Friday, 8 January 2016

జ్ఞాన సరస్వతీ దేవాలయం - వీరంపాలెం


చదువుల తల్లి కొలువు!

సకల విద్యలకూ ఆదిదేవత మేధా సరస్వతి అక్కడ కొలువుంది.
కోరిన విద్యలకెల్లనొజ్జయైన మహాగణపతి అంతెత్తు రూపంతో దర్శనమిస్తాడు.
మేధోదక్షిణామూర్తీ, షిరిడీ సాయి మందహాసంతో సాక్షాత్కరిస్తారు.
జగతఃపితరులు పార్వతీపరమేశ్వరులూ ఆశీర్వదిస్తూ కనిపిస్తారు.
తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలోని పంచాయతన క్షేత్రం ఓ ఆధ్యాత్మిక పుణ్యధామం. 

 
మామూలుగా అక్షరాభ్యాసం అంటే బాసర సరస్వతీ ఆలయమే గుర్తొస్తుంది. కానీ పశ్చిమ గోదావరి జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల వారికి మాత్రం  బాలాత్రిపుర సుందరీదేవి పీఠం విశ్వేశ్వర పంచాయతన క్షేత్రంలో వెలసిన జ్ఞాన సరస్వతీ దేవాలయమే జ్ఞప్తికి వస్తుంది. తెలుగు రాష్ట్రాలలో బాసర తరవాత అత్యధిక సంఖ్యలో అక్షరాభ్యాసాలు జరిగే వాగ్దేవి దేవాలయం ఇదేనని స్థానికులు చెబుతారు. ఇక్కడ వెలసిన గణపతికీ ఎంతో ప్రత్యేకత ఉంది.

అమ్మ చెంతనే...
సువిశాల పంచాయతన క్షేత్రానికి నైరుతిభాగంలో ఉత్తర ముఖంగా తేజో వదనంతో మేధాసరస్వతీ దేవి విగ్రహం దర్శనమిస్తుంది. అమ్మవారికి ఎదురుగా 150అడుగుల దూరంలో శ్రీమేధా దక్షిణామూర్తి విగ్రహం ఉంటుంది. ఏటా వందలాదిమంది చిన్నారులు ఇక్కడ ఓంకారం దిద్దుకుంటారు. ఈ క్షేత్రంలో అష్టముఖ గణపతి విగ్రహం ప్రత్యేకమైనది. ఎనిమిది ముఖాలతో 42 అడుగుల ఎత్తుతో దేశంలోనే ఎక్కడాలేని విధంగా అష్టముఖ గణపతి ఇక్కడ కొలువుదీరాడు. ఈ విగ్రహంలో... తూర్పువైపున లక్ష్మీగణపతి, దక్షిణాన సిద్ధిబుద్ధి సమేత శక్తి గణపతి, పడమర వైపున పార్వతీ, పరమేశ్వరులకు నమస్కరిస్తున్న అభివాద గణపతి, ఉత్తరాన కుబేరుని కాలిపై కూర్చోబెట్టుకున్న కుబేరగణపతి ఇలా ఒక్కో దిశలో ఒక్కో రూపంలో ఈ గణపతి కనిపిస్తాడు. అష్టైశ్వర్యాలకు ప్రతీకగా ఈ అష్టగణపతిని చెబుతారు.

మరిన్ని దేవతా రూపాలు...
ఇదే ప్రాంగణంలో 42 అడుగుల ఎత్తుతో శివపార్వతుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాల కిందిభాగంలో 16 నర్మద శివలింగాలూ, లక్ష రుద్రాక్షలూ, విశేష దివ్య యంత్రాలనూ నిక్షిప్తం చేశారు. క్షేత్రంలో నిర్మించిన ద్వాదశ జ్యోతిర్లింగ పశుపతేశ్వర ధ్యానమందిరం ప్రశాంతతకు చిహ్నంగా ఉంటుంది. మందిరంలో 12 జ్యోతిర్లింగాలు, 12 మంది దివ్యయోగులు, సప్తమహర్షుల విగ్రహాలతో పాటు పశుపతేశ్వరస్వామినీ ప్రతిష్ఠించారు. ఏటా మహాశివరాత్రి రోజున 12 నదుల జలాలు, 12 రకాల విశేషద్రవ్యాలతో 12 వేల లీటర్ల పాలతో 212 మంది పండితులతో మహాకుంభాభిషేకం చేస్తుంటారు. ఈ అభిషేకాన్ని వేలాది మంది దర్శిస్తుంటారు. 42 అడుగుల ఎత్తులో భగీరథుని విగ్రహాన్నీ ప్రతిష్ఠ చేశారు. దేవాలయంలో సరస్సు నిర్మించారు. అందులోని హంసవాహనంపై పర్వదినాల్లో స్వామివారు, అమ్మవారు జలవిహారం చేస్తారు.

