Sunday, 5 October 2014

హిమగిరి సొగసుల నడుమ నేపాల్

హిమగిరి సొగసుల నడుమ నేపాల్

మంథా భానుమతి.
ఉపోద్ఘాతం -
ప్రపంచంలో ఏకైక హిందూ రాజ్యంగా పేరుపొందిన నేపాల్ అందాలని సందర్శించాలని వేలాదిగా సందర్శకులు ఆరాట పడుతుంటారు. మేము కూడా ఉత్సాహంగా బయలుదేరుదామని నిశ్చయించుకున్న వెంటనే ముందుగా.. ఆ ప్రదేశం గురించిన అవగాహన ఉండాలని శోధన మొదలు పెట్టాను. అనేక కథలు, కథల్లాంటి నిజాలు కంట పడ్డాయి. వాటిని మా యాత్రా విశేషాలతో సహా పంచుకోవాలనేదే ఈ చిన్ని ప్రయత్నం.

హిమవత్పర్వత పాదాల వద్ద పరచుకున్న నయపాల దేశం గురించి ప్రధమంగా అధర్వణ వేదంలో ప్రస్థావన కనిపిస్తుంది.

హిమగిరి సొగసులు.

ఇరువైపులా రక్షణ కల్పిస్తున్నట్లున్న పర్వత శ్రేణుల మధ్య లోతు తెలియని విశాలమైన తటాకం.. ఆ పర్వత శిఖరాలపై తపస్సులో నిమగ్నమైన ఐదుగురు ఋషులు.. విపశ్వి, శిష, విశ్వవిభు, ఋక్ చంద, కనకముని. విపశ్వి చేతిలో తామర పూసల మాల మంత్రోచ్ఛారణ కనుగుణంగా నిర్విరామంగా తిరుగుతోంది. సమస్త నాడులనూ కేంద్రీకరించి మంత్రం మీద దృష్టి నిలిపిన విపశ్వి ఉలిక్కిపడి కన్నులు తెరిచారు. ఉచ్ఛారణ ఆగిపోయింది. కలవరంతో కన్నులు తెరిచిన విపశ్వి కన్నులలోకి దేదీప్యమానమైన కాంతులు చొచ్చుకుని వచ్చాయి. మాల తెగిపోయింది. మాలనుండి తెగి పడిన తామరపూస తటాకం మధ్యన పడి నాటుకుపోయింది. ఆ తామరపూస నుండి జ్యోతిర్మయమైన లింగం ఆవిర్భవించింది. ఆ జ్యోతి కాంతులే విపశ్వి కళ్ళను చురుక్కుమనేట్లు చేశాయి. విపశ్వి మరలా తపస్సమాధిలోకి వెళ్ళిపోయారు. దేదీప్యమైన కాంతులు వెదజల్లుతూ ఆ జ్యోతిర్లింగం తటాక మధ్యమున నిలిచి ఉంది.

చీనా దేశీయుడైన ‘మహామంజుశ్రీ’ ఆ జ్యోతిర్లింగాన్ని చూసి, “కటవాల్” అనే ప్రదేశం నుంచి తటాకంలోని నీటిని తోడివేశారు. ఆ ప్రదేశమే.. క్రమంగా కాఠమండు గా పిలవబడి.. కాలక్రమేణా “ఖాట్మండు” గా మారింది. ఆ జ్యోతిర్లింగమే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పశుపతి నాధుడు. అదే ఖాట్మండూ ఇప్పటి నేపాల్ రాజధాని. పశుపతినాధుడు వెలువడిన క్షణం నుంచీ ఖాట్మండూ ఆవాస యోగ్యంగా మారింది. క్షత్రియ రాజుల పాలన మొదలయింది. చారిత్రాత్మక ఆధారాలు కిరాట రాజుల వంశం నుంచీ ఉన్నా, రామాయణంలో జనకుడు పాలించిన విదేహ రాజ్యం, సీతమ్మ జన్మస్థలమైన మిథిలా నగరం నేపాల్ లోనే ఉన్నట్లు చెప్పబడింది. చిట్వాన్ నేషనల్ పార్క్ లోని వాల్మీకి ఆశ్రమం కూడా రామాయణ కాలంలో నేపాల్ ఉనికిని ధృవ పరుస్తుంది. జనకుని సోదరుడైన కుశధ్వజుడు ఖాట్మండు ప్రాంతాన్ని పాలించాడు. ఇది త్రేతాయుగం నాటి మాట.

ద్వాపర యుగంలో మళ్ళీ ఖాట్మండు నీటిలో మునిగిపోయింది. చుట్టుముట్టూ మంచు పర్వతాలు.. మంచు కరిగి లోయలోకి ప్రవహించడం ప్రకృతి సహజమే కదా! బాణాసురుడనే రాక్షసుడు ఆ నీటిలోనే నగరాన్ని నిర్మించుకుని నివసించసాగాడు. శ్రీకృష్ణుడు బాణాసురుడ్ని సంహరించి చోఖాక్ అనే ప్రాంతం దగ్గర నీటిని తోడించి తన వెంట వచ్చిన యాదవుడ్ని రాజుని చేశాడు. యాదవ వంశ గోపాలురు, “గుప్తులు’ అనే పేరుతో 490 సంవత్సరాలు, 82 మంది రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. వీరిలో చివరి గుప్తుడ్ని ఓడించి మహిషపాలురు, రాజపుట్ వంశీయులు రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు. ఈ రాజపుత్రులలో ‘భూల్ సింగ్’ పేరు మాత్రం కనిపిస్తుంది.

క్రీ.పూ.840 లో కిరాత వంశానికి చెందిన ‘యలమవర’ నేపాల్ సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతను మహాభారత యుద్ధ సమయంలో కౌరవుల పక్షాన్ని చేరదామనుకుంటే శ్రీకృష్ణుడు తెలివిగా యుద్ధానికి ముందే అతన్ని సంహరించాడని చెప్తారు.

శాక్య రాజైన శుద్ధోధనుడు నేపాల్ లో కొంత భాగాన్ని కపిలవస్తు రాజధానిగా పాలించాడు. అప్పుడే క్రీ.పూ. ౫౬౩లో గౌతమ బుద్ధుని జననం.. అతను రాజ్యాన్ని పరిత్యజించి బౌద్ధ మతాన్ని స్థాపించడం జరిగింది.

ఏడవ కిరాటరాజు జితేదాస్ కాలంలో బోధి వృక్షం (బుద్ధగయ, ప్రస్థుత బీహార్) కింద జ్ఞానోదయం పొందిన గౌతమ బుద్ధుడు ఖాట్మండు వచ్చినట్లు ఆధారాలు లభించాయి. జైన్ ఆచార్యుడు భద్రబాహు, అశోక చక్రవర్తి కూడా నేపాల్ వచ్చినట్లు తెలుస్తోంది.

క్రీ.శ్. ౨౦౦ లో లిచవి రాజవంశీయులు కిరాటరాజుని ఓడించి నేపాల్ ను కైవశం చేసుకున్నారు. అప్పుడే వివిధ దేవాలయాల నిర్మాణం జరిగింది. ప్రసిధ్ధి చెందిన పశుపతినాధుని మందిరం పగోడా ఆకారంలో వీరే నిర్మించారు. వీరి తరువాత కుశీనగర పాలకులైన మల్లవంశ రాజులు నేపాల్ పశ్చిమ ప్రాంతంలోని గండకీ నది వరకూ రాజ్యాన్ని విస్తరించి పాలించారు. వీరి వారసులందరూ రాజ్యాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టారు. వీరి అంతఃకలహాలు నేపాల్ రాజ్యాన్ని శాహ వంశ రాజైన పృధ్వీనారాయణ శాహు వశం చేశాయి. ఇతని పూర్వీకుడైన ద్రవ్యశాహు గోర్ఖా రాజ్యాన్ని స్థాపించాడు. పృధ్వీనారాయణ శాహు నేపాల్ నంతనీ ఒకే రాజ్యం కింద తెచ్చి ఒకే పాలన చేశాడు.

శాహ రాజులని నామమాత్రంగా చేసి 1846 లో జన్గ్ బహదూర్ కున్వార్ ముప్ఫై మంది రాజప్రసాద వాసులని చంపి ప్రధానమంత్రిగా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నాడు. రాజా మహేంద్ర, రాజా జ్ఞానేంద్ర రాణాల చేతుల్లో కీలుబొమ్మలయిన శాహ వంశీయులే. పెళ్ళి సంబంధాల ద్వారా బంధుత్వాలు కలుపుకుని రాణాలు 1990 వరకూ నేపాల్ ని పాలించారు. ఆ తరువాత ప్రజల పాత్ర, కమ్యూనిస్టుల విప్లవాలు నేపాల్ లో ప్రజాస్వామ్యానికి నాంది పలికాయి. జూన్ 1, 2001 నాడు రాజకుమారుడు దీపేంద్ర తల్లిదండ్రులతో సహా తన కుటుంబ సభ్యులందరినీ హత్య చేశాక జ్ఞానేంద్ర రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నాడు. దీపేంద్ర తాగుడు, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసై తనను, తన కుటుంబాన్నీ సర్వనాశనం చేసుకున్నాడు. ఏప్రిల్ ౨౦౦౬ నుండి నేపాల్ ప్రజాస్వామ్య రాజ్యంగా కొనసాగుతోంది. దేశంలోని దారిద్ర్యానికి, అభివృద్ధి నిరోధానికి కారణంగా చెప్పబడుతున్న రాచరికపు సామ్రాజ్యం అంతరించింది. ప్రకృతి అందాలకి ఆలవాలమైన నేపాల్ ప్రగతి పథంలో పయనిస్తుందని ప్రపంచం ఆశిస్తోంది.


