Friday, 25 September 2015

శ్రీకాళహస్తి









శ్రీకాళహస్తి



ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో పవిత్ర నగరం తిరుపతికి దగ్గరలో ఉన్న శ్రీకాళహస్తి పురపాలక సంఘానికి వ్యవహార నామం కాళహస్తి. ఈ పట్టణం తిరుపతి నగరానికి 54 కి.మీ. దూరంలో ఉంది. దేశంలోని అత్యంత పవిత్ర స్థలాల్లో ఒకటిగా పరిగణించబడే ఈ పట్టణం స్వర్ణముఖీ నదీ తీరాన ఉంది. శ్రీ, కాళ, హస్తి అనే మూడు పదాల కలయికతో ఈ ఊరి పేరు ఏర్పడింది. శ్రీ అంటే సాలీడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడు జంతువులూ శివారాధన చేసి ఇక్కడే మోక్షం పొందాయని ప్రతీతి, ప్రధాన ఆలయం ముందు ఈ మూడు జంతువుల విగ్రహం కూడా ఉంది. దక్షిణ భారత దేశంలోని శైవ క్షేత్రాలు, శివాలయాల్లోకి శ్రీ కాళహస్తి చాలా ప్రధానమైనది. పంచభూత లింగాలున్న అయిదు క్షేత్రాలలో వాయులింగం ఉన్న ఈ క్షేత్రం కూడా వుంది. నిజానికి, ప్రసిద్ధ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి కొండ దిగువకి, స్వర్ణముఖీ నది ఒడ్డుకి మధ్య నిర్మించారు. అందువల్లే ఈ ప్రాంతాన్ని దక్షిణ కైలాసం మరియు దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు.

దక్షిణ కైలాసంగా ముద్రపడ్డ ఈ దివ్య క్షేత్రంలో ప్రధాన ఆకర్షణ ఇక్కడ ఉన్న రెండు దీపాలలో ఒకటి ఎల్లప్పుడు గాలికి అటు ఇటు కదులుతూ ఉండటం మరొకటేమో నిశ్చలంగా కదలకుండా ఉండటం. ఇక్కడ ఉండే కళ్ళు చెదిరే మూడు గోపురాలు నాటి ప్రాచీన భారతీయ వాస్తుకళకు, శిల్ప కళాకారుల పనితనానికి అద్దంపట్టే విధంగా ఉంటాయి. శ్రీ కాళహస్తి పట్టణం చుట్టూ చూడవలసిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి కానీ అందులో నుంచి మీరు తప్పక చూడవలసిన ప్రదేశాలు కొన్నే ఉన్నాయి ప్రధానమైన వాటిలో వెయ్యి కాళ్ళ మండపం, 36కు పైగా తీర్థాలు ఇలా ఎన్నో ...

పురాణాల్లో శ్రీకాళహస్తి :
ఈ ప్రదేశం వాయు స్థలానికి ప్రతీకగా నిలుస్తుంది. ఒక పురాణ గాఢ ప్రకారం శివుడు వాయు రూపంలో సాలీడు, నాగుపాము, ఏనుగుల భక్తిని పరీక్షించాడు. దేవుడు వాటి భక్తికి మెచ్చి వాటిని శాప విముక్తుల్ని చేసాడు, వాటికి ఇక్కడే మోక్షం వచ్చి౦దని చెప్తారు. శ్రీకాళహస్తి ప్రస్తావన స్కంద, శివ, లింగ పురాణాల్లో ఉంది. స్కంద పురాణం ప్రకారం శ్రీ కాళహస్తీశ్వరుడిని పూజించడానికి అర్జునుడు ఇక్కడికి వచ్చి ఈ కొండ శిఖరం మీద భరద్వాజ మహామునిని కలిసాడు. 3వ శతాబ్దంలో పాలించిన సంగమ రాజుల కాలం నాటి కవి నక్కీరర్ రచనల్లో మొదటిసారిగా శ్రీకాళహస్తి ప్రస్తావన వుంది. ఈ పట్టణాన్ని దక్షిణ కైలాసంగా వర్ణించింది నక్కీరర్ కవే. ధూర్జటి అనే తెలుగుకవి ఈ పట్టణంలోనే స్థిరపడి ఈ పట్టణం మీద, శ్రీ కాళహస్తీస్వరుడి మీద శతకం రాసాడు.

