Thursday, 3 September 2015

శృంగేరి






ద్వాదశం రాసుల పై సూర్య కిరణ ప్రసారం - శృంగేరి

కర్ణాటక రాష్ట్రంలో పడమటి కనుమలలో ఉన్న దివ్య క్షేత్రమే శృంగేరి. ఋష్య శృంగ మహర్షి పావనం చేసిన ప్రదేశం. శృంగ గిరే శృంగేరిగా మారింది. ఆది శంకరాచార్యులు ఇక్కడ శారదా పీఠం నెలకొల్పారు. శారదాలయానికి కుడి ప్రక్కన విద్యా శంకరాలయం ఉంది. శ్రీ విద్యారణ్య స్వామి గురువు శ్రీ విద్యా శంకరులు. 105 సంవత్సరాలు పీఠాదిపత్యం వహించిన పుణ్య పురుషులు. అందుకని శిష్యుడు కృతజ్ఞతగా ఈ ఆలయాన్ని కట్టించారు. ఇది 1338లో నిర్మితమైంది.

ముఖ మండపంలో 12 రాతి స్తంభాలున్నాయి. ఇవి 12 రాశుల పేర్లతో ఉంటాయి. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ పేరు గల స్థంభం మీద ఆ రోజున సూర్య కిరణాలు పడటం ఇక్కడ విశేషం. ఖగోళ, జ్యోతిష, గణిత, వాస్తు శాస్త్రాలలో అపూర్వ పాండిత్యం గల శిల్పులు మలచిన అద్భుత విన్యాసం. స్తంభాల పై సింహం ఆకారంలో జీవ మృగ మూర్తులున్డటం విచిత్రం. వాటి నోటిలో వ్రేలాడే రాతి బంతులు, పై కప్పు నుంచి వేలాడే రాతి గొలుసులు అన్నీ ఒకే శిలతో నిర్మింపబడి ఉండటం ఆశ్చర్య కరం. ఆలయం బయట గోడలు కోణాలు, కోణాలుగా చెక్క బడి ఉండటం ఇంకో విచిత్రానుభూతి. పొడ వైన రాతి పలకలు ప్రక్క ప్రక్కగా నిలబెట్టి అతికించినట్లుగా అనిపిస్తుంది. ఇక్కడి శిల్ప సంపద అసదృశంగా ఉంటుంది.
 


శృంగేరి దేవస్థానంలో తన ఆహారమైనట్టి కప్పనే తన పడగనీడన కాపాడుతున్న నాగేంద్రుడు ‘కప్పె చెన్నిగ రాయ’ అనే పేరుతో పూజింపబడడం విశేషం. ప్రస్తుత శృంగేరి పీఠాదిపతి మన గుంటూరు జిల్లా నరసరావు పేటకు చెందిన తెలుగువారే కావడం మరో విశేషం. అక్కడి ‘తుంగ’ నది చల్లటి స్వచ్చ జలాలలో అంత ఎత్తున ఎగిరెగిరిపడే పెద్ద చేపలు కూడా శృంగేరిలో చూడ ముచ్చటైన మరో ఆకర్షణ. 

No comments:

Post a Comment