Friday, 28 August 2015

ఆగస్టు నెలకే ఉత్తమ ప్రదేశాలు !!

మీరు వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు వేచి ఉండి, ఏదైన ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారా ?
అయితే మీకు ఇది సరైన సమయం.
మీరు తక్కువ వర్షపాతం ఉండే ప్రదేశాలను సందర్శించాలను కుంటే ఇక్కడ మేము అందిస్తున్న కొన్ని ప్రదేశాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి.
మీరు భారతదేశం లో ఆగష్టు లో అసలు సందర్శించడానికి ప్రదేశాలే లేవు కాదా అని చెప్పి వెనుకాడవద్దు.
ఇక్కడ పేర్కొనబడిన కొన్ని ప్రదేశాలు కేవలం ఆగస్ట్ మాసం లోనే .. ఆది కూడా తక్కువ వర్షాలు పడే సమయంలోనే సందర్శించేవిగా ప్రసిద్ధి చెందినవి.
మరి ఆలస్యం చేయకుండా, సూట్ కేస్ లు సర్దుకొని ఇక్కడున్న ప్రదేశాలను ఒకసారి తిరిగొద్డామా !!

ఆగస్ట్ మాసంలోనే సందర్శించాల్సిన ప్రదేశాలు

కూర్గ్ , కర్నాటక
కూర్గ్ లేదా కొడగు పట్టణం కర్నాటక లోని ప్రసిద్ది చెందిన హిల్ స్టేషన్ లలో ఒకటి. ఈ ప్రదేశం ప్రధానంగా పర్వతమయం కనుకనే కూర్గ్ ను ఇండియా లోని స్కాట్ లాండ్ అని, కర్నాటకలోని కాశ్మీర్ అని అభివర్ణిస్తారు. కూర్గ్ లో ప్రధానంగా చూడవలసిన ప్రదేశాలలో అబ్బే ఫాల్స్, మల్లలి ఫాల్స్, మడికేరి కోట, టిబెట్ బంగారు దేవాలయం ప్రధానమైనవి. ట్రెక్కింగ్ చేసే వారికి పుష్ఫగిరి హిల్స్, కోటిబెట్ట,నిషాని మోటి ప్రదేశాలు అనుకూలం. కూర్గ్ ను సందర్శించాలంటే, ఆగస్ట్ మాసం నుండి నుండి నవంబర్ మాసం వరకు అనుకూల సమయం.

అగుంబే, కర్నాటక
మల్నాడు ప్రాంతం అయిన తీర్ధహళ్ళి తాలూకాలో అగుంబే ఒక చిన్న గ్రామం. అరేబియా మహా సముద్రంలోకి సూర్యుడు అస్తమించే సుందర దృశ్యాలను ఈ ప్రదేశంనుండి చూసి ఆనందించవచ్చు. ఎన్నో సహజ అందాలు కల ప్రదేశం ఇది. దక్షిణ భారతదేశంలోని ఈ ప్రాంతం అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు, వివిధ రకాల మొక్కలు జంతువులు ఉంటాయి. ప్రకృతి ప్రియులకు ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ కూడా కలదు. అగుంబే సందర్శించాల్సిన సమయం సమయం ఆగస్టు మాసం.

మున్నార్, కేరళ
కేరళ లోని ఇడుక్కి జిల్లాలో కల మున్నార్ హిల్ స్టేషన్ ఒక అద్బుత పర్యాటక ప్రదేశం. పడమటి కనుమలలోని ఈ ప్రాంతం పూర్తిగా కొండలచే చుట్టుముట్టబడి ఉంటుంది. సైట్ సీయింగ్ ఇక్కడ ఎంతో ఆనందకరంగా ఉంటుంది. ఇక్కడ అనేక ట్రెక్కింగ్ ప్రదేశాలతో ఈ ప్రదేశం బైకర్లకు మరియు ట్రెక్కర్లకు స్వర్గంలా వుంటుంది. ఇక్కడ 12 సంవత్సరాలకొకసారి పూచే నీలక్కురింజి పూవులు పూస్తాయి. మున్నార్ పర్వత శ్రేణుల వాతావరణం ఆగస్టు నెలలో ఆహ్లాదకరంగా ఉండి పర్యాటకులను సందర్శించేలా చేస్తాయి.

