Friday, 22 August 2014

అష్టాదశ శక్తిపీఠాలు 2అష్టాదశ శక్తిపీఠాలు
శ్రీ శాంకరీ దేవి
ఈ పీఠం శ్రీలంకలో ఉంది. ఇక్కడ అమ్మవారి కాలి గజ్జెలు పడ్డాయని పురాణాలు చెప్తున్నాయి. ఇది అష్టాదశ పీఠాల్లో ప్రథమ పీఠం. రావణుని స్తోత్రాలకు ప్రసన్నమైన పార్వతీదేవి లంకలో అవతరించింది.రావణుని సీతాపహరణ దోషం వల్ల ఆ తల్లి అంతర్ధాన మైందని తెలుస్తోంది. రావణ సంహారానంతరం తిరిగి లంకలో మహర్షుల చేత ప్రతిష్ఠించబడింది. ఇదీ ఈ శక్తి పీఠం యొక్క పురాణగాథ.

శ్రీ శృంఖలా దేవి
శృంఖలా దేవి శక్తిపీఠం పశ్చిమ బెంగాల్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి ఉదర భాగం పడిందని ప్రతీతి.త్రేతాయుగంలో ఋష్యశృంగమహర్షి దేవీ ఉపాసన చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు.ఆయన తపస్సు శృంగగిరిపై సాగింది. అక్కడ ప్రత్యక్షమైన శృంగదేవి శృంఖలా దేవిగా మారిందని ఒక గాథ.ఋష్యశృంగుని తపశ్శక్తితరంగాలను ఆది శంకరులు ఆవాహన చేసి శారదాపీఠాన్ని ఏర్పాటు చేశారు.

శ్రీ చాముండేశ్వరీ దేవి
ఈ శక్తి పీఠం కర్నాటకలోని మైసూర్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి శిరోజాలు పడ్డాయి. మహిషాసురుని సంహరించిన చాముండేశ్వరి సర్వదేవతల తేజస్సులతో ఆవిర్భవించిన శక్తి స్వరూపం. సముద్రమట్టానికి 3500 కి.మీ. ఎత్తున ఉన్న చాముండీ హిల్స్‌పై ఈ శక్తి పీఠం ఉంది.మైసూరులో ఉన్న ఈ శక్తిపీఠం వద్ద దసరా ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయ గోపురం ఏడు అంతస్తులు. ప్రతి గోపురంపై ఒక చాముండేశ్వరి శిల్పం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో ఒక పెద్ద రావిచెట్టు, ఆలయం చుట్టూ విశాలమైన ఖాళీ ప్రదేశం. ఈ దేవాలయానికి సమీపంలోనే నల్లరాతితో మలచిన 16 అడుగుల ఎత్తు, 25 అడుగుల వెడల్పు గల నంది విగ్రహం ఉంటుంది. ఈ శక్తిపీఠం సుమారు రెండువేల సంవత్సరాల నాటిదని చెబుతారు.
ఈ శక్తి పీఠంలో అమ్మవారు దుష్ట సంహారిణిగా, మంగళదాయినిగా, జగన్మాతగా, చాముండేశ్వరిగా కొలువైవుంది. మనదేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో నాలుగోదిగా ప్రసిద్ధికెక్కిన చాముండేశ్వరి ఆలయ ప్రాంగణంలోనే గణపతి, శివలింగం, ఆంజనేయస్వామి ఉపమందిరాలు భక్తులను ఆకట్టుకుంటాయి.దేవాలయ ప్రాంగణంలోని రావిచెట్టుకు భక్తులు కుంకుమ పూజలు చేస్తుంటారు. కాళిక, దుర్గ, చాముండీమాతల కలయికగా భక్తులకు దర్శనమిచ్చే చాముండేశ్వరి అనుకున్న కార్యాలను విజయవంతం చేస్తుందని భక్తుల విశ్వాసం. మైసూరు రాజుల ఇష్టదైవమైన ఈ ఆలయంలో దసరా ఉత్సవాలను వైభవంగా చేస్తుంటారు. ఈ ఉత్సవాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి యాత్రికులు వస్తుంటారు.
ఆలయ చరిత్ర:
ప్రాచీన కాలంలో ఈ ప్రాంతానికి క్రౌంచపట్టణమని పేరుండేది. అశోకుని కాలంలో ఈ ప్రాంతాన్ని మహిషాసుర మండలమని పిలిచేవారు. ఆధునిక కాలంలో మైసూర్‌ ప్రాంతాన్ని పరిపాలించిన వడయార్‌ (రాజవంశరాజు) ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. 1895-1940 కాలంలో ఈ దేవాలయం బాగా అభివృద్ధి చెందింది. ఆ కాలంలో చాముండేశ్వరి ఆలయం అత్యంత సుందరమైన ఆలయంగా రూపొందింది.
పురాణగాథ:
పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు కఠోర తపస్సుచే పురుషుల చేతుల్లో మరణించకూడదని పరమేశ్వరుని నుంచి వరాన్ని పొందుతాడు. ఆ వరం పొందిన గర్వంతో సకలలోకాలను పీడించాడు.ఇంద్రుని జయించి స్వర్గాన్ని కూడా ఆక్రమిస్తాడు. భయభ్రాంతులైన సకలలోకవాసులు త్రిమూర్తులను వేడుకోగా, మహిషాసురుని వధించుటకై ఒక స్ర్తీ శక్తిని సృష్టిస్తారు. ఆ శక్తి స్వరూపిణియే చాముండేశ్వరి. 18 చేతులతో ప్రతిచేతిలో ఒక ఆయుధంతో ఆ తల్లి దర్శనమిస్తుంది. ముందుగా చండ, ముండ అనే రాక్షసులను సంహరించిన తర్వాత మహిషాసురుని వధించి మహిషాసురమర్దినిగా సకలలోక వాసుల కీర్తనలను అందుకుంటుంది. చాముండేశ్వరి ఆలయానికి వెళ్ళే మార్గంలోనే మహిషాసురుని విగ్రహం ఉంది. ఒక చేతిలో కత్తితో, మరొక చేతిలో పడగవిప్పిన పాముతో ఈ శిల్పం భయంకరంగా కనిపిస్తుంది. మహిషాసురుని వధించిన ఈ శక్తిమాతను దర్శించుకుంటే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంకా సకల సంపదలు, వ్యాపారాభివృద్ధి, ఆయురారోగ్యాలను చాముండేశ్వరి ప్రసాదిస్తుందని విశ్వాసం.

