Friday, 22 August 2014

అష్టాదశ శక్తిపీఠాలు
అష్టాదశ శక్తిపీఠాలు
ఈ ప్రపంచాన్ని శాసించే సర్వసత్తాక శక్తులుగా పేరొందిన శివుడు, విష్ణూవుతో పోటీపడి సర్వ జనులనూ ఆకట్టుకున్న దేవి ఆదిపరాశక్తి. ఆమె దయతోనే త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయ కారకాలను నిర్వహిస్తున్నార ని పురాణాలు చెబుతున్నాయి. నిగ్రహానుగ్రహ సామర్థ్యం గల సర్వశక్తి స్వరూపిణి, సర్వగ్రహ సంచారిణి, లోకానుగ్రహ కారిణి అమ్మవారు. ఆ అమ్మను ఆరాధించేందుకు మనదేశంలో అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి. అష్టాదశ శక్తిపీఠాల్లో వెలసిన అమ్మవారికి ఎనలేని శక్తి ఉంటుందని భక్తుల విశ్వాసం. అయితే అందరికీ అష్టాదశ శక్తిపీఠాల్లో ఉన్న శక్తి స్వరూపిణిని దర్శించుకోవడం కుదరకపోవచ్చు. అలాంటప్పుడు అష్టాదశ శక్తిపీఠాల్లో ఏ ఒక్క పీఠాన్ని దర్శించుకున్నా అన్ని శక్తి పీఠాలను దర్శించుకున్నంత పుణ్యం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి.

పార్వతీదేవి తండ్రి దక్షుడు మహాయజ్ఞం చేయ తలపెట్టి ముల్లోకాల్లోని దేవతలందరినీ ఆహ్వానిస్తాడు. కానీ ఇష్టంలేని పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయిన కూతురు, అల్లుడిని ఆహ్వానించడు. దీంతో ఎలాగైనా యజ్ఞానికి వెళ్ళాలని పరమశివుడిని పార్వతీదేవి వేడుకుంటుంది. అయితే పిలవని పేరంటానికి రావడానికి శివుడు ఒప్పుకోడు. దీనిని అవమానంగా భావించిన పార్వతీదేవి ఉగ్రరూపిణిగా ఊగిపోతూ తన శరీరాన్ని 18 ముక్కలు చేసి విసిరి వేస్తుంది. ఆ శరీర భాగాలు భూలోకంలో 18 చోట్ల పడతాయి. అవే అష్టాదశ శక్తిపీఠాలుగా వెలిశాయని పురాణగాథ. ఈ అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకునే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుంది. శక్తిస్వరూపిణిగా భక్తుల కోరికలను నెరవేర్చే అమ్మవారిని అష్టాదశ శక్తిపీఠాల్లో దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

“లంకాయాం శాంకరీదేవి”
భూప్రపంచాన్నే జంబూద్వీపం అని అంటారు. అగ్నిధృవుడనే రాజుకి అప్సరకాంతవల్ల తొమ్మండుగురు తనయులు కలిగారు. జంబూద్వీపాన్ని నవ ఖండాలుగా చేసి, తొమ్మిది మందికి పంచి ఇచ్చాడు. అందులో ఒకటి భారత ఖండం. భారత ఖండంలో సింహళం కూడా ఒక భూభాగముగా ఉండేది. నాటి సింహళ ద్వీపం, నేడు శ్రీలంకగా ప్రసిద్ధిగాంచినది. ఆంగ్లంలో సింహళమే సిలోన్ అయింది. సిలోన్ లోని ఉత్తర భాగమంతా 12వ శతాబ్దంలో తమిళరాజుల పాలనలో ఉండేది. నాటి నుంచి ఉత్తర ప్రాంతము తమిళులది. దక్షిణ ప్రాంతము సింహళీయులది. ఉత్తరాన హిందూమతం, దక్షిణాన బౌద్దమతం స్నేహ సౌభ్రాతృత్వాలతో వర్థిల్లాయి.

మౌర్యుల కాలములో కళింగ రాజులపై అశోకుడు దండయాత్ర చేశాడు. కళింగ యుద్ధానంతరము అశోకుడు పశ్చాత్తాపం చెంది యుద్ధ విరమణ ప్రకటించి, బౌద్ధమతాన్ని స్వీకరించాడు. అశోకుడు తన కుమారుడు మరియు కుమార్తెను బౌద్ధమతాభివృద్ధికి, మతవ్యాప్తికై చైనా, బర్మా, సింహళం మొదలగు దేశ, విదేశములకు పంపినాడు. గయక్షేత్రంలోని బుద్ధుడు తపస్సు చేసిన బోధివృక్షము తాలూకు రెండు కొమ్మలను సింహళ దేశమునకు పంపినాడు. బౌద్ధమతంను సింహళద్వీపం నందు విస్తరింపజేశాడు. బౌద్ధమతాన్ని ఆచరించిన సార్వభౌములు, వారిపాలనలో హిందూమతాన్ని అణిచివేసినట్లు శిలాశాసనాలు తెలియపర్చుచున్నాయి. తరువాతి కాలమునందు మహమ్మదీయ మతం కూడా వ్యాప్తిలోనికి వచ్చింది. వాస్కోడిగామా క్రైస్తవంతో సిలోన్ లోనికి ప్రవేశించాడు. పోర్చుగీసువారు తమ మతంను ఇండోనేషియా దాకా విస్తరించారు. 1796వ సంవత్సరములో సిలోన్ ప్రాంతమును బ్రిటిష్‌వారు తమ వశం చేసుకున్నారు. వారి పాలనలో క్రీస్తు మతంను అభివృద్ధి చేసినారు.

శ్రీలంక భూభాగము 65,610 చ|| కి|| మీటర్లుగా ఉంటుంది. శ్రీలంక ద్వీపంను ఉత్తర ప్రాంతము, ఉత్తర మధ్యప్రాంతము, తూర్పు తీరప్రాంతము, వాయవ్య ప్రాంతము, ఎల్లవాయుప్రాంతముగా గుర్తించినారు. శ్రీలంక రాజధాని జయవర్థనపురం. దీనినే కొలంబోగా పిలుస్తారు. జాఫ్నా, దేహివాల, కాండి, కొలంబో, అనురాధపురం, పొలన్నరుప, కొట్టే మొదలగు ముఖ్య నగరములు కలవు. సిగిరియా, హిక్కడువా మొదలగు పర్యాటక స్థలాలు, పర్యాటకులను ఆకర్షించుచున్నాయి. సింహళి, తమిళ, ఇంగ్లీష్ అధికార భాషలుగా ఉన్నాయి. చెన్నై, బెంగుళూరు మొదలగు నగరముల నుంచి కొలంబోకు విమాన సర్విసులు కలవు. ముంబాయి, త్రివేండ్రం, చెన్నె (మనంబాకం) నాగపట్టణం మొదలగు రేవుల నుంచి సముద్ర మార్గంలో నౌకా సర్వీసులు కలవు.

“లంకాయాం శాంకరీదేవి”, అష్టాదశ శక్తిపీఠాల్లో మొదటది. భారతదేశమునకు పొరుగున గల సింహళద్వీపం(శ్రీలంక) నందు ఉండేది. శ్రీలంక ద్వీపంనందు తూర్పు తీరప్రాంతములో ట్రింకోమలిపుర(ట్రింకోంలీ) పట్టణము ఉంది. ఇది సతీదేవి కాలిగజ్జెలు పడిన ప్రదేశముగా ప్రసిద్ది. ఇక్కడ శాంకరీదేవి మందిరము ఉండేది అని పూర్వీకుల వాదన. బౌద్ధమతం, క్రైస్తవమతం అభివృద్ధితో హిందూమతంనకు రాజపోషణ కరువయింది.దీనితో ప్రజల ఆదరణ కూడా క్షీణించింది. కొంతకాలమునకు హిందూ దేవాలయములు శిథిలముగా మారినాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయినాయి. శాంకరీదేవి మందిరము కూడా కాలగర్భంలో కలిసిపోయి ఉండవచ్చును. నేడు శ్రీలంకను శోధిస్తే, ఎక్కడా శాంకరీదేవి ఆలయం కనిపించుటలేదు. ప్రస్తుతం శాంకరీదేవి దర్శనం దుర్లభమే. శ్రీలంకలో తమిళులపై దాడులు హింసాత్మక మవటంతో, వాటిని తట్టుకోలేక పారిపోయి కెనడా, ఇండియా మొదలగు దేశములకు, చేరిన హిందువుల సంఖ్య అదికం. క్రమక్రమంగా శ్రీలంకలో హిందూమతంకు, హిందూ దేవాలయములకు ఆదరణ కరువయింది.

