Sunday, 13 September 2015

అమరత్వ పరమార్థం అమరనాథ్ దర్శనం

చుట్టూ మంచుదుప్పటి కప్పుకున్న పర్వతాలు.. ఆ పర్వతాల నుంచి జాలువారే హిమనదాలు.. ఎటు చూసినా ఆహ్లాదకర వాతావరణం.. మరోవైపు హర హర మహాదేవ.. శంభో శంకర.. అంటూ వినిపించే మంత్రనాదాలు.. వీటన్నింటినీ గుండెల్లో మూటగట్టుకొని మంచుకొండల్లో సాహసోపేతంగా ముందుకు సాగే ప్రయాణమే అమర్‌నాథ్‌ యాత్ర.. బుధవారం పవిత్ర అమర్‌ నాథ్‌ యాత్ర జమ్మూ నుండి ప్రారంభమైంది. అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. తొలివిడతలో 1100 మంది భక్తులు యాత్రలో వెళ్లనున్నారు. బాల్తల్‌ మార్గం ద్వారా అమర్‌నాథ్‌కు వెళ్తున్నారు. ఈ బృందంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ కూడా ఉన్నారు. దీనితో ఈ మార్గంలో అదనపు సీఆర్పీఎఫ్‌ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు.

 

అమర్‌ నాథ్‌ క్షేత్రం సముద్ర మట్టానికి 3,888 మీటర్ల అనగా 12,760 అడుగుల ఎత్తులో ఉంది. ఉగ్రవాదుల దాడి, కేదార్‌నాథ్‌లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.భారతదేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్‌ రాష్ట్రంలో అమర్‌నాథ్‌ పర్వతము పై వున్న అమర్‌నాథ్‌ గుహలు హిందువుల ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలో ఒకటి . పరమేశ్వరునికి అంకితము అయిన ఈ పుణ్యక్షేత్రము 5,000 సంవత్సరములకు పూర్వమే వున్నదని తెలుస్తోంది. అమరానాథుడు అంటే జరామరణములు లేనివాడు అని అర్థము . ఈ అమర్‌నాథ్‌ గుహలో సహజ సిద్ధముగా ఏర్పడిన మంచు శివలింగము ఉంటుంది . చంద్రచక్రం ఆధారంగా మంచు శివలింగం పెరగటం...తరగటం జరుగుతుంది .

ప్రపంచవింతల్లో ఒకటి:
ఆ గుహ ఉపరితలము నుండి జారిపడే హిమజలం బిందువు బిందువుగా నేలకు రాలగా ... వెలుపలి శీతల వాతావరణ పరిస్థితులకు ఘనిభవిస్తుంది. అలా బిందువు బిందువు పై జారిపడుతూ .. ఘనిభవిస్తూ , పౌర్ణమీ తిదినాటికల్ల ఎనిమిది అడుగుల ఎత్తులో మంచు శివలింగము ఏర్పడుతుంది . ఇది ప్రపంచ వింతలలో ఒక వింతగా పరిగణించబడుతుంది. గణేశునకు , పార్వతీదేవికి ఇక్కడ లింగములు ఉన్నవి.

స్థల ప్రాశస్థ్యం:
హిందూ మత పురాణాల ప్రకారం, శివుడి దేవేరి అయిన పార్వతీదేవి తనకు అమరత్వం యొక్క రహస్యాలు బహిర్గతం చేయమని అభ్యర్థించింది. ప్రతిస్పందనగా, శివుడు ఎవరి చెవినా ఆ రహస్యం పడకూడదు అనే ఉద్దేశ్యంతో ఆమెను హిమాలయాల ఏకాంతంలో ఉన్న ఈ గుహలకు తీసుకు వెళ్ళి జీవిత రహస్యాలు వెల్లడించాడు. హిమాలయాలకు వెళ్ళే దారిలో, పరమశివుడు తన తలపై ఉన్న చంద్రున్నిచందన్వారి వద్ద, తన వృషభం నందిని పహల్గాం వద్ద వదిలి వెళ్ళాడని ప్రతీతి. పిదప, శివుడు, తన తనయుడు, గజ దేవుడైన గణేశుని మహగుణాస్‌ పర్వతం పైన మరియు సర్పాన్ని శేష్‌ నాగ్‌ వద్ద విడిచి పెట్టాడు. తర్వాత, మహా శివుడు, పంచ భూతాలని పంచ్‌ రత్ని వద్ద వదిలి గుహ లోకి వెళ్ళాడని నమ్మిక.

