Monday, 14 September 2015

బృహదీశ్వరాలయం - తంజావూరు (తమిళనాడు) C

బృహదీశ్వరాలయం - తంజావూరు


ఆ ఆలయం పొడవు 793 అడుగులు, గోపురం ఎత్తు 216 అగుడులు. దీని నిర్మాణానికి ఇటుకలు, సున్నపురాయి, బంకమట్టి లాంటివేవీ ఉపయోగించలేదు. పునాదులు, గోపురం, శిఖరం... అన్నీ పూర్తిగా రాళ్లతో నిర్మించారు. గోపురం 13 అంతస్తులు. ఆ రాష్ట్రంలోనే అది పెద్ద ఆలయంగా పేరుగాంచింది. చోళులు, పాండ్యులు, నాయకులు... ఇలా రకరకాల పాలకుల ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. అదే తమిళనాడుకు చెందిన తంజావూరులోని వెయ్యేళ్లు పూర్తి చేసుకున్న బృహదీశ్వరాలయం.

క్రీ.శ.985 -1012 మధ్య కాలంలో తంజావూరును రాజధానిగా చేసుకుని రాజరాజ చోళుడు పాలించాడు. ఇతను శైవ భక్తుడు. కేరళ, మధురై మొదలుకుని శ్రీలంక వరకూ తన రాజ్యాన్ని విస్తరించాడు. రాజ్యంతో పాటూ ఆదాయమూ బాగా పెరిగింది. ఈ విజయానికి గుర్తుగా, దేశమంతటా తన కీర్తి ప్రతిష్టలు తెలియజేయడానికి పెద్ద ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు. అలా, రాజధాని తంజావూరులో బృహదీశ్వరాలయ నిర్మాణానికి పూనుకున్నాడు. రాజరాజ చోళుడు బృహదీశ్వరాలయ నిర్వహణకు ప్రత్యేకంగా భూములు కేటాయించాడు. దేవాలయ నిధిని ఏర్పాటు చేశాడు. దేవాలయాలు సాంస్కృతిక కేంద్రాలుగా మారింది ఇక్కడనుంచేనని చెబుతారు చరిత్రకారులు. ఆలయ నిర్మాణం క్రీ.శ. 1004లో మొదలై 1010 లో పూర్తయింది. ఇప్పటికీ దేశంలో అతి పెద్ద ఆలయంగా దీన్నే చెబుతారు. బృహదీశ్వరాలయ ప్రాగణం పొడవు 793 అడుగులు, వెడల్పు 393 అడుగులు, గోపురం ఎత్తు 216 అడుగులు. ఈ ఆలయ నిర్మాణానికి ఇటుకలు, సున్నపురాయి, బంకమట్టి... ఇవేవీ ఉపయోగించలేదు.

నిర్మాణంపై ఎలాంటి పూతా పూయలేదు. పునాదుల దగ్గర నుండి పీఠాలు, గోపురం, శిఖరం... ఇలా అన్నీ రాళ్లతోనే తయారయ్యాయి. వాటి బరువుని బట్టి ఒక రాయి మీద మరో రాయిని పేర్చి నిర్మించారు. ఈ ఆలయ గోపురం 13 అంతస్తులు వుంది. గోపురం పై కప్పు నిర్మాణానికి 80 టన్నుల బరువుండే ఏక శిలను ఉపయోగించారట. దీని విస్తీర్ణం 25.5 చదరపు అడుగులు. ఈ రాయిని గోపురంపైకి తీసుకెళ్లడానికి చాలా ఇబ్బంది పడ్డారు. గోపురం నుండి ఏడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఓ గ్రామం దగ్గర్నుండి ఏటవాలుగా ఉండే ప్రత్యేక వంతెనను నిర్మించారు. శిఖరం రెండు తలాలుగా ఉంటుంది. తంజావూరు చుట్టుపక్కల ఎక్కడా కొండలు, గుట్టలు కనిపించవు. ఈరాళ్లను దాదాపు 150 కిలోమీటర్లు దూరంలో ఉన్న పుదుకొవై ప్రాంతంలోని రెండు కొండల్ని పూర్తిగా తొలిచి తీసుకొచ్చి ఆలయం నిర్మించి ఉంటారని ఒక అంచనా.

