Thursday, 23 July 2015

తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి

తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి

ఈ కలియుగంలో భక్తుల కొంగు బంగారమై కోరికలు తిర్చే ఆపదమొక్కులవాడు శ్రీవెంకటేశ్వరస్వామి. ఆయన నామం ఒక్కసారి స్మరిస్తే చాలు చేసిన పాపాలన్నీ పటాపంచలు అవుతాయి. స్వామి నామం ఒక్కసారి పఠిస్తే చాలు సర్వశూభాలు సిద్దిస్తాయి. శ్రీనివాసుని మహిమలకు అన్నమయ్య, త్యాగయ్య, వేంగమాంబ వంటి వారు తమ కిర్తనలతో లోకానికి చాటి చెప్పారు. అంతటి పరమపావనమైన స్వామి వారి గురించి ఒకసారి తెలుసుకుందాం. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తిరుపతిలో కొలువై వుంది. స్వామి వారిని ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు దర్శించుకుంటున్నారు. ప్రపంచంలోనే అటు ఆదాయంలోనూ ఇటు భక్తులు సందర్శించడంలోనూ రెండవ స్థానంలో ఉంది.

స్ధల పురాణం -
                కలియుగంలో ధర్మాన్ని నాలుగు పాదాల మీద నడిపించడానికి గోవిందుడు స్వయంభూవుగా వెలిసాడు. స్వామివారిసేవలో తరించడానికి దేవతలు ఏడుకొండలుగా మారారు. అవే శేషాద్రి, నిలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వెంకటాద్రి. ఆదిశేశుడిగా వరం ఇచ్చిన కారణంచే శ్రీనివాసుడు శేశున్ని కొండగా మార్చి ఆ కొండమిదే కొలువై ఉండి భక్తులను కాపాడుతున్నాడు అదే శేషాద్రి.

శాశానాల ప్రకారం స్వామి వారి ఆలయాన్ని క్రీశ.300లో నిర్మించారని తెలుస్తుంది.ఆ తరువాత పల్లవులు, చోళులు, విజయనగర రాజులు ఇలా ఎంతో మంది రాజవంశాల వారు ఈ ఆలయాన్ని అభివృద్ది చేస్తూ వచ్చారు. 1517లో శ్రీ కృష్ణదేవరాయిలు స్వామి వారిని దర్శించి ఎన్నో విలువైన కానుకలను సమర్పించాడు.

      ఆ తరువాత ఆలయాన్ని అభివృద్ది పరచడానికి ప్రభుత్వం 1932లో తిరుమల తిరుపతి దేవస్ధానం(టి.టి.డి)ని ఏర్పాటు చేసింది.అప్పటినుండి స్వామివారి నిత్యపూజలు దగ్గరనుండి అన్ని కార్యక్రమాలను టీ.టి.డి నే చూస్తుంది. కేవలం తిరుపతి పుణ్యక్షేత్రంగానే కాకుండా పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ది చెందింది.తిరుమల చుట్టూ దట్టమైన అభయారణ్యం విస్తరించి ఉంది.ఇక్కడి కొండలు,లోయలు,సెలయెరులు మనసుకు ఎంతో అహ్లదాన్ని కలిగిస్తాయి.తిరుమల తిరుపతిలో బాలాజీ ఆలయమే కాక గోవిందరాజస్వామి ఆలయం, వరహస్వామి ఆలయం, కోదండ రామాలయం, పాపవినాశనం వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. శ్రీనివాసునికి వచ్చిన ఆదాయంలో ఆలయ అభివృద్దితోపాటు టీ.టి.డి అనేక మంచి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. దేవాలయాలను అభివృద్ది చేయడానికి నిధులు సమకూర్చడం, హిందూ మత వ్యాప్తికి కృషి చేయడం, పేద విధ్యార్ధులకు చదువు చెప్పించడం, పేదలకు వివాహాలు జరిపించడం వంటి ఎన్నో చేపడుతుంది. 


తిరుపతిలో దర్శించవలసిన ఆలయాలు -
1.శ్రీవరాహస్వామి ఆలయం
2.శ్రీఅంజనేయస్వామి ఆలయం
3.స్వామివారి పుష్కరిణి

తీర్ధాలు -
1.ఆకాశగంగ తీర్ధం 2.పాపనాశనం తీర్ధం 3.కుమారధర తిర్ధం 4.పాండవ తీర్ధం 5.తుంబుర తీర్ధం 6.చక్ర తీర్ధం 7.రామకృష్ణ తీర్ధం 8.వైకుఠ తీర్ధం 9.శేష తీర్ధం 10.పసుపు తిర్ధం 11.సీతమ్మ తీర్ధం 12.జాపాని తీర్ధం 13.శంకసనాదన తీర్ధం

