Thursday, 20 August 2015

బేలూరు - హళేబీడు - చిక్కమగలూర్

కొన్ని ప్రాంతాలకు వెళ్ళడ మంటే స్మృతుల తీగలను పట్టి ఊయలలూగడం. మన కలల మాలికలో నుండి రాలిపడ్డ పూలన్నీ దోసిలి ఒగ్గి ఏరుకోవడం.
హోయసలుల శిల్పకళారీతులకు కాణాచిగా పేరొందిన బేలూరు-హళేబీడులను చూడటం నాకు అచ్చంగా అలాంటి అనుభవమే మిగిల్చింది. ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రితం, కొత్తగా పరిచయమైన మిత్రులతో కలిసి ఈ ప్రాంతాలన్నీ తిరిగి తిరిగి ఎంత మైమరచిపోయామో. అప్పుడు మేము తీసుకున్న ఫొటోల రీలులో ఏదో ఇబ్బంది రావడంతో, ఒక్క ఫొటో కూడా రాక, అన్ని గుర్తులూ చెరిగిపోయాయి (అప్పట్లో డిజి కెమెరాలు లేవు మా దగ్గర).  ఓ గొప్ప చారిత్రక ప్రదేశం తాలూకు జ్ఞాపకాలను మాకు మిగలకుండా చేసాడని, కెమెరా తెచ్చిన నేస్తాన్ని మైసూర్‌లో ఉన్నంత కాలమూ మాటలతో హింసించేవాళ్ళం. అది మొదలూ మళ్ళీ ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాలనీ, కెమెరా కళ్ళతో కూడా ఆ అందాలను బంధించాలని నాకో కోరిక అలా మిగిలిపోయింది. మొన్న అనుకోకుండా మా వారి మేనత్త వాళ్ళు బెంగళూరు రావడంతో బేలూరు-హళేబీడు- చిక్కమగలూర్ వెళితే బాగుంటుందనిపించింది.     
నాలుగు గంటలకల్లా ఇంటి నుండి బయలుదేరాలని గట్టిగా తీర్మానించుకున్నాం.  ఈ తెల్లవారుఝాము చలిగాలుల్లో మొదలయ్యే ప్రయాణాల్లో ఓ గమ్మత్తైన మజా ఉంటుంది - నాకు వాటి మీద ఓ ప్రత్యేకమైన మోజు. షరా మామూలుగా ఆరు గంటల దాకా మా వీధి మలుపు కూడా తిరగలేకపోయాం. సర్జాపూర్ నుండి బయలుదేరి హళేబీడు చేరేసరికి 10:30 అయిపోయింది. అక్కడ అడుగుపెడుతూండగానే మనమొక మహా సౌందర్యాన్ని కొన్ని క్షణాల్లో దర్శించబోతున్నామని తెలుస్తూ ఉంటుంది. నక్షత్రాకారంలో ఉన్న ఎత్తరుగు మీద ఠీవిగా కనపడే నిర్మాణం, అల్లంత దూరం నుండే మనసులను పట్టి లాగేస్తుంది. మహాలయ నిర్మాతలకు కేవలం శిల్ప పారీణత ఉంటే సరిపోదు, అంతకు మించినదేదో కావాలి. ఒక్కొక్క ఉలి తాకుకూ ఒక్కొక్క కవళిక మార్చుకుంటున్నట్లున్న శిల్పాలతో సందర్శకులను రంజింపజేయడానికి ఆ శిల్పులు ఎన్నెన్ని రాత్రులు నిద్రకు దూరంగా గడిపి ఉంటారో అన్న ఆలోచనే మననొక ఉద్వేగపూరిత లోకంలోకి నెట్టేస్తుంది. వాళ్ళు విశ్వకర్మను గుండెల్లో నింపుకు అహరహం ధ్యానించి ఉంటారు. నృత్యశాస్త్రాన్ని మళ్ళీ మళ్ళీ తిరగేసి ఉంటారు. శిలల్లో సంగీతాన్ని పలికించగల విద్యను ఏనాడో ఏ జన్మలోనో అభ్యసించి ఉంటారు. ఆ శిల్పులు, బహుశా భావుకులై ఉంటారు, ఒంటరులై ఆ కొలను ఒడ్డున కూర్చుని వ్రాసుకున్న కవిత్వాన్నే, మళ్ళీ శిలల్లో చెక్కి ఉంటారు.   
ఆ శిలలు ? 
వాటిని రాళ్ళనడానికి మనసొస్తుందా ఏనాటికైనా? రాతిలో అన్ని వందల మెలికలు మెరుపులు చూపించడం సాధ్యమవుతుందా ఏ సామాన్యుడకైనా? అది నవనీతమో మధూచ్ఛిష్టమో అయి ఉండాలి. అక్కడున్న స్త్రీమూర్తులందరూ గంధర్వలోకం నుండి శాపవశాత్తూ భూమి మీదకు వచ్చి శిలలైపోయుండాలి. ఎన్ని గంధపు చెక్కల్ని చుక్కల్లా మారేదాకా అరగదీసి శిలలను పరీక్షించి ఉంటారో కానీ, ఏ పసరులతో ఇనుపగుండ్లతో వాటికి ఒరిపిడి పెడుతూ రుద్దారో కానీ, ఈనాటికీ అన్ని విగ్రహాలూ నున్నటి నునుపుతో నలుపుతో నిగనిగలాడుతూంటాయి. హళేబీడులో పక్కన నీలాకాశాన్ని నిండుగా ప్రతిబింబిస్తోందే...ఆ కొలనులోనే అరగదీసిన గంధాన్ని ఒండ్రుమట్టిలా నింపి శిలలను ఒకటికి పదిసార్లు పరీక్షించారేమో!  లేదూ, ఆ కళాకారులంతా పగలల్లా పని చేసి రాత్రి ఆ నీటి ఒడ్డున పడుకుని ఆకాశంలోకి చూస్తూ, కనపడ్డ నక్షత్రాలకు లెక్కలు కట్టి, మర్నాడు అన్ని మెలికలతో జిలుగులతో కొత్త శిల్పాన్ని సృజించాలని కలగనేవారేమో!  ఇటువంటి ప్రేరణ ఏదీ లేకుండా, ఆ గర్భగుడి ముఖద్వారం, నంది భృంగి విగ్రహాలూ, ఆలయం లోపలి భాగంలో కనపడే పైకప్పుల్లోని సౌందర్యం అంత అద్భుతంగా చెక్కడం ఎలా సాధ్యం?!  