శ్రీ కామాక్షీ దేవి
ఈ పీఠం తమిళనాడులో ఉంది. ఇది అమ్మవారి వీపు భాగం పడిన చోటు. కాత్యాయనమహర్షి తపస్సు చేసి గౌరీదేవిని కూతురుగా పొందాలని వరం కోరుకున్నాడు. కామాక్షి ఏకామ్రనాథుని అర్చించి కంచిలో వెలసింది. కాంచి అంటే వడ్డాణం. భూమికి వడ్డాణం స్థానంలో కంచి ఉందిట. ఇక్కడ విభిన్నాకారాలతో ఆకులు ఉండే ఒక మామిడి చెట్టు ఉంది. ఒక్కొక్క కొమ్మకు ఒక్కో రుచి ఉన్న పండు కాస్తుందని చెబుతారు.

పార్వతిదేవి కంచి పట్టణంలో కామాక్షిగా పూజలు అందుకొంటున్న ఈ దేవాలయం చాలా ప్రసిద్ధమైనది. ఆదిశంకరులు ఇక్కడ ఉన్న కామాక్షి దేవికి పూజలు జరిపారు. మధుర మీనాక్షి, తిరువనైకవల్‌లో ఉన్న అఖిలాండేశ్వరి, కాశీలో ఉన్న విశాలాక్షి దేవాలయాలవలే ఈ కామాక్షి దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది. కామాక్షి అమ్మవారు విగ్రహం యోగముద్రలో పద్మాసనముపై ఆసీనురాలై శాంతిని, సౌభ్రాతృత్వాన్ని వెల్లివిరిస్తూ ఉంటుంది. అమ్మవారు క్రింది హస్తాలతో చెఱకుగడ, తామర పుష్పాన్ని, చిలుకను పై చేతులతో పాశాన్ని, అంకుశాన్ని ధరించి ఉంటుంది.