అతిరాప్పిల్లి, కేరళ
అతిరాప్పిల్లి అద్భుతమైన జలపాతాలకి, అమోఘమైన వర్షాధార అడవులకి ఇది నెలవు. ఇక్కడ వైవిధ్యమైన వృక్షజాలం మరియు జంతుజాలం కనిపిస్తుంది. అతిరాప్పిల్లి జలపాతం, వళచల్ జలపాతం, చార్పా జలపాతం ఇక్కడ ప్రధానంగా చూడవలసినవి. మీరు ఇక్కడ ట్రెక్కింగ్, పిక్నిక్, షాపింగ్, రివర్ రాఫ్టింగ్, ఇంకా ఇతర వినోద కార్యక్రమాలలో మునిగితేలవచ్చు. మీరు ఆగస్ట్ మాసం లో సందర్శిస్తే జలపాతాల హోరులతో మారుమ్రోగుతూ ఈ ప్రాంతం ప్రతిద్వనిస్తుంది.

వయనాడు, కేరళ
కేరళలో ఉన్న వయనాడు ప్రాంతం ఎన్నో ప్రత్యేకతల వలన ప్రసిద్దమైన పర్యాటకుల మజిలీ అయింది. కళ్ళని తిరిగి ఉత్తేజ పరిచేంత అందం ఈ ప్రాంతం సొంతం. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, చుట్టూ అందమైన పచ్చటి కొండలు, ఆకుపచ్చని సౌందర్యం, సుగంధభరిత తోటలు, దట్టమైన అడవులు మరియు సంపన్న మైన సాంస్కృతిక చరిత్ర ఇక్కడ ఉండే ప్రధాన ఆకర్షణలు. అడవులకి దగ్గరలో ఉన్న కొన్ని రిసార్ట్స్ ల లో అలసి సొలసిన పర్యాటకులని తిరిగి ఉత్తేజపరిచేందుకు ఆయుర్వేదిక్ మసాజ్, స్పా వంటి సౌలభ్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడున్న అందమైన మరియు ప్రశాంత వాతావరణం ఆస్వాదించాలంటే పర్యాటకులు ఆగస్ట్ మాసంలో తప్పక సందర్శించాలి.

కుమరకొం, కేరళ
అందరూ తప్పక వెళ్ళి తీరాలనుకునే అందమైన చిన్న చిన్న ద్వీపాల పొందిక కుమరకొం. ఇక్కడ మనోహరమైన బ్యాక్ వాటర్స్ పైన హాలిడే ని గడపడం ఒక మధురానుభూతి. కుమరకొం లో లభించే వంటకాలలో సంపన్నమైన కేరళ సాంప్రదాయ రుచులు పర్యాటకులకి అద్భుతమైన భోజనాన్ని రుచి చుసిన అనుభూతిని కలిగిస్తాయి. ఈ ప్రాంతంలో లభించే వివిధ రకాల సీ ఫుడ్స్ ఏంతో రుచికరంగా ఉంటాయి.మంత్రముగ్ధుల్ని చేసే ఇక్కడి వాతావరణం ఆగస్ట్ మాసంలో పర్యాటకులని ఆకర్షిస్తూ అంతు లేని ఉల్లాసాన్నిపంచుతోంది.

కొడైకెనాల్, తమిళనాడు
కొడైకెనాల్ పశ్చిమ కనుమలలోని పళని కొండలలో ఉన్న అందమైన, సుందరమైన హిల్ స్టేషన్. ఈ పట్టణం దాని అత్యద్భుతమైన అందం, ప్రజాదరణ కారణంగా పర్వత యువరాణి అని నామకరణం చేయబడింది. తమిళంలో కొడైకెనాల్ అంటే అర్ధం అడవుల బహుమతి. ఇది హనీమూన్ జంటలకి అనువైనది. ఈ ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవుల మధ్య ఉండే మంత్రముగ్ధులని చేసే ప్రకృతి సౌందర్యంతో కూడిన చెట్లు, రాళ్ళు, జలపాతాలు తప్పక సందర్శించాలి.

పాండిచేరి
ఒక విభిన్న పర్యాటక అనుభవాన్ని కోరుకొనే ప్రయాణీకునికి పాండిచేరి ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. సూర్యోదయ నగరంగా కూడా పేరొందిన ఆరోవిల్లె నగరం చక్కని నిర్మాణ శైలితో పర్యాటకులను ఆకర్షిస్తుంది. గాంధీ విగ్రహం, ఫ్రెంచి యుద్ధ స్మారకం, జోసెఫ్ ఫ్రాంకోయిస్ డుప్లెక్స్ విగ్రహం వంటి అనేక స్మారక చిహ్నాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఫ్రెంచి, తమిళ సంస్కృతుల ప్రభావాలతో నిండిన పాండిచేరి, భోజన ప్రియుల కోసం అద్భుతమైన వంటకాలను అందిస్తుంది. ఈ నగరంలోని వీధులు, అంగళ్లు షాపింగ్ అంటే ఇష్టపడే వారికి స్వర్గంలా ఉంటాయి.