మా నేపాల్ ప్రయాణం - ఖాట్మండూ

“హరేరామ హరేకృష్ణ” సినిమా చూసినప్పట్నుంచీ నేపాల్ వెళ్ళాలని అనుకుంటూ ఉండేవాళ్ళం. అందులో సీనరీలు అంత అద్భుతంగా ఉన్నాయి మరి. సదరన్ ట్రావెల్స్ ద్వారా మా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నాము. మేమిద్దరం, మా అక్కయ్య కొడుకు, కోడలు, మా పిన్నిగారబ్బాయి, అతని భార్య.. మూడు జంటలు. అందరం సీనియర్ సిటిజన్స్ మే. ముందుగా వారణాసి వెళ్ళి అక్కడ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని, ఒక రోజు బుద్ధగయ, గయ వెళ్ళి వచ్చాము. వారణాసి నుంచి ఎయిర్ ఇండియా వారి విమానంలో ఖట్మండు చేరాం. త్రిభువణ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం చిన్నదే కానీ సదుపాయంగా ఉంది. భారతీయులకి వీసా అవసరం లేదు. పాస్ పోర్ట్ ఒకసారి చూసి పంపేశారు.

సామాన్లు తీసుకుని బయటికి రాగానే ట్రావెల్స్ వాళ్ళు పంపిన వాన్ డ్రైవర్ మా కోసం ఎదురుచూస్తూ కనిపించాడు, చేతిలో కార్డ్ పట్టుకుని. మాకు వసతి ఇచ్చిన హోటల్ పేరు మౌంటెన్. రాజాగారి పాలస్.. ప్రస్థుత మ్యూజియమ్ కి దగ్గర్లోనే ఉంది. బైటికి రాగానే బజారు. వీధులన్నీ సన్నగా ఉన్నా, హైద్రాబాద్ లో కన్నా ట్రాఫిక్ జామ్ లు ఎక్కువున్నా శుభ్రంగా ఉన్నట్లుగా కనిపించింది.

హోటల్ కి వచ్చిన వెంటనే నేపాల్ లో మా ట్రావెల్ ఏజంట్ కిషోర్, గంట పైగా లాంజ్ లొ కూర్చోపెట్టి, అక్కడ చూడవలసినవన్నీ అతి నెమ్మదిగా వివరించాడు. అందరికీ జోల పాడుతున్నట్టయి కునుకు పట్టేసింది. ఎప్పటికీ ఆపకపోతుంటే మొహమాటం వదిలేసి “మేము గదుల్లో సర్దుకుని, కాస్త మొహాలు కడుక్కుని వస్తాము.” అని చెప్పేశాము.

ముక్తినాధ్ వెళ్ళాలంటే పర్మిట్ తీసుకోవాలి.. దానికి ఫొటోలు కావాలిట.

“మరి ముందు ఎందుకు చెప్పలేదు?” సుబ్బారావు (మా అక్కయ్య కొడుకు) అడిగాడు విసుగ్గా.

“మీకు పంపించిన టూర్ వివరాల్లో ఉంది. చూసుకోలేదా?” రిటార్ట్ వెంటనే. ఇంటి దగ్గర ట్రావెల్ ఏజంట్ కి కూడా తెలియదు కాబోలు.

“ఇంక నుంచీ ఎక్కడికి వెళ్ళినా అరడజను మన ముఖచిత్రాలు దగ్గర పెట్టుకోవాలి.. పంచి పెట్టడానికి.” సన్నగా గొణిగాను.

“ఎక్కడో చిన్న అక్షరాలతో అలుక్కుపోయి ఉంటే ఎలా కనిపిస్తుంది?” మా రాముడి ఘోష.

తప్పుతుందా.. ఫొటో స్టుడియోకి వెళ్లి మూడు వందలు నేపాలీ రూపాయలు సమర్పించుకుని ఫొటోలు తీసుకుని వచ్చాం.

పశుపతి నాధ్ ఆలయం
పొద్దున్నే లేచి స్నాదులన్నీ ముగించుకుని పశుపతినాధుని దర్శనానికి బయలుదేరాం ట్రావెల్ ఏజంట్ కిశోర్ పర్యవేక్షణలో. గుడికి నాలుగడుగుల దూరంలో ఉన్న ‘అగర్వాల్’ రుద్రాక్షల దుకాణంలో ఆగి, అక్కడ సెల్ ఫోన్లు, కామెరాలు వగైరాలు దాచి పెట్టుకుని (అవన్నీ ఆలయంలోకి నిషిద్ధాలు) టీ తాగి, గుడికేసి నడక మొదలుపెట్టాం. షాపు దగ్గరే ఒక పండితుడు వచ్చాడు “అభిషేకం, ఆ పిదప దర్శనం చేయిస్తాను.” అంటూ. కొత్త ప్రదేశం. అలాగే. రెండు వేలకి బేరమాడి రమ్మని చెప్పాం. మా వెంట వచ్చాడు.


తూర్పు వయిపు నుంచి పశుపతినాధ్ ఆలయ ద్వారం.


ఆలయ ప్రవేశం 
పవిత్ర భాగమతీ నదికి పశ్చిమంగా వెలసిన పశుపతినాధుడ్ని దర్శించడానికి నదిలో స్నానం చేసిన యాత్రీకులు తూర్పు ద్వారం నుంచి ప్రవేశించాలి. ప్రస్థుతం నీళ్ళు నామమాత్రంగా ఉండడంతో నేరుగా పశ్చిమ ద్వారం నుంచే వెళ్తున్నారు. ఆలయంలోనికి ప్రవేశించగానే దాదాపు ఇరవై అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల వెడల్పు, పది అడుగుల ఎత్తు ఉండే ఇత్తడిరేకు కవచం ఉన్న నంది దర్శనం ఇస్తుంది. ఈ నందికి నైఋతి దిశలో ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. నందికి ఎదురుగా రెండంతస్థులలో పగోడా శైలిలో, పై అంతస్థు చిన్నదిగా, కిందిది పెద్దగా నిర్మించబడిన ప్రధాన ఆలయం కనిపిస్తుంది. ఆలయానికి నలువైపులా పదకొండు అడుగుల ఎత్తుతో వెండితో నగిషీలు దిద్దిన నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయి.

పశుపతినాధ్ ఆలయానికి గర్భాలయం, అంతరాలయం, ముఖ మండపాలు చతురస్రాకారంలో ఉంటాయి. ముఖమండపం నుంచి ప్రదక్షిణలు చెయ్యచ్చు. అంతరాలయంలో లాగా, గర్భాలయానికి కూడా నాలుగు ద్వారాలున్నాయి. పంచముఖుడైన పశుపతినాధుని గర్భాలయంలో లింగాకారంలో నాలుగు వైపులా నాలుగు ముఖాలు, మధ్యగా పై భాగంలో లింగాకార ఊర్ధ్వముఖం ఉన్నాయి.

“సద్యోవామం తధాఘోరం తత్పురుషం చతుర్ధకం/
పంచమంతు తధేశానం యోగినామప్య గోచరం//

సద్యోజాత (బాలక), వామదేవ(అర్ధనారీశ్వర), అఘోర (రౌద్ర సంహార), తత్పురుష (శాంత) రూపాలతో శివుని నాలుగు ముఖాలు నలువైపులా ఉండి, యోగులకు కూడా గోచరం కాని ఐదవ ఊర్ధ్వ ముఖం ఆక్కడ లేకపోవడంపై శ్లోకం వివరిస్తుంది.

పొద్దున్న పన్నెండు గంటల వరకూ భక్తులు నిర్విరామంగా వస్తూనే ఉన్నారు. అభిషేకం చేయించిన ప్రత్యేక దర్శనంలో కూడా క్యూలో తోసుకుంటూ, పశ్చిమ ద్వారం నుంచే పరమశివుని దర్శనం కలిగింది. ఒక ముఖమే చూడ గలిగినప్పుడు, పైన వర్ణించిన నాలుగు రకాలు ఎలా ఉన్నాయో చూద్దాం అనే ప్రశ్నే లేదు.


