Monday, 14 September 2015

ఆరు నెలలు వానే

దిక్కులు పిక్కటిల్లే ఉరుముల గర్జనలు. పట్టపగళ్లు కంటిని పొడిచే చీకట్లు. రాలే చినుకులకు పోటీగా పిడుగులు. రోజులు, వారాలు వెరవని కుండపోత వర్షం. ఎడతెరిపి లేకుండా ఆరునెలల పాటు వానలో నానే గ్రామం మన దేశంలోనే ఉంది. పాదాల్ని తాకుతూ వెళ్లే మలయ మారుతాలు, పచ్చగా తడారని అడవులు, ఎప్పుడూ సడి చేసే సెలయేళ్లతో భూలోక స్వర్గ ధామంగా నిలిచిన ప్రాంతమది. ప్రపంచంలోనే అత్యంత తడి ప్రాంతంగా గుర్తించిన ఆ ప్రాంతం అందరూ అనుకునేట్టు చిరపుంజి కాదు.. మాసిన్రామ్‌. మేఘాల డోలికల్లో ఆటలాడుతూ, చినుకుతడికి పరవశించిన పువ్వులా అందాల్ని వికసిస్తుంది ఆ చెమ్మనైన ప్రాంతం. 

చిరపుంజికి దగ్గరలోనే ఉన్న కుగ్రామాల క్లస్టర్‌ ఈ ప్రాంతం. ప్రపంచంలో అత్యధికంగా వర్షపాతం నమోదైన గ్రామంగా గిన్నిస్‌ బుక్‌ రికార్డులకు ఎక్కింది మాసిన్రామ్‌. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు కేవలం 65 కిలోమీటర్ల సమీపంలోనే ఉంటుంది. మేఘాలకు ఆలయమైన ఆ రాష్ట్రంలో అధిక వర్షపాతం సాధారణమే అయినా ఈ ప్రాంతంలో మాత్రం అది అతి తీవ్రం. మేఘాలను తమకు వస్త్రంలా చుట్టుకునే ఖాసీ కొండల్లో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. ఇంత దుర్భేద్య వాతావరణ పరిస్థితుల్లోను స్థానిక ఖాసీ ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఆరు నెలలు ఓపిగ్గా ఇళ్లలో నిరీక్షిస్తే వసంతం వచ్చేస్తుందని చాలా తేలిగ్గా చెప్పేస్తారు. అందాక బుట్టల్ని, చీపుర్లను అల్లుతూ, వారి ప్రత్యేకత అయిన టార్టాన్‌ శాలువాలను నేస్తూ గడుపుతారు. మబ్బులు వీడినా చెమ్మ ఆరని ఆ ప్రాంతంలో వర్తక వాణిజ్యాలు చేసుకుంటారు. మబ్బులన్నీ కరిగి చలికాలం వచ్చేస్తే తీరిగ్గా ఇంటి మరమ్మతులకు కుటుంబమంతా కదులుతుంది. అంత అలజడి సృష్టించే వర్షంపై వారికి చాలా గౌరవం. వర్షాకాలం పూర్తయింది కదా అని ఏ పండగ పబ్బం చేసుకుని సంతోషాల్లో మునిగిపోరు. వెంటనే పనుల్లో నిమగమై రహదారులు, మార్కెట్లను సరిచేసు కుంటారు. విరిగిపడిన కొండ చరియల్ని పక్కకు తొలగించడం, వరద నీరు కూల్చేసిన నిర్మాణాలను పునరుద్ధరించడానికే చాలా రోజులు పడతాయి. 

రికార్డు వర్షపాతం విషయంలో కొలంబియాలోని లియోరో, లోపెజ్‌ డెల్‌ మికారు ప్రాంతాలతో వివాదముంది. కానీ, 1985లో ఇక్కడ కురిసిన 26,000 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుతో వాటిని పక్కకు నెట్టింది. సముద్ర మట్టానికి 7000 అడుగుల ఎత్తులో బంగాళా ఖాతం దగ్గరగా ఉండటం వల్ల ఈ స్థాయి వర్షపాతానికి కారణం. ఇక్కడ భారీగా గుంపులు గుంపులుగా ఉండే కొండల వల్ల ఋతుపవనాల మార్గం బాగా ఇరుకై నొక్కుకునేలా వెళ్లడంతో కుండపోత కురుస్తుందని వాతావరణ నిపుణుల వివరణ. స్థానిక జలాశయాల నుంచి తయారయ్యే మేఘాలు కొండల్ని చుడుతూ పైకి లేచే క్రమంలో చల్లబడి వర్షిస్తాయి. మే, జూలై నెలల్లో వర్షం తన ప్రతాపాన్ని చూపిస్తుంది.

