Monday, 14 September 2015

మూకాంబికాదేవి దేవాలయం(కర్నాటకలోని ఉడిపిజిల్లా, కుందాపూర్ తాలూకా)
కామాసురుడు మృత్యుంజయుడుగా ఉండాలనుకుంటే స్త్రీ శక్తి ఊరుకుంటుందా? ఊరుకోదనడానికి ఉదాహరణే మూకాంబిక దేవత. ఈ దేవత, ఆమె క్షేత్ర మహిమ గురించి తెలుసుకోండి.

అత్యంత ప్రాచీన శక్తి క్షేత్రాలలో మూకాంబికాదేవి క్షేత్రం ఒకటి. ఇది కర్నాటకలోని ఉడిపిజిల్లా, కుందాపూర్ తాలూకాలో 17వ జాతీయ రహదారిని ఆనుకుని, పడమటి కనుమలలోని కొడచాద్రి పర్వతపాదాల చెంత ఉంది. ఈ క్షేత్రానికి ఉత్తరాన సౌపర్ణికా నది ఉంది. సుపర్ణ అనే పేరుగల గరుడపక్షి ఈ నది ఒడ్డున తపస్సు చేసి మోక్షాన్ని పొందినందున దీనికి సౌపర్ణికానది అనే పేరు వచ్చిందంటారు. ఈ తీర్థంలో ఎన్నో ఔషధాలున్నాయని, అందువల్ల ఇక్కడ స్నానం చేస్తే అనేక వ్యాధులు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ దేవి స్వయంభూలింగంగా వెలిసిందనీ, సాక్షాత్తు పరమశివుడు తన కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామికి ఈ క్షేత్ర మహిమ తెలియచేయగా ఆయన ఇక్కడ తపస్సు చేశాడని కథనం.

మూకాసురుని సంహారం
కృతయుగంలో ఈ పరిసరాల్లో కామాసురుడనే రాక్షసుడు దేవతలను, ఋషులను నానా హింసలు పెట్టేవాడట. వాడు తపస్సు చేసి, పరమేశ్వరుడి అనుగ్రహంతో మరణం లేకుండా చేసుకోవాలని సంకల్పించాడట. పరమేశ్వరుడు ప్రత్యక్షం కాగానే వరాన్ని కోరుకోవడానికి వీలులేకుండా దేవి కామాసురుడి నోరు పడిపోయేలా చేసిందట. అయినా కామాసురుడు దేవతలను, ఋషులను వేధిస్తుంటే జేష్ట శుక్ల అష్టమినాడు (ఈ క్షేత్రానికి 25 కి.మీ. దూరంలో ఉన్న మారణఘట్టం) కొడచాద్రి కొండమీద దేవి వీడిని వధించిందట. మూకాసురున్ని వధించింది కనుకనే దేవికి మూకాంబికాదేవి అని పేరు వచ్చిందని కథనం.

దేవికి M.G.R. కరవాలం కానుక
ఈ దేవాలయం కేరళ వాస్తు శైలిలో నిర్మించబడి ఉంటుంది. లోపలికి ప్రవేశించగానే 20 అడుగుల దీపస్తంభం వెలుగులు విరజిమ్ముతూ కన్పిస్తుంది. దానికంటె కొద్ది చిన్నగా ఉన్న గజస్తంభం బంగారుపూతతో మెరుస్తూ ఉంటుంది. ధ్వజస్తంభాన్ని దర్శించిన తర్వాత భక్తులు గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. గర్భగుడిలోకి పురుషులు చొక్కా, బనియన్లతో వెళ్లకూడదు. మూకాంబికాదేవి భక్తులకు పద్మాసనంలో దర్శనమిస్తుంది. శాంత ప్రేమ స్వరూపిణిగా కన్పిస్తుంది. నాలుగు చేతుల దేవికి పై రెండు చేతుల్లో శంఖుచక్రాలుండగా, కింద చేతులు ఒకటి అభయముద్రలోనూ, మరొకటి వరదముద్రలోనూ ఉంటాయి. దేవిలో శౌర్యాన్ని చూపించే బంగారు కత్తిని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ M.G. రామచంద్రన్ బహూకరించారు. ఆయన దేవిని తరచూ దర్శించుకునేవారట.

