Friday, 8 January 2016

పులికాట్ సరస్సు

పులికాట్ 'కొంగెళ్లిపోతోందిరా!'


దేశదేశాలనుంచీ వచ్చే పక్షుల కిలకిలారావాలతో...

పుడమితల్లి పులకించి పోయేంతటి సందడి...
అది సరస్సే... కానీ, అంతకన్నా మించి విదేశీ అతిథుల విడదికేంద్రం...
శీతాకాలంలో ఆ నేల వలసపక్షుల స్వర్గధామంగా భాసిల్లుతుంది...
ఇప్పుడా దేవతాపక్షుల కిలకిలలే లేవు...
ఇప్పుడా రంగురంగుల కళకళలే కనుమరుగు...
ఎటు చూసినా ఎండిన బీడుభూములే కంటిముందుసాక్షాత్కరిస్తుంటే...
గతవైభవం గుర్తుకొచ్చి ఒక్కసారి గుండె గతుక్కుమంటుంది...
ఏమా సరస్సు- ఏమా కడలినీటి కన్నీటి గాథ.......


ప్రళయకావేరిగా ఆ సరస్సుకు పేరు... తమిళులు పులియకావేరిగా పలుకుతుండేవారు... బ్రిటీష్ దొరలు ఆ పేరును ఇంగ్లీషులో పలకడంలో భాగంగా పులికాట్ గా మారింది. దేశంలో రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా పులికాట్ కు పేరు. మామూలు రోజుల్లో సుమారు 650కిలోమీటర్ల మేరా వ్యాపించి వుంటుంది. అదే వర్షాకాలంలో మరిన్ని చదరపు కిలోమీటర్లు విస్తరిస్తుంది. ఇప్పుడా సరస్సుకు ఆ విస్తరణే కరువు. తనను దోచేస్తుంటే.. దగాకోర్లు దర్జాగా కబ్జా చేస్తుంటే.. ప్రళయకావేరి ఏం చేయలేక గోడు గోడు మంటోంది. ఏమిటా విషాధగాథ. ఓ సారి చూద్దాం.

గతంలో ప్రళయకావేరి గురించి- ఇక్కడి ప్రాకృతక శోభల గురించి కథలు కథలుగా చెప్పుకునే వారు. ఇప్పుడా పరిస్థితిలేదు. ప్రళయకావేరి వెతలే అడుగడుగునా దర్శనమవుతున్నాయి నేడు. ఎటు చూసినా ఆ కథలే. ఎక్కడెక్కిడినుంచో వచ్చే వలసపక్షులు... వాటిని చూడ్డానికి ఎగబడే పర్యాటకులు... నీరు పుష్కలంగా వుండటంతో చెంగు-చెంగున ఎగిరి పడే రకరకాల చేపలు... వాటిని పట్టడానికి వేట సాగించే జాలర్లతో పులికాట్ వింత శోభలతో అలరారుతుండేది. ఇప్పుడా వైభవం లేదు. ఇప్పుడా నేలన అంతా విలయమే. ఎటు చూసినా బీడు వారిన భూములు. ఆ భూములను కూడా కబ్జా చేసిన కథలు మాత్రమే వినిపిస్తున్నాయి.సరస్సును నమ్మి నాలుగు రూకలు సంపాదించుకుని బతుకునీడ్చే జాలరన్న విలవిలలాడుతున్నాడు. తన జీవనానికి గుర్తయిన వల- బోటు గుర్తును జారవిడిచాడు. కన్నీటి బొట్లే తన శాశ్వత చిహ్నాలుగా చేసుకునే ప్రయత్నంలో తలమునకలై వున్నాడు.
ముఖద్వారాలు మూసుకుపోవడం వల్ల... వాటిలోంచి వచ్చే నీరందక సరస్సు సర్వనాశనమైపోతోంది. ఏమిటా ముఖద్వారాల మతలబు. సరస్సు మనుగడకు అంత్యంత కీలకమైన ముఖద్వారాలు పూడుకుపోతుంటే అధికారులు ఏం చేస్తున్నట్టు. ఇంతకీ ఆ ముఖద్వారాలు ఎక్కడెక్కడున్నాయి. ఈ ప్రశ్నలకు అధికారులకు సమాధానం తెలుసు. కానీ ఆచరణ దూరం కావడంతో సరస్సు ఎండిపోతోంది.
వాస్తవానికి సరస్సులో ఇరవైకి పైగా దీవులున్నాయి. ఎనభై అయిదు వేల మంది మత్స్యకారులు ఈ సరస్సును నమ్ముకుని బతుకుతున్నారు. చేపల వేట సాగించడం.. పట్టిన చేపలను అమ్మి పొట్ట పోసుకుంటూ బతుకునీడుస్తుంటారు. బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉంటుంది పులికాట్ సరస్సు. నడి మధ్యన మూడు ముఖద్వారాలుంటాయి. మన రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా వాకాడు మండలం రాయదొరువు, శ్రీహరికోట సమీపంలోని కొండూరుపాళెం, తమిళనాడు రాష్ట్రంలోని పల్వర్ కాడ్ లలో ఉంటాయీ ముఖద్వారాలు. అలాంటి ఈ ముఖద్వారాల ద్వారా సముద్రపునీరు పులికాట్ సరస్సులోకి చేరుతుంది. ఆటుపోటుల సమయంలో వచ్చి చేరే ఉప్పునీరు, కాళంగినది, స్వర్ణముఖి నది, పాముల కాలువ, నెర్రికాలువల ద్వారా వచ్చే మంచినీరు.. పులికాట్ వచ్చి చేరుతుంది.