ప్రద్యోషవేళ పశుపతినాధుని ఆలయం


కానీ.. తిరుగు ప్రయాణంలో సాయంత్రం హారతికి వెళ్ళి, అంతరాలయంలో ప్రవేశించి, నాలుగు వైపులా చూడగలిగాం. హారతి ఇచ్చినంత సేపూ, అరగంట పైగా ఉండడానికి అవకాశం కలిగింది. ప్రద్యోష సమయంలో పువ్వులతో అలంకరించిన స్వామిని హారతి వెలుగులో చూస్తుంటే అనిర్వచనీయమైన ఆనందంకలిగింది. అప్పుడు భక్తులు కూడా ఎక్కువమంది లేరు. ప్రశాంతంగా ఆలయప్రాంగణంలో చాలా సేపు గడిపి ప్రాకార దేవతల్ని కూడా దర్శించుకున్నాం. ఆలయానికి కుడి వేపు వాసుకి మందిరం, ముందు భాగాన ఆగ్నేయ దిశలో ముక్తి మండపం, దానికి కింది భాగంలో సంగమేశ్వర, విరూపాక్ష గంగాదేవి ఆలయాలు ఉన్నాయి.

దక్షిణం వైపు ఉన్మత్త భైరవ ఆలయం, దక్షిణ భారత ఆలయాలని పోలిన తాండవశివుని గుడి, బుడా నీలకంఠుని శయన విగ్రహం, లాల్ గణపతి మందిరం, సూర్యనారాయణమూర్తి మందిరం.. చిన్న చిన్న ఆలయాలు ఎన్నో ఉన్నాయి. చూడగలిగినన్ని చూసి, మిగిలిన దేవతలకి దూరం నుంచే నమస్కారాలు చేసుకున్నాం.

ఉదయం తొమ్మిదిన్నరకి తీసిన గుడి తలుపులని, వివిధ తీర్ధ జలాలతో దేవునికి అభిషేకం చేశాక, భక్తుల దర్శనం అయ్యాక పన్నెండుకు మూసేస్తారు. స్వామివారి నాలుగు ముఖాలకీ బంగారు కిరీటాలతోనూ, సువర్ణ నయనాలతోనూ.. ఊర్ధ్వ ముఖానికి శుద్ధమైన చందనంతోనూ అలంకారం చేశాక, హారతి దర్శనం, ప్రసాదం నివేదన చేసి బాలభోగం భక్తులకు పంచుతారు. కానీ ఆ రష్లో ఉండలేక మేము వెళ్ళిపోయాము, మళ్ళీ రావచ్చునులే అని.

ఈ ఆలయంలో పూజలు నిర్వహించడానికి దక్షిణ భారత దేశం నుంచి ఎన్నుకోబడ్డ భట్ట సాంప్రదాయానికి చెందిన అర్చకుడు మాత్రమే గర్భాలయ ప్రవేశానికి అర్హత కలిగి ఉంటాడు. వీరిని శంకరాచార్యులవారు నియమించారని అంటారు. స్థానిక అర్చకుడు అంతరాలయంలోనే ఉండి భక్తులకు చందనం ఇస్తూ ఉంటారు.

భాగమతీ నదికి దక్షిణాన ఉన్న గుహ్యేశ్వరీ మాత ఆలయాన్ని శక్తి పీఠాల్లో ఒకటిగా చెప్తారు. కలశ రూపంలో ఉన్న అమ్మవారిని కొబ్బరి నీళ్ళు, కల్లు మొదలైన ద్రవాలతో అభిషేకం చేస్తారు. ఆ జలాన్ని తీర్థంగా తీసుకెళ్తారు. ఇక్కడ పశుబలి కూడా ఇస్తారుట. మేము ఈ అమ్మవారి దర్శనం చేసుకోలేకపోయాము, సమయాభావం వలన.


స్వయంభునాధుని ఆలయం


ఖట్మండు నగరానికి పశ్చిమంగా పెద్ద కొండ మీద ఉందీ గుడి. ఇందులో కోతులు ఎక్కువగా ఆవాసం ఏర్పరచుకోవడంతో కోతుల గుడి అని పిలుస్తారు.

అసలే మెడ సాగదీసి చూస్తే కానీ ఎంత ఎత్తుందో తెలియదు. దానికి తోడు చివరి చివరికి మెట్లు మోకాలి పర్వతాన్ని మించిపోయాయి. సగం దూరం ఎక్కి ఆగిపోయాము. అక్కడ్నించి కూడా బాగా కనిపించింది. మనం మామూలుగా చూసే ఆలయాలన్నింటి కన్నా భిన్నంగా ఉంది. పెద్ద డోమ్.. డోమ్ మీది స్థూపం. స్థూపం మీద బుద్ధుని కళ్ళు.. కన్నుల మధ్య నాసిక వంటిది కనిపిస్తుంది. కానీ అది నేపాలీలో ఐకమత్యానికి గుర్తు అంటారు. ప్రధాన స్థూపం చుట్టూ లెక్కలేనన్ని చిన్న స్థూపాలు, ఆలయాలు ఉన్నాయి.

బౌద్ధమతస్థులకి అత్యంత పవిత్రమైన యాత్రా స్థలంగా దీనిని చెప్తారు. మహా మంజుశ్రీ బోధిస్త్వునికి ఇక్కడ తామర పువ్వు ఉన్నట్లు దివ్యదృష్టి కలిగిందిట. వెంటనే ఇక్కడికి వచ్చి, లోయలో ఉన్న నీటిని, ఒక పక్క కొండకి గండి కొట్టి తీసేసి, నివసించడం మొదలుపెట్టారని చెప్తారు.రాత్రి దీపాల కాంతిలో స్వయంభునాధుని స్థూపం చూసి తీర వలసిందే!


మా నేపాల్ దర్శనం – పోఖరా


మరునాడు పొద్దున్నే ఏడుగంటలకి తయారయిపోయి, వాన్ లో పోఖరా బయలుదేరాము. దారిలో “మనకామనా దేవి” ఆలయ దర్శనం.. నాలుగు గంటలు పైగా పట్టింది. ఆలయం కొండ మీదుంది. కొండ కింద నున్న ‘కురింతర్’ అనే ఊరు చేరడానికి నాలుగు గంటలు పైగా పట్టింది. దూరం ఎక్కువ లేదు కానీ, అంతా ఘాట్ రోడ్డు. హిమాలయ శ్రేణుల్లోంచి మెలికలు తిరుగుతున్న బాటలో వెళ్తుంటే దారిలో దృశ్యాలు కన్నులకి విందే! కురింతర్ నుంచి కేబుల్ కారులో పది నిముషాలు ప్రయాణం. ఈ సదుపాయం లేనప్పుడు, గుఱాలమీద, కాలి నడకన మూడు నాలుగు రోజులు పట్టేదిట.

మనకామనా దేవి ఆలయం-
ఎక్కడో మారుమూల చిన్న దేశం నేపాల్, ఏం పెద్ద జనం ఉంటార్లే అనుకున్నాం, మంగళవారం రష్ ఉంటుంది అని హోటల్ వాళ్ళు చెప్తున్నా కూడా. కేబుల్ కారు క్యూ చూసేటప్పటికి కళ్ళు తిరిగాయి. ఎప్పటికి పైకి వెళ్ళాలి. ఎప్పుడు దర్శనం అవాలి.. తిరుపతి జనరల్ క్యూకి ఏ మాత్రం తీసిపోదు. పైగా హిమాలయాలు కదా.! ఏప్రిల్ నెలలో ఎండ ఏముంటుందిలే అనుకుంటే అమాయకత్వమే!

నీరసంగా తల మీద చెంగులు, టోపీలు వేసుకుని నిలబడ్డాం. ఈ లోగా ఒకతను కేబుల్ కార్ టికెట్స్ ఉన్నాయి కొంటారా అని హడావుడిగా క్యూలో తిరుగుతున్నాడు. మీకు ట్రావెల్ ఏజెంట్ ఇచ్చాడులే అని చూసుకుంటుంటే.. “టికెట్లున్న వాళ్ళు క్యూలో నించోనక్కర్లేదు. సీదా ఫ్రంట్ కి వెళ్ళిపోండి” అని అరిచాడు.

కాబోసనుకుని మేము గర్వంగా తలెత్తి, అక్కడ నిలబడిన వాళ్ళని జాలిగా చూస్తూ గబగబా ముందుకంటా వెళ్ళిపోయాం. తీరా వెళ్ళాక, “ఎవరు చెప్పారు? మూడు వంతుల మందికి టికెట్లుంటాయి.. పీచే జావ్..” హేళనగా నవ్వాడు అక్కడి అధికారి. ఈ లోగా రెండు బస్సుల జనం వచ్చి క్యూ మూడు ఫర్లాంగుల దూరం పెరిగింది. ఇంక మా వాళ్ళు నన్ను ముందుకు తోశారు. నాకు నెగోషియేషన్స్ లో కొంచెం పేరుందిలెండి.
“చాలా దూరం నుంచి వచ్చాం బేటా! సబ్ సీనియర్ సిటిజెన్స్ హై.. ప్లీజ్..” ఆ హేళనతని వెంట పడ్డాను, విదిలిస్తున్నా లెక్క చెయ్యకుండా.

