Thursday, 20 August 2015

అహోబిలం-యాత్రా విశేషాలు

"కలడంబోధి కలండు గాలి గలడాకాశంబునన్ గుంభినిన్
గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
గలడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటన్
గలడీశుండు గలండు తండ్రి! వెదుకంగా నేల యీ యా యెడన్? "

అంటూ "ఎందెందు వెదకి చూసిన అందందె కలడు విష్ణువ"ని అచంచల విశ్వాసంతో పలికిన అచ్యుతపద శరణాగతుడైన ప్రహ్లాదుని వాక్కును సత్యం చేసేందుకు స్థంభం నుండి సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే నరహరిగా ఉద్భవించిన మహోత్కృష్ట ప్రదేశం "అహోబిలం".

విచ్చుకున్న తామరలతో శోభిల్లే కొలనులు, సూరీడు తొంగి చూసేందుకు కాస్తంతైనా అనుమతివ్వని అమలిన అడవి అందాలు, నున్నటి గులకరాళ్ళ మీద జారిపోయే అడుగులతో ప్రయాణాలు, దారంతా వినిపించే జలపాతాల గుసగుసలు, భవనాశిని జల్లుల్లో చలిగిలిగింతలు, మరెక్కడా కనపడని కొన్ని వింత పూవులు, లతలు, దూరంగా ఎక్కడి నుండో వినిపించే హరి నామ స్మరణలు, ఎటుపక్కకు చూసినా కనువిందు చేసే లేత ఆకుపచ్చ రంగులు, వాటి చుట్టూరా రెక్కలు విదుల్చుకుంటూ తిరిగే రంగురంగుల సీతాకోకచిలుకలు, శ్రావణ భాద్రపదాల్లో విరివిగా కురిసిన వర్షాలకు పూచిన కొండమల్లెలు పంచే పరిమళాలు, ఎత్తైన పర్వత శిఖర అంచుల మీద, కలవరపెట్టేంత లోతైన లోయను కళ్ళు విప్పార్చుకుంటూ చూస్తుంటే సొంతమయ్యే అనుభవాలు, అడుగులో అడుగు వేసుకుంటూ, అడుగు జారితే స్వర్గమే నన్న అపరిచితుల మాటలకు అప్రయత్నంగానే నవ్వులతో బదులిస్తూ సాగే నడకలు, అన్నింటి కంటే ముఖ్యంగా, మనస్సు అనుక్షణం ఆశపడే అద్భుతమైన మౌన ప్రపంచం.........- - స్వర్గలోకాల దారులను వర్ణిస్తున్నా అనుకుంటున్నారా...ఊహూ..అహోబిలం ప్రకృతి సౌందర్యాన్ని నా కళ్ళతో మీకూ చూపిస్తున్నానంతే!


స్వయంవక్త క్షేత్రంగా, నవ నరసింహులు కొలు తీరిన పరమ పవిత్ర పుణ్య స్థలంగా, ఈ ప్రాంతం గురించి చాలా మంది వినే ఉంటారు. ఎన్నాళ్ళుగానో వాయిదా పడుతున్న నా ప్రయాణం, అనుకోకుండా ఇటీవలే సాధ్యపడింది. మాటలకందని అనుభవం! అయినా సరే, ఆ ప్రాంతం గురించి నాకు తెలీని, ఎన్నడూ వినని ఎన్నో విషయాలు నేర్చుకున్న ఉత్సాహంతో, అవి పంచుకునేందుకో చిరు ప్రయత్నం.

అహోబిలం దాకా సరాసరి వెళ్ళేందుకు కుదరకపోవడంతో, బెంగళూరు-నంద్యాల- ఆళ్ళగడ్డ-అహోబిలం వెళ్ళాము. ఈ నంద్యాల-అహోబిలం రహదారిలో కారు ప్రయాణమైతే మహా మంచిది. చక్కగా వానలు పడుతున్న రోజుల్లో వెళ్ళామేమో ఎటు చూసినా ఆకుపచ్చని పొలాలు; ఏ ఆకాశహర్మ్యాలు లేవు కనుక, మీ కళ్ళు కొలిచినంత,కొలవగలిగినంత మేరా మీదే! ఆవలి ఒడ్డున భూమ్యాకాశాలు కలిసే వరకూ అడ్డేమీ లేకుండా కనపడుతుంది. మహానగరాల్లో నివసిస్తూ రోజువారీ పనుల్లో సతమైపోతూ, ఎప్పుడైనా బుద్ధి పుట్టి బయటకు వచ్చినా నాలుగు దిక్కుల్లోనూ కాపు కాస్తున్నట్టుండే అపార్ట్‌మెంట్‌లు రాక్షసంగా నవ్వితే చిన్నబుచ్చుకుని ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళకి, ఇక్కడి ప్రకృతి కావలసినంత సంతోషాన్ని కానుకిస్తుంది.

