసగిరి, శ్రీవనదేవి, శ్రీమహాకాళి మందిరము, శ్రీ చింతామణి మందిరం, శ్రీ మాతృతీర్థ, శ్రీగోముఖ, శివతీర్థ, శ్రీపాపహరణికుండ్‌, శ్రీఅమ్‌త్‌కుండ్‌, శ్రీఆత్మబోదకుండ్‌, శ్రీజమదగ్నిగుట్ట, పాండవులగుహ, కోఠిభూమి, సంగమేశ్వరం, శ్రీదేవదేవేరిమందిరం, మ్యూజియం మొదలగునవి కూడ చూడదగినవి. వీటిని సందర్శించుటకు స్థానిక రవాణా సదుపాయములు దొరుకుతాయి. 

9. ఉజ్జయిన్యాం మహాకాళీ
ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవది అయిన శ్రీ మహాకాళీలింగము మరియు అష్టాదశ శక్తిపీఠాలలో తొమ్మిదవది అయిన శ్రీ మహాకాళీ శక్తిపీఠం అమరియున్న పవిత్రస్థలం. సతీదేవి మోచేయి పడిన ప్రదేశముగా ప్రసిద్ధిగాంచినది. మార్కండేయ పురాణం నందు దేవి ఉత్పత్తి గురించి ప్రస్తావించబడింది. శ్రీ మహాకాళీ రాక్షసులను వధించడానికి పదితలలతో, పదికాళ్ళతో నల్లనిరూపుతో అవతరించింది. ఉజ్జయిని క్షేత్రం నందు ఇటువంటి రూపం ఎక్కడ దర్శించలేము. పురాణం నందు నల్లగా నున్న శ్రీ మహాకాళిని, హంసలకన్నా తెల్లనిదిగా భావించి పూజించే ఉజ్జయిని నివాసులు అంటే అమ్మకు ప్రీతిపాత్రులు. ఉజ్జయిని నగరవాసులు శ్రీ మహాకాళీని హరసిద్ధిమాతగా కొలుస్తారు. ఉజ్జయిని రైల్వేస్టేషన్‌కు సుమారు 2 కి.మీ. దూరంలో శ్రీ మహాకాళేశ్వరాలయం వుంది. దీనికి వెనుక భాగమున, సుమారు 500 మీటర్లు దూరమున కొంత ఎత్తయిన ప్రదేశము నందు కలదు. ఆలయమునకు తూర్పు ముఖముగా, దక్షిణ ముఖముగా రెండు ముఖద్వారములున్నాయి. గర్భాలయము నందు హరసిద్ధిమాత ముఖం మాత్రమే దర్శనమిస్తుంది. మాత ముఖమంతా సింధూరం పూస్తారు. అమ్మ యొక్క శాంతి రూపము, చల్లని చూపులు భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని పుష్కలంగా అనుగ్రహించగలదు. ఆలయ ప్రాంగణములో గౌరి, అన్నపూర్ణ మొదలగు శక్తి రూపములు దర్శనమవుతాయి. పరాశక్తి మాతకు ఈశాన్యంగా గణపతి మందిరం కలదు. గణపతి శరీరమంతా సింధూరం పూస్తారు. ఆలయ దక్షిణ ముఖద్వారము వద్ద పూజా సామాగ్రిలు విక్రయించబడును. శ్రీహరసిద్ధి మాత ఆలయమునకు ఎడమవైపున, కొంతదూరమున శ్రీరామమందిరము కలదు. వీరి సంరక్షణలో మంచి వసతి సదుపాయములు కలవు. యాత్రికులకు వసతి సదుపాయములు ఏర్పాటు చేయగలరు. శ్రీహరసిద్ధి మాత ఆలయము కుడివైపున అనేక మందిరాలున్నాయి. వీటికి సమీపంలో విక్రమాదిత్య మహారాజు నివాసమైన స్థలం కలదు. మహారాజు ఉపయోగించిన సామాగ్రిలు దర్శించవచ్చును.

10. పీఠికాయాం పురుహూతికా
ఆంధ్రలో ఈశాన్యం దిక్కుగా తూర్పుగోదావరి జిల్లా వుంది. పచ్చనిపైరులు, గలగలా పారుతున్న పంట కాలువలు, ఉధృతంగా ప్రవహించే గోదావరినది మరియు సముద్రతీర ప్రాంతాలతో నేత్రపర్వంగా జిల్లా దర్శినమిస్తుంది. సముద్రమూ, గోదావరి నది కలిసే ప్రదేశానికి అతిసమీపంలో నున్న ప్రాచీన పట్టణం ”కాకినాడ పట్టణం”. తూర్పు కోస్తా ప్రాంతపు రేవులలో కాకినాడ రేవు ప్రాచీనమైనది. పిఠాపురం సంస్థానాదీశులు కాకినాడ పట్టణమును ప్రణాళికాబద్ధమైన రీతిలో తీర్చిదిద్దారు. జిల్లా కేంద్రమైన కాకినాడ పట్టణమునకు ఉత్తరదిశవైపుగా సుమారు 19 కి.మీ. దూరమున పిఠాపురం అను చిరుపట్టణము వుంది. ఇది చుట్టుప్రక్కల ప్రాంతములకు ముఖ్య కేంద్రం. పిఠాపురం సంస్థానాదీశుల పాలనలో వైభవముగాను, శోభాయమానంగా విలసిల్లిన రాజక్షేత్రం. నాటి మహారాజుల భవనములు కట్టడాలు చరిత్ర గర్భంలో కలిసిపోయినాయి. వీటితోపాటు శ్రీపురుహూతిక పీఠం కూడ కాలగర్భంలో కలిసిపోయి వుండవచ్చు. సతీదేవి యొక్క పీఠభాగము (పిరుదులు) పడిన ప్రదేశముగా ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రం ప్రాచీనకాలము నందు శ్రీపీఠంగా, పురుహూతికాపురంగా, పురుహూతికా పట్టణముగా వాడుకలో వుండేది.

అష్టాదశ శక్తి పీఠములలో పదవపీఠం అయిన శ్రీ పురుహూతికా మూలస్థానము శ్రీ కుక్కుటేశ్వరాలయ ప్రాంగణము నందు ఈశాన్యం వైపుగా వుంది. గర్భగుడి నందు అమ్మవారు శాంతి రూపములో దర్శనమిస్తుంది. శ్రీ పురుహూతికాదేవిని ఇంద్రుడు మున్ముందుగా ఆరాధించారు. గయాసురుడు కూడ ఆరాధించిన శక్తిగా ప్రసిద్ధి చెందినది. అమ్మవారి మందిరము 1995 సంవత్సరము నందు జీర్ణోద్ధరణ జరిగింది. 1998 సంవత్సరం నందు ఆలయ పునర్నిర్మాణమునకు శంఖుస్థాపన జరిగింది. అమ్మవారికి నిత్యపూజలు జరుగుతుంటాయి. కుంకుమార్చనలు మొదలగునవి భక్తులు భక్తి శ్రద్ధలతో చేస్తారు. అమ్మవారి మంటపం నందు నాలుగు ప్రక్కల, గర్భగుడి గోడల మీద అష్టాదశ శక్తి పీఠములను పొందుపర్చినారు. ఆశ్వీజమాసంలో దేవి నవరాత్య్రుత్సవాలు ఘనంగా జరుగుతాయి. విజయదశమినాడు జమ్మి ఉత్సవం వైభముగా జరుగుతుంది.

పిఠాపురం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. దేశంలోని ప్రాచీన పుణ్యతీర్థములలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచినది. క్షేత్రం నందలి శ్రీ కుక్కుటేశ్వరుడు స్వయంభూలింగముగా వెలిసారు. పిఠాపురం కాశీతో సమానమైనది. దీనిని దక్షిణ కాశీగా పిలుస్తారు. శ్రీ వ్యాసభగవానులు సతీసమేతంగా కాశీనగరం విడిచి, దక్షిణకాశీ అయిన పిఠాపురం నందలి పాదగయ తీర్థమున స్నానముచేసి, శ్రీహుంకారిణి సహిత శ్రీకుక్కుటేశ్వరుని దర్శించుకున్నారు. శ్రీ అగస్త్యులు కూడా సతీసమేతంగా ద్వాదశ క్షేత్రయాత్ర సలుపుతూ భీమమండలం నందలి శ్రీ కుక్కుటేశ్వరస్వామిని మరియు శ్రీ పురుహూతికాదేవిని కొలిచినారు. 14వ శతాబ్దం వాడైన శ్రీనాథకవి సార్వభౌముడు తన కావ్యమునందు ఈ క్షేత్రమును పీఠికాపురం, పీఠాపట్టణము మరియు పిఠాపురముగా వర్ణించాడు. శ్రీకుక్కుటేశ్వరక్షేత్రం కాశీ, కేదార, కోణార్క, కుంభకోణములకు సాటియగు మోక్షదాయమని వర్ణించాడు. ఇక్కడ జరిపే దానం, హోమం, అధ్యయనం, శ్రాద్ధం, దేవతార్చనలు, వ్రతాలు మొదలగునవి కోటి రెట్లు ఫలితములిచ్చునని భీమేశ్వరపురాణం నందు వివరించాడు. కుక్కుటేశ్వర శతకం అను కావ్యమును శ్రీకూచిమంచి తిమ్మకవి స్వామివారికి అంకితమిచ్చాడు. శ్రీ వారణాసి వేంకటేశ్వరకవి, శ్రీ దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి కవి, శ్రీ ఓరుగంటి వెంకటశాస్త్రికవి మొదలగు కవులు తమ కవితా భక్తి కుసుమాలతో స్వామిని అర్చించుకుని ధన్యులైనారు.

11. ఓఢ్యాయాం గిరిజాదేవి
ఒరిస్సా రాష్ట్రమునకు ఈశాన్యదిశగా జాజ్‌పూర్‌జిల్లా కలదు. జిల్లా ముఖ్యకేంద్రము జాజ్‌పూర్‌ పట్టణం. ఈ క్షేత్రమున అష్టాదశశక్తి పీఠాల్లో పదకొండవదిగా గిరిజాదేవి పీఠం వుంది. మాతను విరజాదేవిగా పిలుస్తారు. స్థానికులు విరజాదేవిగా కొలుస్తారు. జాజ్‌పూర్‌ చాలా పురాతన పట్టణం. పవిత్రమైన వైతరణి నది ఒడ్డునగల జాజ్‌పూర్‌ను వైతరణి పట్టణముగా పిలుస్తారు. ప్రాచీన కాలం నందు జాజ్‌పూర్‌ పట్టణము, రాజుల మత రాజధానిగా శోభిల్లింది. కళింగ గాంగవంశము, దత్తవంశము, సోమవంశి వంశము మొదలగు రాజుల కాలంలో జాజ్‌పూర్‌ క్షేత్రం అభివృద్ధి చెందినది. ఈ క్షేత్రమును గదక్షేత్రం, నాభిక్షేత్రం, విరాజక్షేత్రం, బ్రహ్మక్షేత్రం, విరాజతీర్థం, వైతరణితీర్థం మొదలగు పేర్లతో భక్తులు కొలుస్తారు. జాజ్‌పూర్‌ నందు శక్తిపీఠంతో పాటు శైవమతమునకు చెందిన అనేక శివలింగాలు, వైష్ణవ మతమునకు చెందిన ఆలయాలు మరియు తీర్థాలు కలవు. ఈ క్షేత్రము తాంత్రికపీఠంగా కూడా ఖ్యాతి పొందినది. తంత్ర శాస్త్రమునకు సంబంధించిన పూజలు నిర్వహించేవారు. జాజ్‌పూర్‌ ప్రాంతములో హైందవమతంతో పాటు బౌద్ధమతం, జైనమతం కూడా అభివృద్ధి చెందినట్లు శాసనములు తెల్పుచున్నాయి. జిల్లాలోని రత్నగిరి, ఉదయగిరి బౌద్ధమతమునకు ముఖ్య కేంద్రములుగా ఉండేవి. 1360 మరియు 1568 సంవత్సరములలో మహమ్మదీయులు (బెంగాల్‌ నవాబులు) చేసిన దారుణ మారణకాండలో హైందవదేవాలయములు నేలమట్టం చేయగా, నేలమట్టమైన శకలాల మీద మరల కొన్ని ఆలయాలు పునరుద్ధరణ జరిగాయి. మరికొన్ని ఆలయాలు క్షీణదశ చేరగా, నరసింహదేవ్‌, సోమదత్త, ప్రతాపరుద్రదేవ్‌, యయాతి రాజు కాలములో వాటికి పునర్నిర్మాణములు జరిగినాయి.

జాజ్‌పూర్‌ బస్‌స్టాండ్‌ నుంచి సుమారు 2 కి.మీ. దూరమున బింజాపూర్‌ పోవు రోడ్డు మార్గమున బ్రహ్మకుండం వద్ద విరజాదేవి ఆలయం వుంది. నేటి ఆలయనిర్మాణం 18వ శతాబ్దంలో జరిగింది. ఆలయ ప్రాకారంలో నాభిగయ, ఇన్నైశ్వర్‌ శివాలయం, హనుమాన్‌ మందిరం, డోలమండపం, భైరవ, కార్తికేయ, గంగాధర్‌తోపాటు 108 శివలింగాలు, విష్ణురూపాలు దర్శించవచ్చును. ఆలయ గర్భగుడిలో విరజాదేవి మహా తేజోమహిమతో అలరారుతుంది. అమ్మవారి స్వరూపం దేదీప్యమానంగా, తేజోవంతంగా, శాంతిమూర్తిగా కనిపించి, మహామహిమోపేతమైన శక్తి స్వరూపిణిగా దర్శనమిస్తుంది. సతీదేవి యొక్క నాభిస్థానం పడటం చేత, దీనిని మహాశక్తి పీఠంగా పరిగణిస్తారు. ఇది నాభిక్షేత్రంగా కూడా క్యాతి పొందినది. ఆలయప్రాకారం, సింహద్వారము శోభతో నయనానందకరంగా దర్శనమిస్తాయి. గుప్తుల కాలమునాటి విరజాదేవి విగ్రహం, రెండు చేతులు కలిగిన మహిషాసురమర్ధినిగా ఉంటుంది. రాక్షసశక్తి అయిన ఎనుబోతును, అమ్మవారు తన ఎడమకాలితో త్రొక్కి, కుడిచేతిలోని త్రిశూలమును ఎనుబోతు శరీరములో గ్రుచ్చి, ఎనుబోతు (మహిషాసుర) తోకను ఎడమచేతితో పుచ్చుకుని నిలుచుండెను. ఇటువంటి మహిషాసురమర్ధిని రూపం యొక్క నకలును జగన్నాథాలయ ప్రాకారం నందు, వాయువ్యవైపునగల ముక్తీశ్వర్‌ ఆలయం నందు కూడ చూడగలము. భారతదేశమున మరోచోట ఇటువంటి మహిషాసురమర్ధిని రూపమును దర్శించలేము.

12. మాణిక్యా దక్షవాటికే
ఆంధ్రప్రదేశ్‌ నందలి తూర్పుగోదావరి జిల్లా ముఖ్యకేంద్రం కాకినాడ పట్టణము. దీనికి సుమారు 28 కి.మీ. దూరమున ద్రాక్షారామమే పుణ్యక్షేత్రం వుంది. ఇక్కడ భీమేశ్వరుడు మరియు శ్రీ మాణిక్యాంబదేవి కొలువు దీరియున్నారు. భారతఖండములో విరసిల్లిన అష్టాదశ శక్తి పీఠాలలో పన్నెండవదిగా మాణిక్యాంబది. సతీదేవి ఎడమ చెక్కిలి పడిన ప్రదేశంగా ప్రసిద్ధిగాంచినది. సతీదేవి తండ్రి అయిన దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశమును దక్షవాటికగా పిలుస్తారు. దక్షవాటిక దక్షరామం అని పిలువబడింది. కాలక్రమేణా ద్రాక్షారామంగా మారింది. దక్షవాటికన దాక్షాయిని (సతీదేవి) ఆత్మాహుతి చేసుకున్న స్థానమున, పరమేశ్వరుడు భీమరూపమున స్వయంభువుడైనాడు. స్వయంభువ లింగమును భీమేశ్వరునిగా కొలుస్తారు. ద్రాక్షారామం దక్షిణకాశిగా భాసిల్లుతుంది. దక్షిణ భారతదేశము నందు గల అతి ప్రాచీనమై మరియు పురాణ ప్రసిద్ధిగాంచిన శివక్షేత్రాలలో ఒకటిగా ఖ్యాతి పొందినది. శ్రీశైలం – శ్రీకాళేశ్వరం – శ్రీ దాక్షారామం మధ్యగల భూమిని త్రిలింగ దేశముగా పిలుస్తారు. శ్రీభీమేశ్వరలింగము త్రిలింగములలో ఒకటిగా వర్ధిల్లుతోంది.

