Thursday, 11 February 2016

త్రిమూర్తులు కొలువుదీరిన త్రయంబకం


పాపవిముక్తికోసం గౌతముడు స్నానమాచరించిన పవిత్రస్థలమది. జ్యోతిర్లింగరూపంలో త్రిమూర్తులు కొలువైన క్షేత్రమది. అన్నింటినీ మించి ప్రాచీనకాలం నుంచీ కుంభమేళాకు వేదికగా నిలుస్తోన్న ఆ త్రిసంధ్యాక్షేత్రానికి ఉన్న మరో పేరే త్రయంబకం...కార్తీక మాసంలో దర్శనీయ పుణ్యక్షేత్రం..

ఇక్కడ ఉన్న బ్రహ్మగిరి పర్వతాల మీద బ్రహ్మదేవుడు తపస్సు చేసి సృష్టి నిర్మాణానికి అవసరమైన శక్తినీ సిద్ధినీ పొందాడట. అందుకే దీనికి బ్రహ్మగిరి అని పేరు అన్నది ఓ పౌరాణిక కథనం. ఈ బ్రహ్మగిరి పర్వతానికి సద్యోజాతం, వామదేవ, అఘోర, ఈశాన, తత్పురుష అను ఐదు శిఖరాలు ఉన్నాయి. బ్రహ్మగిరిమీద ఉద్భవించిన గంగానది మూడు పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. తూర్పువైపు ప్రవహించే పాయని గోదావరి అనీ దక్షిణం వెపు ప్రవహించే నదిని వైతరణి అనీ, పడమటివైపు ప్రవహించే నదిని గంగ అనీ పిలుస్తారు. పడమటి వైపు ప్రవహించే గంగానది చక్రతీర్థం దగ్గర గోదావరిలో కలుస్తుంది.

త్రయంబకం నాసిక్‌కు 28 కిలోమీటర్ల దూరంలోని త్రయంబక్ పట్టణంలో ఉంది. దేవాదిదేవుడయిన శంకరుని ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాల్లో ఇదీ ఒకటి. వేదకాలంనాటి గురుకుల పాఠశాలలూ, అష్టాంగమార్గాన్ని అనుసరించే ఆశ్రమాలూ అక్కడ చాలా ఎక్కువ. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని క్రీ.శ.1755-1786 మధ్యకాలంలో నానాసాహెబ్ పేష్వా నిర్మించారట. చూడ్డానికి ఇదో నల్లని రాతి యంత్రంలా అనిపిస్తుంది. ఆలయం నలువైపులా 20 నుంచి 25 అడుగుల ఎత్తులో రాతిగోడలు ఉన్నాయి. పంచధాతువులతో నిర్మించిన ధ్వజస్తంభం ఈ మందిరంలోని మరో ఆకర్షణ.

గుడి ప్రాంగణంలోకి ప్రవేశించగానే శివనామస్మరణ చేసే భక్తులతో ఆ ప్రాంతం మరో లోకాన్ని తలపిస్తుంది శివాలయానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుని మందిరం గుండా గుడి అంతర్భాగానికి చేరుకుని, చిరుదీపకాంతిలో కనిపించే జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలి. లింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపాలు ఉన్నాయి. ఇలాంటి అద్వితీయమైన విశేషం ఇక్కడ ఒక్కచోటే కనిపించడం విశేషం.

స్వర్ణాభరణ భూషితుడు:
లింగానికి త్రిమూర్తుల రూపాలతో చేసిన బంగారుతొడుగుని తొడుగుతారు. దానిమీద రత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని పెడతారు. పేష్వాల కాలం నుంచీ ఈ త్రయంబకేశ్వరుణ్ణి స్వర్ణాభరణ భూషితుడుగా అలంకరించడం విశేషం. ఆ ఆదిశంకరుని పంచముఖ బంగారు కిరీటం వజ్రవెఢూర్యాలతోనూ విలువైన రాళ్లతో సుందరంగా ఉంది. ఈ కిరీటం పాండవుల కాలం నాటిదని అంటారు. దీన్ని ప్రతీ సోమవారం, కార్తీకపౌర్ణమి, మహాశివరాత్రి పర్వదినాల్లో కుశావర్త తీర్థస్థలానికి తీసుకువెళతారు. తరవాత వూరేగింపు ఉత్సవం నిర్వహిస్తారు. ఒకప్పుడు నాసిక్ మణిగా పిలిచే నీలమణి కూడా దేవుడికి అలంకారంలో ఉండేదట. మరాఠాలు- ఆంగ్లేయుల మధ్య జరిగిన యుద్ధంలో అది లండన్‌కు చేరి ఆపై అనేక చేతులు మారింది.

