Friday, 13 March 2015

అరుణాచలం

అరుణాచలం.. శివమయాచలం!

స్మరించినంత మాత్రాన ముక్తినిచ్చే క్షేత్రం అరుణాచలం. స్వయంభువుగా కొలువైన అక్కడి శివుడు అరుణాచలేశ్వరుడు. ఈ క్షేత్ర మహిమ పురాణ ప్రసిద్ధం. శివ పురాణం, స్కాంద పురాణం, లింగ పురాణాల్లోనే కాకుండా ఋగ్వేద, అధర్వణ వేద మంత్రాల్లో కూడా అరుణాచల ప్రసక్తి ఉంది. కొన్ని ఉపనిషత్తులు, సంహితలు అరుణాచల మాహాత్మ్యాన్ని ప్రశంసించాయి.

శివరాత్రితో ముడిపడిన క్షేత్ర పురాణం!
అరుణాచలానికి ఎన్నో పేర్లున్నాయి. ప్రధానంగా శోణాద్రి (ఎర్రని కొండ)గా ప్రాశస్త్యం పొందింది. ఈ పేరు రావడానికీ, అరుణాచలానికీ- శివరాత్రికీ ఎంతో సంబంధం ఉంది.
దీనికి సంబంధించిన కథ ఇది.

బ్రహ్మ విష్ణువుల మధ్య ‘ఎవరు గొప్ప?’ అనే వాదం తలెత్తింది. అది వివాదంగా మారింది. యుద్ధానికి దారితీసింది. బ్రహ్మాస్త్ర, నారాయణాస్త్రాల ప్రయోగానికి వారు సిద్ధమవుతున్న సమయంలో- బ్రహ్మ విష్ణువుల మధ్య మహాగ్ని స్తంభంగా పరమ శివుడు ఆవిర్భవించాడు. ఇదీ క్లుప్తంగా కథ.

అలా ఆవిర్భవించింది శివుడని తెలుసుకున్న బ్రహ్మ విష్ణువులు ప్రార్థించడంతో శివుడు సాక్షాత్కరించాడు. ‘‘త్రిమూర్తులలో ఎక్కువ, తక్కువలకు తావు లేదు. సృష్టి-స్థితి-లయాలకు ప్రతీకలుగా ముగ్గురినీ పరాశక్తి సృష్టించింది. ఆమె సంకల్పాలను నిర్వర్తించడమే మన కర్తవ్యం’’ అని హితబోధ చేశాడు.

శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించిన సమయం మాఘ కృష్ణ చతుర్దశి- అర్ధరాత్రి. ఆ రోజును మహా శివరాత్రి పర్వదినంగా యావద్భారతదేశం పాటిస్తోంది. మహాదేవుడికి తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకూ శివాలయాల్లో అభిషేకాలు, అర్చనలు, నిర్వహిస్తారు. భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, శివనామాన్ని జపిస్తారు. శివాలయాలకు వెళ్తారు. రాత్రి జాగరణం చేసి, లింగోద్భవ సమయంలో (అర్ధరాత్రి) శివుడిని దర్శించి, అనుగ్రహ పాత్రులవుతారు.

ఆధ్యాత్మిక రమణాచలం!
మహాశివరాత్రి అనగానే తమిళనాడులోని అరుణాచలం గుర్తుకొస్తుంది. అరుణాచలం అనగానే భగవాన్‌ శ్రీ రమణ మహర్షి స్మరణకు వస్తారు. పధ్నాలుగేళ్ళ వయసులో అరుణాచలం వచ్చిన వెంకటరామన్‌ (రమణ మహర్షి) జీవితాంతం అరుణగిరి సానువులలోనే గడిపారు. అరుణాచలానికీ, రమణ మహర్షికీ మధ్య అంత విడదీయరాని బంధం ఉంది. ‘‘అరుణాచలాన్ని పాషాణాలు, ముళ్ళ పొదలతో కూడిన మామూలు పర్వతంగా భావించవద్దు. ఇది పరమేశ్వరుని ప్రతిరూపం. అరుణం అంటే శక్తి- పార్వతి, ప్రకృతి, అచలం అంటే నిశ్చలాత్మ, శివుడు, పురుషుడు. ప్రకృతీ పురుషుల సమ్మేళనం... సగుణ నిర్గుణా ఏకత్వ రూపం ఇది!’’ అని ఆయన అనేవారు.

