Tuesday, 27 December 2016

మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌... మహిష్మతి
మహిష్మతి
మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌


మహిష్మతి రాజ్యాన్ని ‘బాహుబలి’ సినిమాలో చూసి ఉంటారు. ఆ పేరున్న పట్టణాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌కి వెళ్లాలి. నగిషీలు చెక్కిన ప్రాకారాలు, ఠీవీగా నిల్చున్న కోటగోడలు చుట్టూ ఉండగా మధ్యన నందీశ్వరుడితో సహా కొలువుదీరాడు మహేశ్వరుడు. నిత్యం శివార్చనతో ప్రశాంతమైన నర్మదానది ప్రణమిల్లగా మన అంతఃచేతనంలో పరవశాలను నింపుతూ దర్శనమిస్తాడు మహేశ్వరుడు. ఆయన పేరు మీదుగానే ‘మహేశ్వర్‌’ అని పట్టణ నామం స్థిరపడింది. అలా అక్కడ భక్తులకు అనంతమైన ఆశీస్సులను మహేశ్వరుడు అందిస్తున్నాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఖార్గోన్‌ జిల్లాలో ఉందీ మహేశ్వర్‌ పట్టణం. ఆగ్రా–ముంబై వెళ్లే 3వ నెంబర్‌ జాతీయ రహదారికి కేవలం 13 కిలోమీటర్లు, ఇండోర్‌ నుంచి 91 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణానికి లెక్కలకందని విశిష్టతలెన్నో ఉన్నాయి.

శరీరానికి హృదయం దేవాలయం ఎలాగో సుసంపన్నమైన మహేశ్వర్‌ కోటకు హృదయం మహేశ్వరుడి మందిరం. ఈ కోట అహిల్యాబాయి హోల్కర్‌ కోటగా కూడా ప్రసిద్ధి. 18వ శతాబ్దిలో మరాఠా రాణి, రాజమాత అహిల్యా బాయి హోల్కర్‌ తన భర్త మరణా నంతరం మహేశ్వర్‌ ఆలయాన్ని నడిబొడ్డుగా చేసుకొని దుర్భేద్యమైన కోటను నిర్మించారు. ఇక్కడ నుంచే మాళవ (మాల్వా) దేశాన్ని ఆమె పరిపాలించారు. శివ భక్తురాలైన అహిల్యా దేవి ఎన్నో శివాలయాలను పునరుద్ధరించారు. వాటిలో గుజరాత్‌లోని ద్వారక, సోమనాథ్, కాశీ విశ్వనాథ్‌ మందిరం, ఉజ్జయిని, నాసిక్, విష్ణుపాద మందిర్, గయ.. ఆలయాల లాంటివి ఎన్నో ఉన్నాయి. వీటితో పాటు నర్మదానది ఒడ్డున ఎన్నో దేవాలయాలు, ఘాట్లను నిర్మింపజేశారు. నర్మదానది ఒడ్డున నిల్చుని అహిల్యాబాయి కోట ఘాట్లను వీక్షిస్తుంటే ప్రసిద్ధ చిత్రకారుడు కాన్వాస్‌ మీద అందమైన చిత్రాలను తీర్చిదిద్దినట్టుగా దర్శనమిస్తుంది ఈ ప్రాంతం.

రామాయణ కాలం నాటి సామ్రాజ్యం
మహేశ్వర్‌ ప్రాచీన నామం మహిష్మతి. రామాయణ, మహాభారతాలలో ఈ మహిష్మతి సామ్రాజ్య ప్రస్తావన ఉంది. అంటే, రామాయణ కాలం నాటి కన్నా ముందే ఈ రాజ్యం ఉందన్నమాట. నర్మదా నదికి సమీపంలో ఉన్న సహస్రార్జున మందిరాన్ని సందర్శిస్తే అలనాటి విశేషాలు కళ్లకు కడతాయి. గోపురాలు నాటి కథలు చెబుతాయి. ఈ ప్రాచీన పట్టణాన్ని సోమవంశ సహస్రార్జున క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు తన రాజ్యానికి రాజధానిగా చేసుకొని, పరిపాలించేవాడు. ఇతడినే శ్రీ సహస్రార్జున అనేవారు. ఇతని గురించి మన ఇతిహాసాలలో గొప్ప ప్రస్తావన ఉంది.

ఒక రోజు సహస్రార్జునుడు తన 500 మంది భార్యలతో నదీ తీరానికి వాహ్యాళికి వెళ్లాడట. అయితే, 500 మంది భార్యలు ఉల్లాసంగా ఆడుకోవడానికి అనువైన ప్రాంతం కనిపించక, ప్రవహించే పవిత్ర నర్మదానదిని తన వెయ్యి బాహువులతో నిలువరించాడట. విశాలమైన ఆ నర్మదానదీ మైదానంలో అందరూ ఆనందంగా విహరిస్తున్న సమయంలో రావణాసురుడు ఆకాశమార్గాన పుష్పకవిమానంలో వెళుతూ, ఈ ప్రాంతంలో దిగాడట. నదీ మైదానం విశాలంగా కనిపించడంతో ఇసుకతో చేసిన శివలింగాన్ని ప్రతిష్ఠించి, పూజలు ప్రారంభించాడట. సహస్రార్జునుడి భార్యలు ఆటలు ముగించి, నది ఒడ్డుకు చేరుకోవడంతో అతను నెమ్మదిగా నీటిని విడుదల చేశాడట.

ఇప్పటికీ అవే 11 అఖండ దీపాలు
దీంతో రావణుడు ప్రతిష్ఠించిన ఇసుక శివలింగాన్ని నర్మదానది నీరు తుడిచిపెట్టేసుకుంటూ వెళ్ళింది. రావణుడు ఆగ్రహించాడు. సహస్రార్జునుడితో యుద్ధానికి దిగాడట. çసహస్రార్జునుడు తన వెయ్యి బాహువులతో రావణుడిని ఓడించి, అతడిని కట్టేసి, పది తలల మీద పది దీపాలు, కట్టేసిన రెండు చేతుల మధ్య మరో దీపం ఉంచి తన ఇంటికి బందీగా తీసుకెళ్లాడు. తన కొడుకు ఊయలను రావణాసురుడితో ఊపించి, ఆ తర్వాత వదిలేశాడట. ఇప్పటికీ మహేశ్వర్‌లోని సహస్రార్జున దేవాలయంలో 11 అఖండ దీపాలు నాటి నుంచి నేటి వరకు వెలుగుతూనే ఉండటం విశేషం.

అలాగే, అగ్నిదేవుని కృప ఈ పట్టణానికి రక్షగా ఉందని ఎన్నో కథనాలున్నాయి. సహస్రార్జునుడి తదనంతరం నిషాద రాజ్యం రాజు నిల మహిష్మతి రాజ్యాన్ని చేజిక్కించుకుని పరిపాలించాడు. కురుక్షేత్రయుద్ధం ముగిశాక ధర్మరాజు రాజయ్యాడు. భూమినంతా జయించడానికి యాగాన్ని ప్రారంభించాడు. అంతా ఆక్రమించుకున్నా, మహిష్మతి మాత్రం వీరి హస్తగతం కాలేదు. ధర్మరాజు తమ్ముడు సహదేవుడు అగ్నిదేవుడి రక్షణ వల్లే మహిష్మతి తమ హస్తగతం కావడం లేదని గుర్తించాడు. అగ్నిని ప్రసన్నం చేసుకుని, మహిష్మతిని తమ రాజ్యంలో కలిపేసుకున్నారు పాండవులు. అలా ఆర్యావర్తంలో మహిష్మతి ఈశ్వరుడి నామంతో మహేశ్వర్‌గా రూపుమార్చుకుంది.

దేవాలయాల రాజ్యం
సహస్రార్జునుడి మందిరం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. కాగా ఈ ఆలయ ప్రాంగణంలో రాజరాజేశ్వర మందిరం, కాశీ విశ్వనాథ, చతుర్భుజి నారాయణ, అహిల్యామాత, చింతామణి గణపతి, పండరినాథ్, భవానీ మాత, గోబర్‌ గణేశ్, అనంత్‌నారాయణ, ఖేడాపతి హనుమాన్, రామ– కృష్ణ, నర్సింగ్, కాళేశ్వర, జ్వాలేశ్వర మందిరాలున్నాయి. బాణేశ్వర్‌ శివ మందిరం నర్మదానది మధ్యలో ఉంటుంది. దీని వల్ల ఈ మందిరం ఓ ద్వీపంలో ఉన్నట్టు గోచరిస్తుంది.