త్రేతాయుగంలో రావణాసురుడు, లోకనాథుడైన పరమేశ్వరునితో పాటు శాంకరీదేవిని నిత్యం పూజించినట్లు పురాణ కథనం. ట్రింకోంలీ నందు శాంకరీదేవి ఆలయ దర్శనం నేడు శూన్యం అయినా, క్షేత్ర మహాత్యం, క్షేత్రా దర్శనము ఆనందాయకమే. కొలంబో పట్టణము పశ్చిమతీరంలో ఉండగా, ట్రికోంలీ పట్టణము తూర్పుతీరంలో ఉంది. రెండు పట్టణముల మధ్య రవాణా సదుపాయములు కలవు. మహోపట్టణం, గలోయపట్టణం మీదగా శ్రీలంక ప్రభుత్వరైలు మార్గం ఉండగా, కాండిపట్టణం, గలోయ పట్టణముల మీదుగా రోడ్‌మార్గం కలదు. భారతీయులకు శ్రీలంకలోని పర్యాటక స్థలసందర్శనకై 25,000/- రు||లు పైగా ఖర్చు అవుతుంది.

ఈ పీఠం శ్రీలంకలో ఉంది. ఇక్కడ అమ్మవారి కాలి గజ్జెలు పడ్డాయి. ఇది అష్టాదశ పీఠాల్లో ప్రథమ పీఠం. రావణుని స్తోత్రాలకు ప్రన్నమైన పార్వతీదేవి లంకలో అవతరించింది. రావణుని సీతాపహరణ దోషం వల్ల ఆ తల్లి అంతర్ధానమైంది. రావణ సంహారానంతరం తిరిగి లంకలో మహర్షులు చేత ప్రతిష్ఠించబడింది. ఇదీ ఈ శక్తి పీఠం యొక్క పురాణగాథ.


శ్రీకామక్షీ కంచికాపురే:

ఓం శ్రీ కామాక్షీ దేవతాయై నమః అంటూ కొలిచిన భక్తులను కాపాడి కోరికలు తీర్చే బంగరు తల్లి శక్తిస్వరూపిణి కామాక్షీదేవి. ఈ తల్లిని చేపట్టిన శంకరుడు ఏకామ్రేశ్వరుడు. కామాక్షీదేవి ఆలయం “కంపా” నదీ తీరంలో ఉంది. “కామాక్షి” అనగా “కోర్కెలు తీర్చే కన్నులు” గల శక్తి స్వరూపిణి.

ఈ కంచి కామాక్షీ ఆలయం తమిళనాడు లోని చెన్నైకి 70 కి.మీ. దూరంలో కాంచీపురం అనగా నేటి కంచి క్షేత్రంలో నిత్యార్చన విలసితురాలై భక్తజన మనోభీష్టాలను నెరవేర్చే అమ్మగా విలసిల్లుతోంది. అంతే కాదు శ్రీ మహావిష్ణువు వరదరాజస్వామి రూపంలో మిగిలిన దేవతలంతా తమతమ నెలవులను ఏర్పరచుకొన్న కంచి, మించి సిద్ధినొసగు శ్రీ శక్తి పీఠం. అష్టాదశ శక్తి పిఠాలలో రెండవ శక్తిపీఠమైన ఈ కంచి దేవాలయంలోని బంగారు బల్లి, వెండి బల్లి రూపాలను తాకి తరించే భాగ్యం ఈ క్షేత్రాన్ని దర్శించే వారికి కలుగుతుంది.

చెన్నైకి 70 కి.మీ. దూరంలో గల కంచిక్షేత్రాన్ని కాంచీపురం, కాంజీవరం అని కూడా పిలుస్తారు. చెన్నైనుండి తాంబరం మీదుగా కంచి చేరవచ్చు. దేవాలయాల కేంద్రంగా విశిష్ఠ విద్యాకేంద్రంగా గల ఈ కంచిపురంలో సతీదేవి “కంకాళం” పడినట్లు చరిత్రకారుల నమ్మకం.

ఆదిశంకరులే స్వయంగా ప్రతిష్టించిన ఈ శక్తిక్షేత్ర శక్తిపీఠం వైపుకే కంచిలోని ఆలయాలన్నీ తిరిగి ఉండటం ప్రత్యేక విశిష్ఠతగల అమ్మను, ఏకామ్రేశ్వర కామాక్షమ్మను దర్శించి తరించండి!

ప్రద్యుమ్నేశృంఖలాదేవి.
ఈ చరాచర ప్రపంచానికంతటకు తల్లి అయిన ఆ జగన్మాత నిత్యం బాలింతరాలుగా నడికట్టుతో కొలువుదీరి, తన బిడ్డలను రక్షించే తల్లిగా పేరుపొందిన దేవి. ‘శృంఖలా దేవి ‘కొలువు దీరిన దివ్యక్షేత్రం – ప్రద్యుమ్నం. ప్రద్యుమ్నం అష్టాదశ శక్తిపీఠములలో మూడవది అయిన శృంఖలాదేవి శక్తిపీఠము.

నేటి బెంగాల్ బంగ్లా దేశముగా, వంగ దేశముగా విడిపోయి ఉన్నది. హుగ్లీ జిల్లాలోని పాండుపా గ్రామంలోని దేవినే “శృంఖలాదేవి” అంటున్నారు. పశ్చిమ బెంగాల్‌లొని హుగ్లీ జిల్లాలోగల కలకత్తా (కోల్‌కతా) పట్టణానికి సుమారు 80 కి.మీ. దూరంలో పాండవ ప్రాంతమయిన “ప్రద్యుమ్న” అనే ప్రదేశంలో ఈ శృంఖలాదేవి క్షేత్రం ఉండేదని ఆర్యుల ప్రామాణికం. దాన్ని అనుసరిస్తే కలకత్తాకు 135 కి.మీ. దూరంలో గల గంగా సాగర్ క్షేత్రం శక్తి పీఠముగా పిలువబడుతోంది.

త్రేతాయుగంలో ‘ఋష్యశృంగ మహర్షి ‘ శృంఖలా దేవిని ప్రతిష్టించినట్లు తెలుస్తుంది.
ఈ క్షేత్రంలో సతీదేవి కన్ను పడిందని కొందరూ, స్థనము పడిందని మరికొందరి వాదన.


శృంఖలా దేవి శక్తిపీఠం పశ్చిమ బెంగాల్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి ఉదర భాగం పడిందని ప్రతీతి. త్రేతాయుగంలో ఋష్యశృంగమహర్షి దేవీ ఉపాసన చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆయన తపస్సు శృంగగిరిపై సాగింది. అక్కడ ప్రత్యక్షమైన శృంగదేవి శృంఖలా దేవిగా మారిందని ఒక గాథ. ఋష్యశృంగుని తపశ్శక్తితరంగాలను ఆది శంకరులు ఆవాహన చేసి శారదాపీఠాన్ని ఏర్పాటు చేశారు. 


క్రౌంచపట్టణ చాముండేశ్వరి:
అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాలయమాం|
చాముండేశ్వరి, చిత్కళవాసిని! శ్రీ జగదీశ్వరి రక్షయమాం||

అంటూ క్రౌంచి పట్టణమందున్న చాముండేశ్వరి ఆలయం భక్తజన జయజయ ధ్వానాలతో నిత్యం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. క్రౌంచి పట్టణం అనగా మహిషాసురుని ప్రధాన పట్టణం. అదే ఈనాటి మైసూరు పట్టణం. కర్నాటక రాష్ట్రంలోగల మైసూరు పట్టణమందు మహిషాసుర మర్ధినిగా, చాముండేశ్వరీ మాతగా తన చల్లని దేవెనలు కురిపిస్తూ, భక్తజన మనోభీష్టాలనీడేరుస్తూ నిత్యసేవా కైంకర్యాల నందుకుంటున్న బంగారు తల్లి ఆదిపరాశక్తి చాముండేశ్వరికి నిత్యం మనః పూర్వక వందనం.

శ్రీ చాముండేశ్వరీ దేవి… ఈ శక్తి పీఠం కర్నాటకలోని మైసూర్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి శిరోజాలు పడ్డాయి. మహిషాసురుని సంహరించిన చాముండేశ్వరి. సర్వదేవతల తేజస్సులతో ఆవిర్భవించిన శక్తి స్వరూపం. మనదేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో నాలుగోదిగా ప్రసిద్ధికెక్కిన చాముండేశ్వరి ఆలయ ప్రాంగణంలోనే గణపతి, శివలింగం, ఆంజనేయస్వాని ఉపమందిరాలు భక్తులను ఆకట్టుకుంటాయి. దేవాలయ ప్రాంగణంలోని రావిచెట్టుకు భక్తులు కుంకుమ పూజలు చేస్తుంటారు. కాళిక, దుర్గ, చాముండీమాతల కలయికగా భక్తులకు దర్శనమిచ్చే చాముండేశ్వరి అనుకున్న కార్యాలను విజయవంతం చేస్తుందని భక్తుల విశ్వాసం. మైసూరు రాజుల ఇష్టదైవమైన ఈ ఆలయంలో దసరా ఉత్సవాలను వైభవంగా చేస్తుంటారు. ఈ ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు.