శ్రీ భీమేశ్వరాలయమునందు శ్రీ మాణిక్యాంబదేవికి ప్రత్యేక స్థానం కలదు. శ్రీ భీమేశ్వరాలయం రెండవ ప్రాకారములోని గర్భాలయమునకు నాలుగు ప్రక్కల మండపం వుంది. మండపం వరసలో స్వామివారి పరివార గణములతో పాటు మాణిక్యా శక్తిపీఠం కూడా కలదు. శ్రీ భీమేశ్వర లింగమునకు ఈశాన్యవైపున, దక్షిణముఖముగా శ్రీ మాణిక్యాంబ అమ్మవారు కొలువుతీరింది. తూర్పు చాళుక్యులు తమ ఇలవేల్పుగా మాణిక్యాంబను ఆరాధించారు. శ్రీ మాణిక్యాంబ దేదీప్యమానంగా, తేజోవంతంగా, మంగళకరముగాను భక్తులకు దర్శనమిస్తుంది. సమస్త దేవతలలో మాణిక్యాంబ సుప్రసన్నమూర్తి. భక్తుల యొక్క ఆశ్రిత కల్పవృక్షం శ్రీమాణిక్యాంబదేవి. శ్రీ ఆదిశంకరులు మాణికేశ్వరిని చక్రబిందువుపై ప్రతిష్ఠించారు. అమ్మవారికి నిత్యం కుంకుమార్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుతారు. శ్రీ భీమేశ్వరాలయం బయటపూజా సామాగ్రిలు విక్రయించు షాపులు కలవు.

స్థలపురాణము
ద్రాక్షారామ భీమేశ్వరాలయం పంచారామాలలో ఒకటిగా ప్రాముఖ్యత పొందినది. పురాణాల కాలములో దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన యుద్ధంలో శంకరుని కుమారుడైన శ్రీ కుమారస్వామితో తారకాసురుడు యుద్ధంలో తలపడ్డాడు. తారకాసురుని కంఠమునందు గల అమృతలింగమును ఐదు ఖండాలుగా కుమారస్వామి చేధించినాడు. అవి ఐదు క్షేత్రాలలో పడ్డాయి. వీటిని పంచారామాలుగా పిలుస్తారు. వీటిని అమరారామం, భీమారామం, క్షీరారామం, ద్రాక్షారామం మరియు కుమారారామంగా కొలుస్తారు. మహాశివరాత్రి పర్వదినాన అసంఖ్యాక యాత్రికులు ఈ ఐదు క్షేత్రాలను ఒక వరుసలో సందర్శించి పునీతులవుతారు.

13. హరిక్షేత్ర కామరూపా
భారతదేశమున, ఈశాన్యదిశగా అస్సాం రాష్ట్రం కలదు. పూర్వం దీనిని కామరూప దేశంగా పిలిచేవారు. అస్సాంలోని కామరూప జిల్లానందు కామాఖ్య ఆలయం కలదు. అస్సాం రాష్ట్రములోని ముఖ్యనగరమైన గౌహతి పట్టణమునకు సుమారు 10 కి.మీ. దూరమున గల నీలాచల పర్వతం మీద అష్టాదశ శక్తిపీఠాల్లో ప్రధానమైన శ్రీ కామాఖ్య అమ్మవారి ఆలయం కలదు. నీలాచల పర్వతమును కామగిరి పర్వతం అని కూడా అంటారు. సముద్ర మట్టమునకు 535 అడుగల ఎత్తునగల కామాఖ్య ఆలయ ప్రాంతము ఎంతో రమణీయమైన ప్రకృతిశోభతో ఆహ్లాదకరముగా ఉంటుంది. కామాఖ్య శక్తిపీఠము ప్రాచీన కాలము నుండి ప్రసిద్ధ శక్తిపీఠంగాను మరియు తాంత్రిక విద్యలకు, పూజలకు కేంద్రం గాను ప్రఖ్యాతిగాంచినది. శ్రీమహావిష్ణుకు ముడిపడిన అనేక తీర్థములు ఈ క్షేత్రము నందు ఉన్న కారణముగా, ఈ ప్రాంతము హరిక్షేత్రంగా ప్రఖ్యాతిగాంచినది. ప్రపంచంలోని అతి పెద్ద నదులలో ఒకటిగా ఖ్యాతిపొందిన బ్రహ్మపుత్రనది నీలాచల పర్వతాన్ని అంటి ప్రవహిస్తూ వుంటుంది.

సతీదేవి యోని భాగము పడిన ప్రదేశమే కామాఖ్య శక్తిపీఠంగా విరాజిల్లుతుంది. అష్టాదశ శక్తిపీఠాల్లో పదమూడవదిగా పరిగణించబడుతుంది. ఇది కామాఖ్య తాంత్రిక పీఠంగాను, కామ్యాసిద్ధి పీఠంగాను ప్రపంచ ప్రసిద్ధికెక్కింది. కామాఖ్య ఆలయంలోపల ఒక గుహలాంటిది కనబడుతుంది. గుహలోపల ఒకమూల, నల్లనిరాయిమీద ‘యోని’ రూపం చెక్కి ఉంటుంది. ఆ భాగమును (రూపాన్ని) భక్తులు పూజిస్తూ వుంటారు. ఆ కారణముగా కామాఖ్యపీఠం యోని పీఠంగా ఖ్యాతిపొందినది. యోనిని సృష్ఠికి, సృజనశక్తికీ సంకేతంగా భావిస్తారు. దీనివలన కామరూపాదేవికి ”భగవతి” అను నామం సార్ధకమైనది. భగము అనగా యోని అని అర్ధము. అమ్మవారి భగమును (యోని) పూజించేవారిని వామాచారులని పిలుస్తారు. వామాచార పూజలో ప్రధానపూజ జీవించివున్న స్త్రీ అవ్వడం గమనించదగినది.

నగరవాసులతోపాటు, చుట్టుప్రక్కలగల గిరిజన తెగలకు కూడా కామాఖ్య అమ్మవారు ముఖ్యఆరాధ్య దేవత. ఖాసీ అనే గిరిజన భాషలో కామాఖ్య అంటే జన్మనిచ్చే తల్లి అని అర్థం. తాంత్రికులను ఆకర్షించే ప్రధాన శక్తి పీఠాలలో కామాఖ్యపీఠం ముఖ్యమైనది. అమ్మవారు శక్తిరూపం గావున బలి, పూజాదులు మొదలగునవి జరుగుచుండేవి. ఇక్కడ తాంత్రిక ప్రజా విధానం జరుగుచుండేది. శ్రీ ఆదిశంకరాచార్యులు, తాంత్రిక పూజా విధానమునకు ప్రతిగా పంచాయతన పూజా విధానాన్ని ప్రవేశపెట్టినారు. దీనితో తాంత్రికధోరణుల వ్యాప్తి తగ్గిందని చెబుతారు. నేడు ఆలయము నందు పూజలు తాంత్రిక మరియు ఆగమపద్ధతిలో జరుగుతుంటాయి. భక్తులు పూజా, ఉపాసనలతో కుమారీ పూజ చేస్తారు. పూజానంతరము భోజనం పెట్టడం గొప్ప సంప్రదాయంగా సాగుతోంది. కుమారీపూజను కన్యపూజ అని కూడ అంటారు. నవరాత్రులలో ఆర్ధికముగా శక్తి వున్నవారు ప్రతిరోజు ఒక్కొక్క కన్యను ఆహ్వానించి, శాస్త్రోక్తంగా పూజించాలి. రెండేళ్ళ నుంచి ఏడేళ్ళ వయస్సు వున్న కన్యలే యిందుకు అర్హులు. ఒంటిమీద గాయాలు, మచ్చలు, కురుపులు వున్నవారు మరియు రోగగ్రస్తులు కన్యాపూజకు అర్హులుకారు. వీరిని అమ్మవారి మూర్తిగా భావించి, శ్రీయుక్తనామమంత్రాలతో పూజించాలి. కుమారీ పూజావిధానం దేవీ భాగవతం నందు ప్రశంస కలదు. వివాహం కాని స్త్రీలు వివాహం కావాలని కుమారిదేవిని ఆరాధిస్తారు.

కామాఖ్యమాతను తార, ఛండీ, సరస్వతి, దుర్గ, కాళీ మొదలగు రూపాలలో కూడ పూజిస్తారు. ఆలయము నందు ఈ రూపాలను దర్శించగలరు. ఉదయం 8 గంటల నుంచి కామాఖ్య అమ్మవారి దర్శనము ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు ఆలయమును మూసివేస్తారు. సంతానం లేనివారు సంతానం కోసం పూజిస్తారు. కామాఖ్య అమ్మవారి దర్శనముతో, తమ కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. కామాఖ్య దేవిని సందర్శించుకునే ముందుగా, యాత్రికులు ఆలయమునకు ఉత్తరంవైపున గల సౌభాగ్యకుండ్‌ నందు స్నానమాచరిస్తారు. సౌభాగ్యకుండ్‌ ప్రాంతములో పండాలు తర్పణ, శ్రాద్ధ కర్మలను నిర్వహించుతారు.

14. ప్రయాగే మాధవేశ్వరీ
భారతదేశంనందలి పుణ్యక్షేత్రాలు, నదీతర ప్రాంతములో ఆవిర్భవించి భక్తుల పాపాలన్నీ కడిగివేసి నిష్కళంకులుగా తరింపచేస్తున్నాయి. సుజలపూర్ణమయిన సప్తనదులు అనగా గంగా, యమున, సరస్వతీ, గోదావరి, కావేరి, నర్మదా, సింధునదులు భారతపుణ్యభూమి మీదగా ప్రవహిస్తూ ఎన్నో పవిత్ర స్థలాలను అనుసంధిస్తున్నాయి. వీటితోపాటు బ్రహ్మపుత్ర, సరయూ, పల్గునీ, గోమతి, భీమ, తుంగభద్ర, పెన్న, మహానది, ఇంద్రావతి, తపతి, సబర్మతీ మొదలగు పెక్కు నదుల ప్రవాహంతో భూమాత సస్యశ్యామలంగా పునీతమవుతుంది. పవిత్ర నదులకు ప్రతి 12 సంవత్సరములకు ఒకసారి పుష్కరోత్సవాలు జరుగుతాయి. అదేవిధముగా పుణ్యదాయకమైన నాసిక్‌, ఉజ్జయిని, హరిద్వార్‌ మరియు అలహాబాద్‌ క్షేత్రలములనందు కుంభమేళా ఉత్సవాలు జరుగుతాయి. ఇవి ప్రతి 12 సంవత్సరములకు ఒకసారి ఒక్కొక్క ప్రదేశములో వైభవంగా జరుగుతాయి. బృహస్పతి (గురుగ్రహము) వృషభరాశిలో నుండగా, సూర్యుడు మకర సంక్రమణమైనపుడు కుంభమేళా ఉత్సవాలు జరుగుతాయి. ఇట్టి కుంభ పర్వకాలమునందు లక్షలాది యాత్రికులు అలహాబాద్‌ వద్ద గల త్రివేణి సంగమం నందు పవిత్రస్నానములు చేసి, పూజాది కార్యక్రమాలు మరియు పిండ ప్రదానాలు నిర్వహించుతారు.

ఉత్తరప్రదేశ్‌ నందలి అలహాబాద్‌ జిల్లా ముఖ్యపట్టణమైన అలహాబాద్‌ను ప్రయాగ, త్రివేణి అని కూడా అంటారు. ప్రయాగ తీర్థరాజమని పురాణములలో చెప్పబడినది. గంగ, యమున, సరస్వతీ నదుల సంగమంతో ఈ ప్రాంతము త్రివేణిగా ప్రసిద్ధి చెందినది. ప్రయాగక్షేత్రం నందు త్రివేణి సంగమంతో పాటు అష్టాదశ శక్తి పీఠాలలో పదునాల్గవది అయిన శ్రీ మాధవేశ్వరి పీఠం. సతీదేవి హస్తాంగుళీయకం పడిన ప్రదేశముగా ప్రసిద్ధి. శ్రీ మాధవేశ్వరి శక్తిపీఠం త్రివేణి సంగమం వద్ద వుండేది అని పురాణాలు చాటుతున్నాయి. ప్రయాగ క్షేత్రమున శ్రీమాధవేశ్వరి అనే నామంతో శక్తిపీఠం లేదు. క్షేత్రంలోని అలోపిదేవిని శ్రీమాధవేశ్వరి దేవిగా భక్తులు కొలుస్తారు. శ్రీఅలోపిదేవి విగ్రహరహితమై మరియు గుప్తగాను మందిరంలో ఉంటుంది. అలహాబాద్‌ రైల్వేస్టేషన్‌కు సుమారు 3 కి.మీ. దూరంలోగల ‘దారాగంజి’ అనే ప్రాంతము నందు గల అలోపిబాగ్‌లో అమ్మదర్శనము చేయవచ్చును. ఇది అలోపిశంకరి శక్తిపీఠంగాను, మహేశ్వరి పీఠంగాను ప్రసిద్ధి చెందినది. విశాలమైన ప్రాంగణంలో అమ్మవారి మందిరం వుంది. పీఠమునకు మధ్య ఒక రంద్రము దర్శనమిస్తుంది. దీనిపై అమ్మవారి ఊయల వ్రేలాడుతూ వుంటుంది. భక్తులు తెచ్చిన కొబ్బరికాయను పండాలు రంధ్రము నందు అమ్మవారికి సమర్పించుతారు. భక్తులు అమ్మవారి ఊయలను భక్తి శ్రద్ధలతో ఊపుతారు. మందిరం వెనుక భాగమున నవదుర్గలు, గణపతి, శివలింగాలు మొదలగు మూర్తులున్నారు. త్రివేణి సంగమం నుంచి కూడా అలోపిబాగ్‌ చేరవచ్చును.

అలోపిబాగ్‌ నుంచి సుమారు 4 కి.మీ. దూరంలో శ్రీ కళ్యాణి దేవి అర్థశక్తిపీఠం కలదు. మందిరంలోని కళ్యాణిదేవికి కుడివైపున పార్వతీదేవి మరియు ఎడమవైపున మహాకాళి దేవిని దర్శించగలం. ఇది అర్ధశక్తి పీఠంగా ఖ్యాతి పొందినది. ఆలయ ప్రాంగణములో శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ రాధాకృష్ణులు, శ్రీరామలక్ష్మణుల సమేత జానకీమూర్తులను సందర్శించవచ్చును.

కళ్యాణిదేవి మందిరమునకు సుమారు 6 కి.మీ.ల దూరమున మీర్‌పూర్‌ గ్రామము నందు శ్రీలలితాదేవి సిద్ధిపీఠం కలదు. ఆలయ ప్రవేశ ముఖద్వారం పశ్చిమముఖంగాను, శ్రీలలితాదేవి తూర్పుముఖంగాను ఉంటుంది. శ్రీ లలితాఅమ్మవారికి ఇరువైపుల శ్రీమహాలక్ష్మి మరియు శ్రీమహాసరస్వతి మూర్తులున్నారు. ఆలయ పూజారి శ్రీలలితాదేవిని ప్రయాగమాధవేశ్వరిగా వర్ణించుచున్నారు.