మహాబలేశ్వర్ , మహారాష్ట్ర
మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో కల అందమైన ప్రదేశాలతో కూడిన మహాబలేశ్వర్ ఒక ప్రసిద్ధి చెందిన పర్వత ప్రాంతం. నగర జీవనంలో ఒత్తిడి జీవితాలను అనుభవిస్తున్నవారికి ఈ ప్రాంత ప్రశాంతత ఎంతో హాయినిస్తుంది. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలలో సూర్యోదయ ప్రదేశం విల్సన్ పాయింట్ అత్యంత ఎత్తుగల ప్రదేశం. ఎలిఫిన్ స్టోన్ పాయింట్, మర్జోరీ పాయింట్, ప్రతాప్ ఘడ్ కోట వంటివి కూడా మహాబలేశ్వర్ లో దర్శించటం అసలు మరువకండి. మహాబలేశ్వర్ వెళ్ళేవారు అక్కడి స్ట్రా బెర్రీలు తప్పక తిని తీరాల్సిందే. ఇంతటి వినోదాలు, ప్రకృతి అందాలను పంచి ఇచ్చే మహాబలేశ్వర్ ను కొద్ది పాటి తొలకరి జల్లులు పలకరించే ఆగస్టు మాసంలో తప్పక సందర్శించావల్సినదే!

లోనావాలా, మహారాష్ట్ర
లోనావాలా మహారాష్ట్రలోని పశ్చిమ ప్రాంతంలో ఉండే అద్భుతమైన సహ్యాద్రి శ్రేణిలో గల ప్రసిద్ధ పర్వత ప్రాంతం. జాలువారే జలపాతాలు, పరచుకున్న పచ్చదనంతో ప్రకృతి ఇక్కడ చాలా రమణీయంగా ఉంటుంది. మీరు పర్వతారోహణ లేదా పురాతన భారతీయ నిర్మాణాలను ఇష్టపడే వారైతే తుంగ్, తిలోనా, లోహ ఘడ్ కోటలను చూడండి. ఎత్తైన, పచ్చటి చెట్లుగల రైవుడ్ పార్క్ లోనావాలాలో పెద్ద ఉద్యానవనం. సరదాలు పంచే మరో ప్రదేశం శివాజీ ఉద్యాన్. ఈ స్వర్గపు తునకకి ఆగస్ట్ మాసంలో వెళ్ళకపోతే ఏమీ కోల్పోతున్నారో మీకు తెలీదు.

పంచగని, మహారాష్ట్ర
ప్రకృతి రమణియతతో శోభిల్లే పర్యాటక కేంద్రం మహారాష్ట్ర లోని పంచగని. అందమైన పకృతి లో కొండల మధ్య సూర్యాస్తమయం ఆస్వాదించాలన్నా, అలా కాసేపు బొటు లో షికారు చేద్దామనుకున్నా, స్ట్రా బెర్రీ పళ్ళూ కోసుకోవాలన్నా, లేదా మీరు సాహసోపేతమైనా ఆలోచనలున్నవారైతే పారాగ్లైడింగ్ చేయవచ్చు. ప్రకృతి ని ప్రేమించేవారు, పచ్చటి ఒడి లో సేద తీరాలనుకునే వారు తప్పక చూడాల్సిన ప్రదేశం షేర్ బాగ్. ఆగస్ట్ నుంచి నవంబర్ వరకూ కూడా చిత్తడి నేల, చుట్టూ పచ్చటి ప్రకృతి ని ఆస్వాదించడానికి పర్యాటకులు వస్తూనే ఉంటారు.

చిరపుంజీ, మేఘాలయ
స్థానికులు చిరపుంజీ లేదా సోహ్ర అని పిలుస్తారు. భూమి మీద అతి తేమగా ఉండే భూమిగా చిరపుంజీ మంత్రముగ్దులను చేస్తుందని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో అనేక మంత్రముగ్ధమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందమైన నోహ్కలికై జలపాతం ప్రత్యేకంగా దేశంలోనే ఎత్తైన జలపాతలలో ఒకటిగా ఉన్నది. చిరపుంజీ కేవలం దృశ్య వీక్షణం కొరకు మాత్రమే కాదు సాహసోపేతమైన పర్యటనలకు కూడా అనుగుణంగా ఉంటుంది. చిరపుంజి ని ఆగస్టు మాసంలోనే సందర్శించాలి.

No comments:

Post a Comment