Thursday, 11 February 2016

అందమైన ప్రకృతి ప్రాంతం పట్టిసీమ

పట్టిసీమ గ్రామం నుంచి కొద్ది దూరంలో గోదావరిలో దేవకూట పర్వతంపై వెలసిన వీరభద్రస్వామి, భావనారాయణ స్వామి వార్ల ఆలయాల వల్లే ఈ ఊరికి పేరు వచ్చిందంటే అతిశయోక్తి కాదు.

ఆలయ విశేషాలు : 
పాపికొండల మధ్య సాగే గోదావరి నది ఒడ్డున ఉన్న చిన్న కొండపై ఈ వీరభద్రస్వామి దేవస్థానం కొలువై ఉంది. చుట్టూ గోదావరి మధ్యలో దేవాలయం ఉండడంతో ఇక్కటి వాతావరణం గంభీరంగానూ, అందంగానూ ఉంటుంది. అలాగే ప్రస్తుతం విస్తరణ పనుల్లో భాగంగా ఆలయం చుట్టూ పెంచిన చెట్ల పెంపకంతో ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారిని ఈ దేవాలయం విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ కారణంగానే దాదాపు అన్ని కాలాల్లో ఇక్కడ సినిమా షూటింగ్‌లు సైతం జరుగుతుంటాయి. పట్టిసం అని, పట్టిసీమ అని రెండు రకాలుగా పిలిచే ఈ ఊరిలో వెలసిన వీరభద్రస్వామి ఆలయం మరీ అంత పెద్దది కాకపోయినా సమీప గ్రామాల్లో ఈ ఆలయం అంటే విశేషమైనదిగానే పేరు పొందింది. ఏడాది మొత్తంలో జరిగే చిన్నా చితకా ఉత్సవాలతో పాటు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఐదు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు చుట్టూ ఉన్న ఊర్ల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు.

వసతి సౌకర్యాలు :
కొంతకాలం క్రితం వరకు ఈ వీరభద్రస్వామి దేవస్థానం అంతగా అభివృద్ధి చెందని కారణంగా ఇక్కడ సౌకర్యాలు సైతం అరాకొరగానే ఉండేవి. అయితే ఇటీవలి కాలంలో దేవస్థానంకు రాబడి పెరిగిన కారణంగా విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా దేవాలయం ప్రాంతాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో ఇక్కడ భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.

రవాణా సౌకర్యాలు: 
తూర్పు గోదావరి జిల్లాలోని ప్రముఖ నగరమైన రాజమండ్రి నుంచి ఈ పట్టిసీమ దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రి నుంచి పట్టిసీమకు ఎల్లప్పుడూ బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రకృతినీ ఆస్వాదిస్తూ వెళ్లాలనుకునే వారికి రాజమండ్రి నుంచి పాపికొండల మధ్య ప్రవహించే గోదావరిపై ప్రయాణించే లాంచీలు కూడా అందుబాటులో ఉన్నాయి.


 
పట్టిసీమ భావనారాయణ స్వామి
పంచ భావనారాయణ స్వామి క్షేత్రాలలో పట్టిసీమ భావనారాయణ స్వామికి ఎంతో విశిష్టత వుంది. ఇక్కడి భావనారాయణ స్వామికి యుగయుగాల నాటి చరిత్ర వుంది. శ్రీ మన్నారాయణుడి అనుగ్రహాన్ని కోరుతూ జాంబవంతుడు తపస్సు చేయగా, ఈ క్షేత్రంలో భావనారాయణ స్వామిగా అవతరిస్తానని స్వామి మాట ఇచ్చాడు. ఈ నేపథ్యంలో కృతయుగంలో స్వామి వైకుంఠంలో అమ్మవారితో ముచ్చటిస్తూ వుండగా, ఒక ఏనుగు ఆర్తనాదం వినిపించింది. దాహం తీర్చుకోవడం కోసం ఒక ఏనుగు సరస్సులోకి దిగగా, దాని కాలును ముసలి గట్టిగా పట్టుకుంటుంది. తన శక్తినంతటిని ఉపయోగించి ఆ ఏనుగు దాని బారి నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తోంది. తన శక్తి నశిస్తూ ఉండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో శ్రీ మహా విష్ణువును ప్రార్ధిస్తుంది. ఆ అరుపులోని భావనను బట్టి ఆ ఏనుగు ఎంతగా బాధపడుతుందో శ్రీ మహావిష్ణువు అర్థం చేసుకున్నాడు. ఆ మూగ జీవాన్ని రక్షించాలనే తాపత్రయంతో శంఖు చక్రాలను కూడా మరిచిపోయి కంగారుగా ఆ సరస్సు దగ్గరికి చేరుకొని ఏనుగుకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఆర్తుల మనసులోని భావనను బట్టి వారిని రక్షించే స్వామి కావడంతో భావనారాయణ స్వామిగా భక్తులు కొలుస్తుంటారు. ఏనుగును కాపాడే హడావిడిలో స్వామి ఉన్న సమయంలో, నారద మహర్షి ఆయన శంఖు చక్రాలను తీసుకు వచ్చి ఇచ్చాడు. ఏనుగును కాపాడే ఆదుర్దాలో స్వామి వాటిని అపసవ్యంగా ధరించాడు. నేటికీ స్వామి ఇదే ముద్రలో ఇక్కడ దర్శనమిస్తుంటాడు. జాంబవంతుడికి ఇచ్చిన మాటమేరకు స్వామి ఇక్కడ 'దేవకూట పర్వతం'పై శ్రీ భూనీలాదేవి సమేతుడై వెలిశాడు. ఇలా కృతయుగంలో ఆవిర్భవించిన స్వామి ఎందరో మహర్షులచే దేవతలచే పూజలందు కున్నాడు.

కలియుగంలో కూడా ఎందరో మహానీయులచే ఆరాధించబడిన స్వామికి చోళ రాజులు ఆలయాన్ని నిర్మించగా, రెడ్డి రాజులు ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. భక్తుల భావనను గ్రహించి వారి కోరికలను స్వామివారు సత్వరమే నెరవేరుస్తాడని స్థానికులు చెబుతుంటారు. ప్రతియేటా స్వామివారికి చైత్ర శుద్ధ ఏకాదశి రోజున కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరిస్తుంటారు.

No comments:

Post a Comment