Saturday, 14 November 2015

జ్యోతిర్లింగాల స్థల పురాణముప్రపంచంలోనే అతి ప్రాచీనమైనది శైవమతం. పరమశివుని పంచముఖాల నుండి పంచభూతాలు పంచతన్మాత్రలు పుట్టి సృష్ఠి ప్రారంభమైనదని చెప్తారు. శివతత్వం అతి సూక్ష్మమైనందువల్ల ఆత్మకు మాత్రమే అనుభవపూర్వకముగా తెలుస్తుందని శైవాగమాలు చెబుతున్నాయి. పరమేశ్వరుని యోగులు, మహాఋషులు మొదలగువారు మాత్రమే ఆత్మజ్యోతిగా సందర్శిస్తారు. మిగిలిన వారందరికీ పరమేశ్వరుడు లింగరూపధారియై దర్శనమిస్తాడు. అందుకే లింగం శివునికి ప్రతీక. ఇట్టి శివ లింగములు ఆగమశాస్త్రాన్ని అనుసరించి 84 కాగా అవి కలియుగంలో 64 రకాలని వర్ణింపబడినవి. వీటిలో ద్వాదశ (12) జ్యోతిర్లింగ క్షేత్రములు మిక్కిలి ప్రాముఖ్యత నొందినవి. సకల కోరికలను తీర్చి మోక్షాన్ని ప్రసాదించేవిగా చెప్పబడినవి.

వేలాదిగా వున్న శైవ క్షేత్రాలలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు మిక్కిలి ప్రాశస్త్యత పొందినవి. జ్యోతిర్లింగములు అనగా ఎవరితోను ప్రతిష్ఠాపనము పొందక స్వయముగా పరమేశ్వరుని ఆత్మజ్యోతితో ఆవిర్భవించినదని చెప్పబడినది. ఈ జ్యోతిర్లింగములు పవిత్ర భారతదేశము నందు నలుమూలలా అవతరించి భక్తులచే ఆరాధించబడుతూ వారి వారి కోరికలను తీర్చుచున్నది. భారతదేశానికి పవిత్రత, ఔన్నత్యము కలుగుటకు ఈ భూమి ప్రజలతో ఆధ్యాత్మిక చింతన, దయ, ధర్మములు ఇంకనూ వున్నవి అనుటకు, ఈ జ్యోతిర్లింగ క్షేత్రములే కారణము కనుకనే ఈ జ్యోతిర్లింగ క్షేత్రములను దర్శించినా, పూజించినా అనంతమైన పుణ్యము కలిగి ఈతి బాధలన్నియూ తొలగి సుఖ సంతోషాదులు కలుగును.

ఇటువంటి బృహత్‌ కార్యక్రమమును శ్రీ శివ పంచాక్షరి ధర్మప్రచార్‌, కాశీవారు ప్రతి సంవత్సరము ఏకమార్గ ద్వాదశ జ్యోతిర్లింగములతోలిమిడి వున్న శక్తిపీఠములతో (3), తమ గోత్రనామములతో అభిషేకార్చనలు నిర్వహించుచున్నారు.శ్రీ సోమనాథేశ్వర స్వామి (సోమనాథ్‌, గుజరాత్‌)
సోమనాధ్‌ గుజరాత్‌ రాష్ట్రములోని ప్రభాస పట్టణమునకు సుమారు 4 కి.మీ.ల దూరములో వున్నది. ఇక్కడ పరమశివుడు సోమనాధేశ్వరస్వామిగా వెలసియున్నారు. విజయవాడ నుండి కాజ్‌పేట, వార్థ, సూరత్‌, అహ్మదాబాద్‌ మీదుగా వీరావల్‌ స్టేషన్‌లో దిగవలెను. అక్కడి నుండి 7 కి.మీ. దూరంలోని సోమనాధ క్షేత్రానికి బస్సులో వెళ్ళవచ్చును.

దక్ష ప్రజాపతికి అశ్వని భరణాదిగా గల 27 మంది పుత్రికలు కలరు. తన కుమార్తెలకు సరిజోడు సౌందర్యమూర్తి అయిన చంద్రుడేనని భావించి వారినిచ్చి వివాహము చేసెను. చంద్రుడు తన భార్యలందరిలోకెల్లా రోహిణిపై ఎక్కువ ప్రేమను ప్రకటించుతూ మిగిలినవారికి నిర్లక్ష్యపరచసాగెను. ఇది చూసిన మిగిలిన 26 మంది భార్యలు ఈర్ష్యతో తండ్రి దగ్గరకు వెళ్ళి తమ బాధను తెలియపరచగా దక్ష ప్రజాపతి చంద్రుని పిలిచి చంద్రులందరునూ సమానమైన ప్రేమతో చూడమని పలు విధముల నచ్చచెప్పెను. కానీ చంద్రుడు మామగారి మాట లక్ష్యపెట్టక మునుపంటికంటే ఎక్కువగా రోహిణిపై అనురాగమొసంగసాగెను. దానితో దక్షుడు ఆగ్రహించి చంద్రుని క్షయరోగములో పీడించబడెదను గాక అని శాపమిచ్చెను. ఆ శాప కారణముగా చంద్రుడు తన కళలను కోల్పోయి రోజురోజుకీ క్షీణించసాగెను. చంద్ర కిరణములు నీరసించి పోవుట వలన అమృతమే అమారముగాగల దేవతలు హాహాకారములు చేయసాగారు. ఔషదులు వాడిపోయినవి. చరాచర జగత్తు స్తంభించిపోయినది. అంత దేవతలు, వశిష్ఠుడు మొదలైన మునీంద్రులు చంద్రుని తీసుకొని బ్రహ్మదేవుని వద్దకు తీసుకెళ్ళి ఈ ఉపద్రవం నుండి లోకాలన్నింటిని రక్షించమని ప్రార్ధించితిరి. అపుడు బ్రహ్మదేవుడు చంద్రునితో పవిత్రమైన ప్రభాస తీర్థమునకు వెళ్ళి పరమశివుని ఆరాధించవలసినదిగా అందువల్ల సమస్త శుభములు కలుగునని హితవు చెప్పి అతనికి మృత్యుంజయ మంత్రమును ఉపదేశించినాడు. పిమ్మట చంద్రుడు దేవతలతో కలిసి ప్రభాస క్షేత్రమునకు వెళ్ళి నిష్టతో మహేశ్వరుని ఆరాధించి ఆరుమాసాల కాలం ఘోరమైన తపంబొనర్చెను. దీక్షతో 10 కోట్ల సార్లు మృత్యుంజయ మంత్రాన్ని జపించెను. చంద్రుని భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరము కోరుకోమనగా చంద్రుడు పరమశివుని పరిపరి విధముల స్తుతించి తనను అనుగ్రహించమని తనకు శాప విమోచనం కోరగా పరమేశ్వరుడు కృష్ణ పక్షములో కళలు క్షీణించే విధంగా, శుక్ల పక్షములో కళలు దినదిన ప్రవర్ధమానమయ్యేటట్లు పూర్ణిమ నాటికి కళా పరిపూర్ణుడిగా విరాజిల్ల గలడని వరము ప్రసాదించెను. అంతట చంద్రుడు, బ్రహ్మాది దేవతలు ప్రార్ధించగా వారి కోరికపై మహేశ్వరుడు పార్వతీ సమేతుడై ఈ ప్రభాస క్షేత్రమునందు సోమనాధేశ్వరునిగా అవతరించి భక్తుల కోరికలను తీర్చుతూ వారిని అనుగ్రహించుచున్నారు.
