Wednesday, 9 September 2015

తంజావూర్ – శ్రీ బృహదీశ్వరాలయం D

తంజావూర్ – శ్రీ బృహదీశ్వరాలయం
తంజావూరు అంటే బృహదీశ్వరాలయం, సరస్వతి మహల్ అనే ప్రాచ్య లిఖిత భాండాగారం గుర్తుకు వస్తాయి. బృహదీశ్వరాలయానికే రాజరాజేశ్వరం అనే పేరుంది. రాజ రాజ చోళ చక్రవర్తి నిర్మించిన ఆలయం కనుక ఆ పేరొచ్చింది. తంజావూర్ అనే పేరు కూడా ఒక ఐతిహ్యం వల్ల వచ్చింది. తంజన్ అనే రాక్షసుడు చెలరేగుతుంటే విష్ణు అవతారమైన నీల మేఘ పెరుమాళ్, ఆయన భార్య ఆనంద వల్లీ అమ్మాళ్ లు సంహరించారు. తంజన్ కడసారి కోరికగా తన పేరు మీదుగా ఈ పట్టణం వర్ధిల్లాజేయమని కోరాడట. సరేనని ఆ రోజు నుంచి తంజావూర్ అనే పేరును స్తిరం చేశారట. తన్జం అంటే తమిళంలో శరణు అని అర్ధం. అందుకనే దీన్నిశరణార్ధుల నగరం అంటారని తంజాపురీ మహాత్మ్యంలో ఉందట. కులోత్తుంగ చోళ రాజు దీన్ని నిర్మించి తుంగపురం అని పేరు పెట్టాడని స్థల పురాణం చెబుతోంది. దీనికే అలగై అనే పేరూ ఉంది. కుబేరుడు ఇక్కడ ఉండి తపస్సు చేశాడట.

తంజావూర్ ముత్తయార్లు అనే రాజవంశం వారికి రాజధానిగా ఉండేది. తర్వాత చోళ రాజులకూ రాజదాని అయింది. విజయాల మహారాజు ముత్తురాయలను ఓడించి స్వాధీనం చేసుకొన్నాడు. గంగైకొండ చోళుడు రాజధానిని గంగైకొండ చోళపురానికి మార్చాడు. ఇక్కడ నుండే పాండ్య రాజులు, హోయసల రాజులు పాలించారు. చివరికి అల్లా ఉద్దీన్ ఖిల్జీ సేనాపతి మాలికాఫర్ విజయ నగరాన్ని స్వాధీనం చేసుకొన్న తర్వాత సేవ్వప్ప నాయకుడు స్వతంత్రాన్ని పొంది తంజావూర్ చేరి తంజావూర్ నాయక రాజ వంశాన్ని స్తాపించాడు. వీరిలో కడపటి రాజైన వీర రాఘవుడు మధుర రాజు చొక్కానాధుని చేతిలో ఓడిపోయాడు. తర్వాత పధ్నాలుగేళ్ళు అలగరి అనే సేనాపతి పాలించాడు. శివాజీ మహారాజ్ కు దాయాది తమ్ముడైన ఎకోజీ అలఘిరిని ఓడించి మహారాష్ట్రుల పాలనను ఇక్కడ ప్రారంభించాడు చేశాడు. ఆ వంశం కొంత కాలం పాలించిన తర్వాతా బ్రిటిష్ పాలనలోకి వెళ్ళింది.