ఉప్పు, నీరు మంచినీరు కలిసే పులికాట్ సరస్సులో మత్స్యసంపద ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. సముద్రజీవులు ఇక్కడ సంతోనత్పత్తి చేయడానికి బాగా ఇష్టపడతాయి. అదే చేపలవేట సాగించి బతికే వాళ్లకు భుక్తిగా మారుతుంది. ఇప్పుడా పరిస్థితి తారుమారైంది. సరస్సు మనుగడకు కీలకమైన ముఖద్వారాలు మూసుకుపోవడంతో సరస్సు వెలవెలా పోతోంది.


ఇటీవల కేంద్ర వన్యప్రాణుల శాఖ కన్జర్వేటర్ ఇక్కడకు వచ్చారు. పరిస్థితి చూసి విస్తుపోయారు. నివేదిక తయారు చేసి కేంద్రానికి ఇచ్చారు. ఢిల్లీలో పులికాట్ సరస్సుపై సదస్సు ఏర్పాటు చేశారు. ఈ విషయాలన్నీ చర్చించనున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కనికరిస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుంటే.. పులికాట్ సరస్సు పదికాలాలు చల్లగా ఉంటుంది. ప్రకృతి అందాలు కాపాడుకోవచ్చు. విదేశీ విహాంగాల ప్రాణాలు కాపాడొచ్చు. మత్స్యకారుల జీవన పరిస్థితులు మెరుగుపరచవచ్చు. పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేసి ఆదాయాలు రాబట్టనూ వచ్చు... ఇలా ఎన్నో.. ఎన్నెన్నో.. ప్రయోజనాలు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వమే కదలాలి.. ఈ అద్భుతలోకాన్ని కాపాడాలి.

కేంద్ర కమిటీ రావడం... పులికాట్ ప్రస్తుత పరిస్థితి మీద నివేదికలు సమర్పించడం జరిగింది. బావుంది. చాలా చాలా బావుంది. నివేదిక ఫలించి ప్రళయకావేరి కన్నీళ్లను తుడుస్తారేమోనని ఎదురు చూడ్డమే మిగిలింది. కానీ, ఆ విషయంలో కూడా ఓ అనుమానం మిగిలే వుంది. కేంద్రం కదా.. పులికాట్ కు చాలా దూరంలో వుండే ఢిల్లీలో ఉంటుంది. ప్రళయకావేరి కన్నీరు తుడవడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టవచ్చు అంటున్నారు విశ్లేషకులు.

