Tuesday, 15 March 2016

వెంకన్న తొలి కాపురం ఇక్కడే !

వెంకన్న తొలి కాపురం ఇక్కడే !కొండపై గుడి కట్టేదాకా ముక్కోటిలోనే కొలువు

సువర్ణముఖి నది ఆవిర్భవించిన ‘ముక్కోటి’ అగస్త్యే శ్వరుడు కొలువైన పవిత్ర శైవక్షేత్రం. తిరుమల వెంకన్న నారాయణవనంలో పద్మావతీదేవిని పరిణయ మాడి తిరుమల వెళుతూ ముక్కోటికి వచ్చి అగస్త్యుడి అనుజ్ఞతో ఆరు నెలల పాటు ఇక్కడే ఆవాసం చేశాడట. తొండమానుడితో కొండపై గుడి కట్టించుకుని ఆనక తిరుమల క్షేత్రం చేరుకున్నాడని ప్రతీతి.


స్థలపురాణం : అగస్త్యుడి ఆశ్రమమే ఆలయమైంది స్వర్ణముఖి నది ఆవిర్భవించిన పుణ్యక్షేత్రం ముక్కోటి. చంద్రగిరి మండలం తొండవాడ వద్ద వెలసిన ఈ క్షేత్రం ఒకనాడు శ్రీఅగస్త్యమహాముని ఆశ్రమం. దీనిని అగస్త్య పూజిత విష్ణుపాదంగా కూడా పిలుస్తారు. అగస్త్యుడు ఒకనాడు స్వర్ణముఖిలో స్నానం చేస్తుండగా నదిలో ఒక శివలింగం లభ్యమైందట. దానిని గట్టుమీద ప్రతిష్టించి శ్రీ అగస్త్యేశ్వరస్వామిగా ఆయన నామకరణం చేశారు. తిరుమల శ్రీనివాసుడు నారాయణవరంలో ఆకాశరాజు కుమార్తె శ్రీపద్మావతీదేవిని వివాహమాడి తిరుమలకు వెళుతూ ఈ ఆశ్రమంలో శ్రీఅగస్త్యమహామునిని దర్శించుకున్నారట. నూతన వధూవరులు పసుపుబట్టలతో కొండకు వెళ్ళరాదని అగస్త్యుడు సలహా ఇవ్వడంతో పద్మావతిదేవి, శ్రీనివాసులు ఈ ఆశ్రమంలోనే ఆరుమాసాల పాటు ఉన్నారని ఐతిహ్యం. ఆకాశరాజు మరణానంతరం రాజ్యం కోసం తమ్ముడైన తొండమానుడు, కుమారుడైన వసుధాముడు పోట్లాటకు దిగారు. వారికి భాగపరిష్కారం చేసి పోట్లాటను ఆపమని అగస్త్యుడు శ్రీనివాసుడికి సలహా ఇవ్వగా దానిని శ్రీనివాసుడు పాటించాడు. ప్రతిగా తొండమానుడు తిరుమలలో వెంకన్నకు ఆలయం నిర్మించి ఇచ్చాడట. ఆరుమాసాల తరువాత వేంకటేశ్వరుడు అగస్త్యమహాముని అనుజ్ఞ తీసుకొని తిరుమలకు వెళ్లాడు. అందువల్ల ఈ క్షేత్రానికి అగస్త్యపూజిత విష్ణుపాదం అన్న పేరొచ్చింది. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసిన తమిళనాడుకు చెందిన నాటుకోటి శెట్టియార్లు ఈఆలయాన్ని కూడా జీర్ణోద్ధరణ చేసి ఆలయ పాలనను నిర్వహించి అనంతరం ప్రాంతీయులైన మోగిలిరెడ్లకు అప్పగించారు.

విశేషం : రాతిబండపై విష్ణుపాదం ఈ క్షేత్రంలో ఆరునెలలు నివసించినందుకు గుర్తుగా వేంకటేశ్వరుడు నదిలోని బండపై తన పాదముద్రలను వదిలాడట. నేటికీ ఈ గుర్తును భక్తులు చూడవచ్చు. అగస్త్యేశ్వరస్వామి ఆలయాన్ని ముప్పై సంవత్సరాల క్రితం జీర్ణోద్ధరణ చేసి భద్రాచలం రాములవారి ఆలయం తరహాలో విగ్రహాలతో అందంగా నిర్మించారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా గణేశ, కార్తికేయ, వీరభద్ర (కాలభైరవ), సుందరేశ్వర, పంచముఖేశ్వర, దుర్గాదేవి, శ్రీమహాలక్ష్మి, శ్రీకృష్ణ, ఆంజనేయ, సుబ్రహ్మణ్యస్వాములకు చిన్నచిన్న గుడులు వెలిశాయి. స్వర్ణముఖినదిలో రాతిబండపైన విష్ణుపాదముద్రతో పాటు శివకేశవ, అయ్యప్పస్వామి విగ్రహాలు నెలకొన్నాయి.

ఆలయ విశిష్టత... ముక్కోటి ఆలయం ఎంతో విశిష్టత కలిగిఉంది. శ్రీహరి, పద్మావతిదేవి ఆరుమాసాలు ఇక్కడ ఉన్నారు కనుక ఈస్థలం ఎంతో పవిత్రమైనది భావిస్తుంటారు.అంతేకాకుండా శ్రీవేంకటేశ్వర అష్టోత్తర శతకంలో 105వ నామంలో సువర్ణముఖరీ స్నాత మనుజాభీష్ట దాయినే.. అని ఉంది. అంటే సువర్ణముఖిలో స్నానం చేసే వారందరి అభీష్టాలు శ్రీ వేంకటేశ్వరుడు నెరవేరుస్తాడని అర్థం.

ఉత్సవాలకు కొదవేలేదు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పౌర్ణమినాడు రుద్రపాదాల ముక్కోటి ఉత్సవాలను మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మొదటి రోజు అన్నాభిషేకం, రెండవరోజు సువర్ణముఖీ తీర్థ ముక్కోటి లింగోద్భవ అభిషేకం, మూడవరోజు కల్యాణం నిర్వహిస్తారు. కార్తీక సోమవారాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి ఉత్సవాలు అత్యత వైభవోపేతంగా జరుగుతాయి. జనవరిలో అయ్యప్పస్వామి పూజాదినాలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి గురువారం భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.No comments:

Post a Comment