Thursday, 3 September 2015

ఆలయాలు - విచిత్ర విషయాలు

ఆలయాలు - విచిత్ర విషయాలుఅభిషేక జలం హరించే ఉమా కమండ లేశ్వరుడు
తూర్పు గోదావరి జిల్లాలో వసిష్ఠ నదీ తీరంలో ఉన్న క్షేత్రం ర్యాలి. అక్కడ జగన్మోహన ఆలయంతో బాటు ఉమా కమండలేశ్వర దేవాలయం కూడా ప్రసిద్ధి చెందంది. బ్రహ్మ దేవుడు తపస్సు చేసిన ప్రదేశంగా పేరు పొందింది. బ్రహ్మ, తన కమండలం పై ఉమా దేవితో కూడిన శివుడిని ప్రతిష్టించాడు. అదే ఉమా కమండ లేశ్వర ఆలయం. శివ లింగం రుద్రాక్ష లాగా గరుకు గా ఉంటుంది. సోమ సూత్రం లేక పోవటం ప్రత్యేకత. శంకరుడు కాముడిని దాహించాడు కనుక చాలా వేడి గా ఉంటాడు. అందుకని అభిషేకం చేసిన గంగా జలం అంతా అప్పటి కప్పుడు హరించుకు పోవటం వింత గా అని పిస్తుంది. బయటకు కాని, కిందకు కాని నీళ్ళు పోయే మార్గ మే లేదు. అక్కడ జగన్మోహన కేశవాలయంలో నీరు ఎప్పుడూ ఊరుతుంది. ఇక్కడ హరించుకు పోతుంది. అదీ చిత్రాతి చిత్రం.

రావణ బ్రహ్మ వాహనం పై ఊరేగే క్షీర లింగేశ్వరుడు
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో క్షీర రామ లింగేశ్వర స్వామి కొలువై ఉన్నాడు.  పాల తాతి స్పటిక లింగం అయిదు అడుగుల ఎత్తు ఉంటుంది.  లింగం వెనుక వైపు మూడు గీతలుండటం ప్రత్యేకత. నారద ప్రతిష్ట గా ప్రసిద్ధి. శివుడు శూలంతో నేల మీద గుచ్చితే పాలు చిమ్మి కొలను గా ఏర్పడింది కనుక "పాల కొలను" అయి క్రమంగా "పాలకొల్లు" అయింది. దుగ్దోవనపురం, ఉపమాన్యుపురం అనే పేర్లు కూడా ఉన్నాయి.శివ రాత్రి ఉత్సవంలో శివుడు "రావణ బ్రహ్మ వాహనం" పై ఊరేగటం ఇక్కడి విశేషం. చైత్ర శుద్ధ దశమి నాడు ఒకే సమయంలో శ్రీ లక్ష్మీ జనార్దనుల, పార్వతీ రామ లింగేశ్వారుల కల్యాణం జరగటం మరో విశేషం. జనార్దనుడు క్స్శేత్ర పాలకుడు.శివ కల్యాణం జరిగిన మరు నాటి ఉదయం సూర్య కిర ణాలు క్షీర రామేశ్వర లింగం పై పడటం చిత్రాతి చిత్రం.

నాట్యాభినయ  కరణాలు ఉన్న  కూచి పూడి రామ లింగని గుడి
కృష్ణా జిల్లా కూచిపూడి - కూచి పూడి నాట్య సిద్ధాంత కర్త సిద్ధేంద్ర యతీంద్రుల జనం స్థానం. కూచిపూడి నాట్యానికి కేంద్రంగా వర్ధిల్లింది. శ్రీ బాలా త్రిపుర సుందరీ సాహిత శ్రీ రామ లింగేశ్వర  స్వామిని శ్రీ రాముడు ప్రతిష్టించినట్లు స్థల పురాణ కధనం. ఆలయ ముఖమండపంలో 108   నాట్యాభినయ కారణాలను అత్యద్భుతం గా చెక్కారు. చిదంబరం ఆలయంలోని కరణాలను చూసి, ప్రముఖ కూచి పూడి నాట్యా చార్యులు పద్మ శ్రీ వెంపటి చిన సత్యం గారు వీటిని ఏర్పాటు చేసి తమ కళాభిమానాన్ని చాటుకొన్నారు.

పడమర ద్వారం - తూర్పు ఆలయం ఉన్న - కోడూరు
కృష్ణా జిల్లా దివి తాలూకాలో అవనిగడ్డకు దగ్గరలో కోడూరు గ్రామంలో శ్రీ సోమ శేఖర స్వామి ఆలయం తూర్పు వైపున ఉన్నా, ద్వారం మాత్రం పడమర వైపుకు ఉండటం విశేషం. ఈ ఆలయాన్ని ప్రఖ్యాత కవి, పండితుడు, శతాధిక గ్రంధ కర్త అయిన నాదెళ్ళ పురుషోత్తమ కవి 1894లో నిర్మించారు. కోడూరు ఒకప్పటి రేవు పట్టణం. "దివి దుర్గం" అనే పేరు దీనికి సార్ధక నామం గా ఉండేది. ఇప్పుడు మంచి వ్యాపార కేంద్రం. నిత్య ధూప దీప  నైవేద్యాలతో అభిషేకాలతో ఆలయం వర్ధిల్లు తోంది.

