Sunday, 27 September 2015

ఛాయా సోమేశ్వర ఆలయం - అద్భుత శిల్పవాస్తు రహస్యం

మన దేశంలో ఎన్నో చారిత్రక విశిష్టత కలిగిన ఆలయాలున్నాయి. శతాబ్దాల క్రితమే అనేక దేవాలయాలు భారతావనిలో అనేకం నిర్మింపబడినాయి. అలాంటి వాటిల్లో ప్రతి ఆలయానికీ ఓ ప్రత్యేక ఉంది. పవిత్ర కృష్ణానదీ తీరంలో విస్తరించిన నల్లగొండ జిల్లాలో అనేక ప్రాంతాలలో ఆ విశిష్ట ఆలయాల ఛాయలు కనిపిస్తాయి. ఇక్కడ హిందూ, బౌద్ధ, జైన మతాలు వివిధ కాలాలలో వెల్లివిరిసాయని ఇక్కడ దొరికిన ఆధారాలు తెలుపుతున్నాయి. ఎన్నో స్థూపాలు, శిల్పాలు వెలుగు చూశాయి. హిందూ ఆలయాలలో మేళ్ళ చెఱువు, మెట్టపల్లి, వాడపల్లి, యాదగిరి గుట్ట ప్రాశస్త్యం చాలా మందికి తెలిసిందే. కానీ ఎంతో చారిత్రిక నేపథ్యం, నిర్మాణ విలువలు ఉన్నా అంతగా ప్రాచుర్యంలోకి రాని ఒక విశేష ఆలయం ఈ జిల్లాలో ఉంది. అదే శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం.

జిల్లా కేంద్రమైన నల్లగొండ పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పానగల్లు గ్రామంలోని ఈ ఆలయంలో మరెక్కడా కనుపించని విశేషం ఉన్నది. అక్కడ గర్భాలయంలోని శివలింగాన్ని నిరంతరం నిలువెత్తు ఛాయ కప్పి ఉండటం. సుమారు పదో శతాబ్దంలో పానగల్లుని రాజధానిగా చేసుకొని ప్రస్తుత నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాలను పాలించిన కందూరు చోడులు తమ ఆరాధ్య దైవమైన పరమేశ్వరునికి నిర్మించిన ఆలయాలలో ఇది ఒకటి. సమీపంలో వీరి కోట తాలూకు శిథిలాలున్నాయి. వీరి తర్వాత ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న కాకతీయ ప్రభువులు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేసారనడానికి నిదర్శనం ఇక్కడ లభించిన ప్రతాపరుద్రుని శాసనం. తదనంతర రాజవంశాలు కూడా తమ వంతు సేవలు, కైంకర్యాలు సమర్పించుకున్నారని తెలుస్తోంది.

ఛాయ రహస్యమేమింటే..!
ఛాయా ఛాయా సోమేశ్వరాలయం 800 సంవత్సరాల క్రితం కుందూరు చోడులు (నల్లగొండ / నీలగిరి చోడులు) పరిపాలించిన ప్రాంతంలో ఒక వాస్తు శాస్త్ర అద్భుతం. ఈ దేవాలయానికి రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యమైంది ఈ దేవాలయం గర్బగుడిలో గోడపై ఎప్పటికీ కదలకుండా ఒకే స్థానంలో ఉన్నట్లుగా కనపడే నీడ. రెండోది అక్కడికి దగ్గరలోని చెరువులో నీరుంటే గర్భగుడిలో కూడా నీరు ఉబికి రావడం. ఇక ముఖ్యమైన విషయానికి వస్తే దేవాలయం గర్భగుడి గోడపై నిరంతరం పడే నీడ. గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్నా అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. అది వెలుతురు ఉన్నంత సేపు కదలకుండా ఒకే స్థానంలో ఉంటుంది. సూర్యుని గమనంలో మార్పు ఆ నీడను మార్చదు. ఆ నీడ ఎలా పడుతుంది, ఎందుకు అది వెలుతురులో ఉన్నంత వరకూ తన స్థానాన్ని మార్చుకోదు అనేది ఇప్పటి వరకూ ఎవరికీ అంతుచిక్కని విషయం. అ శాస్త్ర రహస్యాన్ని సూర్యపేటకు చెందిన శ్రీ శేషగాని మహేశ్వర్‌ గారు చేదించారు. భౌతిక శాస్త్రం, గణిత శాస్త్ర సూత్రాల ఆధారంగా నిర్మించిన వాస్తుశాస్త్ర అద్బుతం శ్రీ ఛాయా సోమేశ్వర ఆలయం లోని ఛాయ రహస్యాన్ని ఆయన ప్రపంచానికి వివరించారు.