భక్త కన్నప్ప :
శ్రీ ఆదిశంకరాచార్యుల వారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు భక్త కన్నప్ప భక్తికి పరవశించి తన శివానందలహరిలో ప్రస్తావించారు. దేవుడి కోసం తన కంటినే త్యాగం చేసిన గొప్ప భక్తుడు భక్త కన్నప్ప శ్రీకాళహస్తికి పర్యాయపదంగా మారిపోయాడు. హిందువులకు ముఖ్యంగా శివ భక్తులకు ఈ భక్తి కథ బాగా తెలిసిందే.

విశిష్ట నిర్మాణ శైలిలో దేవాలయాలు :
ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షించే దేవాలయాలకు శ్రీ కాళహస్తి ప్రసిద్ది పొందింది. వివిధ రూపాల్లో పూజలందుకునే శివ, విష్ణు రూపాల దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎన్నో గుళ్ళు నిర్మించిన రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. అందువల్ల ఇక్కడి ప్రతి దేవాలయ నిర్మాణ శైలి ఆ నాటి రాజుల విశిష్ట అభిరుచుల్ని ప్రతిబింబిస్తాయి. తమ తమ సమయాల్లో నిర్మించిన దేవాలయాలపై చోళ, పల్లవ, విజయనగర రాజులు తమదైన ముద్రతో నిర్మించారు. చాలా మంది విజయనగర రాజులు తమ పట్టాభిషేకం అంతఃపురాలూ, రాజ ప్రాసాదాల్లో కాక పవిత్రమైన గుళ్ళలో జరిపించుకునే వారని చెప్తారు. అచ్యుతరాయల వారి పట్టాభిషేకం శ్రీ కాళహస్తిలోని నూటి స్తంభాల మండపంలోనే జరిగాక తన రాజధానికి వెళ్లి వేడుకలు చేసుకున్నాడు.

శ్రీ కాళహస్తి దేవాలయం
శ్రీకాళహస్తి లో ఉన్న ప్రధాన దేవాలయాలలో ఒకటిగా ఉన్న కాళహస్తి దేవాలయం తప్పక సందర్శించాలి. ఈ దేవాలయంలో శివుడు ప్రధాన ఆకర్షణ. పురాణాలలో పేర్కొన్న విధంగా తనను పరీక్షించిన శివుని కోసం తన కంటినే తీసి ఇచ్చిన పరమ భక్తుడు భక్త కన్నప్ప ఇక్కడనే శివుడుని కొలిచాడు. శివ భక్తులే కాక ఈ కాళహస్తి ఆలయానికి రాహు - కేతు దోషాల నుంచి విముక్తి పొందటానికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. తిరుపతిని సందర్శించేవారు కాళహస్తిలోని కాళహస్తి దేవాలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం.

కన్నప్ప దేవాలయం
కన్నప్ప దేవాలయం, శ్రీకాళహస్తి లోని ఒక చిన్న కొండ మీద ఉంది. కాళహస్తిలో ఉన్న ఈ ఆలయం గొప్ప శివ భక్తుడైన భక్త కన్నప్పకు అంకితం చేయబడినది. వేటగాడు అయిన కన్నప్ప ఆకులు మరియు దుమ్ముతో కప్పబడి ఉన్న శివలింగాన్ని చూసిన తరువాత అక్కడి నుంచి దానిని తీసుకువచ్చి నియమాలకు వ్యతిరేకంగా పక్కనే ఉన్న జలాధార నుండి తన నోటిలో నీరు తీసుకొని వచ్చి శివలింగాన్ని శుభ్రం చేసేవాడు. మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు.

భక్త కన్నప్ప గురించి ఒక్కమాటలో ..
కన్నప్ప ఒక వేటగాడు. ఈయన నిత్యం శివుణ్ని ఆరాదించేవాడు. ఒకనాడు శివుడు అలా అతనిని కొలిచే సమయంలో కన్నప్ప భక్తిని పరీక్షించడం కోసం తన కంటి నుండి రక్తం కార్చేవాడు వెంటనే కన్నప్ప తన కన్నుని పీకి స్వామివారికి అమర్చాడు వెంటనే మరో కంటి నుండి రక్తం కారడం మొదలవడంతో భక్తుడైన కన్నప్ప సందేహీంచకుండా తన రెండవ కన్నుని కూడా పీకి స్వామివారికి అమర్చాడు. దీనికి చూసి ఎంతగానో ముగ్ధుడైన శివుడు ప్రత్యెక్షమై అతనిని కరుణించి ముక్తిని ప్రసాదించాడు.