ఈ పట్టణమునకు చుట్టు పురాతనమైన కోట కలదు. ఇక్కడకు సమీపమున బాలక్‌ తీర్థ, త్రివేణి సంగమము (కపిల, సరస్వతి, హిరణ్య నదుల సంగమము) కలవు. శ్రీ కృష్ణ భగవానుడు అవతారము చాలించిన ప్రదేశము ”దేహస్వర్గ” ఈ క్షేత్ర సమీపములోనే కలదు.శ్రీ మల్లిఖార్జునస్వామి (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్‌)
ఈ క్షేత్రము ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లాలోని నల్లమల పర్వత శ్రేణులలో సముద్ర మట్టానికి 460 మీటర్ల ఎత్తులో వున్నది. విజయవాడ నుండి 260 కి.మీ.లు దూరంలో శ్రీశైల క్షేత్రమున్నది. రహదారి మార్గమున గుంటూరు, వినుకొండ, డోర్నాల్‌ మీదుగా రైలు మీద అయినచో మార్కాపురం వరకు వెళ్ళి అక్కడి నుండి బస్సులో శ్రీశైలమునకు వెళ్ళవచ్చును. పరమేశ్వరుడు ఇచ్చట మల్లిఖార్జున స్వామిగా అవతరించియున్నాడు. శిలాదుడు అనే మహర్షి గొప్ప శివభక్తుడు. సంతానం కొరకు శివుని గురించి ఘోర తపస్సు చేసెను. ఆయన తపమునకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఇద్దరు పుత్రులను అనుగ్రహించెను. వారే పర్వతుడు, నందికేశుడు. వీరిద్దరు తండ్రి కంటే గొప్ప శివభక్తులై శివుని గూర్చి తపస్సు చేయగా స్వామివారు ప్రత్యక్షమై వరము కోరుకోమనెను. నందికేశుడు తనని స్వామివారి వాహనముగా అనుగ్రహించమని వేడుకొనెను. పర్వతుడు స్వామివారిని ఎల్లప్పుడూ తన మీదే నివసించమని కోరెను. వారి కోర్కెను స్వామివారు మన్నించి నందికేశుని తన వాహనముగా (నందీశ్వరునిగా) చేసుకొనెను. పర్వతుని కోరిక ప్రకారం పరమేశ్వరుడు మల్లిఖార్జున లింగరూపమున పర్వతునిపై స్వయం భూ జ్యోతిర్లింగముగా వెలసినారు. ఈ స్వామివారు వెలసినప్పటి నుండి ఆ పర్వతమునకు శ్రీశైలం అని పేరు వచ్చింది. (శైలము అనగా పర్వతము) ఇచ్చటనే అష్టాదశ శక్తి పీఠములలో ఒకటైన శ్రీ భ్రమరాంబికా దేవి ఆలయము కలదు. ”శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే” అని యుగయుగాల నుండి అఖండకోటి భక్తావళి నమ్మకము. అనగా శ్రీశైల మల్లిఖార్జునస్వామి ఆలయ శిఖరాన్ని శిఖరేశ్వరస్వామి పర్వతము నుంచి దర్శించి కలిగినచో పునర్జన్మ ఉండదు. శ్రీ మల్లిఖార్జునస్వామి వారి లింగము సుమారు ఆరు అంగళముల ఎత్తు ఎనిమిది అంగుళముల వెడల్పుతో సాలిగ్రామ శిలతో పానుమట్టం మీద దర్శనమిస్తున్నారు.

శ్రీశైల క్షేత్రమునకు వెళ్ళు దారిలో 4 కి.మీ. ముందుగా పాలధార, పంచధార, హటకేశ్వరము దర్శించుకొనవలెను. ఇక్కడ నుండి 2 కి.మీ. సాక్షి గణపతి ఆలయము కలదు. శ్రీశైలము వచ్చినవారు తప్పక సాక్షి గణపతి స్వామివారి దర్శనము చేసుకొనవలెను. ఇచ్చటికి సమీపములో పాతాళగంగ, శ్రీశైలం డ్యామ్‌ కలవు. ఛత్రపతి శివాజీని గురించి తెలిపే మ్యూజియం కలదు.శ్రీ మహాకాళేశ్వర స్వామి (ఉజ్జయినీ, మధ్యప్రదేశ్‌)
సప్తపురీ మోక్షములలో ఒకటైన ఉజ్జయినీ నగరము క్షిప్రానదీ తీరమున అలరారుచున్నది. ఇచ్చటనే పరమేశ్వరుడు మహాకాళేశ్వర జ్యోతిర్లింగముగా అవతరించియున్నాడు. అష్టాదశ శక్తి పీఠములలో ఒకటైనటువంటి మహాకాళికాదేవి ఆలయము కూడా ఇచ్చటనే కలదు.