అలంపురే జోగులాంబ:
అలంపురం పూర్వనామం హలంపురం, మరో పేరు హేమలాపురం. ఈ అలంపురంలోని శక్తిపీఠం జోగులాంబా దేవి శక్తిక్షేత్రం. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో కలదు. ఆదియుగంలో ఈ క్షేత్రం హరిహర క్షేత్రంగా భాసిల్లింది. కాశీక్షేత్రంలో ఉత్తర వాహిని గంగానది, అలాగే అలంపురంలో ఉత్తర వాహిని తుంగభద్ర. కాశీకి అటు, ఇటు వరుణ, అసి నదులున్నాయి. అదే విధంగా అలంపురానికి వేదవతి, నాగావళీ నదులున్నాయి. కాశీలో గంగ, యమున, సరస్వతి, త్రివేణి సంగమం ఉన్న విధంగా అలంపురంలో వేదవతి, నాగావళీ నదులున్నాయి. కాశీ అధిదేవతలు విశాలాక్షీ, విశ్వేశ్వరుడు. అలంపురానికి అధిదేవతలు జోగులాంబా, బాలబ్రహ్మేశ్వరుడు. ఈ అలంపురం శక్తిక్షేత్రం శ్రీశైలానికి పశ్చిమ ద్వారమై వెలసింది. కావున ఈ అలంపురాన్ని “దక్షిణ కాశి” అంటారు.

అలంపురం శక్తి జోగులాంబా, బాలబ్రహ్మేశ్వరాలయాలకు అటూ ఇటూ కుమార బ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, తారకబ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ అనే నవబ్రహ్మ ఆకారాలు లింగ రూపంలోనే ఉంటాయి. బాలబ్రహ్మేశ్వరుని తలపై మాత్రం చిన్నచిన్న గుంటలుంటాయి. ఈ లింగం చుట్టూ నారాయణ సాలగ్రామాలుంటాయి. ఈ బాలబ్రహ్మేశ్వర లింగంపై ఎన్ని నీళ్లు పోసినా ఆ నీళ్లు ఎటు పోతాయో తెలియదు. ఇసుకతో రూపుదిద్దిన “రససిద్ది వినాయకుడు” అనే పేరుతో గుడిలోని ఒక వినాయకుని తాకితే గరుకుగా ఉంటాడు. గట్టిగా అరగదీస్తే ఇసుక రాలుతుంది.

తుంగభద్ర ఆవలి ఒడ్డున పాపనాశేశ్వర ఆలయం, పాపనాశిని తీర్థం ఉన్నాయి. ఈ తీర్థంలో ఒక్క స్నానం చేస్తే సంవత్సరం పాటు గంగానదిలో స్నానం చేసిన ఫలితం సిద్ధిస్తుంది.

ఎంతో అద్భుత మహిమల చరిత్రల అలంపురం క్షేత్రాన్ని 7,8 శతాబ్దాలలో చాళుక్య రాజులు; 9వ శతాబ్దంలో రాష్ట్రకూటం రాజులు; 10,11 శతాబ్దాలలో కళ్యాణ, చాళుక్య రాజులు అభివృద్ధిపరచారు. కాని బహుమని సుల్తానుల తాకిడికి ఈ ప్రాంతం జీర్ణస్థితికి చేరుకుంది. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ అలంపురాన్ని అభివృద్ధిప్రిచాడు. ఇలా కాలమనే ఆటుపోటులకు తట్టుకుంటు నాటి చరిత్రకు సాక్షీభూతంగా నిలచి నేటికి ఆ ప్రతిభను చాటుతూ నిలచిన అలంపురం చూసి తీరవలసిన మహిమాన్విత పర్యాటక కేంద్రం. అష్టాదశ క్షేత్రాలలో ఐదవది.

శ్రీశైల భ్రమరాంబిక:
అష్టాదశ శక్తిపీఠలలో ఆరవ శక్తి పీఠమై భ్రామరి శక్తితో విరాజిల్లుతున్న శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో కూడా విశిష్ట స్థానం పొంది యున్నది. ఆంధ్రరాష్ట్రంలోని కర్ణూలు జిల్లాలో గల శ్రీశైలం సముద్రమట్టానికి చుట్టూ నాలుగు ప్రధాన గోపురాలతో కోట గోడల్లాంటి ఎతైన ప్రాకారంలో 279300 చ.అడుగుల విశాల ప్రాంగణంలో ఈ ఆలయం ఉన్నది. ఆలయ ప్రాకారం 2121 అడుగుల పొడవుతో దాదాపు 20 అడుగుల ఎత్తుగల కోట గోడ పురాతన చరిత్రకు సాక్ష్యంగా నిలచి ఉన్నది.

కాశీ క్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామస్మరణం, శ్రీశైలంలో భ్రమరాంబ మల్లేశ్వరల దర్శనం ముక్తిదాయకమని పురాణ ప్రవచనం. అందుకే “శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే” అని ఆర్యోక్తి. శ్రీశైలము అనగా వరములనిచ్చె శివ కైలాసము. సతీదేవి కంఠభాగము ఈ ప్రదేశంలో పడిందని చరిత్ర ఆదారం.

ఒకరోజున సౌందర్యలహరి అయిన జగజ్జనని అరుణాసురుని కంటపడింది. ఓ సుందరీ ! నీకీ కానలలో పని ఏమి? నేను లోకాల నేలేటి అరుణాసురుడను. నా సామ్రాజ్ఞ్‌వై నాతో సుఖించు అని ఆమె చేయిపట్టుకోబోగా ఆమె చుట్టూ తిరుగుతున్న భ్రమరాల (తుమ్మెదలు) అరుణాసురునిపై దాడిచేసి, చంపివేసి వాడి రాజ్యంలో ఉన్న రక్కసులందరినీ తుదముట్టించాయి.

కొంతకాలానికి మహిషాసురుని సంహరించేందుకు ఉగ్ర చండీరూపంతో, పద్దెనిమిది భుజములతో వెలసి వాడిని తుదముట్టించింది. రెండవసారి మహిషుడు మళ్ళీ పుట్టినప్పుడు భద్రకాళిగా ఎనిమిది చేతులతో అవతరించి వాడిని సంహరించింది. మూడవసారి మహిషుడు పుట్టి ‘అమ్మా! రేండు జన్మలలో నీచేత సంహరింపబడి నా అజ్ఞానం పొగొట్టుకున్నాను. ఇప్పటికైనా నన్ను కటాక్షించి నీ వాహనంగా నన్ను సేవచేయనీ, అని ప్రార్థించగా వాడిని తన పాదల క్రింద తొక్కి ఉంచింది భ్రమరాంబాదేవి.

ఈ క్షేత్రమున ముందుగా వెలసినది అర్ధనారీశ్వరి అయినప్పటికీ భ్రమరాంబా దేవి వెలసిన నాటి నుండి ఈమెయే ప్రధాన శక్తి స్వరూపిణి అయినది.

శ్రీశైలానికి నాలుగు ప్రధాన ద్వారములు కలవు. అవి త్రిపురాంతకము, సిద్ధవటము, అలంపురము, ఉమామహేశము అనునవి.

ఇక్కడి పాతాళగంగ భక్తుల పాపాలు కడిగే పావనగంగ. నల్లమలై అడవిలోపల గల “ఇష్టకామేశ్వరి” ఆలయం కాకుండా ఆరుబయటే ఆ దేవి ఉంటుంది. ఇష్టకామేశ్వరీ దేవి నొసట కుంకుమ దిద్దినపుడు మనిషి నుదురువలె మెత్తగా ఉంటుంది. ఇంకా చంద్రావతి నిర్మించిన “వృద్ధ మల్లికార్జునాలయము” అలా అడుగడుగునా అలరారే వన సౌందర్యాలు, ఔషధీ విలువలు, ఆరోగ్య ప్రశాంతతో అలరారే శ్రీశైలం నిజంగా భూతల కైలాసం.

శరణు ! శరణు ! భ్రమరాంబా మల్లేశా ! శరణు!

కొలాహపురి మహాలక్ష్మీ:
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సుర పూజితే|
శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే||

తా|| శ్రీ పీఠముపై సుఖముగా కూర్చొని యుండి, శంఖము, చక్రము, గద మరియు అభయ హస్తముద్రతో నుండి మాయను మటుమాయం చేసే మహామాయగా దేవతల రత్న కిరీట కాంతులతో మొరయుచున్న పద్మపాదములుగల తల్లి, దేవతలచే పూజింపబడుతున్న మహాలక్ష్మికి భక్తిపూర్వక నమస్కారము.