హిమాలయాల కన్నా పురాతనం!
పురాతత్వ శాస్త్రవేత్తలు కూడా అరుణగిరి గొప్పతనాన్ని శాస్త్రీయంగా నిరూపించారు. సృష్టికి పూర్వమే అరుణగిరి ఉందనీ, సూర్యుడి నుంచి విడివడిన భూమి అగ్నిమయంగా ఉన్న దశ నుంచి ప్రకృతిలో సహజ సిద్ధమైన మార్పులు పొందుతూ చల్లబడి ఏర్పడిన తొలి పాషాణమయ స్థానం అనీ, ఇది ఆసియా ఖండంలో భాగం కాదనీ, అప్పటి మహా సముద్రంలో మునిగిన లెమోరియా ఖండంలో భాగమనీ, హిమాలయాల కన్నా పురాతనమైన పర్వతమనీ ధ్రువపరిచారు.

దీనికి సంబంధించి-
గంగాచ మూలభాగస్థా
యమునా గగనస్థితా!
సోమోద్భవ శిరోభాగే
సేవంతే శోణ పర్వతః!!
అని స్కాంద పురాణం స్పష్టంగా చెబుతోంది.

సాధారణంగా పర్వతాలు చెట్లూ, పుట్టలతో పచ్చగా ఉంటాయి. కాని అరుణగిరి ఆ పేరులోనే ఉన్న వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. ‘‘అరుణగిరి అగ్నితత్త్వానికి సంకేతం. ఇది ధరిత్రికి హృదయం వంటిది. సత్య స్వరూపం. జ్ఞాన తేజస్సు. శ్రేష్టతమం’’ అని ఋగ్వేదం కీర్తించింది.

ముక్తిదాయకం గిరిప్రదక్షిణం
అరుణాచలేశ్వరుని దేవేరి అపీత కుచాంబ. నలుదిశలా ఎత్తైన ప్రాకారాలతో, అరుణగిరి సానువులో నెలకొన్న అతి విశాలమైన అరుణాచలాలయంలో శివ కుటుంబంలోని గణపతి, కుమారస్వామి ఆలయాలున్నాయి. ఈ గిరి చుట్టూ ముక్కోటి దేవతలు శివలింగాలను ప్రతిష్ఠించారు. అరుణగిరిపై దక్షిణామూర్తి కొలువు తీరాడు. బ్రహ్మాది దేవతలందరూ అరుణగిరి ప్రదక్షిణం చేసేవారని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరమణ మహర్షి కూడా అరుణగిరి ప్రదక్షిణం చేయాల్సిందిగా భక్తులకు చెప్పడమే కాదు- ఆయన కూడా భక్తులతో కలిసి ప్రదక్షిణం చేసేవారు.

వైభవంగా శివరాత్రి
అరుణాచలంలో సంవత్సరంలో ఎన్నో పండుగలు, పర్వాలు జరుగుతాయి. అన్నిటిలో ప్రధానమైనది శివరాత్రి. ఆ రోజున దివారాత్రాలు అసంఖ్యాకంగా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. రోజంతా అరుణాచలేశ్వరునికి అభిషేకాలు, అర్చనలు నిరంతరాయంగా జరుగుతాయి. అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో ఒక్కసారిగా గుడిలోని గంటలన్నీ మ్రోగుతాయి. శంఖనాదాలు మిన్నుముడతాయి. కర్పూర హారతి ప్రకాశిస్తూ ఆకాశంలో పున్నమి చంద్రుడి వెన్నెలను భాసింపజేస్తుంది. ‘‘అరుణాచల శివా! అరుణాచల శివా!’’ అనే శరణు ఘోష దశదిశశలా ప్రతిధ్వనిస్తుంది. అరుణాచలేశ్వరునీ, అపీత కుచాంబనూ దర్శించి భక్తులు తన్మయులవుతారు.

అత్యద్భుతమైన ఈ ప్రాచీన ఆలయంలో శ్రీకృష్ణదేవరాయలు మంటపాలను, గోపురాలను నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ‘అరుణగిరి వాసం, ఇక్కడ మరణం ముక్తిదాయకం. ఇది గొప్ప తీర్థక్షేత్రం. స్మరించిన మాత్రాన ముక్తి కలుగుతుంది’ అని శివపురాణం ఉల్లేఖించింది. శివభక్తికి ప్రధాన క్షేత్రమైన అరుణాచలంలో ఈశ్వరుని, అపీత కుచాంబను, అరుణగిరిని దర్శించినవారికి ఆ ఆది దంపతుల అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
ఏ.సీతారామారావు

No comments:

Post a Comment