వింధ్యవాసినీ శక్తిపీఠం
మహేశ్వర్‌లోని వింధ్యవాసినీ భవాని శక్తిపీఠాలలో ఒకటి అంటారు. ఏక్‌ ముఖి దత్త మందిరాన్ని ఇక్కడ కొత్తగా నిర్మించారు. దీన్ని శివదత్త ధామంగా పిలుస్తారు. 30 ఎకరాలలో సువిశాలంగా నిర్మించారు. జగద్గురు కృపాళూజీ మహారాజ్‌ వేవేల విధాలుగా మహేశ్వర్‌ దేవాలయాన్ని కీర్తిస్తూ అఖండ సంకీర్తనల్ని వెలువరించారు. జీవితమంతా మహేశ్వర్‌లోనే ఉన్నారు.

ఉత్సవాల కోలాహలం
అహిల్యాబాయి కోటలో కొంత భాగాన్ని ప్రాచీన హోటల్‌గా మార్చారు. మహేశ్వర్‌లో నాగపంచమి, గుడి పడవా, తీజ్, శ్రావణమాసంలో అన్ని సోమవారాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. చివరి సోమవారం మాత్రం కాశీవిశ్వనాథుని పూజ జరిపి భంగు (గంజాయి) ప్రసాదంగా పంచుతారు. మహాశివరాత్రి, సమోటి అమావాస్య, ఇతర అన్ని పండగలు విశేషంగా జరుపుతారు. ప్రతి ఏటా సంక్రాంతి ముందు వచ్చే ఆదివారం మహేశ్వర్‌లోని స్వాధ్యాయ భవన్‌ ఆశ్రమం మహా మృత్యుంజయ రథయాత్రను ప్రారంభిస్తుంది.

సినిమాలలో మహేశ్వర్‌!
నర్మద నదీ తీరప్రాంతమంతటా ఎన్నో ప్రకృతి అందాలు కొలువుదీరాయి. వీటిలో మహేశ్వర్‌లోని కోట ఘాట్లు, ప్రాకారాలు ప్రత్యేకమైనవి. ఈ కోట లోనూ, చుట్టుపక్కల ప్రాంతాలలో తరచూ హిందీ, తమిళ, కన్నడ సినిమాల చిత్రీకరణ జరుగుతుంటుంది. వీటిలో ప్రముఖంగా ఎ.ఆర్‌.రెహ్మాన్‌ మ్యూజిక్‌ వీడియో, ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘నీర్జా’ సినిమాలు, చారిత్రక టీవీ సీరియల్స్‌ ఇక్కడే చిత్రీకరించారు. నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడి వాతావరణం చలిగా, పొడిగా సందర్శనకు అనుకూలంగా ఉంటుంది.

దేశీయ చేనేత... మహేశ్వరి చీరలు
మహేశ్వర్‌ 5వ శతాబ్ది నుంచి చేనేతకు ప్రసిద్ధి గాంచింది. దేశంలోని చేనేతలలో ఉత్తమమైన వస్త్రంగా పేరొందింది. మహేశ్వర్‌ దేవాలయాన్ని సందర్శించి, విశేషాలు తెలుసుకోవడం ఒక ఎల్తైతే, ఆ పట్టణానికి మరో ప్రత్యేకత – రంగురంగుల మహేశ్వరి చీరలు. ఇవి కాటన్, పట్టులో లభిస్తాయి. చారలు, పువ్వుల అంచులతో చూడగానే ఆకట్టుకుంటాయి ఈ చీరలు.

మధ్యప్రదేశ్‌ టూరిజమ్‌ హనుమాంతియాలోని నర్మదానది డ్యామ్‌ బ్యాక్‌వాటర్‌లో ‘జల్‌ మహోత్సవ్‌’ పేరుతో రెండేళ్లుగా డిసెంబర్‌–జనవరి నెలల్లో ఉత్సవాలు జరుపుతోంది. ఈ సందర్భంగా హనుమాంతియాలోని టూరిస్ట్‌ కాంప్లెక్స్, మహేశ్వర్, ఓంకారేశ్వర్‌ల సందర్శనకు ప్రత్యేక ప్యాకేజీలను ఏర్పాటు చేసింది.

వివరాలకు: మధ్యప్రదేశ్‌ టూరిజమ్, టూరిస్ట్‌ ప్లాజా, బేగంపేట, హైదరాబాద్‌. 9866069000 / 9951080605లలో సంప్రతించవచ్చు.

ఇలా వెళ్లచ్చు!
హైదరాబాద్‌ నాంపల్లి, సికింద్రాబాద్‌ స్టేషన్‌ల నుంచి మ«ధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాకు రైలు సదుపాయం ఉంది. ఇక్కడ నుంచి మహేశ్వర్‌కు 120 కిలోమీటర్లు. రోడ్డుమార్గంలో వెళ్లడానికి బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి.
ఇండోర్‌లో దేవీ అహిల్యాబాయి హోల్కర్‌ పేరున అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడ నుంచి మహేశ్వర్‌కి 95 కిలోమీటర్లు.

–  నిర్మల చిల్కమర్రిSaturday, 10 December 2016

పళని మురుగన్కొండలలో కోటి జ్ఞానకాంతుల స్వామి పళని మురుగన్శివపార్వతుల గారాల తనయుడు, దేవసేనాధిపతి, తారకాసురుడనే రాక్షస సంహారానికి ఉద్భవించిన కారణజన్ముడు కార్తికేయుడు. సకల విద్యాపారంగతుడిగా, జ్ఞానప్రదాతగా, దండాయుధపాణిగా, నిత్యయవ్వనుడుగా సుబ్రహ్మణ్యేశ్వరునికి పేరుంది. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయాలకు, ఆయనను అర్చించే భక్తులకు తెలుగునాట కొదవలేనప్పటికీ తమిళనాడు, కర్ణాటకలలో మనకన్నా అధికంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి అడుగడుగునా గుడులు కట్టి పూజించడం సర్వసాధారణంగా కనబడుతుంటుంది. తమిళనాట గల ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యక్షేత్రం పళని. దండాయుధపాణిగా, బాలమురుగన్‌గా, పళని మురుగన్‌గా తమిళులు కొలిచే ఈ స్వామి ఆలయం ఎంతో ప్రముఖమైనదిగా, మహిమాన్వితమైనదిగా వాసికెక్కింది.

స్థలపురాణం:
వినాయకచవితినాడు మనందరం చెప్పుకునే కథ ఒకటుంది. అదేమంటే గణాధిపత్యం కోసం పోటీపడుతున్న కుమారులతో భూమండలంలోని అన్ని పుణ్యతీర్థాలలోనూ స్నానం చేసి, ఎవరు ముందుగా తమ వద్దకు వస్తారో, వారికే గణాధిపత్యమిస్తానని శివుడు చెప్పడం, ఆ మాట వినడంతోటే తన మయూర వాహనాన్ని అధిరోహించి, కుమారస్వామి వాయువేగంతో వెళ్లిపోవడం, వినాయకుడు తెలివి తేటలను ఉపయోగించి, నారాయణ మంత్రాన్ని పఠిస్తూ, మూడుమార్లు తన తల్లిదండ్రులైన శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఆ ప్రదక్షిణ మహిమతో కుమారస్వామి ఏ పుణ్యతీర్థానికేగినా అన్నగారే తనకన్నా ముందుగా వచ్చి పుణ్యతీర్థాలలో స్నానం చేసి వెళ్లిన ఆనవాళ్లు కనిపించి ఖిన్నుడై, కైలాసం వచ్చేసరికి, ఈ పరీక్షలో గణేశుడే నెగ్గాడంటూ గణాధిపత్యాన్ని వినాయకుడికే కట్టబెట్టడం.. ఆ ఆనందోత్సాహాలతో వినాయక చవితి పండుగ జరుపుకోవడం...

ఇంత వరకూ కథ అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఏం జరిగిందో, వినాయకచవితి రోజున తెలుసుకోవడానికి అవకాశం ఉండదు. అది ఇప్పుడు తెలుసుకుందాం.. అప్పుడు జరిగిన పరిణామానికి బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు ఎంతో బాధపడతాడు. తలిదండ్రుల మీద అలిగి, అన్నగారిలాగా తనకు కూడా పరిపక్వమైన జ్ఞానం లభించాలనే కాంక్షతో తన అలంకారాలన్నింటినీ వదిలేసి, భూలోకం వెళ్లి అక్కడ తనకు నచ్చిన ఒక కొండమీద గల ప్రశాంతమైన వాతావరణంలో తపస్సులో మునిగిపోయాడు. కైలాసంలో కుమారుని జాడ తెలియక పార్వతీదేవి బెంగపడుతుంది. పరమేశ్వరుడు పత్నిని ఊరడించి, ఆమెను వెంటబెట్టుకుని కొడుకుని వెతుకుతూ భూలోకానికి పయనమవుతాడు. ఇద్దరూ కలసి వెతుకుతుండగా, తమిళనాడులోని తిరు ఆవినంకుడి అనే ప్రదేశం వద్దకు రాగానే కొండశిఖరం బంగారు కాంతులతో మెరుస్తూ కనపడటంతో తమ కుమారుడు అక్కడే ఉన్నాడని తెలుసుకుంటారు.