తిరుపతిలో చుట్టూ ఉన్న ఆలయాలు -
1.శ్రీగోవిందరాజస్వామి ఆలయం - తిరుపతి
2.శ్రీకొదండరామస్వామి ఆలయం - తిరుపతి
3.శ్రీకపిలేశ్వరస్వామి ఆలయం - తిరుపతి
4.శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం - తిరుచనూరు
5.శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం - శ్రీనివాసమంగాపురం
6.శ్రీవేదనరసిమ్హస్వామి ఆలయం - నాగాలాపురం
7.శ్రీఅంజనేయస్వామి ఆలయం -అప్పలాయగుంట

వేకటేశ్వరస్వామికి నిత్యం జరిగే సేవలు -
సుప్రభాత సేవ ఉదయం 2గం ల 30ని లకు
తోమాల సేవ ఉదయం 3గం ల 30ని లకు
అర్చన ఉదయం 4గం ల 30ని లకు

ఉత్సవమూర్తికి జరుగు సేవలు -
1.కళ్యాణోత్సవం 2.ఆర్జితబ్రహ్మౌత్సవం 3.డోలోత్సవం 4.వసంతోత్సవం 5.సహస్రదీపాలంకరణ సేవ 6.ఏకాంత సేవ

బ్రహ్మౌత్సవాల సందర్భంగా స్వామివారు సర్వాలంకారభూషితుడై వివిధ రూపాలలో వివిధ వాహనాలలో దర్శనమిస్తూ తిరుమాడవీధులలో భక్తులను అలరిస్తారు.

ఆయావాహనాల వివరాలు -
1.మొదటి రోజు ద్వజారోహణం(ఉదయం) పెదశేష వాహనం(సాయంత్రం)
2.రెండవ రోజు చినశేష వహనం హంస వాహనం
3.మూడవ రోజు సిమ్హ వాహనం ముత్యపు పందిరి వాహనం
4.నాల్గవ రోజు కల్పవృక్ష వాహనం శివభూతాల వాహనం
5.ఐదవ రోజు మొహిని అవతారం గరుడ సేవ
6.ఆరవ రోజు హనుమంత వాహనం స్వర్ణరధం,గజవాహనం
7.ఏడవ రోజు సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
8.ఎనిమిదవ రోజు రధోత్సవం అశ్వ వాహనం
9.తోమ్మిదవ రోజు పల్లకీ ఉత్సవం బంగారు తిరుచ్చి ఉత్సవం చక్ర స్ధానం ద్వజారోహణం


తిరుపతి ఎలా వెళ్ళాలి ?
దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తిరుపతికి దూరముల వివరాలు
1.హైదరాబాద్ నుండి - 554కిమీ
2.వైజాగ్ నుండి -735 కిమీ
3.చెన్నై నుండి - 139 కిమీ
4.బెంగూళూరు నుండి -247 కిమీ
5.ముంబాయి నుండి - 1140 కిమీ
వివిధ మార్గాల ద్వారా -
1.ట్రైన్ మార్గం ద్వారా -
తిరుపతికి దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ట్రైన్ సౌకర్యం ఉంది.తిరుపతికి దగ్గరలోనే రేణిగుంట జంక్షన్ ఉంది.
హైదరాబాద్ నుండి నారాయనాద్రి ఎక్స్ ప్రెస్(ఉదయం 6గం"ల 30ని"కు)
ట్రైన్ నంబర్ 2734
పద్మావతి ఎక్స్ ప్రెస్
రాయలసీమ ఎక్స్ ప్రెస్
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్
కాచిగుడ ఎక్స్ ప్రెస్
2.రోడ్డు మార్గం ద్వారా -
తిరుపతికి దేశంలోని అన్నిప్రాంతాల నుండి రోడ్డు మార్గం కలదు. ఎ.పి.యస్.ఆర్.టి.సి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం కలదు.
3.ఆకాశమార్గం ద్వారా -
విమానం ద్వారా తిరుపతికి చేరుకొవాలనుకునేవారు తిరుపతికి దగ్గరలోని రేణిగుంట విమానశ్రయానికి చేరుకోవాలి.అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా తిరుపతికి చేరుకొవచ్చు.
ఎక్కడ ఉండాలి ?
తిరుమలలో భక్తులు ఉండటానికి విలుగా టి.టి.డి కాటేజ్ లలొ వసతి సౌకర్యం కల్పిస్తుంది.ఇంకా సౌకర్యంగా కావలనుకునేవారి కోసం గెస్ట్ హౌస్ల్ కు పరిమితమైన అద్దె వసూలు చేస్తుంది.
ఇవే కాక ప్రముఖమైన హొటల్స్ కూడా ఉన్నాయి.
1.సింధూరి హోటల్
2.గ్రాండ్ హోటల్
3.హోటల్ కళ్యణ్ రెసిడెన్సీ

ఇంత పరమపావనమైన తిరుమల క్షేత్రాన్ని మనమూ ఒకసారి దర్శించి తరిద్దామామరి.
           గోవిందా........ గోవిందా........ గోవిందా........