15. జ్వాలాయాం వైష్ణవీదేవి
భారతదేశమున వాయువ్యమూలంగా హిమవన్నగ పర్వత ప్రాంగణంలో ఒదిగియున్న ప్రదేశం హిమాచలప్రదేశ్‌, పరమశివుని వెండికొండగా పేర్కొనబడిన దివ్యధామం హిమాలయం. హిమాచల స్వరూప స్వభావాన్ని బట్టి ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విభజించవచ్చును. దక్షిణ ప్రాంతము కొంత ఉష్ణంగాను, ఉత్తర ప్రాంతము శీతలముగా వుంటుంది. చలికాలము నందు అతిశీతలమై, హిమపాతం జోరుగా పడుతూ వుంటుంది. హిమాచలప్రదేశం చాలాభాగము పర్వతప్రాంతమే. ప్రపంచములోనే అత్యధిక గ్రామీణ ప్రాంతములతో నిండిన రాష్ట్రం. భారతమాతను వసుంధరగా సస్యశ్యామలంగా మారుస్తూ, తమ విద్యక్తి ధర్మంగా ప్రవహించే జీవనదులు జన్మస్థలమైన పుణ్యస్థలి హిమాచలప్రదేశ్‌, ఉత్తరాన జమ్ము-కాశీర్మర్‌, ఆగ్నేయముగా ఉత్తరప్రదేశ్‌, దక్షిణాన హర్యానా, పడమట పంజాబు సరిహద్దు రాష్ట్రాలు మరియు తూర్పున టిబెట్టు సరిహద్దు రేఖలున్నాయి. చీనాట్‌, రావి, బియాన్‌, సట్లెజ్‌, యమున నదులు హిమాచలప్రదేశ్‌ను సస్యశ్యామలము చేస్తున్నాయి. చద్విక్‌ జలపాతం, కుఫ్రి, డల్హౌసి, కసౌలి, లాహపుల్‌, స్పితి, సిమ్లా, కులూ, మనాలి మొదలగు పర్యాటక స్థలాలతో నిండి ఉంటుంది. జ్వాలాముఖి, తారాదేవి, ధర్మశాల, రేణుక, నైనాఏవి, బైద్యనాథ్‌, మహాదేవ్‌, పార్వతీలోయ, త్రిజోకనాథ మొదలగు పుణ్యక్షేత్రాలు దర్శనమిస్తాయి. గ్రామీణ ప్రాంత అందాలు, ప్రకృతి సౌందర్యాలు, పర్వత సోయగాలు, పర్యాటకులకు స్వాగతమిస్తున్నాయి.

హిమాచలప్రదేశ్‌ ఉత్తరప్రాంతమును క్రీ.శ. 550 సంవత్సరము పూర్వము నుంచి రాజపుత్రులు రాజ్యమేలారు. 2-5 శతాబ్దాల మధ్య గుప్తుల రాజ్యపాలనలో ఉండేది. హిందూరాజుల అంతఃకలహాల మూలంగా ఒక్కొక్క మెట్టూ పరాయిపాలకుల హస్తాలలోకి జారిపోయింది. మహమ్మద్‌ గజనీ దండయాత్ర చేసి దోచుకోగలిగినంత దోచుకున్నారు. టర్కీ సుల్తానులు, తురుష్కులు దండయాత్రలు చేసి సిరులన్నీ తరలించారు. ముస్లిం వంశీయులు వారి కోటలు నిర్మించి, తమ కోశాధికారులను నియమించారు. 16వ శతాబ్దంలో మొగలు వంశపు చక్రవర్తులు దండయాత్రలు చేసి, తమ సామ్రాజ్యంలోనికి తెచ్చారు. మొగలు పతనానంతరము సిక్కులు రాజ్యమేలారు. 18వ శతాబ్దంలో సిక్కురాజైన రాజారంజిత్‌సింగ్‌ మరణం తరువాత అనగా 19వ శతాబ్దంలో బ్రిటీష్‌వారి పాలనలోనికి వచ్చింది. 1947 సంవత్సరములో భారతస్వతంత్ర దేశంఅయిన పిమ్మట 32 సంస్థానాలు, రాచరికపు రాజులను విలీనం చేసి, కేంద్రపాలిత రాష్ట్రంగా ఏర్పాటుచేశారు. 1960వ సంవత్సరములో పంజాబులోని కొన్ని ప్రాంతాలు, అంతకు ముందున్న ప్రాంతములతో కలిసి హిమాచలప్రదేశ్‌గా ఏర్పాటు జరిగింది. ఉత్తర – పశ్చిమాన గల కాంగ్రా ప్రాంతము మొదటి నుంచి దృఢమైన రాజ్యంగా ఉండేది. రాజపుత్రులు, మొగలు వంశీయులు, సిక్కుల పాలనలో మహావైభవోపేతంగా, సిరులకు నిలయంగా తులతూగుచుండేది. కాంగ్రా పట్టణములోని దేవి వజ్రేశ్వరి ఆలయ సంపదను మహమ్మద్‌ గజనీ, తుగ్లక్‌లు కొల్లగొట్టుకుపోయినట్లుగా చరిత్ర చాటుతుంది. కాంగ్రా చుట్టుప్రక్కల ప్రాంతముల నందు అనేక హిందూ దేవాలయములు ఉండేవి. వీటిలో జ్వాలాముఖి ఆలయం పురాణ ప్రసిద్ధి చెందినది.

హిమాచలప్రదేశ్‌ ఉత్తర ప్రాంతమునందు కాంగ్రా జిల్లా కలదు. జిల్లా ముఖ్య కేంద్రముగా కాంగ్రా పట్టణము ఉంది. దీనికి సుమారు 35 కి.మీ. దూరమున జ్వాలాముఖి క్షేత్రం వుంది. ఇది సతీదేవి పిరుదులు పడిన ప్రదేశముగా ఖ్యాతి పొందినది. మరికొంతమంది సతీదేవి శరీరకలాల్లోని నాలుక తెగిపడిన ప్రదేశముగా భావించుచున్నారు. క్షేత్రం అష్టాదశశక్తి పీఠాలలో పదిహేనవదిగా ప్రసిద్ధి చెందినది. శివాలికి పర్వతశ్రేణిలో, కలిందర్‌ పర్వతం చెంత జ్వాలాముఖి ఆలయం వుంది. కొండమీదకు మెట్లు మార్గం నిర్మాణం జరిగింది. ఆలయంలో వేంచేసిన దేవిని విద్వేశ్వరీదేవిగా కొలుస్తారు. భక్తులు మాతను వైష్ణవీదేవిగా కూడా పిలుస్తారు. ఆలయం రాతిదర్వాజా గుండా చూస్తే వెలుగుతున్న మహాజ్వాలను చూడగలము. ఈ మహాజ్వాలను పాలు, నేయితో తయారుచేసిన పదార్ధాలను నివేదనగా సమర్పించుకుంటారు. ఆలయప్రాంగణములోని హోమగుండం నిరంతరం అగ్నితో ప్రజ్వరిలుతూంటుంది. భక్తులు అమ్మకు సమర్పించు నివేదనలు హోగుండమునకు సమర్పించుట ఆచారముగా వస్తుంది. నివేదనలు తిరిగి ప్రసాదంగా భక్తులకు పంచుతారు. ఆలయములోని జ్వాలల చుట్టూ ప్రదక్షిణలు జరిపి, భక్తి శ్రద్ధలతో జ్వాలాముఖిని ఆరాధించుతారు.

16. గయా మాంగళ్య గౌరికా
హిందువులకు, బౌద్ధలకు గొప్ప పవిత్రమైన యాత్రాస్థలం గయా క్షేత్రం. గయ క్షేత్రం నందు పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించి, పిండప్రదానం చేస్తే పితృ ఋణాన్ని తీర్చుకుని, ఇహపర సాధనలో మోక్షం పొందుతారు అని గట్టి నమ్మకం. వారణాశిలో మొదలయిన శ్రాద్ధవిధులు, గయా శ్రాద్ధవిధులతో పూర్తి అవుతుంది. గయలోని వటవృక్షము క్రింద పితృకర్మలు చేయించి, పిండ ప్రదానములు చేయిస్తారు. ఈ కర్మతో పితృదేవతలు శాశ్వత కైవల్యం పొందగలరని గాఢమైన విశ్వాసం. శ్రాద్ధవిధులు పండాలు మంత్రయుక్తంగా, శాస్త్రోక్తవిధిగా చేయిస్తారు.

గురుక్షేత్రం ఉత్తరభారతదేశంలోని బీహార్‌ రాష్ట్రములో వుంది. రాష్ట్ర ప్రధాన నగరమైన పాట్నాకు సుమారు 112 కి.మీ. దూరమున గయ పట్టణము కలదు. ఇది గయ జిల్లాకు ముఖ్య పట్టణము. ఫల్గునీ నదీతీరమున, అందమైన పర్వతశ్రేణుల మధ్య అమరియున్న పట్టణము. గయ క్షేత్రము పితృగయగా మరియు బుద్ధగయగా రెండు భాగములుగా ఉంటుంది. హిందువుల పురాతన ఆలయాలకు పితృగయ ప్రసిద్ధి. దేవాలయాలపై ఉండే శిల్పకళ ఎంతో శోభగా ఉంటుంది. బుద్ధ ఆశ్రమాలు, బౌద్ధ ఆలయాలకు బుద్ధగయ ప్రసిద్ధి. సిద్ధార్ధుడు తపస్సుచేసి, జ్ఞానాన్ని పొందిన పవిత్ర స్థలాలుగా బుద్ధ గయ ప్రఖ్యాతి చెందినది. వేదభూమి అయిన గయాక్షేత్రం పూర్వం మగధ సామ్రాజ్యంలో ఒక భూభాగంగా ఉండేది. మగధ గురించి వేదాల్లో, పురాణాల్లో ప్రసక్తి మరియు ప్రశస్తి వుంది. మగధ భూభాగంలో మౌర్యులు మరియు గుప్తుల పాలన కాలాలు స్వర్ణయుగంగా కీర్తించబడినాయి. బౌద్ధులకు ముఖ్య విహారంగా వుండి, విహార్‌ అనే నామంతో తేజరిల్లిన ప్రదేశం గయాక్షేత్రం.

అష్టాదశ శక్తిపీఠాలలో పదహారవ పీఠం అయిన శ్రీ మంగళగౌరి మహాశక్తి పీఠం గయాక్షేత్రం నందు కలదు. సతీదేవి యొక్క శరీరఖండం పడి, శక్తిపీఠం ఏర్పడింది. క్షేత్రంలోని విష్ణుపాద దేవాలయమునకు సుమారు 1 కి.మీ. దూరమున గల నారాయణ చుహ అనే ప్రాంతములో కొంత ఎత్తైన కొండమీద శ్రీ మంగళగౌరి పీఠం వుంది. కొండపైకి చేరుటకు మెట్లు మార్గంతోపాటు, కొండవెనుకభాగం నుంచి రోడ్‌ మార్గం కూడా కలదు. ఆటోరిక్షా, వేన్లు, టాక్సీలు మొదలగునవి కొండపైకి చేరుటకు వీలుగా వుంది. సతీదేవి యొక్క స్తనములు పడినచోటుగా ప్రసిద్ధి. సుమారు 3 అడుగుల ఎత్తుగల ద్వారం గుండా గర్భగుడిలోనికి ప్రవేశం దొరుకుతుంది. అమ్మవారి స్తనములు పోలిన శిలకు పూజలు జరుగుతాయి. భక్తులు కూడా స్వయంగా పూజలు చేయవచ్చును. ప్రతి మంగళవారం నాడు విశేషంగా అమ్మవారి దర్శనము కొరకు వస్తారు. విజయదశమి, చైత్రమాసంలో విశేషపూజలు, ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారి మందిరమునకు వెనుక భాగమున పార్వతి, కాళీ మూర్తులు దర్శించగలం. అమ్మవారి మందిరం ఎదురుగా వున్న మండపం నందు హోమం మొదలగు కార్యక్రమాలు నిర్వహించుటకు వీలుగా వున్నది. దీని ప్రక్కనే శివాలయం కూడా కలదు. పూజకు కావలసిన సామాగ్రిలు విక్రయించుశాలలు కూడా వున్నాయి. ఆలయ ప్రాంగణము భక్తి భావంతో నిండి వుంటుంది.
మహిళలకు శ్రావణమాసం అత్యంత ముఖ్యమైనది. మహిళలు ఆచరించే మంగళగౌరి వ్రతం శ్రావణ మాసమునకు ప్రధానమైనది. దీనినే శ్రావణ మంగళవార వ్రతం మరియు మంగళగౌరి నోము అని కూడా అంటారు. వ్రతం ఆచరించటం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. మహిమాన్వితమైన మంగళగౌరి వ్రతమును త్రిలోకసంచారి అయిన నారదుడు మహా పతివ్రత సావిత్రికి తెలిపి ఆచరింపచేసినట్లు, శ్రీకృష్ణపరమాత్మ ద్రౌపదికి తెలిపి స్వయంగా ఆచరింపచేసినట్లు మరియు త్రిపురాసుర సంహార సమయంలో శివుడు, మంగళగౌరిని పూజించి విజయం సాధించినట్లు మన పురాణాలు వెల్లడించాయి.

17. వారణాస్యాం విశాలాక్షి
భారతదేశమునందు ఉత్తరప్రాంతముగా వున్న భూమిని ఉత్తరప్రదేశ్‌గా పిలుస్తారు. ఇక్కడ వేదవాఙ్మయంలో పుట్టి పెరిగిన హైందవమతం, అహింసను ప్రబోధించిన బౌద్ధమతం యొక్క ప్రధాన వేదికలు, జైనమతం ఉజ్జ్వల శోభతో వెలిగి విస్తరిల్లాయి. రామాయణ, మహాభారత పురాణేతిహాసాల దివ్యపురుషుల నివాసం, ఈ పుణ్యభూమి మీద ఉండుట విశేషం. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నందు ఆగ్నేయం వైపుగా వారణాసి జిల్లా వుంది. జిల్లా ముఖ్య పట్టణము వారణాసి నగరం. ఈ పట్టణానికి అతి పురాతన నామం కాశికాపురి. కాశీ అనే పేరుకు అర్థం కాంతినిచ్చే స్థలం. హైందవులకు ఇది ముక్తి కాశిక. అనగా జ్ఞానజ్యోతినిచ్చే పురము. ఈ పట్టణము బెనారస్‌, వారణాసి అనికూడా పిలుస్తారు. కాశీక్షేత్రం వేదపురాణ కాలాల కంటే ముందే అత్యున్నతమైన స్థానాన్ని అలంకరించిన విజ్ఞానకేంద్రం. క్షేత్రములో పావన గంగానది ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది. గంగానదికి ఉత్తరంగా వరుణానది, దక్షిణాన అసి నదులు గంగానదిలో సంగమిస్తున్నాయి. ఈ రెండింటికి మధ్యనున్న పట్టణమవడం వల్ల వారణాసిగా ప్రసిద్ధి చెందినది. కాశీక్షేత్రంలోని మట్టి, గాలి, నీరు మొదలగునవి హైందవులకు అతి పవిత్రమైనవి. ఇక్కడ అడుగడుగునా తీర్థమే. జంతుజాలమూ, పక్షులూ కూడా మరణసమయం నందు విశ్వేశ్వరుని వల్ల తారకమంత్రోపదేశం పొంది ముక్తి నొందుతాయి. కాశీక్షేత్రం క్రిమికీటకాలు పొందే ఉత్తమపదవిని, వేరొక స్థలమున యోగులు కూడా పొందలేరు. ఇంతటి పవిత్ర, పుణ్యదాయకమైన కాశికాపురి, ఆది దంపతులకు నివాసస్థలము. ద్వాదవ జ్యోతిర్లింగములలో 9వది అయిన శ్రీవిశ్వనాధలింగము మరియు అష్టాదశ శక్తిపీఠాలలో పదిహేడవది అయిన శ్రీ విశాలాక్షి పీఠమును వారణాసి నందు దర్శించగలము.