శ్రీ బృహదీశ్వరాలయం
చోళ రాజులు పరిపాలనలో విశేషమైన వారసత్వాన్ని ఒదిలి పెట్టారు. వారి గొప్ప నిర్మాణమే బృహదీశ్వరాలయం. భారతదేశం లోనే ఉత్కృష్ట దేవాలయం అని పేరు పొందింది. ద్రావిడ శిల్ప కళ విజృంభించిన దేవాలయం. దీనిని లార్డ్ కర్జన్, గాంధీ వంటి ప్రముఖులు సందర్శించారు. ఆలయం చిన్న కోటలో అంటే శివ గంగ కోటలో ఉంది. ఈ కోట మొదటి రాజు సేల్వప్ప నాయకుని పేర ఉంది. చివరి వాడడైన విజయ రాఘవుడు ఈ నగరాన్ని, కోటను నిర్మించాడు. దీని నిర్మాణానికి చాలా నాణ్యమైన గ్రానైట్ ను ఉపాన లేక స్తూపి అనే సుదూర ప్రాంతం నుండి తెప్పించి వాడారట. ఇది రాజ రాజ చోళుని ఆలోచనా, అమలు పరచిన తీరు. 985 -1014లో పాలించిన రాజ రాజ చోళుడు పాలన కాలంలోనే దీని నిర్మాణం జరగటం విశేషం. ఆయన రాజ్యానికి వచ్చిన 19వ సంవత్సరంలో నిర్మాణాన్ని ప్రారంభించి ఆరు ఏళ్ళలో పూర్తీ చేశాడు. ఆయన పాలించిన ఇరవై అయిదవ ఏడాది 1009న 257వ రోజున రాగి కలశాలను విమానం మీద ఉంచి దిగ్విజయంగా పూర్తీ చేశాడు. దీని బరువు 235 పొండ్లు, 2926 ½ కలజుళ అంటే 35 పౌండ్ల బరువున్న బంగారం పూతతో ఉంది. నిర్మాణం జరిగిన ఆరేళ్ళ కాలంలో యుద్ధాలు లేక పోవటం శాంతి నెలకొని ఉండటం బాగా తోడ్పడింది. రాజు ఇంటి పేరు రాజ శేఖర వర్మన్. ఆయనకు రాజ రాజ అని, శివప్ప దేశికార అని బిరుదులున్నాయి. చిదంబర దేవాలయానికి చాలా ధనం దానముగా ఇచ్చాడు.

రాజేశ్వరం అని పిలువబడే ఈ బృహదీశ్వరాలయం కోటకు దక్షిణ భాగాన ఉంది. ముఖ ద్వారం తూర్పున ఉంది. రెండు వైపులా సుబ్రహ్మణ్య, గణపతి చిన్న దేవాలయాలున్నాయి. 90 అడుగుల గోపురం లోపలికి రమ్మని ఆహ్వానించినట్లుంది. ఆలయం లోపలి ప్రాంగణం 500 అడుగుల పొడవు , 250 అడుగుల వెడల్పు ఉంటుంది. రాయి, ఇటుకలతో భూమి పై నడవటానికి వీల్లుగా ఉంటుంది. దక్షిణాన యాగశాల ఉంది. పడమర, ఉత్త్తర భాగాలలో అనేక శివలింగాలున్నాయి. ఈ గది గోడలకు అద్భుతమైన వర్ణ చిత్రాలు చిత్రించి ఉన్నాయి. శివుని విన్యాసాలన్నీ చిత్రితాలై ఉన్నాయి. ఆలయం బయటి కొలతలు 793, 397 ప్డుగుల పొడవు వెడల్పు ఉన్నాయి.

బృహదీశ్వరలింగం
ప్రాంగణంలో పడమటి భాగాన బృహదీశ్వరాలయం ఉంటుంది. దానిలోపల అభాగాలున్నాయి. బృహదీశ్వరలింగం ఉన్నదాన్ని గర్భగృహం అని, తర్వాత దాన్ని అర్ధమండపం అని, మూడవ దాన్ని మహామండపం అని, నాల్గవ దాన్ని స్థాపన మండపం అనీ అంటారు. ఇక్కడ శ్రీ త్యాగరాజ స్వామి కొలువై ఉంటాడు. అయిదవ మండపం నర్తన మండపం, ఆరవది వాద్య మండపం. ఇక్కడే గాయకులూ సంగీత కచేరి చేస్తారు. ప్రతి చోట ద్వార పాలకులుంటారు. వాటి శిల్ప కళ అమోఘం. ఇందులో ఏడు విగ్రహాలు పద్దెనిమిది అడుగుల ఎత్తు, ఎనిమిది అడుగుల వెడల్పు ఉంటాయి. ఇవన్నీ ఏక శిలా నిర్మితాలే.