Saturday, 18 July 2015

కాళీదేవి - కోల్‌కతా

భవతారిణి.. మోక్షప్రదాయిని

బెంగాల్‌ ప్రాంతంలో కాళీదేవిని పూజించడం, ఆరాధించడం అధికంగా కనిపిస్తుంటుంది. ఎంతో మంది ప్రజలు ఆరాధ్య దైవంగా, ఇంటి ఇలవేల్పుగా ఆ తల్లిని కొలుస్తుంటారు. రామప్రసాద్‌ సేన్‌, రామకృష్ణ పరమహంస వంటి ఎందరో కాళీ సిద్ధులు ఆ ప్రాంతంలో కాళీ భక్తి సంప్రదాయాన్ని వ్యాపింపజేశారు. ముఖ్యంగా కోల్‌కతాలో ప్రపంచ ప్రసిద్ధ కాళీ మందిరాలున్నాయి. వాటిలో విశేషమేంటంటే.. అక్కడ కాళీఘాట్‌లో అత్యంత తీవ్ర స్వరూపిణిగా, ఉగ్రదేవతగా కనిపించే కాళీదేవి, దక్షిణేశ్వర్‌ దేవాలయంలో ప్రేమస్వరూపిణిగా, ఆహ్లాదమూర్తిగా అనుగ్రహిస్తుంది.

రెండు ఆలయాల్లోనూ భక్తజనసందోహం ఉంటుంది. దక్షయజ్ఞంలో ప్రాణాలు విడిచిన సతీదేవి ఖండితాంగాల్లో కుడిపాదం వేళ్లు పడినచోటున క్షేత్రమే కాళీఘాట్‌. అందుకే అమ్మవారు అక్కడ శక్తిస్వరూపిణిగా పొడవాటి నాలుక చాచి దర్శనమిస్తుంది. స్థానికులు ఆ తల్లిని గ్రామదేవతగా భావించి పూజిస్తారు. భూతప్రేత ప్రయోగ బాధలను, కష్టాలను తొలగించే దేవతగా, నరదిష్టిని పోగొట్టే దేవతగా కొలుస్తారు. దక్షిణేశ్వర్‌లో కొలువైన కాళిని ‘భవతారిణి’గా.. అంటే భవబంధాల నుంచి జనులను తరింపజేసి మోక్షాన్ని అనుగ్రహించే దేవతగా పూజిస్తారు. కాళికాదేవిని ప్రేమస్వరూపిణిగా భావించి ఉపాసించిన రామకృష్ణ పరమహంసకు అమ్మ అనుగ్రహం చాలా త్వరగా లభించింది. అమ్మకరుణవల్లనే ఆయన అద్వైత స్థితిని పొంది మూడురోజులపాటు నిర్వికల్ప సమాధిస్థితిలో ఉండగలిగారు. రామకృష్ణులవారికే కాదు.. ఆ తల్లిని భవతారిణీదేవిగా భక్తిగా ఉపాసిస్తే ఎవరికైనా మోక్షాన్ని అనుగ్రహిస్తుంది.

మాతా రమ్యానంద భారతిFriday, 17 July 2015

పూరీ జగన్నాథుడి నవకళేబర యాత్ర

Jul 17, 2015

వస్తున్నాయొస్తున్నాయ్.. జగన్నాథుని రథచక్రాల్!

కొలిచిన వారికి కొంగుబంగారమై నిలిచే పూరీ జగన్నాథుని పేరు వినగానే అంగరంగ వైభవంగా జరిగే రథయాత్ర గుర్తుకొస్తుంది. పూరీ క్షేత్రంలో సోదర, సోదరీ సహితుడై కొలువున్న జగన్నాథ స్వామి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ఉత్సవమూర్తి ఆకారంలోనే కాదు, ఆయనకు సమర్పించే ప్రసాదాలు మొదలుకుని ఆయనకు జరిపే ఉత్సవాలు అన్నీ ప్రత్యేకమే! జగన్నాథుని రథయాత్ర అంటే, భక్త జనసందోహానికి ఓ వేడుక.... కన్నుల పండుగ. ఆబాలగోపాలాన్నీ భక్తి పారవశ్యంలో ముంచెత్తుతూ, జూలై 18వ తేదీన జరగనున్న పూరీ జగన్నాథ రథయాత్ర గురించి....