కంచి పట్టణంలో కామాక్షి అమ్మవారి దేవాలయం కాకుండా వేరే అమ్మవారి దేవాలయాలు లేవు. కామాక్షివిలాసం అనే ఇతిహాసం ప్రకారం ఇక్కడ అమ్మవారు శక్తి అంతా గ్రహించి మన్మధునిలో ఆవహింపజేస్తుందని, మరో ఇతిహాసం ప్రకారం రాజరాజేశ్వరి ఆసనంలో ఉండటం వల్ల ఈ అమ్మవారు సృష్టిలో ఉండే అన్ని శక్తులమీద తన ప్రభావం చూపుతుందని చెబుతారు. కామాక్షి అమ్మవారు మామిడి చెట్టు క్రింద మట్టితో శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఈశ్వరుని పాణి గ్రహణం చేసిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు చాల ఉగ్రతతో ఉండి బలులు తీసుకొంటూ ఉంటే ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించే శ్రీచక్రాన్ని ప్రతిిష్ఠించారట.

శ్రీ మహాలక్ష్మీ దేవి
ఈ పీఠం మహారాష్టల్రోని కొల్హాపుర్‌లో ఉంది. ఇక్కడ అమ్మవారి మూడు కళ్ళు పడ్డాయి అని చెప్పుతారు. మహాలక్ష్మి అనే పేరు ఉండడం మూలంగా ఈ అమ్మవారిని శ్రీ మహావిష్ణువు భార్య అని అనుకుంటారు. కానీ, ఈమె విష్ణుపత్ని కాదు. 18 భుజాలతో రజోగుణంతో భాసిల్లుతున్న మహాశక్తి. ఇక్కడ అమ్మవారి పాదాలపై ఏడాదికి మూడుసార్లు సూర్యకిరణాలు పడతాయి. అలా సూర్యకిరణాలు పడే రోజులలో కిరణోత్సవాలు వైభవంగా జరుగుతాయి.

పంచగంగ నది ఒడ్డున కొల్హాపూర్‌ నగరం ఉంది. కొల్హాపూర్‌ దేవాలయాన్ని క్రీస్తు శకం ఏడో దశాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్య రాజు కరణ్‌ దేవ్‌ కట్టించారు. ఆ తరువాత 9వ శతాబ్దంలో యాదవ రాజు వంశానికి చెందిన షిలాహార యాదవుడు మరింత అందంగా దేవాలయాన్ని తీర్చిదిద్దటానికి కృషిచేశాడు. దేవాలయంలో లోపల మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం స్వయం వ్యక్తమని ప్రజలు భావిస్తారు. అమ్మవారికి అర్చకులు ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులపుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు.

ఈ మహాలక్ష్మి దేవాలయం హేమాడ్‌ పంతి నిర్మాణశైలిలో కట్టబడినది. ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడతో ఉంటుంది. ప్రాంగణం మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయం ఒక అద్భుత కళాసృష్టి అని చెప్పవచ్చు. ఆలయమంతా మనోహరమైన శిల్పాలతో నిండి ఉంటుంది. పశ్చిమాభిముఖంగా ఉండే గర్భగుడి ముందుగా సుమారు వందడుగుల పొడవు గల విశాలమైన మండపం ఉంటుంది. గర్భగుడి చుట్టూ సన్నని ప్రదక్షిణ మార్గం వుంది. గర్భగుడిలో సుమారు ఆరడుగుల చదరంగా ఉన్న ఎత్తైన వేదిక మీద రెండడుగుల పీఠం, దానిమీద మహాలక్ష్మి విగ్రహం కూర్చొని ఉన్న భంగిమలో ఉంటుంది. మూడడుగుల ఎత్తున్న మూర్తి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మహారాష్ట్రీయులకు కొల్హాపూర్‌ మహాలక్ష్మి అత్యంత పవిత్ర యాత్రాస్థలం. వీరు అమ్మవారిని అంబాబాయి అని పిలుస్తారు. ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం నవరాత్రి ఉత్సవం. ముఖ్యంగా ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు విశేషంగా గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా ఐదు కి.మీ. దూరంలో ఉన్న తెంబ్లాయి అమ్మవారి ఆలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. ఇదిగాక చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు. గుడి ప్రాంగణంలో ఉన్న అనేక ఆలయాలలో విఠోబా ఆలయం కూడా చాలా పురాతనమైనది.