తపోదీక్షలో ఉన్న పుత్రుని చేరదీసి, ముద్దాడుతూ, ‘నువ్వే నా జ్ఞానఫలానివిరా బంగారుకొండా!’ అంటూ పార్వతీ పరమేశ్వరులు కుమారుని అనుగ్రహిస్తారు. తల్లిదండ్రుల ఊరడింపుతో కుమారస్వామి అలకమానతాడు కానీ, ఆ ప్రదేశం తనకు ఎంతో నచ్చడంతో తన అంశను అక్కడే వదిలి, తలిదండ్రులతో తిరిగి కైలాసం చేరతాడు. ఇదీ పళని సుబ్రహ్మణ్యేశ్వరుని పురాగాథ. ఆ ప్రదేశమే ప్రస్తుతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తులు అర్చించే పళని ఆలయం. తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో మధురైకి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండ ప్రకృతి రమణీయకతకు పెట్టింది పేరు.

అన్ని విగ్రహాల్లాంటిది కాదు:
పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అన్ని విగ్రహాలలా రాతితో మలిచింది కాదు. నవపాషాణాలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దినది. ఈ నవ పాషాణాలనే తొమ్మిది విధాలైన మూలికలు అని కొందరంటారు, తొమ్మిది భయంకరమైన విషాలనూ ప్రత్యేకమైన పాళ్లలో కలిపితే అమృతం వంటి ఔషధం తయారవుతుందని, అందుకే దీనిని భోగార్ అనే ముని ఈ విగ్రహాన్ని ప్రత్యేకశ్రద్ధతో మలచాడని క్షేత్రపురాణం చెబుతోంది. ఈ ఆలయం దాదాపు పదహారు గంటలసేపు తెరిచే ఉంటుంది. అందరూ స్వామిని దర్శనం చేసుకునేందుకు వీలుగా గర్భాలయం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి.

ఈ మందిరం క్రీస్తుశకం 7వ శతాబ్దంలో కేరళ రాజు చీమన్ పెరుమాళ్ కట్టించగా, దానిని పాండ్యరాజులు పునరుద్ధరించారు.

అద్భుతమైన శిల్పసంపదతో, కేవలం కౌపీనం మాత్రమే కట్టుకుని, చేతిలో శూలాయుధం పట్టుకుని, చూడగానే ఆకట్టుకునే అందమైన విగ్రహంతో కనువిందు చేస్తాడు ఈ దేవసేనాని, దండాయుధ పాణి. కావడి మొక్కులంటే ఇష్టమట ఈస్వామికి. అంటే ఏదయినా ఆపద కలిగినప్పుడు తాము సమర్పించగలిగినదానిని కావిళ్లకొద్దీ సమర్పించుకుంటామని మొక్కుకుని, ఆపద తీరగానే, నియమ నిష్ఠలతో స్వామికి కావిళ్లలో కానుకలు మోసుకుంటూ నృత్యగానాలతో స్వయంగా సమర్పించుకుంటారు భక్తులు. తండ్రి అయిన శివునిలాగే ఈయన కూడా అభిషేక ప్రియుడు. కార్తికమాసంలో అయితే రోజుకు కనీసం 700 మార్లు భక్తుల అభిషేకాలందుకుంటాడు ఈ స్వామి. వల్లీ, దేవసేన ఆయన భార్యలు. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠిరోజున స్వామివారికి కన్నుల పండువగా కల్యాణోత్సవం జరుగుతుంది.

పర్యాటక స్థలాల పళని
పళని చుట్టూ బోలెడన్ని పర్యాటక స్థలాలున్నాయి. తిరునావినంకుడి ఆలయం, ఇదుంబన్ ఆలయం, పదగణపతి ఆలయం, తిరు అవినాకుడి ఆలయం, పెరియ నాయకి అమ్మన్ ఆలయం, పెరియన్ అవుడైయర్ ఆలయం, కన్నడి పెరుమాల్ ఆలయం, పళని కొండలు, పార్వతీదేవికి తల్లిగా పేర్కొనే మరియమ్మన్ ఆలయం, మురుగన్ విగ్రహ శిల్పి భోగర్ సమాధి ఆలయం, కురుంజి అందవార్ ఆలయం, లక్ష్మీనారాయణ పెరుమాళ్ ఆలయం ముఖ్యమైనవి. అసలు పళని కొండలే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్రకృతి అందాలను వీక్షిస్తూ పళని ఆలయాన్ని చేరుకోవాలంటే మెట్లమార్గంలో వెళ్లడం ఉత్తమం.

ఎప్పుడు వెళ్లాలి?
వాతావరణ పరిస్థితుల రీత్యా పళని వెళ్లేందుకు చలికాలమే అనకూలమని చెప్పాలి. ఎందుకంటే ఎండాకాలంలో విపరీతమైన వేడి ఉంటుంది. వర్షాకాలంలో కొండ ఎక్కడం కొంచెం కష్టమే. అదే చలికాలంలో అయితే హాయిగా వెళ్లవచ్చు. ప్రకృతి అందాలను తనివితీరా తిలకింవచ్చు. పళనిలో ప్రత్యేకమైన కొంగలు బారులు తీరుతాయి. నారాయణ పక్షులు, గోల్డెన్ వడ్రంగి పిట్టలు కనువిందు చేస్తాయి. వాటి కిలకిలరావాలతో మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తాయి. చలికాలంలోనే పళనిలో అనేక ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో కావడి ఉత్సవం, మార్గశిరశుద్ధ షష్ఠికి జరిగే కల్యాణోత్సవం ఒకటి.

వివాహం కానివారు, సంతానం లేనివారు, కుజదోషం ఉన్నవారు, రాహు, కేతు, కుజగ్రహదోషాలు ఉన్నవారు, కాలసర్పదోషం, నాగదోషం వగైరాలతో బాధపడేవారు పళని సుబ్రహ్మణ్యేశ్వరుని సందర్శించుకుని స్వాంతన పొందుతారు. అంతేకాదు, జ్ఞానప్రదాతగా పేరుగాంచిన సుబ్రహ్మణ్యేశ్వరుని బుద్ధిమాంద్యంతో బాధపడేవారు కన్నులారా సందర్శించుకుని ఆయా బాధలనుంచి విముక్తి పొందుతుంటారు.

ఎలా వెళ్లాలంటే..?
పళని సుబ్రహ్మణ్యేశ్వరాలయానికి వెళ్లడం సులువే. రైలు, బస్సు, విమాన మార్గాలున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి పళనికి నేరుగా బస్సులు, రైళ్లు ఉన్నాయి. రైలు మార్గం: పొల్లాచ్చి మీదుగా మధురై నుంచి కోయంబత్తూరు వెళ్లే రైలుంది. అలాగే తిరుచెందూరు నుంచి మధురై మీదుగా పళని వెళ్లేందుకు రైలుంది. చెన్నై సెంట్రల్ నుంచి పళని వెళ్లేందుకు ప్రత్యేకంగా రైలుంది. ఎలాగైనా పళని చేరుకుంటే అక్కడి నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో గల ఆలయాన్ని చేరుకోవడానికి ఆటోరిక్షాలు, బస్సులు విరివిగా ఉన్నాయి. వాయుమార్గం: పీలమేడు లేదా కోయంబత్తూరు, మధురై వరకు విమానంలో వెళ్తే అక్కడినుంచి పళనికి బస్సులు, రైళ్లు ఉన్నాయి.

D.V.R. భాస్కర్

Monday, 14 November 2016

సియాచెన్‌

ఆ మంచుకొండల్లో నీళ్లు దొరకవు!

ప్రపంచంలోకెల్లా ఎత్తైన భూభాగంలో ఉన్న యుద్ధభూమి సియాచెన్‌, భారత్‌-పాక్‌ దేశాలకు భౌగోళికంగా కీలకమైన భూభాగం. మధ్య ఆసియాను భారత ఉపఖండం నుంచీ పాక్‌ను చైనా నుంచీ వేరు చేసే ముఖ్య ప్రదేశమే సియాచెన్‌ గ్లేషియర్‌. గడ్డి మొక్క కూడా మొలవని కఠినమైన మంచు ప్రాంతమిది. అలాంటి ప్రదేశాన్ని సందర్శించే అరుదైన అవకాశం వచ్చిందంటూ ఆ విశేషాలను చెప్పుకొస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన పాలిక శ్రీనివాసరావు.