పులికాట్ గతమెంతో ఘనం. ప్రతి ఏడాది అక్టోబర్ నెల నుంచీ పులికాట్ ఓ ప్రత్యేక లోకంగా మారిపోతుంది. ఎటు చూసినా చిత్రవిచిత్రమైన రంగుల కోలాహాలమే. వచ్చే పక్షులొస్తుంటే... పెట్టే గూళ్లు పెడుతుంటే... వాటిలో అవి పిల్లలను పెడుతూ.. తమ తమ సంతానోత్పత్తిని చేస్తుంటే... చూసే వారి కన్నుల పంటగా వుంటుంది. ఒక రకంగా పులికాట్ ఈ పక్షుల పుట్టినిల్లని కూడా చెప్పవచ్చు. ఏ ఆడపిల్లైనా పురుడు పోసుకునేది పుట్టినింట్లోనే కదా... అలాంటిదే మన పులికాట్ సరస్సు.

ఎక్కడో దేశవిదేశాలను దాటుకుని వచ్చి మరీ... ఇక్కడ తమ పిల్లలను పెట్టడంలో అంతరార్ధం ఏమిటి. పులికాట్ పుట్టినిల్లుగా తలంచడంవల్లే కదా. పులికాట్ కు వలస పక్షులు భారీగా తరలివస్తుంటాయి. ఫ్లెమింగో, పెలికాన్, ఎర్రకాళ్ళ కొంగలు, నత్తగుల్ల కొంగలు, నారాయణ పక్షులు, తెడ్డుముక్కు కొంగలు, షావలర్ పక్షులు, వంటి అరుదైన నూటయాభై రకాల పక్షులు పులికాట్లో విడిది చేస్తుంటాయి. ఇవన్నీ ఆఫ్రికా, సైబీరియా, మలేషియా, బర్మా, బంగ్లాదేశ్, కజికిస్థాన్, పాకిస్థాన్, జమ్మూ-కాశ్మీర్ ప్రాంతాల నుంచి ఆహారం, సంతానోత్పత్తి కోసం వలస వస్తుంటాయి. ఆరునెలల పాటు ఇక్కడే ఉంటాయి. ఈ పక్షులను చూస్తే, మనస్సు పులకించిపోతుంది. చిత్ర విచిత్రమైన రంగులు, కేరింతలు, కిలికిలరావాలు మనస్సులను ఇట్టే దోచేస్తాయి.

 పులికాట్ సరస్సు.. ఇక్కడి వాతావరణం.. అందులో తమ భుక్తిని ఆశించి వచ్చే పక్షులు.. ఇప్పుడు పులికాట్ రావడానికి పెద్దగా ఇష్టత చూపడం లేదు. పులికాట్ పక్షులు పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా... ఇక్కడి నేలలకు ఎంతో మేలు చేస్తాయి కూడా. పులికాట్ పక్షులు విసర్జించే మలం కూడా ఎంతో మేలు చేకూర్చుతుంది. ఈ దిశగా కొందరు ప్రయోగాలు చేసి ఆ విషయం అవునని నిరూపించారు కూడా. వలస పక్షులు విసర్జించే మలం ఎరువుగా ఉపయోగపడి ఇక్కడి భూములు సారవంతం చేస్తాయని రుజవైంది కూడా.

ఒక పక్క పులికాట్ ఎండి పోవడం, మరొపక్క శబ్ధకాలుష్యం, అధికారుల నిర్లక్ష్యం వెరసీ ఇక్కడకు వలసపక్షుల రాకడ తగ్గింది. శ్రీహరికోట రాకేట్ కేంద్రం అత్యంత దగ్గరగా వుండటంతో సౌండ్ పొల్యూషన్ కూడా ఈ పక్షుల రాకడకు అడ్డు తగులుతోందని చెబుతుంటారు పరిశీలకులు. ఈ పక్షుల పేరున ఫ్లెమింగో ఫెస్టివల్స్ జరుపుతుంటారు కూడా. మూడు నాళ్లు నడిచే ఈ పక్షుల పండుగ కొన్ని రాజకీయ కారణాల దృష్ట్యా ఇప్పుడు ఒకనాటికి పరిమితం అయింది. పక్షులు రావడానికి ప్రధానమైన పులికాట్ మీదే శ్రద్ధలేని అధికార యంత్రాంగానికి ఫెస్టివల్ విషయంలో ఉంటుందని ఆశించడం కూడా తప్పే అవుతుంది.