వెలుగు పడినప్పుడు ఏర్పడే స్తంబాల నీడ ఒకదాని మీద మరొకటి పడి చివరకు ఒకటిగా మారి లింగం మీద పడుతున్నాయని, అలా పడటానికి కారణమైన సూర్యకాంతి ధారాళంగా ఆలయంలోకి ప్రవేశించడానికి అనువుగా ప్రహరీగోడ నిర్మించలేదని తేల్చారు. అన్ని ఆలయాలలో కనిపించే ధ్వజస్తంభం కూడా ఇక్కడ ఉండదు. నాడు పరిమితంగా ఉన్న పరికరాలు, సదుపాయాలు సహాయంతో ఎంతో కాలం సూర్యగమనాన్ని, కాంతి మార్గాన్ని గమనించి, లెక్క కట్టి దానికి అనుగుణంగా స్తంభాలను అమర్చి ఒక అద్భుతాన్ని మన ముందు ఆవిష్కరించిన శిల్పుల గొప్పదనం ఎంతైనా శ్లాఘనీయం. ఇక్కడ మరో చిత్రమేమిటంటే ఛాయపడే మార్గంలో ఏదైనా వస్తువును ఉంచితే దాని నీడ కూడా పడుతుంది. అదే కొద్దిగా ప్రక్కన ఉంచితే ఆ వస్తువు నీడ పడదు.

ఆలయ విశేషాలు...
ఊరికి దూరంగా ఒంటరిగా పొలాల మధ్య ఎలాంటి రాజగోపురం లేకుండా చతురస్రాకారంలో ఉండే మూడు గర్భాలయాలు గల ఈ త్రికూటాలయంలోని ఒక దాంట్లో శ్రీదత్తాత్రేయుడు కొలువై ఉండగా మరొకటి ఖాళీగా ఉంటుంది. తూర్పు ముఖంగా లోతుగా ఉన్న మూడో గర్భాలయంలో మూలవిరాట్టు శ్రీసోమేశ్వర స్వామి దర్శనమిస్తారు. నిరంతరం నీడతో కప్పబడి ఉన్నందున స్వామిని ఛాయా సోమేశ్వరుడు అంటారు. పూర్తిగా రాతి నిర్మాణం అయిన ఆలయంలో చాళుక్యుల శైలి కొంత కనపడుతుంది. మండప స్థంభాలకు రామాయణ, భారత, శివలీలా ఘట్టాలు చెక్కారు. ద్వారపాలక విగ్రహాలు, గర్భాలయ ద్వారం పైనున్న తోరణానికి చెక్కిన సూక్ష్మరూప లతలు, పూలు ఆలయ బయటి గోడలపై ఉన్న శిల్పాలు మనోహరంగా ఉంటాయి. లింగానికి ఎదురుగా నందీశ్వరుడు లేకున్నా, ద్వారానికిరుపక్కలా విఘ్నరాజు వినాయకుడు, నాగరాజు దర్శనమిస్తారు. ఆలయం ప్రాంగణంలో దాడులలో ధ్వంసం చేయబడిన నందులు, ఇతర శిల్పాలు కనుపించి హృదయాన్ని కలవర పరుస్తాయి. చుట్టూ ఉన్న ఉప ఆలయాలు చాలా వరకు ఖాళీగా ఉండగా, ఒక దాంట్లో మాత్రం ఆత్మలింగ రూపంలో లింగరాజు కొలువై ఉంటాడు.

ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఆలయంలో వారి బోర్డు తప్ప మరే రకమైన నిర్వహణ, అభివృద్ధి, సంరక్షణ, రక్షణలకు సంబంధించిన దాఖలాలు కనిపించకపోవడం, కనీసం దీపం వెలిగించే పూజారి కూడా లేకపోవడం శోచనీయం. తమ ఇష్టదైవ ఆలయం ఒక విశిష్ట నిర్మాణంగా ఉండాలన్న రాజుల ఆకాంక్షను తమ ప్రజ్ఞాపాటవాలతో ఒక రూపాన్ని కల్పించిన శిల్పుల మేధస్సును గుర్తించి, దానిని కాపాడి నేర్చుకోవాలి. మన నిర్మాణాల గొప్పదనాన్ని తెలిపే వారసత్వ కట్టడానికి తగిన రక్షణ, గౌరవం, ఆదరంతో కూడిన పోషణ, ప్రచారం కల్పించకపోవడం విచారకరం. భావి తరాలకు ఈ అద్భుత నిర్మాణాన్ని అందించాల్సిన బాధ్యత ఉన్నది.

No comments:

Post a Comment