Saturday, 5 March 2016

యాగంటి బసవయ్య రంకె లేసేను - మహానంది


కర్నూల్ జిల్లా బనగాన పల్లెకు 15 కి.మీటర్ల దూరంలో యాగంటి గ్రామంవద్ద " యాగంటేశ్వర " అని ప్రసిద్ద శైవపుణ్యక్షేత్రం ఉన్నది. ఈ క్షేత్రమునకు వెనుక భాగామున ఎత్తైన " ఎర్రమల " కొండలు, గుహలు ఉన్నవి. ఇక్కడి ఆలయంలో ఈశ్వరుడు లింగాకారములో గాక విగ్రహరూపంలో వుండడం ఒక ప్రత్యేకత. నందిరూపంలో విగ్రహం భయంకరంగా ఉన్నది, భూమిని చీల్చుకొని నందీశ్వరుడు వెలికి వచ్చాడని. అచట ఆలయము నిర్మించి పూజలు జరిపారని అక్కడి స్థానికుల కథనం. ఇక్కడి ఈశ్వరుడిని నందీశ్వరుడు అని పిలుస్తున్నారు. ఇక్కడే అగస్త్య మునీశ్వరులు చేసిన తపస్సుకు మెచ్చి మునీశ్వరులు కోరిన విధంగా ఏకశిలలో శ్రీఉమామహేశ్వర్లుగా వెలిసినారని, లింగాకృతిలో కాకుండా శిలాకృతిలో వెలసిన శివక్షేత్రము భారతావనిలో ఎచ్చటా లేదని ప్రతితి.


ఇక్కడి నిర్మాణల శైలినిబట్టి క్రీ.శ 7.8 శతాబ్దములలో పల్లవులు, చోళులు, చాళుక్యులు, ఒకరి తర్వాత మరొకరు నిర్మించి, కొన్నినిర్మణాలను అసంపూర్తిగా వదిలివేయగా... వాటిని క్రీ.శ. 13.,14 శతాబ్దాలలో విజయనగర ప్రభువులు పూర్తిగావించారని విశ్లేషుకుల అంచనా. నేనిక్కడికి రావడానికి మరో ముఖ్యమైన కారణం..ఈ ఆలయ ముఖమండపములోని ఈశాన్య భాగములోనున్న నందీశ్వరుడు అంతకంతకు పెరుగుతూ వస్తున్నాడట. అక్కడున్న పరిస్థితిని చూస్తే నిజమనేనిపిస్తుంది..! నందీశ్వరుడు చుట్టూ వున్న నాలుగుస్థంబాల మంటపం నిండా నందీశ్వర విగ్రహం నిండి ఉన్నది. రెండు స్థంబాలు కొద్దిగా పక్కకు జరుగుతున్నాయి..అవి పడిపోకుండా కొన్ని బండరాళ్ళును ఆసరగా వుంచారక్కడ.
మీరు ఫోటోలలో చూస్తే అర్థమవుతుంది. సుమారు 90 సంవత్సరాల క్రితం ఆ నాలుగు స్తంబాలలోపల నందీశ్వరుని చుట్టూ ప్రదక్షణలు చేసేవారట..!! కాని నేడు మాత్రం అలాంటి అవకాశమేలేకుండా పూర్తిగా మంటపం నిండుగా పెరిగిపోయాడు. భారత పురావస్తుశాఖ వారి లెక్కల ప్రకారం ప్రతి 20 ఏళ్ళకు ఒక అంగుళం పరిమాణంలో పెరుగుతూ వస్తున్నదట ఈ నందీశ్వర విగ్రహం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలఙ్ఞానంలో " యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగానంతమున లేచి కాలుదువ్వి రంకె లేసేను " అని వ్రాసారట. కాబట్టి ప్రస్తుత మీడియాలో చూపుతున్న 2012 గోల గురించి జనమంతా మరిచిపోవచ్చు..!!


