Thursday, 7 January 2016

ఇరకం.. ఇహలోక స్వర్గం


ఇరకం.. ఇహలోక స్వర్గం
ఆకట్టుకొనే పరిసరాలు మొగలి పొదలు ప్రత్యేకం

పులికాట్‌ సరస్సు మధ్యలో దూరంగా విసిరేసినట్టుగా ఉండే దీవి ఇరకం.. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇరకం దీవి పేరే ప్రధానంగా విన్పిస్తోంది. ఎందుకంటే ఈ దీవిని పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.26 కోట్లు విడుదల చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో విదేశీ పర్యటకులను సైతం ఆకట్టుకునేలా తయారుచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకుగాను ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. మొత్తం మీద ఇరకం దీవికి మహర్దశ పట్టనుంది.  
న్యూస్‌టుడే, ఇరకం(తడ)
 
ఇరకం దీవిని పర్యటక ప్రదేశంగా గుర్తించడంతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతోకొంత ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. పైపెచ్చు రవాణా మార్గాలు పెరగనున్నాయి. ఇప్పటిదాకా రోజుకు రెండు ట్రిప్పులు మాత్రమే తిరిగే ప్యాసింజరు బోటే ఈ దీవి ప్రజలకు ఏకైక దిక్కుగా ఉంది. ఇక ఇక్కడి ప్రజల జీవన శైలిలోనూ మార్పు రానుంది. దేశ, విదేశీ పర్యటకులు దీవిలో పర్యటించి సేద తీరనున్నారు. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం రానుంది. ఇక్కడ చేయాల్సిన అభివృద్ధిపై దిల్లీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ వూహా చిత్రాన్ని ఇటీవలే విడుదల చేసింది.

అన్నీ ప్రత్యేకతలే
ఇరకం దీవిలో ప్రత్యేకతలు ఏమున్నాయని అందరి మదిలో మెదిలే ప్రశ్న.. భీమునివారిపాళెం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం పడవలో ప్రయాణించి ఈ దీవిని చేరుకునే వరకు ఆహ్లాదకరమైన వాతావరణం, పక్షుల గుంపులు, గాలి ఆధారంగా దూసుకెళ్లే తెరచాప పడవలు, చేపల వేట సాగించే మత్స్యకారులు ఇలా ప్రతి ఒక్కటీ పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకునే అంశాలే.

మొగలి రేకుల ఘుమఘుమలు
దీవిలో పూర్వ కాలంలో ఏర్పాటు చేసుకున్న దొరువులే అక్కడి రైతులకు సాగునీటి ఆదరవుగా ఉంటున్నాయి. వాటి ఆధారంగానే అక్కడ పంటలు సాగు చేస్తున్నారు. ఎడారుల్లో ఒయాసిస్సుల్లా మంచినీటి దొరువులు ఆకట్టుకుంటాయి. అంతేకాదు దొరువుల చుట్టూ పేము మొక్కల పచ్చదనానికి ఎవరైనా ముగ్దులవ్వాల్సిందే. దీవిలో అక్కడక్కడా ఏపుగా పెరిగిన మొగలి పొదల గుభాళింపును ఆస్వాదించాల్సిందే. ఇసుక తేలిన వీధులు సేద తీరేందుకు రమ్మని పిలుస్తున్నట్టు ఉంటాయి. చుట్టూ ఉప్పునీరున్నా తాగునీరు పుష్కలంగా దొరకడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడి రైతులందరూ ట్రాక్టర్ల ద్వారానే వ్యవసాయం చేస్తున్నారు.

80 ఎకరాల్లో కుటీరాలు, ఉద్యానవనాలు
పర్యటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వం దీవిలో 80 ఎకరాలను కేటాయించింది. ఇందులో చుట్టూ కుటీరాలు, మధ్యలో ఉద్యానవనాలు, పచ్చిక బయళ్లు పెంచేందుకు పర్యటక శాఖ అధికారులు యోచిస్తున్నారు. అంతేగాకుండా దీవిలో పరిసరాలను పరిశీలించి ఆస్వాదించేందుకు అనువుగా కాలిబాటలు, ఇసుకలోనూ నడిచేలా బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన సిద్ధమైంది. పర్యటక శాఖకు కేటాయించిన స్థలం సరస్సుకు సమీపంలోనే ఉండడం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. సరస్సులోనూ విహరించేలా పెడల్‌ బోట్లు, ఇరకం నుంచి వేనాడు దీవికి బోటు షికారు చేసేందుకు ఏర్పాట్లు చేయనున్నారు.

స్థానికుల జీవన శైలిని తెలిపేలా ప్రదర్శన థియేటర్లు వెలియనున్నాయి. అంతేగాకుండా చేతివృత్తి కళాకారులు తయారుచేసిన వస్తువుల విక్రయ ప్రదర్శనశాలలు ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించనున్నారు. తద్వారా వారికి ఉపాధి మార్గం ఏర్పడనుంది.

No comments:

Post a Comment