ముందే చెప్పినట్టు అహోబిలంలో నవ నరసింహ క్షేత్రాలున్నాయి. అన్నీ స్వయంవక్త క్షేత్రాలే కావడం, ప్రతి క్షేత్రంలో స్వామివారు ఒక్కో గ్రహానికి అధిపతిగా ఉండటం ఇక్కడి ప్రత్యేకతలు. దిగువ అహోబిలం(కొండ క్రింది భాగంలో)భార్గవ,ఛత్రవట,యోగానంద నరసింహులు, ఎగువ అహోబిలంలో(కొండ పైన) కారంజ, అహోబిల, మాలోల, క్రోడ, పావన, జ్వాలా నరసింహులు కొలువు తీరి ఉంటారు. ఒక్కో అవతారానికీ ఒక్కో కథ ఉంది. ఒక్కో దర్శనానికి, క్షేత్ర పురాణం ద్వారా నేను విన్న దాన్ని బట్టి, ఒక్కో విశేష ఫలం ఉంది.

దిగువ అహోబిలంలో పైన చెప్పినవి కాక, మొట్టమొదట మనకు కనపడే లక్ష్మీ నరసింహుని గుడిలో మాత్రం, విగ్రహ ప్రతిష్ట జరిగింది. దీనితో పాటు, భార్గవ, యోగానంద, ఛత్రవట క్షేత్రాలలో స్వామి శాంత స్వరూపులు.

భార్గవ నరసింహ స్వామి :

పూర్వం పరుశురాముడు ఇక్కడ తపస్సు చేసినప్పుడు భగవంతుడు ప్రసన్నుడై భక్తవత్సలుడిగా ప్రత్యక్షమైనప్పుడు, పరశురాముడు సంతృప్తి పడక, హిరణ్యకశిపుడిని చంపిన ఉగ్రనరసింహుని రూపంలో తనకు దర్శనమీయమని ప్రార్థిస్తాడు. అతని కోరిక తీర్చేందుకు అవతరించిన ప్రదేశం ఇది. హిరణ్య వథ చేస్తున్న స్వామి విగ్రహం కనపడుతుంది. దీనికి సుమారుగా ఒక వంద మెట్ల దాకా ఎక్కాల్సి ఉంటుంది. కష్టమేమీ ఉండదు. అహోబిలం నుండి ఇక్కడకు సరైన ప్రయాణ మార్గాలేమీ ఉండవు. నడచి లేదా అక్కడ దొరికే ఆటోలో వెళ్ళాల్సిందే. దాదాపు అడవిలో వెళ్ళినట్టే ఉంటుంది.

మెట్ల మొదట్లో ఒక పక్కగా కోనేరుంటుంది. పరుశురాముడు తవ్వాడని, ఐదడుగుల లోతు మాత్రమే ఉన్నా ఎన్నడూ ఎండిపోదనీ పూజారి చెప్పారు. కోనేటి నిండా తామరలే. అందంగా, కొన్ని పూర్తిగా విచ్చుకున్నవీ, కొన్ని ముడుచుకున్న మొగ్గలు, తామరకుల మీద తొంగి చూస్తున్న సూరీడికిరణాలు పడి మెరిసిపోతున్న నీటి ముత్యాలు...కాసేపైనా కూర్చోకుండా మిమ్మల్ని వెనుతిరిగి వెళ్ళనివ్వవు.