శ్రీ విశాలాక్షి అమ్మవారి ఆలయము, విశ్వనాథ ఆలయమునకు తూర్పుగా సుమారు 2 ఫర్లాంగుల దూరమున మీర్‌గాట్‌కు దగ్గరలో ధర్మేశ్వర్‌ అనుచోట కలదు. సతీదేవి వామహస్తం పడినచోటుగా ప్రతీతి. ఆలయం నందు విశాలమైన కన్నులు కలిగిన విశాలాక్షి స్వరూపం దర్శించగలరు. ఆమెరూపం స్వయంగా ఏకశిలలో వెలసినది. కాశీనగరంలో నవ గౌరీ మందిరాలున్నాయి. వీటిలో విశాలాక్షి గౌరీ మందిరమునకు ఎంతో ప్రాముఖ్యత కలదు. మిగిలిన వాటిలో మంగళగౌరి, విశాలాక్షి గౌరీ మందిరాలు ముఖ్యమైనవి. విశాలాక్షి మందిరములో జరిగే కుంకుమార్చన సుప్రసిద్ధం. అమ్మ తమ భక్తులకు సమస్త సంపదలనూ ప్రసాదిస్తుంది. భక్తుల కోరికలు నెరవేర్చగల జగన్మాతగా ప్రసిద్ధి. శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారు ఆలయం నందు రెండు మూర్తులు దర్శనమిస్తాయి. ముందు భాగములో గల మూర్తిని జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులవారు స్థాపించినారు. వెనుకభాగంలో గల మూర్తి స్వయంభూమూర్తిగా ఖ్యాతిపొందినది. ప్రతి నిత్యం ఉదయం మరియు మధ్యాహ్నం నందు అమ్మవారికి అభిషేములు జరుగుతాయి. భాద్రపద శుక్ల పక్ష తదియ అమ్మవారి యొక్క జన్మదినం. నాడు విశేషాలంకరములు, ఉత్సవాలు జరుగుతాయి. అమ్మవారి గర్భాలయం బయట చుట్టూ శివలింగాలు, గణపతి మొదలగు మూర్తులను దర్శించవచ్చును. అమ్మవారి ఎడమవైపున గల మందిరంలో అమ్మవారి వాహనములు, నవగ్రహమండపం ఉన్నాయి. అమ్మవారి దర్శనము కొరకు వచ్చు భక్తుల సంఖ్యలో, దక్షిణభారతదేశం నుంచి వచ్చువారి సంఖ్య అధికముగా ఉంటుంది. అమ్మవారి ఆలయమునకు ఎడమవైపుగా మీర్‌ఘాట్‌, కుడివైపున శ్రీ విశ్వనాధాలయంనకు చిన్న, చిన్న ఇరుకైన సందులలో ప్రయాణం.

18. కాశ్మీరేతు సరస్వతి
భారతమాత శిరోభాగాన వెలిగే పచ్చల కిరీటమే కాశ్మీరు భూప్రాంతము. ప్రకృతి అందాలన్నీ మూటగట్టి రాసిపోసిన సుందర దివ్య ఆరామం కాశ్మీర్‌. సుందర దృశ్యముగా కనిపించు మంచు పొగలతో నిండిన హిమాలయ పర్వతాలు, గలగల సాగే సెలయేళ్లు. నయనానందకరమైన సరస్సులు, మధురఫల వృక్షసంపద, పరిమళాలు విరజిల్లు పుష్పజాతులతో ప్రకృతిపరచిన సౌందర్యాల రాశిగా కాశ్మీరులోయ ఖ్యాతి గాంచినది. ప్రఖ్యాత వేసవి పర్వత విశ్రాంతి కేంద్రంగా గణతికెక్కింది.

అనాదికాలంలో కాశ్మీర్‌ పెద్ద జలార్ణవంగా ఉండేది. ఇది జలోద్భవానికి దానవుడు యొక్క నివాసం. జలాశయంలో ఉన్నంతవరకు చావులేకుండా వరం పొందినాడు. అందిన జీవరాశులను భక్షిస్తూండేవాడు. కశ్యప మహాముని దేవతల సాయంతో నాగలి సహాయంతో సరోవర ప్రాంతాన్ని దున్ని, నీటిని ఇంకింపచేశాడు. దానవుని మరణంతో జనవాసం ఏర్పడింది. ఈవిధముగా కాశ్మీర్‌ భూభాగము అవతరించినట్లు పురాణగాథ.

పురాణేతిహాసాల్లో కాశ్మీర్‌ ప్రశస్తి ఉంది. హిందు రాజులనేకమంది కాశ్మీర్‌ భూప్రాంతమును పరిపాలించారు. 3వ శతాబ్దంలో అశోకుని సామ్రాజ్యంలో ఒక భూభాగము ఉండేది. అక్బరు మహాచక్రవర్తి కాశ్మీర్‌ భూభాగాన్ని జయించి మొగలు సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. ఆఫ్గనిస్తాన్‌ రాజు అహమ్మద్‌షా అబ్దాలి దండయాత్ర చేసి రాజ్యపాలనకు వచ్చాడు. 1819 సంవత్సరములో పంజాబు మహారాజు రాజారంజిత్‌సింగ్‌ ఆధిపత్యంలోనికి వచ్చింది. రంజిత్‌సింగ్‌ మరణం తరువాత సిక్కులతో యుద్ధంచేసి బ్రిటీష్‌వారు వశపరచుకొన్నారు. కాశ్మీర్‌ భూభాగము కొరకు పాకిస్తాన్‌ సైన్యము భారత సైనికులతో యుద్ధంచేసి, కొంత భూభాగమును వారి ఆధిపత్యంలోనికి తెచ్చుకొన్నారు. ఇప్పటికి సరిహద్దు సమస్య ఇరుదేశాలకు వుంది

కాశ్మీర్‌ రాజ్యపాలన చేసిన మహమ్మదీయులు నిరంకుశులై మత చాంధసత్వంతో హిందూ దేవాలయమును నేలమట్టము చేశారు. సికిందర్‌ (1389-1413) పానలో హిందూ దేవాలయములను కూలగొట్టడం ప్రభుత్వ నిత్యకృత్యాలలో ఒకటైంది. దీనికి ప్రత్యేకంగా ప్రభుత్వ విభాగం ఒకటి ఏర్పరచినారు. పరాస్పోర్‌, అవంతిపూర్‌, తాపార్‌ తదితర ప్రాంతాలలోని ప్రసిద్ధ దేవాలయములను కూల్చినట్లుగా పర్షియన్‌ చారిత్రక పత్రాల్లో స్పష్టంగా పేర్కొనబడింది. ఇస్లాంను స్వీకరించని హిందువులపై జిజియా పన్ను వేశాడు. ఇస్లాం మతం పుచ్చుకోని కాశ్మీర్‌ బ్రాహ్మణుల మెడలోని యజ్ఞోపవీతాన్ని సికిందర్‌ బలవంతముగా త్రెంచి, వాటిని తూకం వేస్తే అవి ఏడు మణుగులు బరువు తూగాయంట! అలీషా పాలనలో (1413) కాశ్మీర్‌లో మిగిలిన పండిత కుటుంబాలు కేవలం పదకొండు మాత్రమే. 1489లో ఫతేషా 24 వేలమంది కాశ్మీర్‌ హిందువుల మెడమీద కత్తిపెట్టి ఇస్లాంలోనికి బలవంతముగా మార్పించారు. తాను కూల్చిన కాళికాలయంలోనికి ప్రవేశించిన నేరానికి, కాశ్మీర్‌ పండితులందరికి ముక్కు, చెవులు కోసేయమని ఆజ్ఞ జారీచేశాడు. మొగలాయి షాదుషాల ఏలుబడిలో మతసహనం పాటించగా కొంత ప్రశాంతత ఏర్పడినది. తిరిగి ఔరంగజేబు కాలములో దేశవ్యాప్తముగా దేవాలయములను కూల్చివేయడానికి సంకల్పము చేశారు. ఇస్లాం మతచాంధసులు కాశ్మీర్‌లో అనేక హిందూ దేవాలయములను నేలమట్టం చేశారు. నేలమట్టమైన ఆలయాలలో శ్రీ సరస్వతీ ఆలయం కూడా ఉండవచ్చును. నేడు కాశ్మీర్‌ శోధిస్తే ఎక్కడా శ్రీ సరస్వతీ పీఠం కనిపించుటలేదు. శ్రీనగర్‌నందలి శ్రీ శంకరాచార్యుల పర్వతము మీద శ్రీ సరస్వతీ ఆలయం ఉండేది అని పరిశోధకులు భావించుచున్నారు. అష్టాదశ శక్తిపీఠాల్లో పద్దెనిమిదవదిగా పరిగణించబడుతోంది. అష్టాదశ శక్తిపీఠాల్లో చివరిది.
సతీదేవి కుడి చెంపభాగం కాశ్మీర్‌ ప్రాంతములో పడినట్లుగా పురాణాలు చాటుతున్నాయి. సరస్వతీపీఠం అనుపేరుతో ఎక్కడా దర్శించలేక పోవుచున్నాము. కాశ్మీర్‌ ప్రాంతములో అనేక శక్తిపీఠాలు కలవు. వాటిని ప్రతివారు సరస్వతీపీఠంగా చాటుతారు. వీటిలో ముఖ్యమైన స్థానం శారికాదేవి మందిరము. ఇది హరిపర్వతంపై వుంది. అమ్మ అద్భుతమైన మౌనశిల రూపములో దర్శనమిస్తుంది. ఇదే సరస్వతి పీఠంగా స్థానికులు కొలుస్తారు. మహాయోగులు, మహాత్ములు, పుణ్యపురుషులు హరిపర్వతం చేరి, అమ్మ సన్నిధిలో మౌనవ్రతం పాటించి, సిద్ధులు పొందుచున్నారు. ప్రతి శనివారం అద్భుత మౌనశిల నుంచి మౌనచక్రం బయటకు వచ్చి, సిద్ధులకు దర్శనమిస్తుంది. ఇది సృష్టిలో అద్భుతమైన చర్యగా భావించవచ్చును. మరో విషయము మౌనశిలలో ఒక మూలన గల గుంటలో నీరు ఉద్భవించుతుంది. దాని నుంచి ఎంతనీరు మనము తీసుకుంటే, అంత నీరు మళ్ళీ ఉద్భవించ గలదు. భక్తులు ఈ నీరును పవిత్రమైన గంగా జలంగా భావించి సేవించుతారు. యాత్రికులు మౌనంగా, దీక్షగా అమ్మను ప్రార్ధన చేస్తే వారి కోరికలు తప్పక తీరగలవు అని గట్టి నమ్మకం. ఆషాడమాసంలోని శుక్లనవమితో కూడిన శనివారం నాటి మౌనచక్రం యొక్క దర్శనం చాలా పుణ్యదాయకం. భక్తుల కోరికలు తీర్చగల మహిమతో నిండి ఉంటుంది. శ్రీనగర్‌ జనరల్‌ బస్‌స్టాండుకు ఈశాన్యంగా హరి పర్వత్‌ పోర్టు ఉంది. బస్‌స్టాండ్‌కు సుమారు 10 కి.మీ. దూరంలో గల హరిపర్వతం (హరిపర్బత్‌ కోట) చేరుటకు బస్‌ సర్వీసులున్నాయి. కొండ క్రింద నుంచి మెట్లు మార్గం.

శ్రీ శాంకరీదేవి ధ్యానం : ట్రింకోమలి (శ్రీలంక)
శ్రీ సతీ శాంకరీదేవీ త్రికోమలి పురస్థితా
ఉత్తమాంగ ప్రభాగౌరీ భక్తకామ ఫలప్రదా
 శ్రీ కామాక్షి దేవి ధ్యానం – కంచి (తమిళనాడు)
కాంచీపురశ్రితే దేవి కామాక్షి సర్వమంగళా
చింతాతన్మాత్ర సంతుష్టా చింతితార్థఫలప్రదా

శ్రీ శృంఖలాదేవి ధ్యానం – ప్రద్యుమ్నం (పశ్చిమబెంగాల్‌)
ప్రద్యుమ్నే వంగరాజ్యాయాం శృంఖలా నామ భూషితే
విశ్వవిమోహితే దేవీ శృంఖలా బంధనాశనీ

శ్రీ చాముండేశ్వరీ దేవి ధ్యానం – మైసూరు (కర్ణాటక)
క్రౌంచపుర స్థితామాతా చాముండా దుష్టనాశనీ
సర్వసిద్ధిప్రదాదేవీ భక్తపాలన దీక్షితా

శ్రీ జోగులాంబా దేవి ధ్యానం – అలంపురం (ఆంధ్రప్రదేశ్‌)
జోగులాంబా మహాదేవీ రౌద్రవీక్షణ లోచనా
అలంపురీ స్థితా మాతా సర్వార్ధ ఫల సిద్ధిదా

శ్రీ భ్రమారాంబా దేవి ధ్యానం – శ్రీశైలం (ఆంధ్రప్రదేశ్‌)
శివ పార్శ్వ స్థితా మాతా శ్రీశైలే శుభపీఠకే
భ్రమరాంబా మహాదేవీ కరుణారస వీక్షణా

శ్రీ మహాలక్ష్మీ దేవి ధ్యానం – కొల్హాపూర్‌ (మహారాష్ట్ర)
మహాలక్ష్మ్యభిదా దేవీ కరవీర పురస్థితా
పురుషార్ధ ప్రదామాతా సంపూర్ణామృత వర్షిణీ

శ్రీ ఏకవీరా దేవి ధ్యానం – నాందేడ్‌ (మహారాష్ట్ర)
ఏకవీరా మహాశక్తి మహుగ్రామ గుహాస్థితా
భవాని వీర విఖ్యాతా ధర్మ రక్షణ తత్పరా

శ్రీ మహాకాళీ దేవి ధ్యానం – ఉజ్జయిని (మధ్యప్రదేశ్‌)
ఉజ్జయిన్యాం మహాకాళే మహాకాళేశ్వరేశ్వరీ
క్షిప్రా తీరస్థితామాతా వాంఛితార్థ ప్రదాయినీ
శ్రీ పురుహూతికా దేవి ధ్యానం – పిఠాపురం (ఆంధ్రప్రదేశ్‌)
పురుహూతీ సతీమాతా పీఠికాపుర సంస్థితా
పుత్రవత్పాలితా దేవి భక్తనుగ్రహదాయినీ
 శ్రీ గిరిజా దేవి ధ్యానం – కటక్‌ (ఒరిస్సా)
ఓధ్రదేశే భువనేశీ గిరిజానామ సంస్థితా
పాలికాఖిల లోకానాం వల్లవారుణ పాణినా

శ్రీ మాణిక్యాంబ దేవి ధ్యానం – ద్రాక్షారామం (ఆంధ్రప్రదేశ్‌)
ద్రాక్షావటీ స్థితాశక్తిః విఖ్యాతా మణికాంబికా
వరదా శుభదాదేవీ భక్త మోక్ష ప్రదాయినీ

శ్రీ కామరూపిణీ దేవి ధ్యానం – గౌహతి (అస్సాం)
కామరూపిణీ విఖ్యాత హరిక్షేత్రే సనాతనీ
యోని ముద్రాత్రిఖండేశీ మాసే మాసే నిదర్శితా

శ్రీ మాధవేశ్వరీ దేవి ధ్యానం – ప్రయాగ (ఉత్తరప్రదేశ్‌)
మాధవేశ్వరీ మాంగళ్యా ప్రయాగ స్థల వాసినీ
త్రివేణీ సంగమే తీరే భుక్తి ముక్తి ప్రదాయినీ

శ్రీ వైష్ణవీ దేవి ధ్యానం – జ్వాలాకేతం (హిమాచల్‌ప్రదేశ్‌)
తుహినాద్రి స్థితామాతా జ్వాలాముఖీతి విశ్రుతా
జ్వాలా మాలా ప్రభాదేవీ జ్ఞాన వైరాగ్య వర్ధినీ

శ్రీ మాంగల్య గౌరీదేవి ధ్యానం – గయ (బీహార్‌)
సర్వ మంగళ మాంగల్యా గయా మాంగల్య గౌరీ
అర్ధదా మోక్షదాదేవీ అక్షయ్య ఫలదాయినీ

శ్రీ విశాలాక్షి దేవి ధ్యానం – వారణాశి (ఉత్తరప్రదేశ్‌)
విశాలాక్షీతి విఖ్యాత వారణాస్యాం శివాంతికే
నిరతాన్న ప్రదాతీచ నిర్భాగ్య జనతోషిణీ

శ్రీ సరస్వతీ దేవి ధ్యానం – (జమ్మూ, కాశ్మీర్‌)
జ్ఞాన ప్రదా సతీమాత కాశ్మీరేతు సరస్వతీ
మహావిద్యా మహామాయా భుక్తిముక్తి ప్రదాయినీ

అష్టాదశ శక్తి పీఠాలు...అష్టాదశ శక్తి పీఠాలు
శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడిన 101 ప్రదేశాలలో 51 క్షేత్రాలు ముఖ్యమైనవి. వాటిలోనూ అతి ముఖ్యమైన శరీర భాగాలు పడినవి 18 ప్రదేశాలు. వాటినే అష్టాదశ శక్తి పీఠాలుగా గుర్తించి, పూజిస్తున్నాం. ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో (గుడి ధ్వంసం అయ్యింది), మరొకటి శ్రీలంకలో ఉండగా మిగతా 16 శక్తి పీఠాలు మన దేశంలోనే ఉన్నాయి. వాటి గురించిన సమాచారం దసరా పండగ సందర్భంగా ఈ వారం...