బృహదీశ్వరాలయ గోపురం మొత్తం ఎక్కడా కొంచెం కూడా ఖాళీ లేకుండా శిల్పాలతో తీర్చి దిద్దారు. ఆలయం నిర్మాణ గొప్పదనం బయట గోడలపైనే కాదు లోపల కూడా కనిపిస్తుంది.

గర్భగుడిలోని శివలింగాన్ని 13 అడుగుల ఎత్తున్న ఏకశిలతో మలిచారు. ఈ శివలింగాన్ని ఉత్తర భారతదేశంలోని నర్మదా తీరం నుండి తీసుకొచ్చారని చెబుతారు. ఎత్తైన ఈ లింగాన్ని పూజించడానికి రెండు వైపులా మెట్లు ఉంటాయి. ఈ లింగానికి గోముఖ పానవట్టం కూడా సుమారు 500 టన్నుల బరువున్న కొండరాయితో నిర్మించారు. గుడి లోపల భాగం రెండు అంతస్తులుగా ఉంటుంది. ఎక్కడా తలుపులు ఉండవు. రాతి ద్వారాలు ఉంటాయి. లోపలి గోడలపై రాజుల కాలంలో వేసిన కుడ్యచిత్రాలు కన్పిస్తాయి. ఇవి అక్కడక్కడా చోళుల కాలంనాటి చిత్రాలపైన వేసి ఉన్నాయి. రాజరాజ చోళుడు తన ముగ్గురు రాణులతో కలిసి దక్షిణామూర్తి రూపంలో నటరాజుకు పూజలు చేస్తున్న కుడ్యచిత్రాలు దర్శనమిస్తాయి. ఈ చిత్రాలు ఇప్పుడు అస్పష్టంగా కన్పిస్తున్నాయి.

సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకోసం ఈ ఆలయానికి రాజ్యం నలుమూలల నుండి 91 దేవాలయాల నుండి 400 మంది దేవదాసీల్ని రప్పించారు. తర్వాత కాలంలో బృహదీశ్వరాలయం... దేవాలయాలూ, దేవాలయ నగరాల నిర్వహణకు ఒక నమూనాగా నిలిచింది.

పాలనా నమూనా
1279లో తంజావూరు చోళుల ఆధిపత్యం నుండి మధురై పాలకులైన పాండ్యుల చేతుల్లోకి వెళ్లింది. పాండ్యుల తర్వాత తంజావూరు విజయనగర రాజుల పాలనలోకి వచ్చింది. ఈ కాలంలో బృహదీశ్వరాలయం ప్రజల సమావేశ మందిరంగా, విద్యా సాంస్కృతిక శిక్షణా కేంద్రంగా ఉండేది. ఆ తర్వాత తెలుగు పాలకులైన నాయకుల ఆధీనంలోకి వచ్చింది. చోళుల కాలం నాటి నందికి వీరు రక్షణగా మండపాన్ని నిర్మించారు. పంతొమ్మిది అడుగుల పొడవూ, ఎనిమిది అడుగుల వెడల్పూ, పన్నెండు అడుగుల ఎత్తూ ఉన్న ఈ నందిని ఏకశిలతో మలిచారు. ఇది దేశంలోనే రెండో అది పెద్ద ఏకశిల నంది (మొదటిది లేపాక్షి నంది). నాయకుల తర్వాత తంజావూరు మరాఠా పాలకుల చేతిలోకి వెళ్లింది. వీరు ఆలయ శిఖరానికి కొన్ని మార్పులు చేయించారు. ఒకే ఆలయంలో భిన్న రకాల పాలకుల గుర్తులు కనిపించడమనేది భారతదేశంలో మరే చోటా ఉండదు.