అక్కడ తిరుగాడుతున్నంతసేపూ మనసు మనసులో ఉండదు. అంత సౌందర్యాన్ని ఎలా దోచుకోవాలో, దాచుకోవాలో తెలిసిరాదు. బహుశా ఆ అయోమయంలో పడే ఈ ప్రాంతం మీదకి దండయాత్రలకు వచ్చిన ముస్లిం ముష్కర మూకలు ఈ ఆలయాన్ని పాక్షికంగా ధ్వంసం చేసి వదిలెళ్ళిపోయారేమో. వాళ్ళ దౌర్జన్యానికి గుర్తుగా తలలు తెగిపడిన విగ్రహాలు, మొండేలు లేని దేవతా రూపాలు కనపడడం ఒక అపశ్రుతిలా ఇబ్బంది పెట్టినా, మొత్తం అనుభవానికి కలిగే నష్టమైతే ఏమీ ఉండదు. 
బేలూరు, హళేబీడు రెండు చోట్లా ఆలయాలకి చుట్టూ విశాలమైన ప్రదక్షిణ పథం ఉంది. హళేబీడులో బాహ్యసౌందర్యానిది పైచేయి ఐతే, బేలూరులో ఆలయం లోపలా వెలుపలా కూడా సౌందర్యమే.  ఈ ఆలయాల బయటి వైపున స్తంభాల పైభాగాన్నీ, పైకప్పునూ కలుపుతూ ఏటవాలుగా నిలబెట్టిన మనోహరమైన శిల్పాలలో ప్రతి ఒక్కదాన్ని గురించీ ప్రత్యేకంగా చెప్పుకు తీరాల్సిందే [ రామప్ప గుడిలోని మదనికా శిల్పాలను పోలివుంటాయవి]. వాటిలో దర్పణ సుందరి, వికట నర్తకి, రసిక శబరి, మయూరశిఖే లాంటివి చూపు తిప్పుకోనివ్వవు. రామాయణ ఘట్టాలూ, దశావతార ప్రదర్శనా, శివపార్వతులూ, వామనావతారం సరేసరి. ఆ శిల్పులు ఆయా ఘటనలకు సంబంధించిన ప్రతి చిన్న విశేషాన్నీ ఎంత జాగ్రత్తగా, ఎంత రమణీయంగా చెక్కారో గమనిస్తూంటే, ఒక అలౌకిక ఆనందానికి లోనవుతామంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా గజాసురవథను చెక్కడంలో శివుడు ఆ ఏనుగు పొట్టను చీల్చడంలో కొనదేలిన గోళ్ళు చర్మాన్ని దాటుకు బయటకు రావడం...ఆహ్...అమోఘం! అలాగే నరసింహ స్వామివి, దాదాపు 34 విగ్రహాలు (హోయసల రాజుల కులదైవం కదా - అందుకు!), అన్నీ హిరణ్యకశిప వథ చేస్తున్న ఉగ్రనరసింహావతారాలే.  వజ్రనఖాలతో హిరణ్యకశిపుణ్ణి చంపి, ప్రేగులు మెడలో వేసుకున్న స్వామి ఉగ్ర రూపాన్ని ఎంత గొప్పగా మలిచారనీ..."సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు" అని ఇందుకు కదూ అంటారు..!

