Tuesday, 15 September 2015

సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం

శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కొలువై వున్న ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం సింహాచలం. విశాఖపట్నానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో, సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున వున్న ‘సింహగిరి’ అనే పర్వతం మీద కొలువై వున్న సింహాచలం తెలుగు రాష్ట్రాల్లోనే సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం. ఈ క్షేత్రంలో భక్తులందరూ ‘సింహాద్రి అప్పన్న’గా పిలుచుకునే వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కొలువై వున్నాడు. 
 
ఈ నెల 20 తెల్లవారుజాము నుంచి సింహాచలమున వెలసిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి నిజరూప దర్శనం లభిస్తుంది. దీనినే మనం అక్షయ తృతీయ(చందనయాత్ర) అంటాము. వైశాఖ బహుళ తదియ రోజున ఈ ఉత్సవం జరుగుతుంది.

సింహాచలంలో భగవానుడు మనకు సంవత్సరము అంతా గుమ్మడిపండు రూపంలో దర్సనమిస్తాడు. విదియనాటి రాత్రి స్వామికి అభిషేకాదులు చేసి అర్చకులు స్వామి మేను నుండి చందనము తొలగిస్తారు. తిరిగి తదియనాటి రాత్రి శ్రీవైష్ణవ స్వాములు గంగధార నుండి మట్టి కలశలతో నీరు తెచ్చి అప్పన్నకి సహస్ర కలశాభిషేకం చేస్తారు. సహస్ర కలశాభిషేకం జరుగుటకు మన పెద్దలు చెప్పిన కొన్ని విశేషాలు మనం చెప్పుకుందాము.

హిరాణ్యాక్షుని సంహరించిన పిదప, నరసింహస్వామి ప్రహ్లాదునుని, నీకేమివరము కావాలో కోరుకో అని అడుగగా..... అంతట ప్రహ్లాదుడు స్వామితో ఇట్లనెను "స్వామీ మా తండ్రి, పెడతండ్రులను సంహరించిన వాడివైనందున నీ రెండు అవతారాలను కలిపి ఒకే రూపంలో దర్శించే భాగ్యము నాకు కల్పించు తండ్రీ" అని అడగగా స్వామి అట్లే అనుగ్రహించి, ప్రహ్లాదుని కోరికని మన్నించెను. అందువలననే ఇచట వెలసిన స్వామిని "శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి" అని అంటారు. ఇక్కడ ఉన్నటువంటి స్వామి రూపం మనకు మరెక్కడా కనిపించదు.

ప్రహ్లాద వంశీయుడైన పురూరవ చక్రవర్తి, ఊర్వశితో గగనమార్గాన విహరిస్తున్న సమయంలో సింహగిరి సమీపమునకు రాగానే వారి పుష్పకవిమానము ముందుకు కదలక అచ్చటే నిలిచిపోయేనట. ఆ చక్రవర్తి భగవదాజ్ఞగా భావించి, కొంత సమయము విశ్రాంతి తీసుకోదలచి వాహనమును సింహగిరి పైకి దించి, ఒక చెట్టు క్రింద విస్రమించెను. అంతట అతనికి స్వప్నమందు అప్పన్న సాక్షాత్కరించి, "నేను ఇచటనే వెలసియున్నను, నాకు ఆరాధన చేయు" అని పలికెను. వెంటనే పురూరవుడు.స్వామి చెప్పిన గురుతుల ప్రకారము, ఆ కొండ ప్రాంతమంతా భటులచే వెతికించి, ఒక చోట స్వామి ఉన్నట్లు తెలుసుకొని, స్వామి పై ఉన్న పుట్టమన్నుని తొలగించి దర్శించెనట. 

అంత స్వామి ఇంతకాలము తనపై ఉన్నమట్టివలన తాపములేదని, ఎంత మన్నుని తనపైనుండి తీసారో అంతే పరిమాణంలో తనపై శ్రీ చందనం పూతగా వేయవలెనని చెప్పెనట, సంవత్సరములో ఈ ఒక్కరోజునే స్వామి యొక్క నిజరూప దర్శనభాగ్యం మనకు లభిస్తోంది. పుట్టను తవ్వి తీసిన మట్టి 12 మణుగులు ఉన్న కారణంగా, ఇప్పుడు అంతే పరిమాణంగల చందనమును 4 విడతలుగా వేస్తున్నారు. ఆ నాలుగు విడతలు.

1)అక్షయ తృతీయ
2) వైశాఖ పూర్ణమి
3) జ్యేష్ట పూర్ణిమ
4) ఆషాడపూర్ణిమ. 

ప్రతీ విడతకు 3 మణుగుల చొప్పున చందనమును స్వామిపై వేస్తారు. అందుకే ఈ స్వామిని చందన స్వామి అనికూడా అంటారు.

ఏడాదిలో వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే చందనాన్ని పూర్తిగా తొలగించి, కేవలం 12 గంటల సమయం మాత్రమే స్వామివారి నిజస్వరూపాన్ని చూసే అవకాశాన్ని భక్తులకు కలిగిస్తారు. దీనిని చందనోత్సవం లేదా చందనయాత్ర అని పిలుస్తారు. సింహాచల క్షేత్రానికి సంబంధించి ఇది చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక ఉత్సవం. 

ముందుగా నిజరూప దర్శనాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి ఆనంద గజపతి రాజు దంపతులు కుటుంబసమేతంగా దర్సనం చేసుకోవడం ఆనవాయితీ.

చందనయాత్ర రోజున నాటి రాత్రి శ్రీవైష్ణవ స్వాములు గంగధారవద్ద స్నానమాచరించి1008 మట్టికలశలతో గంగధార నీటిని తీసుకొని వచ్చి స్వామికి అభిషేకిస్తారు.

దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వచ్చి చందన స్వామి ని దర్సనం చేసుకుంటారు దీని కోసం సింహాచలం ని అందంగా తీర్చిదిద్దుతున్నారు.

No comments:

Post a Comment