Thursday, 31 March 2016

బెంగళూరు నుండి తిరుపతి కి రోడ్ ట్రిప్ జర్నీ !!

బెంగళూరులో చాలా వరకు ఎక్కువ సంఖ్యలో తెలుగు ప్రజలు ఉన్నారు. ఏదైన వారాంతంలో చాలా మంది తరచూ తిరుపతి వెళ్ళి అలా వస్తుంటారు అవునా ..! 
బెంగళూరు ప్రజలైతే మరీను ..! 
దగ్గరలో ఉంది కాబట్టి ఒక్క రోజులో వెళ్ళి వస్తుంటారు. 
బెంగళూరు నుండి తిరుపతికి మీరు ఎప్పుడైనా బైక్ లేదా సొంత వాహనాల వెళ్ళరా ..?? 
ఒకవేళ అలా వెళితే ఏ ఏ ప్రదేశాలు మీకు కనిపించాయి ...?? 
అక్కడ ఏమేమి చూడాలి..?? 
ఎప్పుడైనా ఆలోచించారా ..!! 
అయితే ఈ దిగువ పేర్కొనబడిన సారాంశం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

బెంగళూరు తిరుపతి మార్గం
బెంగళూరు నుండి తిరుపతి 260 కి. మీ. దూరంలో ఉన్నది. ప్రయాణ సమయం సుమారుగా 5 గంటలు పడుతుంది. బెంగళూరు నుండి తిరుపతికి గల జాతీయరహదారి నెంబర్ 4. మీరు ఈ రహదారి గుండానే తిరుపతికి వెళ్ళాలి.

కోలార్
కోలార్ తిరుపతికి వెళ్లే మార్గంలో కనిపిస్తుంది. ఈ ప్రదేశం బంగారు గనులకి ప్రసిద్ధి. అలాగే అద్భుతమైన దేవాలయాలను, చారిత్రక కోటలను కలిగి ఉంది.

కోలారమ్మ గుడి
కోలార్ లో తప్పక చూడవలసినది కోలారమ్మ గుడి. ఇక్కడి ప్రధాన దైవం పార్వతి దేవి. 'ఎల్' ఆకారం లో కనిపించే ఈ దేవాలయాన్ని చోళులు నిర్మించినారు. ఇక్కడ గ్రానైట్ రాళ్లతో చెక్కిన నమూనాలు, విగ్రహాలు అబ్బురపరుస్తాయి.

సోమేశ్వర ఆలయం
కోలార్ జిల్లాలో ఉన్న ప్రముఖ దేవాలయం ఈ సోమేశ్వర ఆలయం. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. ఊరికి మధ్యలో ఉండే ఈ ఆలయాన్ని 14 వ శతాబ్దంలో విజయనగర నిర్మాణ శైలిలో నిర్మించినారు. లోపల ఉండే కళ్యాణ మండపంలోని స్థంబాలపై గల చెక్కుడు లు చైనీస్, థాయి, యూరోపియన్ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి.

ఆది నారాయణ స్వామి 
కోలార్ లో ఎల్లొడు కొండల మీద ఉన్న ఆదినారాయణ స్వామి ఆలయం ప్రముఖంగా చూడవలసినది. ఈ ఆలయానికి చేరుకోవడానికి 618 మెట్లు ఉన్నాయి. చివరికి మెట్లు ఎక్కుకుంటూ గుడి దగ్గరివరకి వెళితే అక్కడ మరో రెండు మెట్లు ఎత్తులో ఉంటాయి. ఈ రెండు మెట్లను కేవలం తాడు సహాయంతో మాత్రమే ఎక్కడానికి వీలుంటుంది.

కోలార్ పర్వతాలు
కోలార్ పర్వతాలను కోలార్ బెట్ట అనికూడా పిలుస్తారు. ఈ ప్రదేశం చేరుకోవాలంటే వందల మెట్లు ఎక్కవలసి ఉంటుంది. అలా పైకి ఎక్కిన తరువాత మీకు ఒక విశాలమైన మైదానం కనపడుతుంది. అలాగే తూర్పు దిక్కున అంతర గంగ కూడా చూడవచ్చు.

అవని
అవని ఇతిహాస నేపధ్యం ఉన్న గ్రామం. ఇక్కడనే సీతాదేవికి లవకుశలు జన్మించినారు మరియు ఈ గ్రామంలోనే రాముడికి, వారి కుమారులైన లవకుశ లకు యుద్ధం జరిగింది. ఇక్కడ వాల్మీకి ఆశ్రమంతో పాటుగా, సీతాదేవి అరుదైన ఆలయాన్ని, రామలింగేశ్వర దేవాలయ సముహాన్ని చూడవచ్చు.