1. లంకాయాం శాంకరీదేవి!
అష్టాదశ శక్తి పీఠాలలో ముందుగా నమస్కరించవలసిన శక్తి స్వరూపిణి శాంకరీదేవి. నేటి శ్రీలంకలో పశ్చిమతీరాన గల ట్రింకోమలి పట్టణానికి సమీపంలో సముద్రంలోకి చొచ్చుకొని వచ్చినట్లున్న కొండపైన శాంకరీదేవి ఆలయం, శక్తి పీఠం ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని తిరుకోనేశ్వరం అంటారు. అమ్మవారి ‘తొడ భాగం’ పడిన స్థలంగా ప్రతీతి.

2. కామాక్షీ కాంచికా పురే!
 కోర్కెలు తీర్చే కన్నులు గల శక్తి స్వరూపిణి కామాక్షి. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పట్టణానికి 75 కి.మీ దూరంలో కాంచీపురం అమ్మగా వెలగొందుతోంది. అమ్మవారి శరీరభాగమైన ‘కంకాళం’ ఇక్కడ పడినట్లు చెబుతారు.

3. ప్రద్యుమ్నే శృంఖలాదేవి!
నేటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాకు సుమారు 85 కి.మీ దూరంలో హుగ్లీ జిల్లాలోని ‘పాండువా’ అనే గ్రామంలో వెలసిందీ క్షేత్రం. కాలక్రమేణా మహమ్మదీయ పాలనలో గుడిని ధ్వంసం చేసి, పైన మీనార్‌ను నిర్మించారు. దీంతో భారత ప్రభుత్వం నిషేధిత స్థలంగా ప్రకటించింది. శృంఖల అంటే సంకెళ్లు అని అర్థం. భక్తుల సమస్యల సంకెళ్లను అమ్మవారు త్రుంచివేస్తారని నమ్మకం.  అమ్మవారి శరీర భాగమైన ‘ఉదరం’ ఇక్కడ పడిందని చెబుతారు. పాండువా గ్రామానికి 10 కి.మీ దూరంలో హంసాదేవి అనే అతి ప్రాచీన దేవాలయం ఉంది. భక్తులు హంసాదేవినే శృంఖలాదేవిగా భావించి పూజలు జరుపుతుంటారు.

4. క్రౌంచపట్టణే చాముండేశ్వరి!
కర్ణాటక రాష్ట్రం మైసూరు పట్టణంలో మహిషాసుర మర్దినిగా చాముండేశ్వరి మాత వెలుగొందుతోంది. ఆలయానికి ఎదురుగా సర్వాలంకృతుడైన మహిషుని విగ్రముంది. అమ్మవారి ‘తలవెంట్రుకలు’ పడిన పుణ్య ప్రదేశం చాముండేశ్వరీ ఆలయం.

5. అలంపురే జోగులాంబ:!
తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్‌నగర్ జిల్లాలో  కర్నూలుకు 10 కి.మీ దూరంలో ఉన్న ప్రాచీన ఆలయం అలంపూర్ జోగులాంబ. ఈ దేవాలయం ముసల్మానుల దండయాత్రలో ధ్వసం అయ్యి, ఆ తర్వాత పునరుద్ధరించబడింది. సతీదేవి ‘దంతాలు’  ఇక్కడ పడ్డాయని ప్రతీతి. ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి.

6. శ్రీశైలే భ్రమరాంబికా!
దక్షిణాపథంలో ప్రసిద్దికెక్కిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం. కర్నూలుకు 150 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయంలో అమ్మవారు భ్రమరాంబికగా నిత్య పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ సతీదేవి ‘మెడ’భాగం పడిన స్థలంగా ప్రతీతి. ఈ ఆలయానికి దగ్గరలోని అడవిలో ఇష్టకామేశ్వరి ఆలయం అతి ప్రాచీనమైనది.

7. కొల్హాపురే మహాలక్ష్మీ!
మహారాష్ట్రలోని పుణేకి దాదాపు 300 కి.మీ దూరంలో కొల్హాపూర్‌లో వెలసిన అమ్మ మహాలక్ష్మి అవతారం. ఇక్కడ సతీదేవి ‘కనులు’ పడిన ప్రాంతంగా చెబుతారు.

8. మాహుర్యే ఏకవీరికా!
మాహుర్యే పురమున వెలసిన శక్తి స్వరూపిణి ఏకవీరిక. మహారాష్ట్రలో నాందేడ్ పట్టణానికి 125 కి.మీ దూరంలో ఉంది మాకుద్యపురం. అమ్మవారి ‘కుడి చేయి’ పడిన స్థలంగా ఇది ప్రతీతి.

9. ఉజ్జయిన్యాం మహాకాళి!
సతీదేవి ‘పై పెదవి’ పడిన స్థలం. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పట్టణానికి 50 కి.మీ దూరంలో మహాకాళేశ్వర జ్యోతిర్లంగం, మహాకాళి ఆలయం ఉన్నాయి. మహిమాన్వితమైన క్షేత్రంగా ఈ ప్రదేశానికి పేరు. మంత్ర, తంత్రాలతో ప్రతిష్ఠ చేసిన శక్తిపీఠంగా విరాజిల్లుతోంది మహాకాళి.

10. పీఠికాయాం (పిఠాపురం) పురుహూతికా!
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో సామర్లకోటకు 13 కి.మీ దూరంలోని పిఠాపురంలో సతీదేవి ‘పీఠభాగం’ పడడం వల్ల  పీఠికాపురంగా, కాలక్రమంలో పిఠాపురంగా ఈ ప్రాంతం పేరొందింది. శ్రీచక్రం, అమ్మవారికి బంగారు చీర ఇక్కడ ఉన్నాయి. ఈ చీరతో ప్రతి శుక్రవారం అమ్మవారికి అలంకారం చేస్తారు.

11. ఓఢ్యాయాం గిరిజా దేవి!
ఒడ్యాణం అనగా ఓఢ్ర దేశం (ఒరిస్సా). నేటి ఒరిస్సా రాష్ట్రంలో కటక్ సమీపంలోని వైతరణీనది ఒడ్డున అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా వెలసింది. ఈ ప్రాంతాన్ని వైతరణీ పురం అని కూడా అంటారు. ఒరిస్సాలోని జాజిపూర్ రోడ్ నుంచి 20 కి.మీ దూరం ప్రయాణిస్తే ఈ గిరిజాదేవి (ఇక్కడ భిరిజాదేవిగా ప్రసిద్ధి) ఆలయం ఉన్నది. సతీదేవి ‘నాభి స్థానం’ ఇక్కడ పడిందని అంటారు.

2. మాణిక్యామ్ దక్షవాటికే (ద్రాక్షారామం)!
సతీదేవి ‘కణతల భాగం’ పడిన ప్రదేశంగా అష్టాదశ పీఠాలలో 12వదిగా, పంచారామాలలో మొదటిదిగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఇది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామంలో మాణిక్యాంబగా అమ్మవారు వెలిశారు. దక్షయజ్ఞంలో సతీదేవి ఆహుతి అయిన ప్రదేశం. భోగానికి, మోక్షానికి, వైభవానికి ప్రసిద్ధి చెందినదీ క్షేత్రం.

13. హరిక్షేత్రే కామరూపా!
అస్సాం రాష్ట్రం రాజధాని గౌహతి పట్టణంలో బ్రహ్మపుత్రానది ఒడ్డున నీలాచలంలో వెలసినదీ క్షేత్రం. సతీదేవి ‘యోని’ భాగం పడిన స్థలం. నీలాచలంలో స్త్రీ యోని వంటి శిల ఒకటి ఉంది. ఆ శిల నుండి సన్నని ధారగా జలం వస్తుంది. సంవత్సరానికి ఒకసారి మూడు రోజుల పాటు ఎర్రని నీరు వస్తుంది. అమ్మవారు రజస్వల అయిందని, ఈ మూడు రోజులు దేవాలయాన్ని మూసి ఉంచుతారు. నాలుగో రోజున సంప్రోక్షణ జరుపుతారు.

14. ప్రయాగే మాధవేశ్వరీ!
ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ప్రయాగ క్షేత్రం ఉంది. సతీదేవి ‘హస్త అంగుళీయం’ పడిన ప్రాంతంగా చెబుతారు. యుమన, గంగా నదులు కలిసే ప్రాంతం. శక్తిని మాధవేశ్వరి అంటారు. పిండప్రదానానికి, అస్థికల నిమజ్జనానికి ప్రాముఖ్యత గలదీ క్షేత్రం.

15. జ్వాలాయం వైష్ణవీ దేవి!
సతీదేవి ‘పుర్రె’ పడిన ప్రదేశం. జ్ఞాన క్షేత్రం. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు 50 కి.మీ దూరంలో కాట్రా అనే ప్రదేశంలో ఉందీ ప్రాంతం. అక్కడి నుండి గుర్రాల మీద లేదా హెలీకాప్టర్‌లో కొండపైకి వెళ్లి జ్వాలాముఖి లేదా వైష్ణో దేవి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో గుహ ఉంది. నాడు మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషా చేయించి, తన స్వహస్తాలతో మోస్తూ కొండపైకి నడిచి వెళ్లి అమ్మవారికి సమర్పించిన వెండి గొడుగు నేటికీ ఈ ఆలయంలో ఉంది.

16. గయాయామ్ మాంగళ్య గౌరీ!
బీహార్ రాష్ట్రంలో పాట్నాకు 75 కి.మీ. దూరంలో గయా క్షేత్ర శక్తి స్వరూపిణి మంగళ గౌరి కొలువుదీరి ఉంది. సతీదేవి ‘స్తనం’ పడిన ప్రదేశం. దగ్గరలో బుద్ధగయ, బోధి వృక్షం, బౌద్ధ ఆలయాలు ఉన్నాయి. గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయాలని ప్రతి హిందువూ కోరుకుంటాడు.

7. వారాణస్యాం విశాలాక్షీ!
సతీదేవి ‘మణికట్టు’ పడిన స్థలం కాశీ పుణ్య క్షేత్రం. శివుని విశిష్ట స్థానంగా కాశి/వారణాశి విరాజిల్లుతోంది. వరుణ, అసి అనే రెండు నదుల సంగమం. గంగాస్నానం, విశ్వేశ్వరుడు, విశాలాక్షి దర్శనం నయానందకరం. శుభకరం.

18. కాశ్మీరేతు సరస్వతియనా!
ఇక్కడ సతీదేవి ‘చేయి’ పడినదని కొందరు, కుడి చెంప పడిన స్థలమని కొందరు చెబుతారు. పురాణేతిహాసాల వల్ల అమ్మవారి ఆలయం కాశ్మీర్‌లో ఉందని తెలుస్తోంది. కానీ ఆ ఆలయం ధ్వంసం అవడంతో అక్కడ పూజలు జరగడం లేదని శంకచార్యులు ఆ పీఠాన్ని శృంగేరిలో (కర్ణాటక రాష్ట్రంలో) ప్రతిష్ఠించారని తెలుస్తోంది. మంగుళూరుకు 100 కి.మీ దూరంలో సరస్వతి ఆలయ రూపకల్పన చేసి, ఒక రాయిపై చక్రయాత్ర స్థాపన చేసి, సరస్వతీదేవి చందనపు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు.

శక్తి పీఠాల సందర్శన భాగ్యం..
అష్టాదశ శక్తి పీఠాల సందర్శన ఫలితంగా మనశ్శాంతి, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ఆర్యోక్తి. అటువంటి 18 పీఠాలను స్వయంగా సందర్శించడం నా పూర్వజన్మ సుకృతం. ఒక్కో రాష్ట్రానికి వెళ్లినప్పుడు ఒక్కోటి, ఒక్కోసారి రెండు-మూడు శక్తి పీఠాలను దర్శించి వచ్చాను. దసరా పండగ నాడు ఈ 18 క్షేత్రాలలో శక్తి పూజ కన్నుల పండగగా జరుగుతుంది.

- S.V.S.భగవానులు, విశ్రాంత డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఒంగోలు

 కూర్పు: నిర్మలారెడ్డి

అష్టాదశ శక్తిపీఠాలుఅష్టాదశ శక్తిపీఠాలు
శ్రీ భ్రమరాంబికాదేవి
ఆంధ్రప్రదేశ్‌, శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికాదేవి ఆలయాన్ని ఎనిమిదో అష్టాదశ పీఠంగా పిలుస్తారు. విష్ణుచక్రభిన్న అయిన సతి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు ఇక్కడ కొలువైన సతి ‘శక్తి’ భ్రమర(తుమ్మెద) రూపంలో అవతరించిందట. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన ‘సౌందర్య లహరి’ కూడా రచించారని చెబుతారు.


శ్రీ గిరిజా దేవి
అష్టాదశ శక్తి పీఠాల్లో తొమ్మిది శక్తి పీఠం ఒరిస్సాలోని వైతరణీ నదీతీరంలో వెలసింది. ఇక్కడ వెలసిన అమ్మవారిని శ్రీ గిరిజా దేవి అని పిలుస్తారు. ఒరిస్సాలో వైతరణీనదీ తీరంలో జాజ్‌పూర్‌ రోడ్డుకు 20 కి. మీ. దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. ఇది అమ్మవారి నాభి బాగం పడిన చోటుగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ గిరిజాదేవిని శ్వేతవరాహమూర్తి రూపంలో విష్ణుమూర్తి అర్చిస్తుంటాడు. సింహవాహణిగా దర్శనమిచ్చే గిరిజా దేవి, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో మహిషాసురుని తోక పట్టుకుని ఉంటుంది. ఈమెను శక్తిత్రయరూపిణి కొలుస్తారని ఆలయ పురాణాలు చెబుతున్నాయి.

గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ జిల్లాలో కొలువైన తల్లి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు. ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయ ప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృ దేవతలకు పిండప్రదానం చేస్తారు. ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది.

శ్రీ ఏకవీరా దేవి
శ్రీ ఏకవీరా దేవి శక్తి పీఠం మహారాష్టల్రోని నాందేడ్‌ జిల్లా కేంద్రానికి 128 కి.మీ. దూరంలో దత్తాత్రేయుని జన్మక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహోర్‌లో ఉంది. ఇది అమ్మవారి కూడి హస్తం పడిన చోటు. ఇక్కడ అమ్మవారి శిరస్సు మాత్రమే దర్శన మవుతుంది. ఇక్కడ మూడు కొండలు ఉన్నాయి. ఒక దానిపై అత్రి - అనసూయలు, రెండవ దానిపై దత్తాత్రేయుడు, మూడవ దానిపై ఏకవీరాదేవి ప్రతిష్ఠితిమయ్యారు. అమ్మవారి ముఖం గర్భాలయపుపై కప్పును తాకేంత పెద్దదిగా ఉంటుంది. జమదగ్ని రేణుఖా దంపతులకు చెందిన కథ ఇక్కడ జరిగిందని చెపుతారు. పరశురాముని చేత ఖండితమైన తల్లి శిరస్సే ఈ దేవత. ఈ తల్లినే ‘ఛిన్నమస్త’ అని కూడా అంటారు.

శ్రీ మహంకాళీ దేవి
ఈ శక్తిపీఠం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. ఇది అమ్మవారి పై పెదవి పడిన చోటు. విక్రమార్క మహారాజు చరిత్ర ఉజ్జయినితో ముడిపడిఉంది. ఇక్కడి నది సిప్ర నది. కుజునికి ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఆలయం ఉంది. భూమి నుంచి కుజుడు విడిపోయిన ప్రాంతం ఇది అని జ్యోతిషశాస్తవ్రేత్తలు చెపుతున్నారు. కుజుడు అంటే భూమికి జన్మించిన వాడని అర్థం. ఇక్కడ త్రిపురాసురుణ్ని వధించిన మహాకాలుని ఆలయం ఉంది. ఆ స్వామికి ఆధారమైన శక్తి మహంకాళి. ఆ మహంకాళి శక్తి పీఠం ఇది. ఈ ఆలయాన్ని గర్‌ కాళికా అని కూడా పిలుస్తుంటారు. దేవీ మాతలందరిలో కాళికా మాతకు ఎనలేని ప్రాధాన్యముంది. ప్రాచీన భారతీయ కవులలో అగ్రగణ్యుడైన కాళిదాసు సైతం కాళికా దేవి భక్తుడని చెబుతుంటారు. పురాణాల ప్రకారం కాళిదాసు నిత్యం కాళీమాతను పూజించేవాడు. గర్‌ కాళిక ఆశీర్వాదం వల్లే అతడికి అపూర్వమైన కవితాశక్తి అబ్బింది. కాళికా మాతను పూజించడానికి శ్యామలా దండకం పేరిట జగత్ప్రసిద్ధమైన స్తోత్రాన్ని కాళిదాసు రచించాడు. ఉజ్జయినిలో ప్రతి ఏటా నిర్వహించే కాళిదాస్‌ సమారోహ్‌ కార్యక్రమంలో ఈ దండకాన్ని పఠిస్తుంటారు. ప్రతి రోజూ భారీ సంఖ్యలో భక్తులు ఈ గర్‌ కాళిక ఆలయాన్ని సందర్శిస్తుంటారు.

ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారనే విషయం ఎవరికీ తెలీదు కానీ మహాభారత కాలంలో నిర్మించారని ప్రజల నమ్మకం. అయితే మహా భారత కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినప్పటికీ కాళికామాత విగ్రహం మాత్రం సత్య యుగానికి చెందినదని చెబుతుంటారు. హర్ష వర్ధన రాజు హయాంలో ఈ ఆలయానికి మరమ్మతులు చేసి పునరుద్ధరించినట్లు ఆధారాలు ఉన్నాయి. తర్వాత చాలాకాలానికి గ్వాలియర్‌ రాజు ఈ ఆలయానికి తిరిగి మరమ్మతులు చేయించారు. సంవత్సరం పొడవునా ఇక్కడ అనేక ఉత్సవాలు జరుగుతుంటాయి కాని, నవరాత్రులలో మాత్రం భారీస్థాయిలో ఉత్సవాలు నిర్వహించబడతాయి. మతపరమైన యజ్ఞాలు, పూజలు కూడా నవరాత్రుల సమయంలో ఇక్కడ భారీ స్థాయిలో నిర్వహించబడతాయి.

శ్రీ మాధవేశ్వరీ దేవి పీఠం
ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌లో ఉంది. అమ్మవారి హస్తాంగుళి పడిన చోటుగా దీన్ని పిలుస్తారు. శక్తిత్రయస్వరూపిణి పీఠమైన ఈ ప్రాంతంలో బ్రహ్మదేవుడు ఇక్కడ వరుసగా ఎన్నో యాగాలు చేసినందున ప్రయాగ్‌గా మారింది. ఈమెను కృతియుగంలో బృహస్పతి అమృతంతో అభిషేకించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ఈ క్షేత్రాన్ని అమృత తీర్థం అని అంటారు. త్రేతాయయుగంలో రాముడు, ద్వాపరంలో శ్రీకృష్ణుడు ఈ తల్లిని పూజించారని పండితులు చెబుతున్నారు. అలాగే సూర్యుడు పూజించడం వలన ఈ క్షేత్రాన్ని భాస్కరక్షేత్రం అని కూడా పిలుస్తారు.

శ్రీ సరస్వతీ దేవి శక్తి పీఠం:
కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు 40 కి.మిదూరంలో ఉన్న ఈ క్షేత్రంలో అమ్మవారి దక్షిణ హస్తం పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ సరస్వతీ దేవీని కీరవాణి అని పిలుస్తారు. పార్వతీపరమేశ్వరులు విశ్వకర్మతో అందమైన ఇల్లు కట్టించుకుని గృహప్రవేశానికి సిద్దమౌతారు. శివభక్తుడైన రావణుని పురోహితునిగా నియమిస్తారు. గృహప్రవేశం పూర్తయిన తరువాత దక్షిణం కోరుకొమ్మంటుంది పార్వతీదేవి. ఆ ఇంటినే తనకివ్వమంటాడు రావణుడు. ఆడిన మాట తప్పలేక ఇచ్చేస్తుంది పార్వతీదేవి. తన పుట్టింటికి బాధపడుతూ వెళుతుంది. దారిలో సరస్వతి కనిపించి తనను ఓదారుస్తుంది. వారిద్దరూ కలిసిన ప్రదేశమే ఈ శక్తి పీఠంగా వెలసిందని ఆలయ గాథలు చెబుతున్నాయి. ఈ ఆలయం చెరువులో ఉంటుంది.

కామరూపిణి
అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారనీ స్థలపురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోని భాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవికాలంలో మూడు రోజులపాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి రుతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. ఈ ఆలయం కూచ్‌బేహార్‌ సంస్థానం పరిధిలోకి వస్తుంది. కానీ ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం. అందుకే ఆ వంశానికి సంబంధించిన వారెవరూ కామాఖ్యాదేవి గుడిలో అడుగుపెట్టరు. కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు.

అస్సాం గౌహతి సమీపంలోని నీలాచల పర్వతశిఖరంపై ఈ శక్తిపీఠం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది ఆషాడమాసంలో స్రవించే జలధార ఎర్రగా మారుతుంది. అది స్ర్తీత్వానికి ప్రతీక అంటారు. పరశురాముని మాతృ హత్యాదోషాన్ని ఈ తల్లి పోగొట్టిందని, శివుని కంటి మంటకు దహనమైన మన్మథుణ్ని జీవింపచేసిన తల్లిగా ఈమె ప్రఖ్యాతి చెందిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ అమృతేశ్వర్‌, కోటిలింగ, సిద్ధేశ్వర, కామేశ్వర శివాలయాలున్నాయి.

శ్రీ మాంగల్యగౌరీ దేవి శక్తి పీఠం:
అమ్మవారి వక్షోజాలు ఇక్కడ పడ్డాయని చెబుతారు. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. ఈ పీఠం బీహార్‌లోని గయాలో ఉంది. తనను తాకిన ప్రతి జీవికీ మోక్షం వచ్చేలా విష్ణుమూర్తి వరం పొందిన గయాసురుడు పర్వతాకారంలో ఉన్న ప్రాంతమిది. గయాసురుడు శరీరాన్ని విపరీతంగా పెంచి అందరికీ మోక్షాన్ని ఇచ్చే సందర్భంలో, అతని శరీరం పెరగకుండా ధర్మవతశిలను అతని శిరస్సుపై ఉంచి, దాని పైకి విష్ణువును ఆవాహన చేసినట్లు ఒక పురాణగాథ ఉంది. విష్ణుమూర్తి సహోదరి అయిన మాంగల్యగౌరి ఈ క్షేత్రరూపిణి అని పండితులు చెబుతున్నారు. ఇక్కడి తీర్థం ఫల్గుణీనది. ఆ నదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి, నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు.

శ్రీ మాణిక్యాంబా దేవి:
రక్షమాం ద్రాక్షారామ పురవాసినీ – భీమేశురాణి
పాలయమాం గోదావరి తటవాసినీ – శక్తి స్వరూపిణీ

దేశంలోని అష్ట్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తి పీఠంగా కొనియాడబడుతున్న శ్రీ మాణిక్యాంబా దేవి. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలోని పురాణ ప్రసిద్ధి గాంచిన భీమేశ్వరాలయ ప్రాంగణంలో కొలువైవున్నది. దక్షుడు యాగం చేసిన ప్రదేశం కాబట్టి ఈ గ్రామం ద్రాక్షారామం అయ్యింది. సతీదేవి కణత భాగం పడిన చోటు ఈ పీఠం. ద్రాక్షారామంలో శివుడు భీమేశ్వరుడుగా, మాణిక్యాంబదేవితో ఒకేసారి స్వయం ప్రతిష్ట పొందిన ప్రదేశం ద్రాక్షారామం. ఈ ప్రాంతం త్రిలింగ దేశంలో ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్రాక్షారామం ఈ మూడు క్షేత్రాలను కలిపి త్రిలింగ దేశం అంటారు. మిగతా శక్తి పీఠ క్షేత్రాలకు ద్రాక్షారామంలోని మాణిక్యాంబ శక్తి పీఠానికి ఒక భిన్నమైన విశిష్టత ఉంది. దాదాపు అన్ని శక్తి పీఠ క్షేత్రాలలో అమ్మవారి విగ్రహం ఒకచోట, శ్రీచక్ర యంత్రం మరో చోట వుంటాయి. కానీ ద్రాక్షారామంలో మాణిక్యాంబా దేవిని శ్రీచక్ర యంత్రం పై ప్రతిష్టించడం వల్ల శ్రీచక్ర యంత్రానికి, అమ్మవారికి ఏకకాలంలో పూజలు జరగడం ఈ క్షేత్ర విశిష్టత. సతీదేవి తనువు చాలించిన ప్రదేశంలోనే శక్తిపీఠం ఆవిర్భవించడం వల్ల ఇది ఒక మహిమాన్విత ప్రాంతంగా విరాజల్లుతుంది. ఆలయం లోపల గోడలకు రత్న దీపాలుండేవని ప్రతీతి. గర్భాలయంలోని చీకటి కోణాన్ని అవి వెలుతురుతో నింపేవని చేబుతారు. అంతేకాక ఈ శివాలయం పంచారామాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ద్రాక్షారామ క్షేత్రానికి దక్షిణ కాశి అని మరో పేరు వుంది. ఇది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో వుంది. కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి నేరుగా ద్రాక్షారామంకు బస్సు సర్వీసులు వున్నాయి. యాత్రికుల విడిది కోసం దేవస్థానం కాటేజీలు, టూరిజం శాఖ అతిథి గృహం, పైండా జమిందారు సత్రం అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ శరన్నవరాత్రి మహోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు, కుంకుమ పూజ, లక్ష కుంకుమార్చన ఈ క్షేత్రంలో జరిగే ప్రత్యేక పూజలు. శ్రీచక్ర యంత్రంపై అమ్మవారిని ప్రతిష్టించడం వల్ల దేవికి ప్రత్యేక అవతార రూప అలంకరణలు ఉండవు.

శ్రీ విశాలాక్షీదేవి
అష్టాదశ శక్తి పీఠాల్లో 17వ క్షేత్రం పుణ్యక్షేత్రం కాశీలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో వెలసిన అమ్మవారిని శ్రీ విశాలాక్షీదేవిగా ప్రార్థిస్తారు. ఇది అమ్మవారి మణికర్ణిక పడిన చోటు. కాశీలో 1500 ఆలయాలకు పైగా ఉన్నాయి. శివుని కన్నులు మూసి లోకాన్ని చీకటి చేసిన పాపానికి నల్లగా మారిన గౌరి, అన్నదాన పుణ్యంతో తిరిగి బంగారు వర్ణంలోకి మారిన క్షేత్రం కాశి. వ్యాసునికి కడుపార భోజనం పెట్టిన తల్లి అన్నపూర్ణ తిరుగాడిన క్షేత్రం కాశి. హిమాలయాలపై ఉండడం ఇష్టం లేక తన కోసం నిర్మించుకున్న పట్టణం కాశి. శివుని వైభవాన్ని విశాల నేత్రాలతో చూసిన తల్లి శక్తిపీఠంగా వెలిసింది విశాలాక్షి పీఠం.

అయోధ్య, మధుర, హరిద్వార్‌, కాంచీపురం, కాశీ, ఉజ్జయిని, ద్వారక సప్త మోక్ష ప్రదాయికాల్లో కాశీక్షేత్రం శ్రేష్టమైనది. ఈ పుణ్యస్థలంలో మహావిష్ణువు ముక్కంటిని పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఓసారి సూర్యభగవానుడు ఆకాశ మార్గాన వెళ్తుండగా, మహావిష్ణువు కాశీలో శివ లింగపూజలో ఉండటం గమనిస్తాడు. ఉమాపతి కొలువైన ఈ పుణ్యస్థలంలో పూజలు చేస్తే అత్యంత పుణ్య ఫలం లభిస్తుందని మహావిష్ణువుచే తెలుసుకుని ఆదిత్యుడు ఆ ప్రాంతంలో లింగాన్ని స్థాపించి పూజించసాగాడు. మహావిష్ణువు మాత్రమే కాకుండా, సృష్టికర్త బ్రహ్మ కూడా ఈశ్వరుని వేడుకుంటూ పది అశ్వమేధయాగాలు చేశాడు. ఈ దశాశ్వ మేథఘాట్‌కు ఇప్పటికీ బ్రహ్మదేవుడు పూజలు చేస్తుంటాడని ప్రతీతి. అటువంటి ఈ పుణ్యస్థలిలో భక్తులను బ్రోచే జగన్మాత విశాలాక్షిగా కొలువైంది. ఈ శక్తిపీఠంలో విశాలాక్షి గర్భాలయంలో రెండు రూపాలతో దర్శనమిస్తుంది. ఒకరూపం స్వయంభువు. మరొక రూపం అర్చామూర్తి. మనం ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా అర్చామూర్తిని, పిమ్మట స్వయంభువును దర్శించుకోవాలి. పసుపు కుంకుమలతో ప్రకాశిస్తూ, పుష్పమాలాలంకృతురాలైన ఆమెను భక్తులు మనసారా పూజిస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని విశ్వాసం.

శ్రీ వైష్ణవీ దేవి
అష్టాదశ శక్తి పీఠాల్లో చివరిది శ్రీ వైష్ణవి దేవీ క్షేత్రం. ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో హిమపర్వతం నడమ పఠాన్‌కోటలో జ్వాలాముఖి రైల్వేస్టేషన్‌కు 20 కి.మి. దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. అమ్మవారి శిరస్సు పడిన చోటుగా విరాజిల్లుతున్న శ్రీ వైష్ణవీ దేవి శక్తి పీఠం జమ్మూలో కాట్రాకు సమీపంలో ఉంది.

భైరవనాథుడు అనే తాంత్రికుని బారి నుండి విష్ణుభక్తురాలైన ఒక బాలిక తప్పించుకుని, అతని తంత్రాలను తిప్పికొట్టిన కథ ప్రచారంలో ఉంది. ఈమెను వైష్ణవ దేవి అని పిలుస్తారు.

త్రేతాయుగంలో శ్రీరాముడు లంకానగరములో దండయాత్రకు బయలుదేరేముందు జగన్మాతను ప్రార్ధించగా జగన్మాత సరస్వతి, లక్ష్మి, మహాకాళి రూపాల్లో ప్రత్యక్షమై ఆయన పూజలందుకున్నట్లు చెప్పబడింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని పూజలందుకున్న ఆ జగన్మాత ద్వాపరయుగంలో ఉత్తర భారతదేశానికి వెళ్ళి జమ్ము ప్రాంతాల్లోని అడవుల్లో కొలువుదీరినట్లు చెప్పబడుతుంది. ఈ విధంగా త్రేతాయుగం, ద్వాపరయుగంలో పూజలందుకున్న ఈ అమ్మవారు కలియుగంలో కొలువుదీరడాన్ని ఒక విశేషంగా చెప్పుకోవచ్చు.

ఎత్తయిన పర్వత శ్రేణులు, వాటిపైన ఆకాశన్నంటే వివిధ వృక్షాలు, ఆహ్లాదాన్ని కలిగించే అందమైన ప్రకృతి శోభ మధ్య త్రికూట పర్వతం పైన "శ్రీ వైష్ణవీ దేవి" ఆలయం ఉంది. ఆలయం సముద్ర మట్టానికి సుమారు 5,200 అడుగుల ఎత్తులో ఉంది. శ్రీ వైష్ణవదేవీ యాత్ర కత్రా నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడినుంది ఆలయం 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. భక్తులు సాధారణంగా కాలినడకనే వెళతారు. ఈ దారిలో వాహనాలు వెళ్ళలేవు. నడవలేని వారికి , వృద్ధులకు గుర్రాలు, డోలీలు అందుబాటులో ఉంటాయి. కత్రాకు కొంత దూరంలో ’భూమికా మందిరం ’ ఉంది.

ఇక్కడ ఉన్న రిసెప్షన్ కౌంటర్‍లో భక్తులు దర్శనానికి వెళ్ళేముండు తమ పేర్లను నమోదు చేసుకోని రసీదు పొందాలి. ఆ రసీదు ఉన్నవారే దర్శనానికి అర్హులు. ప్రయాణ మార్గంలో కత్రా నుంచి సుమారు రెండు కిలోమీటర్లు దాటగానే "దక్షిణ దర్వాజా" ఉంది. ఇక్కడి నుండి ఆలయం కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల దీనికి "దర్సన దర్వాజా" అని కూడా పేరు. దీనిని దాటిన తర్వాత "బాణ్ గంగా" ఉంది. వైష్ణవీదేవి బాణం వేయగా అక్కడ ఉన్న రాయి నుండి గంగ ఉద్భవించడం వల్ల దీనికి ఆ పేరు వచ్చిందని చెపుతారు.