ఉగ్రనారసింహావతారం

"సురరాజవైరి లోబడె, బరిభావిత సాధుభక్త పటలాంహునకున్
నరసింహునకు నుదంచ, త్ఖరతరజిహ్వునకు నుగ్రతరరంహునకున్" 
-అని నరసింహావతారం గురించి భాగవతంలో ఓ పద్యం ఉంటుంది. ఈ శిల్పాన్ని చూడండి..." అత్యంత భయంకరంగా కదులుతున్న నాలుక"తో ఉన్న ఆ  స్వామి రూపాన్ని ఎంత గొప్పగా మనకు సాక్షాత్కరింపజేస్తోందో!!   

హళేబీడులోని హోయసలేశ్వరుడిగా (మహరాజు పేరు మీదుగా నెలకొల్పబడినది), శాంతలేశ్వరుడిగా( మహరాణి శాంతలాదేవి పేరు మీదుగా) పూజలందుకుంటోన్న శివలింగాలకు ఎదురుగా, రెండు నంది విగ్రహాలు ప్రతిష్టించారు. ఇవి రెండూ దేశంలోని అతి పెద్ద నంది విగ్రహాల్లో వరుసగా ఐదూ ఆరూ స్థానాల్లో ఉన్నాయి. వీటిని చూడగానే నాకు మొట్టమొదట గుర్తొచ్చే విషయమొకటి ఉంది. మా అక్క, అమ్మ టీచరుగా పని చేసిన బళ్ళోనే చదువుకుంది. నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడొకసారి వాళ్ళిద్దరూ బళ్ళో విహారయాత్రకని  ఈ ఊళ్ళన్నీ తిరిగారు. లేత పసుపు లక్నో చుడీదార్‌లో మెరిసిపోతూ అక్క ఈ నంది మీద చేతులు పెట్టుకు దిగిన ఫొటో ఒకటి చూసి చాలా కాలం నాలో నేను తెగ బాధపడిపోతూ ఉండేదాన్ని. నన్ను ఒక్కదాన్నీ వదిలి వెళ్ళిపోయారన్న బెంగ కంటే నిలువెత్తు నంది దగ్గర అంత ఠీవిగా నిలబడి అక్క దిగిన ఫొటోనే అప్పట్లో నా కడుపుమంటకు కారణం :). అప్పుడేమో అది ఒక్కతే వెళ్ళిపోయిందనీ, ఇప్పుడు అది కూడా నా పక్కన ఉంటే బాగుండుననీ - బెంగ పడేందుకు మనుషులు ఎప్పుడూ కారణాలు వెదుక్కుంటూ ఉంటారేమో అనిపిస్తూంటుంది అప్పుడప్పుడూ. ఆ మాట వదిలేస్తే, ఈ నందులు నిజంగా ఎవరో చెక్కినట్టు ఉండవు. కాస్త ఎత్తి ఉన్న కంఠదేశంలో మూడు పట్టెడలు, క్రింద మువ్వల గొలుసు.., రెండు కొమ్ములనూ చుడుతూ ముత్యాల పట్టికలు, నడుము పైభాగం నుండీ బెత్తెడు బెత్తెడు వెడల్పుతో జిలుగు పనులతో నిండిన పేటల గొలుసులు...గిట్టల పైభాగాన కడియాలు...శివుని ఆజ్ఞతో సాక్షాత్తూ ఆ మహావృషభరాజమే నేలకు దిగివచ్చినట్టుంటుందది. తనివితీరేదాకా నిలబడి తప్పక చూడవలసిన పనితనమది.