అష్టాదశ శక్తి పీఠములలో ముఖ్యమైన శక్తిపీఠము కొలాహపురి మహలక్ష్మీ శక్తిపీఠము. ఇక్కడ చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతమంత మేలుచేస్తుందని ఆర్యోక్తి. ఈ క్షేత్రానికి పూర్వనామం “కరవీర” పట్టణం. ఈ కొలాహపూర్ సముద్ర మట్టానికి 550 అడుగుల ఎత్తులో వున్నది. క్రీ.శ.9వ శతాబ్దంలో ఈ మహాలక్ష్మి ఆలయం నిర్మించబడినదని చరిత్రకారుల భవన.

పద్మావతి పురంవంటి కొలాహపురంలో కొలువైనది, కరుణ మాత్రమున వీరత్వము నొసగే కరవీర పురవాసిని, విభూతి అనగా ఐశ్వర్యప్రదమైన శివలింగమును కిరీటంపై ధరించి, వాత్సల్యంతో కోరిన వారికి సంపదనొసగే సచ్చిదానంద స్వరూపిణీ, ఓ లక్ష్మిదేవీ నీకు జయమగుకాక…

మాత లుంగం గదాం ఖేటం పానపాత్రం చ భిభ్రతే|
నాగలింగం చ యోనించ భిభ్రతీ నృప మూర్థని||

కొలాహపురి మహలక్ష్మికి నాలుగు చేతులున్నాయి. (కొలాహపుర మహాత్మ్యము) క్రింద కుడిచేతిలో మాతలుంగ ఫలం (మాదిఫలం), పైకుడి చేతిలో కిందికి దిగి ఉన్న పెద్ద గద, పైన ఎడమ చేతిలో డాలు, క్రింది ఎడమ చేతిలో పానపాత్ర ఉండగా, శిరస్సుపై ఒక నాగపడగ, దానిలో శివలింగము, యోని ముద్ర ఉన్నాయి. చంద్రఘంటా దేవి కిరీటంలోని ఘంటయే లక్ష్మిదేవి కిరీటంలోని శివలింగంగా మారిందని పెద్దల ప్రవచనం. అత్రి, అనసూయల పుత్రుడైన సద్గురు దత్తాత్రేయుడు ప్రతిరోజు మద్యాహ్నం ఈ లక్ష్మీదేవి వద్దకు వచ్చి భిక్షస్వీకరించేవాడట. వింధ్య గర్వమణచిన అగస్త్యుడు కొలాహపురి క్షేత్రదర్శనంతో దేవి సాక్షాత్కారం పొందాడు.

వందే పద్మకరాం ప్రసన్న వదనాం సర్వసౌభాగ్యదాయినీం|
వందే కరవీరపురస్థితాం మహాలక్షీం మానసార్చిత వందనం||

ఏకవీరికా దేవి:
మాహుర్యే ఏకవీరికా.. అనగా మాహుర్య పురమున వెలసిన శక్తి స్వరూపిణి ఏకవీరికాదేవి. ఈ మాహుర్య పురం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో నాందేడ్‌కి 128 కి||మీ|| దూరంలో ఉన్నది. దీనినే మయూర పురమని కూడా అంటారు.

ఈ ప్రదేశంలోని 3 పర్వతాలున్నాయి. ఒక శిఖరం మీద దత్తాత్రేయ స్వామి, రేండవ పర్వతంపైన అత్రి, అనసూయల ఆలయాలు ఉన్నాయి.

మూడవ శిఖరం సతీదేవి కుడిస్తం పడిన శ్రీ క్షేత్రం.. ఈ శిఖరంపైన గల ఆలయంలోగల ఏకవీరాదేవి విగ్రహం భయంకర రూపంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారి పెద్ద తల మాత్రమే ఉంటుంది.

ఆ అమ్మను బుద్ధి అనే అక్షింతల అర్చన చేస్తూ హృదయమనే కమలంలో సుస్థిరంగా నిలుపుకోవాలి. అమ్మ కోసం మనం తపిస్తే అమ్మ మనకోసం పరితపిస్తుంది.

ఇక అమ్మ ఏకవీరికా దేవిగా వెలసిన మయూర పురం దర్శనం ఎంతో పుణ్యప్రదమైనది.

సహ్యద్రి పర్వత శ్రేణులో ఒక శిఖరంపై గల ఈ పీఠాన్ని దర్శించేందుకు ఎందరో తాంత్రికులు, క్షుద్రోపాసకులు వచ్చి బలులు ఇచ్చి అమ్మను సంతృప్తిపరుస్తారు. దీనినే మహాగ్రామమని, తులజాపూర్ అని అంటుంటారు. ఈ క్షేత్రాన్ని ఛత్రపతి శివాజీ కూడా దర్శించాడని అంటారు.

ఉజ్జయిన్యాం మహాకాళీ:
మహామంత్రాధి దేవతాం ధీగంభీరతాం|
మహా కాళీ స్వరూపిణీం. మాం పాలయమాం||
ఎక్కడైతే స్త్రీమూర్తి గౌరవింపబడుతుందో, అదే దేవతల స్థానం. ఎప్పుడైతే స్త్రీకి అవమానం జరుగుతుందో ఆ అజ్ఞానాన్ని ద్రుంచే విజ్ఞాన స్థానమే కాళీ నిలయం.

ధర్మగ్లాని జరిగే వేళ దేవతల ప్రార్థనతో అంబిక నవదుర్గ రూపాలలో దుష్ట శిక్షణకై బయలుదేరింది. ఆ నవదుర్గ రూపాలలో అతి భీకరమైనదీ కాళీ స్వరూపం.

మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌కు 55 కి|| మీ|| దూరంలో క్షిప్రానదీ తీరంలో ఉజ్జయినీ క్షేత్రం ఉన్నది. ఈ ఉజ్జయిని పూర్వనామం అవంతిక. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర లింగం, మహాకాళీ శక్తి పీఠం ఉన్న శక్తి ప్రదేశమే ఉజ్జయిని. సతీదేవి మోచేయి పడిన ఈ ప్రాంతానికి అష్టాదశ శక్తి పీఠలలో ఒక విశిష్ఠ స్థానం ఉంది. అదేమిటంటే ఈ క్షేత్రాన్ని భూమికి నాభిగా పేర్కొంటారు. ప్రతి 12 సం||లకు ఒకసారి ఇక్కడ “కుంభమేళా” ఉత్సవం జరుగుతుంది.

ఇక్కడి స్వామివారైన మహాకాళేశ్వరునకు కన్నులుండటం అనగా శివలింగానికి కన్నులుండటం విశేషం.

ఈ ఉజ్జయిని కుశస్థలి, కనకశృంగి, పద్మావతి, కుముద్వతి, అమరావతి, విశాల అనే పేర్లతో కాల పరిస్థితులను బట్టి మారింది. సప్తమోక్ష పురలలో ఒకటి ఈ ఉజ్జయిని.

అదిగో చూడండి ! మహాకాలుని ఎదుట మహాకాళి ఆనంద తాండవం చేస్తోంది. ఒక్కసారి ఆ ఆదిదంపతులను స్మరించి మనసుతో ఆ ఆనంద తాండవాన్ని తిలకించండి.
అప్పుడు మనకి లభించేది సత్ + చిత్ ఆనంద మోక్షపురి. అదే ఉజ్జయిని, (విజయవంతమైన) మహాపురి, శివపురి.

పీఠికాయాం పురుహూతికా:
అది అందమైన తల్లి పీఠము. బంగారు తల్లి పేరు పురుహూతికా దేవి. ఆ బంగారు తల్లిని చేపట్టినవాడు కుక్కుటేశ్వరస్వామి. పిఠపురం అనాదిగా శ్రీ కుక్కుటేశ్వర స్వామి క్షేత్రం. ఎందుకంటే ఇక్కడి శివలింగం కుక్కుటాకారంలో ఉంటుంది. కుక్కుటమనగా కోడి. పైగా ఏలముని యోగానికి సారమైనది. అత్యద్భుతమైన మహితమలకు ఆలవాలమైనది. పాదగయ అని ఇక్కడి ప్రాంతానికి మరోపేరు. ప్రప్రథమంగా దేవేంద్రునిచే ఆరాధించబడిన పుణ్యక్షేత్రం ఈ పిఠాపురం.

ఈ పిఠాపుర క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి నుండి 60కి||మీ|| దూరంలోను మరియు కాకినాడకు 18 కి||మీ దూరంలోను ఉంది.

భీహారులో ఉన్న ప్రదేశాన్ని “విష్ణుగయ” లేదా “శిరోగయ” అని, పాదాలు పిఠాపురంలో ఉన్నందున ఆ ప్రదేశానికి “పాదగయ” అనే పేరు వచ్చింది. అలా శివ, శక్తి, విష్ణు పీఠాలతో పవిత్రమైన ఈ పిఠాపురం మంగళప్రద మహాత్మ్యలకు ఆలవాలమై ఉన్నది.