స్వయంభు లింగం తాడి పత్రీ
అనంత పురం జిల్లా తాడిపత్రీలో సి రామేశ్వర ఆలయం ఉంది. ఇది పశ్చిమాభి ముఖంగా ఉందాం విశేషం. పానవాట్టం ఆకారంలో ఒక శీల ఉంటుంది. లింగం ఉండదు. ప్రతిష్ట జరగలేదు. దీన్ని స్వయంభూ లింగంగా భావిస్తారు.  తురుష్కుల దండ యాత్రలో లింగం అపహరణకు గురైందట. ఆలయపు గోపురం అంతా నల్ల రాతి కట్టడంగా ఉండటం విచిత్రం                           

మత సామరస్యం విలసిల్లె కదిరి సమాధి
అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో "చంద్ర వాదన మొహియార్ "అనే సమాధిని హిందువులు, ముస్లిములు సమానంగా దర్శిస్తారు. ఈ సమాధి దగ్గర మట్టిని చేతిలో పట్టు కొంటే విడిపోయిన భార్యా భర్తలు కలిసి పోతారనే నమ్మకం ఉంది. సంసారంలో కలతలు రావనీ, కార్పణ్యాలు రావని విశ్వసిస్తారు.                    

కంచు శబ్దం చేసే రాతి నంది
ప్రకాశం జిల్లా అద్దంకికి పది కిలో మీటర్ల దూరంలో ధర్మవరం ఉంది. చుట్టూ ఎత్తైన కొండలు, అనేక జీర్ణ ఆలయాల నిలయం. ఒక కొండ మీద శ్రీ నీల కన్తేశ్వర ఆలయం ఉంది. శిధిల మైన స్తితిలో స్వామికి ఎదురుగా రాతి నంది ఉంది. ఈ నందిని రాయి తో కొడితే "కంచు శబ్దం" వినిపించటం అపూర్వ మైన వింత. ఇక్కడున్న కొండల చుట్టూ "రాక్షస గుడులు" ఉన్నాయి. ఇవి, రాతి యుగం నాటి మానవ ఆవాస భూమి గా భావిస్తున్నారు.

లింగోద్భావాన్ని చూపే శివ లింగం
గుంటూరు జిల్లా చండవోలులో చాలా పురాతన మైన "లింగోద్భవ స్వామి" దేవాలయం ఉంది. శివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో శివుడు ఇక్కడ లింగరూపం పొందాడని ప్రజల విశ్వాసం. ఆ లింగం ఆది, అంతాలను తెలుసుకోవ టానికి బ్రహ్మా, విష్ణువు ప్రయత్నించి విఫలురైనా సంగతి అందరికి తెలిసిన విషయమే. చిన్న లింగం గుడిలోను, పెద్ద లింగం బయటా ఉంటాయి. మొగలి రేకు గుర్తు, హంస గుర్తు ఈ లింగాల పై ఉండటం చిత్రాతి చిత్రం. లింగోద్భవం జరిగింది ఇక్కడే నని చెప్ప టానికి ఈ రెండు గుర్తులు సాక్ష్యంగా ఉన్నాయని ఇక్కడి వారి విశ్వాసం.

చేజెర్ల కపోతెశ్వరుడు
గుంటూరు జిల్లా నరసరావు పేట కు ౨౫ కి.మీ. దూరంలో "చేజెర్ల" గ్రామంలో కపోతేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది చతుర్భుజా కారంలో ఉండటం విశేషం. స్వామి పావురం ఆకారంలో లింగ రూపంలో ఉండటం మరో విచిత్రం. శిబి చక్ర వర్తి, త్యాగ ఉద్దితో తన తోడలోని మాంసాన్ని కోసి పావురాయిని కాపాడిన ప్రదేశం ఇదే అని జనుల విశ్వాసం. దాని గుర్తు గానే ఇక్కడ శివుడు కపోతేశ్వరుడై, శిబి త్యాగానికి చిహ్నం గా నిలిచాడు. 

అయిదంతస్తుల మహాద్వారం ఉన్న పుష్పగిరి
కడప జిల్లాలో పినాకినీ నదికి తూర్పున కొండ పై పుష్పగిరి ఉంది. దీని పైనే గొప్ప ప్రాకారం, మహా ద్వారం ఉన్నాయి. దీని లోపల చెన్న కేశవా స్వామి, ఆయనకు ఉత్తరంగా "పుష్పాచ లింగం" ఉండటం విశేషం. మహాద్వారం అయిదు అంతస్తులు కలిగి విపరీతమైన ఆశ్చర్యం కలిగిస్తుంది. పుష్పాచ లింగేశ్వరునికి, ఎడమ వైపు ఉమామహేశ్వర లింగం ఉండటం విశేషం. కొండ కింద "ప్రయాగ మాధవ మూర్తి" ఉన్నాడు. ఈ స్వామికి పశ్చిమం వైపు "రుద్ర పాదం" ఉంది. 24 అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల వెడల్పు ఉన్న కుడి పాదం ఇది. దీనికి సుమారు కిలో మీటర్ దూరంలో "ముని పాక" అనే గ్రామంలో విష్ణు పాదం ఉంది. ఆంధ్రులకు ఏకైక పీఠం పుష్పగిరి యే.

తేళ్ళ మండపం
కడప జిల్లాలో రాయచోటిలో వీర భద్ర స్వామి ఆలయం ఉంది. దసరా పండుగ రోజున స్వామి వారి గ్రామ విహారంలో "పారు వేట "ఉత్సవం జర్గు తుంది. ఈ ఉత్స వాన్ని "తేళ్ళ మండపం" అనే చోట జర పటం ఆన వాయితీ గా వస్తోంది  ఆ సమయంలో  వేలాది తేళ్ళు అక్కడికి చేరు కొంటాయి. ఎవర్నీ ఏమీ చేయవు. ఉత్సవం అయి పోగానే ఒక్క తేలు కూడా అక్కడ ఉండ కుండా వెళ్లి పోవటం చిత్రాతి చిత్రం.