“అడ్డంగా కట్టిన తాడు కింది నుంచి ఒక్కొక్కళ్ళు మెల్లిగా లోపలికి జారుకోండి..” కొంచెం సేపయ్యాక, దయతలచి, నాకేసి చూడకుండా అన్నాడు, పైన ఉన్న వాడికి సైగ చేసి. మొత్తానికి, స్టేషన్ ఇంకా అర ఫర్లాంగు దూరం ఉందనగా నడుం కలుక్కుమంటుండగా దూరి, ఒక చిన్న కొండ మెట్లు ఎక్కుతున్నాం

ఒకావిడ గట్టిగా దెబ్బలాడ్డం మొదలు పెట్టింది.. సడన్ గా ఎక్కడ్నుంచొచ్చారంటూ. మమ్మల్ని కాదన్నట్లు ప్రకృతి సౌందర్యం తిలకించడంలో ములిగి పోయాం. అలా చివరి వరకూ సాధిస్తూనే ఉంది. అదృష్టవశాత్తూ, మా ముందున్న ఒడిస్సా దంపతులు, “ఏ హమారా పరివార్ హై..” అంటూ దబాయించారు. మూతి మూడు వంకలు తిప్పింది, నేపాలీ వీర వనిత.

చివరాఖరుకి కేబుల్ కారులో ఆరుగురం వచ్చి పడ్డాం. ఒకసారి కదిలాక, అప్పటి వరకూ పడిన శ్రమ అంతా మర్చిపోయాం. అలా కొండల్లో పైకి వెళ్తుంటే.. కింద తీరుగా పెంచిన పోడూ పంటలు, ఆకాశాన్నంటే శిఖరాలు, చెట్లు.. అందరం మాటలు మానేసి బైటికి చూస్తుండి పోయాం. మా పక్కనుంచి మేకల అరుపులు వినిపిస్తున్నాయి. అంత ఎత్తున ఎక్కడ్నుంచా అని చూస్తే.. మా వెనుకే ఒక కేబుల్ కారు, బోనులా ఉంది. అందులో పది మేకలు తలని కడ్డీల బైటికి పెట్టి అరుస్తున్నాయి. తరువాత తెలిసింది, అక్కడ పశుబలి ఇస్తారని.

కేబుల్ కారులోంచి దిగి మళ్ళీ కొన్ని గుట్టలు మెట్లు ఎక్కి దాటుకుని వెళ్తే అప్పుడు మొదలయింది అసలు కథ. పై నుంచి నెత్తి మీదికి చురుక్కుమని పొడుస్తున్న ఎండ.. ఎత్తు ఎక్కువైతే వేడి కూడా ఎక్కువవుతుందనుకుంటా. మెలికలు తిరిగి ఎంత దూరమో తెలియకుండా ఉన్న క్యూ .. పన్నెండు దాటింది. కళ్ళు తిరగడం మొదలెట్టాయి.

“గుడి దగ్గరగా వెళ్ళి కొబ్బరి కాయలు కొట్టడానికి దర్జాగా వెళ్ళిపోవచ్చు.. ఒక సౌ కొట్టండి.” ఒక పంతులు సెలవిచ్చాడు.

అబ్బా.. స్పెషల్ దర్శనం ఇంత చవకా అని సంతోషించి, అలాగే చేశాం. తీరా వెళ్ళిందాకా ఉండి, బైటే కొట్టి, మొహాన ఇంత బొట్టు మెదిపి తోసేశాడు అయ్యవారు. అక్కడ నా బేరాలేం చెల్లలేదు. ఇంతలో క్యూ.. మరో మైలు..

గుమ్మం ఇవతల నుండే మెడలు నొప్పెట్టేలా వంకర్లు తిరిగి చూసి దణ్ణం పెట్టుకున్నాం. ఇంతా చేసి అక్కడ అమ్మవారు మధుర మీనాక్షిలాగో, కంచి కామాక్షిలాగో ఉందనుకుంటే ఆశాభంగమే. వైష్ణోదేవిలో లాగా చిన్న విగ్రహం.. అది కూడా పువ్వులతో కప్పేసి, కాకపోతే లోపలికి వెళ్ళిన వాళ్ళు విగహానికి తల ఆన్చి మొక్కుకోవచ్చుట.

మనకామనా ఆలయం
ఈ మనకామనా దేవి ఎవరు?
క్రీ.శ. 1614 సంవత్సరంలో జన్మించిన గోర్ఖా దేశపురాణి తన భక్తుడైన లఖన్ థఫాకి మాత్రమే దేవతగా కనిపించేది. ఒక రోజు రాజు, తన తన రాణీని దేవతగా చూసి, ఆ సంగతి రాణీకి చెప్పాడు. చెప్పిన వెంటనే మరణిస్తాడు. రాణీ సతీ సహగమనం చేస్తుంది. లఖన్ థఫా కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే తను మళ్ళీ కనిపిస్తానని ఓదారుస్తుంది. ఆరు నెలల తరువాత, ఒక రైతు పొలం దున్నుతుంటే, నాగలి రాయికి తగిలి, రాతిలోనుంచి రక్తం, పాలు ధారలా వస్తాయి. లఖన్ థఫాకి ఈ విషయం తెలిసి, ఆ ప్రదేశానికి వెళ్ళి, మంత్ర తంత్రాలతో పూజలు జరిపిస్తాడు. అప్పుడు రక్త ధార ఆగిపోతుంది. అక్కడే దేవతకి గుడి కట్టి, అప్పట్నుంచీ మనసులో కోరికలు తీర్చే దేవత కింద అందరూ ఆరాధిస్తున్నారు. ప్రస్థుతం అక్కడున్న పూజారి, లఖన్ థఫా పదిహేడవ తరంలోని వాడట.

కొండ దిగి వచ్చేటప్పుడు తీరిగ్గా అక్కడున్న దుకాణాలన్నీ చూసుకుంటూ, రోడ్డు పక్కనే ఉన్న శాఖాహార భోజనశాలలో పప్పు, పనీర్ మటర్ కూర, చపాతీలు, అన్నంతో భోజనం చేశాం. పెరుగు కావాలంటే ప్రత్యేకం చెప్పుకోవాలసిందే. చెప్పిన అరగంటకి తెచ్చాడు. భోజనం బానే ఉంది కానీ, రాత్రికి అందరికీ కడుపు నొప్పి తగులుకుంది. మళ్ళీ కేబుల్ కారులో తిరుగు ప్రయాణం. కొన్ని కేబుల్ కారు బోనుల్లో మేక శరీరాలు రక్త సిక్తమైన, గోనె సంచుల్లో దర్శనమిచ్చాయి. తలలు పక్కకి తిప్పేసి కూర్చున్నాం.

పోఖరా—
మనకామనా దేవికి మనసారా నమస్కరించి, కొండదిగి, పోఖరా పట్టణానికి ప్రయాణమయ్యాం. భారత దేశానికీ, టిబెట్ కీ మధ్యన రవాణాలు ఈ పట్టణం ద్వారా సాగిస్తారు. ఖాట్మండూ తరువాత, నేపాల్ లో మూడవ పెద్ద పట్టణం. అందులో మా హోటల్, మేమూ వస్తున్న దిశలో కాక ఊరికి అటు పక్కనుంది. మొత్తం నగర సందర్శనం అయితే కానీ చేరలేకపోయాం. సంపన్నులు ఉండే పట్టణంలాగ అనిపించింది. పెద్దపెద్ద భవనాలు, విశాలంగా లేకపోయినా తీర్చిదిద్దిన వీధులు.. లోయలో, కొండల మధ్య ఆహ్లాదంగా ఉంది. మేము వెళ్తుంటే సూర్యాస్తమానం అవుతోంది. ప్రకృతి మాత సోయగాలు చూసి తీరవలసిందే!

పోఖరా “సేతి గండకీ” లోయలో ఒక భాగం. పోఖరా పట్టణం దక్షిణాన ఫేవా సరస్సునుంచి, ఉత్తరాన అన్నపూర్ణా పర్వత శ్రేణి వరకూ విస్తరించి ఉంది. సేతి గండకీ నది పట్టణం లోనుంచి కొన్ని చోట్ల అంతర్వాహిని లాగ ప్రవహిస్తూ ఉంటుంది. ఫేవా సరస్సు ఉత్తరం వైపు ఒడ్డున పర్యాటకులు ఉండే హోటళ్ళు, దుకాణాలు ఉన్నాయి. మా బస అక్కడే హోటల్ మీరాలో ఏర్పాటు చేశారు. సాయంత్రం అందరం దుకాణాల మీద పడ్డాం.. ఏవో చిన్న చిన్న వస్తువులు, పూసలూ, శాలువాలు కొని, రాత్రి విశ్రాంతి తీసుకున్నాం.

మరునాడు పొద్దున్నే ముక్తినాధ్ వెళ్ళాం. ఆ వివరాలు తరువాత చెప్తాను.