ఈ దేవాలయం వాయువ్యదిశకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ సహజంగా వెలసిన అగస్త్య పుష్కరిణి కనపడుతుంది, నేనెల్లిన సమయంలో మన పూర్వీకులు పుష్కరిణిలో జలకాలాడుతున్నారు.. మన పూర్వీకులంటే అర్థం కాలేదా..? అదేనండి మన వా’నరులు’ పుష్కరణీకి రెండు వైపులున్న ప్రాకారముల మీద నుండి డిల్లీలో జరిగిన కామన్‌వెల్త్ ఆటలలో స్విమ్మింగ్ డైవ్ చేసినట్లుగా ఈ వానరలు చేస్తుంటే చూట్టానికి బలే ముచ్చటగా వుంది. ముందే కోతులు.. ఇక మనుషులు ఎవ్వరూ లేకపోవడంతో వాటి ఇష్టారాజ్యంలాగ డైవింగ్..స్విమ్మింగ్..యమ ఫాస్ట్‌గా చేస్తున్నాయి.

ఈ క్షేత్రమునకు 15 కి.మీ దూరములోనున్న " ముచ్చట్ల " క్షేత్రము నుండి పర్వతశ్రేణుల గుండా నీరు ప్రవహించి ఇక్కడి అగస్త్య పుష్కరణిలో కలుస్తాయి. ఈ పుష్కరణీలోను సహజసిద్దమైన నీటి ఊట ఉన్నది స్వచ్చంగా తేట తెల్లగా ఉన్నాయి నీరు. దీనికి ఉత్తరభాగానున్న పర్వతరాయికి దేవనాగరలిపిలో ఆ విశేషాలు చెక్కబడి వున్నాయి. ఇక్కడ నుండి ఆలయానికి ముందుభాగానున్న పెద్దకోనేరుకు చేరుకుంటాయి. అక్కడ నుండి ఆ క్షేత్ర పరిసర ప్రాంతంలో నున్న 20 ఎకరాల భూమిలో సాగుకు మాత్రమే పరిమితమై ఇంకిపోతున్నాయి.ఈ క్షేత్రమునుకు వెనుకభాగాన ఆలయము చుట్టూ అర్థచంద్రాకరాంలోనున్న " ఎర్రమల " కొండల వద్దకు చేరుకుంటే అక్కడ మూడు గుహలు 50 అడుగుల మద్యదూరంతో పక్కపక్కనే వున్నవి. మొదటిగుహను " రోకళ్ళ గుహ " అని పిలుస్తున్నారు. చాలా పెద్దగుహ లోపలికి వెళ్ళడానికి తాపలు వున్నాయి కాకపోతే ఏటువాలుగా కంటే కాస్త నిటారుగా ఉన్నాయి. అవెక్కి పైకి వెళ్ళాక అక్కడ ఒక శివలింగం కనపడుతుంది. అగస్త్యముని శివలింగప్రతిష్టాపన చేసి అక్కడే ధ్యాన సాదన చేసారని అక్కడి వారి విశ్వాసం.