పావురాలకు అమరత్వం:
అప్పడు శివుడు, తన మాటలను ఎవరూ వినకుండా ఉండేందుకు గానూ, గుహలో మంట వెలిగించి అక్కడి సమస్త జీవులను నాశనం చేశాడని నమ్ముతారు. అయితే అతను గమనించకుండా పోయిన జింక చర్మం కింద ఉన్న రెండు పావురం గుడ్లకి మాత్రం ఎటు వంటి హాని జరగలేదు. ఆ రెండు గుడ్లు, శివుడు రహస్యాన్ని వివరిస్తూ ఉండగా,నిశ్శబ్దంగా పొదిగి,మాటలను దొంగ చాటుగా వినేసాయి. అమర్‌ నాథ్‌ గుహ చేరుకోగానే, యాత్రికులు పావురాల జంటను చూడవచ్చు. వ్యాప్తిలో ఉన్న నమ్మకం ప్రకారం, శివుని రహస్యం చాటుగా విన్న ఆ రెండు పావురాలు, మరల మరల జన్మిస్తూ ఉన్నాయి. అందుచేతనే అవి అమర్‌నాథ్‌ గుహను తమ నిత్య నివాసంగా చేసుకున్నాయి.

పౌరాణిక ప్రస్థావన:
6వ శతాబ్దానికి చెందిన సంస్కృత రచన, నీలమాత పురాణం లో ఈ ప్రసిద్ధ యాత్రా స్థలాన్ని పేర్కొన్నారు. ఈ పురాణం కాశ్మీరీల కర్మకాండను మరియు వారి సాంస్కృతిక జీవన శైలులను వివరిస్తుంది. క్రీ.పూ. 34లో కాశ్మీర్‌ సింహాసనాన్ని అధిరోహించిన రాజర్షి ఆర్యరాజతో కూడా అమర్‌నాథ్‌ ముడిపడి ఉంది. కాలక్రమంలో ఈ రాజు, తన రాచరిక హక్కును విసర్జించాడు. వేసవుల్లో అతను ఇక్కడికి చేరుకొని సహజ రీతిన మంచుతో తయారయిన శివలింగాన్ని పూజించాడని నమ్ముతారు. రాజతరంగిణిలో కూడా అమర్‌నాథ్‌ అమరేశ్వరగా పేర్కొనబడింది. 1420 మరియు 1470 ల మధ్య జరిగిన తన అమర్‌నాథ్‌ యాత్రా కాలంలో సుల్తాన్‌ జైన్లబిదిన్‌, షా కోల్‌ అనే కాలువ నిర్మించాడు.

అతి ఎత్తయిన గుహ:
అమర్‌ నాథ్‌ యాత్రలో, ప్రయాణికులు 3888 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌ నాథ్‌ గుహను తప్పక చూడాలి. ఈ గుహలో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు శివ లింగం ఉంటుంది. చంద్ర చక్రం ఆధారంగా మంచు శివ లింగం పెరగటం తరగటం జరుగుతుంది. మే నుంచి ఆగష్టు మధ్యలో గరిష్ట ఎత్తును చేరుకుంటుంది.ఈ గుహ 5000 ఏళ్ల నాటిదిగా చెప్పబడుతుంది.ఇది శివుడు పార్వతిదేవికి అమరత్వ రహస్యం ఉపదేశించిన ప్రదేశంగా నమ్మబడుతుంది. గణేశునికి,పార్వతి దేవి కి కూడా ఇక్కడ రెండు మంచు లింగాలు ఉన్నాయి. భారతీయ సైన్యం, భారతీయ పారామిలటరీ దళాలు, సి.ఆర్‌.పి.ఎఫ్‌, ఈ ప్రదేశానికి గస్తీ కాస్తూ ఉంటాయి. అందువల్ల, అమర్‌నాథ్‌ గుహను సందర్శించాలంటే ఉన్నత అధికారుల నుంచి ముందే అనుమతి తీసుకోవాలి.

శేష్‌ నాగ్‌ సరస్సు:
అమర్‌ నాథ్‌ లోని మరొక ప్రసిద్ధ ఆకర్షణ శేష్‌ నాగ్‌ సరస్సు. ఇది పహల్గాం కి 27 కి.మీ ల దూరంలో ఉంది. ఈ సరస్సు, సముద్ర మట్టానికి 3658 మీటర్ల ఎత్తులో ఉండటం వల్ల, జూన్‌దాకా మంచుతో కప్పబడి ఉంటుంది. వేసవి కాలంలో అమర్‌నాథ్‌ యాత్రికులు , పర్యాటకులు ఈ సరస్సుకి భారీ సంఖ్యలో వస్తారు.