ముక్తినాధ్ నుంచి వచ్చిన రోజే హోటల్ కి రాకుండానే నగరంలో చూడవలసినవి చూపిస్తానని డ్రైవర్ పట్టు పట్టాడు. మూడు గంటల్లో మమ్మల్ని గిరగిరా తిప్పేసి తను ఖట్మండూ వెళ్ళిపోవాలిట.

“మేము అలిసి పోయి ఉన్నాం బాబూ ముందు హోటల్ కి వెళ్ళి స్నాన పానాదులన్నీ తీర్చుకుంటేనే కానీ అడుగు ముందుకెయ్యలేమని గొడవ పెట్టాం. గుణుక్కుంటూనే తీసుకెళ్ళాడు. తీరా హోటల్ కి వచ్చాక, గదులు ఖాళీ లేవు, రెండు గంటలు పడుతుందని చెప్పారు. ఈసురో మంటూ మళ్ళీ వాన్ ఎక్కి పదపదమన్నాం.. డ్రైవర్ విజయ గర్వంతో చూస్తుండగా!

డేవి జలపాతం
“పతలె చాంగ్” (హెల్’స్ వాటర్ ఫాల్)గా ప్రసిద్ధి చెందిన ఈ జలపాతం, పోఖరా విమానాశ్రయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్నే డేవిడ్ వాటర్ ఫాల్ అనికూడా అంటారు. పర్ది కోలా నదిలో స్నానం చేస్తున్న డేవిడ్ అనే విదేశీయుడు, అనకట్ట గేటు తెరవడంతో, జలపాతంలోకి పడిపోయి మళ్ళీ కనిపించలేదట. అందుకని ఆ పేరు వచ్చిందని చెప్తారు.

ఆవరణలోకి ప్రవేశించగానే ఆహ్లాదకరమైన వాతావరణం.. తీరుగా పెంచిన తోట, అందులో జంతువుల ఆకారంలో కత్తిరించిన చెట్లు. కొంచెం లోపలికి వెళ్ళి, మెట్లు దిగి కిందికి వెళ్తే చిన్న చెరువు, మధ్యలో పెద్ద పళ్ళెంలో దేవత విగ్రహం. ఆ పళ్ళెంలో నాణాలు వెయ్యాలి. తిన్నగా విగ్రహం కాళ్ళదగ్గర పడితే కోరికలు నెరవేరుతాయట.. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా.. సర్ఫేస్ టెన్షన్, బ్యుఓయన్సీ వగైరాలు.. ఒక్క నాణెం పడితే ఒట్టు. వదిలేసి అలా కొండ మీదినుంచి కిందికి పడుతున్న జలపాతం చూసుకుంటూ చకచకా మెట్లు దిగాం.. మళ్ళీ అవన్నీ ఎక్కాలన్న సంగతి మర్చిపోయి.

ఎలాగో కష్టపడి అన్ని మెట్లూ ఎక్కి, తోటలో శివలింగాలని చూసుకుంటూ బయటికి వచ్చాం. నేపాల్ హిందూ రాజ్యం కదా.. ఎక్కడికక్కడా ప్రతీ ఫర్లాంగుకీ చిన్న గోపురం, గుడి.. అందులో కాళీ విగ్రహం కానీ, శివలింగం కానీ! లోపలికి వెళ్ళి నుదిటి మీద పెద్ద బొట్టుతో బయటికి వచ్చే భక్తులు.. హడావుడిగా ఉంటుంది.

గుప్తేశ్వరుడి గుహ
ఈ పవిత్రమైన గుహలో శివుడు స్వయంభు వెలిశాడని అంటారు. డేవి జలపాతం ఎదురుగా ఉన్న ద్వారంలో నుంచి వెళ్తే వస్తుంది. పెద్ద హాలు వంటి గదులు దాటాక.. మూడు కిలోమీటర్లు పొడవున్న గుహ. పాకుతూ మోకాళ్ళ మీద నడుస్తూ వెళ్ళాలి. మేము పాకాల్సిన చోటు వచ్చే వరకూ వెళ్ళి దణ్ణం పెట్టి వచ్చేశాం.

పోఖరా స్తూపం
డ్రైవర్ చిటపటలాడ్తూనే (ఆ రోజు సాయంత్రానికి ఖట్మండూ చేరుకోవాలి మరి).. తరువాతి మజిలీకి తీసుకెళ్ళాడు. నేపాల్ లో బౌద్ధస్థూపాలు విరివిగా కనిపిస్తాయి.. అందులో పోఖరా టిబెట్ కి చాలా దగ్గర కూడా.. చాలా పెద్ద స్థూపం. ఒరిస్సాలోని నందన్ కణ్ణన్ ని జ్ఞప్తికి తెచ్చింది.

ఇవన్నీ చూసే సరికి ఒంటిగంట దాటింది. ఆకలి, నీరసం. హోటల్ కి వచ్చాక స్నాను, భోజనాలు అయ్యాక నిస్త్రాణగా వాలిపోయాం మంచాల మీద. సాయంత్రం ఐదు దాటాక కానీ లేవలేదు. అప్పటికి కాస్త తేరుకుని, టీ తాగి నాలుగడుగులు వేసి ఎదురుగా ఉన్న వీధిలోకి వెళ్ళి, ఫేవా సరస్సు చేరుకున్నాం. సరస్సు మధ్యలో ఉంది వారాహీ దేవి మందిరం.

వారాహీ మందిరం
సరస్సు మధ్యలో ద్వీపం.. అందులో మందిరం. చల్లని సాయంకాలం. చుట్టూ కొండలు, సరస్సు ఒడ్డున దూరంగా చెట్లలో నుంచి తొంగి చూస్తున్న భవనాలు.. మలయ మారుతం. ఓహ్! మా నేపాల్ ప్రయాణం లోని రెండవ అద్భుతమైన అనుభవం. మొదటిది తరువాత చెప్తాను.

రసమయ జగతిని రాసక్రీడలలాగా ఇద్దరిదరం ఒక్కొక్క పడవ మాట్లాడుకుని, ద్వీపాన్ని చుట్టి మరీ.. మందిరానికి తీసుకెళ్ళమన్నాం. మా నావని పదిహేనేళ్ళ అమ్మాయి నడపడానికి వచ్చింది. దాని పేరు కాళీ. సన్నగా.. ఇంకా మొహంలో పసితనపు చాయలు వదల్లేదు. నేను గట్టిగా వద్దనబోతే, అక్కడున్న వస్తాదులాంటి సరంగులు ఫరవాలేదని భరోసా ఇచ్చారు. మరి వాళ్ళేం చేస్తారుట.. బేరాలు ఆడుతుంటారేమో! చెప్పద్దూ చాలా భయం వేసింది. ఒడ్డు ఎంత దూరం ఉందో మనసులో గుణించుకుంటూనే ఉన్నాను.. అవసరమైతే ఈదుకుంటూ చేరడానికి. కానీ కొంత దూరం వెళ్ళేసరికి నమ్మకం వచ్చేసింది. మూడుసార్లు ఎడం చేత్తో, నాలుగు సార్లు కుడి చేత్తో తెడ్లు వేస్తూ బానే నడిపింది కాళీ.. అలవాటే ననుకుంటా..
వారాహీ దేవి మందిరం:
మందిరం ఆవరణ అంతా గచ్చు చేసి ఉంది. మధ్యలో పెద్ద పెద్ద చెట్లు. మందిరం వెనుక తోట. కూర్చోవడానికి గట్లు. నలువైపులా చక్కని దృశ్యాలతో కదలాలనిపించలేదు. చిన్నదే అయినా పగోడా ఆకారంలో గుడి. కొంచెం పెద్దగా ఉన్న అమ్మవారి విగ్రహం. ఇటూ అటూ చిన్న చిన్న విగ్రహాలు.. అవి ఎవరివో అక్కడ చెప్పే వాళ్ళు లేరు. మూల విగ్రహం మాత్రం.. వారాహి (అక్కడ బారాహి అంటారు.).. లలితా సహస్రనామాల్లోని పేరు. మనం తీసుకెళ్ళిన పూలు స్వయంగా అలంకరిచి, పాదాలు పట్టుకుని మొక్కుకోవచ్చు. గుడి బయట ఉన్న పూజారి, తీర్థం ఇచ్చి, మొహాన పెద్ద బొట్టు పెట్టి పంపేశాడు. చీకటి పడే వరకూ ఉండి, మళ్ళీ నావలో ప్రయాణం చేసి, తేలిక పడ్డ మనశ్శరీరాలతో, హోటల్ కి వచ్చి కబుర్లు చెప్పుకుంటూ నిద్రకుపక్రమించాం.

మరునాడు పొద్దున్నే విమానంలో ఖట్మండూ చేరుకున్నాం. అరగంట ప్రయాణం. విమానాశ్రయం వద్ద మళ్లీ మా వాన్ డ్రైవర్ తయారుగా ఉన్నాడు. ఇంక వీడ్కోలు పలికే సమయం.. ప్రసన్నంగానే ఉన్నాడు. ఆ రోజంతా ఎక్కడికెళ్ళాలన్నా మా ప్రయత్నాలు మావే అని చెప్పాడు “కిశోర్.. ది ట్రావెల్ ఏజంట్.”