పులికాట్ అనేకరకాలుగా నిరాదరణకు గురవుతుంటే ఎవరి పని వారిదే అన్నట్టు కబ్జా దారులు రెచ్చిపోతున్నారు. ఎండిపోతున్న పులికాట్ ను కాపాడే చర్యలు చేపట్టడం అటకెక్కడంతో వేలమందికి ఉపాది కోల్పోతున్నారు. ఇదే అదనుగా భావించి తమ పని తమదే అన్న చందంగా రెచ్చిపోతున్నారు కొందరు భూ-బకాసురులు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఎకరాల కొద్దీ భూమి బొక్కే పనిలో నిమగ్నమైపోయారు.

అధికారులు కళ్లున్నా లేనట్టు.. ఎంపీ, ఎమ్మెల్యేలు పులికాట్ అభివృద్ధి చేపట్టాల్సిన బాధ్యత ఉన్నా లేనట్టు... కేంద్రమంత్రులు అధికారం వున్నా లేనట్టు... ప్రవర్తిస్తుండటంతో ప్రళయకావేరి గతచరిత్రకు పరిమితమవ్వాల్సిన స్థితికి అతి చేరువలో వుంది. ఇకనైనా కళ్లు తెరవకుంటే పులికాట్ మనకు ఫ్లాష్ బ్యాక్ అయిపోగలదు జాగ్రత్త అంటున్నాయి పరిస్థితులు.  అరుదైన ప్రకృతి... అందునా మనరాష్ట్రంలో వెలసిన ఈ సహజసంపద మీద దృష్టి సారించకుంటే 'కొంగెళ్లిపోతోందిరా!' అంటూ బాధ పడ్డం మినహా వేరే దారిలేదు. పులికాట్ గురించి చెప్పుకోడానికి తప్ప భావితరాలు కళ్లారా చూసి విజ్ఞానవినోదాలు పొందడానికి మరేమీ మిగలదు. అధికారయంత్రాంగమా పులికాట్ గోస వినిపిస్తోందా.. అంటున్నాయా వలసపక్షులు.

- telugusla






కాలుష్యం కోరల నుంచి పులికాట్‌ను కాపాడండి

February 06, 2012
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: పులికాట్ సరస్సు కాలుష్యకోరల్లో చిక్కుకుపోవడంతో విదేశీ వలస పక్షుల రాక క్రమేపీ తగ్గుతుందని నార్వే దేశానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఆర్‌డబ్ల్యూ జాకబ్‌సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం పులికాట్ సరస్సును సందర్శించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. సముద్రం నుంచి ఉప్పునీరు, నదులు, కాలువల నుంచి మంచినీరు కలిసి జీవవైవిధ్యం కలిగి ఉండడంతో పక్షులు ఈ సరస్సును ఆహారకేంద్రంగా ఎంచుకున్నాయన్నారు. ప్రస్తుతం సరస్సుకు ఉప్పునీరు సరిగా రాకపోవడంతో ఎడారిలా తయారవుతోందన్నారు. ఇక్కడి మత్స్యసంపద కోసం యూరప్, ఆసియా దేశాల నుంచి 70 జాతుల విదేశీ వలస పక్షులు వస్తుంటాయన్నారు. సుమారు ఆరునెలల పాటు ఈ ప్రాంతంలోనే ఉండి సంతానోత్పత్తి చేసుకుని వెళుతుంటాయని సర్వేలో ఎన్నోమార్లు వెల్లడైందన్నారు. 1998 నుంచి తాను ఈ ప్రాంతానికి వస్తున్నానని, అప్పటి నుంచి ఇప్పటి వరకు పక్షులపై అధ్యయనం చేస్తూనే ఉన్నానని చెప్పారు.