పూర్వము అవంతి (ఉజ్జయిని) నగరమున వేదప్రియుడను బ్రాహ్మణోత్తముడు తన సంతానమైన దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, ధర్మవాహి అను నలుగురు కుమారులతో నిత్యనైమిత్తిక వైదిక కర్మల ననుష్ఠించుచు పార్ధివలింగార్చన చేయుచుండెను. వారి పుణ్యప్రభావము వలన నగర ప్రజలందరు సుఖ సంతోషాలతో అలరారుచుండిరి. అదే కాలము రత్నమాల పర్వతము మీద దూషణుడు అను రాక్షసరాజు ధర్మద్వేషియై ఎన్నియో అకృత్యములు చేయుచుండెను. ఒక్క ఉజ్జయినీ నగరము తప్ప రాక్ష గణముతో ఉజ్జయినీ నగరములోనికి ప్రవేశించి బ్రాహ్మణుల, భక్తుల కార్యక్రమాలను స్తంభింపచేసి వారిని బాధించుచుండెను. అయినను వేదప్రియుడు, అతని కుమారులు పరమేశ్వరుని మీద నమ్మకముతో, అకుంఠిత దీక్షతో స్వామివారి మీద భారము మోపి పార్ధివ లింగారాధన చేయుచుండిరి. దూషణుడు వేదప్రియుడు తదితరులను ఎప్పుడైతే బాధించుటకు వచ్చెనో అక్కడ వున్న ఒక గుంట నుండి పరమేశ్వరుడు మహాకాలుని రూపంలో ప్రత్యక్షమై దూషణుడిని, వాని అనుచరులను భస్మమొనర్చెను. మహాకాలుడు ఆ బ్రాహ్మణ కుటుంబమును, భక్తులను వరము కోరుకోమనగా భక్తులందరు ముక్త కంఠముతో స్వామిని అచ్చటనే జ్యోతిర్లింగ రూపమున నివసించమని ప్రార్ధించగా వారి కోరిక మన్నించి పరమేశ్వరుడు మహాకాళ జ్యోతిర్లింగముగా అవతరించెను.

ఉజ్జయినిలో దర్శించవలసిన దేవాలయములు చాలా వున్నవి. విక్రమాదిత్య మహారాజు ప్రతిరోజు దర్శించి, పూజించిన హరసిద్ధి మాతా మందిరము అందులో ఒకటి. స్వామివారి ఆలయమునకు 5 కిలోమీటర్ల దూరములో కాళికాలయము వున్నది. అష్టాదశ శక్తిపీఠములలో ఇది ఒకటి. ఉజ్జయిని క్షేత్రములోనే సాందీపముని వద్ద శ్రీకృష్ణుడు, బలరాముడు, కుచేలుడు విద్యను అభ్యసించిరి. ఆయన పేరుతో సాందీపుని ఆశ్రమము వున్నది. ఈ క్షేత్రములో వేంచేసియున్న కాలభైరవ స్వామికి మద్యమును నైవేద్యముగా సమర్పించి తిరిగి దానినే భక్తులకు తీర్థముగా ఇచ్చుట విశేషము. విగ్రహము పెద్దది. స్వామివారి నోటివద్ద మత్తు పానీయములు ఒక పాత్రలో యుంచి పెట్టిన ఆ పాత్ర ఖాళీ అగును. ఇది మనం కళ్ళారా చూడవచ్చును.
క్షిప్రా నదిలో స్నానమాచరించి మహాకాళేశ్వరుని దర్శించిన సర్వ పాపములు పటాపంచలగునని భక్తుల విశ్వాసము.శ్రీ అమలేశ్వరస్వామి (ఓంకార్‌, మధ్యప్రదేశ్‌)
మధ్యప్రదేశ్‌లోని ఓంకార్‌లో అమలేశ్వర జ్యోతిర్లింగంగా పరమశివుడు అవతరించినాడు. నర్మదానది ఒడ్డును కుడి ప్రక్కన ఓంకారేశ్వరుని ఆలయము. ఎడమ ప్రక్కన అమలేశ్వరుని మందిరము భక్తకోటి సందర్శనతో అలరారుతున్నది. ఓంకారేశ్వరుని, అమలేశ్వరుని ఒక జ్యోతిర్లింగంగా పరిగణించుచున్నారు.
ఒకానొక పర్యాయము నారద మహర్షి వింధ్య పర్వతమునకు వెళ్ళగా విధ్యుడు నారదుని తగు సముచిత రీతిన గౌరవించెను. ఆ సమయంలో వింధ్యుని మనస్సులో తనతో సిద్ధులు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు డమేకాక రత్న, మణి, వైఢూర్యాది సర్వంబులు కలవు కనుక తనకేమియూ కొరత లేదనుకొనుచుండెను. వింధ్యుని మనస్సులోని ఆలోచన గమనించి, నారదుడు నీయందు అన్నీ వున్నవి కానీ నీకంటే మేరు పర్వతము ఎత్తైనది మరియూ దేవతలలో మేరువుకు స్థానమున్నది. కానీ నీకట్టి యోగము లేదుకదా అని అనెను. అపుడు వింధుడు తనకంటే వేరొకరు గొప్పవారుగా నుండుట సహించలేక శివుని ఆరాధించి కృతార్ధుడు కావాలన్న పట్టుదలతో ఓంకార క్షేత్రమునకు వెళ్ళి పరమేశ్వరుని పార్ధివ లింగమును తపస్సుతో, నిశ్చల భక్తితో ఆరాధించెను. అంతట పరమేశ్వరుడు వింధుని భక్తికి మెచ్చి ప్రత్యక్షమై వరము కోరుకోమనగా వింధ్యుడు స్వకార్యమును సాధించు శక్తిని ప్రసాదించమని పరమేశ్వరుని కోరుకొనెను. పరమేశ్వరుడు నీ ఇష్ట ప్రకారమే చేయుదునని వరమిచ్చెను. అప్పుడు దేవతలు, మునులు, స్వామివారిని ఓంకార క్షేత్రములో నిసించమని ప్రార్ధించెను. వారి కోరిక మన్నించి ప్రణవాకారముగా ఓంకారేశ్వరుడనియూ, పార్ధివ లింగాకారముగా అమలేశ్వరుడనియూ అవతరించెను.