ఏడాదికి రెండుసార్లే...
గంగావతరణం దృశ్యంతో నిర్మించిన కైలాసగిరిలో స్ఫటికలింగాన్ని ప్రతిష్ఠించారు. దీంతో పాటు లక్ష నర్మద బాణ శివలింగాలు ఈ ఆలయం అంతటా ప్రతిష్ఠించడం విశేషం. ఆలయం లోపల ధ్యానశివమూర్తి, సద్యోజాత, అఘోర, వామదేవ, ఈశాన్య, సత్పురుషమూర్తుల విగ్రహాలూ, నైరుతిభాగంలో మహాగణపతి విగ్రహమూ ఉన్నాయి. ఈ ఆత్మలింగానికి రోజూ మానససరోవర జలంతో అభిషేకం జరుపుతారు. స్ఫటికలింగాన్ని భక్తులు మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి రోజుల్లో మాత్రమే దర్శించుకునే వీలుంది.

హుండీలు లేవు...
గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి సిద్ధాంతి ఆధ్వర్యంలో 2003 సంవత్సరాన వీరంపాలెంలో శ్రీబాలాత్రిపుర సుందరి విద్య, వైద్య, ఆధ్యాత్మిక సేవా పీఠాన్ని స్థాపించారు. తన తాతయ్య కొండూరి నృసింహావధానుల స్ఫూర్తితో ఆయన ఈ ఆలయ సముదాయాన్ని నిర్మించారట. క్షేత్రంలో మొత్తంగా ఐదు ఆలయాలూ, కాలభైరవుడూ, ధ్వజస్తంభం శిఖరాలతో 29 దివ్య విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. గుడిలో షిరిడీ సాయి, అర్ధనారీశ్వర రూపంలో హరిహరులూ, అయ్యప్ప స్వామి, లక్ష్మీనారాయణ, గాయత్రీ, బాలా త్రిపుర సుందరి, అష్టలక్ష్మి తదితర విగ్రాలున్నాయి. ఆలయంలో ఆర్జిత సేవల రూపంలో కానీ, హుండీ రూపంలో కానీ ఎక్కడా ఒక్కరూపాయి కూడా సమర్పించే అవకాశం భక్తులకు ఇవ్వరు. డబ్బులు వేయొద్దంటూ క్షేత్రంలో బోర్డు పెట్టడం విశేషం. ‘దేవుడికీ భక్తుడికీ మధ్య డబ్బు ఓ బంధం కానేకాదు... అలాంటప్పుడు ఆయనకు పూజ చేసేందుకు డబ్బులడగడం మాకు సమంజసంగా అనిపించలేదు... పేదా ధనికా బేధం లేకుండా అందరూ భగవంతుడిని ప్రశాంత మనసుతో ధ్యానించుకుని వెళ్లడమే మాకు సంతోషం’ అంటారు నిర్వహకులు.

శిష్యుల సహకారం...
ఇంత పెద్ద ఆలయాన్ని ఏ లోటూ లేకుండా నిర్మించాలన్నా నిర్వహించాలన్నా నిజానికి చాలా ఖర్చే అవుతుంది. ఆలయ నిర్మాత వెంకటరమణశాస్త్రికి దాదాపు లక్షా ముప్ఫైరెండు వేల మంది శిష్యులున్నారు. వాళ్లే నెలకు పదిమంది చొప్పున దేవాలయ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సేవలకోసం ఉభయగోదావరి జిల్లాల్లోని ఎంతో మంది భక్తులు బృందాలుగా వస్తుంటారు. పీఠం తరఫున గ్రామంలో వైద్యశిబిరాలూ నిర్వహిస్తున్నారు. క్షేత్రంలో అన్ని సామాజిక వర్గాల మహిళలకూ వేదం నేర్పుతున్నారు. ఆలయంలో నిత్యాన్నదానమూ ఏర్పాటు చేశారు.
No comments:

Post a Comment