చతుర్ముఖేశ్వర దేవాలయం
బ్రహ్మ మరియు మహేశ్వరుల కోసం నిర్మించిన చిన్న గుడి శ్రీకాళహస్తిలోని చతుర్ముఖేశ్వర దేవాలయం. బ్రహ్మ, శివులకు సంబంధించిన వుండడం వల్ల ఈ దేవాలయం తప్పక చూడదగినది. ఈ గుడిలో శివలింగం నాలుగు దిక్కులూ చూసే నాలుగు ముఖాలతో వుండడం విశేషం. చతుర్ముఖుడు అంటే నాలుగు ముఖాలున్న వాడని అర్ధం. ఈ దేవాలయం గోడల మీద శివుడికి చెందిన పురాణ గాధల చిత్రాలు వున్నాయి.

సహస్ర లింగ దేవాలయం
శ్రీకాళహస్తిలో ఉన్న ప్రముఖ ఆలయాలలో ఒకటి సహస్ర లింగ దేవాలయం. ఒక అందమైన అడవి మధ్యలో ఉన్న ఈ గుడి పరిసరాల వల్ల కూడా ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ‘సహస్ర' అంటే వేయి అని అర్ధం - ఏకశిల పై వేయి లింగాలు చెక్కిన శివలింగం ఉండడం వల్ల ఈ గుడికి ఆ పేరు అంతేనా .. ఈ దేవుడిని దర్శించుకోవడం వల్ల ఈ జన్మలోనూ, పూర్వజన్మల్లోనూ చేసిన పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు.


ప్రసన్న వరదరాజు స్వామి దేవాలయం
శ్రీకాళహస్తి లోని ప్రసన్న వరదరాజ స్వామి దేవాలయం దక్షిణ భారతంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా భావిస్తారు. ఇది కాళహస్తి దేవాలయానికి దగ్గరలోనే ఉంది. ఈ దైవం ఆశీస్సుల కోసం ప్రతి ఏటా వేలాది మంది భక్తులు వస్తారు.

శ్రీ చక్రేశ్వర స్వామి దేవాలయం
శ్రీకాళహస్తిలోని శ్రీ చక్రేశ్వర స్వామి దేవాలయం ప్రతిష్టించిన అతి పెద్ద శివలింగం వున్న దేవాలయంగా ప్రఖ్యాతి గాంచింది. ఈ దేవాలయం 1200 - 1500 ఏళ్ళ నాటిదంటారు. పరిసరాల్లో ఉన్న గుళ్ళతో పోలిస్తే ఈ గుడి చిన్నదే అయినప్పటికీ ఎంతో మంది భక్తులు శ్రీ చక్రేశ్వర లింగాన్ని పూజించడానికి ఇక్కడికి వస్తారు. గమ్మత్తేమిటంటే ఈ చిన్న గుళ్ళోనే దక్షిణ భారతంలో కెల్లా అతి పెద్ద శివలింగం ఉంది.

గుడిమల్లం
శ్రీకాళహస్తి కి 54 కి. మీ. దూరంలో ఉన్న గుడిమల్లంలో శాతవాహనుల కాలంలో నిర్మించిన పురాతన శివాలయం ఉంది. ఇక్కడున్న శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది అదేమిటంటే ఇక్కడున్న శివలింగం లింగరూపంలో కాకుండా మానవ రూపంలో వేటగానివలె ఉంటుంది. పురుషాంగముతో పోలి ఉన్న ఈ లింగం ప్రపంచంలో అతి పురాతనమైన శివలింగంగా ఖ్యాతి గడించింది.

వేయిలింగాల కోన జలపాతం
వేయిలింగాల కోన జలపాతం కాళహస్తి సరిహద్దుల నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి రమణీయ ప్రకృతి దృశ్యాల వల్ల ఈ ప్రాంతం ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అయింది. ఈ జలపాతాలలో స్నానం చేయకుండా వెళ్ళడం సాధ్యం కాదు, పెద్ద వాళ్ళు, పిల్ల వాళ్ళు కూడా అంటే ఉత్సాహంతో ఇక్కడ స్నానం చేస్తారు. చుట్టూ శివలింగాలను పోలి వున్న రాళ్ళతో ఉండడం వల్ల ఆ పేరు వచ్చిందని భావిస్తారు. ఇక్కడి నీటికి ఔషధ గుణాలున్నాయనే నమ్మకం వల్ల ఎంతో మంది భక్తులు ప్రతి ఏటా ఇక్కడ స్నానాలు ఆచరిస్తారు.