అష్టాదశ పీఠాల్లో పద్దెనిమింటిని దర్శించుకోవడం అసాధ్యం. అందుచేత అష్టాదశ పీఠాల్లో ఏదేని ఒక క్షేత్రాన్ని దర్శించుకున్నా 18 క్షేత్రాలు దర్శించుకున్న పుణ్యఫలం సిద్ధిస్తుందని పురోహితులు అంటున్నారు.
అష్టాదశ శక్తిపీఠాల వివరాలుఅష్టాదశ శక్తిపీఠాల వివరాలు
అష్టాదశ శక్తిపీఠాల వివరాలు ఆదిశంకరాచార్యులు వ్రాసిన క్రింది పద్యాల నుండి సంగ్రహించబడినవి.

లంకాయాం శాంకరీదేవి , కామాక్షి కాంచికాపురే /
ప్రద్యుమ్నే శృంఖలాదేవి , చాముండా క్రౌంచపట్టణే //

అలంపురే జోగులాంబా , శ్రీశైలే భ్రమరాంబికా /
కొల్హాపురే మహాలక్ష్మి , మాహుర్యే ఏకవీరికా //

ఉజ్జయిన్యాం మహాకాళి , పీఠికాయాం పురుహూతికా /
ఓఢ్యాణే గిరిజాదేవి , మాణిక్యా దక్షవాటికే //

హరిక్షేత్రే కామరూపి , ప్రయాగే మాధవేశ్వరి /
జ్వాలాయాం వైష్ణవిదేవి , గయా మాంగల్యగౌరికా //

వారణాశ్యాం విశాలాక్షి , కాశ్మీరే తు సరస్వతి /
అష్టాదశ శక్తిపీఠాని , యోగినామపి దుర్లభం //

సాయంకాలే పఠేన్నిత్యం , సర్వశతృవినాశనం /
సర్వరోగహరం దివ్యం , సర్వసంపత్కరం శుభం //


అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకునే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుంది. శక్తిస్వరూపిణిగా భక్తుల కోరికలను నెరవేర్చే అమ్మవారిని అష్టాదశ శక్తిపీఠాల్లో దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం.


ఈ అష్టాదశ పీఠాలు ఎలా వెలశాయంటే..?
పూర్వం అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి సతీదేవిరూపంలో ఉన్నప్పుడు తండ్రి దక్షుడు మహాయజ్ఞం తలపెట్టాడు. ఈ మహాయజ్ఞానికి ముల్లోకాల్లోని దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. కానీ ఇష్టంలేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన కుమార్తె పార్వతీదేవిని, అల్లుడు పరమేశ్వరునిని ఆహ్వానించడు. కానీ తండ్రి చేపట్టిన యజ్ఞానికి వెళ్లాలని ఈశ్వరునిని సతీదేవి వేడుకుంటుంది. అయితే పిలవని పేరంటానికి వెళ్లడానికి పార్వతీ పరమేశ్వరుడు అంగీకరించడు. కానీ పరమేశ్వరుని మాటను కాదని పుట్టింటి మీది ప్రేమతో వెళ్ళిన లోకమాతకు అక్కడ అవమానం ఎదురవగా ఆ తల్లి యోగాగ్నితో తన శరీరాన్ని త్యజిస్తుంది. కోపంతో పరమేశ్వరుడు వీరభద్రుని సృష్టించి యజ్ఞధ్వంసం చేసి సతీదేవి శరీరాన్ని భుజానవేసుకుని ఉన్మత్తునిలా తిరుగుతూ ఉంటే సృష్టి శ్రేయస్సుకోసం చక్రి ఆ శరీరాన్ని పద్దెనిమిది భాగాలుగా ఖండిస్తాడు. ఆ శరీర భాగాలు భూలోకంలో 18 చోట్ల పడినట్లు పురాణాలు చెబుతున్నాయి. అవే అష్టాదశ శక్తిపీఠాలుగా వెలశాయి.

అష్టాదశ పీఠాల విషయాల విషయంలో వివిధ స్థలాలను గుర్తించడంలో కొన్ని భేదాభి ప్రాయాలున్నాయి. ఒక వివరణ ప్రకారం ఈ స్థలాలు ఇలా ఉన్నాయి

శాంకరి – శ్రీలంక – ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో ‘త్రికోణేశహవర స్వామి’ అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.

కామాక్షి – కాంచీపురం, తమిళనాడు – మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

శృంఖల – ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ – ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.

చాముండి – క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక – అమ్మవారు చాముండేశ్వరీ దేవి.

జోగులాంబ – ఆలంపూర్, తెలంగాణా – కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో ‘తుంగ’, ‘భద్ర’ నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది.


భ్రమరాంబిక – శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ – కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.

మహాలక్ష్మి – కొల్హాపూర్, మహారాష్ట్ర – ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.

ఏకవీరిక – మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర – ఇక్కడి అమ్మవారిని ‘రేణుకా మాత’గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.

మహాకాళి – ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ – ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.

పురుహూతిక – పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్రప్రదేశ్ – కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.

గిరిజ – ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒరిస్సా – వైతరిణీ నది తీరాన ఉన్నది.

మాణిక్యాంబ – దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ – కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.

కామరూప – హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం – బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.

మాధవేశ్వరి – ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో – ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.

వైష్ణవి – జ్వాలాక్షేత్రం,  కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ – ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.

మంగళ గౌరి – గయ, బీహారు – పాట్నా నుండి 74 కిలోమీటర్లు.

విశాలాక్షి – వారాణసి, ఉత్తర ప్రదేశ్.

సరస్వతి – జమ్ము, కాశ్మీరు – అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు. పాక్ ఆక్రమిత కాశ్మీరు లో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు.

అష్ఠాదశ శక్తిపీఠాలు


అష్ఠాదశ శక్తిపీఠాలుదక్షయఙ్ఞ కార్యక్రమమే అష్ఠాదశపీఠాలకు ఏర్పడటానికి మూలం ఐనది. తాను జరపబోయే బృహస్పతియాగానికి దక్షుడు అందరిని ఆహ్వానిస్తాడు, తన కూతురు దాక్షాయణిని, అల్లుడు శివుడిని తప్ప. తన ఇష్టంతో సంబంధంలేకుండా దాక్షాయణి శివుడిని పెళ్ళాడటమే అందుకు కారణం. పిలుపు లేకుండానే, దాక్షాయణి యాగానికి వస్తుంది (పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవల్సిన అవసరంలేదు అనే ఉద్దేశ్యంతో ). అక్కడ దక్షుడు, ఇతరులు చేసిన శివనింద భరించలేక ఆమె యోగాగ్నికి ఆహూతైంది.

ఉగ్రరూపుడైన శివుడు, విషాదంతో దాక్షాయణి మృతదేహాన్ని భుజాన వేసుకొని, జగత్రక్షణ కూడా పక్కనబెట్టి, సంచరించసాగాడు. సృష్టి, స్థితి, లయంలో ఏ ఒక్కట్టి ఆగినా అనర్ధాలు ఏర్పడే అవకాశం ఉంది అనే ఉద్దేశ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, విష్ణుదేవుడు, శివుడిని కార్యోన్ముక్తుడు చేయుటకై, తన చక్రాయుధంతో దాక్షాయణి మృతదేహాన్ని ఖండాలుగా చేస్తాడు. ఒక్కోభాగము ఒక్కోచోట పడ్డాయి అవి పడిన ప్రతీచోట శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి.

అష్టాదశ శక్తిపీఠాల వివరాలు ఆదిశంకరాచార్యులు వ్రాసిన క్రింది పద్యాల నుండి సంగ్రహించబడినవి.ఓం లంకాయాం శాంకరీదేవి, కామాక్షీ కాంచికాపురీ
ప్రద్యుమ్నే శృంఖలాదేవీ, చాముండే క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హా పురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహంకాళీ, పీఠికాయాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికా
హరిక్షేత్రే కామరూపీ, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగల్య గౌరికా
వారణాస్యం విశాలాక్షీ, కాశ్మీరేతు సరస్వతీ
అష్టాదశ పీఠాని, యోగినామపి దుర్లభం
సాయంకాలం పఠేన్నిత్యం, సర్వశత్రు వినాశనం
సర్వరోగహరం దివ్యం, సర్వ సంపత్కరం శుభం


శాంకరి – శ్రీలంక
అమ్మవారి మొలభాగము పడినచోటు త్రికోణమలై (ట్రికోమలీ) శ్రీలంక. త్రి =3, కోణ = కోణం, మలై = కొండ, త్రికోణాకారంలో ఉన్న కొండ మీద అమ్మవారు ఉన్నారు. గుడి భూమధ్యరేఖకు సున్నాడిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)లోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది. దగ్గరలో ‘త్రికోణేశహవర స్వామి’ అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది. కోణేశ్వరం దేవాలయాన్నే తిరు కోణేశ్వరం అని పిలుస్తారు. కున అంటే తమిళంలో తూర్పు అని అర్ధం. 2500 సంవత్సారలకు ముందు విజయుడు ఇక్కడికి రాజుగా రావడానికి ముందే దేవాలయం వుందని నమ్ముతారు. దేవాలయ పరిసరాలలో బయల్పడిన అనేక విగ్రహాల ఆధారంగా ఈ ప్రాంతం పల్లవులదే నని నమ్ముతారు. ఈ దేవాలయాన్ని పరిరక్షించడంలో చోళ పాంఢ్యులు తమ వంతు కృషి చేసారు. తమిళ రాజు కులోత్తముడు ఈ దేవాలయానికి మరమత్తులు చేయించాడని ప్రతీతి.

కామాక్షి – కాంచీపురం, తమిళనాడు
మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమ్మవారి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు. ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ని వివాహం చేసుకుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆదిపరాశక్తి యోగపీఠంగానూ, కామాక్షీదేవి ఆలయాన్ని భోగపీఠంగానూ భావిస్తారు భక్తులు.

అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదోది అని చెపుతారు. కాత్యాయన మహర్షి తపస్సు చేసి గౌరీదేవిని కూతురుగా పొందాలని వరం కోరుకున్నాడు. కామాక్షి ఏకామ్రనాథుని అర్చించి కంచిలో వెలసిందని పండితులు చెబుతున్నారు.

శృంఖల – ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్
ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది. అష్టాదశ శక్తి పీఠాల్లో మూడోది శ్రీశృంఖలా దేవి క్షేత్రం. త్రేతాయుగంలో ఋష్యశృంగమహర్షి దేవీ ఉపాసన చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన తపస్సు శృంగగిరిపై సాగింది. అక్కడ ప్రత్యక్షమైన శృంగదేవి శృంఖళా దేవిగా మారిందని ఒక గాథ. ఋష్యశృంగుని తపశ్శక్తితరంగాలను ఆది శంకరులు ఆవాహన చేసి శారదాపీఠాన్ని ఏర్పాటు చేశారని పురాణ గాథలు చెబుతున్నాయి.
అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. పశ్చిమ బెంగాల్లో ఉన్న హుగ్లీ జిల్లాలోని “పాండువా” అనే ప్రాంతాన్ని శక్తిపీఠంగా అందరూ విశ్వసిస్తారు. అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ ‘మేళతాళలతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం ప్రత్యేకత.
మరొక కధనం ప్రకారం …ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నదని కొందరు, కోల్‌కత్తాకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న ‘చోటిల్లామాత’ను అక్కడివారు శృంగళాదేవిగా ( శృంఖలాదేవి) భావిస్తారు.

చాముండి – క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక – అమ్మవారు చాముండేశ్వరీ దేవి.
అమ్మవారి కురులు (శిరోజాలు) చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి పరమేశ్వరి, శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది. “మహాబలాద్రి శిఖర” అనే కొండపై అమ్మవారు వెలిసారు కావున ఆ కొండ కాలక్రమములో చాముండికొండగా మారింది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది. మహిషాసురుని సంహరించిన చాముండేశ్వరి సర్వదేవతల తేజస్సులతో ఆవిర్భించిన ప్రాంతం ఇదేనని చెబుతున్నారు. సముద్ర మట్టానికి 3500 కి.మీ ఎత్తున చాముండేశ్వరి కొండపై ఈ శక్తి పీఠం ఉంది. ఈ శక్తిపీఠంలోనే ప్రతి ఏడాది దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి.

జోగులాంబ – ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్
కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో ‘తుంగ’, ‘భద్ర’ నదులు తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో ఉన్నది. మనరాష్ట్రంలోని నాలుగు శక్తిపీఠాల్లో మొదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు / దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు. జోగులాంబ ఉగ్ర రూపంలో ఉంటుంది, చతుర్భుజి గా కపాలము, గొడ్డలి, ఖడ్గము, పాన పాత్ర ధరించి, శవమును ఆశనముగా కలిగి, ఎడమవైపు తల తిప్పి మోకాళ్ళపై కూర్చొనిఉన్న ఒక శిరస్సు పై తన వృష్టభాగాన్ని ఆనించి, అరికాలు కనపడేలా ఎడమపాదం నేలపై ఆనించి, కపాలమును యఙ్ఞోపవీతంగాను, ఐదు ఆకులవలె వేలాడుతున్న కటిసూత్రం ధరించి ఉంటుంది. ఇది ఏడో అష్టాదశ పీఠం పూర్వం హలంపురం అని పిలుపబడేదట. పంచారామక్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలానికి పశ్చిమ ద్వారంలో ఉన్న ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుని ఆలయం కూడా ఉండటం విశేషం.

భ్రమరాంబిక – శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్
కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి. అమ్మవారి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు అమ్మవారు తుమ్మెదరూపంలో (భమరము అంటే తుమ్మెద) అవతరించిందట. మల్లికార్జునము అంటే తెల్లటి మల్లే పువ్వు. ఆ దేవి ముఖారవిందంపై వాలిన తుమ్మెదల గుంపు ఆ రాక్షసుడిపై దాడి చేయటంతో ఆ రాక్షసుడు మరణించాడు. ఆ తల్లి భ్రమరాంబికగా వెలసి, మల్లికార్జునుని వరించి శ్రీశైలంపై కొలువైందని పురాణాలు చెబుతున్నాయి. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన ‘సౌందర్య లహరి’ కూడా రచించారని చెబుతారు. దీనిని ఎనిమిదో అష్టాదశ పీఠంగా పిలుస్తారు. .

మహాలక్ష్మి – కొల్హాపూర్, మహారాష్ట్ర
కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నాలుగు చేతులతో అమ్మవారి నల్లరాతి విగ్రహం మూడు అడుగుల ఎత్తున ఉంటుంది. మహాలక్ష్మి అంటేనే విష్ణుపత్ని లక్ష్మి అనుకోకూడదు. 18 భుజాలతో రజోగుణంతో విలసిల్లుతున్న మహాశక్తి పార్వతీదేవి అని పండితులు అంటున్నారు. అలనాటి కరవీర ప్రాంతమే ఈనాటి కొల్హాపూర్‌. అమ్మవారి నేత్రాలు పడిన ప్రదేశము. పూణెకు 240 కి.మి దూరంలో ఉత్తరాన కొల్హాపూర్‌ మహాలక్ష్మి ఆలయం ఉంది. రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి కొల్హాసుర రాక్షస సంహారం అనంతరం ఈ కరవీరప్రాంతం కొల్హాపూర్‌గా రూపాంతరం చెందింది. హిందూ ఆలయాలు సహజంగా తూర్పు ఉత్తరదిశగా ఉంటాయి. కాని ఇక్కడ మహాలక్ష్మి ఆలయం పడమరదిశగా ఉంటుంది. ‘ఇక్కడ మరో ప్రత్యేకతేమిటంటే ఆలయంలో పశ్చిమాన ఒకచిన్న గవాక్షం ఉంది. సంవత్సరంలో మార్చి, సెప్టంబర్ నెలల్లో సూర్యాస్తమయ సమయంలో 3రోజులు సూర్య కిరణాలు ఈ కిటికీగుండా ప్రసరించి అమ్మవారి ముఖంపై ప్రకాశిస్తాయి. ఈ 3రోజులు ‘కిరణోత్సవాలుగా జరుపు కుంటారు. ఇది అష్టాదశ పీఠాల్లో ఆరోది

ఏకవీరిక – మాహుర్యం లేదా మహార్, మహారాష్ట
మహారాష్టలో నాందేడ్‌ జిల్లా కేంద్రానికి 128 కి.మీ. దూరంలో దత్తాత్రేయుని జన్మక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహోర్‌లో ఉంది. – ఇక్కడి అమ్మవారిని ‘రేణుకా మాత’గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును. అమ్మవారి కుడిచేయి పడినచోటు, మహారాష్ట్రలోని నాందేడ్‌ సమీపంలోని మాహోర్‌ క్షేత్రం. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక. ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి. అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రిమహర్షి, అనసూయాదేవిని ప్రతిష్ఠించారు. మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది. మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది. అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు.