ఎలా చేరుకోవాలి:
అమర్‌నాథ్‌ సందర్శించేవారు, విమానంలో గానీ రైలులో గానీ ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడికి అత్యంత దగ్గరలో ఉన్న విమానాశ్రయం శ్రీనగర్‌ విమానాశ్రయం. ఇది ఢిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో చక్కగా అనుసంధానించబడింది. అమర్‌ నాథ్‌ని రైలులో చేరగోరే వారు జమ్మూ రైల్వే స్టేషన్‌ కు చేరుకోవచ్చు. ఇక్కడికి దేశం లోని ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి రైళ్లు ఉన్నాయి. వేసవిలో సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీలు ఉంటుంది. అయితే, శీతాకాలం విపరీతమైన చలిగా ఉంటుంది. కనిష్ఠ ఉష్ణోగ్రత -5 డిగ్రీల దాకా పడిపోతుంది. అమర్‌నాథ్‌ సాధారణంగా నవంబర్‌ నుంచి మార్చి/ఏప్రిల్‌ దాకా మంచుతో కప్పబడి ఉంటుంది. ఏడాదిలో ఏ సమయంలోనైనా వర్షాలు పడవచ్చు. వర్షాలు అమర్‌నాథ్‌ యాత్రకు అడ్డంకిగా మారతాయి. అమర్‌నాథ్‌ దర్శించడానికి మే నుంచి అక్టోబర్‌ మధ్యనెలలు సరైన సమయం.గుజ్జర్‌ జాతికి చెందిన బూటా మాలిక్‌ అనే గొర్రెల కాపరికి ఒకరోజున ఒక సాధుపుంగవుడు కనబడి సంచినిండా బొగ్గులు ఇచ్చాడు. మాలిక్‌ వాటిని ఇంటికి తీసుకు వొచ్చి చూస్తే బొగ్గులన్నీ బంగారు నాణాలు అయినాయి. ఆ సాధువుకు కృతజ్ఞతలను చెప్పుకోవడానికి అక్కడకి వెళ్లి చూస్తే , అక్కడ సాధువుడు లేడుకాని , అక్కడ ఒక మహా అధ్బుతమైన మహా శివలింగము కనపడింది. ఆ విధముగా అమర్‌ నాథ్‌ గుహ కనుగొనబడింది. కాలకామేణా అమర్‌నాథ్‌ యాత్రగా ప్రసిద్ది కెక్కింది ....

ఉగ్రవాదుల బెదిరింపులు:
ఉగ్రవాదుల నుండి బెదిరింపులు రావడంతో, 1991 నుండి 1995 వరకు తీర్థయాత్ర నిషేధించారు. ఉగ్రవాదులు, తాము జోక్యం చేసుకోమని హామీనివ్వడంతో, 1996లో యాత్ర మళ్లీ గతానికంటే ఎక్కువ సంఖ్యలో కొనసాగింది. ఆ సంవత్సరం ఆగష్టు చివరలో అకాల మంచు తుఫాన్లు రావడంతో, లక్షలాది యాత్రికులు ఇరుక్కు న్నారు. అప్పుడు జరిగిన విషాదంలో, 242 యాత్రికలు బడలికతోను, మంచును తట్టుకోలేక మరణించారు. నాలుగు సంవత్సరాల తరువాత, యాత్రికులకు మరో పెద్ద దెబ్బ తగిలింది. కాశ్మీర్‌ వేర్పాటు ఉగ్రవాదులు 30 మందిని పహల్గంలో హతమార్చి, మారణ కాండ సృష్టించారు.

2006లో అమర్‌నాథ్‌లో కృత్రిమ శివలింగం గురించి పెను వివాదం నెలకొంది. 2006లో, యాత్ర ప్రారంభ సమయంలో సహజ శివలింగం చాలా చిన్నదిగా ఉంది. యాత్రను కొనసాగించడానికి ఆలయ మండలి వారు, గుహను చల్లగా ఉంచాలనే నెపంతో, చాలా పొడి మంచును నేరుగా అసలు శివలింగం పెైనే పోశారు. దీని మూలాన పెను వివాదం చెలరేగింది. యాత్రకు మాత్రం ఎటువంటి ఆటకం కలుగలేదు. మంచు లింగం పెైన, కింద రెండు నీటి కాలువలు ప్రవహిస్తు న్నాయి. ఈ కాలువలనుంచి వచ్చే నీళ్ళే శివలింగ ఆకార సృష్టికి దారి తీస్తున్నాయి. 2005లో జరిగిన భూకంపంలో ఇవి దెబ్బ తిన్నాయి కనుకనే మంచు లింగం సరిగ్గా ఏర్పడలేదని అంటారు. ఆ కాలువలు మళ్ళీ బాగవడంతో ఆ తరువాత సంవత్సరాలలో మంచు లింగం మంచి ఆకారంతో ఏర్పడింది.

No comments:

Post a Comment