బృహదీశ్వరమహాలింగం నిజంగానే మహా పెద్ద లింగం. 8.7 మీటర్ల ఎత్తు, అయిదు మీటర్ల వెడల్పు ఉన్న పెద్ద లింగం. ఈ లింగానికి అసలు పేరు అద వల్లన్ అంటారట. దీని అర్ధం నాట్యం చేసేవాడు అని. రెండో పేరు దక్షిణ మేరు విటంకన్. ఈ రెండు పేర్లు తిరు విసాప్పైలో లభిస్తాయి. ఇవి చిదంబరేశ్వరుని పేర్లు కూడానట. శైవులకు చిదంబరం పెద్ద ఆధార భూమిట. రాజ రాజు ఈ లింగాన్ని రాజరాజేశ్వర ముదైయార్ అని ముద్దుగా పిలిచేవాడట. దీనికే రాజ రాజేశ్వర్ ప్రభువు అని పేరుంది. ఈ లింగాన్ని బృహదీశ్వరా లింగం అని, ఆలయాన్ని బృహదీశ్వరాలయం అనీ అంటారు. "గ్రేట్ టెంపుల్" అని కూడా పిలుస్తారు. శివలింగం ఉన్నదాని పై భాగాన్ని దక్షిణ మేరు అంటారు. కైలాసాన్ని ఉత్తర మేరు అంటారన్న మాట.

బృహదీశ్వరాలయ స్థపన మండపంలో శ్రీ త్యాగ రాజ శివుడుంటాడు. ఈయన్నే విదంకార్ అంటారు. ఈ శివుడు చోళులకు ఆరాధ్య దైవం. చోళ రాజు ముచుకున్దుడు అసుర సంహారంలో దేవేంద్రునికి సహాయ పడ్డాడని స్థలచరిత్ర. ఇంద్రుడు ప్రీతి చెంది ఇతనికి ఏడు త్యాగ రాజ శివ విగ్రహాలను ఇచ్చాడట. వాటిని తిరువారూర్, తిరునగైక్కోరణం, తిరుక్కరిఎల్, తిరుక్కోలిలి, తిరు మరైక్కాడు, తిరు నల్లారు, తిరువమూర్ లలో ప్రతిష్ట చేశాడట. వీటినే సప్త విటంక క్షేత్రాలు అంటారు. తిరువారూర్లో మహా పెద్ద త్యాగరాజ స్వామి దేవాలయాన్ని కట్టించాడు. దేశం లోనే పెద్ద రధం ఏర్పాటు చేశాడు బ్రహ్మాండమైన పుష్కరిణి నిర్మించాడు. ఈ త్యాగ రాజస్వామి అనుగ్రహం వల్లనే మన కాకర్ల త్యాగయ్య గారు జన్మించటం. ఆ దేవుని పేరు తండ్రి ఈయనకు పెట్టటం అమ్మవారి పేరు కమల అవటం త్యాగయ్య గారి భార్య పేరు కూడా కమల కావటం తమాషాగా ఉంటుంది.

బృహదీశ్వరాలయంలో అనేక చిన్న మండపాలు దేవుల్ల విగ్రహాలు ఉన్నాయి. దేవాలయ విమానం 216 అడుగుల ఎత్తుంటుంది. పద్నాలుగు అంతస్తులున్నాయి. గోడలలో ఉన్న స్తంభాలు గోడలలో గూడులు, అనేక దేవతాగణాలతో శిల్పరమణీయంగా కన్పిస్తుంది. శిఖరం అష్టభుజాకారంలో ఉంది. దాని పైన ఉన్న బంగారు కలశం పన్నెండున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఇరవై అడున్నర అడుగుల ఏకశిలా గ్రానైట్ రాయి పై గోపురం ఉంటుంది శిఖరం, స్తూపం నీడ భూమి మీద పడక పోవటం శిల్ప చాతుర్యం. అత్యాస్చర్య కరం. పైన రెండు నందులు ఆరున్నర అడుగుల పొడవు, అయిదున్నర అడుగుల వెడల్పుతో ఎనభై టన్నుల బరువుతో ఉన్నాయి. వీటిని విమాన శిఖరం పైకి చేర్చటానికి వాలు బల్ల (ఇంక్లైనేడ్ ప్లేన్) ఉపయోగించారని చెబుతారు.