సముద్రమట్టానికి సుమారు 12 వేల అడుగుల నుంచి 23 వేల అడుగుల ఎత్తులోని శీతల ప్రదేశమే సియాచెన్‌. దాదాపు 76 కిలోమీటర్ల పొడవుగల ఈ హిమనీనదానికి పడమటన సాల్టొరొ రిడ్జ్‌, తూర్పున కారకోరం పర్వతశ్రేణి ఉన్నాయి. సరిహద్దుల్లోని ఈ గ్లేషియర్‌కోసం దాయాది దేశాలు నాలుగువేలమంది సైనికులను కోల్పోయాయి. బాల్టి భాషలో సియా అంటే గులాబీ జాతికి చెందిన ఓ మొక్క, చెన్‌ అంటే విరివిగా దొరికే ప్రదేశం. గ్లేషియర్‌కి కింది భాగంలో ఉన్న లోయల్లో ఆ ముళ్లపువ్వులు ఎక్కువగా పూస్తాయి కాబట్టి దీనికా పేరు వచ్చింది.

భారత ప్రభుత్వం సియాచెన్‌ సివిల్‌ ట్రెక్‌ను ఏటా ఆగస్టు, సెప్టెంబరుల్లో ఆర్మీ అడ్వెంచర్‌ వింగ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. సియాచెన్‌ సందర్శించాలనుకునే సామాన్య పౌరులకు ఇది ఒక్కటే మార్గం. ఇందులో 30-40 మంది పాల్గొనే అవకాశం ఉంటుంది. వివిధ రక్షణదళాలు, ఇండియన్‌ మౌంటెనీరింగ్‌ ఫెడరేషన్‌లు ఎంపిక చేసిన ఔత్సాహికులకు ఇందులో పాల్గొనే అవకాశం కల్పిస్తారు. సివిల్‌ట్రెక్‌- 2015లో పాల్గొనేందుకు భారతీయ రైల్వేల తరపున మేం ఎంపిక అయ్యామని తెలుసుకున్న వెంటనే మా ప్రయాణానికి కావలసినవి ఏర్పాటుచేసుకున్నాం. దిల్లీ నుంచి లేహ్‌కి విమానంలో ప్రయాణించాం.

లేహ్‌ నుంచి శిక్షణ మొదలు... 
హిమాలయాల మీదుగా విమానప్రయాణం నయనానందకరం. హిమశిఖర సౌందర్యాన్ని ఎన్నిసార్లు చూసినా తనివితీరదు. దేశంలోని వివిధ నగరాల నుంచి ఎంపిక అయిన మొత్తం 36 మందికీ మిలటరీ అధికారులు కెప్టెన్‌ అభిషేక్‌, కెప్టెన్‌ అర్పిత్‌ ఖెరా, కెప్టెన్‌ స్వాతి స్నెగర సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సాహసయాత్ర లేహ్‌లో 11,562 అడుగుల ఎత్తులో మొదలై సియాచెన్‌ బేస్‌ క్యాంప్‌ మీదుగా కుమార్‌ పోస్టు వరకూ అంటే 16,000 అడుగుల ఎత్తు వరకూ ఉంటుంది. శిక్షణ మూడు విడతలుగా ఉంటుంది. సెప్టెంబరు 15- 21 వరకూ తేలికపాటి వ్యాయామాలూ నడకా చేయించారు. మొదటి రెండు రోజులూ హోటల్‌కే పరిమితమయ్యాం. తరవాత శాంతిస్తూపం, వార్‌ మెమోరియల్‌, జొరావర్‌ సింగ్‌కోట, కాళీమాత గుడి, పత్తర్‌ సాహిబ్‌ గురుద్వారా, మాగ్నటిక్‌ హిల్‌, డిక్సే మొనాస్ట్రీ... ఇలా లేహ్‌లో సందర్శించదగ్గవన్నీ చూశాం.


20 నిమిషాలకు మించి ఉండలేం! 
లేహ్‌ నుంచి 40 కిలోమీటర్ల దూరంలోగల కర్దుంగ్‌ లా పాస్‌ 18,379 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మోటారు వ్యవస్థ కలిగినటువంటి ప్రదేశం. లేహ్‌లో టూరిస్టులు అత్యధికంగా సందర్శించే ప్రదేశమిదే. అక్కడ ఆక్సిజన్‌ అందక ఇబ్బందిపడే అవకాశం ఉంది. 20 నిమిషాలకు మించి ఉండకూడదు. మేం అక్కడ దొరికే బుల్లెట్‌ వాహనాలు అద్దెకు తీసుకుని ఈ ప్రాంతాన్ని సందర్శించాం. మేం వెళ్లినప్పుడు మంచు కురుస్తోంది. అయినా అలాగే తడుస్తూ వెళ్లి ఫొటోలు తీసుకున్నాం. తరవాత వైద్యపరీక్షలు చేశారు. ప్రతిరోజూ బీపీ, నాడి, ఆక్సిజన్‌ శాతం చెక్‌ చేస్తారు. ఇవి స్థిరంగా ఉండాలి. అందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. మంచినీళ్లు రోజుకి ఐదారు లీటర్లు తాగాలి. లేహ్‌లో ఆరోగ్య పరీక్షలో నలుగురు ఉత్తీర్ణులు కాలేకపోయారు.


బూట్ల బరువే మూడు కిలోలు! 
రెండో విడత శిక్షణ కోసం సెప్టెంబరు 22 ఉదయాన్నే సియాచెన్‌ బేస్‌క్యాంప్‌నకు బయలుదేరాం. వర్షంవల్ల దారిపొడవునా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. నీటి ప్రవాహం కొన్నిచోట్ల ఎక్కువగా ఉండటంవల్ల మా వాహనాలు పలుమార్లు ఇరుక్కుపోవడం జరిగింది. వాటిని మిలటరీ వాహనాలకు కట్టి తాళ్లతో బయటకు తీశారు. 210 కిలోమీటర్ల ప్రయాణించడానికి 13 గంటలు పట్టింది.

ఈ ప్రయాణం లేహ్‌ నుంచి సౌత్‌పుల్లు, కర్దుంగ్‌ లా పాస్‌, నార్త్‌పుల్లు, కర్దుంగ్‌ గ్రామం, సుముర్‌, పనమిక్‌, ససోమా, దర్శి గ్రామాల మీదుగా నుబ్రా లోయలోకి సాగుతోంది. నుబ్రాలోయ అందాలు ఎంత చూసినా తనివి తీరదు. ఒకవైపు ష్యోక్‌ నది, మరోవైపు పర్వతాలూ కొంతదూరం ఎడారి వాతావరణం కనువిందు చేస్తాయి.

సియాచెన్‌ బేస్‌క్యాంప్‌ను గ్లేషియర్‌ ముఖద్వారం వద్ద ఉన్న కొండల మధ్యలో నిర్మించారు. మేం అక్కడకు చేరుకునేసరికి విపరీతమైన చలి... బేస్‌క్యాంప్‌ నుబ్రా నది ఒడ్డున 12 వేల అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ నుంచి ప్రయాణం మరింత కఠినంగా ఉంటుందని అర్థమైంది. అనుకున్నట్లుగానే సెప్టెంబరు 22-28 వరకూ ఇచ్చిన శిక్షణ చాలా కఠినంగా ఉంది. దీన్ని తట్టుకోవడం సాధారణ వ్యక్తులకు ఒకింత కష్టమే అయినా గ్లేషియర్‌కి వెళ్లాలనే కుతూహలం ప్రతి ఒక్కరినీ ఉత్సాహంగా పాల్గొనేలా చేసింది. బేస్‌ క్యాంప్‌ దగ్గరే ఖరీదైన మౌంటెనీరింగ్‌ పరికరాలు ఇచ్చారు. బూట్లు కనీసం మూడు కిలోల బరువు ఉన్నాయి. మంచుమీద నడవడానికి ఈ బూట్లకింద క్రాంపాన్లు ధరించాలి. అవి మరో అరకిలో బరువు. రెండో విడత శిక్షణ ఈ రకమైన సామగ్రికి అలవాటు పడ్డానికే ఉంటుంది. ఎత్తు ప్రదేశాల్లో వచ్చే వ్యాధుల గురించి డాక్టర్‌ వివరించారు. అవలాంచె వస్తే తప్పించుకునే పద్ధతి గురించీ అందులో తప్పిపోయినవాళ్లను వెతికే పద్ధతుల గురించీ వివరించారు. ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి. ముందు ఎలాంటి బరువూ లేకుండా కొండ ఎక్కడం, దిగడం చేశాం. మూడోరోజు నుంచి పది కిలోల బరువుతో ఎక్కాల్సి వచ్చింది. కొండ దిగి రాగానే రాక్‌ క్రాఫ్టింగ్‌, ఐస్‌ క్రాఫ్టింగ్‌లో శిక్షణ ఇచ్చారు. ఇది చాలా క్లిష్టమైనది. వాలుల్లో మంచు దాటడానికి ఉపయోగపడుతుంది.