ఈ ఆలయము ఒక చిన్న పర్వతము మీద వున్నది. మందిరము చాలా మనోహరముగా వుండును. స్వామివారి జ్యోతిర్లింగము గర్భగుడి మధ్యలో నుండక గోడకు దగ్గరగా వుండును. స్వామివారి జ్యోతిర్లింగ మధ్య భాగమున చిన్న చీలిక వున్నది. అభిషేక జలము ఆ చీలిక ద్వారా నర్మదా నదిలోనికి పోయి నర్మదానది పవిత్రత మరింత ఎక్కువ చేసిని. కావేరి అనే నది నర్మదా నదిలో కలిసే ఉపనది. కావేరి నది మాంధాత పర్వతమును చుట్టి వచ్చి నర్మదానదిలో కలియును. ఈ కలయిక ఓం ఆకారములో చుట్టి వచ్చి కలయును. పైనుండి చూసినచో ‘ఓం’ ఆకారములో ఆ ప్రవాహము వుండును.శ్రీ వైద్యనాథేశ్వర స్వామి (బైద్యనాథ్‌, జార్ఖండ్‌)
వైద్యనాధేశ్వరుడు నూతనంగా ఏర్పడిన జార్ఖండ్‌ రాష్ట్రంలోని జస్ధి అనే చిన్న పట్టణములో అవతరించెను. జ్యోతిర్లింగం సుమారు 12 అంగళముల వెడల్పు పొడుగులో గుంటగా, వాలుగా వుండును. జ్యోతిర్లింగం శిరస్సుపై ఉన్న నొక్కును రావణాసురుని బొటన వేలు నొక్కు అందురు.
పూర్వము రావణ బ్రహ్మ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకొనుటకు ఘోరతపము చేసెను. ఒక వృక్షము క్రింద అగ్నిగుండము ఏర్పరచి పార్ధివ లింగము ప్రతిష్ఠించి శివపంచాక్షరీ మంత్రముతో హవన కార్యక్రమముతో నిష్ఠతో చేసిననూ పరమేశ్వరుడు కరుణించలేదు. అంత రావణాసురుడు ఆ అగ్ని గుండములో తన తొమ్మిది తలనను ఒక్కో దానిని ఖండించి హవనము చేసెను. అయిననూ పరమేశ్వరుడు కరుణించలేదు. చివరకు తన పదవ తలని కూడా ఖండించుకొనుటకు సిద్ధమవగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై రావణుని తొమ్మిది తలలను తిరిగి ప్రసాదించి వాని కోరిక ప్రకారము అసమానమైన బలము నొసంగెను. స్వామిని రావణాసురుడు లంకా నగరమునకు నివసించమని ప్రార్ధించగా స్వామి రావణునికి తన ఆత్మ లింగమును ప్రసాదించి లంకా నగరమందు తీసుకొని వెళ్ళమని చెప్పి ఈ లింగమును భూమికి తాకించిన అచ్చటమే స్థిరపడునని హెచ్చరించెను. రావణ బ్రహ్మ లంకా నగరమునకు తిరుగు ప్రయాణములో నిత్యనైమిత్తిక కర్మలాచరించుటకై ఆత్మలింగమును ఒక గోపబాలునికిచ్చి పట్టుకోమనగా ఆ బాలుడు ఆ దివ్యలింగమును చితా భూమినందు ఉంచెను. ఆ లింగము అచ్చటనే స్థిరపడెను. రావణాసురుడు తన శక్తినంతయు వుపయోగించిననూ ఆ లింగము కదల్చలేకపోయెను. ఆ విధముగా వైద్యనాథేశ్వరుడు లంకా నగరమందు కాక చితా భూమినందు కొలువై భక్తుల కోరికలను తీర్చుచున్నాడు. సర్వదేవతలు ఆ చితాభూమి కేతించి పూజాభిషేకాలతో జ్యోతిర్లింగమును అర్పించినారు.
వైద్యనాథ్‌లో సుమారు 20 పేరు పొందిన ఆలయములు వున్నవి. అందు ముఖ్యముగా వైద్యనాథ స్వామి ఆలయము, శివగంగా ఆలయము, భగవతీ జగదాంబ, బైద్య భక్త మందిరము తప్పక దర్శించతగిన ఆలయములు.శ్రీ భీమ శంకర స్వామి (భీమశంకర్‌, మహారాష్ట్ర)
ఈ క్షేత్రము మహారాష్ట్రలోని భీమశంకర్‌లో కలదు. విజయవాడ నుండి పూణె నగరమునకు చేరిన అచ్చట నుండి బస్సులో భీమ శంకరమునకు వెళ్ళవచ్చు. పూణు నుండి భీమశంకర్‌ 120 కి.మీ. దూరములో వున్నది. ఈ క్షేత్రములో స్వామివారు భీమేశ్వరస్వామిగా అవతరించి భక్తులచే పూజలందుకొనుచున్నారు.
పూర్వము కుంభకర్ణునికి కర్కటి అనే రాక్షసికి పుట్టినవాడే భీమాసురుడు. తన తండ్రిని నారాయణుని అంశకల శ్రీరామచంద్రుడు సంహరించెనని తెలుసుకుని నారాయణునిపై పగ సాధించదలచి బ్రహ్మదేవుని గురించి వెయ్యి సంవత్సరముల ఘోర తపస్సు చేసెను. అంత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భీమాసురుని వరం కోరుకోమనెను. ఆ రాక్షసుడు ఈ బ్రహ్మాండములో ప్రత్యక్షమై భీమాసురుని వరం కోరుకోమనెను. ఆ రాక్షసుడు ఈ బ్రహ్మాండములో తనతో సమానమైన బలవంతుడు వుండరాదని కోరుకొనెను. బ్రహ్మదేవుడు అటులనే అని వరమిచ్చెను. తదుపరి భీమసురుడు, ఇంద్రుడు మొదలగు దేవతలను జయించి నారాయణుని కూడా జయించెను. భీమాసురుడు మూడు లోకములలో ఎచ్చట యజ్ఞయాగాదులు జరుగకుండా చేయుచూ అందరూ తననే పూజించవలెనని భక్తులందరిని బాధించుచుండెను. కాని కామరూపేశ్వరుడు, అతని భార్యయైన సుదక్షిణాదేవి మానసపూజా విధమున పరమేశ్వరుని ప్రణవ సహిత శివపంచాక్షరితో పూజించుచుండెను. పరమేశ్వరుడు కామరూపేశ్వర దంపతుల వద్ద పార్ధివ లింగ రూపములో వుండి వారి పూజలను స్వీకరించసాగెను. రోజురోజుకీ పాతాళరాజు పూజలు అధికమైనవి. అది చూసి భీమాసురుడు నీవు చేయు పూజలు ఆపెదవా లేక శివ లింగమును భిన్న మొనర్చెదనని అనగా పాతాళరాజు భయపడక పరమేశ్వరునిపై నమ్మకముతో నీ చేతనైనని చేసుకొమ్మని పూజలు కొనసాగించెను. భీమాసురుడు తన చేతిలోని ఖడ్గముతో శివ లింగమును తాకెను. రాక్షసుని కత్తి తగిలిన వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఓరీ అసురా! నా భక్తులను రక్షించుటే నా కర్తవ్యమని భీమాసురుని సంహరించెను. భీమాసురుని తల్లి కర్కటి తన కుమారుని శరీరము పాతాళము నుండి భూమి మీదకు వచ్చి శివుని గురించి దీనాతిదీనంగా ప్రార్ధింప స్వామి దర్శనమిచ్చి వరము కోరుకోమనెను. అప్పుడు ఆమె తనయుడి పేరు చిరస్థాయిగా వుండునట్లు అదే ప్రదేశములో జ్యోతిర్లింగముగా వెలయునని కోరుకొనెను. అంతట పరమేశ్వరుడు ఆమె కోరికను మన్నించి భీమశంకర జ్యోతిర్లింగముగా ఆ సహాద్రి పర్వతములలో వెలసెను. కృష్ణానది ఉపనది అయిన భీమనది ఇచటనే పుట్టి స్వామివారి సేవకు ఉపయోగపడుచున్నది.