ఛత్రవట నరసింహ స్వామి :

పూర్వం స్వామి గొడుగులా ఉన్న వట వృక్షం కింద యోగ ముద్రలో ఉన్నప్పుడు, "హాహ" "హూహ్వ"(గైడ్‌లు ఆహా -ఊహ అని చెప్తున్నారు మరి)అనే గంధర్వ కన్యలు ఆకాశ మార్గాన వెళ్తూండగా వారి వాహనం ఈ ప్రాంతానికి చేరగానే ఆగిపోతుంది. అప్పుడు వారిక్కడ మహాశక్తి ఉందని గ్రహించి, స్వామిని చేరి, తమ గాన నృత్య కళలతో స్వామిని ప్రసన్నం చేసుకుంటారు. వామ హస్తంతో తాళం వేస్తూ, ప్రసన్నుడై ఉన్న విగ్రహాన్ని ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ గుడి ప్రాంగణంలో మహత్తరమైన ప్రశాంతత కలుగుతుంది. అలాగే మాట కూడా సంగీతంలా, వీణా వాద్యంలా వినపడుతుంది. చుట్టూ మరేమీ లేకపోవడం వలనేమో.

యోగానంద నరసింహ స్వామి :
హిరణ్యకశిప సంహారానంతరం, ప్రహ్లాదునకు యోగనీతిని, రాజనీతిని బోధించిన అవతారమిది. యోగముద్రలో ఉన్న స్వామి దర్శనమిస్తారిక్కడ. చిన్న గుడి. ఛత్రవట ఆలయంలోనూ, ఇక్కడా పూజారులు ఒక్కరే ఉండడం చేత, ఒకేరోజు వెంటవెంటనే దర్శనాలవ్వడం కష్టం. ఛత్రవటం దాటి ఇక్కడకు రావాలి కాబట్టి, ఆ దారిలో వెళ్ళే ఎవ్వరికైనా ఓ మాట చెప్తే, అయ్యవార్లు వీలైనంత త్వరగా వచ్చే అవకాశం ఉంది.

దీని పక్కనే, నవగ్రహ-నవనరసింహ ఆలయం ఉంది. తొమ్మిది క్షేత్రాలనూ దర్శించుకునే అవకాశం లేని వారు, ఇక్కడికి తప్పకుండా వెళ్ళండి. అన్ని అవతారాలు, వాటితో ముడిపడి ఉన్న గ్రహాల విగ్రహాలతో, ఈ ఆలయం బాగుంటుంది.

కారంజ నరసింహ స్వామి :
Karanja Narasimha swami

నాకు విపరీతంగా నచ్చిన ప్రాంతం ఇది. వంపులు తిరిగిన కొండచిలువ లాంటి రోడు మార్గం మీద ప్రయాణించి ఇక్కడకు రాగానే, సుందర తపోవనానికి వచ్చినట్టు ఉంటుంది. ఆలయం చుట్టూ బోలెడు ఖాళీ స్థలం. అంతా తులసి మొక్కలు. కొండ చరియ విరిగి పడుతుందా అన్నట్టుండే ప్రాతంలో ఉంటుంది.

ఆంజనేయ స్వామి ఇక్కడి కారంజ వృక్షం కింద కూర్చుని తపస్సు చేసినప్పుడు నరసింహ స్వామి ప్రత్యక్షం కాగా, ఆయన నా శ్రీరామచంద్ర ప్రభువు తప్ప వేరెవ్వరూ నాకక్కర్లేదని మొండికేస్తారట. అప్పుడు, అన్నీ తానే అని చాటేందుకు, ఒక చేత్తో విల్లు, ఒక చేత్తో శంఖంతో, నుదుటన త్రినేత్రంతో స్వామి దర్శనమిచ్చి కరుణించారని స్థలపురాణం. ఆ మూర్తే గర్భ గుడిలో ఉండేది. ఆ విల్లు, శంఖం, త్రినేత్రం చాలా స్పష్టంగా కనపడతాయి. "అన్ని నీవనుచు.." అన్న పదాలు అప్రయత్నంగా పెదవుల మీద నాట్యమాడుతుంటే, జోడించిన చేతులతో కళ్ళు మూతలు పడతాయంటే అబద్ధం కాదు. దర్శనభాగ్యానికే మనసు పరవశించిపోతుందంటే అతిశయోక్తి కానే కాదు.

అహోబిల నరసింహ స్వామి :

'అహో' అంటే ఆశ్చర్యం. బిలం అంటే గుహ. ఆశ్చర్యకరమైన గుహలో ఉండే స్వామి కనుక అహోబిల నరసింహ స్వామి అంటారని ఒక కథ. రాక్షస సంహారంతో పలువిథ బాధల నుండి విముక్తులైన దేవతలందరూ కలిసి, మహాబలవంతుడని స్వామిని వేన్నోళ్ళ పొగడడం చేత "అహోబలుడ"య్యాడని మరొక కథనం.

