Thursday, 3 September 2015

కుంభ కోణం

తమిళనాడులోని కుంభకోణంలోని కుమ్భేశ్వర ఆలయం అత్యంత ప్రాచీన మైనది. ఇక్కడ బ్రహ్మ దేవుడికి ఆలయం ఉండటం ఒక విశేషం. దక్షిణ దేశంలో ఇంకెక్కడా బ్రహ్మకు గుడి లేదు. కుంభాలు అంటే కుండలు. కుండల్ని చేసే మట్టి తో శివుడు లింగాన్ని చేసి ప్రతిష్టించాదట. ఇక్కడ మహా మాఘ, బంగారు తామర అనే రెండు పుష్కరిణులున్నాయి. మొదటిది చాలా పవిత్ర మైంది. పన్నెండు ఏళ్ళ కొకసారి "మహా మాఘ" వస్తుంది. అప్పుడు పౌర్ణమి నాడు చంద్రుడు మఖా నక్షత్రం లో ప్రవేశిస్తాడు. శుక్రుడు చంద్రుని తో కలుస్తాడు. లక్షలాది భక్త జనం వచ్చి పుష్కరిణి లో పవిత్ర స్నానాలు చేసి స్వామిని దర్శిస్తారు. అంటే పుష్కరానికి ఒక సారేమహా మాఘ ఉత్సవం జరుగు తుంది అన్న మాట. అదీ విశేషం.

కుమ్భేశ్వరాలయం-కుంభకోణం (తంజావూర్ జిల్లా) 
నిత్యాభిషేకం లేని శివలింగం కుంభకోణం తంజావూర్ జిల్లాలో ఉంది. దీనిని "దక్షిణ దేశపు ఆక్స్ ఫర్డ్" అని ఇంగ్లీష్ వారే కీర్తించారు. ఇక్కడి కుమ్భేశ్వరాలయం అతి ప్రాచీనమైనది. 350 అడుగుల పొడవు, 156 అడుగుల వెడల్పు ఉన్న పెద్ద ఆలయం. పది అంతస్తుల గోపురం ఇక్కడి ఒక వింత. అమ్మవారు మంగళాంబిక. గరుత్మంతుడు తెస్తున్న అమృత భాండంలో నుంచి కొన్ని చుక్కలు ఇక్కడ పడితే శివుడు ఇసుకతో కుండ చేసి వాటిని అందులో నిలువ చేసి అందులోనే ఉండిపోవటం వల్ల  కుమ్భేశ్వరుడయ్యాడు. అందుకని ఇక్కడ నిత్యాభిషేకాలు ఉండవు. సుగంధ ద్రవ్యాలనే లేపనంగా పూస్తారు ఇదో విచిత్రం. చిత్రమాసంలో సూర్యకిరణాలు లింగం పై పడటం విశేషం. విశాలమైన నటరాజ మండపానికి పెద్ద రాతి చక్రాలు అమర్చబడటం మరో వింత. పన్నెండు ఏళ్ళకోసారి ఇక్కడ మాఘమాసంలో మహామాఘం ఇక్కడి కోనేరులో జరగటం ఇంకో విశేషం. పవిత్ర నదులన్నీ ఈ కోనేటిలో ప్రవేశిస్తాయని నమ్మకం. లక్షలాది భక్తులు వచ్చి మాఘ స్నానం చేసి స్వామిని దర్శించి వెళ్ళటం మరొక విశేషం. కోనేరు విస్తీర్ణం యిరవై ఎకరాలు. అందులో ఇరవై రెండు బావులు ఉండటం విశేషాలకే విశేషం.

చిదంబర రహస్యం
పంచతత్వ లింగాలలో "ఆకాశ లింగం" ఉన్న పవిత్ర క్షేత్రం చిదంబరం. ఇక్కడి నటరాజ దేవాలయం నాట్యశాస్త్ర ప్రాముఖ్యత కలిగింది. ఆలయం ఫర్లాంగు పొడవు, ఫర్లాంగు వెడల్పు ఉంటుంది. చక్కని కనువిందు చేసే శిల్పాలు ఆకర్షిస్తాయి. శతాబ్దాలు గడచినా రంగు మారని చిత్ర కళా రహశ్యం అబ్బురపరుస్తుంది. నటరాజ ఆలయం ఆరు అడుగుల ఎత్తు మండపం. అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. మానవరూపంలో శివుడు నృత్యం చేసే భంగిమ లో విగ్రహం దర్శన మిస్తుంది. ఇక్కడే శివ లింగం ఉంది. అయినా పూజలన్ని నటరాజ స్వామికే జరగటం విశేషం.

గర్భగుడికి కుడి వైపు ఒక గది ఉంటుంది. గుడ్డ తెరలతో చీకటిగా ఉంటుంది. అర్చకుడు తెర తొలగించగానే, గోడ మీద బంగారు ఆకుల లాంటి వాటితో ఒక తోరణం వేలాడుతూ ఉంటుంది. శివుడు ఆకాశ రూపంలో ఉన్నాడు అని చెప్పి పూజారి తెరను మూసేస్తాడు. అదే చిదంబర రహశ్యం. సృష్టిలో మొదటిది ఆకాశం. దాని నుంచే మిగిలినవి ఏర్పడి, చివరికి అన్నీ ఆకాశంలో అంటే శూన్యంలో చేరిపోతాయి కనుక ఏ తాపత్రయము లేకుండా, ఆకాశం లాగా మనసును నిర్మలం గా ఉంచుకోవాలి. చిత్ అంటే మనసు. అంబరం అంటే ఆకాశం. నిర్మల మైన మనసును కలిగి ఉండాలి అని చెప్పేదే చిదంబర రహశ్యం.  నటరాజస్వామి ఎడమ కాలు కొంచెం పైకి ఎత్తి, కుడి కాలు వైపుగా మడిచి, నాట్యం చేస్తున్నట్లు ఉంటాడు. దీన్ని "భుజంగ త్రాస" అభినయం అంటారు. ఆయన చేతిలో ఉన్న డమరుకం నుంచి సృష్టి ఏర్పడిందని, అభయ హస్తాలు సృష్టిని రక్షిస్తున్నాయని, ఎడమ చేతిలోని అగ్ని లయ కారకత్వానికి చిహ్నం అని, పాదం కొంచెం ఎత్తి ఉండటం వల్ల మోక్షం ఇస్తున్నట్లు సూచన అని శిల్ప రహశ్యం తెలిసిన వారు శిల్పార్ధాన్ని వివరిస్తారు.

No comments:

Post a Comment