భీమ్‌శంకర్‌ చిన్న కుగ్రామము. ఇచ్చట కొన్ని సత్రములు కట్టినారు. పర్వ దినములలో వసతి దొరకుట కష్టము. చిన్న భోజనం హోటల్‌ మరియు కాఫీ హోటళ్లు కలవు.శ్రీ రామనాథ స్వామి (రామేశ్వరి, తమిళనాడు)
ఈ క్షేత్రము తమిళనాడులోని రామేశ్వరంలో కలదు. విజయవాడ నుండి చెన్నై – తిరుచ్చి – తిరుమయం – కరైకుడి – రామనాధపురం – మీదుగా రామేశ్వరమునకు వెళ్ళవచ్చు రైలులో ప్రయాణము చేయవలెనన్న విజయవాడ నుండి చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌ అక్కడి నుండి (ఎగ్మోర్‌) ఎగ్‌మోర్‌ రైల్వేస్టేషన్‌కి వెళ్ళి రామేశ్వరమునకు వెళ్ళవచ్చు. ఇచ్చటనే స్వామివారు రామలింగేశ్వరస్వామిగా అవతరించియున్నారు.
శ్రీరామచంద్రుడు రావణబ్రహ్మను సంహరించిన అనంతరం బ్రహ్మహత్యాదోష నివారణార్ధం రామేశ్వరములో శ్రీ శివదేవుని లింగ ప్రతిష్ఠకు నిర్ణయించినారు. అందుకుగాను ఆంజనేయస్వామివారు హిమాలయములలోని కైలాస పర్వతము దగ్గర నుండి శివలింగమును తెచ్చుటకు వెళ్ళెను. కానీ సుముహూర్త సమయమైనను ఆంజనేయస్వామి రానందున సీతామహాసాధ్వి సైకత (ఇసుక) లింగమును తయారుచేసెను. ఈ ప్రతిష్ఠ జరిగిన తరువాత ఆంజనేయస్వామి కైలాస పర్వతము నుండి శివ లింగమును తెచ్చెను. శ్రీరాములవారు ఆ లింగమును కూడా ఆలయ ప్రాంగణములో ప్రతిష్ఠించినారు. రాములవారు ప్రతిష్ఠించిన లింగమును రామనాధస్వామిగాను, ఆంజనేయస్వామి తెచ్చిన లింగమును కాశీ విశ్వేశ్వర లింగముగా భక్తులచే పూజలందుకొనుచున్నవి. రామేశ్వరము బంగాళాఖాతంలో చిన్న ద్వీపము. శ్రీరామనాధస్వామి ఆలయము చాలా మనోహరముగా వుండును. ఆలయ ప్రాంగణము సుమారు 400 అడుగుల పొడవు 21 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తు కలిగి సుందరమైన శిల్పములతో అలరారుచున్నది. దేవాలయ ప్రాంగణములో 22 తీర్థాలు మరియు ఇతర ప్రదేశములలో 21 తీర్థాలు కలవు. ఆలయములోని తీర్థములు మహాలక్ష్మి – సావిత్రి – గాయత్రి – సరస్వతి – మాధవ – గంధ మాధవ – గవాక్ష – గవాయ – నీల – శంక – శంకర – బ్రహ్మ హత్యా విమోచన – సూర్య – చంద్ర – గంగ – యమున – గయ – శివ – సత్యామృత – సర్వ తీర్థము – కోటి తీర్థముల పేర్లతో వున్నవి. స్వామివారు ఆలయమునకు 5 కి.మీ.ల దూరములో గంధ మాధవ పర్వతం కలదు. ఇచ్చట నుండే హనుమంతులవారు సీతాదేవుని వెతుకుటకు సముద్రమును లంఘించెనని చెప్పెదరు. ఈ పర్వతం మీదున్న రెండు అంతస్తుల దేవాలయము ఎక్కితే క్రింద నుండి రామేశ్వర ద్వీపము మనోహరముగా కనిపించును. రామేశ్వరం నుండి 2 కి.మీ. దూరంలో ధనుష్కోటి కలదు. ఇది ఒక ద్వీపము. రావణాసురుని తమ్ముడైన విభీషణుడు శ్రీరాముని శరణు పొందిన ప్రదేశము. ఇంకను రామేశ్వరాలయము, నంది నాయకి అమ్మన్‌, విల్లోరిని తీర్థము – భైరవ తీర్థము మొదలగునవి చూడదగిన ప్రదేశములు.శ్రీ నాగనాథ స్వామి (నాగనాథ్‌, గుజరాత్‌)
సప్త మోక్షపురుషులలో ఒకటైన ద్వారకాపట్టణం పురాణ ప్రసిద్ధి చెందినది. శ్రీకృష్ణ పరమాత్మ సామ్రాజ్య రాజధాని అయిన ద్వారకకు, శ్రీకృష్ణుని అంతఃపురమైన భేటీ ద్వారక మధ్యన వున్నదే నాగేశ్వర జ్యోతిర్లింగం. గుజరాత్‌ రాష్ట్రంలోని పోరుబందరు నుండి 80 కిలోమీటర్ల దూరంలో కలదు.