కారంజ ఆలయం నుండి ఇక్కడికి ఒక పది పదిహేను నిముషాల నడక. నడిస్తేనే అసలు మజా! కోతులతో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి.

పేరుకు తగ్గట్టే పూర్తిగా గుహలోనే స్వామి దర్శనమయ్యేది. కొంచం యాదగిరి గుట్టను గుర్తు తెచ్చింది నాకైతే. మహా ఉగ్రరూపం, ఎవ్వరి వల్లా శాంతం పొందని నరసింహ అవతారం, ప్రహ్లాదుడి ప్రార్థనలకు మాత్రమే చలించి, శాంతించాక, ఈ గుహలో స్థిరపడిందని చెప్తారు. బయట భవనాశిని కనపడుతుంది. అక్కడ స్నానం చేసి దర్శనం చేసుకుంటే సమస్త పాప క్షయం జరుగుతుందని ఓ నమ్మకం.

గుడిలోపల, మధ్యలో, ఇనుప కంచెలా ఒకటి కనపడుతుంది. ఆ ప్రాంతంలో ప్రతాప రుద్ర రాజులూ, విజయనగర రాజులు దాచిన అపారనిథులున్నాయని అక్కడి భక్తుల విశ్వాసం. ఈ ప్రాంతం అంతా ప్రభుత్వ అధికారంలో లేదు కనుక, తవ్వకాలూ గట్రా ఏం లేవని గైడ్ చెప్పారు.

క్రోడ నరసింహస్వామి :

ఇది వరాహావతారం. హిరణ్యాక్షుడు భూదేవిని రాక్షస చర్యలతో హింసిస్తున్నపుడు, అతని బారి నుండి భూదేవిని రక్షించి, భుజాలపైకెత్తుకున్న కథ మనకు తెలిసిందే. ఇక్కడి విగ్రహంలో భీకరంగా ఉన్న వరాహాన్నీ, భుజాలపైనున్న భూదేవినీ చూడగలం. ఇదీ స్వయంవక్త క్షేత్రమే కావడం విశేషం.

అహోబిలం గుడి నుండి ఇక్కడకు వచ్చే దారి అద్భుతంగా ఉంటుంది. నీళ్లల్లోనూ, రాళ్ళల్ల్లోనూ నడక. మనకు కొండ మొదట్లోనే పెద్ద పెద్ద పొడవైన వెదురు కఱ్ఱలు ఊతానికి ఇస్తారు. మనిషికి రెండు. తీసుకునేటప్పుడు నేను భలే మొహమాటపడిపోయాను. చిన్నపిల్లని నాకిస్తాడేమిటీ, ఈ మాత్రం నడవలేనని వాళ్ళ ఉద్దేశమా అని. కానీ ఆ కర్రలు భలే అక్కరకొచ్చాయి. ఆ రాళ్ళు రప్పల్లో చెప్పుల్లేని నడక కాస్తైనా సుఖంగా సాగిందంటే వాటి చలవే. రెండు పేద్ద పేద్ద కొండల మధ్యలో, తుళ్ళుతూ కిందపడుతున్న భవనాశిని నీళ్ళల్లో తడుస్తూ, ఆ జలపాతపు సంగీతం వింటూ, వెలుగు చీకట్లు దాగుడుమూతలాడుతుంటే మంత్రముగ్థులమైపోతూ కొండ ఎక్కడం - అదో ప్రత్యేకమైన లోకమే నిజంగా!