మా నేపాల్ దర్శనం – ముక్తినాధ్
పోఖరా వచ్చిన మరునాడే ముక్తినాధ్ ప్రయాణం. అక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరట. అందుకని, పోఖరాలో చూడవలసినవి వాయిదా వేసి, ముందే ముక్తినాధ్ దర్శనం ఏర్పాటు చేశారు. పొద్దున్నే ఫలహారాలు.. ఒక్కో సాండ్విచ్, ఫ్రూటీ, యాపిల్, కేక్ పొట్లాలు కట్టి ఇచ్చారు మీరా హోటల్ వాళ్ళు. చాలా చిన్న విమానం. పద్ధెనిమిది మంది మాత్రమే పడతారు. అరగంట ప్రయాణం. హిమాలయాల్లో, మంచు కొండల మధ్య సూర్యోదయం చూస్తూ, నాలుగైదు ఫొటోలు తీసేసరికి జామ్సమ్ వచ్చేసింది. మస్తంగ జిల్లా ముఖ్యపట్టణం జామ్సమ్. విమానం దిగుతూనే వేళ్ళు కొంకర్లు పోవడం మొదలుపెటాయి. అంత పెద్ద చలేం ఉండదని, స్వెటర్లు మాత్రం తీసుకెళ్ళాం.

మాతో ప్రయాణం చేసిన ఇతర ప్రయాణీకులు కూడా తెలుగువారే. విశాఖపట్నం నుంచి వచ్చారుట.. ట్రెకింగ్ కి. చేతులకి గ్లౌజ్ దగ్గర్నుంచీ తెచ్చుకున్నారు. మేము వణుక్కుంటూ, షాల్స్ చెవుల మీంచి కప్పుకుని, సూట్ కేసులు దొర్లించుకుంటూ, ఏడెనిమిది నిముషాల్లో మేముండబోయే హోటల్, ‘మెజెస్టిక్’ కి చేరాం. రోడ్డు చాలా సన్నగా, రాళ్ళు పరచి ఉంది.. ఒక్క జీపు మాత్రం వెళ్తుంది. హోటలంతా చెక్కలతో.. పాత హాలీవుడ్ వెస్టెర్న్ సినిమాలో సెట్టింగ్ లా ఉంది లోపల. బల్లలు కుర్చీలు ఆధునికంగానే ఉన్నాయి.

కాఫీలు తాగేసి ముక్తినాధ్ బయలుదేరాం. హోటల్ వాళ్ళే అందరికీ చలి తట్టుకోవడానికి కోట్లు అద్దెకిచ్చారు. ఒక కి.మీ నడిచి వెళ్లాలి.

మాకు నడవడం కష్టం.. మళ్ళీ ఎదర ట్రెకింగ్ అంటున్నారు.. అని గొడవ పెడ్తే హోటల్ దగ్గరికి జీపు తెప్పించాడు హరి సింగ్. నలభై కి.మీ జీపులో.. కంకఱాళ్ళమీద ప్రయాణం. సామాన్లు లాబీలో పడేసి పరుగెత్తాం.. చీకటి పడకుండా తిరిగి వచ్చెయ్యాలంటే.

ఏరుమీది సన్నని బ్రిడ్జ్.. దానికి ఇవతలగా జీపు ఆగింది. బ్రిడ్జ్ దాటి నడుచుకుంటూ వెళ్తే అక్కడ జీపులు తయారుగా ఉన్నాయి. మేము ఆరుగురం ఒక జీపు మాట్లాడుకుని ఉండవలసింది.. పన్నెండు మంది సునాయాసంగా వెళ్ళిపోవచ్చు అంటే కాబోసనుకుని, (చవక కూడా.. సగానికి సగం) ఎక్కాం. హైద్రాబాద్ లోని షేర్ ఆటోలు నయం. అంతకంటే ఎక్కువ కూరేసినట్లుంది. మూడు గంటలు పైగా కంకఱాళ్ళమీద, సన్నని రోడ్డు మీద ప్రయాణం.. చేతులు చాచుకోడానికి కానీ, కాళ్ళు కదపడానికి కానీ లేదు. అందులో మాతో ఎక్కిన నేపాలీ ఫామిలీ, వాళ్ళ పన్నెండేళ్ళ కుర్రవాడు.. పోకిరీ సినిమాలో ఇలియానా తమ్ముడిలా ఉన్నాడు.. మిగిలిన వాళ్ళంతా కూడా.. వాడి ఫామిలీయేగా మరీ.. ఇంక మా పాట్లు ‘ముక్తి’నాధుడికే ఎరుక.

అవస్థలన్నీ కలిసికట్టుగా వస్తాయంటారు. అది నిజం చేస్తున్నట్లు మా జీపు మధ్యలో చెడిపోయింది. అదీ మా మంచికే.. కొండల్నీ,లోయల్నీ చూస్తూ కాళ్ళు సాగదీసుకున్నాం. అరగంట అయ్యాక ఇంకో జీపు వచ్చింది. (సెల్ ఫోన్లు కనిపెట్టినవాళ్ళు, ఇటువంటి సమయాల్లోనే దేవుళ్ళనిపిస్తారు.

కాగ్బెనీ అనే ఊరు చేరడానికి రెండు గంటలు పైగా పట్టింది. అక్కడ్నుంచి మరో గంట ఝార్గోట్. కంకఱాళ్ల రోడ్డు.. జీపులో ఏ క్షణం ఏ స్థానం తీసుకున్నా నాలుగు చక్రాలూ ఒక లెవెల్లో ఉండవు. మధ్యలో కాళీ గండకీ నది లోనుంచి ప్రయాణం. మా అదృష్టం.. అప్పుడు నదిలో నీళ్ళు ఒక పొరలా మాత్రమే పారుతున్నాయి. లేకపోతే వరద వచ్చేస్తుందిట ఒక్కోసారి. మధ్య మధ్య ఒకటే దుమ్ము. అయినా.. ఎంతో ఉత్సాహంగా ఉంది. అందుకనే హిమగిరి సొగసులన్నారు మరి.

ఎలాగయితేనేం పోఖరా హోటల్ వాళ్ళు కట్టిచ్చిన ఫలహారాలతో శక్తి పుంజుకుని ముక్తి నాధుని పాదాల దగ్గరికి, ఝార్కోడ్ చేరాం. కొంచెం ముందునించే కడుపులో తిప్పుతోందని మా వారు గొడవ పెడుతున్నారు. తిన్న సాండ్ విచ్ పడలేదేమో అనుకుని, చిన్న బడ్డ్డీ కొట్టు ఉంటే అక్కడ కూర్చోపెట్టి సపర్యలు చెయ్యబోయా.

ఊహూ.. అంతకంతకూ గాభరా ఎక్కువవుతోంది. తల తిరగడం, కడుపులో పేగులన్నీ కథాకళీ చెయ్యడం.. ఆ బాధ చూస్తుంటే ఏం చెయ్యాలొ అర్ధం అవలేదు. వెంటనే జామ్సం వెళ్ళి హాస్పిటల్ లో చేర్పించాలేమో అనుకున్నాం.

“క్యాహువా?” కాషాయ బట్టలతో ఒక సాధువు, భుజాల వరకూ జుట్టు.. వక్షస్థలం అంతా పరుచుకుని గడ్డం.. నుదుట విభూది.. దగ్గరగా వచ్చి అడిగాడు.

కష్టపడి వివరించాము.. అందరం హావభావాలతో సహా.

“ఆక్సిజన్ నయీ లాయా?” మూడడుగుల దూరంలో నిల్చుని అడిగారు.

తెల్లమొహం వేశాం. ఆక్సిజన్ కీ కడుపులో తిప్పడానికీ సంబంధం ఏమిటో నా కెమిస్ట్రీ బుఱకి తట్టలేదు. అలా మిఠాయి తెచ్చుకున్నట్లు ఆక్సిజన్ తెచ్చుకోవాలా? అదేలా?… ఏం చెయ్యాలీ.. తన బాధ చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళాగటం లేదు నాకు.

ఆ సాధువు పెద్దపెద్ద అంగలేసుకుంటూ మాయమయ్యారు.

సరిగ్గా రెండు నిముషాల్లో, ఆస్థ్మా అటాక్ వచ్చినప్పుడు పీల్చే ఇన్హేలెర్ లాంటిది తెచ్చి నోటి దగ్గర పెట్టి, గట్టిగా పీల్చి నోరు మూసుకుని, ముక్కులోంచి వదలమన్నారు. అలా నాలుగు సార్లు పీల్చాక నొప్పి చేత్తో తీసేసినట్లు మాయం.. అప్పటికి అందరికీ పరిసరాలు గుర్తుకొచ్చి అవసరాలు తీర్చుకోవడానికి బాత్రూంలు ఎక్కడున్నాయో చూడ్డం మొదలు పెట్టాం. బడ్డీ హొటల్లోనే ఉన్నాయి. రెండు రూపాయలిస్తే వాడుకోనిచ్చింది నేపాలీ మగువ. పనులయ్యాక సాధువు గారికి కృతజ్ఞతలు తెలుపుకుందామని వెతికాం.