శ్రీ గిరిజా దేవి
ఒరిస్సాలో వైతరణీనదీ తీరంలో జాజ్‌పూర్‌ రోడ్డుకు 20 కి. మీ.దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. ఇది అమ్మవారి నాభి భాగం పడిన చోటుగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ గిరిజాదేవిని శ్వేతవరాహమూర్తి రూపంలో విష్ణుమూర్తి అర్చిస్తుంటాడు. ఇక్కడి గిరిజాదేవి సింహవాహనగా కనిపిస్తుంది. అమ్మ వారు ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో మహిషాసురుని తోక పట్టుకుని దర్శనమిస్తుంది. ఈమె శక్తి త్రయరూపిణి.

శ్రీ ఏకవీర్యకా దేవి
ఈ శక్తి పీఠం మహారాష్టల్రోని నాందేడ్‌ జిల్లా కేంద్రానికి 128 కి.మీ. దూరంలో దత్తాత్రేయుని జన్మక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహోర్‌లో ఉంది. ఇది అమ్మవారి కుడి హస్తం పడిన చోటు. ఇక్కడ అమ్మవారి శిరస్సు మాత్రమే దర్శన మవుతుంది. ఇక్కడ మూడు కొండలు ఉన్నాయి. ఒక దానిపై అత్రి- అనసూయలు, రెండవ దానిపై దత్తాత్రేయుడు, మూడవ దానిపై ఏకవీరికా దేవి ప్రతిష్ఠితిమయ్యారు. అమ్మవారి ముఖం గర్భాలయపు పై కప్పునుతాకేంత పెద్దదిగా ఉంటుంది. జమ దగ్ని రేణుకా దంపతులకు చెందిన కథ ఇక్కడ జరిగిందని చెపుతారు. పరశురాముని చేత ఖండితమైన తల్లి శిరస్సే ఈ దేవత. ఈ తల్లినే ఛిన్నమస్త అని కూడా అంటారు.

శ్రీ మహంకాళీ దేవి
ఈ శక్తిపీఠం మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉంది. ఇది అమ్మవారి పై పెదవి పడిన చోటు. విక్రమార్క మహారాజు చరిత్ర ఉజ్జయినితో ముడిపడిఉంది. ఇక్కడి నది సిప్ర. కుజునికి ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఆలయం ఉంది. భూమినుంచి కుజుడు విడిపోయిన ప్రాంతం ఇది అని జ్యోతిషశాస్తవ్రేత్తలు చెపుతున్నారు. కుజుడు అంటే భూమికి జన్మించిన వాడని అర్థం. ఇక్కడ త్రిపురాసురుణ్ని వధించిన మహాకాలుని ఆలయం ఉంది. ఆ స్వామికి ఆధారమైన శక్తి మహంకాళి. ఆ మహంకాళి శక్తి పీఠం ఇది. ఈ ఆలయాన్ని గర్‌ కాళికా అని కూడా పిలుస్తుంటారు. దేవీ మాతలందరిలో కాళికామాతకు ఎనలేని ప్రాధాన్యముంది. ప్రాచీన భారతీయ కవులలో అగ్రగణ్యుడైన కాళిదాసు సైతం కాళికా దేవి భక్తుడని చెబుతుంటారు.

పురాణాల ప్రకారం కాళిదాసు నిత్యం కాళీమాతను పూజించేవాడు. గర్‌ కాళిక ఆశీర్వాదం వల్లే అతడికి అపూర్వమైన కవితాశక్తి అబ్బింది. కాళికా మాతను పూజించడానికి శ్యామలా దండకం పేరిట జగత్ప్రసిద్ధమైన స్తోత్రాన్ని కాళిదాసు రచించాడు. ఉజ్జయినిలో ప్రతి ఏటా నిర్వహించే కాళిదాస్‌ సమారోహ్‌ కార్యక్రమంలో ఈ దండకాన్ని పఠిస్తుంటారు. ప్రతిరోజూ భారీ సంఖ్యలో భక్తులు ఈ గర్‌ కాళిక ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారనే విషయం ఎవరికీ తెలీదు కానీ మహాభారత కాలంలో నిర్మించారని ప్రజల నమ్మకం. అయితే మహా భారత కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించిన ప్పటికీ కాళికామాత విగ్రహం మాత్రం సత్య యుగానికి చెందినదని చెబుతుంటారు. హర్ష వర్ధన రాజు హయాంలో ఈ ఆలయానికి మరమ్మతులు చేసి పునరుద్ధరించినట్లు ఆధారాలు ఉన్నాయి. తర్వాత చాలాకాలానికి గ్వాలియర్‌ రాజు ఈ ఆలయానికి తిరిగి మరమ్మతులు చేయించారు. సంవత్సరం పొడవునా ఇక్కడ అనేక ఉత్సవాలు జరుగుతుంటాయి కాని,నవరాత్రులలో మాత్రం భారీస్థాయిలో ఉత్సవాలు నిర్వహించబ డతాయి. మతపరమైన యజ్ఞాలు, పూజలు కూడా నవరాత్రుల సమయంలో ఇక్కడ భారీ స్థాయిలో నిర్వహించబడతాయి.