సత్ చిదానంద శక్తి క్షేత్రమైన ఈ పిఠాపురం దర్శనం పరమం పవిత్రం !

ఓం శ్రీ కుక్కుటేశ్వర సమేత శ్రీ పురుహూతికాయై నమః


ఓఢ్యాణే గిరిజా దేవి:

ఆత్మయే శంకరుడు. బుద్ధియే గిరిజాదేవి. కావున జగద్గురు ఆదిశంకరాచార్యులవారిలా “గిరిజా శంకరులను” స్తోత్రంతో అర్చించారు. “ఆత్మాత్వం గిరిజా మతిః పరిచరాః ప్రాణాః శరీరం గృహం పూజతే విషయోప భోగ రచనా నిద్రా సమాధి స్థితిః సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వాగిరో యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధన్‌ం “.

“శంభో! నా ఆత్మవు నీవు, నామతి గిరిజాదేవి, పంచప్రాణాలు నీకు పరిచారికలు, శరీరము అనే ఈ గృహంలో మీ ఆదిదంపతులను నిలిపిన. నాకు ఏఏ విషయోప భోగాలందాసక్తి కలదో అవన్నీ నీకు నిత్యపూజలు, నా నిద్రా స్థితి నీ ధ్యాన సమాధి స్థితి. నా పాదాలు భూమిని సంచరించినదంతా నీకు భక్తి ప్రదక్షిణలు. నే పలికే ప్రతి పలుకు నీ స్తోత్ర గానాలే నేను ఏఏ కర్మలొనర్చినా అవి నీకు ఆరాధనలే. కనుక నిత్యం నీపై నుండి దృష్టి మరలని వరమీయి” అని ప్రార్థించారు. మనము కూడా మన తనువును “శక్తి ఆలయం”గా మలచుకొని బుద్ధి అనే అర్చనతో “శక్తి”నుపాసించి మనసు “శక్తి” దక్షిణగా ఇచ్చినచో “శక్తి” సంపన్నులమౌతాము.

గిరిజ అనగా గిరి (హిమవంతుడు)కి జనియించినది. జన్మించినది మొదలు జటధారిపై మనసు నిలిపి ధ్యానంతో కొలిచేది.

విరజానది పాపులను పుణ్యలను చేసే పావన జల ప్రవాహం. ఓఢ్యాణము అనగా ఓడ్రదేశము. అదే నేటి ఒరిస్సా రాష్ట్రము. ఈ రాష్ట్రంలోని కటక్ సమీపంలో వైతరిణి నది ఉన్నది. ఈ నదీ తీరంలో వైతరిణి అనే గ్రామం కూడా ఉంది. ఇప్పటి ఒరిస్సాలోని జాజ్‌పూర్ రోడ్‌కి సుమారు 20 కి|| మీ|| దూరంలో ఉంది ఓఢ్యాణము.

ద్రాక్షారామ మాణిక్యాంబ:

రక్షమాం ద్రాక్షారామ పురవాసినీ – భీమే శురాణీ
పాలయమాం గోదావరీతటి వాసినీ – శక్తి స్వరూపిణీ

మాణిక్యాంబ … ఆహా ! ఎంత చల్లని పేరు. అంబ అనగా అమ్మ, మాణిక్యముల వంటి చిరునవ్వులు చిందిస్తూ ఆప్యాయతలందించే అమృతమూర్తి. సతీదేవి “కణత” పడిన శక్తి ప్రదేశమై భీమేశ్వరుడు, మాణిక్యాంబ ఒకేసారి స్వయం ప్రతిష్ఠ పొందిన ప్రదేశమే ద్రాక్షారామం. ఈ ప్రాంతాన్నే “త్రిలింగ” పిఠం అంటారు. ఆంధ్ర ప్రదేశ్‌లో శ్రీశైల, శ్రీకాళహస్తి, ద్రాక్షారామ క్షేత్రాలను మూడింటిని కలిపి “త్రిలింగ దేశం” అంటారు. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకు 32 కి||మీ|| దూరంలో, రాజమండ్రికి 60 కి||మి|| దూరంలో ఉన్న ఈ ద్రాక్షారామ శక్తి పీఠాధినేత్రి మాణిక్యాంబ, స్వయంభూ లింగాకారుడు భీమేశ్వరుడు, దక్షుడు యాగం చేసిన ప్రదేశం కనుక దక్షారామమయింది.

పంచ భూతాకారమైన ప్రపంచానికి పంచముఖేశ్వరుడు మించి సిద్ధినందుటకు జనులకందించిన పంచాక్షరీ ప్రణవ నాదమే “ఓం నమః శివాయ ” అన్న మంత్రం.

దక్షప్రజాపతి యజ్ఞ చేసిన ప్రదేశం కనుక “దక్షారామం” అని మిక్కిలి ద్రాక్ష తోటలుండటం వలన “ద్రాక్షారామం” అని పేరు వచ్చింది. “ద్రాక్షారం” అనే మరోపేరు కూడా కలదు. ఇక్కడ శంకరుడు “భీమేశ్వరుడై” స్వయంభువుడై వెలిశాడు. కనుక శక్తి ఈశ్వరుల సంగమస్థానమే ఈ ద్రాక్షారామం.

ఈ ప్రాంతాన గోదావరీ నదికి “సప్త గోదావరమని” పేరు.

తెలుగు వెలుగుల పదమునకు సత్యపదమై అమరేవిధంగా అక్షర సత్య నిరూపణ చేసిన భీమ కవి ఈ భీమేశ్వర మాణిక్యాంబలను సేవించి, అక్షర శక్తిని సంపాదించాడు.

ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో రెడ్డిరాజులు నిర్మించారు. ఊరిమధ్యనగల ఈ ఆలయం 3 ప్రాకారాలతో , 4 గాలిగోపురాలతో శివభక్తితో ధీటుగా నిలచింది. జగద్గురు శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన ఈ శక్తి స్వరూపిణి మాణిక్యాంబాలయం, స్వయంభూ భీమేశ్వరాలయం యొక్క విశిష్ఠత చేరి కొలవవలెనే గాని చెప్పనలవికాదు. శివోహం !

హరిక్షేత్ర కామరూపా దేవి:
హరిక్షేత్ర కామరూపాదేవి వందనం, అభివందనం. నీలాచలవాసినికి నిత్యాభివందనం. అంటూ కామరూపాదేవి అనబడే కామాఖ్యా దేవిని నిత్యార్చనల స్తుతిస్తూ ఉంటారు. ఈ కామాఖ్యదేవి కన్యక అని, పెళ్ళికాని పిల్ల కనుక కామరూపి అని ఆర్యోక్తి. సమానంగా లేని కొండప్రాంతం కనుక “అసమ” అన్న నాటి పేరు నేటి అస్సాంగా మారింది. నీలాంచలమున గల ఈ క్షేత్రానికి దగ్గరగా బ్రహ్మపుత్రానది కలదు. సతీదేవి యొక్క “యోని” భాగం ఈ పర్వతం మీద పడింది. ఈ ప్రాంతం హిమాలయాలకు దగ్గరగా వున్నది. ఇక్కడే వున్న నీలాంచల పర్వతం విష్ణుస్వరూపంగా భావించబడుతోంది కనుక ఇది హరిక్షేత్రమయింది.

కాముడికి ఖ్యాతి వచ్చిన క్షేత్రం కనుక ఆ క్షేత్రాన్ని “కామాఖ్యా క్షేత్రమని” కాముడికి మళ్ళీ జీవం వచ్చింది కనుక కామరూప క్షేత్రమని పిలచేవారు. ఆ తల్లిని కామరూపాదేవిగా అర్చించేవారు.

13వ శతాబ్దంలో బిష్వసింహుడు, శివసింహుడు అనే రాజ యువకులు అడవిలో తప్పిపోయిన తమ సైన్యం గురించి వెతుకుతూ, నీలాచల పర్వతం చేరి అక్కడ ఒక జ్వాల ఆ ప్రక్కన ఒక ముసలమ్మ కనిపించగా తమ దాహం తీర్చమని అడిగారు రాకుమారులు. వారికి బ్రహ్మకుండం చూపింది ములసమ్మ.

ఆ బ్రహ్మకుండంలోని నీరుతాగి సేదతీరిన రాకుమారులు అవ్వా! ఆ జ్వాల ఏమిటి? ఒంటరిగా ఎందుకున్నావని అడుగగా అది కామాఖ్యక్షేత్రమని, కూలిపోయిన గుడిని పునర్నిర్మిస్తే మీ కోరిక తీరుతుందని ముసలమ్మ తెలుపగా… ‘బంగారు గుడి కట్టించలేని అశక్తులము, ఇటుక ఇటుక మధ్యన బంగారు పలుకు వేసి కట్టిస్తాం… మమ్ము క్షమించి అనుగ్రహించమని ప్రార్థించగా… తల్లి ఆనందించి ఆశీర్వదించింది. అందుకే అంటారు అమ్మ వాత్సల్యానికి మించిన అనుగ్రహం లేదని. అమ్మ అనుగ్రహంతో ఆలయ నిర్మాణం పూర్తిచేసి నిత్యార్చనలకై అర్చక కుటుంబాలను ఏర్పరిచారు.