‘బ్రహ్మ’ రహస్యం
జ్యేష్ఠమాసం కృష్ణ చతుర్దశి నాడు ‘బ్రహ్మం’ మార్పిడి జరుగుతుంది. శ్రీమందిరంలోనే ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇది అత్యంత రహస్యం... నియమనిష్ఠామయం! మొదట దేవాలయంలో ఎవరూ లేకుండా జాగ్రత్త పడతారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర, సుదర్శనుల కొత్త మూర్తులను తీసుకొచ్చి... ప్రస్తుతం పూజలు అందు కుంటున్న విగ్రహాల ముందుంచుతారు. ‘బ్రహ్మ’ మార్పునకు ఎంపిక చేసిన నలుగురు దైతాపతుల కళ్ళకు ఏడుపొరలుగా పట్టు వస్త్రాన్ని కడతారు. అలాగే చేతులకూ, కాళ్ళకూ చుడతారు. అర్ధరాత్రి కాగానే, మందిరంలో దీపాలు ఆర్పేస్తారు. ఆ నలుగుర్నీ మాత్రమే ప్రధాన ఆలయంలోకి అనుమతిస్తారు. కటిక చీకటిలో కళ్ళకు గంతలతో వీరు శ్రీమందిరంలో ఉంటారు. ఎవరెవరు ఏయే దేవుని బ్రహ్మపదార్థాన్ని మార్చాలో అప్పటికే నిర్ణయిస్తారు. ఆ మేరకు వారు ఆయా దేవతామూర్తుల వద్దకు వెళ్ళి నాభి ప్రాంతంలోని బ్రహ్మ పదార్థాన్ని జాగ్రత్తగా తీసి కొత్త విగ్రహాల్లో ఉంచుతారు. జాజిపూలు, కస్తూరి, చందనం, తులసి తదితర ద్రవ్యాలతో బ్రహ్మపదార్థాన్ని నూతన విగ్రహాల్లో ఉంచి బొడ్డు దగ్గరున్న ద్వారాన్ని మూసేస్తారు. దీంతో బ్రహ్మ పదార్థం మార్పిడి పూర్తవుతుంది. ఆ ‘బ్రహ్మం’ ఏమిటన్నది మాత్రం బ్రహ్మరహస్యమే! ఆ సమయంలో పూరీ పట్టణమంతా విద్యుత్తు సరఫరా నిలిపివేస్తారు. నూతన దారుదేవతామూర్తుల్లో బ్రహ్మ పదార్థాన్ని నింపగానే వాటికి ‘నవకళేబర’ ప్రాప్తి లభిస్తుంది. అనంతరం పాత విగ్రహాలను భూస్థాపితం చేస్తారు.

రథచక్రాలు కదులుతున్నాయి
రథయాత్రకు రెండురోజులు ముందుగా అమావాస్యనాడు, నూతన దేవతామూర్తులకు యధావిధిగా పూజలు ప్రారంభిస్తారు. మరుసటి రోజు అంటే జులై 17వ తేదీన భక్తులకు నవయవ్వన దర్శనం లభిస్తుంది. ఆషాఢ శుక్ల విదియనాడు ఉదయం పాండాలు మేళతాళాలతో పూజలు నిర్వహించి, ‘మనిమా’ (జగన్నాథా) అంటూ పెద్ద పెట్టున నామస్మరణ చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు. ఈ విగ్రహ మూర్తులను భక్తజనసందోహ కోలాహలం మధ్య ఊరేగిస్తూ రథం వెనుక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరిస్తారు. ఈ ఉత్సవాన్ని ‘పహండీ’ అని వ్యవహరిస్తారు. గుండిచా ఆలయానికి వెళ్ళేందుకు సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై ఉండగా... పూరీ రాజు పల్లకీలో ఆ ప్రాంతానికి చేరుకోవడంతో సంబరాలు మిన్నంటుతాయి. పూరీ మహారాజు ఆ జగన్నాయకుని సేవకునిగా మారి బంగారు చీపురుతో రథాల లోపల శుభ్రం చేస్తాడు. ఈ కార్యక్రమాన్ని ‘చెరా పహారా’ అని పిలుస్తారు. కస్తూరి కళ్ళాపి జల్లి హారతిచ్చి, ‘జై జగన్నాథా’ అని నినదిస్తూ ఆయన రథానికున్న తాళ్ళను లాగడంతో ప్రఖ్యాతిగాంచిన రథయాత్ర (జులై 18) మొదలవుతుంది. దీన్నే ‘గుండిచాయాత్ర, ఘోషయాత్ర’ అని వ్యవహరిస్తారు. ఆ సమయంలో స్వామిని ‘పతితపావనుడు’ అని అంటారు. మిన్నంటే జయజయ ధ్వానాల మధ్య రథాలు నెమ్మదిగా కదులుతాయి. సుమారు మూడు కిలోమీటర్ల దూరం ఉన్న గుండిచా ఆలయానికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. జగన్నాథుని రథయాత్రలో ఆ భగవంతుడికి ఏమైనా లోటుపాట్లు జరిగితే భక్తులు ఎంత ప్రయత్నించినా రథం అంగుళం కూడా ముందుకు సాగదు. రథం ఆగిపోయిన సమయంలో భక్తులంతా తాము ఏదైనా అపచారం చేసినట్టయితే క్షమించవలసిందిగా వేడుకుంటూ కొబ్బరికాయలు కొడితేనే రథం కదులుతుంది. రథం గుండిచా వనానికి చేరుకున్నాక, ఆ రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూలవిరాట్టులు విశ్రాంతి తీసుకుంటారు. మర్నాడు పొద్దున మేళతాళాలతో గుడి లోపలికి తీసుకు వెడతారు. స్వామి వారు అక్కడ ఏడు రోజుల పాటు ఉంటారు. ఐదోరోజు ఓ విశేషం జరుగుతుంది. ఆలయంలోకి తనతో పాటు తీసుకెళ్ళలేదని అలిగిన లక్ష్మీదేవి, పట్టరాని కోపంతో గుడి బయట నుంచే స్వామిని ఓర కంట చూస్తూ ఆయన రథాన్ని కొంత మేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ ముచ్చట అంతా పూజారులే నిర్వహిస్తారు. ఆ రోజును ‘హీరాపంచమి’ అంటారు. వారంరోజుల పాటు గుడిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమి నాడు తిరుగు ప్రయాణమవుతారు. దీన్ని ‘బహుదాయాత్ర’ పేరిట జులై 26న నిర్వహిస్తారు. జగన్నాథుడు మార్గమధ్యలో ‘అర్థాసని’ (మౌసీ మా) గుడి దగ్గిర ఆగి తియ్యటి ప్రసాదాల్ని ఆరగిస్తాడు. మధ్యాహ్న సమయానికి మూడు రథాలూ ఆలయానికి చేరుకుంటాయి. తరువాతి రోజు ఏకాదశినాడు స్వామివారిని బంగారు ఆభరణాలతో అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు. ద్వాదశినాడు మళ్ళీ విగ్రహాలను రత్నసింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పరిసమాప్తి అవుతుంది. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని రూపాన్ని మనసంతా నింపుకుని భక్తజనం తిరుగుముఖం పడతారు.