ఇదీ బృహదీశ్వరాలయమే
ఉత్తరాదికి రాజ్యాన్ని విస్తరించిన మొట్టమొదటి దక్షిణాది రాజు మొదటి రాజేంద్ర చోళుడు. ఇతడు రాజరాజ చోళుడి తనయుడు. గంగానది తీరం వరకు తన రాజ్య విస్తరణకు గుర్తుగా రాజధాని నగరాన్ని (గంగై కొండ చోళపురం) నిర్మించాడు. మొదటి రాజేంద్రుడు తంజావూరులో నిర్మించిన బృహదీశ్వరాలయాన్ని పోలిన మరో బృహదీశ్వర ఆలయాన్ని గంగై కొండచోళపురంలో నిర్మించాడు. ఈ రెండు దేవాలయాలూ దాదాపు ఒకేలా ఉంటాయి. ఎత్తైన రాజ గోపురాలూ ప్రహరీలూ అపురూప శిల్ప సంపద... ఇవన్నీ ఈ రెండు ఆలయాలకే సొంతం. తండ్రిపై విధేయతను చూపుతూ శిఖరం ఎత్తును మాత్రం తగ్గించాడు రాజేంద్రుడు. విస్తీర్ణంలో మాత్రం ఇదే పెద్దది. ఈ ఆలయ ప్రాంగణంలో శివుడితో పాటు ఇతర దేవుళ్ల ఆలయాలూ ఉన్నాయి.

బృహదీశ్వరాలయం నిర్మాణాన్ని అప్పటి రాజులు తమ దైవభక్తితో పాటు ఆర్థిక, సైనిక సామర్థ్యాన్ని చాటి చెప్పుకోడానికి చేసిన ప్రయత్నంగా చరిత్రకారులు చెబుతారు. ఏదేమైనా చోళుల కాలంనాటి సంస్కృతీ, సంప్రదాయాలు తెలుసుకోడానికి ఈ ఆలయాల్లోని చిత్రాలు ఉపయోగపడతాయి.

బృహదీశ్వరాలయ నిర్మాణంలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది భక్తులే. ఆలయాన్ని నిర్మించిన రాజరాజ చోళుడు 'ఈ ఆలయ నిర్మాణంలో భాగమైన అందరి పేర్లూ ఇక్కడ చెక్కించాలి' అని ఆదేశించాడట. ఆయన చెప్పినట్లే వాళ్లందరి పేర్లన్నీ శాసనాల్లో కనిపిస్తాయి. వందేళ్ల క్రితం వరకూ ఈ ఆలయాన్ని కరికాళ చోళుడి కాలంలో నిర్మితమైందని భావించేవారు. జర్మనీకి చెందిన ఓ పరిశోధకుడు మాత్రం రాజరాజ చోళుడు నిర్మించాడని నిర్ధారించాడు.

దర్శనీయ ప్రాంతాలు
తంజావూరు చెన్నైకి దక్షిణంగా 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. బృహదీశ్వరాలయం తంజావూరు పట్టణంలో మధ్యలో ఉంది. బృహదీశ్వరాలయంతో పాటు అక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా వున్నాయి. ఇక్కడున్న ప్రసిద్ధ సరస్వతి మహల్‌ లైబ్రరీ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఆలయానికి సమీపంలో పురావస్తుశాఖ మ్యూజియం ఉంది. రాజభవనాన్నే మ్యూజియంగా మార్చారు. తంజావూరు పరిసరాల్లో లభించిన వివిధ రాజుల కాలం నాటి ఆయుధాలు, నాణేలు... అన్నీ అక్కడ చూడొచ్చు. గంగై కొండచోళపురం ఇక్కడి నుండి 61కిలోమీటర్ల దూరంలో ఉంది.No comments:

Post a Comment