పూర్వము పశ్చిమ సముద్ర (అరేబియా) తీరమున 16 యోజనములు కల ఒక వనము నందు దారుక అనే రాక్షసి తన భర్తతోను, ఇతర రాక్షసులతోను నివశించుచుండెను. దారుక పార్వతీదేవి గురించి ఘోరతపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నము చేసుకుని అనేక వరములు పొందెను. వర గర్వముచే దారుక ఆ వనమును గాలిలోకి లేపుచూ తన ఇష్టము వచ్చిన చోట దింపుచూ భక్తులను, మునులను వారు చేయు యజ్ఞయాగాదులను ధ్వంసము చేయుచూ, ప్రజలను భక్షించుచూ కాలము గడుపుచుండెను. భక్తులు, ప్రజలు, రాక్షసులు పెట్టు బాధలు భరించలేక ఔర్య మునిని రక్షించమని వేడుకొనగా ఆ ముని రాక్షసులు ఈ భూమి మీద ఎవరినైననూ బాధించినచో వెంటనే మరణించెదరు గాక అని శాపమిచ్చెను. ఆ శాప భయంతో రాక్షసులు నిస్సహాయులై వుండిరి. అప్పుడు దేవతలు వారిపై దండెత్తి రాగా దారుక ఆ వనమును గాలిలోకి లేపి సముద్రముపై ప్రతిష్ఠించెను. అచ్చటనే వుండి అటువైపు పడవలపై వచ్చు ప్రయాణీకులను బంధించిన భక్షింప మొదలు పెట్టినారు. అలా బంధింపబడిన వారిలో సుప్రియుడను వైశ్యుడు పరమేశ్వరుని భక్తుడు. అతడు చెరసాలలో వుండియు పరమేశ్వరుని పార్ధివలింగపూజను చేయుచూ తన తోటివారిని కూడా పూజలకు పురికొల్పెను. అందరును యధావిధిగా పంచాక్షరీ మంత్రముతో పరమేశ్వరుని ప్రార్ధించుచుండిరి. ఆ భక్తుల పూజలకు పరమేశ్వరుడు సంతసించి వారి పూజలను స్వీకరించెను. వారు చేయు పూజల గురించి తెలిసిన దారుక భర్త అయిన దారకాసురుడు సుప్రియుని సంహరించుటకు రాగా సుప్రియుడు భయపడక పరమేశ్వరుని ప్రార్ధించగా శివుడు ప్రత్యక్షమై దారకాసురుడిని, ఇతర రాక్షసులను సంహరించెను. వారి కోరికపై నాగేశ్వరస్వామిగా అవతరించి భక్తుల కోరికలను ఈదేర్చుచున్నాడు. ఈ ద్వారకలోనే శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులవారు స్థాపించిన నాలుగు పీఠాలలో ఒకటి వున్నది. సముద్రపు ఒడ్డు నుండి 5 కిలోమీటర్ల బోటు మీద వెళ్ళినచో భేటీ ద్వారకను చూడవచ్చు. ఆసక్తి వున్నచో ఇక్కడి నుండి 80 కిలోమీటర్ల దూరములోగల పోరుబందరులో మహాత్మాగాంధీ జన్మస్థలము, మ్యూజియము చూడవచ్చును.శ్రీ విశ్వనాథ స్వామి (వారణాసి, ఉత్తరప్రదేశ్‌)
సప్త మోక్షపురులలో ఒకటైన కాశీ నగరమందు పరమేశ్వరుడు విశ్వేశ్వర జ్యోతిర్లింగముగా అవతరించెను. ఈ క్షేత్రము రాష్ట్రములో పవిత్ర గంగా నదీ తీరమున కలదు. విజయవాడ నుండి కాశీ పట్టణమునకు రైలు సౌకర్యము కలదు. స్వామి వారి ఆలయ గోపురము బంగారపు రేకుతో కప్పబడినది.
ప్రకృతి పురుషులు తమ తల్లిదండ్రులగు మాయా మహేశ్వరులను (శివ శక్తులను) చిరకాలము కాంచనందున మేమెచ్చట జన్మించెనని మా కర్తవ్యమేది అని చింతించుచుండెను. పరమేశ్వరుని నుండి ఎటు చూసినను ఐదు క్రోసుల నేలను సృష్టించి అందుండి తపస్సు చేయమని సందేశము వచ్చెను. ఆ ప్రకారంగా కాశీ పట్టణము నిర్మించబడినది. మహేశ్వరుడు తానునూ జ్యోతిర్లింగము రూపము ధరించి విశ్వేశ్వర నామధేయముతో కాశీపురమున అవతరించెను. ప్రళయ కాలమున ప్రపంచమంతయు మునిగిపోయినను కాశీ పట్టణమును మాత్రం పరమేశ్వరుడు తన త్రిశూలముతో పైకెత్తి పట్టుకొని రక్షించెను. అంత కాశీ పట్టణము అవినాశి అయ్యెను. విష్ణుమూర్తి చెమట బిందువు ఒకటి క్రిందపడి దిగుడు బావి అయ్యెను. అది చూసి పరమేశ్వరుడు ఆశ్చర్యముతో తల పంకించగా ఆ దేవదేవుని కర్ణ కుడి మణికుండలము ఒకటి క్రిందపడెను. అప్పటి నుండి ఆ ప్రదేశము మణికర్ణికా తీర్థముగా ప్రసిద్ధి గాంచెను. ఇక్కడ స్నానము చేసి కాశీ విశ్వేశ్వరుని ఆరాధించినచో కైలాస మార్గము సుగమము అగును. కాశీ క్షేత్రములో మరణించిన పశు, పక్షి, కీటక, మానవవాదులకు పునర్జన్మ రహిత శివసాయుజ్యము కలుగును. కాశీయందు మరణమునకు, జ్ఞానముగాని, భక్తిగాని, కర్మ, దానము సంస్కారము, ధ్యానము, నామస్మరణము, పూజకాని అవసరము లేదు. గంగానదికి ఉపనదులైన ”వరుణ” ”అశి” అనే నదులు ఇచ్చటనే సంగమిస్తాను. కనుక ఈ క్షేత్రమునకు వారణాశి అని పేరు కూడా వచ్చినది. హరిశ్చంద్ర మహారాజు, శ్రీరామచంద్రుడు, పాండవరాజులు, గౌతమబుద్ధుడు, జగద్గురు ఆదిశంకరాచార్యులవారు మరెందరో మహానుభావులు ఈ క్షేత్రమును దర్శించి విశ్వేశ్వరుని సేవించి తరించినారు.