శ్రీ మాధవేశ్వరీ దేవి
ఈ పీఠం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌లో ఉంది. అమ్మవారి హస్తాంగుళి పడిన చోటుగా ఈ స్థలాన్ని చెబుతారు. బ్రహ్మదేవుడు ఇక్కడ వరుసగా ఎన్నో గాయాలు చేసినందున ప్రయాగగా మారింది. ఈమెను కృతయుగంలో బృహస్పతి అమృతంతో అభిషేకించాడని పురాణాలు చెబుతున్నాయి.అమృతతీర్థం అని అంటారు. త్రేతాయయుగంలో రాముడు, ద్వాపరంలో శ్రీకృష్ఱుడు ఈ తల్లిని పూజించారు. సూర్యుడు పూజించడం వలన ఈ క్షేత్రాన్ని భాస్కరక్షేత్రం అని కూడా పిలుస్తారు.ఈ తల్లి శక్తిత్రయస్వరూపిణి.

శ్రీ సరస్వతీ దేవి
కాశ్మీర్‌లో శ్రీనగర్‌కు 40 కి.మీ. దూరంలో తుళుముల ప్రదేశంలో ఈ శక్తి పీఠం ఉంది.అమ్మవారి దక్షిణ హస్తం పడిందని చెబుతారు. సరస్వతీ దేవిని కీరవాణి అని పిలుస్తారు.పార్వతీపరమేశ్వరులు విశ్వకర్మతో అందమైన ఇల్లు కట్టించుకుని గృహప్రవేశానికి సిద్ధ్దమౌతారు. శివభక్తుడైన రావణుని పురోహితునిగా నియమిస్తారు. గృహప్రవేశం పూర్తయిన తరువాత దక్షిణ కోరుకొమ్మంటుంది పార్వతీదేవి. ఆ ఇంటినే తనివ్వమంటాడు రావణుడు. ఆడిన మాట తప్పలేక ఇచ్చేస్తుంది పార్వతీదేవి. తన పుట్టింటికి బాధపడుతూ వెళుతుంది. దారిలో సరస్వతి కనిపించి తన ను ఓదారుస్తుంది. వారిద్దరూ కలిసిన ప్రదేశమే ఈ శక్తి పీఠం. ఈ ఆలయం చెరువులో ఉంటుంది.

శ్రీ కామ రూపా దేవి
అస్సాం గౌహతి సమీపంలోనీ నీలాచలపర్వతశిఖరం పై ఈ శక్తిపీఠం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది ఆషాఢమాసంలో స్రవించే జలధార ఎర్రగా మారుతుంది. అది స్ర్తీత్వానికి ప్రతీక అంటారు. పరశురాముని మాతృ హత్యాదోషాన్ని ఈ తల్లి పోగొట్టిందని, శివుని కంటి మంటకు దహనమైన మన్మథుణ్ని జీవింపచేసిన తల్లిగా ఈమె ప్రఖ్యాతి చెందింది. ఇక్కడ అమృతేశ్వర్‌, కోటిలింగ, సిద్ధేశ్వర, కామేశ్వర శివాలయాలున్నాయి.

శ్రీ మాంగళ్య గౌరీ దేవి
ఈ పీఠం బీహార్‌లోని గయలో ఉంది. అమ్మవారి వక్షోజాలు ఇక్కడ పడ్డాయని చెబుతారు. తనను తాకిన ప్రతి జీవికీ మోక్షం వచ్చేలా విష్ణుమూర్తి వరం పొందిన గయాసురుడు పర్వతాకారంలో ఉన్న ప్రాంతమిది. గయాసురుడు శరీరాన్ని విపరీతంగా పెంచి అందరికీ మోక్షాన్ని ఇచ్చే సందర్భంలో, అతని శరీరం పెరగకుండా ధర్మవతశిలను అతని శిరస్సుపై ఉంచి, దాని పైకి విష్ణువును ఆవాహన చేసినట్లు ఒక పురాణగాథ ఉంది. విష్ణుమూర్తి సహోదరియైైన మాంగల్యగౌరి ఈ క్షేత్రరూపిణి. శ్రాద్ధకర్మలు ఇక్కడ ఎక్కువగా జరుగుతాయి.