గైడ్ లేకపోతే ఐదు నిముషాల్లోనూ, మంచి గైడ్ దొరికితే గంటా- రెండు గంటల్లోనూ చూసేయగలమనిపిస్తే, అంతకు మించిన భ్రమ వేరొకటి లేదు. పైగా ఇలాంటి ప్రాంతాలకొచ్చి, గైడ్ అడిగే వంద రూపాయల దగ్గర కక్కుర్తి పడి, "మనకు కనపడనివి వాళ్ళేం చూపిస్తారటా.." అని దీర్ఘాలు వాళ్ళని  చూస్తే ఎంత జాలేస్తుందో! రెండు రోజుల సెలవలూ, ఈ రెండు కళ్ళూ ఆ అందాన్ని లోలో ముద్రించుకోవడానికి సరిపోవు. ఆ ఒక్క మకరతోరణం చాలు - ఓ పూటంతా గడిపేయడానికి. ఆ జయవిజయుల మెళ్ళోని హారాలనూ, వాటిలోని నొక్కులను లెక్కబెట్టే పనిలో పడితే చాలు - మీకో రోజు రోజంతా సరిపోదు. కొన్ని వందల రకాల కేశ సౌందర్యాలతో కనిపించే ఆ కాలపు సామాన్య స్త్రీల అందం-అతిశయం, ఓ జాతి సంస్కృతీ, ఒక రాజవంశపు చరిత్రా, ఆంగ్లేయుల సొత్తని భావించే అనేక పరికరాలను ఆ కాలంలోనే వాడిన మన పూర్వీకుల ప్రజ్ఞ, ఈ దేశం నిలబెట్టుకోలేకపోయిన అనుపమాన శిల్పకళాచాతుర్యం....వీటన్నింటికీ కాలాలకతీతంగా నిలబడ్డ మూగసాక్షులు బేలూరు-హళేబీడు నిర్మాణాలు. 


చిక్కమగలూర్

మలుపుల కొండ దారి మీద జలపాతాలను వెదుక్కుంటూ..(ఊ..వెదుక్కుంటూనే...కనపడలేదు..:)) పైకి చేరేసరికి ఆలస్యమైపోయింది. జలపాతాలు నిరాశపరిచాయి సరే, అక్కడ దత్తాత్రేయపీఠం ఒకటుందని, తప్పకుండా చూడమనీ దారిలో ఎదురొచ్చిన వాళ్ళు చెప్పారు. మేము వెళ్ళాలా వద్దా అని లెక్కలు వేసుకుంటూ.."ఏ సిద్ధ ప్రదేశంబు ద్రొక్కితిమో.." అనుకోవడానికి ఏనాటికైనా ఏమైనా ఉండాలి కదా అని నచ్చజెప్పుకుని అక్కడికి ఓపిక చేసుకుని వెళ్ళాము. దత్తాత్రేయ మఠము అని వ్రాసి ఉన్నా, నిజానికి, అది ఒక ముస్లిముల దర్గా. ఒక వంద మెట్లు క్రిందకి దిగాక, గుహలాంటి ప్రదేశంలో సమాధులు, మట్టి ఉన్నాయంతే. అక్కడి వాళ్ళు ఉర్దూలో ఆ ప్రాంతం యొక్క గొప్పదనం ఏమిటో చెప్పబోయారు...నాకర్థం కాలేదు. 
ఆ గుహ నుండి బయటకు వచ్చేసరికి రాత్రి కావస్తోంది. చీకట్లు ముసురుకుంటున్నాయి. ప్రసూన సువాసనాలహరీ సంయుతుడై గంధవహుడు మెల్లగా తిరుగుతున్నాడు. ఆగీఆగీ ఏవో పక్షుల కలకల రుతులు వినపడుతున్నాయి. లేలేత ఆకుల మీద వెన్నెల ప్రసరించి మిలమిలా మెరుస్తోంటే, గరుడ పచ్చలు పొదిగారా అన్నట్టు..మాటల్లో పెట్టలేని మహాసౌందర్యం. ఎవరూ భగ్నం చేయాలనుకోని నిశ్శబ్దం. 
మేం ఆరుగురం కాసేపు మాటలు రానివాళ్ళమైపోయాం. బేలూరు-హళేబీడు చూశాక కలిగిన ఉద్వేగం మా నోట వేయి మాటలుగా రాలిపడితే, చిక్కిమంగళూరు శిఖరపు అంచు మీద నిలబడ్డ క్షణాల్లో అక్కడి పొగమంచులా కమ్ముకున్న పారవశ్యం మమ్మల్ని ఓ మౌన ప్రపంచంలోకి రెక్కపట్టుకు లాక్కెళ్ళింది. ఇన్నేసి మైళ్ళ ప్రయాణంలో మనం వేటిని వెదుక్కుంటూ వెళ్తామో, వాటిని దొరకబుచ్చుకున్న సంతృప్తి ఉంది కానీ..ఏనాడో చెప్పాడో జ్ఞాని... 
"రూప్‌కే పావ్ చూమ్‌నే వాలే సున్‌లే మేరీ బానీ
ఫూల్కీ డాలీ బహుత్ హీ ఊంచీ, తూ హై బహతా పానీ"    ( "సౌందర్య చరణాలను ముద్దాడేవాడా! నా మాట విను. పూలకొమ్మేమో చాలా ఎత్తైనది. ప్రవహించే నీటివి నువ్వు") 

No comments:

Post a Comment