రస భాండ నిలయం - సిద్ధ వటం
కడప జిల్లా పెన్నానదీ తీరాన సిద్ధ వటం అనే గ్రామంలో అనేక సిద్ధ పురుషులు ఉండే వారట. అందుకే ఆ పేరు సార్ధక మైంది. అందులో "రస సిద్ధులు" చాలా మంది ఉండే వారట. అక్కడ భూమి ని తవ్వితే నేక రస భాండాలు కన్పించాయట. వాటిలో ఏమి ఉందొ, వాటి వివరాలు ఇప్పటికీ ఎవరికీ తెలియదట. ఆ రసం ఎందుకు ఉపయోగించారో, ఉపయోగిస్తారో ఈ నాటికి అంతుపట్టని మిస్టరిగానే ఉందట. అదీ సిద్ధవటం హిస్టరీ. తిరునాళ్ళలో ఇక్కడి నీటి బుగ్గలు ఉబుకుతాయత. అదొక వింత గా చెప్పు కొంటారు.

గోపాద ముద్రలున్న మహా నందీశ్వరుడు
కర్నూలు జిల్లా నంద్యాలకు దగ్గరలో ఉన్న మహా నంది గొప్ప శైవ క్షేత్రం. మహా నందీశ్వర లింగం కింద "రుద్ర కుండం" అనే కోనేటిలోకి, నీరు నిరంతరం గా ప్రవహిస్తూ ఉంటుంది. లింగం మీద ఆవు పాద ముద్రలు కనిపించటం ఇక్కడి వింత. అది సాలగ్రామలింగం అవటం మరీ విశేషం. పుష్కరిణిలో నీళ్ళు ఎప్పుడు అయిదు అడుగుల లోతులో ఉండటం మరో విశేషం. దీనిలో స్నానం చేయటం పరమానందం, వింత అనుభవం. అడుగున వేసిన చిన్న పైసా కూడా స్పష్టం గా కని పిస్తుంది. స్నానం చేస్తుంటే మనం దేవతలమేమో నన్న దివ్య భ్రాంతి, కాంతి మన శరీరాలకు కలిగి మరిచిపోలేని అనుభూతిగా మిగిలి పోతుంది. ఆనంద పారవశ్యం కల్గిస్తుంది. దీని కంతటికీ కారణం ఆ జలం శుద్ధ స్పటిక జలం అవటమే. దివ్యాను భూతి అంటే ఏమిటో ఇక్కడే మనం పొందగలం.

అభిషేక జలాన్ని మాయం చేసే  మహేశ్వరుడు
ప్రకాశంజిల్లాలో కనిగిరి పట్టణానికి ఇరవైకిలో మీటర్ల దూరంలో "మల్లప్ప సెల" అనే ఊరిలో, ఈశ్వరాలయం చాలా ప్రసిద్ధి చెందింది. శివునికి చేసిన అభిషేక జలం బయటకు పోయే మార్గంలో ఒక రుషి శయనించి ఉన్నట్లుగా ఒక శిల్పం ఉంది. స్వామి వారి పుష్కరిణీ జలాన్ని తెచ్చి, అభిషేకం చేస్తే ఒక్క చుక్క నీరు కూడా కనిపించాడు. పుష్కరిణి నీరు కాకుండా, ఇంకే రకమైన నీటి తోఅభిషేకం చేసినా, ఆ నీరు అక్కడే నిలచి ఉండి పోవటం చూస్తే ముక్కు మీద వేలు వేసుకొని ఆశ్చర్య పోతాం.

అభిషేక జలం బయటకు రానివ్వని బాల బ్రహ్మేశ్వర లింగం
మహబూబ్ నగర్ జిల్లాలో, కర్నూలు కు దగ్గరగా"అలంపురం" చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రం. దక్షిణ కాశి అంటారు. తుంగ భద్రా నదీ తీరం. ఇక్కడా నవ బ్రహ్మ లకు ఆలయాలున్నాయి. ఇక్కడి బాల బ్రహ్మాలయం చాలా ప్రసిద్ధి పొందింది. బాల బ్రహ్మేశ్వర లింగానికి ఎంత నీటితో అభిషేకం చేసినా, ఒక్క చుక్క నీరు కూడా బయటకు రాదట. గుడి లోపల ఉన్న గణపతి విగ్రహాన్ని వన మూలికలు, పసరులు, ఇసుకతో కలిపి, ఈ ఆలయాన్ని నిర్మించిన రససిద్ధుడు తయారు చేశాడట. ముట్టుకుంటే గరుకుగా ఉంటుందట. ఇక్కడి ఆలయాలన్నీ  మహోన్నత శిల్పాలతో విరాజిల్లుతూ ఉంటాయి. జోగులాంబా దేవి శక్తి క్షేత్రం ఇది. ఆలాయాలన్ని గుహల్లా గా ఉండటం విచిత్రం. రాతికీ, రాతికీ మధ్య అతికించాటానికి  సున్నం లాంటిది ఏదీ వాడక పోవటం మరీ విచిత్రం.

బోయలే పూజారు  లైన బీచు పల్లి
మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణా తీరాన బీచు పల్లి ఆంజనేయ స్వామి ఆలయం, మహిమాన్విత మై ప్రసిద్ధి చెందింది. స్వామి స్వయం గా వెలసిన దివ్య క్షేత్రం. స్వామి అర్చకులు బోయ వాళ్ళే. స్వామి దర్శనం తో దీర్ఘ వ్యాదు లన్నీ మాటు మాయం అవుతాయని భక్త జన విశ్వాసం. స్వామి సమీ పంలో ఉన్న "కడిమి చెట్టు "మహా మహిమాన్విత మైనదని ఇక్కడి ప్రజల అచంచల విశ్వాసం.