రెండవది వేంకటేశ్వర గుహ. ఇక్కడ వేంకటేశ్వర విగ్రహ ప్రతిష్టాపనలో జరిగిన కొన్ని పొరబాటుల వలన, విగ్రహపతిష్టకు అనర్హముగా భావించి విగ్రహాన్ని ఇక్కడ బద్రపరిచారు. మూడవది శంకర గుహ.. ఇక్కడ ఏంతో మంది మునీశ్వరులు తపస్సు చేసారని చెబుతున్నారు. తర్వాత చాలా మంది ప్రశాంతముగా ధ్యానము చేసుకొనటకు ఈ గుహను ఉపయోగించారట.ఇక్కడి గుహలలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తపస్సు చేస్తూ కాలఙ్ఞానము రచించాడనీ.. ఆ సమయములో ఆయన నోట " ఏన్ కంటిని " అన్న మాట వెలుబడనదనీ అప్పటినుండి ఈ ప్రాంతాన్ని " ఏన్ కంటిని " అనిపిలుస్తూ కాలక్రమేనా యాగంటిగా రూపాంతరం చెందిందని అంటున్నారు. ఇక్కడి గుహ లోపలి భాగములో కాలఙ్ఞాన గ్రంథము పూర్తి ప్రతి లభ్యము కావచ్చని కొందరి భావన.బనగాన పల్లె నుండి ఈ క్షేత్రానికి వెళ్ళే మార్గమద్యలో 12 వ కి.మీటర్ వద్ద కుడి వైపున చిన్న గుట్టాలంటి ఎత్తైన ప్రదేశంలో పాతకాలం నాటి ఒక భవంతి కనపడుతుంది. చూడడానికి గంభీరంగా ఉంటుంది. 400 సంవత్సరాల క్రితం బనగానపల్లె నవాబు తన ప్రేయసికోసం నిర్మించిన భవంతి. ప్రస్తుతం అది హైదరాబాద్‌లో ఉన్న నిజాం నవాబుల ఆదీనంలో ఉన్నది. వాళ్ళు ఎవరోగాని ఈ భవంతి ఆలనాపాలనా చూడట్లేదు. వెలుపలి భవనమంతా చూడడానికి చాలా గంభీరంగా ఉంటే..లోపల మాత్రం చాలా ధారుణంగా ఉంది. రాత్రిల్లు అసాంఘీక మనుషులొచ్చి తాగి తందనాలాడి లోపలి గదులన్ని మురకిపట్టించారు. మొదటి అంతస్తులో వున్న హాలు గదియెక్క పైకప్పు పడిపోయి ఉన్నది. అక్కడొక మనిషిని వున్నారు కాని..అతనివల్ల ఆ భవనాన్ని ఎటువంటి రక్షణ లేదు. కాని భవనం మొత్తం రాతితో నిర్మించారు. ఇప్పటికైనా భారత పురావస్తు శాఖ వారు ఈ భవనాన్ని స్వాదీనం చేసుకొని, మరమత్తులు చేసి ఒక యాత్రాస్థలంగా మారుస్తే బాగుంటుంది.
మరి కొన్ని ఫోటోస్ కింద చూడండి.
- మహానంది -


ఈ క్షేత్రం గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రాయలసీమ ప్రాంతంలోనే గాక కన్నడ, తమిళ రాజ్యాలలో కూడ ప్రాచుర్యం పొందింది. నంద్యాల మండలమునకు 12 కి.మీ దూరాన నల్లమల కొండల్లో ప్రకృతిసిద్దమైన సుందరప్రదేశమున అర్థచంద్రాకారముగా నున్న ఒక కొండవొంపులో ఈ క్షేత్రము వున్నది. ఇక్కడకు చుట్టుపక్కల పదహైదు కిలోమీటర్ల పరధిలో ప్రథమనంది, నాగనంది, వినాయక నంది, శివనంది, సూర్యనంది, విష్ణునంది, సోమనంది అని ఎనిమిది నందీశ్వర క్షేత్రాలున్నవి, మహానందితో కలిపి నవనంది క్షేత్రాలు అంటారు. వీటి ప్రాదుర్భవాన్ని గురించి ఎన్నో కథలు ప్రచారంలో వున్నవి. ఈ నవనందీశ్వరాలయములు ప్రాచీన చాళుక్యుల కాలమునాటివని కొందరంటారు.