శీతాకాలంలో -60 డిగ్రీలు! 
సియాచెన్‌ గ్లేషియర్‌ దగ్గర ఏడాదిపొడవునా కాపలా ఉండాల్సిందే. ఏ క్షణాన ఏ ప్రమాదం ఎటునుంచి ముంచుకు వస్తుందో తెలియదు. ప్రత్యర్థులనుంచే కాదు, ప్రకృతి నుంచీ కావచ్చు. గాలులు గంటకి 125 కిలోమీటర్ల వేగంతో వీస్తుంటాయి. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు -60 డిగ్రీలకు పడిపోతుంటాయి. ఇక్కడ ప్రధాన శత్రువు ప్రకృతే. మంచువాన 30 అడుగుల మేర కురుస్తుంటుంది. రాత్రివేళ కురిసే మంచును ఇద్దరు వ్యక్తులు ఎప్పటికప్పుడు తీసేస్తుంటారు. లేదంటే అందులోనే కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఫ్రాస్ట్‌బైట్‌, స్నోబ్లైండ్‌నెస్‌, సెరిబ్రల్‌ ఈడెమా లాంటి వ్యాధులు వస్తాయి. రాత్రంతా సుఖంగా నిద్రపోవడం అరుదు. ఒక్కసారి మెలకువ వస్తే తిరిగి నిద్రపట్టదు. ఇక్కడ ఉండి తిరిగివెళ్లే సైనికులు కనీసం 15 శాతం బరువు కోల్పోతారు. మనకి నీళ్లు లేందే నిమిషం గడవదు. కానీ సియాచెన్‌లో నీళ్లే దొరకవు. మంచుని పగులకొట్టి వేడి చేసుకోవాల్సిందే. ఈ వేడి ఎక్కువసేపు ఉండదు. త్వరగా చల్లబడిపోతుంది. మళ్లీ మళ్లీ వేడిచేసుకోవాల్సిందే.


సెప్టెంబరు 30న మూడో విడత శిక్షణ కోసం నార్త్‌పుల్లు చేరుకున్నాం. ఇది 15,380 అడుగుల ఎత్తులో ఉంటుంది. బేస్‌క్యాంప్‌తో పోలిస్తే ఇక్కడ సౌకర్యాలు తక్కువే. గ్లేషియర్‌లోకి వెళ్లే సైనికులు కూడా శిక్షణ అనంతరం ఎత్తు ప్రదేశాల్లో అలవాటు పడ్డానికి ఇక్కడికి రావలసి ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్‌ సరిగ్గా అందదు. చలి కూడా విపరీతంగా ఉంటుంది. ఇక్కడ కూడా మరో నలుగురు వైద్యపరీక్షలు దాటలేకపోయారు. అక్టోబరు 3న తిరిగి బేస్‌క్యాంప్‌నకు చేరుకున్నాం.

ఇరవై రోజుల నుంచీ ఆతృతగా ఎదురుచూసిన రోజు ఎట్టకేలకు వచ్చింది. పూర్తిస్థాయి ఆర్మీ దుస్తులు ధరించి గ్లేషియర్‌కి వెళ్లడానికి సిద్ధమయ్యాం. గ్లేషియర్‌కి వెళ్లే ప్రతి సైనికుడూ అధికారులూ ముందుగా దర్శించుకునేది ఒ.పి బాబా మందిర్‌. దారిలో ఎలాంటి అడ్డంకులూ ఎదురుకాకుండా చూడమని కోరుకుంటారు. 1980లలో మాలాన్‌ పోస్ట్‌లో ఓం ప్రకాశ్‌ అనే సైనికుడు ఒంటరిగా పాక్‌ సైనికులతో పోరాడి అమరుడయ్యాడు. అప్పటినుంచి ఆయన్ని దేవుడిగా కొలుస్తారు.

ఎంత బరువైనా మోస్తారు..! 
గ్లేషియర్‌లో నడిచేటప్పుడు అందరూ రోప్‌-అప్‌ విధానంలో తాళ్లతో అనుసంధానించి వెళ్లాల్సి ఉంటుంది. మేం 24 మంది ఉన్నాం. 42 మంది పోర్టర్లూ నలుగురు అధికారులూ నలుగురు సైనికులూ, హాఫ్‌ లింక్‌ కమాండర్‌ (ఇతను సగం దారివరకూ పోర్టరు సాయంతో వస్తాడు. తరవాత మరో హాఫ్‌ లింక్‌ కమాండర్‌కి అప్పగిస్తాడు) మావెంట వచ్చారు. సియాచెన్‌లో కొందరు స్థానికులు పోర్టర్లుగా సైనికులతోబాటు తమ సేవలు అందిస్తున్నారు. ఇక్కడి వాతావరణం తట్టుకోవడం వీళ్లకి చాలా సులభం. మాతో వచ్చిన పోర్టర్లు కుమార్‌ పోస్టు వరకూ మా లగేజీ మెడికల్‌ కిట్లూ మిగిలిన సరంజామా అంతటినీ చేరవేశారు. ఎంత బరువుతోనైనా పరుగులాంటి నడక వీరి సొంతం.


బేస్‌ క్యాంప్‌ నుంచి కుమార్‌ పోస్టు వరకూ మధ్యలో 3 ట్రాన్సిట్‌ క్యాంపులు ఉన్నాయి. గ్లేషియర్‌పైకి వెళ్లి తిరిగి వచ్చే సైనికులకు ఆహారపానీయాలు, రాత్రి బస ఏర్పాటు చేయడం వీళ్ల ముఖ్య ఉద్దేశం. సాధారణంగా ఇక్కడ నలుగురైదుగురు సైనికులూ వాళ్లకు సహాయ పోర్టర్లూ మాత్రమే ఉంటారు. సియాచెన్‌ బేస్‌ క్యాంప్‌ నుంచి మొదటి ట్రాన్సిట్‌ క్యాంప్‌కి 12 కి.మీ., అక్కడ నుంచి రెండో క్యాంప్‌కి 14 కి.మీ., మూడోక్యాంప్‌కి 16 కి.మీ., కుమార్‌ పోస్టుకి 18 కి.మీ. దూరం ఉంటుంది. బేస్‌క్యాంప్‌ నుంచి క్యాంప్‌-1కి మధ్యలో క్రేవేసెస్‌ ఎక్కువగా ఉన్నాయి. సుమారు 40-50 అడుగుల వెడల్పు ఉండే ఈ గుంతల్ని దాటడానికి నిచ్చెనలు వేశారు. వీటిని జాగ్రత్తగా దాటాల్సి వచ్చింది. తరవాత క్యాంప్‌-2 వరకూ ప్రయాణించాం. ఇందులో 6 కి.మీ. అచ్చంగా మంచుమీదే నడిచాం. మిగిలిన దారంతా పెద్ద పెద్ద రాళ్ల మధ్యే నడవాల్సి వచ్చింది. తెచ్చుకున్న నీళ్లు త్వరగా అయిపోయి విపరీతంగా అలసిపోయేవాళ్లం.

క్యాంప్‌-2 నుంచి క్యాంప్‌-3 వరకూ ఉన్న దారి ఏటవాలుగా ఉంది. ఎంత నడిచినా తరగదు. క్యాంప్‌-3 నుంచి కుమార్‌ పోస్టు దూరం ఎక్కువైనా మిగతా దారులతో పోలిస్తే ఒకింత సులువే. కుమార్‌ పోస్టు దగ్గర నుంచి సియాచెన్‌ గ్లేషియర్‌ను ఆసాంతం ఆస్వాదించి వెనుతిరిగాం. ఈ మూడు క్యాంపుల్లో మాకోసం విడిగా టెంట్‌లు ఏర్పాటుచేశారు. రుచికరమైన భోజనం పెట్టారు.

