Sunday, 16 August 2015

అన్నవరం సత్యనారాయణస్వామి






కోరిన వరాలిచ్చే సత్యదేవుడు..!

కోరిన వరాలు ఇచ్చే స్వామిగా, రత్నగిరీశుడిగా, సత్యానికి ప్రతీకగా భావించే సత్యనారాయణస్వామి కల్యాణోత్సవానికి అన్నవర క్షేత్రం అంగరంగవైభవంగా ముస్తాబవుతోంది. ఏటా వైశాఖ శుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి (ఈ ఏడాది ఏప్రిల్‌ 25 నుంచి మే 1) వరకూ జరిగే ఈ వేడుకల్లో పాల్గొనడానికి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఇల్లుకట్టినా, పెళ్లిచేసినా లేదా గృహంలో మరేదైనా శుభకార్యం జరిగినా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పక ఆచరిస్తారు. ‘శ్రీసత్యనారాయణునీ సేవకు రారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా...’ అంటూ స్వామిని కీర్తిస్తూ పులకిస్తారు. అలాంటి సత్యదేవుడు తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో రత్నగిరి మీద అనంతలక్ష్మీ సమేత శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామిగా విరాజిల్లుతున్నాడు. ఈ క్షేత్రంలో స్వామి ఎడమవైపు అమ్మవారూ కుడివైపు ఈశ్వరుడితో కలిసి ఒకే పీఠంమీద దర్శనమిస్తారు.

స్థల పురాణం
వీరవేంకట సత్యనారాయణ స్వామి కొలువైన ఈ ప్రాంతం రత్నగిరిగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ ఆలయానికి సంబంధించి రెండు స్థలపురాణాలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం రత్నాకరుడు అనే విష్ణుభక్తుడు స్వామి కోసం తపస్సు చేస్తాడు. అనుగ్రహించిన విష్ణుమూర్తి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. ‘ఎప్పుడూ నేను నీతో కలిసి ఉండే భాగ్యాన్ని ప్రసాదించ’మని వేడుకుంటాడు. ‘కలియుగంలోని భక్తులను రక్షించడానికి శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామిగా వస్తాననీ అప్పుడు రత్నగిరి రూపంలో ఉన్న నీ కొండపై కొలువుతీరుతాననీ’ అభయం ఇస్తాడు విష్ణుమూర్తి. అలా ఈ యుగంలో స్వామి రత్నగిరీశుడు అయ్యాడు. ఇలాంటిదే మరో కథనం... దశాబ్దాల కిందట గోర్స జమిందారు రాజా ఇనుగంటి వేంకట రామనారాయణం ఏలుబడిలో అన్నవరం గ్రామం ఉండేది. ఆ ఊరికి గ్రామ పెద్దగా ఈరంకి ప్రకాశరావు ఉండేవాడు. ఒకనాటి రాత్రి ఇద్దరి కలల్లో ఏక సమయంలో విష్ణుమూర్తి సాక్షాత్కరించి ‘రాబోయే శ్రావణ శుక్ల విదియనాడు నేను రత్నగిరిపై వెలుస్తున్నాను. నన్ను శాస్త్రనియమానుసారం ప్రతిష్ఠించి, సేవించ’మని ఆజ్ఞాపించాడట. మర్నాడు ఇద్దరూ ఆ రత్నగిరికి చేరుకుని వెతికితే అక్కడ ఒక పుట్టలో సత్యనారాయణ స్వామి విగ్రహం కనిపించిందట. దీంతో వారు అక్కడే స్వామిని ప్రతిష్ఠించారట. తర్వాతి కాలంలో స్వామి ఉన్న ఈ క్షేత్రం సత్యదేవుని వ్రతాలకు విశిష్టమైందిగా ప్రాచుర్యం పొందింది. కార్తిక, శ్రావణ మాసాల్లో ఇక్కడికి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తారు.

ప్రత్యేక పూజలు
ఆలయంలో స్వర్ణపుష్పార్చనా, జన్మ నక్షత్ర పూజలూ ప్రధానంగా నిర్వహిస్తారు. సప్తగోప్రదక్షిణశాల, ఫలబాయంత్రం ఇక్కడ ప్రత్యేకం. సత్యనారాయణ స్వామివారి వార్షిక కల్యాణం, కార్తికమాసంలో తెప్పోత్సవం, గిరి ప్రదక్షిణ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడి స్వామివారికి నిత్యం సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహిస్తారు.

ప్రసాదం ప్రత్యేకం
సత్యనారాయణస్వామి వ్రతానికి ఎంత ప్రాముఖ్యత ఉందో స్వామి ప్రసాదానికీ అంతే విశిష్టత ఉంది. ఈ విషయ ప్రస్తావన వ్రత కథలో కూడా కనిపిస్తుంది. సాధారణంగా ఏ దేవాలయానికి వెళ్లినా లడ్డూనో, పులిహోరో లేదూ అంటే చక్కెరపొంగలో ప్రసాదంగా అందిస్తుంటారు. కానీ ఈ సత్యదేవుని ఆలయంలో మాత్రం గోధుమ నూకతో ప్రత్యేకంగా తయారుచేసిన ప్రసాదాన్ని అందిస్తారు.

ఇలా చేరుకోవాలి
ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. అన్నవరం బస్‌స్టాండ్‌ నుంచి దేవస్థానం బస్సుల్లో రత్నగిరికి చేరుకోవచ్చు. రైలు విషయానికి వస్తే అన్నవరంలో రైల్వేస్టేషన్‌ ఉంది. అక్కడి నుంచి కూడా స్వామివారి దేవస్థానం బస్సులు ఉంటాయి.

- పాకలపాటి వెంకటరాజు


No comments:

Post a Comment