జ్వాలా నరసింహ స్వామి :

అహోబిలానికి వచ్చే ఎనబై శాతం మంది, జ్వాలా నరసింహ స్వామి దాకా రాలేరుట. ఆ దారి అలాంటిది. చాలా ఎత్తున ఉంటుంది. అక్కడక్కడా కొన్ని మెట్లుంటాయి కానీ, మొత్తానికి ఎగుడుదిగుడుల్లో కాలినడకే ఎక్కువ. దారి చదునుగా ఉండే సమస్యే లేదు. కోతుల బెడద ఉండనే ఉంది. నల్లమల అడవుల అందాలను సంపూర్ణంగా చూడలనుకునే వారు ఇక్కడి దాకా వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అడుగు జారిందా, చేతులు చాచి ఆహ్వానించే లోయ ఓవైపు, కొసలు తేలినట్టుండే నల్ల రాయి కొండ ఒకవైపు, మూడో దిక్కులో అడవి, నాలుగో దిక్కులో కళ్ళకు విందిచ్చే భవనాశిని జలపాతం. వేదాద్రి పర్వతం చివర్లో భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకునేందుకు అతి సన్నటి దారి ఒకటి ఉంది; తలలు పూర్తిగా వంచి, ఆ కొండ దారిలో వెళ్తుంటే, రెండో పక్క కొండ పైనుండి విపరీతమైన వేగంతో కిందపడే భవనాశిని ఎదురవుతుంది ఒక చోట. అక్కడ ఆ జల్లుల్లో తడిసి తీరాల్సిందే. అసలే దాదాపు పర్వతం పైదాక వచ్చేసి ఉంటామేమో, వణికించే చలి గాలులు ఒళ్లంతా చుడుతుంటే, దానికి తోడు ఈ చన్నీటి స్నానం!

అలా పది అడుగులు వేసాక "రక్త గుండం" కనపడుతుంది. హిరణ్యకశిపుడిని వజ్ర నఖాలతో చీల్చి చంపిన తరువాత, ఆ రక్తపు చేతులను స్వామి ఈ గుండంలో కడిగారట.

దాని పక్కనే జ్వాలా నరసింహ స్వామి దర్శనం అవుతుంది. ఇది నిజానికి హిరణ్యకశిపుడి కోట ద్వారం. బ్రహ్మ నుండి అతను పొందిన వరం ప్రకారం - మనిషీ, జంతువూ కాకుండా నారసింహుని రూపంలో, పగలూ-రాత్రీ కాని సంధ్యకాలంలో, ప్రాణం ఉన్నవీ లేనివీ అని తేల్చరాని నఖాలతో, ఇంటి లోపలా-బయటా కాక గుమ్మంలో, భూమిపైనో-ఆకాశంలోనో కాక తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. జ్వాలా నరసింహ స్వామి దర్శనమిచ్చేది అదే ప్రదేశంలో. తొడల మీద హిరణ్యకశిపుడు, పాదాల వద్ద ప్రహ్లాదుడు, మెడలో ప్రేగులు, మహోగ్ర రూపంలో ఉన్న మూర్తిని చూడగానే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. తనను మనసా వాచా స్మరించి అర్చించిన ఒక భక్తుడిని కరుణించడానికి, కాపాడటానికి అవతరించిన శ్రీహరిని కళ్ళారా చూసి భక్తితో ప్రణమిల్లాలనిపిస్తుంది. ఇక్కడ విశేషమేమిటంటే, స్వామిని శాంతపరచడానికే ఆకాశ గంగ ఇక్కడికి దిగి వచ్చిందని చెప్తారు. అదే భవనాశిని.గుహ పై భాగం నుండి, సరీగ్గా స్వామి అభిషేకం జరుగుతున్నట్టే నీటి చుక్కలు పడుతూ ఉంటాయి. అది నిర్విరామంగా జరిగే ప్రక్రియ. ఏడాది పొడుగునా, ఏనాడూ ఆగకుండా, బొట్టుబొట్టుగా, ఆ ధార స్వామికి అభిషేకం చేస్తూనే ఉంటుంది.
బయటకు రాగానే గ్లాసులతో పానకం ఇస్తారు. ఎంత అడిగినా కాదనరు. పరమ పావన ప్రదేశంలో మనసు చెమరిస్తే, పానకపు చుక్కలతో అందాకా మండిపోయిన గొంతు కూడా చల్లబడుతుంది. ఇహ అక్కడి నుండి మన ప్రయాణం "మాలోల నరసింహ స్వామి" దగ్గరికి.