లింగం మీద ఒకే మట్టంలో నీరు ఉండే వాడ పల్లి
మూసీ నదికి ముచి కుంద నది అని పేరు. ఇది నల్గొండ జిల్లా వాడ పల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. ఇక్కడి అగస్స్త్యేశ్వర దేవాలయం పురాణ ప్రసిద్ధ మైనది. శివ లింగం మీద నీరు ఎప్పుడూ ఒకే ఎత్తులో ఊరుతూ ఉండటం ఇక్కడి విశేషం. దీనికి దగ్గరలో నర సింహ స్వామి ఆలయమూ విశిష్ట మైనదే. స్వామికి ఎదురుగా పద కొండు దీపాలు నిరంతరం వెలుగుతూ ఉండటం విశేషం. అందులో నర సింహ స్వామి ముక్కుకు దగ్గరగా ఉన్న దీపం గాలికి రెప రెప లాడుతూ కన్పించటం మరీ విచిత్రం.. మిగిలిన దీపాలు నిశ్చలంగా వెలుగుతూ కన్పిస్తాయి. దేవుడు ఊపిరి పీలుస్తున్నాడు అన్న భావన కలిగేట్లు శిల్పి నిర్మించిన నిర్మాణ చాతుర్యం ఆశ్చర్యం కలిగించి ఆతని చాతుర్యానికి జోహారు లర్పిస్తాం. శైవ, వైష్ణవ దివ్య  క్షేత్రం వాడ పల్లి.

కంచి - అయ్య వారికి దూరం గా అమ్మ వారున్న కంచి
కంచి కామాక్షి క్షేత్రం పరమ పవిత్ర మైనది. ఏకాంబరేశ్వరుడు దర్శనీయుడు. సాధారణంగా స్వామి వారి విగ్రహానికి ఎడమ వైపు అమ్మ వారి విగ్రహం ఉంటుంది. అయితె కంచిలో మాత్రం, ఎకామ్రారేశ్వర ఆలయానికి సుమారు రెండు ఫర్లాంగుల దూరంలో కామాక్షి దేవి ఆలయం ఉండటం విశేషం. కామాక్షి ఆలయంలో, అమ్మ వారి ఎదుట బీజాక్షరాలతో ఉన్న యంత్రం ప్రతిష్టించబడి ఉంది. పూజాదికాలను యంత్రానికే చేయటం ఇక్కడి ప్రత్యేకత.   ఇక్కడే శ్రీ కంచి కామ కోటి పీఠం ఉంది. విష్ణు కంచిలో వరద స్వామి ఆలయం ఉంది. ఇక్కడి వెండి బల్లిని తాకితె పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.  కామ కోటి అంటే కామం తర్వాత వచ్చే మోక్ష దశ్శ. అంటే మోక్షం పొంద టానికి దారి చూపేది కామ కోటి పీఠం అని అర్ధం.

మత సామరస్యం తో వెలిగే వేముల వాడ
కరీం నగరం జిల్లా వేముల వాడలో శ్రీ రాజా రాజేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది ఒకప్పటి రాజ దాని.  జైన,  బౌద్ధాలు విలసిల్లిన ప్రదేశం.  ఒక ముస్లిం ముల్లా గారి స్మారక చిహ్నం ఈ ఆలయంలో ఉండటం ఇక్కడి ప్రత్యేకత.  రాజా రాజేశ్వర లింగం "నీల మాణిక్య లింగం. "పాన వట్టం కింద బ్రహ్మ, మధ్య విష్ణువు, పైన శివుడు ఉంటారు. అమ్మ వారు శ్రీ రాజ రాజేశ్వరి దేవి. ఆమె వాహనం వ్యాఘ్రం కాదు "వరాహం". ఇదీ ఇక్కడి విశేషం. వెయ్యి బంగారు నాణాలతో శివుడికి అభి షేకం చేయటం ఇక్కడి మరో విచిత్ర విషయం. అంటే కాదు అన్నం తో కూడా స్వామికి అభిషేకం నిర్వహించటం మరో వింత. కోడె గిత్తలను స్వామికి సమర్పించటం మరో వింత. అవి రాత్రి పూట ఆలయం,లో నిద్రిస్తాయి. దీన్నే"కోడె కట్టటం"అంటారు. ఆలయంలో బౌద్ధ, జైన విగ్రహాలు కూడా ఉండటం అబ్బుర పరుస్తుంది.దీనికి దక్షిణ కాశి అని పేరుంది. నన్నయ గారి భారత రచనకు రాజ రాజ నరేంద్రుడు ప్రేరణ గా నిలిస్తే, వేముల వాడ రాజు "అరి కేసరి" 10 వ శతాబ్ది లోనే తన ఆస్తాన కవి"పంప"కవి ని ప్రేరేపించి కన్నడ భారతాన్ని రాయించి కృతిని అంకితం గా పొందటం విశేషం. పంపకవి జైనుడు. అతని సోదరుడు జన వల్లభుడు ఇక్కడి వాడే. ఇతడు తెలుగులో "కంద పద్యాలు" రాసిన మొదటి కవి గా ప్రసిద్ధి చెందాడు. "లేగల వాడ", "వెంబుల వాడ" అయి చివరికి "వేముల వాడ" అయిందని చెబుతారు.

