Tuesday, 15 September 2015

పిఠాపురం - శక్తిపీఠాల్లో సుప్రసిద్ధ (తూర్పు గోదావరి జిల్లా)


తూర్పుగోదావరి జిల్లాలోని పుణ్యక్షేత్రాల్లో పిఠాపురం పౌరాణికంగా, చారిత్రకంగా ప్రసిద్ధమైనది. దాక్షాయణీ దేవి తన తండ్రి దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక ఆత్మాహుతికి పాల్పడినప్పుడు ఆమె శరీరంలోని భాగాలు దేశంలోని పలు ప్రాంతాల్లో పడ్డాయనేది పౌరాణిక గాథ. దాక్షాయణీదేవి పీఠభాగం ఈ ప్రాంతంలో పడటం వల్ల ఈ పట్టణానికి పీఠికాపురంగా పేరొచ్చింది. దిన క్రమంగా పిఠాపురంగా మారింది. అష్టాదశ శక్తి పీఠాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి అమ్మవారి పేరు పురూహుతిక దేవి. పురూహుతికా దేవి ఆలయం ఎదురుగానే కుక్కుటేశ్వరస్వామి ఆలయం ఉంది. కుక్కుటేశ్వరస్వామి వారి ఆలయంలోని శివలింగం స్వయంభూ శివలింగం. దత్తాత్రేయుని ప్రథమ అవతారమైన శ్రీపాద వల్లభుడు జన్మించింది ఇక్కడేనన్నది పురాణ కథనం. పిఠాపురం దేశంలోని త్రిగయ క్షేత్రాల్లో ఒకటి. గయాసురుడనే రాక్షసుడు విష్ణువు కృప కోసం తపస్సు చేశాడు. తన దేహం పవిత్రమైనదిగా చేయాలని అతడు వరం కోరాడు. అతడి కోరిక ప్రకారం అతడి దేహంపై ఇక్కడ యజ్ఞాన్ని ఆరు రోజులు నిర్వహించారు. విష్ణువు వరం ప్రకారం అతడి పాదభాగం పిఠాపురంలో ఉండటం వల్ల ఈ క్షేత్రానికి పాదగయ అని పేరు వచ్చింది.

అలాగే, పిఠాపురం వైష్ణవ క్షేత్రం కూడా. ఇంద్రుడు వృత్తాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కోసం ఐదు ప్రాంతాల్లో విష్ణాలయాలను నిర్మించి ఆరాధించాడన్నది పురాణ కథనం.ఈ ఐదు క్షేత్రాల్లో మాధవ స్వామి ఆలయాలు వెలిశాయి. వారణాసిలో బిందు మాధవస్వామి ఆలయం,ప్రయాగలో వేణు మాధవస్వామి ఆలయం,పిఠాపురంలోని కుంతీ మాధవస్వామి ఆలయం, రామేశ్వరంలోని సేతుమాధవస్వామి ఆలయం, అనంతపద్మనాభంలోని సుందర మాధవస్వామి ఆలయం ప్రసిద్ధి చెందాయి. పిఠాపురం సంస్థానాధీశులు ఎంతో మంది కవులను ప్రోత్సహించారు. సాంఘిక సేవా కార్యక్రమాలకు చేయూతనిచ్చారు. పిఠాపురం రాజావారి పేరిట కాకినాడలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల చాలా కాలం క్రితమే నెలకొల్పారు. పిఠాపురంలో క్రైస్తవ మెడికల్‌ సెంటర్‌ ఏర్పాటును పిఠాపురం రాజా ప్రోత్సహించారు. అలాగే, పిఠాపురంలో సూర్యరాయ తెలుగు నిఘంటువు రూపకల్పనకు చేయూత నిచ్చారు. పిఠాపురంలో సూర్యా ఆయుర్వేద నిలయం దశాబ్దాలుగా వైద్య సేవలను అందిస్తోంది.ఈ సంస్థ శాఖలు ఆంధ్రప్రదేశ్‌ అంతటా ఉన్నాయి. స్వాతంత్య్రోద్యమంలో పిఠాపురానికి చెందిన ఎంతో మంది చురుకుగా పాల్గొని జైలుకి వెళ్ళారు.శ్రీవీర వెంకట సత్యనారాయణస్వామి వేంచేసి ఉన్న అన్నవరం క్షేత్రం ఇక్కడికి బాగా దగ్గరే. పిఠాపురం రాజమండ్రికి 62 కిలో మీటర్లు, సామర్లకోటకు 12 కిలో మీటర్ల దూరంలో ఉంది. ప్రధానమైన రైళ్ళు అన్నీ పిఠాపురంలో ఆగుతాయి. ఇవి కాక, జిల్లా కేంద్ర మైన కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి బస్సు సౌకర్యం ఉంది.శక్తిపీఠాల్లో ఒకటి అయిన పిఠాపురాన్ని సందర్శించడం వల్ల కుక్కుటేశ్వరస్వామి, కుంతీమాధవస్వామి ఆలయాలనే కాక, పాదగయను కూడా సందర్శించవచ్చు. పాత తరానికి చెందిన సినీ గేయరచయిత, సుప్రసిద్ధ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి పిఠాపురం సమీపంలోని చంద్రంపాలెంలో పుట్టి పిఠాపురంలో విద్యాభ్యాసం చేశారు. అలాగే, మరో సుప్రసిద్ధ కవి ఆవంత్స సోమసుందర్‌, పాత తరం ఐఎన్‌టియుసి నాయకుడు భావనాచారి, వెనుకటి తరానికి చెందిన సినీ నేపధ్య గాయకుడు పిఠాపురం నాగేశ్వరరావు వంటి ఎందరో ప్రముఖులు ఈ పట్టణానికి చెందినవారే.పిఠాపురం నాగేశ్వరరావు ఊరుపేరునే తన ఇంటిపేరుగా మార్చుకుని ప్రాచుర్యాన్ని పొందారు. సాహిత్య, సాంస్కృతిక,విద్యా, కళా రంగాల్లో పిఠాపురం స్వాతంత్య్రానికి పూర్వమే ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది.

No comments:

Post a Comment