గతంలో ప్రకృతి, ఆహార పరిస్థితులు, వాతావరణం అనుకూలంగా ఉండడంతో పక్షులు సంతానోత్పత్తిని చేసుకున్నాయని తెలిపారు. గతంలో పులికాట్‌కు వచ్చే పక్షుల సంఖ్య ఎక్కువగా ఉండేదని, అది ప్రస్తుతం గణనీయంగా తగ్గిందన్నారు. ఫ్లెమింగోలు, పెలికాన్స్, ఎర్రకాళ్ల కొంగల సందడి కొంతమేర తగ్గిందని అభిప్రాయపడ్డారు. ప్రకృతిలో వచ్చిన మార్పులు, సూళ్లూరుపేట-శ్రీహరికోట మధ్య పెరిగిన ట్రాఫిక్, పంటపొలాల్లో రైతులు వేసే క్రిమిసంహారక మందులు, ఎరువుల వాడకం పెరగడం సరస్సు ఉనికికి పెను ప్రమాదంగా మారిందన్నారు. పులికాట్ సరస్సుకు పర్యావరణ ముప్పు ఏర్పడిందని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొంత కాలానికి విదేశీ పక్షుల రాక పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ సారి కొత్తగా సరస్సులో మాబల్ టిల్ (చిన్నబాతు) కనిపించిందన్నారు. ఇక్కడి ప్రభుత్వాలు సరస్సు సంరక్షణ బాధ్యతను విస్మరించడంతో ఈ ప్రాంతానికి వచ్చే పక్షుల రాక పూర్తిగా తగ్గిపోతోందన్నారు. ఆయనతో పాటు గోపీనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదపుటంచున పులికాట్


May 18, 2015 ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాల పరిధిలో ప్రకృతి వరప్రసాదంగా ఏర్పడిన పులికాట్ సరస్సు ప్రమాదపుటంచులో ఉంది. సరస్సు గర్భంలో సహజసిద్ధంగా ఉన్న సున్నపు గుల్ల, వానపాములను ఇబ్బడి ముబ్బడిగా తవ్వేయడంతో భవిష్యత్తులో సరస్సు ఉనికి కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది.

సూళ్లూరుపేట : అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు తీరప్రాంత గ్రామాల్లోని కూలీలను ప్రోత్సహించి సరస్సు ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నారు. సున్నపుగుల్ల తీసేయడం వల్ల సరస్సు ఉత్తరంవైపు ఎడారిని తలపిస్తోంది. మరోవైపు వానపాముల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. తడమండలం వేనాడు, ఇరకం దీవుల చుట్టూ గుల్ల, వానపాములను తవ్వేస్తున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడం దురదృష్టకరం. దీనికి తోడు కొండూరు, గ్రద్దగుంట, చేనిగుంట గ్రామాల్లోని కొందరు కాళంగినది లో కలిసేచోట ఉన్న ఇసుక దిబ్బలను తవ్వి ట్రాక్టర్లతో రాత్రివేళల్లో తమిళనాడుకు తరలిస్తున్నారు.

వేనాడు, ఇరకం దీవులే కేంద్రాలు..
వేనాడు ఇరకం దీవుల్లోని కూలీలు ఎక్కువగా వానపాములను పట్టే పనికి వెళుతున్నట్టు తెలుస్తోంది. కూలీలు తవ్వి తీసిన వానపాములను మట్టికుండలు,  ప్లాస్టిక్ బకెట్లు, పాలిథిన్ కవర్లలో అనుమానం రాకుండా తరలిస్తున్నారు. పులికాట్ సరస్సులో దొరికే వానపాములకు రొయ్యల హేచరీల్లో మంచి డిమాండ్ ఉండడంతో చాలామంది ఈ అక్రమ వ్యాపారాన్ని నడుపుతున్నారు. కిలో వానపాములు పడితే కూలీకి రూ.500 నుంచి రూ.750 వరకు ఇస్తున్నారు.