కుంభ కోణం  
తమిళనాడులోని కుంభకోణంలోని కుమ్భేశ్వర ఆలయం అత్యంత ప్రాచీన మైనది. ఇక్కడ బ్రహ్మ దేవుడికి ఆలయం ఉండటం ఒక విశేషం. దక్షిణ దేశంలో ఇంకెక్కడా బ్రహ్మకు గుడి లేదు. కుంభాలు అంటే కుండలు. కుండల్ని చేసే మట్టి తో శివుడు లింగాన్ని చేసి ప్రతిష్టించాదట. ఇక్కడ మహా మాఘ, బంగారు తామర అనే రెండు పుష్కరిణులున్నాయి. మొదటిది చాలా పవిత్ర మైంది.  పన్నెండు ఏళ్ళ కొక సారి "మహా మాఘ" వస్తుంది. అప్పుడు పౌర్ణమి నాడు చంద్రుడు మఖా నక్షత్రంలో ప్రవేశిస్తాడు. శుక్రుడు చంద్రుని తో కలుస్తాడు. లక్షలాది భక్త జనం వచ్చి పుష్కరిణిలో పవిత్ర స్నానాలు చేసి స్వామిని దర్శిస్తారు. అంటే పుష్కరానికి ఒక సారేమహా మాఘ ఉత్సవం జరుగు తుంది అన్న మాట. అదీ విశేషం.

చిదంబర రహస్యం
పంచతత్వ లింగాలలో "ఆకాశ లింగం" ఉన్న పవిత్ర క్షేత్రం చిదంబరం. ఇక్కడి నటరాజ దేవాలయం నాట్యశాస్త్ర ప్రాముఖ్యత కలిగింది. ఆలయం ఫర్లాంగు పొడవు, ఫర్లాంగు వెడల్పు ఉంటుంది. చక్కని కనువిందు చేసే శిల్పాలు ఆకర్షిస్తాయి. శతాబ్దాలు గడచినా రంగు మారని చిత్ర కళా రహశ్యం అబ్బురపరుస్తుంది. నటరాజ ఆలయం ఆరు అడుగుల ఎత్తు మండపం. అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. మానవరూపంలో శివుడు నృత్యం చేసే భంగిమలో విగ్రహం దర్శన మిస్తుంది. ఇక్కడే శివ లింగం ఉంది. అయినా పూజలన్ని నటరాజ స్వామికే జరగటం విశేషం. గర్భగుడికి కుడి వైపు ఒక గది ఉంటుంది. గుడ్డ తెరలతో చీకటిగా ఉంటుంది. అర్చకుడు తెర తొలగించగానే, గోడ మీద బంగారు ఆకుల లాంటి వాటితో ఒక తోరణం వేలాడుతూ ఉంటుంది. శివుడు ఆకాశ రూపంలో ఉన్నాడు అని చెప్పి పూజారి తెరను మూసేస్తాడు. అదే చిదంబర రహశ్యం. సృష్టిలో మొదటిది ఆకాశం. దాని నుంచే మిగిలినవి ఏర్పడి, చివరికి అన్నీ ఆకాశంలో అంటే శూన్యంలో చేరిపోతాయి కనుక ఏ తాపత్రయము లేకుండా, ఆకాశం లాగా మనసును నిర్మలం గా ఉంచుకోవాలి. చిత్ అంటే మనసు. అంబరం అంటే ఆకాశం. నిర్మల మైన మనసును కలిగి ఉండాలి అని చెప్పేదే చిదంబర రహశ్యం.  నటరాజస్వామి ఎడమ కాలు కొంచెం పైకి ఎత్తి, కుడి కాలు వైపుగా మడిచి, నాట్యం చేస్తున్నట్లు ఉంటాడు. దీన్ని "భుజంగ త్రాస" అభినయం అంటారు. ఆయన చేతిలో ఉన్న డమరుకం నుంచి సృష్టి ఏర్పడిందని, అభయ హస్తాలు సృష్టిని రక్షిస్తున్నాయని, ఎడమ చేతిలోని అగ్ని లయ కారకత్వానికి చిహ్నం అని, పాదం కొంచెం ఎత్తి ఉండటం వల్ల మోక్షం ఇస్తున్నట్లు సూచన అని శిల్ప రహశ్యం తెలిసిన వారు శిల్పార్ధాన్ని వివరిస్తారు.

నడుంలోతు నీటిలో శివ లింగం         
నల్గొండ జిల్లాలో నల్గొండకు అతి సమీ పంలో "పాను గల్లు" గ్రామం ఉంది. అక్కడున్న ఛాయా సోమేశ్వర ఆలయం ప్రసిద్ధ మైనది. ఆలయం చుట్టూ ఎనిమిది వైపులా చిన్న మండపాలున్డటం ప్రత్యేకత. వీటి మధ్యలో మూడు గర్భ గుడులు ఉన్న దేవాలయం ఉండటం విశేషం. దీన్నే "త్రికూటాలయం" అంటారు. గర్భాలయంలో నడుము లోతు జలంలో శివలింగం ఉండటం ప్రత్యేకత. ఈ జలం అన్ని కాలాల్లో అదే లోతులో ఉండటం విచిత్రం. ఈ జల లింగం పైన అన్ని సమయాల్లో స్తంభాకారంలో నీడ పడటం మరో వింత. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు నీడ ఒకే రకంగా పడటం వింతల్లో వింత. ఇదే "ఛాయా సోమేశ్వరం". ఈ రహశ్యం ఇప్పటికీ దుర్భేద్యంగానే ఉంది.
ఇంకో వింత కూడా ఉందండోయ్. సింహ ద్వారానికి ఎదురుగా, గర్భాలయం ద్వారంలో నిలబడితే, మన నీడ ఒకటి మూడు చాయాల్లో, అయిదు చాయాల్లో ఎదుటి గోడ మీద పడుతుందట. ఈ కాంతి రహశ్యం తెలిసిన ఆ అజ్ఞాత శిల్పి చాతుర్యానికి మప్పి దాలు.
అంతే కాదండోయ్ ఈ ఊరి దగ్గరే "పచ్చల సోమేశ్వరాలయం" ఉందట. నల్ల రాతి స్థంభ నిర్మాణం అది. ఆ స్తంభాలపై మన ప్రతి బింబాన్ని చూసుకోవచ్చు నట. అంటే అంత నున్నగా చేక్కారన్న మాట. అద్దం లాగా ఉంటుందన్న మాట. లింగంలో "ఒక పచ్చ" ను శిల్పి పోదిగాడట. పచ్చలహారం నిత్యం స్వామికి ధరింపజేయటం వల్ల పచ్చల సోమేశ్వరుడు అయాడు.                                            