కాశీ మహానగరములో అష్టాదశ శక్తి పీఠములలో ఒకటైన విశాలాక్షి అమ్మవారి ఆలయము కలదు. స్వామివారి ఆలయమునకు సమీపమున మాతా అన్నపూర్ణేశ్వరి ఆలయం వున్నది. కాశీ యాత్రలో ముఖ్యంగా ”గాడీ” అమ్మ అనబడే పరమేశ్వరి సహోదరి మందిరము తప్పక దర్శించవలెను. అప్పుడు కాశీ విశ్వేశ్వరుడు తృప్తినొందడంటారు. కాలభెరవుడు శునక వాహనుడై క్షేత్ర పాలకుడుగా ప్రసిద్ధి పొందినారు. గంగానది ఇచ్చట ఉత్తర వాహినియై ప్రవహించుచూ 64 ఘాట్లతో విరాజిల్లుతున్నది. ఇంకనూ దుర్గాలయము, తులసి మానస మందిరము, భారత్‌ మాతా మందిరం, మాలవ్యాబ్రిడ్జి, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, అమృత కుండము, డూండీ గణపతి ఆలయము మొదలైనవి దర్శనీయములు.శ్రీ త్య్రంబకేశ్వర స్వామి (త్య్రంబకం, మహారాష్ట్ర)
సహ్యాద్రి పర్వత శ్రేణులలో వెలసియున్న మరియొక జ్యోతిర్లింగమే త్య్రంబకేశ్వర జ్యోతిర్లింగము. ఈ క్షేత్రము మహారాష్ట్రలో నాసిక్‌ నుండి 32 కి.మీ. దూరంలో కలదు.

బ్రహ్మగిరిపై గౌతమ మహర్షి అహల్యాదేవితో తపస్సు చేయుచుండిరి. అట్టి సమయములో ఆ పరిసరాల్లో భయంకరమైన కరువు ఏర్పడినది. అంత గౌతముడు వరణుని ప్రసన్నుడిగా చేసుకొని మూరెడు లోతు గుంటను త్రవ్వి దానిలోనికి తరుగులేనటువంటి దివ్యజమునిమ్మని కోరెను. వరుణుడు తథాస్తు అని వరమిచ్చి అంతర్ధానమయ్యెను. ఆ నీటితో గౌతమ దంపతులు నిత్యనైమిత్తిక కర్మలు చేయుచూ ధాన్యములు, ఫలములను, పుష్ప వృక్షములను పెంపొందించుచుండెను. అది చూసి మిగిలిన ఋషులు వారి వారి సంసారములతో అక్కడికి వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకొని పుణ్య కార్యములు చేయుచుండిరి. ఒకరోజు గౌతముని భార్య అహల్యాదేవి ఋషిపత్నులను వారించి గౌతమ శిష్యులకు ప్రధమ జలము ఇప్పించెను. దానితో ఋషి పత్నులు ఆగ్రహించి గౌతమ దంపతులను ఏదో ఒక విధముగా అపకారము చేయవలెనని నిశ్చయించినారు. ఒకనాడు గౌతముడు పొలము నందు పంటను పరీక్షించుచుండగా ఋషులచే పంపబడిన ఒక మాయా గోవు అచటకు వచ్చెను. గౌతముడు ఆ ఆవు తినుటకు గడ్డి పరకలను విసిరెను. అవి తగిలి ఆ గోవు కిందపడి మరణించెను. ఇది అంతయు మునులకల్పన అని తెలియక తనకు గోహత్యాదోషము కలిగెనని నివారణా మార్గము తెలుపమని వారినే అడిగెను. వారు గౌతముని అనుష్ఠానము భంగము చేయుటకు కఠినమైన నిబంధనలు విధించిరి. అవి 1) భూమిని మూడుసార్లు ప్రదక్షిణ చేయుట 2) బ్రహ్మగిరికి 101 సార్లు ప్రదక్షిణ చేయుట 3) గంగానదిని బ్రహ్మగిరికి తెచ్చి అందులో స్నానము చేసి కోటి లింగాలకు ఒక్కోదానికి 1008 సార్లు అభిషేకం చేయుట. ఆ ఋషులు చెప్పినట్లు గౌతముడు ఆచరించినాడు. కోటి లింగాలకు భార్య సమేతముగా ఎప్పుడైతే గౌతముడు అభిషేకము చేసెనో పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమనెను. అంతట గౌతముడు తన గోహత్యా దోషము తొలగించమని కోరెను. అప్పుడు శివుడు ఇది అంతయు మునులు కల్పనయే కాని నీకెట్టి దోషము లేదు అనెను. అంత గౌతముని కోరికపై అదే ప్రదేశములు త్య్రంబకేశ్వర స్వామిగా అవతరించినాడు.

చూడవలసిన ప్రదేశములు పుష్పక క్షేత్ర ఘాట్‌, పంచవటి, శ్రీకపాలేశ్వరస్వామి ఆలయము, సీతాదేవి గుహ, జటాయువు మోక్ష ప్రదేశము. ఇచ్చట సమీపములోనే గోదావరి నది జన్మస్థలము కలదు. దీనినే గంగాద్వార్‌ అంటారు.శ్రీ కేదారనాథ స్వామి (కేదార్‌నాథ్‌, ఉత్తరాంచల్‌)
”ధన్యాస్తే పురషాలోకే పుణ్యాత్మనో మహేశ్వరీ |
యే వదం త్యపి కేదారమ్‌ గమిష్యామి ఇతిక్య చిత్‌” ||
కేదారమునకు వెళ్ళగలనని ఉచ్ఛరించనంత మాత్రముననే ధన్యాత్ములగుదురు. స్వయంగా యాత్ర చేసిన ఫలమెంతగలదోనని పురాణాలు పేర్కొంటున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములలో తొమ్మిదవ క్షేత్రముగా పేర్కొన్న కేదారనాధేశ్వరుడు సముద్రమట్టానికి 11,500 అడుగుల ఎత్తున నిరంతరం మంచుతో కప్పబడిన పర్వతముల మధ్య భక్తులకు దర్శనమిచ్చుచున్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగములలో అతి పెద్దది కూడా ఇదే. పర్వత శిఖరమే జ్యోతిర్లింగము కనుక దీనికి పానుమట్టం లేదు. గర్భగృహాన్ని లింగాకారంలో వున్న పర్వతశిఖరం ఆక్రమించి ఉన్నదని చెప్పడం కంటే జ్యోతిర్లింగ రూపమైన పర్వత శిఖరం చుట్టూ ఆలయం నిర్మింపబడినదని భావించవచ్చు. ఎనిమిది గజముల పొడవు, నాలుగు గజముల వెడల్పు, నాలుగు గజముల ఎత్తును గల పర్వత శిఖరమునే భక్తులు పూజింతురు.