శ్రీ విశాలాక్షీ దేవి
ఈ పీఠం ఉత్తరప్రదేశ్‌లోని కాశీలో ఉంది. ఇది అమ్మవారి మణికర్ణిక పడిన చోటు. కాశీలో 1500 ఆలయాలకు పైగా ఉన్నాయి. శివుని కన్నులు మూసి లోకాన్ని చీకటి చేసిన పాపానికి నల్లగా మారిన గౌరి, అన్నదాన పుణ్యంతో తిరిగి బంగారు వర్ణంలోకి మారిన క్షేత్రం కాశి. వ్యాసునికి కడుపార భోజనం పెట్టిన తల్లి అన్నపూర్ణ తిరుగాడిన క్షేత్రం కాశి. హిమాలయాలపై ఉండడం ఇష్టం లేక తన కోసం నిర్మించుకున్న పట్టణం కాశి. శివుని వైభవాన్ని విశాల నేత్రాలతో చూసిన తల్లి శక్తిపీఠంగా వెలిసింది విశాలాక్షి పీఠం.

అయోధ్య, మధుర, హరిద్వార్‌, కాంచీపురం, కాశీ, ఉజ్జయిని, ద్వారక సప్త మోక్ష ప్రదాయికాల్లో కాశీక్షేత్రం శ్రేష్టమైనది. ఈ పుణ్యస్థలంలో మహావిష్ణువు ముక్కంటిని పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఓసారి సూర్యభగవానుడు ఆకాశ మార్గాన వెళ్తుండగా, మహావిష్ణువు కాశీలో శివ లింగపూజలో ఉండటం గమనిస్తాడు. ఉమాపతి కొలువైన ఈ పుణ్యస్థలంలో పూజలు చేస్తే అత్యంత పుణ్య ఫలం లభిస్తుం దని మహావిష్ణువుచే తెలుసుకుని ఆదిత్యుడు ఆ ప్రాంతంలో లింగాన్ని స్థాపించి పూజించ సాగాడు. మహావిష్ణువు మాత్రమే కాకుండా, సృష్టికర్త బ్రహ్మ కూడా ఈశ్వరుని వేడు కుంటూ పది అశ్వమేధయాగాలు చేశాడు.

ఈ దశాశ్వ మేథఘాట్‌కు ఇప్పటికీ బ్రహ్మదేవుడు పూజలు చేస్తుంటాడని ప్రతీతి. అటువంటి ఈ పుణ్యస్థలిలో భక్తులను బ్రోచే జగన్మాత విశాలాక్షిగా కొలువైంది. ఈ శక్తిపీఠంలో విశాలాక్షి గర్భాలయంలో రెండు రూపాలతో దర్శనమిస్తుంది. ఒకరూపం స్వయంభువు. మరొక రూపం అర్చామూర్తి. మనం ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా అర్చామూర్తిని, పిమ్మట స్వయంభువును దర్శించుకోవాలి. పసుపు కుంకుమలతో ప్రకాశిస్తూ, పుష్పమాలాలంకృతురాలైన ఆమెను భక్తులు మనసారా పూజిస్తే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని విశ్వాసం.

శ్రీ వైష్ణవీ దేవి
హిమాచలప్రదేశ్‌లో పఠాన్‌కోటలో జ్వాలా ముఖి రైల్వే స్టేషన్‌కు 20 కి.మి.దూరంలో ఈ శక్తి పీఠం ఉంది. అమ్మవారి శిరస్సు పడిన చోటిది. జమ్మూలో కాట్రా వద్ద ఉన్న వైష్ణోదేవి ఆలయాన్ని శక్తిపీఠంగా చెపుతారు. భైరవనాథుడు అనే తాంత్రికుని బారి నుండి విష్ణుభక్తురాలైన ఒక బాలిక తప్పించుకుని, అతని తం త్రాలను తిప్పికొట్టిన కథ ప్రచారంలో ఉంది. ఈమెను వైష్ణవ దేవి అని పిలుస్తారు.

No comments:

Post a Comment