కొలను పాక కోటి లింగం
నల్గొండ జిల్లా భువన గిరికి ముప్ఫై కిలో మీటర్ల దూరంలో "కొలను పాక" ఉంది. ఇక్కడి కాశీ బుగ్గ అనే బావిలో ని నీరు "గంగా జలం" గా భావిస్తారు. దీని ప్రక్కనే  శివాలయం ఉంది. అందులోని స్వామిని "అపర కాశీవిశ్వనాధుడు "గా పూజిస్తారు. దీనికి దాదాపు ఎనిమిది వందల సంవత్స రాల చరిత్ర ఉంది. ఈ వూరికి నైరుతి భాగంలో ఒక చిన్న దేవాలయంలో ఒక శివ లింగం ఉంది. దీన్నే "కోటి లింగం" అంటారు. లింగం చుట్టూ గొలుసు లాగా అనేక లింగాలున్డటం ప్రత్యేకత. అందుకే ఆపేరు వచ్చింది.      

యజ్ఞోప వీతం ఉన్న కాళింగ  దేవి  
కరీం నగర్ జిల్లాలో మందెన గ్రామం ప్రసిద్ధి చెందినదే. మంత్ర కూటం అనే పేరు దానికి ఉండేది. నేపాల్ లోని పశుపతేశ్వర దేవాలయంలోని పూజారులు మందెన గ్రామ వాసులేనట. ఇక్కడ గౌతమ మహర్షి తపస్సు చేశాడట. ఇక్కడి శివాలయాన్ని అందుకే "గౌతమేశ్వర ఆలయం" అంటారు. ఇక్కడ భూమిని తవ్వితే బయట పడ్డ ఇటుకలను నీటి పై వేస్తె తేలి పోతాయట. ఇదీ ఇక్కడి వింత. అమ్మ వారు కాళిందీ దేవి. నల్ల రాతి విగ్రహం. ఆమెకు యజ్ఞోప వీతం ఉండటం విశేషం. అంతే కాదు గోదావరి నది మధ్యలో ఒక దిబ్బ మీద పానువట్టంలో పద కొండు శివ లింగాలున్డటం వింతల్లో వింత అయితే నందీశ్వర విగ్రహంలో పద కొండు నందులున్డటం మరీ విడ్డూరం అని పిస్తుంది. మందెన గోదావరి తీర గ్రామం. వేద పండితులకు నిలయం. మన పూర్వ ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని బహు భాషా వేత్త పీ.వి.నర సింహారావు గారిది కూడా ఈ గ్రామం కావటం మరో విశేషం.

మన వైపే చూసే నందీశ్వరుడు
వరంగల్ జిల్లా హనుమ కొండకు 70 కి.మీ. దూరంలో ఉన్న "పాలం పేట" చిన్న గ్రామం.  గ్రామానికి, చెరువుకు మధ్య రామప్ప దేవాలయం ఉంది. కాకతి చక్రవర్తి న్గనపతిదేవుడు నిర్మించిన రుద్రేశ్వరాలయం ఇకడే ఉంది. నక్షత్ర ఆకారంగా ఉండే వేదిక పై ఆలయం నిర్మించారు. పన్నెండు నల్ల రాతి యక్షినీ విగ్రహాలు, ఆలయ పై భాగాన్ని మోస్తున్నట్లుగా శిల్పాలుంటాయి. అనీ కదులుతున్న బొమ్మల్లాగా కనిపించటం విశేషం. ఆ శిల్ప శోభ అనన్య సదృశం. ఆలయ నిర్మాణానికి చాలా పెద్ద  ఇటుకలను ఉపయోగించారు. అవి తేలికగా ఉండటమే కాదు, నీటి పై తేలటం విచిత్రంగా వుంటుంది. రుద్రేశ్వర స్వామి భారీ శివ లింగం. నాగిని అనే నగ్న స్త్రీ శిల్పం అందర్నీ యిట్టె ఆకర్షిస్తుంది. ఆమె శరీరం చుట్టూ పాములు చుట్టూ కొన్నట్లుగా నిర్మించి, అబ్బుర పరుస్తాడు శిల్పాచార్యుడు. ఆ శిల్ప సోయగం ఆనందపు అంచుల్ని చేరుస్తుంది. ఇక్కడి రుద్ర స్వామికి అభిముఖంగా ఉండే నందీశ్వర విగ్రహం వింత గోలుపుతుంది. నందీశ్వరుని కళ్ళు మన వైపే చూస్తున్నట్లుగా ఉంటాయి. ఏ వైపు నుంచి చూసినా, మనల్నే ఆయన చూస్తున్నట్లు గా చెక్కటం పరమాద్భుతం అని పిస్తుంది. నల్ల రాతి విగ్రహంలో అనంత మైన శిల్ప విన్నానాన్ని దర్శింప జేసిన ఆ శిల్ప బ్రహ్మ. .సృష్టికే ప్రతి సృష్టి చేశాడనిపిస్తుంది. 