పిమ్మట కాలగతంలో శిథిలమైన ఆలయాన్ని పునరుద్ధరించేందుకు 16వ శతాబ్దంలో నరనారాయణుడు, చిలారై రాజసోదరులు నడుంకట్టారు.

ఈ ఆలయం సమీపంలోగల “ఉర్బసీ కుండం”లో స్నానమాచరించి కామాఖ్యా ఆలయంలో ప్రవేశించాలి.

మరో విశేషమేమిటంటే “అంబూషి మేళ”గా పిలువబడే సమయంలో అమ్మవారికి కట్టిన వస్త్రాలు ఎర్రబడతాయి. మృగశిరకార్తెవెళ్ళి ఆర్త్రకార్తె ప్రవేశించేవేళ, భూమి రజస్వలవుతుందని దేవీ భాగవతంలో ఉంది. ఈ సమయంలో 3 రోజులపాటు అమ్మవారి ఆలయాలను, చుట్టుపక్కల ఆలయాలను మూసివేస్తారు. నాల్గవరోజున అమ్మవారికి తలంటిపోసి ఆలయ సంప్రోక్షణ జరిపి అమ్మవారి దర్శనం కోసం ఆలయం తెరుస్తారు. 


కామాఖ్యాదేవి ఆలయం చుట్టుపక్కల ఏడుగురు అమ్మవార్ల ఆలయాలున్నాయి. అవి : 1. కాశి, 2. తార, 3.భువనేశ్వరి, 4.భైరవి, 5. చిన్న మస్తా, 6. భగళీ, 7.ధూమావతి 
ఆలయాలతోపాటు 1. కామేశ్వర, 2. సిద్ధేశ్వర, 3.కోటిలింగ, 4. అఘోర, 5. అమృతేశ్వర అనే పంచశివాలయాలున్నాయి.

ఈ క్షేత్ర సందర్శకులకు నిత్యమూ మహిమా చూపి ఆదరిస్తున్న బంగారు తల్లి కోర్కెలు తీర్చే కామాఖ్యమాత అనడంలో ఎటువంటి సందేహం లేదని ఎందరో భక్తులు కొనియాడుతున్నారు.

ప్రయాగే మాధవేశ్వరి:
“ప్ర” అనగా గొప్ప. “యాగ” అనగా యాగము. కావున గొప్ప యాగము చేసిన ప్రదేశమైనందు వలన ఈ ప్రదేశమునకు “ప్రయాగ” అను పేరు వచ్చినది.

పూర్వం గంగా యమునల మధ్య సరస్వతీదేవి నది కూడా ప్రవహిస్తూ ఉండేది. గంగా నదిని “ఇడానాడి” గానూ, యమునానదిని “పింగళానడి” గాను, సరస్వతీ దేవిని “సుషుమ్నా నాడి”గా భావించి ఎందరో మహర్షులు, దేవర్షులు, ఈ సరస్వతి నదీ ప్రాంతంలో నివసించేవారు. సరస్వతి నది ఉన్నంతకాలం గంగానదికి ప్రాచుర్యం లభించలేదు. సరస్వతి నది అంతర్వాహిని అయిన తరువాత గంగానదికి విశేష ప్రాచుర్యం లభించింది. ఈ క్షేత్రాన్ని త్రివేణి సంగమక్షేత్రమని పిలిచేవారు.

బ్రహ్మ యాగాలు చేసిన ప్రదేశం కనుక “ప్రయాగ క్షేత్రమని” ఆ క్షేత్రానికి పేరు వచ్చింది.

ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఈ ప్రయాగ క్షేత్రం వుంది. సతీ దేవి హస్తాంగుళీయం ఇక్కడ పడింది.

ప్రతి 12 సం||లకొకసారి ఈ ప్రయాగ క్షేత్రంలో కుంభమేళా ఉత్సవం జరుగుతుంది. మరియు జీవకోటికి ప్రత్యక్షసాక్షి అయిన సూర్యభగవానుడు పూజించినందువల్ల భాస్కర క్షేత్రమని మరోపేరు కూడా ఈ ప్రయాగ క్షేత్రానికి వచ్చింది. కొంత కాలానికి సరస్వతీ నది అంతర్వాహినిగా ఉండిపోయింది.

ఈ క్షేత్రంలో సతీదేవి చేతివేలు పడింది. కావున ఇది ఒక శక్తి క్షేత్రంగా పూజలందుకుంటోంది. అక్బరు నిర్మించిన కోటలో అనాదిగా ఒక వటవృక్షం ఉంది. దాన్ని “అక్షయ వటము” అని పిలుస్తారు. ఈ వటవృక్షం శ్రీహరికి గొడుగుగా ఉంటుందని పురాణ సారం.

ఈ క్షేత్రంలో ముందుగా గంగాస్నానం చేశాక తరువాత యమునలో విడివిడిగా స్నానం చేయాలి. తలనీలాలర్పించటం అనేది ఈ సంగమస్థానంలో ఒక విశిష్ఠత. పురుషులు తలనీలాలు, స్త్రీలు జడ కొసలు ఈ నదీమ తల్లికి సమర్పిస్తారు.

గయాక్షేత్రంలో పిండ ప్రదానం ఎంత ప్రశస్తమో, గయ తరువాత పిండ ప్రదానానికి అంత ప్రాముఖ్యత కలిగినదీ ప్రయాగ. గంగా, యమునల మధ్య గల భూభాగమంతా పరమ పవిత్రమైనది మనం ప్రతిరోజూ చేసే సంధ్యా వందనంలో ఉంటుంది. దానికి కారణమేమంటే గంగా, యమునల మధ్య భూమి దేవతకు నడుము. ఆ నదుల సంగమ స్థానం భూదేవికి ఒడి. తల్లి ఒడిలో లాలన పొందే శిశువులను ప్రేమించినట్లు ప్రేమతో లాలించే పవిత్ర పావన “మాతృక్షేత్రం” ఈ ప్రయాగ.

ఈ క్షేత్రం చేరుకున్నా దూరం నుంచైనా స్మరించి, ఇక్కడి ఒంటికి పూసుకుంటే త్రివేణి సంగమ స్నాన ఫలం లభిస్తుంది. ఈ మాధవేశ్వరి శక్తి పీఠం వలననే ఈ మహత్మ్యం లభిస్తున్నదని పురాణ ప్రవచనం.

సితా సితే యత్ర తరంగ చామరే
నద్యో విభాతో ముని భాను కన్యకే
లాలాత పత్రం వట ఏవ సాక్షాత్
స తీర్ధ రాజో జయతి ప్రయాగః

తా|| గంగా తరంగాలు తెల్ల వింజామర వీచగా, యమునా తరంగాలు నల్లని వింజామర వీచగా అక్కడి “అక్షయ వటము” శ్వేతఛత్రంగా అలరారే రాజు చిహ్నలు గల ప్రయాగ, సకల తీర్థాలకు రాజు.

జ్వాలాయాం వైష్ణవీ దేవి:
జగజ్జేగీయమానమైన “జ్వాలాక్షేత్రం” శ్రీ వైష్ణవీ దేవి క్షేత్రం. సతీదేవి పుర్రెపడి నందువలన ఇది జ్ఞానక్షేత్రమని కూడా కొందరు భావిస్తారు. ద్వాపరయుగంలో మహాభారత యుద్ధానికి ముందు శ్రీ కృష్ణుని ఆదేశానుసారం ఈ జ్వాలాదేవిని విజయం కోసం అర్చించి అర్జునుడు వైష్ణవీదేవి దీవెనలు పొందాడని పురాణ కథనం.

కాశ్మీర్ రాష్ట్రంలోని జమ్ముకు 60 కి||మి|| దూరంలో కాలధరమనే పర్వత ప్రాంతం ఉంది. ఈ కాలధర పర్వతంపై వైష్ణవి మాత, జ్వాలా వైష్ణవిగా విలసిల్లుతోంది. కొందరు జమ్ము-కాశ్మిర్ రాష్ట్రంలో, కాట్రా దగ్గరలో గల వైష్ణోదేవి ఆలయమే ఈ “జ్వాలా ముఖి” ఆలయమంటున్నారు. అక్కడి దేవిపేరు కూడా వైష్ణవీ దేవియే కావటం వలన కూడా జనులు అభిప్రాయపడుంటారు.