స్వామివారి ప్రసాదం అమృతతుల్యం
ఎంతో శ్రద్ధతో తయారు చేసే స్వామివారి ప్రసాదాన్ని భక్తులు భక్తిప్రపత్తులతో స్వీకరిస్తారు. పూరీలో స్వామి వారికి నివేదించే అన్నాన్ని ‘మహాప్రసాదం’ అని పిలుస్తారు. రథయాత్ర నాడు జగన్నాథుడు ఏదో ఒక రూపంలో స్వయంగా తనకు నివేదించిన ప్రసాదాన్ని ఆరగిస్తారని భక్తుల విశ్వాసం. కుండ మీద కుండ పెట్టి ప్రసాదాలు వండుతారు. ఒకసారి వాడిన కుండను మరోసారి వాడరు. ఆలయ ప్రాంగణంలోనే ప్రసాద వితరణ జరుగుతుంది.

రథ నిర్మాణం
పూరీ రథయాత్రలో రథాల నిర్మాణం ఓ మహాయజ్ఞమే! రథయాత్రకు అరవై రోజుల ముందు నుంచే పనులు ప్రారంభమవుతాయి. పూరీ మహరాజు పూజారుల్ని పిలిచి కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు. సామంతరాజు దసపల్లా అప్పటికే అవసరమైన వృక్షాల్ని గుర్తించి ఉంచుతాడు. వాటికి వేదపండితులు శాంతి నిర్వహించాక...జాగ్రత్తగా నరికి 1,072 కాండాలను పూరీకి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13వేల ఘనపుటడుగుల కలప అవసరం అవుతుంది. ప్రధాన పూజారి నేతృత్వంలో శిల్పుల బృందం రథాలను తయారు చేయడం మొదలుపెడతారు. వీటి తయారీలో ఎక్కడా యంత్రాల్ని వాడరు. నిర్మాణాలు పూర్తయిన తరువాత రథాల్ని యాత్రకు ఒకరోజు ముందుగా...ఆలయ తూర్పుభాగంలోని సింహ ద్వారం దగ్గర నిలబెడతారు. లాగేందుకు అనువుగా ఒక్కో రథానికి 250 అడుగుల పొడవు, ఎనిమిది అంగుళాల మందం ఉన్న తాళ్ళను కడతారు. రథయాత్ర జరిగిన తర్వాత రథాలను భగ్నం చేస్తారు.

జగన్నాథుడు ఊరేగే రథాన్ని ‘నందిఘోష’ అంటారు. ఈ రథం ముప్ఫైనాలుగున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. 18 చక్రాలు ఉంటాయి. బలభద్రుడు ఊరేగే రథాన్ని ‘తాళధ్వజ’ అంటారు. ఈ రథం ముప్ఫైమూడు అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి. సుభద్రాదేవి ఊరేగే రథాన్ని ‘దేవదాలన’ అంటారు. ఈ రథం ముప్ఫైఒకటిన్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ రథానికి 14 చక్రాలు ఉంటాయి. ఈ మూడు రథాలు అలంకరించడానికి 12వందల మీటర్ల పట్టు వస్త్రాన్ని ముంబాయిలోని ఓ మిల్లు వారు విరాళంగా అందజేస్తారు.