పోస్టుల్లో ఉండే సైనికులు పెరిగిన గడ్డాలతో నలుపురంగులోకి మారిన దుస్తులతో ఖైదీల్లా కనిపిస్తారు. తమ కుటుంబాలను ఎప్పుడెప్పుడు చూస్తామా అన్నట్లు ఉన్నారు. ఇక్కడ ఉండేవాళ్లు ప్రతి పనీ తామే చేసుకుంటారు. పర్వతాలు అన్నీ నేర్పిస్తాయన్నది నిజం. అక్టోబరు 12న తిరిగి బేస్‌క్యాంప్‌నకు చేరుకుని బాబాకు కృతజ్ఞతలు చెప్పి మాకు ఇచ్చిన పర్వతారోహణ సామగ్రి తిరిగి ఇచ్చి 13న లేహ్‌కి తిరిగి చేరుకున్నాం. 14న మాకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. నెలరోజుల తరవాత లేహ్‌ విమానాశ్రయంలో తిరుగుప్రయాణమయ్యాం.

చిదంబరం

ఇదే... చిదంబర రహస్యం!
‘‘ ‘ఆంగికం భువనం యశ్య వాచికం సర్వవాజ్ఞ్మయం ఆహార్యం చంద్ర తారాది తంవందే సాత్వికం శివం’ అంటూ నటరాజస్వామిని ఆరాధిస్తుంటాం. ఆ రూపాన్ని కళ్లారా చూడాలన్న కోరికతో ఇటీవలే చిదంబర క్షేత్రాన్ని దర్శించి వచ్చాం’’ అంటూ ఆ ఆలయ విశేషాలు చెప్పుకొస్తున్నారు వైజాగ్‌కు చెందిన బొమ్మకంటి పద్మావతి.చిదంబరంలో దిగగానే నేరుగా నటరాజస్వామి దేవాలయానికే వెళ్లాం. ఆలయం చుట్టూ తిలై అనే రకం చెట్లున్నాయి. అందుకే దీన్ని తిలై చిదంబరం అంటారు. దీని అసలు పేరు చితాంబళం. క్రమంగా చిదంబరంగా మారింది. చిత్‌ అంటే మనస్సు. అంబళం అంటే ఆకాశం. ఆకాశానికి సంబంధించిన జ్ఞాన ప్రదేశమని అర్థం. అందుకే దీన్ని చిదాకాశం అనీ పిలుస్తారు. 


పట్టణం మధ్యలోని 40 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయంలో నటరాజు, శివకామి అమ్మన్‌, గణపతి, గోవిందరాజ పెరుమాళ్‌, మురుగన్‌లు కొలువై ఉన్నారు. ప్రాంగణంలో మొత్తం ఐదు మండపాలు ఉన్నాయి. మొదటిది చిత్‌ అంబళం. ఇందులో నటరాజస్వామి, ఆయన అర్ధాంగి శివకామ సుందరి కొలువై ఉంటారు. దీనికి ఎదురుగా ఉన్నదే పొన్‌ అంబళం లేదా కనకసభ. తరవాతది 56 స్తంభాలున్న నృత్యమండపం. నాలుగోది రాజసభ లేదా వెయ్యిస్తంభాల మండపం. వెయ్యి రేకుల పద్మం(సహస్రారామం)గుర్తుగా చెప్పే ఈ హాలుని ఉత్సవ సమయాల్లోనే తెరుస్తారు. దేవసభగా పిలిచే ఐదో మండపంలో పంచమూర్తులైన గణేశుడు, సోమస్కంద, శివానంద నాయకి, మురుగన్‌, చండికేశ్వరులు కొలువై ఉన్నారు. 


నటరాజస్వామి! 
చిదంబరం స్వయంభూక్షేత్రం. పంచభూత క్షేత్రాల్లో ఒకటి. దీన్నే ఆకాశలింగ క్షేత్రమనీ అంటారు. ఇక్కడ ఈశ్వరుడు ఆనంద తాండవరూపంలో నటరాజస్వామిగా దర్శనమిస్తాడు. పూర్వకాలంలో వారణాసి నుంచి వ్యాఘ్రపాదుడు అనే యోగి వచ్చి ఇక్కడ స్వయంభూలింగం కలదనీ అది కూడా నటరాజ రూపంలో ఉన్నదనీ గుర్తించాడట. ఈ యోగి పులిచర్మాన్ని ధరించేవాడట. అందుకే వ్యాఘ్రపాదుడని పేరు. ఇక్కడ శివుడు చేసే ఆనందతాండవాన్ని చూడ్డానికి శ్రీమహావిష్ణువూ, ఆయన వెంట ఆదిశేషుడు పతంజలి రూపంలో దేవాలయానికి వచ్చేవారట. ఆలయకుడ్యాలమీద చిత్రించి ఉన్న ఆ ఇద్దరి చిత్రాలూ అందుకు సాక్ష్యాలుగా నిలుస్తాయి.ఆలయానికి పశ్చిమదిశలో ఉన్న గోపురంమీద సూర్యతేజస్సుగల సింహముఖం ఉంది. తూర్పుదిక్కున ఉన్న గోపురంమీద సోమస్కందుడి రూపం కనిపిస్తుంది. దీన్నే శివశక్తి స్వరూపంగా భావిస్తారు. దక్షిణ గోపురంమీద మార్కండేయుణ్ణి కాపాడే ఈశ్వరుణ్ని యమస్వరూపంగా చెబుతారు.


12, 13వ శతాబ్దాల్లో ఈ ఆలయాన్ని చోళులు, పల్లవులు, చేర రాజులు అభివృద్ధిపరిచినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. అయితే ఆధునిక శాస్త్రజ్ఞులు ఈ ఆలయానికి సంబంధించి అనేక విషయాలు గుర్తించారు. మానవదేహానికీ ఈ దేవాలయ నిర్మాణానికీ దగ్గర పోలికలు ఉన్నాయట. 

చిదంబరం ఓ అద్భుత శక్తి క్షేత్రం. దీనికి అయస్కాంతశక్తి ఉందనీ భూమధ్యరేఖలోని బిందువు, ఈ నటరాజ విగ్రహంలోని కాలిబొటనవేలుని సూచిస్తుందనీ చెబుతారు. ఆకాశలింగం(చిదంబరం), వాయులింగం (కాళహస్తి), భూలింగం(కాంచీపురం), అగ్నిలింగం(తిరువణైక్కవల్‌), జలలింగం (తిరువణ్ణామలై) అనే పంచభూతలింగాల్లో 1, 2, 3 దేవాలయాలను ఒకే సరళరేఖలో 79 డిగ్రీల 41నిమిషాల తూర్పు అక్షాంశంమీద నిర్మించారు. అందుకే దీన్ని ఓ ఖగోళ, భౌగోళిక అద్భుతంగా చెబుతారు. 

చిదంబరం ఆలయానికి మన శరీరంలోని నవ రంధ్రాల మాదిరిగానే 9 ద్వారాలు ఉన్నాయి. ఈ దేవాలయంలోని ఓ గోపురాన్ని 21,600 బంగారు రేకులతో కప్పారు. ఇది ఒకరోజుకి మనిషి శ్వాసలోని ఉచ్ఛ్వాస, నిశ్వాసాల సంఖ్యతో సమానం. ఆ రేకుల్ని తాపడం చేయడానికి ఉపయోగించిన బంగారు మేకుల సంఖ్య 72 వేలు. యోగశాస్త్ర ప్రకారం మనిషి శరీరంలోని నాడుల సంఖ్యా అంతే. మన శరీరంలో ఎడమవైపు గుండె ఉండే ప్రదేశంలానే ఇక్కడ అమ్మవారి విగ్రహం ఎడమచేతి వైపునకు తిరిగి ఉంటుంది. దీనికి పక్కనే ఉన్న నాలుగు స్తంభాల మండపం నాలుగు వేదాలకూ ప్రతీక. శివపూజలో జరిగే 28 కైంకర్యాలని సూచిస్తూ శివకామసుందరి అమ్మవారి ప్రాంగణంలో 28 స్తంభాలు ఉంటాయి. వీటిమీద 64 కళలకూ గుర్తుగా 64 బీములు ఉంటాయి. బంగారు తాపడం కలిగిన గోపురంమీద ఉన్న నవ కలశాలూ నవశక్తులకి సంకేతాలు. అర్ధమండపానికి ఆనుకుని ఉన్న మండపంలోని 18 స్తంభాలు అష్టాదశ పురాణాలకు ప్రతీక. 


చిదంబర రహస్యం! 
ఈ ఆలయంలో స్వామి నటరాజ రూపం, ఇదీ అని చెప్పలేని చంద్రమౌళీశ్వర స్ఫటికలింగ రూపం, ఏ రూపమూలేని దైవసాన్నిధ్యం అనే మూడు స్వరూపాల్లో దర్శనమిస్తాడు. మూడో రూపమే చిదంబర రహస్యం.. గర్భాలయంలోని వెనకగోడమీద ఓ చక్రం గీసి ఉంటుందట. దానిముందు బంగారు బిల్వ ఆకులు వేలాడుతుంటాయి. అవేమీ కనిపించకుండా ఓ తెర కట్టి ఉంటుంది. అర్చకులు ఆ తెరను నామమాత్రంగా తొలగించి చూపిస్తారు. ఆ ప్రదేశాన్నే శివోహంభవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం. భవ అంటే మనసు... ఆ దైవంలో మనసు ఐక్యం అయ్యే ప్రదేశం. అంటే అక్కడ ఏ రూపం లేకుండానే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ ఆ దైవ సాన్నిథ్యాన్ని అనుభూతించడమే ఈ క్షేత్ర ప్రాశస్త్యం... అదే చిదంబర రహస్యం. 


ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే నటరాజస్వామిని దర్శించి బయటకు వచ్చి వెనుతిరిగిచూస్తే ఆలయ గోపురం వెనుకనే వస్తున్న అనుభూతి కలుగుతుంది. అనేక విశిష్టతలున్న చిదంబర క్షేత్రాన్ని దర్శించుకుని తాదాత్మ్యంతో తిరిగివచ్చాం.

టాంజానియా సఫారీ

ఆ సమయంలో.. లక్షల జంతువులు చనిపోతాయట!

‘వందల సంఖ్యలో క్రూర జంతువుల్నీ వేల సంఖ్యలో వన్యప్రాణుల్నీ అతి దగ్గరగా చూడాలంటే టాంజానియాలో సఫారీకి వెళ్లాల్సిందే...’ అంటూ అక్కడి విశేషాలను కళ్లకు కట్టినట్లుగా వివరిస్తున్నారు విశాఖపట్టణానికి చెందిన చెన్నూరు కామేశ్వరరావు.

మా కూతురూ అల్లుడూ టాంజానియా వాణిజ్య రాజధాని ధర్‌-ఎ-సలామ్‌లో నివసిస్తుండటంతో అక్కడకు వెళ్లాం. బంధుమిత్రులతో కలిసి ముందుగా సఫారీ చూడాలనుకున్నాం. ఉదయం ఆరు గంటలకి ధర్‌-ఎ-సలామ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కిలిమంజారోకు బయలుదేరాం. గంటన్నరలో అక్కడ దిగాం. ఇది ఆఫ్రికా ఖండ వన్యప్రాణుల నివాసానికి ముఖద్వారం లాంటిది. దిగేముందు మాకు విమానంలోంచి ఓ అద్భుత దృశ్యం కనిపించింది. అదే కిలిమంజారో... ఇది ఆఫ్రికాలోకెల్లా ఎత్తైనదే కాదు, ప్రపంచంలోకెల్లా విడిగా ఉన్న ఎత్తైన పర్వతం కూడా. ఎత్తు సముద్రమట్టం నుంచి 19,341 అడుగులు. ఈ పర్వతం మీద మూడు అగ్నిపర్వత శిఖరాలు ఉన్నాయి. ఇవి మంచుతో కప్పబడి తెల్లగా మెరుస్తున్నాయి.
ఎత్తైన మాసైలు! 
మేం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చేసరికి స్వాగతం పలకడానికి ట్రావెల్‌ గైడ్‌ కమ్‌ డ్రైవర్‌ మాకోసం ఎదురుచూస్తున్నాడు. మా లగేజీతో సహా మేం సఫారీ వాహనంలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుషాకు బయలుదేరాం. అక్కడ ట్రావెల్‌ ఆఫీస్‌కు చేరుకుని మాతో తెచ్చుకున్న ఫలహారం తిని గొరొంగొరొ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి బయలుదేరాం. ఇది అరుషాకు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడకు చేరేసరికి మధ్యాహ్నం 12.30 అయింది. ప్రవేశరుసుము ఒక్కొక్కరికి 50 డాలర్లు. ఇది ఎత్తైన ప్రదేశంలో ఉండటంతో వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇక్కడ ఏప్రిల్‌- జూన్‌ను గ్రీన్‌ సీజన్‌గా పిలుస్తారు. జూన్‌, జులై నెలలు చాలా చల్లగా ఉంటాయి. నవంబరు, డిసెంబరుల్లో వర్షాలు ఎక్కువ.ప్రధాన ద్వారం నుంచి వన్యప్రాణులు ఉండే ప్రాంతానికి చేరుకోవడానికి సుమారు గంటన్నర సమయం పట్టింది. అక్కడ మమ్మల్ని సఫారీ వాహనంలోకి ఎక్కించారు. మాకు దారిలో పశువులు కాస్తోన్న ఆఫ్రికన్‌ కొండజాతివాళ్లు కనిపించారు. వాళ్లు నల్లగా పొడవుగా వింత వస్త్రధారణతో కనిపిస్తారు. వాళ్లే మాసైలు. వీళ్లు ఈ ప్రాంతానికి దగ్గరలోనే నివాసం ఉంటారు.

గొరొంగొరొ ఒకప్పుడు కిలిమంజారోకన్నా ఎత్తైన అగ్నిపర్వతం. సుమారు 30 లక్షల సంవత్సరాల క్రితం అది బద్దలవడంతో భూమికి 2000 అడుగుల లోతుకు కుంగిపోయింది. ఇలా కుంగిపోయిన నేలభాగం 100 చదరపు మైళ్ల వరకూ విస్తరించి ఉంది. దీన్నే అగాథం అంటారు. ఇది సముద్రమట్టానికి 5,900 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ప్రాంతం అంతా దట్టమైన పచ్చని గడ్డితో ఉంటుంది. ఇక్కడ ఏడాది పొడవునా నీటి వనరులు ఉంటాయి. అందుకే ఇక్కడ అన్ని జాతులకూ చెందిన వన్యప్రాణులూ కలిసి మొత్తం ముప్ఫైవేలకు పైగా నివసిస్తున్నాయి. మా సఫారీ వాహనం నుంచి బిగ్‌ ఫైవ్‌గా పిలిచే సింహాలనూ పులులనూ, చిరుతలనూ ఏనుగులనూ, రైనాలనూ చూశాం. మధ్యాహ్నం మా వాహనాన్ని ఓ సురక్షిత ప్రాంతంలో నిలిపి, మాతో తెచ్చుకున్న భోజనం చేశాక, మా సఫారీ ప్రయాణం మళ్లీ మొదలైంది. వందలకొద్దీ అడవి దున్నలూ జీబ్రాలూ జింకలూ జిరాఫీలూ నక్కలూ అడవి పిల్లులనూ చూశాం. ఇన్ని రకాల జంతువులు స్వేచ్ఛగా మా వాహనానికి అతి దగ్గరగా తిరుగుతుంటే మాకు ఎంతో ఆనందం వేసింది. వాటిని మా కెమెరాల్లో వీడియోల్లో బంధించాం. తరవాత ఇక్కడే ఉన్న ‘మగాడి’ అనే సరస్సు దగ్గరకు వెళ్లాం. అది సుమారు 400 రకాల జాతులకు చెందిన పక్షులకు నివాసయోగ్యంగా ఉంది. అయితే మిగిలిన వాటికన్నా ఫ్లెమింగోల సంఖ్యే ఇక్కడ ఎక్కువ. కొన్ని వేల సంఖ్యలో గుంపులుగుంపులుగా సరస్సులో తిరిగే ఈ పక్షులు నయనానందకరంగా ఉన్నాయి. ఇలా సఫారీ వాహనంలో సాయంత్రం ఐదు గంటలవరకూ విహరించాం. ఈ సఫారీకి ఏటా ఐదు లక్షల మంది విహారయాత్రకు వస్తారట.
రెస్టారెంటులో పుట్టినరోజు! 
తరవాత క్రేటర్‌ అంచున అంటే రెండు వేల అడుగుల ఎత్తులో ఉన్న కొండమీద ఉన్న సోపా లాడ్జికి బయలుదేరాం. అక్కడకు చేరుకోవడానికి సుమారు గంటన్నర సమయం పట్టింది. లాడ్జికి చేరుకోగానే ప్రవేశద్వారం దగ్గరే మాకు సాదర స్వాగతాలు లభించాయి. సిబ్బంది మా అందరినీ కరీబు(స్వాగతం), జాంబో(బాగున్నారా) అంటూ పలకరించారు. ముఖం తుడుచుకోవడానికి గోరువెచ్చని నాప్‌కిన్‌లూ వెల్‌కమ్‌ డ్రింకులూ ఇచ్చి, మాకు కేటాయించిన కాటేజీలకు తీసుకెళ్లారు. ఓ స్టార్‌ హోటల్లో ఉన్న సదుపాయాలన్నీ ఆ కాటేజీలో ఉన్నాయి. రాత్రివేళ అప్పుడప్పుడూ ఏనుగులూ అడవిదున్నలూ హోటల్‌ ఆవరణలోకి వచ్చే ఆస్కారం ఉండటంతో, భద్రతా సిబ్బంది సహాయం లేకుండా బయటకు రాకూడదని లాడ్జివారు సలహా ఇచ్చారు. లాడ్జి రెస్టారెంట్‌లో భోజనంలో మాకు కావాల్సిన శాకాహార, మాంసాహార వంటకాలను ఉంచారు. హోటల్‌ సిబ్బంది, మేనేజర్లు కాటేజీలో ఉన్న సదుపాయాల గురించీ ఆహార పదార్థాల నాణ్యత గురించీ అనేకసార్లు అడిగి తెలుసుకున్నారు. భోజనం చేసేటప్పుడు అక్కడ ఓ దృశ్యం మమ్మల్ని ఆకర్షించింది. ఆ రోజు రెస్టారెంట్‌కు హాజరైన అతిథుల్లో ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే వారికి తమదైన శైలిలో శుభాకాంక్షలు అందజేస్తారు. రెస్టారెంటు సిబ్బంది, వంటవాళ్లు మొత్తం 12 నుంచి 15 మంది ఒకే వరుసలో నడుస్తూ వాళ్ల స్వాహిలి భాషలో పాడుకుంటూ అతిథి ఉన్న టేబుల్‌ దగ్గరకు వెళ్లి అతనికి శుభాకాంక్షలు అందజేశారు. కేకు కోయించారు. ఆ సమయంలో రెస్టారెంట్‌లో లైట్లు ఆఫ్‌ చేసి కొవ్వొత్తుల వెలుతురు మాత్రమే ఉంచారు.