ఉత్తరాన ఉన్న శ్రీ సుబ్రహ్మన్యేశ్వర స్వామి చిన్న దేవాలయం ఆగ్నేయ భాగంలో బృహన్నాయకి అమ్మవారి దేవాలయం ఉన్నాయి. ప్రక్కనే చండీశ్వరాలయం ఉంది. సుబ్రహ్మన్యదేవాలయ శిఖరం 55 అడుగుల ఎత్తు ఉంది 45 అడుగుల బేస్ మీద ఉంటుంది. బృహన్నాయకి అమ్మవారి ఆలయం తర్వాత కాలంలో కట్టిందే. పద మూడవ శతాబ్దంలో పాండ్య రాజు కోనేరి మని కంతన్ రాజు నిర్మించాడు. బృహదీశ్వరాలయం ముందు పెద్ద ధ్వజ స్థంభం ఉంది. చండీశ్వరాలయం రాజ రాజ నిర్మితమే.

బృహన్నంది
శివాలయ ముఖ ద్వారానికి ఎదురుగా ఎత్తైన ప్లాట్ ఫారం మీద అద్భుత ఏక శిలా నిర్మిత మైన నందీశ్వరుడు మన చూపులను లాగేసి అక్కడే నిలిచి చూసేట్లు న్తాడు. పన్నెండు అడుగుల ఎత్తు, పందోమ్మిదిన్నర అడుగుల పొడవు, ఎనిమిదిన్నర అడుగుల వెడల్పు ఉన్న బృహత్ నంది విగ్రహం ఇది. దేశంలో పెద్ద నందులలో రెండవది మొదటి నంది లేపాక్షిలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ బృహన్నంది ఇరవై అయిదు టన్నుల బరువున్న విగ్రహం. లేపాక్షి నందిలా శిల్ప కళ కన్పించదు. తిరుచి నాపల్లి దగ్గరున్న పెరంబదూర్ సమీపంలోని పచ్చ చేమలై అనే చోటు నుండి ఈ నందీశ్వర విగ్రహానికి ఏక శిలను తెచ్చారు. ఈ నందీశ్వరుడు క్రమం గా పెరుగు తుంటే కాలికి మేకు దిగ కొట్టారని చెప్పుకొంటారు. ఇంకో కధనం ప్రకారం ఈ నంది ఇంతగా పెరగటానికి దాని కడుపులో ఒక బావురు కప్పు ఉన్నదని అందుకే పెరిగి పోయిందని అంటారు. దాన్ని కనీ పెట్టి బయటికి తీసేసి ఆ రంధ్రాన్ని పూడ్చారని చెబుతారు. ఈ కప్పను సభా పతి మండపం లోని నూతిలో వదిలేశారని అంటారు.

ఆలయ గోపురం మీద వైష్ణవ, శైవ కధలు శిల్పీకరించారు. గౌతమ బుద్ధుని జ్ఞానోదయ చిత్రం కూడా ఉండటం ఆశ్చర్యం. ముఖ్య విమానానికి ఉత్తర భాగాన నాలుగు మానవ ముఖాలున్న శిల్పాలున్నాయి. వీటి కన్నా కింద ఉన్నది పెద్దది క్రమం గా సైజ్ తగ్గి మిగిలినవి ఉంటాయి. కన్జీవారానికి చెందిన సోమ వర్మ అనే శిల్పి చోళ, నాయక, మహారాష్ట్ర ఆంగ్ల పాలకుల ను చిత్రించాడు అంటే వరుసగా వీరి చోళ దేశ పాలనకు ఇవి ప్రతి బింబాలు. ఇందులో యూరోపియన్ ముఖం ఉన్న వాడు వెనిస్ సముద్ర యాత్రికుడైన మార్కో పోలో అని భావిస్తారు మార్కో పోలో కాంటన్ కు గవర్నర్ గా కొంత కాలం పని చేశాడట. అతను చైనాలో విస్తృతం గా పర్య టించాడు. అందుకే కాంటన్లో ఉన్న అయిదు వందల బుద్ధ విగ్ర్సహాలున్న దేవాలయం లో అతని విగ్రహమూ చేర్చి గౌరవిన్చారట.