ఇంకో కధనం కూడా ఉంది:
జమదగ్ని ఆఙ్ఞచే, తల్లి రేణుకాదేవి శిరస్సును ఖండించాడు పరశురాముడు. ఆ శిరస్సు రూపంలో ఉన్న మాయా శక్తే “ఏకవీర”, పరశురాముని చేత ఖండితమైన తల్లి శిరస్సే ఈ దేవత. ఈ తల్లినే ‘ఛిన్నమస్త’ అని కూడా అంటారు. మిగిలిన రేణుకాదేవి శరీరం, భూదేవిగా పూజలు అందుకొంటోంది.

మహాకాళి – ఉజ్జయిని, మధ్య ప్రదేశ్
ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉన్నది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే. అష్టాదశ శక్తిపీఠాల్లో 11వ శ్రీ మహంకాళీ దేవి క్షేత్రం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. ఇది అమ్మవారి పై పెదవి పడిన చోటు. విక్రమార్క మహారాజు చరిత్ర ఉజ్జయినితో ముడిపడి ఉంది. ఇక్కడి నది సిప్ర. కుజునికి ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఆలయం ఉంది. భూమి నుంచి కుజుడు విడిపోయిన ప్రాంత ఇదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కుజుడు అంటే భూమికి జన్మించిన వాడని అర్థం. ఇక్కడ త్రిపురాసురుణ్ని వధించిన మహాకాలుని ఆలయం ఉంది. ఆ స్వామికి ఆధారమైన శక్తి మహంకాళి. ఆ మహంకాళి శక్తి పీఠం ఇది.

పురుహూతిక – పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్
కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు. అష్టాదశ శక్తి పీఠాల్లో రెండోది శ్రీ పురుహుతికా దేవి క్షేత్రం రాష్ట్రంలోని పిఠాపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారి ఎడమ హస్తం పడిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. పూర్వం ఏలుడు అనే ఋషి గంగ కోసం శివుని గురించి తపస్సు చేసి, శివుని అనుగ్రహం పొందాడు. ఏలుని తపస్సుతో సంతృప్తి చెందిన పరమేశ్వరుడు తన జటాజూటంలోని గంగలోని ఒక పాయను వదిలిన శివుడు… వెనక్కి తిరిగి చూడకుండా పోయినంతసేపూ, గంగ వస్తుందని ఏలునితో చెప్పాడు. కానీ శివుని అనుగ్రహానికి ఆనకట్టగా నిలవాలని ఇంద్రుడు కోడి పుంజులా మారి కూశాడు. ఏలుడు వెనక్కి చూశాడు. గంగ ఆగి అక్కడ ఏలానదిగా మారింది. శివుడు కుక్కుటేశ్వరుడుగా మారాడు. ఇక్కడ అపరకర్మలు చేస్తారని ఆలయ పండితులు చెబుతున్నారు.

గిరిజ – ఓఢ్య, ఒరిస్సా
జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, – వైతరిణీ నది తీరాన ఉన్నది. అష్టాదశ శక్తి పీఠాల్లో తొమ్మిది శక్తి పీఠం ఒరిస్సాలోని వైతరణీ నదీతీరంలో వెలసింది. ఇక్కడ వెలసిన అమ్మవారిని శ్రీ గిరిజా దేవి అని పిలుస్తారు. ఒరిస్సాలో వైతరణీనదీతీరంలో జాజ్‌పూర్‌ రోడ్డుకు 20 కి. మీ.దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. ఇది అమ్మవారి నాభి బాగం పడిన చోటుగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ గిరిజాదేవిని శ్వేతవరాహమూర్తి రూపంలో విష్ణుమూర్తి అర్చిస్తుంటాడు. సింహవాహణిగా దర్శనమిచ్చే గిరిజా దేవి, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో మహిషాసురుని తోక పట్టుకుని ఉంటుంది. ఈమెను శక్తిత్రయరూపిణి కొలుస్తారని ఆలయ పురాణాలు చెబుతున్నాయి.

మాణిక్యాంబ – దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్
కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో అష్టాదశ శక్తి పీఠాల్లో 16వ శక్తి పీఠమే ఆంధ్రప్రదేశ్‌లోని ద్రాక్షారామం. ఇక్కడ అమ్మవారిని శ్రీ మాణిక్యాంబా దేవిగా పిలుస్తారు. ఇది అమ్మవారి ఎడమ చెక్కిలి పడిన చోటుగా అభివర్ణిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ త్రిలింగం అనడానికి మూలమైనా త్రిలింగాలలో ద్రాక్షారామలింగం ఒకటి. ఆలయం లోపల గోడలకు రత్న దీపాలుండేవని ప్రతీతి. గర్భాలయంలోని చీకటి కోణాన్ని అవి వెలుతురుతో నింపేవని చెబుతారు. ఇది దాక్షాయణి ఆత్మాహుతి చేసుకున్న చోటని పురాణాలు చెబుతున్నాయి. ఈ శివాలయం పంచారామాలలో ఒకటి కావడం విశేషం.

కామరూప/కామాఖ్యదేవి – హరిక్షేత్రం, అసోం
గౌహతి నుండి 18 కిలోమీటర్లు బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది. శ్రీ కామరూపీ దేవి శక్తి పీఠం:
అస్సాం గౌహతి సమీపంలోని నీలాచల పర్వత శిఖరంపై ఈ శక్తిపీఠం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది ఆషాడమాసంలో స్రవించే జలధార ఎర్రగా మారుతుంది. అది స్ర్తీత్వానికి ప్రతీక అంటారు. పరశురాముని మాతృ హత్యాదోషాన్ని ఈ తల్లి పోగొట్టిందని, శివుని కంటి మంటకు దహనమైన మన్మథుణ్ని జీవింపచేసిన తల్లిగా ఈమె ప్రఖ్యాతి చెందిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ అమృతేశ్వర్‌, కోటిలింగ, సిద్ధేశ్వర, కామేశ్వర శివాలయాలున్నాయి.

మాధవేశ్వరి – ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్
త్రివేణీ సంగమం సమీపంలో – ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు. అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. ఇక్కడి వారు ఈ మాతని అలోపీ దేవిగా వ్యవహరిస్తారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమనీ వాడుకలోకి వచ్చింది.

శ్రీ మాధవేశ్వరీ దేవి పీఠం: ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌లో ఉంది. అమ్మవారి హస్తాంగుళి పడిన చోటుగా దీన్ని పిలుస్తారు. శక్తిత్రయస్వరూపిణి పీఠమైన ఈ ప్రాంతంలో బ్రహ్మదేవుడు ఇక్కడ వరుసగా ఎన్నో యాగాలు చేసినందున ప్రయాగ్‌గా మారింది. ఈమెను కృతియుగంలో బృహస్పతి అమృతంతో అభిషేకించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా ఈ క్షేత్రాన్ని అమృత తీర్థం అని అంటారు. త్రేతాయయుగంలో రాముడు, ద్వాపరంలో శ్రీకృష్ణుడు ఈ తల్లిని పూజించారని పండితులు చెబుతున్నారు. అలాగే సూర్యుడు పూజించడం వలన ఈ క్షేత్రాన్ని భాస్కరక్షేత్రం అని కూడా పిలుస్తారు.

వైష్ణవి – జ్వాలాక్షేత్రం, కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్
ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి. అమ్మవారి నాలుక పడినచోటు, హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతం. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. సముద్ర మట్టానికి 5200 అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గుహలో వెలసిన అమ్మవారు వైష్ణోదేవి. జగన్మాత శ్రీవైష్ణవిదేవి గుహలోపల కొలువుదీరి ఉంది. సుమారు 98 అడుగుల గుహలో గుహగోడపై శ్రీవైష్ణవీదేవి దర్శనమిస్తుంది.గుహలో కొలువుదీరిన జగన్మాత రాయి రూపంలో దర్శనమిస్తుంది. ఈ మూర్తిక్రిందిభాగం ఒకటిగానే ఉండి శిఖరస్థానం దగ్గరకు వచ్చేటప్పటికి మూడుగా విభజింపబడి ఉంటుంది. ఎడమవైపు తెల్లని భాగం శ్రీ సరస్వతిగా, మధ్యలోని పచ్చని భాగం శ్రీలక్ష్మిగా, కుడివైపున ఉన్న నల్లని భాగం శ్రీమహాకాళిగా చెప్పబడుతూ ఉంది.అంటే ఈమె ముగ్గురు శక్తుల సమ్మేళనంతో ఏర్పడిన ఏకరూపం. అమ్మవారు కొలువుదీరి ఉన్న గుహలో అమ్మవారి కంటే ముందే ‘చరణ్ గంగా’ ఉంది. ప్రవహిస్తూ ఉన్న ఈ నీటిలో భక్తులు కాళ్ళు కడుక్కుని అనంతరం అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అష్టాదశ శక్తి పీఠాల్లో చివరిది శ్రీ వైష్ణవి దేవీ క్షేత్రం. ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లో హిమపర్వతం నడమ పఠాన్‌కోటలో జ్వాలాముఖి రైల్వేస్టేషన్‌కు 20 కి.మి. దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. అమ్మవారి శిరస్సు పడిన చోటుగా విరాజిల్లుతున్న శ్రీ వైష్ణవీ దేవి శక్తి పీఠం జమ్మూలో కాట్రాకు సమీపంలో ఉంది.

మంగళ గౌరి – గయ, బీహారు పాట్నా నుండి 74 కిలోమీటర్లు. అమ్మవారి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు. ఫల్గుణీనదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు.

శ్రీ మాంగల్యగౌరీ దేవి శక్తి పీఠం:
అమ్మవారి వక్షోజాలు ఇక్కడ పడ్డాయని చెబుతారు. ఈ పీఠం బీహార్‌లోని గయాలో ఉంది. తనను తాకిన ప్రతి జీవికీ మోక్షం వచ్చేలా విష్ణుమూర్తి వరం పొందిన గయాసురుడు పర్వతాకారంలో ఉన్న ప్రాంతమిది. గయాసురుడు శరీరాన్ని విపరీతంగా పెంచి అందరికీ మోక్షాన్ని ఇచ్చే సందర్భంలో, అతని శరీరం పెరగకుండా ధర్మవతశిలను అతని శిరస్సుపై ఉంచి, దాని పైకి విష్ణువును ఆవాహన చేసినట్లు ఒక పురాణగాథ ఉంది. విష్ణుమూర్తి సహోదరి అయిన మాంగల్యగౌరి ఈ క్షేత్రరూపిణి అని పండితులు చెబుతున్నారు. శ్రాద్ధకర్మలు ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి.

విశాలాక్షి – వారాణసి, ఉత్తర ప్రదేశ్.
అమ్మవారి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ పురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి.

అష్టాదశ శక్తి పీఠాల్లో 17వ క్షేత్రం పుణ్యక్షేత్రం కాశీలో ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో వెలసిన అమ్మవారిని శ్రీ విశాలాక్షీదేవిగా ప్రార్థిస్తారు. ఇది అమ్మవారి మణికర్ణిక పడిన చోటు. శివుని కన్నులు మూసి లోకాన్ని చీకటి చేసిన పాపానికి నల్లగా మారిన గౌరి, అన్నదాన పుణ్యంతో తిరిగి బంగారు వర్ణంలోకి మారిన క్షేత్రం కాశి. వ్యాసునికి కడుపార భోజనం పెట్టిన తల్లి అన్నపూర్ణ తిరుగాడిన క్షేత్రం కాశిగా పురాణాలు చెబుతున్నాయి. హిమాలయాలపై ఉండడం ఇష్టం లేక తన కోసం అమ్మవారు నిర్మించుకున్న పట్టణం కాశిగా పరిగణించబడుతోంది.. శివుని వైభవాన్ని విశాల నేత్రాలతో చూసిన తల్లి శక్తిపీఠంగా వెలసినదే విశాలాక్షి పీఠమని పురాణాలు చెబుతున్నాయి.

సరస్వతి – జమ్ము, కాష్మీరు
అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు. పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాద్‌కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు. అమ్మవారి కుడిచేయి పడిన ప్రాంతం కాశ్మీర్లో ఉంది. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నేటి ముజఫరాబాద్‌కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యం ద్వారా తెలుస్తోంది. కాశ్మీర్‌లోని శారదా మందిరం అత్యంత పురాతనమైనదిగా చెప్పబడుతున్నది. ప్రధానాలయం 22 అడుగుల చదరపు ఆకారంలో నిర్మింపబడింది. పాకిస్తాన్ వాళ్ళు (పాక్ ఆక్రమిత కాష్మీర్) ఆలయాన్ని నామరూపాలు లేకుండా చేసారు. చాల భాదాకరమైన విషయం :(. కాష్మీరీ పండితుల విన్నపంతో రోజూ ఆ శిధిలమైన గుడి దగ్గరక దీపం పెట్టడానికి ఒక పురోహితుడిని మాత్రం అనుమతిస్తారని వినికిడి.

శ్రీ సరస్వతీ దేవి శక్తి పీఠం:
కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు 40 కి.మిదూరంలో ఉన్న ఈ క్షేత్రంలో అమ్మవారి దక్షిణ హస్తం పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ సరస్వతీ దేవీని కీరవాణి అని పిలుస్తారు. పార్వతీపరమేశ్వరులు విశ్వకర్మతో అందమైన ఇల్లు కట్టించుకుని గృహప్రవేశానికి సిద్దమౌతారు. శివభక్తుడైన రావణుని పురోహితునిగా నియమిస్తారు. గృహప్రవేశం పూర్తయిన తరువాత దక్షిణం కోరుకొమ్మంటుంది పార్వతీదేవి. ఆ ఇంటినే తనివ్వమంటాడు రావణుడు. ఆడిన మాట తప్పలేక ఇచ్చేస్తుంది పార్వతీదేవి. తన పుట్టింటికి బాధపడుతూ వెళుతుంది. దారిలో సరస్వతి కనిపించి తనను ఓదారుస్తుంది. వారిద్దరూ కలిసిన ప్రదేశమే ఈ శక్తి పీఠంగా వెలసిందని ఆలయ గాథలు చెబుతున్నాయి. ఈ ఆలయం చెరువులో ఉంటుంది.

అష్టాదశ పీఠాల్లో పద్దెనిమింటిని దర్శించుకోవడం అసాధ్యం. అందుచేత అష్టాదశ పీఠాల్లో ఏదేని ఒక క్షేత్రాన్ని దర్శించుకున్నా 18 క్షేత్రాలు దర్శించుకున్న పుణ్యఫలం సిద్ధిస్తుందని పురోహితులు అంటున్నారు.
అష్టాదశ శక్తి పీఠాల్లో నాలుగు పీఠాలు మన తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నాయి. ఈ నాలుగు పీఠాలలోను అత్యుత్తమ మైనదిగా, బహుళ ప్రచారంలో ఉన్నది కర్నూలు జిల్లాలోని శ్రీశైలం. ఇది అమ్మవారి పరంగానే కాక శివుని పరంగా కూడా విశేష ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లిం గాలలో ఒకటిగా ఇక్కడ కొలువుదీరిన మల్లిఖార్జున స్వామికి విశేషమైన గుర్తింపు ఉంది.
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో వెలిసిన పురుహూతికా దేవి, అదే జిల్లా ద్రాక్షారామంలో కొలువైవున్న మాణిక్యాంబా దేవి.
తరువాత క్షేత్రం మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని జోగులాంబ ఆలయం.