ప్రస్తుతం ఉన్న దేవి పంచలోహ విగ్రహాన్ని శ్రీచక్రంతో పాటు తయారుచేయించి ప్రతిష్టించినవారు ఆదిశంకరాచార్యులవారట. దేవి గర్భగుడి వెనుక పశ్చిమ భాగంలో ఆదిశంకరాచార్యుల వారి పీఠం ఉంది. మొదట్లో దేవి ఉగ్రరూపంలో ఉండేదని, శంకరాచార్యులవారు బాల్యంలో కాలి నడకన ఈ ప్రాంతానికి వచ్చినపుడు ఆమె ఉగ్రరూపం చూసి భయపడి ప్రసన్నురాలిని చేసుకొని శాంతస్వరూపిణిగా మార్చారని కథనం. దేవి అనుగ్రహంతోనే ఆయన తపస్సు అనంతరం ఉత్తర ప్రాంతానికి తరలి వెళ్లారంటారు. తర్వాత కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులందరూ ఈ క్షేత్రాన్ని ఎంతోకొంత అభివృద్ధి చేస్తూ వచ్చారు.

వినాయకుడికి కుడివైపు తొండం
మూకాంబికాదేవి మూర్తికి ముందు ఆమె స్వయంభూ లింగం ఉంటుంది. ఈ లింగం ఒక గీతతో రెండు (సమానం కాని) భాగాలుగా విడదీయబడి ఉంటుంది. చిన్నభాగం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్థావరమని, పెద్ద భాగం సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళీల నెలవని - అక్కడే జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి ఉంటాయంటారు. అలంకరణలు, పూజలు మూకాంబికాదేవికి, అభిషేకాలు మాత్రం లింగానికి నిర్వహిస్తారు. ఉదయం 5 గంటలనుండి రాత్రి 8.30 వరకు తెరిచి ఉంచే ఈ దేవాలయ దక్షిణ భాగంలో పది చేతులున్న దశముఖ బాలమురారి గణపతి మందిరం ఉంది. ఈ గణపతికి తొండం కుడి వైపున ఉండటం విశేషం. దేవాలయ ప్రాంగణంలో సరస్వతీ మందిరం కూడా ఉంది. రాత్రి ఊరేగింపు తర్వాత మూకాంబికా ఉత్సవ విగ్రహాన్ని సరస్వతీ దేవి మంటపంలో ఉంచుతారు. ఇక్కడ చాలామంది తమ పిల్లల చేత అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు.

సెప్టెంబర్ - అక్టోబర్‌లలో సందడి
కొల్లూరు క్షేత్రానికి హనుమంతుడితో కూడా అనుబంధం ఉందట. ఆయన లంకనుండి హిమాలయాలకు వెళ్లేటప్పుడు, సంజీవని పర్వతంలోని కొంత భాగం విరిగి కొడచాద్రి పర్వత ప్రాంతంలో పడింది కాబట్టే ఈ ప్రాంతంలో అనేక ఔషధ మూలికలు దొరుకుతాయని కథనం. ఈ క్షేత్రం ప్రశాంతతకు, ప్రకృతి రమణీయతకు కూడా పేరొందింది. మూకాంబికా క్షేత్ర దర్శనం ఒక మరువరాని ఆధ్యాత్మిక అనుభూతి. కొల్లూరులో యాత్రికులు బస చేయడానికి ఆధునిక సౌకర్యాలతో దేవస్థానం వారి వసతి గృహాలు ఉన్నాయి. మార్చి - ఏప్రిల్ నెలల్లో జరిగే రథోత్సవానికి, సెప్టెంబర్ - అక్టోబర్‌లలో జరిగే దేవీ నవరాత్రి ఉత్సవాలకు యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో తప్పనిసరిగా చూడవలసిన పుణ్యక్షేత్రాలలో కొల్లూరు మూకాంబికాక్షేత్రం ఒకటి.

No comments:

Post a Comment