నవకళేబర యాత్ర
జగన్నాథుడు జీర్ణమైన దారువును విడిచిపెట్టి, కొత్త దారువులోకి ప్రవేశించడమే నవకళేబరం. మనిషి సంసారమనే భ్రమలో చిక్కుకుని అందులోనే మునిగి తేలుతుంటాడు. అలాంటి భ్రమలొద్దు...ఈ జీవితం మాయ, ఈ శరీరం మాయ, శరీరాన్ని ఎప్పుడైనా విడిచిపెట్టాల్సిందే అంటూ ఆ జగన్నాటక సూత్రధారి జీవులను హెచ్చరించడమే ‘నవకళేబర యాత్ర’ అంతరార్థం. పూరీ జగన్నాథ రథయాత్ర ఏటా ఘనంగా జరిగేదే! కానీ ఈసారి, ఆ యాత్రకు ‘నవకళేబర యాత్ర’ తోడైంది. జగన్నాథుడు తన సోదరుడు బలభద్రుడూ, సోదరి సుభద్రతో కలిసి పాత దారుమూర్తుల్ని విసర్జించి కొత్త దారురూపాలలోకి ప్రవేశిస్తాడు. ఆ సందర్భంగా పూరీ క్షేత్రం వైకుంఠాన్ని తలపిస్తుంది. నవకళేబర మహోత్సవం అధిక ఆషాఢంలో వస్తుంది. ఇది ఇన్నేళ్ళకోసారి జరుగుతుందని చెప్పడం కష్టం. సాధారణంగా 8, 11, 19 సంవవత్సరాలకోసారి వస్తుంది. క్రీ.శ. 1039లో 27 సంవత్సరాల వ్యవధి తీసుకుంది. 1912, 1920, 1931, 1950, 1969, 1977, 1996..తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతోంది. ఈ శతాబ్దిలో ఇదే మొదటి యాత్ర.

Jul 18, 2015

నవకళేబర యాత్ర ప్రారంభం

ప్రతి యేటా ఎంతో వైభవంగా నిర్వహించే పూరిజగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. ముఖ్యంగా  విశిష్టమైన మిలీనియం నవకళేబర యాత్ర ప్రారంభమైంది. క్షలాదిమంది భక్తులతో సుమారు మూడు కిలోమీటర్ల మేర ఈ యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రకై పూరీ నగరం సర్వాంగసుందరంగా ముస్తాబైంది.

బలభద్ర, సుభద్ర సమేతుడై జగన్నాథుడు పూరీ పురవీధుల్లో దర్శనమిచ్చే అద్భుత క్షణాలకు సమయం ఆసన్నమైంది. ఈ ఉత్సవాలను కనులారా వీక్షించేందుకు లక్షలాది భక్తులు ఇప్పటికే పూరి చేరుకున్నారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్ష విదియ నాడు మొదలై... తొమ్మిది రోజుల తర్వాత ఆషాడ శుక్ల దశమితో వేడుకలు ముగుస్తాయి. తొమ్మిది రోజుల పాటు వేడుకగా జరిగే ఈ ఉత్సవాల కోసం ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

పూరీ జగన్నాథుడి ఆలయం పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది జగన్నాథ రథయాత్రే కానీ.. ఆ ఉత్సవంతో పాటు అక్కడ ఎన్నో ఆసక్తికరమైన వేడుకలు జరుగుతుంటాయి. వాటన్నిటిలోకీ ప్రత్యేకమైనది.. నవకళేబర. అంటే.. కొత్త దేహం అని అర్థం. పూరీ ఆలయంలో జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలు రాతి విగ్రహాల్లాగా శాశ్వతం కావు. కొయ్యతో తయారైనవనే విషయం అందరికీ తెలిసిందే. అధిక ఆషాఢ మాసం వచ్చిన సంవత్సరంలో... పూరీ క్షేత్రంలో గర్భగుడిలోని దారు విగ్రహాలను తొలగించి వాటి స్థానంలో కొత్తగా వేప చెక్కతో చెక్కిన సరికొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఈ వేడుకనే నవకళేబర’గా వ్యవహరిస్తారు. అధిక ఆషాఢ మాసం కనిష్ఠంగా 8 సంవత్సరాల నుంచి గరిష్ఠంగా 19 సంవత్సరాలకొకసారి వస్తుంటుంది.

ఒడిశా ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఉత్సవాల ఏర్పట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సుమారు రెండువేలమంది వాలంటీర్లు సిద్ధంగా ఉన్నాయి. మెడికల్ క్యాంపులు, అంబులెన్స్, పారామెడికల్ సిబ్బంది, ప్రథమ చికిత్సా కేంద్రాలు భక్తుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచారు.

మరోవైపు ఈ సందర్భంగా ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పాలు ఈ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తమ సృజనాత్మకు పదును పెట్టి జగతి నాథుడు శ్రీజగన్నాథుని నవకళేబర మహోత్సవం విశ్వవ్యాప్తంగా ఆబాలగోపాలాన్ని విశేషంగా ఆకట్టుకునేలా పూరీ బీచ్లో అద్భుతాన్ని సృష్టించారు.

25 June 2017

పూరి జగన్నాథ రథయాత్ర

వస్తున్నాయ్‌ వస్తున్నాయ్‌ జగన్నాథ రథచక్రాల్‌ వస్తున్నాయ్‌ అన్నారు మహాకవి శ్రీశ్రీ.

జూన్‌ 25వ తేది ఆదివారం అషాడ శుక్ల విదియ నాడు పూరి జగన్నాథ రథయాత్ర చక్రాలు కదులుతున్నాయి.