అర్ధ మండపంలో చోళ సంస్కృతీ చిత్రాలున్నాయి దక్షిణ దేశ చిత్ర కళా రీతి గోచరిస్తుంది. భూమి నుండి సీలింగ్ వరకు రమణీయ మైన చిత్రకళా తో శోభిస్తుంది. పై భాగాన నాయక రాజుల కాలం,లో ఉన్న తెలుగు దేశపు మనుష్యుల చిత్రాలున్నాయి. వీరిలో సేవ్వప్ప నాయకుడు అచ్చ్యుతప్ప నాయకుడు ప్రసిద్ధం గా ఉన్నారు. చోళుల కాలంలో శైవం బాగా వ్యాప్తి చెందింది. వీరికాలంలో వెలసిన చిత్రాలలో కైలాశశివుడు పార్వతి, శివ గణాలు నందీశ్వరుడు అప్సర గణం ఉంటారు.

రెండవ రకంలో నాలుగు దంతాలున్న తెల్లని ఏనుగైన ఐరావతం, దాన్ని నడిపే యువ మావటి కనిపిస్తారు. ఏనుగు ముందు నడిచే తెల్ల గుర్రం ఉంటుంది. సుందర సెరిమన స్వామి ఉంటారు. మూడో రకంలో సుందర మహర్షి శివుడు కనీ పిస్తారు. భక్త గణం పెద్ద హాల్లో ఉంది వారిని చూస్తూ ఉంటారు. కింది చిత్రాలలో ఆడ వాళ్ళు వంటా వార్పూ చేస్తున్నట్లు చిత్రించారు. అయిదవ భాగంలో నటరాజ స్వామి, ఆయన భక్తులు కన్పిస్తారు. ఆ తర్వాతి దానిలో అందమైన మహిళా చిత్రాలు కనువిందు చేస్తాయి. ఉత్తరం వైపు గోడ మీద త్రిపురాసుర వధ ఘట్టం కనిపిస్తుంది. తర్వాతా దేవతా ముఖాలున్న నాలుగు పెద్ద సైజు తలకాయలు కనిపిస్తాయి.

బృహదీశ్వరునికి బృహత్ కానుకలు
రాజ రాజ చోళుడు తన పాలన ఇరవై తొమ్మిదవ ఏడాది నాడు, రాణీలతో ఆయన సోదరి కుందావై తో వచ్చి స్వామిని దర్శించి అపూర్వ మైన కానుకలు సమర్పించారు. నిత్య పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ భారీగా చేశాడు. సుమారు 489 పౌండ్ల బంగారు ఆభరణాలు స్వామికి సమర్పించాడు. ఆరువందల పౌండ్ల వెండి వస్తువులు అందజేశాడు. నైవేద్యాలకు ఉత్సవాలకుగాను అనేక ప్రదేశాలలో ఉన్న సేద్యపు భూములను బృహదీశ్వరునికి రాసిచ్చాడు. సిలోన్ దేశంలో ఉన్న భూములు కూదా స్వామికి సమర్పించి తన స్వామి భక్తిని ప్రకటించుకొన్నాడు. వీటి వల్ల ఏడాదికి ఒక లక్షా పదహారువేల కాలముల ధాన్యం వచ్చేది. దీని విలువ యాభై ఎనిమిది వేల కాసులు. ఇవి కాక పదకొండు వందల కాసుల ధనాన్ని స్వామికి సమర్పించాడు రాజ రాజు.

దేవాలయానికి ఉత్తర, దక్షిణ భాగాలలో విశాలమైన పెద్ద మహా వీధులను నిర్మించాడు. తూర్పు నుండి పడమర వరకు 400 మంది దేవ దాశీలకు నివాస గృహాలు ఏర్పరచాడు. ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు సంవత్సరానికి వంద కాలముల ధాన్యం వచ్చే భూమి ఇచ్చాడు. నృత్య దర్శకులకు సంగీత గాయకులకు వాద్యకారులకు, దుస్తులు కుట్టే వారికి మొత్తం 212 మంది పురుష సేవకులకు కూడా ఇదే ఏర్పాటు చేశాడు. ఇందులో సంస్కృత అరియం అంటే ద్రావిడ వేదంను పఠించేవారు. వేదాలను అధ్యయన అధ్యాపనం చేసే వారు ఉన్నారు. తనజావూర్ జిల్లాను దక్షిణ దేశ ధాన్య గారం (రైస్ బౌల్) అంటారని చిన్నప్పుడెప్పుడో సోషల్లో చదువుకొన్నాం ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాం.No comments:

Post a Comment