Thursday, 3 September 2015

ధర్మ స్థల


 శైవ జైన వైష్ణవ సామ రాస్యానికి ప్రతీక ధర్మ స్థల


కర్ణాటకలో మంగుళూరు నుంచి ౪౦ కి.మీ.దూరంలో ఉన్న చిన్న గ్రామమే ధర్మ స్థలి. ఇక్కడి శివుడు మంజునాధుడు. పూజారులు రాజా కుటుంబాలకు చెందిన వైష్ణవులు. ఆలయ నిర్వాహకులు జైనులు. ఇదీ ఇక్కడి విశేషం. మత సామరస్యానికి ఒక గొప్ప ఉదాహరణ ధర్మ స్థలం. మంజు అంటే కన్నడంలో మంచు అని అర్ధం. శివుడు మంచు పర్వతమైన కైలాస గిరి పై ఉంటాడు కనుక ఆ పేరు. "వాడి రాజా తీర్ధులు" అనే వైష్ణవ స్వామి స్వయంగా ఇక్కడ లింగ ప్రతిష్ట చేశారు. దేవ రాజ హేగ్గడే అనే జైన మతస్తుడు మొదటగా విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు తెలుస్తోంది. "కుడుము" అనే పేరు ఉన్న ఈ గ్రామం క్రమంగా ధర్మస్థలి అనే పేరుగా మార్పు చెందింది. జైన దేవుని అతి పెద్ద విగ్రహం అత్యాకర్షణీయంగా ఇక్కడికి దగ్గరలో శ్రావణ బెల్గోలాలో ఉండటం మరో వింత. నిజాయితీకి మారు పేరు ధర్మ స్థలి. దొంగతనం అనేది ఉండదు. ఎక్కడ పడేసిన వస్తువులు అక్కడే ఎంత కాలమైనా ఉంటాయి. అందుకే ఆపేరు వచ్చింది.మంజునాథ దేవస్థానం ఉన్నట్టి ధర్మస్థలకు ఒకప్పటి పేరు ‘కురుమపురం’. అందుకే భక్తి గీతాల్లో మంజునాథుడిని ‘నమో మంజునాథా! కురుమపుర వాసా!’ అని కీర్తిస్తారు. కురుమపురమే నేడు కుడుమపురం అయింది. శ్రీ కృష్ణ దేవరాయల పూర్వులైన కురుమ కులస్థులైన జైనుల ప్రాబల్యం అక్కడ ఎక్కువ. అందుకే దాన్ని కురుమపురం అన్నారు. తుళునాడు లోని ధర్మస్థల, కార్కళ, ముడ బిదరి, గేరసోప్ప ప్రాంతాలన్నిటిలో జైనుల ప్రాబల్యం ఎక్కువ. భగవాన్ బాహుబలి అనే రెండవ జైన తీర్థంకరుడి పెద్ద రాతి విగ్రహాలు ఆ ప్రాంతం అంతటా చూడొచ్చు. మంజునాథ ఆలయ ధర్మకర్త వీరేంద్ర హెగ్గడవరు. తెలుగు నియోగులను "ప్రెగ్గడ వారు" లేక పెగ్గడ వారు అంటారు. కన్నడ భాషలో ‘పులి’శబ్దం ‘హులి’ గానూ, పల్లి శబ్దం ‘హళ్లి’ గానూ రూపాంతరం చెందినట్లే ‘ప్రెగ్గడ వారు’ అనే తెలుగుపదం కన్నడ భాషలో ‘హెగ్గడవరు’ అయింది. (మన ‘ప’ శబ్దాన్ని కన్నడిగులు ‘హ’గా పలుకుతారు). అక్కడి హెగ్గడవరులనే ‘హేగ్డేలు’ అనీ అంటారు. కర్నాటక మాజీ ముఖ్య మంత్రి రామ కృష్ణ హెగ్డే, సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తి కే.యస్. హెగ్డే వీరిలో ప్రముఖులు.

No comments:

Post a Comment