కురుక్షేత్ర సంగ్రామమనంతరం పాండవులు సగోత్ర హత్యపాపము పోగొట్టుకొనేందుకు మహిషి రూపంలో దర్శనమిచ్చిన పరమశివుని గుర్తించి పట్టుకోవడానికి పాండవులు ప్రయత్నించగా పరమశివుడు భూమిలోకి ప్రవేశించాడు. ఈ సందర్భంగా పాండవులు మహిషి వీపు భాగమును స్పర్శించిరి. స్పర్శా మాత్రమునే వారి స్వగోత్ర హత్యాపాపమును పోగొట్టుకొన్నట్టు పురాణాలు తెలుపుతున్నాయి. ఈ స్వామిని కృతయుగంలో నర నారాయణులు, త్రేతాయుగంలో ఉపమన్యు, మహర్షి, ద్వాపరయుగంలో పాండవులు పూజించి ధన్యులయ్యారు. ఇచ్చట కూడా ఒక తత్వకుండము కలదు. ఆలయం వెనుక పర్వతముల గుండా పాండవులు ద్రౌపదితో కూడా నడిచి స్వర్గధామము చేరిన మహాప్రస్థాన మార్గము కలదు. వారి పాద చిహ్నములను దర్శించుకొనవచ్చును. ఆలయమున కుంతి ద్రౌపదులతో కూడిన పాండవుల విగ్రహులు కలవు. ఇచ్చట ఆరు మాసములు తలుపులు మూసివున్ననూ అఖండ జ్యోతి వెలుగుచుండును. ఆ జ్యోతిని దర్శించుటకు దేవాలయం తెరుచు సమయమునకు భక్తులు అధిక సంఖ్యలో వెళ్ళెదరు.

కేదారనాధ క్షేత్రము ఉత్తరాంచల్‌ రాష్ట్రంలోని హరిద్వార్‌ నుండి గౌరీకుండ్‌ వరకు బస్‌లో వెళ్ళి అక్కడి నుండి పధ్నాలుగు కిలోమీటర్లు నడిచికానీ, గుర్రముల మీద కానీ డోలీలలో కానీ వెళ్ళవచ్చు. విజయవాడ నుండి న్యూఢిల్లీకి వెళ్ళి అక్కడి నుండి హరిద్వార్‌ బస్సు లేదా రైలు మీద ప్రయాణము చేయవచ్చును. మే నెల నుండి దీపావళి వరకు మాత్రమే ఆలయము తెరచి వుండును.శ్రీ ఘృష్ణేశ్వ స్వామి (ఘృష్ణేశ్వర్‌, మహారాష్ట్ర)
దేవగిరి పర్వత శ్రేణులలో వేంచేసియున్న దివ్యక్షేత్రము ఘృష్ణేశ్వర్‌. ఘృష్ణేశ్వర స్వామి ఆలయము మహారాష్ట్రలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎల్లోరా గుహలకు అత్యంత సమీపమున కలదు.
సుధర్ముడను గొప్ప శివభక్తుడు సుదేహా అను ధర్మపత్నితో శివదేవుని వేదోక్త ధర్మముగా సేవించుచున్నారు. కానీ వారికి సంతానము కలుగలేదు. సుదేహ తనకి సంతానము కలుగదని నిశ్చయించుకుని తన చెల్లెలైన ఘృష్ణాదేవిని సంతానార్ధము వివాహము చేసుకోమని భర్తను బలవంతపెట్టగా సుధర్ముడు అంగీకరించి ఆమెను వివాహము చేసుకొనెను. ఘృష్ణాదేవి అక్కగారి అనుమతితో 101 పార్ధివ లింగములను తయారుచేసి పూజిలొనరించి తదుపరి చెరువులో నిమజ్జనము చేయుచుండెను. అటుల లక్ష పార్ధివ లింగములకు నిమజ్జనము చేసిన అనంతరం పరమేశ్వరుడు ఆమె శక్తికి మెచ్చి ఒక కుమారుని ప్రసాదించెను. కుమారుడు జన్మించిన అనంతరం ఘృష్ణాదేవికి సంఘములో విలువ పెరగసాగెను. అది చూసిన అక్క సుదేహకు అసూయ కలిగెను. కుమారుడు పెరిగి పెద్దవాడైన తదుపరి తండ్రియైన సుధర్ముడు వివాహ మొనర్చెను. ఆ కుమారుడు భార్యతో ఆనందముగా కాపురము చేయసాగెను. కాని ఘృష్మాదేవి మాత్రం ఏమియు పట్టక నిర్వికరముగా పరమేశ్వరుని భక్తితో ఆరాధించుచుండెను. కాని అక్క సుదేహకు మాత్రం రోజు రోజుకు అసూయ ఎక్కువై ఒకనాడు రాత్రి ఆ కుమారుని చంపి ముక్కలుగా కోసి పార్ధివ లింగములు నిమజ్జనము చేసిన చెరువులో పారవేసి ఏమీ తెలియని దానివలె నటించసాగెను. భర్తను కానిదై కోడలు ఏడవ సాగెను. అది వినిననూ ఘృష్మాదేవి ఏ మాత్రమే చలించక 101 పార్ధివ లింగముల పూజను చేయుచుండెను. పూజానంతరము మహేశ్వరుని స్మరించుచూ పార్ధివ లింగములను కోనేరులో నిమజ్జనము చేసి వెనుతిరిగిన వెంటనే కుమారుడు పునర్జీవితుడై కనిపించెను. ఆమె తన కుమారుడు మరణించినపుడు, తిరిగి పునర్జీవితుడైనపుడు నిర్వికారిగా వుండెను. ఆమె భక్తికి, నిగ్రహ శక్తికి సంతసించి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమనెను. అంతట ఆమె శివభక్తుల కోరికలు తీర్చుటకు వారిని రక్షించుటకు తన పేరుతో జ్యోతిర్లింగ రూపముగా వెలయుమని కోరగా పరమేశ్వరుడు అందుకు అంగీకరించి అచ్చటనే శ్రీ ఘృష్ణేశ్వరస్వామిగా అవతరించెను. ఇచ్చటనే వున్న ఎల్లోరా గుహలు దర్శనీయమైనవి. ఇక్కడికి సమీపములో ఔరంగాబాద్‌, దౌలతాబాద్‌, దేవగిరి కోటలు కలవు. తాజ్‌మహల్‌ నకలు కూడా ఇచ్చటికి సమీపమున కలదు.

No comments:

Post a Comment