భారీ శిలా ధ్వజ స్తంభం
చిత్తూరుజిల్లా మదనపల్లికి దగ్గరలో "సోమపాలెం" శివాలయంలో 45 మీటర్ల ఎత్తు ఉన్ననాల్గు పలకల రాతితో చేయబడిన ధ్వజస్తంభం చూపరులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆనందంతో పాటు విపరీతమైన ఆశ్చర్యాన్నీ కలిగిస్తుంది. ఇంత భారీ రాతి ధ్వజ స్తంభం ఇంకెక్కడా లేదని చెబుతారు. ఈ స్వామికి రాతి రధం కూడా ఉండటం మరో విశేషం. ఈ భారీ ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారట. వారి కళా పోషణకు, భక్తీ  వైభవానికి ఇది మచ్చు తునక.

తండ్రీ కొడుకులకు గుడులున్న "భైరవ కొండ"
బ్రహ్మకు ఆలయాలు ఉండటమే వింత అయితె, ఆయన తండ్రి విష్ణువు తో కూడిన ఆలయం వుండటం మరీ వింత.  ఆ విచిత్రానికి నిలయమే నెల్లూరు జిల్లా లోని ఉదయగిరికి దగ్గరలో ఉన్న భైరవ కొండ గ్రామం. ఒకే రాతి తో చేసిన  ఎనిమిది గుహాలయాల సముదాయంలో శివ లింగాలున్డటం ఇక్కడ మరో విశేషం. ముందు ముఖ మండపం,  తర్వాత గర్భ గుడి ఉంటాయి. ఈ గుహలన్నీ తూర్పు ముఖం గా ఉంటే, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా ఉంటుంది. గుహల ముందు చిన్న సెలయేరు ఉంటుంది. దక్షిణాన వైపు బ్రహ్మ విగ్రహం, ఉత్తరం వైపు విష్ణు విగ్రహం ఉంటాయి. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను అంటే త్రిమూర్తులను ఒక్క చోటే దర్శించే మహద్భాగ్యం కలుగు తుందన్న మాట.                 

బొట్టు పెట్టు కోని లచ్చి 
నెల్లూరు జిల్లా పెంచలకోన గ్రామంలో నరసింహ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. స్వామిని "పెంచలయ్య" అని భక్తులు ఆప్యాయంగా పిలుచుకొంటారు. ఆ పేరునే పిల్లలకు పెట్టు కొంటారు భక్తిగా. ఆ స్వామికి నిత్య పూజ ఉండదు. ఇదే ఇక్కడి వింత. ఒక్క శని వారమే పూజాదికాలు నిర్వ హిస్తారు.  మూల విరాట్టు అయిన నరసింహ స్వామి రెండు రాళ్ళు పెన వేసుకోన్నట్లు ఉండే శిలా ప్రతిమ. ఆయనకు లచ్చి (లక్ష్మి), చెంచీత అనే ఇద్దరు భార్యలున్నారని మనకు తెలుసు. చెంచీతను పెండ్లాడాడని లచ్చికి కోపం వచ్చింది. ఇంకేముంది అలిగి బొట్టు చెరుపుకుని, చీకట్లో ఒక మూల కూర్చుందట. అందుకే లచ్చి విగ్రహానికి భక్తులు ఎన్ని సార్లు కుంకుమ అద్దటానికి ప్రయత్నం చేసినా అతకదట. జారి పోతుందట. తమాషా గా ఉంది కదా! అదీ ఆడ వారి ప్రతిజ్ఞా, సాధింపూ.

ఒంటిపాదం పై లక్ష్మీ నృసింహులు   
అంతపురం జిల్లాలో అనంతపురానికి దగ్గరలో "పెన్నఅహోబిల క్షేత్రం" ఉంది. సముద్ర మట్టానికి 1360 అడుగుల ఎత్తున శ్రీ లక్ష్మీనరసింహ ఆలయం ఉంది. అయితే వింత ఏమిటంటే విగ్రహం లేని ఆలయం ఇది. నల్ల రాతి మీద శ్రీ లక్ష్మీనరసింహని పాదం ఒక్కటి మాత్రమే కన్పిస్తుంది. హిరణ్యకశిపుని వధ తర్వాత స్వామి ఇక్కడికి వచ్చి, ఒంటి పాదం పై నిలబడ్డాడని ఐతిహ్యం. పాదం కింద ఒక బిలం ఉంది. ఎన్ని బిందెల నీరు స్వామి పాదానికి అభిషేకం చేసినా ఆ నీరు ఆ బిలంలోకి జారి పోతుందట. ఆ బిలం ఎప్పుడూ నిండదు . ఇదీ విచిత్రం. కొండ  కింద లక్ష్మీ దేవి ఆలయం ఉంది. ఇక్కడా అమ్మ వారి విగ్రహం లేదు. ఒక్క శిల మాత్రమే ఉంది. గుడికి కొద్ది దూరంలో ఒక రాతి మీద వరాహ పాద చిహ్నాలు కన్పిస్తాయి. కనుక స్వామి వరాహాన్ని వేట ఆడాడని భక్తుల విశ్వాసం.

రంగులు మారే కోనేరు
అనంతపురం జిల్లా లోని "హేమావతి" అతి ప్రాచీన చోళ రాజదాని. ఇక్కడ గొప్ప విశ్వ విద్యాలయం ఉందట. దానికి అనంత శివ దేవుడు అది పతి అని చరిత్ర. ఇక్కడే సిద్దేశ్వర, మల్లేశ్వర ఆలయాలున్నాయి. ఆలయంలోని కోనేరులోని నీరు ఉదయం ఎరుపు రంగులో మధ్యాహ్నం ఆకుపచ్చగా, సాయంత్రం పసుపు రంగు  లోను కన్పించి చిత్రాతి చిత్రం అని పిస్తుంది. ఈ విచిత్రానికి కారణం ఏమిటో ఇప్పటి వరకు ఎవ్వరూ కనిపెట్ట లేకపోయారు. 