ప్రతి సంవత్సరం జరిగే పూరీ జగన్నాథ యాత్ర యావత్‌ భారతదేశంలో అత్యంత ఆకర్షణీయమైన రథయాత్ర. ఇది మరెక్కడ కానరాదు. మంగళ వాద్యములు, రాండోళ్ళు, నగారాలు జయజయ ధ్వానాల మధ్య రథ చక్రాలు చురుగ్గా కదులుతాయి. దారు రూపంతో నున్న స్వామి చాలా ఆకర్షణీయం. దారు అంటే కొయ్య. 19 సం||లకు ఒకసారి మాత్రమే నవకళేబర యాత్ర జరుగుతుంది. ఇది 2015లో జరిగింది. మూర్తులు కొత్తవి చేసి ప్రాణ ప్రతిష్ఠ కావించే కార్యక్రమమే నవకబేళబర యాత్ర. ఈ జీవితం మాయ అని, శరీరం మాయ అని, దీనిని ఎప్పుడైన విడచి పెట్టవలసినదే అంటూ జగన్నాటక పాత్ర ధారులైన మానవులును జగన్నాటక సూత్రధారి అయిన భగవంతుడే హెచ్చరించుటయే ఈ మ¬త్సవం.

ఆలయ చరిత్ర :
ప్రస్తుత ఆలయం 12వ శతాబ్ధంలో రాజా అనంతవర్మ చోడగంగ దేవ్‌ మొదలు పెట్టారు. ఆయన మనుమడు రాజా అనంగ భీమదేవ్‌ పాలనలో పూర్తయింది. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని ప్రతీతి. ఒకనాటి రాత్రి ఇంద్రద్యుమ్న మహారాజుకు జగన్నాథుడు కలలో కన్పించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖ ద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొని వస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని చెప్పి అదృశ్యమయ్యాడు. కొయ్యలయితే కొట్టుకొని వచ్చాయి. కాని విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో దేవ శిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వచ్చి రహస్యంగా విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఎవరూ రాకూడదని చెప్పి తలుపులు వేసుకొని పని మొదలు పెట్టాడు. ఎన్ని రోజులకు గది నుండి శబ్దం రాకుండుట గ్రహించిన రాణి గుండిచా దేవి త్వర పెట్టినందుకు రాజు తలుపులు తెరిపించాడు.

శిల్పి కనబడలేదు. చేతులు, కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిచ్చాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మను ప్రార్థించగా చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీద అదే రూపంలో విగ్రహాలు పూజలందుకొంటాయని ఆనతిచ్చినాడట. తానే స్వయంగా వాటికి ప్రాణ ప్రతిష్ట చేశారట. పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించనిది అందుకేనంటారు. చతుర్దశ భువనాలను వీక్షించడానికి అన్నట్లు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి.

ఆలయ విశిష్టతలు :
దేశంలోని మోక్ష దాయక ప్రదేశాలలో పూరీ ఒకటి. మత్స్య, స్కంద, విష్ణు, వామన పురాణాల్లో పూరీ ప్రస్తావన కనిపింస్తుంది. మధ్యలో ప్రధాన ఆలయం, చుట్టూ పార్శ్వదేవతల ఆలయాలు, ఆనంద బజార్‌ (ప్రసాదాల విక్రయశాల), వంటశాల… వీటన్నింటినీ కలుపుతూ ఒక రేఖ గీస్తే శంఖాకారం వస్తుంది.

అందుకే ఈ క్షేత్రానికి శంఖక్షేత్రమని పేరు. రత్న సింహాసనం మీద కుడివైపు బలభద్రుడు, వామభాగంలో జగన్నాథుడు, మధ్యలో సుభద్రాదేవి బంగారంతో చేసిన శ్రీదేవి, వెండితో చేసిన భూదేవి విగ్రహాలు కొలువై ఉంటాయి.

ప్రధాన ఆలయం ఎత్తు 214 అడుగులు. గర్భాలయాన్ని విమాన మండపమనీ, భక్తులు నిలబడి చూసే ప్రాంతం జగమోహన మండపం అనీ అంటారు. దేవదాసీ విధానాన్ని తెలిపే నాట్య మండపం, స్వామికి హారతులిచ్చే భోగ మండపం ఉన్నాయి. ఆలయ ప్రహరీ సింహద్వారం ఎదుట అరుణ స్థంభం కలదు. ఆలయ శిఖరం మీద సూర్యుని రథసారథి అరుణుని ప్రతిమ కనిపిస్తుంది. గోపుర శీర్ష స్థానంలో అష్టధాతువులతో తయారైన నీలచక్రాన్ని స్థాపించారు. శిఖరం మీద పతిత పావన పతాకం గాలి వీచు వైపునకు కాకుండా వ్యతిరేక దిశలో ఎగురుతుంటుంది. ప్రతీ ఉదయం దాన్ని మార్చి, కొత్త ధ్వజాన్ని ఎగుర వేస్తారు.