మహా నందీశ్వరాలయనికి చుట్టూ " తిరుచుట్టు మాళియ " అనబడే చుట్టు మండపము వున్నది. మద్యలో కళ్యాణమంటపాదులు ఉన్నవి. ఆలయ విమానం అంతస్తులుగా విభజింపబడి నిర్మితమైంది. ప్రతి అంతస్థు అమలక శిలతో శిఖరం వలె వేరు చేయబడింది, అన్ని అంతస్తులు కూడి మహావిమానమేర్పడి వున్నది. ఆలయంలో స్వామివారిని అభిషేకించిన జలము బయటకు రాకుండా లింగం అధోభాగంలో చేరి అచట గల జలఊటలో కలిసిపోతుంది. లింగము కిందనుండి ఎల్లవేళలా బుగ్గవలే నీటి ప్రవాహం వస్తుంటుంది, వాటిని మూడు కుండముల గుండా వెళ్ళే ఏర్పాట్లు చేసారు మనం ప్రదానఆలయ ప్రాంగణములోనికి ప్రవేశించగానే స్వచ్చమైనా నీటితో నిండిన రుద్రకుండము ప్రధాన అలయానికి ముందువైపున కనపడతుంది. దీని చుట్టూ రాతితో ప్రాకారం కట్టినారు. తూర్పు వైపున అమర్చిన నంది నోటిలోనుంచి నీరు ఈ కుండములోనికి ప్రవహిస్తుంది, వచ్చిన భక్తులు, యాత్రికులు ఇక్కడ జలకాలాటలు అడతారు.


ఇక్కడనుండి తూములగుండా నీరు బయటకొచ్చి బ్రహ్మ, విష్ణు కుండాలను చేరుకుంటుంది. యాత్రికులు బయటి ఆలయప్రహరి ముఖద్వారం నుండి పెద్ద పెద్ద చెట్లతో వున్న విశాలమైన ఆలయప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఎదురుగా వున్న ఆలయమంటపంకు వెళ్ళే దారికిరువైపుల ఈ బ్రహ్మ,విష్ణు కుండాలను చూడవచ్చు. ఇక్కడ కూడ భక్తులు స్నానాలు చేస్తారు. చాలా స్వచ్చంగా ఉంటాయి ఇక్కడినీరు, నీటి అడుగున వున్న నేల చాలా స్పష్టంగా కనపడుతుంది..అంత తేటతెల్లగా ఉంటాయి నీరు.. అక్కడ ప్రభుత్వంవారు " స్నాం చేయు భక్తులు దయచేసి సబ్బును ఉపయోగించారాదు, బట్టలు ఉతకరాదు " అని బోర్డు పెట్టినా ’ అబ్బే మనం ఏది చేయవద్దని చెబుతామో అదే చేస్తాము... అదీ మన భారతీయ సంస్కృతి ’ ఆలయసిబ్బంది ఎంతమందికని చెబుతారు..చెప్పి..చెప్పి విసిగి వదిలేసారు..పాపం.! జనాలు మాత్రం సబ్బును ఉపయోగించడమే..బట్టలు ఉతకడమే..ఇంత చేస్తున్నా కొందరు భక్తులు ఆ నీటిని మ్రోక్కుకొని కాసిన్ని నోటిలో వేసుకొని వెళ్తున్నారు..! అది చూసిన నాకు ఒళ్ళు జలదరించింది...నేను నీటి దగ్గరికి వెళ్ళి చూస్తే.. మనుషులు అంత మలినం చేసినా ఆ నీరు మాత్రం తన స్వచ్చతను కోల్పోలేదు..’ చాలా స్వచ్చంగా అలానే ఉన్నాయి..!


ఆ నీరు అక్కడ నుండి కాలువల ద్వారా అరటితోటలకు, పంటపొలాలకు ఉపయోగపడుతున్నది. ఈ నీటిద్వార రెండు వేల హెక్టారుల మేరకు పంటభూములు సస్యశ్యామలమవుతున్నది. అది నిజమేననిపిస్తుంది నంద్యాల పట్టణములోకి అడుగుపెట్టగానే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చుక్కరటిపండ్లు కనపడతాయి. నంద్యాల నుండి మహానందికి వెళ్ళే దారిపొడవునా అరటితోటలు రహదారికి ఇరువైపులా ఉన్నాయి.

No comments:

Post a Comment