మర్నాడు ఉదయాన్నే టిఫిన్‌ తినడానికి రెస్టారెంట్‌కి వచ్చాం. రకరకాల డ్రైఫ్రూట్లూ పండ్లరసాలూ పండ్లూ పాలూ కార్న్‌ఫ్లేక్సూ... వంటివన్నీ ఏర్పాటుచేశారు. ఇంకా రకరకాల రొట్టెలూ గుడ్లతో చేసిన పదార్థాలను అక్కడ ఉంచారు. ఎనిమిది గంటలకు సెరెంగెటి అనే మరో సఫారీ ప్రయాణం మొదలైంది. లాడ్జివారు ఆ రోజు మధ్యాహ్నం భోజనాన్ని అట్టపెట్టెల్లో పార్సిల్‌ చేసి ఇచ్చారు.
సెరెంగెటి పార్కులో... 
గొరొంగొరొ నుంచి సెరెంగెటి సఫారీ సుమారు 200 కిలోమీటర్లు ఉంటుంది. సెరెంగెటికి వెళ్లే దారిలో కొన్ని వేల అడవి దున్నలూ జింకలూ వందలకొద్దీ జీబ్రాలూ పదుల సంఖ్యలో జిరాఫీలూ ఆస్ట్రిచ్‌లూ కనిపించాయి. వేలసంఖ్యలో అడవిదున్నలు ఒకే వరుసలో వెళ్లడం మాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. మేం సెరెంగెటి ప్రవేశద్వారానికి చేరేసరికి మధ్యాహ్నం 12 గంటలు అయింది. అక్కడ ప్రవేశ రుసుము తలకి 50 డాలర్లు. టాంజానియాకి వాయువ్యదిశ నుంచి కెన్యా సరిహద్దులోని ఉత్తరం వరకూ అంటే సుమారు 15 వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన ఈ పార్కు మొత్తం దట్టమైన పొడవాటి గడ్డి పరచుకుని ఉంటుంది. సెరెంగెటి అనే పదం మాసై భాష నుంచి వచ్చింది. అంటే అంతులేని మైదానం అని అర్థం. ముందుగా సింహాలూ చిరుతలూ ఉన్న ప్రదేశానికి బయలుదేరాం. అక్కడ అవి చాలా కనిపించాయి. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు పార్కు ప్రవేశద్వారం దగ్గర ఉన్న కన్జర్వేషన్‌ ఆఫీసుకి వచ్చి, అక్కడ చెట్ల కింద ఏర్పాటుచేసిన బల్లల దగ్గర కూర్చుని భోజనం చేశాం. మళ్లీ రెండున్నరకు మా సఫారీ ప్రయాణం మొదలు... ఇప్పుడు సెరెంగెటి ఉత్తర భాగానికి బయలుదేరాం. అక్కడ ఆఫ్రికన్‌ ఏనుగులూ జిరాఫీలూ ఉన్నాయి. పెద్ద చెవులూ దంతాలూ కలిగి ఉన్న ఆఫ్రికన్‌ ఏనుగులు గుంపులుగుంపులుగా విహరిస్తున్నాయి. ఓ చోట రెండు ఏనుగులు తొండంతో పోట్లాడుకోవడం కనిపించింది.

ద గ్రేట్‌ మైగ్రేషన్‌ 
మేం వాహనంలో ముందుకు పోతుంటే ఆంటిలోప్‌(ఒకరకమైన జింక)లు గుంపుగా దాదాపు 15 అడుగుల ఎత్తు ఎగురుతూ రోడ్డునీ కాలువనీ దాటుతూ కనిపించాయి. ఆ దృశ్యం చూడ్డానికి అద్భుతంగా ఉంది. దారిలో ఓ నీటిగుంటలో రైనోలు నీటిలో మునుగుతూ తేలుతూ కనువిందు చేశాయి. నల్లని మూతులు కలిగి ఉన్న ఆఫ్రికన్‌ కోతులు కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయి. అప్పటికే సమయం సాయంత్రం ఐదుగంటలు కావడం, ఇంకా అక్కడ ఉండటం ప్రమాదం అని హెచ్చరించడంతో మేం లాడ్జికి చేరుకున్నాం. మర్నాడు ఉదయాన్నే మాంజాకు బయలుదేరాం. తిరుగుప్రయాణంలో చూడని ప్రాంతాలకు తీసుకెళ్లారు. గృమెటి అనే నదీప్రాంతంలో చాలా మొసళ్లు కనిపించాయి. దగ్గరలోనే కొలాబస్‌ జాతికి చెందిన కోతులు గుంపులుగుంపులుగా ఉన్నాయి. పోతే సెరెంగెటికే తలమానికమైన ‘ద గ్రేట్‌ మైగ్రేషన్‌’ ఏటా మే నుంచి జులై వరకూ ఉంటుంది. ఆ సమయంలో దాదాపు 20 లక్షల జంతువులు ఎక్కువగా అడవిదున్నలూ జీబ్రాలూ ఆంటిలోప్సూ... కెన్యాకు వలసపోతాయి. మళ్లీ ఇక్కడ వాతావరణం అనుకూలించాక తిరిగి నవంబరు, డిసెంబరు నెలల్లో ఇక్కడకు వస్తాయి. ఆఫ్రికాలోని ఏడు సహజవింతల్లో ద గ్రేట్‌ మైగ్రేషన్‌ ఒకటి. ఈ 800 కిలోమీటర్ల వలస ప్రయాణంలో దాదాపు రెండున్నర లక్షల జంతువులు ఆకలీ నీటికొరతా వన్యమృగాల దాడుల కారణంగా చనిపోతాయట.

సెరెంగెటీలో హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ సదుపాయం కూడా ఉంది. అందులో ఎక్కి విస్తారమైన సెరెంగెటి పచ్చని మైదానాన్ని చూడవచ్చు. మాంజా చేరుకునేటప్పటికి సాయంత్రం నాలుగు గంటలయింది. ప్రపంచంలోకెల్లా అతిపెద్దదైన విక్టోరియా మంచినీటి సరస్సు ఇక్కడే ఉంది. దీని ఉపరితలం 68,800 చదరపు కిలోమీటర్లు కలిగి ఉంటుంది. దీని తీరం 4,828 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది టాంజానియా, కెన్యా, ఉగాండా దేశాల సరిహద్దుల్లో విస్తరించి ఉంది. ఈ సరస్సులో అతి ఎక్కువ లోతు 272 అడుగులు. అతి తక్కువ లోతు 130 అడుగులు. నైల్‌ పెర్చ్‌ అనే చేప ఈ సరస్సు ప్రత్యేకత. ఇంకా అనేక జాతులకు చెందిన చేపలు కూడా ఉంటాయి. దాదాపు లక్షన్నర మందికి ఈ చేపలే జీవనాధారం. ఇక్కడి చేపలు రుచిగా ఉండటంతో వీటికి ప్రత్యేక గిరాకీ ఉందట. అందుకే ఇవి చాలా ప్రదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. మేం ఆ రాత్రికి సరస్సుకి ఆనుకుని ఉన్న హోటల్లో బస చేసి, మర్నాడు తిరిగివచ్చాం.