అంత వర్షం పడినా అక్కడ మంచినీటి లభ్యత కష్టమే. విద్యుత్‌ సదుపాయం ఉన్నా కోతలే ఎక్కువ. ఆ గ్రామాలను కలుపుతూ ప్రధాన రహదారి ఒక్కటే ఉంది. అక్కడ ప్రత్యేకంగా పెరిగే గడ్డితో వారు తమ ఇళ్లను నిర్మించుకుంటారు. అది చక్కటి సౌండ్‌ ప్రూఫ్‌గా పనిచేసి ఉరుములు, పిడుగుల శబ్దాలను తగ్గిస్తుంది. కుండపోతగా కురుస్తున్న చినుకుల శబ్దం వల్ల గ్రామస్తులు పెద్ద గొంతుకతో మాట్లాడుకుంటారు. వారికి ఆ వాతావరణం ఎంతలా అలవాటైందంటే ఏ చింత లేకుండా జీవనం సాగిస్తున్నారు. గ్రామాన్ని, వర్షాన్ని ప్రేమిస్తూ హాయిగా బతికేస్తున్నారు. 

నెలల ముందు నుంచే వర్షాకాల పరిస్థితులకు సన్నద్ధమవుతారు. వంటచెరకును అడవి నుంచి సమకూర్చుకుంటారు. అదే వారి వంటకు, కాంతికి ఆధారం. ఆహార ధాన్యాలను నిల్వ చేసుకుంటారు. క్నప్‌ అనే ఛత్రం ఇక్కడ ప్రత్యేకం. మోకాలి వరకు ఉండే ఈ గొడుగులను వెదురు చీలికలు, ప్లాస్టిక్‌ పట్టాలు, చీపురు గడ్డితో తయారు చేస్తారు. చూడ్డానికి తాబేలు డొప్పలా ఉండే ఈ గొడుగులను శరీరానికి కట్టుకుని పనులు చేస్తుంటారు. రెండు చేతులతో సులువుగా పనిచేసుకునేలా చాలా నేర్పుగా వీటిని స్థానిక మహిళలు తయారు చేస్తారు. ఈదురు గాలుల్లోను పనులు చక్కబెట్టుకునేందుకు ఇవి ఉపయోగ పడతాయి. చీపురు గడ్డిని నీటిలో తడిపి చెక్క దిమ్మెలతో వాటిని బల్లపరుపుగా చేసి ఎండబెడతారు. దీనివల్ల గడ్డి చాలా దృఢంగా మారుతుంది. ఇక్కడ తయారు చేసిన చీపుర్లు, బుట్టలు, శాలువాలు ఎగుమతి అవుతాయి. వర్షాకాలానికి ముందు కొందరు వేరే ప్రాంతాల్లో ఉన్న తాత్కాలిక నివాసాలకు తరలిపోతారు. స్థానికుల పేర్లు గమ్మత్తుగా ఉంటాయి. మూన్‌స్టార్‌ అనే పేర్లు ఇక్కడ సాధారణం. బ్రిటీష్‌ కాలనీలు, మిషనరీల ప్రభావం వల్ల వీరు అలా పేర్లు పెట్టుకోవడం అలవాటైంది. చాలామందికి వాటి అర్థాలు తెలీదు.

ప్రకృతి వంతెనలు
ప్రకృతిని తమకు అనుకూలంగా మార్చు కోవడంలో వీరికి వీరే సాటి. రబ్బర్‌ చెట్ల వేర్లను ఒకదానికొకటి వెదురు బొంగుల ద్వారా అల్లుకునేలా చేసి వంతెనలు నిర్మించుకుంటారు. సజీవ వంతెనలుగా ఆశ్చర్యం గొలిపే వీటి ద్వారానే అడవుల్లో, గ్రామాల్లో తిరుగుతుంటారు. కొన్ని చాలా విశాలంగా మన కాంక్రీట్‌ వంతెనల పొడవు ఉంటాయి. చాలా దృఢంగా మారేందుకు ఏళ్ల తరబడి వేచి చూస్తారు. కొన్నింటికి దశాబ్దాల కాలం పడుతుంది. ఇలాంటి వంతెనలు ప్రపంచంలో మరెక్కడా కనబడవు. ఇలా ప్రకృతితో మమేకమై అసాధారణ వాతావరణానికి అనుకూలంగా మారి బతుకు బండిని లాగించేస్తున్నారు.

No comments:

Post a Comment