వారు ఎప్పుడో మాయమయ్యారు. దేవుడు ఆపదలో ఆదుకుంటాడు కానీ.. మనం కృతజ్ఞతలు చెప్పుకునే వరకూ తీరుబడిగా కూర్చుని ఎదురు చూస్తాడా? ఆయనకెన్ని పనులు? ఎంత మందిని ఆదుకోవాలి. ముక్తినాధుని గుడి ఉన్న దిక్కుకి తిరిగి మనస్ఫూర్తిగా ధన్యవాదాలర్పించాను.

“హై ఆల్టిట్యూడ్ కి వెళ్ళినప్పుడు ఆక్సిజెన్ సిలిండర్ తీసుకెళ్ళాలిసిందే..” ఒక పాఠం నేర్చుకుని (ముక్తినాధ్ 3720 అడుగుల ఎత్తులో ఉంది), గుడి ఎక్కడుందా అని వెతికాము.

దూరంగా కొండ మీద గుడి కనిపిస్తోంది. నడిచి కానీ, మోటర్ సైకిల్ మీద కానీ వెళ్ళాలి. మా సుబ్బు నడుస్తానన్నాడు. మిగిలిన వాళ్ళం చేతులెత్తేశాం.. మోటర్ సైకిల్ నడిపేవాళ్ళు, పాతికేళ్ళలోపు కుర్రాళ్ళు.. ఝామ్మని మా ముందుకు తీసుకొచ్చి ఎక్కమన్నారు. కాళ్ళు అటూ ఇటూ వేసి కూర్చోవాలి. అంతే కాదు.. గట్టిగా ముందున్నవాడిని పట్టుకోవాలి. సర్లే.. మా పిల్లలకంటే చిన్నవాళ్ళు.. మునిగిందేముంది.. గట్టిగా వాడి నడుం పట్టుకుని కూర్చున్నాం. ఒక పక్క కొండ, ఇంకో పక్క లోయ. కొండ మరీ ఎత్తుగా.. లోయ మరీ లోతుగా లేకపోయినా, పడితే నాలుగో ఐదో ఎముకలు విరగడం ఖాయం.

భయం భయంగా.. బెదురుగా ఇష్ట దైవాన్ని ప్రార్ధిస్తూ గుడి మెట్ల దగ్గరికి వచ్చి పడ్డాం. సుబ్బు నయం.. హాయిగా నడుచుకుంటూ వచ్చేశాడు. ఏ టెన్షన్ లేకుండా. మరీ ఎక్కువగా లేకపోయినా, చెప్పుకోదగినంతమంది భక్తులు.. పూసలు, కొబ్బరికాయలు, పూలు వగైరాలు అమ్మేవాళ్ళు.. హడావుడిగా ఉంది. మళ్ళీ కొంత నడక.. కొండలు. మెట్లెక్కి గుడి ప్రాంగణం చేరగానే మనసంతా హాయిగా అనిపించింది. పడిన శ్రమ అంతా పారిపోయింది. ఒక వైపు వణికించే చలి.. మరో వైపు నెత్తికి వేడిగా తగులుతూ ఎండా.. కనిపించినంత మేర ఎత్తైన కొండలు, నిటారుగా పెరిగిన చెట్లు. ఈ ప్రకృతిని కన్నుల విందుగా ప్రసాదించిన ఆ అంతర్యామికి ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోగలం?

నేపాల్ లోని అన్ని ఆలయాలలా పగోడా ఆకారంలో ఉంటుంది ముక్తినాధుని మందిరం. గుడి ముందు రెండు కొలనులు. గుడి వెనుక నూరు జలధారలు అర్ధ చంద్రాకారంలో వరాహం నోట్లోనుంచి వస్తున్నట్లు పడుతుంటాయి. వీటినే “చుమిగ్ గ్యాట్సా” అని బౌద్ధమతస్థులు అంటారు (నూరుధారలు). ముక్తినాధ్ దేవాలయానికి ఇంకొక పేరు చుమిగ్ గ్యాట్సా. ఈ వంద ధారలూ తల మీదినుంచి పడేలా ధారల కిందినుంచి నడుస్తూ స్నానం చేస్తారు. కొందరు మూడు సార్లు కూడా చేస్తారు. వీటిని పవిత్ర జలాలుగా భాఅవిస్తారు. ఉట్టినే మీద చల్లుకుంటేనే మంచు నీటిలా ఉంది. అందులో ఇంక స్నానం చెయ్యాలంటే సాహసమే. పైగా మేము వేరే బట్టలు కూడా తెచ్చుకోలేదు.

సుబ్బు మాత్రం తువ్వాలు చెచ్చుకున్నాడు. అది కట్టుకుని, పళ్ళు కటకటలాడుతుండగా మూడుసార్లు ధారల కింద పరుగెత్తాడు.

మిగిలిన భక్తులందరూ స్నానం చెయ్యడానికి తయారయి వచ్చారు. ధారల దగ్గరే కాకుండా, గుడి ముందున్న కోనేరుల్లో కూడా మునుగుతున్నారు. మేము మాత్రం ధారలకింద నీటితో సంప్రోక్షం చేసుకుని దర్శనం చేసుకున్నాం.

ముక్తినాధ్ ఆలయం

ముక్తినాధ్ హిందువులకీ బౌద్ధులకీ సమానంగా నమ్మకం ఉన్న ఏకైక ఆలయం. ఈ క్షేత్రం పంచ భూతాలకీ ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్తారు. అందుకేనేమో.. రెండు మతాలకీ చెందిన యోగులు ఇక్కడ తపస్సు చేసుకుంటుంటారు. డాకినీలు (దేవతలు) ఇక్కడ తిరుగాడుతూ ఉంటారని బౌద్ధుల నమ్మకం.

ఈ ప్రదేశాన్ని “పద్మ సంభవ బోధిసత్వుడు” దర్శించడమే కాక, కొంతకాలం నివసించారని శాసనాల మీద ఉందిట. ఈ క్షేత్రాన్ని టిబెట్ బుద్ధ సాధువులైన లామాల ఆధీనంలో ఉంచారు. వారే ఈ ఆలయం అభివృద్ధి కానీ బాగోగులు కానీ చూస్తారు. ప్రస్థుతం వన్గ్యాల్ అధీనంలో ఉంది. వన్గ్యాల్ లామా శాకాహారి. ఆలయం నుంచి పైసా ఆశించకుండా పని చేస్తున్నారు. ఆయన జీవనానికి ఖట్మండూలో ఉన్న భార్య తన వ్యాపారంలోని ఆదాయంలో కొంత పంపుతుంది.

ఆలయంలో శుచీ శుభ్రతలు కూడా బౌద్ధ సన్యాసినిలు చూస్తుంటారు. విగ్రహాలకిరుపక్కలా ఉండి ఎప్పటికప్పుడు, పువ్వులు, అక్షింతలు తీసేస్తుంటారు.

పద్మసంభవునితో వచ్చిన ఎనభైనాలుగు మంది సాధువులు కర్రలతో కొండలని కొడితే జలధారలు ఏర్పడ్డాయని అంటారు. అవే చ్యుమిగ గ్యాట్సాలు. బౌద్ధ సిద్ధాంతం ప్రకారం, ఆలయ అంతర్భాగం లోని విగ్రహాలు, అవలోకితేశ్వర్, ఇద్దరు డాకినీలుగా చెప్తారు. ద్వారం ముందు రెండు మతాలూ గౌరవించే గరుడుని విగ్రహం ఉంటుంది.

హిందూ మతం ప్రకారం మహావిష్ణువు సాలగ్రామ రూపంలో ముక్తినాధ్ వద్ద, గండకీ తీరంలో నివసిస్తుంటారని అంటారు. అందుకే ఈ క్షేత్రాన్ని సాలగ్రామం అని కూడా వ్యవహరిస్తారు. ఈ తీరంలో దొరికే సాలగ్రామ శిలల్లో అంతర్భాగంలో శంఖు చక్రాలు, శివలింగం, త్రిశూలం.. మొదలైన హిందూ దేవతల చిహ్నాలు కనిపిస్తాయి

ఇవన్నీ వేల సంవత్సరాల కిందటి ఫాసిల్స్ అని శాస్త్రజ్ఞులు చెప్తారు. పురాణాల ప్రకారం సతీ తులసి శాపం వలన శ్రీమహావిష్ణువు శిలాకృతి దాల్చాడని, శిల అంతర్భాగం పురుగులు దొలిచే శాపం ఉందనీ ఒక నమ్మకం. ఈ సాలగ్రామాల మహత్యం, విష్ణుపురాణంలో బాగా వివరిస్తారు.. ప్రతీ రోజూ, అభిషేకం, పూజ చేస్తే ఇహపరాలు రెండూ లభ్యమవుతాయని ఒక నమ్మకం.