పఠాన్ కోట నుండి జోగేంద్ర నగర్‌కు వెళ్ళే దారిలో, జ్వాలాముఖీ రోడ్ అనే రైల్వే స్టేషన్ ఉంది. అక్కడికి 20 కి||మి|| దూరంలో జ్వాలాముఖీ క్షేత్రం ఉంది. ఇదే అష్టాదశ శక్తి పీఠాలలోని “జ్వాలా ముఖీ” క్షేత్రం.

ఈ ప్రాంతంలో గల “కాలధరమనే” పర్వతంపై సతీదేవి నాలుక నిలువుగా పడినందువలన ఆ ప్రదేశంలో అప్పటి నుండి ఈ నాటి వరకు “అగ్నిజ్వాల” బయటకు వస్తూనే ఉంది. ఈ అగ్నిజ్వలనే జ్వాలాముఖియని, అమ్మవారిని జ్వాలాముఖీశ్వరీ దేవియని, జ్వాలాజీ అని భక్తులు పిలుస్తున్నారు, కొలుస్తున్నారు.

గయా మాంగల్యగౌరి:
సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్ద సాధకే|
శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే||

తా|| సర్వ మంగళప్రదమై.. మాంగల్యాను బంధం కలకాలం నిలపే శివనారి… మాంగల్య గౌరి… నారాయణ ప్రియసోదరియైన సర్వమంగళకు ప్రణతులర్పిస్తున్నాను.

భీహార్ రాష్ట్రంలోని పాట్నాకు సుమారు 74 కి||మి|| దూరంలో గల గయాక్షేత్ర శక్తి స్వరూపిణి మంగళగౌరి, సర్వమంగళ, విష్ణు సోదరియైన మాంగల్య గౌరి నిత్యానంద దాయినిగా వర ప్రదాయినిగా భక్తుల కోర్కెలు తీరుస్తోంది.

1. గయ : బిహార్ రాష్ట్రంలో ఫల్గుణీ నదీ తీరంలో “శిరోగయ”గా వెలసింది.

2. జాజాపూర్: ఒరిస్సా రాష్ట్రంలో వైతరణి నదీ తీరంలో వున్న ప్రదేశంను “నాభిగయ” అని అంటారు.

3. పిఠపురం: ఆంధ్ర ప్రదేశ్‌లో గయని పాదాలుండటం వలన అవి వున్న ప్రదేశం పిఠాపురాన్ని “పాదగయ” అంటారు.

4. గుజరాత్ రాష్ట్రంలో మహేషన జిల్లాలో సరస్వతీ నదీ తీరంలో గల ప్రాంతాన్ని “మాతృహయ” అని అంటారు. బిందు సరోవరమనే మరో పేరు కూడా కలదు. అహమ్మదాబాదుకు 32 కి||మి|| దూరంలో గల మాతృగయలో మాతృవంశం వారికి పిండప్రదానం మరింత ముఖ్యం. ఒరిస్సాలోని భువనేశ్వర్‌కి 33 కి||మి|| దూరంలో వున్న బిందు సరోవరం వద్ద కూడా పిండ ప్రదానాలు చేస్తారు.

5. బధరీనాథ్: ఉత్తర ప్రదేశ్‌లోని అలకనందా నదీ తీరంలో గల “బ్రహ్మకపాలం” అనే ప్రదేశాన్ని “పితృగయ” అంటారు.

గయాక్షేత్రంలో సతీదేవి యొక్క శరీర భాగం ఒకటి పడింది. కనుక శక్తి క్షేత్రముగా, ఇక్కడి అమ్మవారు సర్వమంగళాదేవిగా దేవతల, మునులచే పూజింపబడుచున్నది.

ఫల్గుణీ, మధుర, శ్వేత అనే 3 నదుల సంగమమై ప్రయాగ క్షేత్రంతో సమానమై ఫలం అందిస్తోంది.

ఈ ప్రాంతానికి బుద్ధగయ అనేపేరు కూడా కలదు. జన్మకు ఒకసారైన పితృదేవతలకు గయలో పిండప్రదానం చేయాలని ప్రతి హిందువూ కోరుకుంటారు.

సర్వమూ శాంతిని ఒనగూర్చే సర్వమంగళ అయిన మాంగల్య గౌరిని మనసారా ప్రార్థిస్తే… భక్తులనేగాక వారి పితృదేవతలను కూడా అనుగ్రహించే మంగళ గౌరికి, మహేశ్వరికి శతసహస్ర భక్తి వందనాలు మనసారా అర్పిద్దామా!

వారణాస్యాం విశాలాక్షి:
విశ్వమునేలు విశ్వజనని విశ్వేశ్వరుని రాణి విబుధ జనవాణి
వారణాసి ప్రాంత వాసిని ఆకొన్న వారి క్షుద్భాధ తీర్చే జనని
విశాలాక్షీ వందనం ! శివనారీ శరణం ! అన్నపూర్ణా వందనం !

మాతా! అన్నపూర్ణేశ్వరీ ! భిక్షాందేహి! అని పిలచినంతనే బిడ్డ ఆకలి తెలిసిన అమ్మవలె ఆదరించి అన్నపూర్ణాదేవి కొలువున్న కమనీయ క్షేత్రం వారణాసి. అంతేకాదు విశాలమైన అక్షములు (కనులు) గలది కావున విశాలాక్షి. ఆ తల్లి కొలువున్న శక్తి క్షేత్రం కాశీ. ఈ కాశీకే “వారణాసి” అను మరోపేరు కూడా కలదు. వరుణ, అసి అను రెండు నదులు కలసి ప్రవహించే ప్రదేశమే వారణాసి.

అయోధ్యా, మధురా, మాయా, అవంతికా, కంచి, కాశీ|
పురీ ద్వారవతీ చైవ సస్తైతా మోక్ష దాయకాః||

సప్త మోక్షపురులలో కాశీ కూడా విశిష్ఠ స్థానం గల శక్తి పీఠం మరియు జ్యోతిర్లింగ క్షేత్రం అయిన కాశీని ఆనంద కాననమని, మహాశ్మశానమని, శివానందక్షేత్రమని కూడా పిలిచేవారు. ఈ కాశి క్షేత్రం శివునికి కైలాసానికన్నా ప్రియమైన ప్రదేశమని కూడా అంటారు.

అన్నదానమే దీక్షగాగల మాతా అన్నపూర్ణేశ్వరీ! జ్ఞాన భిక్షాందేహి దేహిమే సదా||

కాశీక్షేత్రం, వేద విద్యలకు నిలయం, అక్కడ నిరంతరం శిష్యగణంతో వ్యాసమహర్షి నిత్య విశ్వేశ్వర, అన్నపూర్ణాంబికను ఆరాధించేవాడు కనుక “వ్యాసకాశి” అనికూడా ఈ క్షేత్రాన్ని పిలుస్తారు.


కాశ్మీరేతు సరస్వతి:

సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ|
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా||

అంటు మనం చదువు ప్రారంభించే ముందు చదువుల తల్లి సరస్వతీ దేవిని మనసారా ధ్యానిస్తాం. చదువుకు అధిష్ఠాన దేవత సరస్వతీదేవి. బ్రహ్మ ముఖం నుండి జనియించిన వాగ్దేవి బ్రహ్మవాణి అయింది. ఆ చదువుల తల్లిని, పుస్తక పాణిని, వాగ్విలాసినిని మనం నిత్యం కొలవాలి, స్మరించాలి.

మనిషికి, మృగానికి గల తేడాను తెలిపేది చదువే. అందుకే విద్య లేనివాడు వింత పశువు అన్నారు. మన సాహిత్య, విజ్ఞాన వైభవానికి సారస్వతమనే పేరు వచ్చింది సరస్వతీ దేవి వల్లనే. వాక్సుద్ధిని, వాక్సిద్ధినీ అనుగ్రహించే శారదాంబను మనసారా తలుచుకున్న తరువాతనే కవులు, విద్యార్థులు కలం చేతబడతారు.

ఈ సరస్వతీ దేవి ఆలయం కాశ్మీరంలో ఉందని పురాణేతిహాసాల నిర్వచనం. కానీ ఈ ఆలయం ఇప్పుడు కాశ్మీరంలో లేదు. కాని కాశ్మీర్‌లో కొంతమంది సరస్వతిని కీర్ భవానీగా కొలుస్తారు. ఆ కీర్ భవాని ఆలయం శ్రీనగర్‌కు పది కిలో మీటర్ల దూరంలో వుంది. భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన 2 సరస్వతుల ఆలయాల్లో ఒకటి కాశ్మీరం, రెండవది బాసరలో వుందని పెద్దలు చెబుతారు. సతీదేవి కుడి చెంప భాగం ఈ కాశ్మీరంలో పడిందని ఆర్యుల ఉవాచ.

నమస్తే శారదాదేవి, కశ్మీర పుర వాహిని|
త్వా మహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహిమే||

తా|| కాశ్మీర పురంలో నివసించే శారదా దేవీ! నేను నిన్ను ఎల్లప్పుడూ భక్తిపూర్వకంగా ప్రార్థించెదను. నాకు విద్యాదానం చేసి కటాక్షించు జనని!