కుంభమేళాకు ఆరంభ స్థలం: 
జ్యోతిర్లింగ దర్శనానంతరం- ప్రధాన ఆలయం నుంచి కాలినడకన ఐదు నిమిషాల్లో కుశావర్త తీర్థానికి చేరుకోవచ్చు. దీన్ని వోల్‌వోకర్ శ్రీరావ్‌జీ సాహెబ్ పాఠ్‌నేకర్ క్రీ.శ. 1690-91లో నిర్మించారు. ఈ కుశావర్త తీర్థం పన్నెండు సంవత్సరాలకి ఒకసారి వచ్చే కుంభమేళాకి ఆరంభ స్థలం. ప్రపంచ నలుదిశల నుంచీ సాధువులు స్నానం చేయడానికి ఇక్కడికే వస్తారు. ప్రముఖులైన సాధువులు స్నానం చేశాకే సామాన్యులని అనుమతిస్తారు. గతంలో జరిగిన ఓ కుంభమేళా సమయంలో వైష్ణవులూ శైవులూ మధ్య తలెత్తిన వివాదంలో వందలాది మంది చనిపోయారట. ఆ సందర్భంగా ఎవరు ఎక్కడ ముందుగా స్నానం చేయాలనే నియమాన్ని పేష్వాలు విధించారట. వైష్ణవ సాధువులు పంచవటి దగ్గర ప్రవహించే రామ్‌కుండ్‌లో సాన్నమాచరిస్తే, శైవ సాధువులు కుశావర్త్‌లో పుణ్యస్నానం చేస్తారట.

కుశావర్త్: 
గోదావరీ నది కుశావర్త్ నుంచి రామ్‌కుండ్‌లోకి ప్రవహిస్తుంది. అందువల్ల ఈ రెండు ప్రదేశాలూ కూడా పవిత్రమైనవే. అయితే భక్తులు సైతం కుశావర్త్‌లో స్నానమాచరించేందుకే మక్కువ చూపుతారు. భగవంతుడు సైతం తొలగించలేని పాపాలు ఇక్కడ మునకలేయడంవల్ల పోతాయని విశ్వసిస్తారు. అందుకే కుశావర్తాన్ని మహిమాన్విత క్షేత్రంగా చెబుతారు. గౌతమ మహర్షి తన గోహత్యా పాతకాన్ని ఈ కుశావర్త్‌లో స్నానమాచరించడంవల్ల పోగొట్టుకోగలిగారన్నది పురాణేతిహాసం. అప్పట్లో వర్షాభావంతో తీవ్రమైన కరవు ఏర్పడటంతో తన ఆశ్రమం చుట్టూ ఉన్న కొద్దిస్థలంలోనే ధాన్యం పండించి, రుషులకు భోజనం పెట్టేవాడట గౌతమమహర్షి. ఓసారి తన పొలంలో ఆవు మేస్తుంటే, దాన్ని తోలేందుకు ఓ దర్భను విసిరాడట. సూదిమొనగుచ్చుకుని అది ప్రాణం విడిచిందట. గోహత్యా పాతకాన్ని చుట్టుకున్న గౌతముడు, దాన్ని తొలగించుకునేందుకు గంగలో స్నానం చేయదలిచి, బ్రహ్మగిరిమీద తపస్సు చేయగా, శివుడు గంగను విడిచాడట. శివుణ్ణి వీడటం ఇష్టంలేని గంగమ్మ ముందుగా బ్రహ్మగిరిమీద ఉన్న గంగాద్వార్, త్రయంబక, వరాహ, రామలక్ష్మణ, గంగాసాగర... ఇలా అనేక చోట్ల ప్రత్యక్షమై మాయమైపోతున్నదట. దాంతో ఆ తీర్థాల్లో మునకలేయలేక ఒకచోట వెలసిన నీటి ప్రవాహం చుట్టూ గడ్డి వేసి ఎటూ వెళ్లకుండా చేసి స్నానం చేశాడట గౌతముడు. అదే కుశావర్తంగా వాడుకలోకి వచ్చింది.

మహిమాన్విత బ్రహ్మగిరి: 
పుణ్యస్నానం తరవాత బ్రహ్మగిరికి వెళతారు యాత్రికులు. ఇది సముద్రమట్టానికి 4248 అడుగుల ఎత్తులో ఉంది. అంటే త్రయంబకేశ్వర పట్టణం కన్నా 1800 అడుగుల ఎత్తులో ఉందన్నమాట. ఈ పర్వతాన్ని శివస్వరూపంగా చెబుతారు.ఈ బ్రహ్మగిరి మీదే బ్రహ్మదేవుడు తపస్సు చేసి సృష్టి నిర్మాణానికి అవసరమైన శక్తినీ సిద్ధినీ పొందాడట. అందుకే దీనికి బ్రహ్మగిరి అని పేరు అన్నది ఓ పౌరాణిక కథనం. ఈ బ్రహ్మగిరి పర్వతానికి సద్యోజాతం, వామదేవ, అఘోర, ఈశాన, తత్పురుష అను ఐదు శిఖరాలు ఉన్నాయి. బ్రహ్మగిరిమీద ఉద్భవించిన గంగానది మూడు పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. తూర్పువైపు ప్రవహించే పాయని గోదావరి అనీ దక్షిణం వెపు ప్రవహించే నదిని వైతరణి అనీ, పడమటివైపు ప్రవహించే నదిని గంగ అనీ పిలుస్తారు. పడమటి వైపు ప్రవహించే గంగానది చక్రతీర్థం దగ్గర గోదావరిలో కలుస్తుంది.

No comments:

Post a Comment