మాలోల నరసింహ స్వామి :

"మా" అంటే లక్ష్మీ దేవి. లోల అంటే ప్రియుడు. లక్ష్మీ దేవికి ప్రియుడై, లక్ష్మీ వల్లభుడై, శాంతరూపంలో ప్రసన్నుడై ఉన్న స్వామి దర్శనమవుతుంది ఇక్కడ. నరసింహ అవతారంలో స్వామి "చెంచు లక్ష్మి" అనబడే అడవితల్లి ముద్దు బిడ్డని పరిణయమాడారనీ, అది తెలిసి అలక బూనిన అమ్మవారు వైకుంఠం నుండి ఇక్కడకు వచ్చారని, అప్పుడు స్వామి ఇక్కడే అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారని స్థలపురాణం. లక్ష్మీ సమేతుడై, అమ్మవారిని గాఢాలింగనం చేసుకున్నట్లుండే మూర్తిని దర్శించుకోవచ్చు.

ఈ ఆవరణ కూడా ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానాలకి బాగా అనుకూలం. బోలెడన్ని పూలమొక్కలతో, నిండా విరబూసిన రకరకాల పూలతో, దగ్గరికి వెళ్తూండగానే మనసు హాయిగా అయిపోతుంది. మేమిక్కడ ఉన్నప్పుడు ఎవరో భజన సంఘం వారు బృందంగా దర్శనానికి వచ్చారు. అందరూ కలిసి కన్నడలో, కొన్ని తెలుగులో పాటలు పాడారు. అలా అందరం కలిసి పాడుతుంటే నిజంగానే "మదినొకటే హరినామ మంత్రమది చాలదా..తగు వేంకటేశు కీర్తనమొకటి చాలదా ..." అనిపించింది.

పావన నరసింహస్వామి :

చెంచులక్ష్మి సమేతుడైన నరసింహ స్వామి ఉన్నదిక్కడే. ఈ స్వామిని దర్శించుకుంటే చాలా శుభాలు జరుగుతాయనీ, పాపలు పోతాయనీ భక్త జన విశ్వాసం. ఇక్కడికి నడచి వెళ్ళడం మాత్రం చాలా కష్టం. కింద నుండి జీపులు ఉంటాయి. వాటిలో వెళ్ళడం కొంచం సులభం. కుదుపులు ఎక్కువగా ఉంటాయి, కొండదారి కాబట్టి.

చెంచులక్ష్మి అడవిజాతి స్త్రీ కనుక, ఆమె కోసం చుట్టుపక్కల ఊళ్ళ నుండి వచ్చి మరీ ప్రతి శనివారం గుడిబయట బలులిచ్చే సాంప్రదాయం ఈనాటికీ ఉందట. మంచి కోలాహలంగా ఉంటుందని చెప్పారు. నాకైతే చూసే అవకాశం రాలేదు.

క్రోడ నుండి జ్వాలా నరసింహుని దగ్గ్రకు వెళ్తున్నప్పుడు, కొండ మధ్యలో ఒక చోటు నుండి ఉగ్రస్థంభం కనపడుతుంది.

" ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును, చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, .......... వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును, ధగధ్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును, ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయుండును, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును, మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు" స్థంభము నుండి ఆవిర్భవించినది ఇక్కడే. వెళ్ళడానికి బోలెడు బలం, ఓపిక, అవసరమైతే వానరుల్లా చేతులతో నడవగలిగిన ప్రావీణ్యం కావాలన్నారు. నాకు అన్ని ఉన్నాయి కానీ, సమయం సరిపోలేదు.

"చదవనివాడజ్ఞుండగు
చదివిన సదసద్వివేక చతురత గలుగున్
చదువగ వలయును జనులకు
చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ "

అంటూ చండామార్కుల వారికి అప్పజెప్పిన తండ్రి హిరణ్యకశిపుని మాట శిరోధార్యంగా భావించి, పరమ భాగవతుడు ప్రహ్లాదుడు విద్యాభ్యాసము చేసిన "ప్రహ్లాద బడి" మరొక దర్శనీయమైన ప్రదేశము. ఇది కూడా నేను చూళ్ళేకపోయాను.

"పునః దర్శన ప్రాప్తిరస్తు" అని ప్రతి చోటా దీవించిన అయ్యగార్ల ఆశీర్వచనం ఫలించి, మళ్ళీ నవ నరసింహ క్షేత్రంలో అడుగిడగల్గిన భాగ్యం కలిగితే, వాటి విశేషాలతో మరో సారి కలుస్తాను. అందాకా వీటిని అసంపూర్ణంగా వదిలేస్తున్న బాధను దిగమింగుతూ .. :)

No comments:

Post a Comment