వీటిని హేచరీలకు తరలించి కిలో సుమారుగా రూ.5 వేల నుంచి రూ.6 వేలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు తమిళనాడు తీరప్రాంతంలో నిత్యం టన్నుల కొద్దీ సున్నపుగుల్లను తీసేసి సరస్సును గుల్ల చేస్తున్నారు. దీంతో మత్స్యసంపద తగ్గిపోవడం, సరస్సు గుంతల గుంతలుగా మారి ఎడారిగా మారుతోంది. తమిళనాడులోని కవరైపేటై నియోజకవర్గం పరిధిలోని సున్నాంబుగోళం (సున్నపుగుంట) గ్రామం వద్ద సరస్సుకు అతి దగ్గరలో నాలుగైదు సున్నపు గుల్ల కంపెనీలున్నాయి.

వాస్తవంగా పులికాట్ సరస్సుకు వందమీటర్ల పరిధిలో ఎలాంటి పరిశ్రమలు, హోటళ్లు, రిసార్ట్స్ లాంటివి ఉండకూడదని చట్టం ఉంది. ఈ చట్టాన్ని తుంగలోతొక్కి తమిళనాడులో ఇప్పటికీ సున్నపుగుల్ల కంపెనీలు నడుస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో సూళ్లూరుపేట వన్యప్రాణి సంరక్షణ విభాగం కిందిస్థాయి సిబ్బందికి నెల మామూళ్లు అందుతుండడంతో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పులికాట్ సరస్సును భవిష్యత్తు తరాల వారికి మ్యాప్‌లో చూపించాల్సిన పరిస్థితులు తలెత్తినా ఆశ్చర్యం లేదు.

దాడులేవీ..?
పులికాట్ సరస్సును అన్ని రకాలుగా కుళ్లబొడిచేస్తున్నా పులికాట్ వన్యప్రాణి సంరక్షణ విభాగం అధికారులు, సిబ్బంది దాడులు చేస్తున్న దాఖలాల్లేవు. ప్రభుత్వం ఇచ్చే జీతాలతో పాటు పులికాట్‌లో జరిగే అక్రమాలను కూడా సొమ్ముచేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. పులికాట్ సరస్సు పరిధిలో ఒక్కొక్కరికి ఒక్కో ప్రాంతాన్ని కేటాయిస్తూ బీట్ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు. అందిన కాడికి దండుకుని వారు కార్యాలయానికి పరిమితమవుతున్నారు. దాడుల విషయమై అధికారులను అడిగితే  సిబ్బంది కొరత కారణంగా దాడులు చేయలేకపోతున్నామని చెబుతున్నారు.

ప్రమాదం అంచున పులికాట్ సరస్సు
సూళ్ళూరు పేట (ఏజెన్సీ), బుధవారం, 26 డిశెంబరు 2007 (15:19 IST)

దేశంలో అతిపెద్దదైన రెండవ సరస్సుగా పేరుగాంచిన పులికాట్ సరస్సు మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. వాస్తవానికి 600 చదరపు కి.మీ.ల విస్తీర్ణంలో అలరారుతున్న ఈ సరస్సు గడచిన రెండు దశాబ్దాల కాలంలో 400 చదరపు కి.మీ.ల విస్తీర్ణానికి కుదించుకుపోయింది. దీంతో సరస్సులో జల జీవాలు మరియు వలస పక్షుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది.

జలజీవాల జనాభా సంఖ్యతో పాటు సరస్సు లోతు నాలుగు మీటర్ల నుంచి రెండు మీటర్లకు తగ్గిపోయిందని సూళ్ళురు పేట డివిజన్ అటవీ అధికారి రామలింగం మీడియాతో బుధవారం అన్నారు.

సరస్సులో నీటి పరిమాణం తగ్గిపోవడంతో శీతాకాలంలో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు వలస వచ్చే ఫ్లెమింగో, పెయింటెడ్ స్టోర్క్‌స్, ఎగ్రెట్స్, గ్రే పెలికాన్లు, గ్రే హెరోన్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది.

No comments:

Post a Comment