మాఘ శుద్ధ పంచమి సరస్వతీ దేవి జన్మదినం. అందుకని ఆనాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు.

కర్ణాటక వద్ద గల శృంగేరిలో శంకరాచార్యుల వారు సరస్వతీదేవి ఆలయానికి రూపకల్పనచేసి ఒకరాతిపై శ్రీ చక్రయంత్ర స్థాపన చేసి సరస్వతి చందనపు విగ్రహ ప్రతిష్ఠ చేశారు.

శ్రీనగర్‌లోని సరస్వతీ దేవి ఆలయానికి శతాబ్దాల చరిత్ర వుంది. హిమగిరిపై వెలసిన శారదాదేవిని “కల్వణుడు” తన “రాజతరంగిణి” అనే గ్రంథంలో ప్రస్తావించాడు. మాతంగ మహర్షి కుమారుడైన శాండిల్యముని ఈ చోటనే సరస్వతీ సాక్షాత్కారం పొందాడు.

“మూకం కరోతి వాచాలం” అనగా “అక్షర జ్ఞానంలేని అజ్ఞానిని సైతం విజ్ఞాన ఖనిగా మార్చే శక్తి” శారదాంబది. దీనికి ఉదాహరణగా “కాలుడు” అనే గొర్రెల కాపరి నిరక్షర కుక్షి, అమ్మ అనుగ్రహంతో “మాణిక్యవీణా ముఫలాల యంతీం, మదాలసాం మంజుల వాగ్విలాసాం, మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి” అని ప్రార్థన చేసి ఆ తల్లి దీవెనతో మేఘ సందేశం, రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం వంటి కావ్యరచనా మేధావిగా మారిన కవి కాళిదాసు.నిజంగా సరస్వతీ దాసుడే.

కాశ్మీరంలో సరస్వతి ఆలయం లేకున్నా ప్రతి మనసు సరస్వతి ఆలయం కావాలి. అజ్ఞానాన్ని వదలి విజ్ఞనం పెంచుకుని ప్రతి ఒక్కరూ సత్య సఖ్యతతో, ఇక్యతతో వసుదైక కుటుంబమై మెలగాలి.

ఓం సరస్వత్యై నమోనమః

సృష్టి స్థితి లయస్వరూపిణి ఆదిపరాశక్తి జగన్మాత శ్రీదేవి. ఆ జగన్మాత లీలలను వర్ణింప ఎవరికీ శక్యముకాదు. దుష్టశిక్షణ శిష్ఠ రక్షణ చేసే ఆదిపరాశక్తిని అభివందన చందన చర్చల సేవలతో నిత్యం మరియు దేవి నవరాత్రులలో భక్తిశ్రద్ధలతో సేవిద్దాం.


అష్టాదశ శక్తి పీఠాలు
హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి. 18 అనీ, 51 అనీ, 52 అనీ, 108 అనీ వేర్వేరు లెక్కలున్నాయి. అయితే 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారు.

ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.


లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్
అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిలో నాలుగు శక్తిపీఠాలు తెలుగు రాష్టాలలోనే ఉండటం విశేషం. అవి శ్రీశైలం, పిఠాపురం, ద్రాక్షారామం(ఆంధ్రప్రదేశ్), అలంపురం(తెలంగాణ). మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా దేశం వెలుపల కూడా మరో రెండు శక్తిపీఠాలున్నాయి. అందులో ఒకటి శ్రీలంకలోనూ మరొకటి ప్రస్తుత పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఉంది. ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలూ(గయ-శిరోగయ, పిఠాపురం-పాదగయ, జాజ్‌పూర్‌-నాభిగయ) రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలూ (శ్రీశైలం, ఉజ్జయిని) ఉండటం మరో విశేషం. ఆ క్షేత్రాల గురించిన వివరాలు... 

1. శాంకరీదేవి
లంకాయాం శాంకరీదేవి అంటే మునులూ రుషుల లెక్కప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్యరేఖకు సున్నాడిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)లోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది.

2. కామాక్షి
సతీదేవి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలూ చెరకుగడ, భుజంపై చిలుకతో పద్మాసనస్థితయై కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరిసంపదలూ కలుగుతాయని ప్రతీతి. స్థలపురాణం ప్రకారం... మహిషాసురుణ్ని సంహరించిన చాముండేశ్వరీదేవి ఆ పాపాన్ని తొలగించుకునేందుకు ఏంచేయాలని శివుణ్ని అడగ్గా నేటి కంచి ప్రాంతంలో అన్నపూర్ణగా వెలసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని చెప్పాడట. అలా ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు. ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ని వివాహం చేసుకుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో... ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆ ఆదిపరాశక్తి యోగపీఠంగానూ కామాక్షీదేవి ఆలయాన్ని భోగపీఠంగానూ భావిస్తారు భక్తులు.

3. శృంఖల
అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నదని కొందరూ కోల్‌కతకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న 'చోటిల్లామాత'ను అక్కడివారు శృంఖలా(శృంగళా)దేవిగా భావిస్తారు. కానీ... పశ్చిమబెంగాల్‌లో ఉన్న 'పాండువా'నే అసలైన శక్తిక్షేత్రం అని అత్యధికులు విశ్వసిస్తారు. అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ 'మేళతాళ' పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం.

4. చాముండి
హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు వూడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.

5. జోగులాంబ
మనరాష్ట్రంలోని నాలుగు శక్తిపీఠాల్లో వెుదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు/దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు. ఆలయంలోని గర్భగుడిలో ఆసీనముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి (సరస్వతీదేవి), వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి.

6. భ్రమరాంబిక
విష్ణుచక్రభిన్న అయిన సతి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు... ఇక్కడ కొలువైన సతి 'శక్తి' భ్రమర(తుమ్మెద) రూపంలో అవతరించిందట. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన 'సౌందర్య లహరి' కూడా రచించారని చెబుతారు.

7. మహాలక్ష్మి
రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి 'అంబాబాయి'గా కొల్హాపూర్‌ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్‌ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు. కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయకాలంలిో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్ని వీడదని పురాణప్రతీతి. అందుకే కొల్లాపూర్‌ను 'అవిముక్త క్షేత్రం'గా వ్యవహరిస్తారు.

8. ఏకవీరాదేవి
మహారాష్ట్రలోని నాందేడ్‌ సమీపంలోని మాహోర్‌ క్షేత్రంలో వెలసిన తల్లి ఏకవీరికాదేవి. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక. దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు. ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి. అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రిమహర్షి, అనసూయాదేవిని ప్రతిష్ఠించారు. మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది. మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది. అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు.

9. మహాకాళి
సప్త వోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయినీ నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉజ్జయినీ మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం కూడా.

10. పురుహూతిక
పురాణ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటోంది. ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి( కుడివైపు చేతుల్లో)... తామరపువ్వు, మధుపాత్ర (ఎడమ చేతుల్లో) ఉంటాయి. ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుని శరీర మధ్యభాగం ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని నాభిగయ అంటారు. శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలసిన చోటు అదే.

11. గిరిజాదేవి
గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు. ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది.

12. మాణిక్యాంబ
సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామక్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడనీ స్థలపురాణం. ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరక్కుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకూ ఆయన పరివారానికీ అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీవిడిచిపెట్టి వెళ్లమన్నాడనీ అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందనీ పురాణప్రతీతి. ఉత్తరాది నుంచి వింధ్యపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్లు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు.

13. కామాఖ్య
అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారనీ స్థలపురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవికాలంలో మూడురోజులపాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి రుతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. ఈ ఆలయం కూచ్‌బేహార్‌ సంస్థానం పరిధిలోకి వస్తుంది. కానీ ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం. అందుకే ఆ వంశానికి సంబంధించిన వారెవరూ కామాఖ్యాదేవి గుడిలో అడుగుపెట్టరు. కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు.

14. మాధవేశ్వరి
అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బిందుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమనీ... సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమనీ వ్యవహరించడం కద్దు.

15. సరస్వతి
పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నేటి ముజఫరాబాద్‌కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యం ద్వారా తెలుస్తోంది.

16. వైష్ణవీదేవి
అమ్మవారి నాలుక హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజవాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికీ శక్తికీ సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మరికొందరు... 'జ్వాలాయాం వైష్ణవీదేవి' అంటే అది ఈ గుడి కాదనీ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమనీ చెబుతారు.

17. మంగళగౌరి
సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. ఇక... పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు. ఇక్కడి తీర్థం ఫల్గుణీనది. ఆ నదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు.

18. విశాలాక్షి
సతీదేవి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి.No comments:

Post a Comment