రెండు మతాలకి పవిత్ర స్థలమైన ముక్తినాధ్ దేవాలయం దర్శించడం పూర్వజన్మ సుకృతం. పడిన శ్రమంతా మర్చిపోయి.. ఆలయంలొ ఉన్నంత సేపూ ఒక రకమైన ప్రశాంతత ఆవరించింది అందర్నీ. గర్భగుడిలోకి వెళ్ళి విగ్రహానికి తల ఆనించి మొక్కుకోగలిగాము. వదల్లేక వదల్లేక, వెనక్కి తిరిగి చూసుకుంటూ కొండ దిగి, శివపార్వతి ఆలయం, యజ్ఞశాల, చూసుకుని మోటర్ సైకిల్ ఎక్కి ఒక్కొక్కళ్ళం ఝార్కోడ్ చేరాం. ఈ ముక్తినాధ్ యాత్రే నేను చెప్పిన మొదటి అద్భుతమైన అనుభవం

తిరిగి వచ్చేటప్పుడు కిలోమీటర్ పైగా దూరంలో దించేశాడు మోటర్ సైకిల్ బేటా. అక్కడి వరకే అనుమతి ఉందిట. అదంతా నడుచుకుని, జీపులు బయలుదేరి దగ్గరికి వచ్చేసరికి నీరసం వచ్చేసింది. ఈ సారి జీపులో వెనుక కూర్చున్న వాళ్ళు పట్టుకోవడానికి ఏమీ ఆసరా లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ.. అందులో ఒక టీనేజి కుఱ్ఱాడు, పాడయిపోయిన జీపు బాగు చెయ్యడానికి మధ్యలో ఆగుతూ, నిర్లక్ష్యంగా వేగంగా నడిపాడు. సుబ్బు తల నాలుగు సార్లు టాపుకి కొట్టుకుని కళ్ళ నీళ్ళ పర్యంతం అయింది. అందరం గట్టిగా అరిచి, వాడి స్పీడు తగ్గించేసరికి తల ప్రాణం కాళ్ళ దగ్గర కొచ్చింది.

ఎలాగైతేనేం జామ్సమ్ వచ్చి పడ్డాం. అప్పుడు మమ్మల్ని కూర్చోపెట్టి పప్పు, అన్నం, ఆలు/ఉల్లిపాయ/టొమాటో కూర, రొట్టెలు చేసి పెట్టాడు హోటల్ వాడు. మా కాంట్రాక్ట్ ప్రకారం తిండి వాళ్ళు పెట్టాలి. ఎలాగా డబ్బు ముందే అందింది కదా.. అప్పుడు వండినవే రాత్రి భోజనంలో కూడా పెట్టాడు. పెరుగు కానీ లస్సీ కానీ ఏవీ లేదు. విడిగా కొనుక్కుంటే నయం. ఎవరు వెళ్ళినా ఫుడ్ మాట్లాడుకోకుండా ఉంటే బాఉంటుంది. అక్కడ నాలుగైదు హోటల్సున్నాయి.

పేరు మెజెస్టిక్ అనే కానీ స్నానానికి వేడి నీళ్ళు ఇవ్వలేదు సరి కదా.. లిఫ్ట్ లేని మూడో అంతస్థులోని గదుల్లోకి మంచినీళ్ళు కూడా మేమే మోసుకెళ్ళవలసి వచ్చింది. చేతులు జివ్వుమనే నీళ్ళతో మొహాలు కడుక్కుని విమానంలో వచ్చి పడ్డాం. పొద్దున్న బ్రేక్ ఫాస్ట్ కూడా ఇవ్వలేదు. తరువాత కిషోర్ కి చెప్పి ఆ వార డబ్బు వాపస్ తీసుకున్నాం.. కానీ అప్పుడు పడిన అవస్థలు.. ఆకళ్ళు ఎలా మర్చిపోగలం? ఇవన్నీ జాగ్రత్తగా ముందే మాట్లాడుకోవాలి.

జామ్సమ్ లోని ఇబ్బందులన్నీ పోఖరాలోని సదుపాయాలతో తుడిచి పెట్టినట్లు పోయాయి. ఆ రోజంతా పోఖరాలో చూడవలసినవి చూసేసి మరునాడు పొద్దున్నే ఖట్మండూ చేరుకున్నాం.
వీడ్కోలు:
ఖట్మండూలో రెండు రోజులు విశ్రాంతి. అనుకోకుండా వచ్చే వాతావరణంలోని మార్పులకి ఆ మాత్రం ఖాళీ సమయం ఉంచుకోవాలిట. ఎయిర్పోర్ట్ లో దించడం తప్ప ట్రావెల్స్ వాళ్ళు ఇంకేమీ చూపించమన్నారు. ముందుగా వివరించినట్లుగా మొదటి రోజు సాయంత్రం టాక్సీలు మాట్లాడుకుని పశుపతినాధ్ దర్శనం చేసుకున్నాం.

ఆలయ పరిసరాలన్నీ తిరిగి, హోటల్ కొచ్చేశాం.

నేపాల్ లో చివరి రోజు.. రాయల్ పాలస్ చూద్దామని పదింటికి బయలుదేరాం. హోటల్ నుంచి కిలోమీటర్ లోపే ఉంది దూరం. కబుర్లు చెప్పుకుంటూ నడిచి వెళ్ళిపోయాం. అక్కడ టికెట్లు, క్యూ. పదకొండుకి కానీ తెరవరు. కూర్చోడానికేమీ లేదు. పై నుంచి ఎండ పేలిపోతోంది. కొద్ది నీడ వెతుక్కుని కష్టం మీద కాలం గడిపాం.

నారాయణ హితి పాలస్ లో రాజా బీరేంద్ర కుటుంబం హత్యల తరువాత, రాజా జ్ఞానేంద్ర నివసించే వారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చాక, జ్ఞానేంద్రని మే 2008లో ఖాళీ చేయించి మ్యూజియమ్ కింద మార్చారు. లోపలికి అన్ని చోట్ల లాగే కామెరాలు, సెల్ ఫోన్లు తీసుకెళ్ళకూడదు. బైట ఫొటోలు తరువాత మళ్ళీ వెళ్ళి తీసుకున్నాం.

పాలస్ లో చెప్పుకోతగ్గది.. విదేశాల నుంచి వచ్చే ముఖ్య అతిథులని ఆహ్వానించే హాలు, వారికి ఏర్పరచిన గద్లు. పాల్స్ లో రాజావారిదీ, రాణిగారిదీ గదులూ, పిల్లలవీ.. పెద్ద అట్టహాసాలేవీ లేకుండా సాధారణంగానే ఉన్నాయి.

రెండు వేల సంవత్సరంలో హత్యలు జరిగిన ఇల్లు, హాలు అంతా పడగొట్టేశారు. మద్య సేవనంతో ఉన్మాది అయిన రాజకుమారుడు దీపేంద్ర ఎవరెవర్ని ఎక్కడ చంపాడో రాసి ఉంచారు. రాణీ ఐశ్వర్య, రాకుమారుడు నిరజన్ తోటలోకి పారిపోయి, తల దాచుకునే చోటు వెతుక్కునే లోగానే తరుముకుంటూ వచ్చి కాల్చి చంపేశాడు. నిరజన్ వయస్సు ఇరవై మూడు. రాకుమారి శృతి వయస్సు ఇరవై నాలుగు సంవత్సరాలు. మొత్తం పదిమంది రాజ కుటుంబీకులు.. ఆ ప్రదేశం చూస్తుంటే మనసంతా కలచి వేసింది.

ఆ తరువాత ఆంతా విషాద హృదయాలతోనే చూసి, నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి హోటల్ చేరాం.

సాయంకాలం అలా నడుచుకుంటూ దగ్గరలో ఉన్న బజారంతా తిరిగి, నేపాల్ లో చూసిన ప్రదేశాలన్నీ ఒక సారి జ్ఞప్తికి తెచ్చుకుని, సామాన్లు సర్దుకుని తిరుగు ప్రయాణానికి తయారయిపోయాం.

వారం రోజుల నేపాల్ పర్యటన ముగిసి, ఎయిర్ పోర్ట్ కొచ్చిన కిషోర్ కి టాటా చెప్పి త్రిభువన్ విమానాశ్రయంలో ప్రవేశించాం. స్పైస్ జెట్ విమానం గంటన్నర లేటు. ఢిల్లీ వచ్చేసరికి రెండు దాటింది. అక్కడ్నుంచి మధుర, బృందావనం చూసుకుని, మధురలో A.P Express పట్టుకుని హైద్రాబాద్ వచ్చాం. మళ్ళీ ఆరుగురం కలిసి ఎక్కడికెళ్ళాలా అని ఆలోచిస్తున్నాం.

*————————*————————*