భరద్వాజ తీర్థం
శ్రీకాళహస్తి దేవాలయానికి తూర్పు వైపున మూడు కొండల మధ్య భరద్వాజ తీర్థం ఉంది. ఈ తీర్థం నెలకొని ఉన్న అందమైన లోయ పచ్చటి కొండలు, నిర్మలమైన సెలయేళ్లతో ఉండి ఈ ప్రాంతానికి ఒక దైవికమైన వాతావరణాన్ని తీసుకువచ్చింది. ఈ తీర్థం మధ్య ధ్యానముద్రలో ఉన్న తపో వినాయకుడి అద్భుతమైన విగ్రహం ఉంది. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ తీర్థంలో మునక వేయడానికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తారు.

ఉబ్బలమడుగు జలపాతం
ఉబ్బల మడుగు జలపాతం శ్రీకాళహస్తి నుండి 35 కిలోమీటర్ల దూరంలో సిద్దుల కోన అని పిలువ బడే అడవిలో ఉన్నది. ఇది ప్రధాన వర్షాకాల సమయంలో అనగా అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ జలపాతం జలకళతో కళకళలాడుతూ ఉంటుంది. టెక్కింగ్ మరియు విహార యాత్రలకు ఇది చాల అందమైన ప్రదేశము. ఈ జలపాతాన్ని వీక్షించడానికి స్థానికులే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు.

తలకోన జలపాతం
శ్రీకాళహస్తి పట్టణానికి 82 కి.మీ. దూరంలో ఉన్న తలకోన జలపాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కెల్ల ఎత్తైనది. ఈ జలపాతానికి సమీపంలో సిద్ధేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ప్రాంతం నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండలు... మధ్యలో జలపాతాన్ని చూసిన పర్యాటకులకు చిత్రమైన అనుభూతి కల్గుతుంది. దాదాపు అరవై మీటర్ల ఎత్తునుంచి జాలువారే జలపాత దృశ్యం నయనానంద కరంగా, చాలా అకర్షణీయంగా వుంటుంది. అలాగే జలపాతం కింద గుంటలో పర్యాటకులు హాయిగా ఈత కొడుతుంటారు.

వసతి గృహాలు
యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వసతి గృహం, జ్ఞానప్రసూనాంబ వసతి గృహం, బాలజ్ఞానాంబ సత్రము, శంకరముని వసతిగృహము, త్రినేత్రనటరాజ వసతిగృహము, తిరుమల తిరుపతి దేవస్థానం వసతిగృహము తో పాటుగా పలు ప్రైవేట్ వసతి గృహాలు ఉన్నాయి. శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి సన్నిధిలో నిత్యాన్నదాన పధకం ద్వారా భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కల్పించబడుతుంది.

శ్రీకాళహస్తి ఎలా చేరుకోవాలి?
వాయు మార్గం శ్రీకాళహస్తి నుంచి 26 కిలోమీటర్ల దూరంలో వున్న తిరుపతిలోని రేణిగుంట ఇక్కడికి దగ్గరలోని విమానాశ్రయం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, మదురై విమానాశ్రయాల నుంచి తిరుపతికి నిత్యం విమానాలు తిరుగుతూ ఉంటాయి. అక్కడి నుంచి ప్రేవైటు టాక్సీ లేదా ప్రభుత్వ బస్సు ద్వారా శ్రీ కాళహస్తి చేరుకోవచ్చు.

కాళహస్తి ఎప్పుడు సందర్శించాలి :
ఈ పట్టణంలో వేసవి చాలా తీవ్రంగా ఉంటుంది కనుక అప్పుడు కాళహస్తి సందర్శన చేయకపోవడం మంచిది.

అద్భుత నిర్మాణ శైలితో ప్రశాంతతను అందిస్తూ వుండే దేవాలయాలు కాళహస్తికి ప్రశస్తి చేకూర్చాయి, దీనివల్ల ప్రశాంతతను కోరుకునే వారికి ఇది ప్రధమ ఎంపిక అవుతుంది. ఒక దివ్యమైన ప్రయాణానుభూతి కాళహస్తిలోని ప్రసిద్ధ దేవాలయాలు అటు పర్యాటకులకు, భక్తులకు కూడా ఒక దివ్యమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి.



No comments:

Post a Comment