రథయాత్ర
రథయాత్రకు ఉపయోగించే రథాలను ప్రతి సంవత్సరం కొత్తవి తయారు చేస్తారు. ఈ యాత్రకు  60 రోజుల ముందు వైశాఖ బహుళ విదియ నాడు రథ నిర్మాణం పనులు ప్రారంభిస్తారు. కలప సేకరించి జగన్నాథుడి రథం కోసం 832 ముక్కలను, 763 ముక్కల్ని బలభద్రుని రథం కోసం, 593 ముక్కలను సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు. జగన్నాథుని రథం పేరు నంది ఘోష. ఎత్తు 46 అడుగులు, 6 అడుగుల ఎత్తు, 16 చక్రములు ఉంటాయి.

బలభద్రుని రథం తాళ ధ్వజం. సుభద్రాదేవి రథాన్ని దేవదళన్‌గా పిలుస్తారు. రథాల్ని యాత్రకు 1 రోజు ముందు ఆలయం తూర్పు భాగంలో సింహద్వారం దగ్గర నిలబెట్టి లాగేందుకు ఒక్కొక్క రథానికి 250 అడుగుల పొడవు 8 అంగళముల మందం ఉన్న తాళ్ళను కడతారు.  జగన్నాథ రథానికి పసుపు వస్త్రం, బలభద్రుని రథానికి ఆకు పచ్చ వస్త్రం, సుభద్ర రథానికి నలుపు ఎరుపు రంగు వస్త్రం చూడతారు. విగ్రహాలను కదలించి మేళ తాళాలతో, నినాదాలతో, రథం వెనుక వైపు నుంచి తెచ్చి రత్నపీఠం మీద ఉంచుతారు. ఈ ఉత్సవాన్ని ”పహండీ” అంటారు. ఈ ఉత్సవంలో కులమత బేధాలకు తావు లేదు. పూరీ రాజు పల్లకీలో వచ్చి పరమాత్ముని ముందు సేవకునిగా మారి బంగారు చీపురుతో రథాల లోపల ఊడుస్తాడు. ”దీన్ని చెరాపహారా” అంటారు. కస్తూరి కళ్ళాపి జల్లి హారతిచ్చి ”జైజగన్నాథ” అని నినదిస్తూ తాళ్ళను లాగడంతో ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథుని రథయాత్ర (25.06.2017 ఆదివారం) మొదలవుతుంది.

దీనినే గుండిచా యాత్ర, ‘‘ఘోష యాత్ర” అని అంటారు. సుమారు 3 కి.మీ. ఉన్న గుండిచా ఆలయాన్ని చేరుటకు 12 గంటలు పడ్తుంది. స్వామి వార్లు 7 రోజులు అక్కడ ఉంటారు. గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించి సుభద్ర, బలభద్ర, జగన్నాథులు దశమి నాడు తిరిగి ప్రయాణం అవుతారు. ద్వాదశి నాడు మళ్ళి విగ్రహాలను రత్నసింహాసనం పై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది.

ప్రత్యేకంగా ప్రసాదం తయారీ
స్వామి వారి ప్రసాదం చాలా ముఖ్యం. వివిధ భోగాల పేరుతో 64 రకముల పిండి వంటలు చేస్తారు. ఒకసారి వండిన పాత్రులు మరలా ఉపయోగించరు. కుండ మీద కుండ పెట్టి అక్కడ కట్టెల పొయ్యిమీద వండే వంట పద్ధతి చిత్రమే. వంటశాలను చూచుటకు రుసుము కలదు. చాలా పెద్ద వంటశాల, నేను తిరిగి చూసాను. కుండలు కుంభారు గ్రామస్థులు చేసినవే. జగన్నాథునికి సమర్పించే అన్న ప్రసాదాన్ని. ఓబడా అంటారు. విష్ణుమూర్తి ప్రొద్దున్న స్నాన సంధ్యాదులు రామేశ్వరంలో ఆచరిస్తాడని, అల్పాహారాన్ని బదరీనాథ్‌లో తీసుకుంటాడని; మధ్యాహ్న భోజనానికి పూరీ చేరుకుంటాడని, రాత్రికి ద్వారకలో విశ్రాంతి తీసుకుంటాడని ప్రతీతి. విష్ణు, శివ, బౌద్ధ, జైన సాంప్రదాయాలు గుడిలో కనబడతాయి.

చూడదగ్గ ప్రదేశాలు
పూరీ దగ్గరలో సాక్షి గోపాల్‌ ఆలయం 18 కి.మీ. దూరంలో ఉన్నది. కోణార్క్‌ కూడా పూరీ వెళ్ళినప్పుడు చూడవలసిన ప్రదేశం. జయదేవుడు అష్టపదులు రచించింది పూరీలోనే అను నానుడి కలదు.

ఎలా వెళ్ళాలి :
పూరీ క్షేత్రం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు 60 కి.మీ., ఖుర్దా రోడ్‌ నుంచి 45 కి.మీ. ఉంటుంది. దేశంలో అన్ని చోట్ల నుంచి పూరీకి రైలు సౌకర్యం కలదు.

జైజైజై జగన్నాథ్‌
ఎస్‌.వి.ఎస్‌.భగవానులు