Tuesday, 8 September 2015

శైవులకీ వైష్ణవులకీ పవిత్రమైన పుణ్యక్షేత్రం పుష్పగిరి

కడప పట్టణానికి 16 కిలో మీటర్ల దూరంలో పెన్నానదీ తీరాన ఉన్నది పుష్పగిరి, అతి పురాతనమైన ఈ క్షేత్రం శైవులకీ వైష్ణవులకీ సమానంగా ఆరాధ్యనీయమైన పుణ్యక్షేత్రం. శైవులు దీనిని మధ్య కైలాసం అని, వైష్ణవులు నధ్య అహోబిళం అని పిలుచుకొంటారు. ఇక్కడ ఉన్న శిల్ప సంపదని తెలియచేసే విధంగా రెండవ హంపి అని కూడా ఈ క్షేత్రాన్ని వ్యవహరిస్తారు. శంకరాచార్యుల గారిచే ఏర్పాటు చేయబడ్డ అద్వైత క్షేత్రాల్లో ఇది ఒకటి. మన రాష్ట్రంలోని ఏకైక శంకరాచార్య పీఠం ఇది.

శిధిలమైపోగా మిగిలి ఉన్న ఆలయాలలో చెన్నకేశవ స్వామి ఆలయం అతి పెద్దది. ఇందులో 13వ శతాబ్ధం నాటి శాసనాలు ఉన్నాయి. గుడి చుట్టూ, గుడి లోపలా అనేక అద్భుత శిల్ప సంపద ఉంది. రామాయణ, మహభారతాల లోంచి అనేక ఘట్టాలను ఇక్కడ శిల్పరూపంలో చూడవచ్చు.

స్థల పురాణం:
పూర్వం గరుత్మంతుడు తన తల్లి కోసం అమృతాన్ని తీసులెళ్తూండగా అందులోంచి ఒక చుక్క జారి ఇక్కడ ఉన్న కొలనులో పడిందట. ఒకరోజు ఒక వృద్ధ రైతు తన జీవితమ్మీద విసుగు చెంది ఆత్మహత్య చేసుకోవాలని ఈ కొలనులో దూకగా అతడు పరిపూర్ణ యవ్వనస్థుడై పోయాడు. ఆశ్చర్యపోయిన అతడు తన భార్యనూ, ఎద్దులనూ తీసుకొచ్చి అందులో ముంచి వాళ్ళనూ యవ్వనస్థులను చేశాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చుట్టుపక్కల ప్రజలందరూ ఇక్కడికి వచ్చి కోనేటిలో మునిగి నిత్య యవ్వనస్థులైపోయారు. కొన్నాళ్ళకి ఈ ప్రాంతం నుంచి చాలా కాలంగా ఎవరూ తన లోకానికి రాకపోవడం గమనించిన యముడు విషయం తెలుసుకొని బ్రహ్మతో మొరపెట్టుకోగా ఆయన హరి, హరులని ఆశ్రయించాడు. వారి ఆజ్నతో హనుమంతుడు ఒక పర్వతాన్ని తెచ్చి ఆ కొఅల్ను పైన వేశాడు. కానీ అది అందులో మునగక పుష్పంలాగా పైకి తేలింది. అలా పుష్పగిరి అన్న పేరు వచ్చింది. ఆ పర్వతాన్ని ముంచడానికి ఒక వైపి శివుడు, మరో వైపు విష్ణువు తమ పాదాలతో చెరో వైపు తొక్కి పట్టారు. శివుడి పాదముద్ర శివపాదం అని విష్ణు పాదముద్ర విష్ణుపాదం అనీ ఇక్కడ కనిపిస్తాయంటారు.ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలలో ఇక్కడ పది రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. కడప నుండి 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి ఆటోలు, బస్సులూ ఉన్నాయి. కారులో పోవడానికి మంచి రోడ్డుంది.

అయితే ఇక్కడి గుడి గోపురాలు వాటి పైన శిల్పాలు నల్లగా మకిలి పట్టి వాటి సౌందర్యాన్ని కప్పివేస్తూంది. దేవాదాయ, పురావస్తు శాఖలు కడప జిల్లాలోని మరొక దేవాలయం ఒంటిమిట్టలో చేసినట్టు కెమికల్ ట్రీట్ మెంటు చేసి ఈ శిల్ప సౌందర్యాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది.

No comments:

Post a Comment