నారాయణ పాద పూజ చేసే సూర్య నారాయణుడు
చిత్తూరు జిల్లా తిరుపతికి దగ్గరలో "నాగలా పురం" లో శ్రీ కృష్ణదేవరాయలచే నిర్మింపబడిన "వేద నారాయణ స్వామి" ఆలయం ఉంది. సూర్యకిరణాలు వేద నారాయణ స్వామి పాదాలపై పడిన సమయంలోనే, ఇక్కడి నారాయణ స్వామికి పూజ జరగటం ప్రారంభమవుతుంది అదీ విశేషం.

కుంభకోణంలో కుండ మూతి లింగం
తమిళ నాడు లోని కుంభకోణంలో వెలసిన "కుమ్భేశ్వర స్వామి" లింగం కుండా మూతి లాగా ఉండటం తో ఆ పేరు వచ్చింది. ఇక్కడ మహా మాఘం అనే కొలను ఉంది. పన్నెందేల్లకు వచ్చే పర్వ దినమే మహా మాఘం. .ఆ సమయంలో ఆ కొలనులో "గంగా జలం" పుడుతుందని భక్తుల విశ్వాసం. ఇదీ ఇక్కడి వింత, విశేషం.  మహా మాఘంలో ఉత్సవం అమోఘం గా జరుగుతుంది.

వ్రేలి ముద్రలు కని పించే సైకత లింగం
కర్నూలు జిల్లా ప్రొద్దుటూరు కు దగ్గర్లో ముక్తి రామేశ్వరం ఉంది. .ఇక్కడి లింగం ఇసుక తో చేసింది. సైకత లింగం అంటారు. .లింగం అయిదు అంగుళాల ఎత్తు మాత్రమే ఉండటం విచిత్రం. ఈ లింగం పై ఇసుకను అదిమి పెట్టిన చేతి వ్రేలి ముద్రలు ఇప్పటికీ కని పించటం విశేషం.

ఉత్సవాలు లేని కోటి పల్లి లింగం
తూర్పు గోదావరి జిల్లా కాకినాద కు దగ్గర్లో గోదావరి ఒడ్డున కోటి పల్లి దివ్య క్షేత్రం. దేవేంద్రుడు నిర్మించిన స్వంభూ శివలింగం, ఆలయం ఉన్నాయిక్కడ. పాతాళం నుంచి ఈ లింగం ఉద్భవించినదని పురాణ కధనం. ఇది ‘’యోగా లింగం ‘’అవటం వల్ల ఉత్స వాలు ఉండవు. ఈ కోటేశ్వర స్వామికి చైత్ర మాసం నుండి అయిదు నెలలు కోటి తీర్ధంలో ఉంటాడు. మిగతా ఏడు నెలలు కోటి తీర్ధ జాలం నేల మట్టం వరకు వుండి, భక్తులకు దర్శనం ఇస్తూ, ఆనందం మాత్రమే కల్గించటం విశేషం.
                                   
కన్నీరు కార్చే గరుడుడు
నెల్లూరుజిల్లా సూళ్ళూరుపేటకు రెండు కిలోమీటర్ల దూరంలో మన్నారు పోలూరు గ్రామం పురాణ ప్రసిద్ధి చెందింది. ఇక్కడే జాంబవంతునికి, శ్రీ కృష్ణుడికి యుద్ధం జరిగిందని అంటారు. ఇక్కడున్న "అలఘు మల్లామ్క్రిష్ణ" దేవాలయం చాలా పురాతన మైనది. చాళుక్య రాజులు కట్టిన దివ్య దేవాలయం ఇది. ఇక్కడ సుగ్రీవ, జాతాయు, జాంబవంత, గరుత్మంతుల భారీ విగ్రహాలు అందర్ని ఆకర్షిస్తాయి. స్వామి భక్తులంతా కొలువుదీరినట్లు ఉంటుంది. దీన్ని మనికాంత క్షేత్రం అని కూడా పిలుస్తారు. స్వామి గర్భాలయానికి దక్షిణంగా "సౌందర్య వల్లి" అమ్మవారు ఉంటారు. స్వామికి ఎదురుగా తొమ్మిది అడుగుల ఎత్తున గరుత్మంతుని విగ్రహం సమ్మోహన పరుస్తుంది. గరుడుని కంటి నుంచి కన్నీరు ఒలుకుతున్నట్లు శిల్పి విగ్రహాన్ని మహాద్భుతంగా మలిచాడు. శమంతక మణిని శ్రీ కృష్ణుడు ఇక్కడే జాంబవంతుని దగ్గర నుండి పొందాడని ఐతిహ్యం. సత్య, జాంబవతీ సమేత శ్రీ కృష్ణ స్వామి దర్శనం సర్వ శుభ ప్రదం. ఇక్కడే సత్యభామకు గర్వభంగం అయిందట. ఈ ప్రదేశంలోనే ఆంజనేయుని చేత గర్వభంగం అయిందిని తనకు జరిగిన అవమానాన్ని దుఃఖిస్తూ, తన స్వామికి మొర పెట్టు కొనే సన్నివేష రూప కల్పనే గరుడుని కన్నీరు గాధ. ఇప్పటికి ఆ కన్నీరు గాధను మనం చూడ వచ్చు. అద్భుత మైన వింత ఇది. ఇక్కడి శిల్ప సౌందర్యం చిత్రాతి చిత్రంగా ఉంది మనసులను ఆకర్షిస్తుంది.No comments:

Post a Comment