విదురాశ్వత ఆలయం
కోలార్ మీదుగా తిరుపతి వెళ్లే పర్యాటకులు విదురాశ్వత ఆలయాన్ని తప్పక సందర్శించాలి. ఇక్కడ పవిత్రమైన ద్వాపరయుగం నాటి అశోక చెట్టు ఉన్నది. కృష్ణ భగవానుని అనుచరుడు విదురుడి ఈ గుడిలో పూజలు చేయటం వల్ల ఈ గుండికి ఆ పేరొచ్చింది. ఇక్కడ ఉండే ఈ ఆలయ విగ్రహాన్ని భక్తులు రథోత్సవ సమయంలో అధిక సంఖ్యలో దర్శించుకుంటారు.

కోటిలింగేశ్వర
తిరుపతికి వెళ్లే మార్గంలో ప్రపంచంలో కెల్లా పెద్ద లింగంగా చెప్పబడే 108 అడుగుల ఎత్తున్న శివలింగాన్ని చూడకుండా వెళ్ళిపోతారా ?? అవును కొల్లర్ లోని కమ్మసాన్ద్ర గ్రామంలో ఈ మహా విగ్రహం ఉన్నది. ఉదయం, సాయంత్రం 6 గంటలకు 10 మంది పూజారులు వాయిద్యాల నడుమ మంత్రోచ్చారన చేస్తూ నీళ్ళు పోసి అభిషేకం చేస్తారు.

మార్కండేయ కొండ
మార్కండేయ కొండ అన్వేషణలను ఇష్టపడే వారికి బాగుంటుంది. ఈ కొండ దట్టమైన అడవుల మధ్యలో నెలకొని ఉంది కాబట్టి పర్యాటకులకు అసలు సమయమే తెలీదు. పూర్వం ఇక్కడే మార్కండేయులు కొండమీద తపస్సు చేసాడని భక్తుల నమ్మకం. ఇక్కడ మార్కండేయులు పేరుతో గల ఆలయం మరియు జలాశయం చూడవలసినది.

అంతరగంగ
కోలార్ సమీపంలో గల అంతరగంగ అందాలు దాని రాతి నిర్మాణాలలోను, గుహలలోను ఉన్నాయి. సాహసం ఇష్టపడేవారికి, అంటే పర్వతా రోహణ, ట్రెక్కింగ్ వంటివి చేసేవారికి ఈ ప్రదేశం మరువలేని అనుభూతులనిస్తుంది. ఇక్కడి గుహలు కూడా అన్వేషించదగినవే. ట్రెక్కింగ్ కనీసం ఒకటి రెండు గంటలు పడుతుంది. అయితే, కొండనుండి కిందకు వేగంగాను, తేలికగాను రావచ్చు.

పలమనేరు చెరువు
పలమనేరు ప్రదేశంలో కాసింత ఆగి నీరు తాగవచ్చు. నీరంటే అదేదో మినరల్ వాటర్ బాటిల్ లో నీళ్ళు తెచ్చుకొని తాగేరు ..! వద్దు ఇక్కడ చెరువులో లభ్యమయ్యే నీరు తియ్యగా ఉంటుంది కనుక చెరువుల వద్దకి వెళ్ళి నీళ్ళు తాగండి వీలు దొరికితే ఇక్కడే భోజనం చేయండి.

బంగారుపాళ్యం
బంగారుపాళ్యం తిరుపతి వెళ్లే మార్గంలో కనిపిస్తుంది. ఈ ప్రదేశం మామిడి పండ్లకు ప్రసిద్ధి. ఈ ప్రదేశంలో పురాతన మొగిలీశ్వరాలయం ఉంది. ఇక్కడ మామిడి పండ్ల గుజ్జును తయారుచేసి ఎగుమతి చేసే చిన్నా చితక పరిశ్రమలు, దారాల పరిశ్రమలు ఉన్నాయి.

కాణిపాక గణపతి
చిత్తూర్ కి 10 కి. మీ. దూరంలో కాణిపాక గణపతి ఆలయం ఉన్నది. ఇక్కడికి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు కూడా ఆర్టీసీ వారు నడుపుతున్నారు. ఈ ఆలయంలో ఆసత్య ప్రమాణాలు చేయరు అసలు చేయటానికే భయపడతారు భక్తులు. ఆలయంలో స్వామి వారు దినదినం పెరుగుతూపోతుంటారు.

అర్ధగిరి వీరాంజనేయస్వామి
అర్ధగిరి వీరాంజనేయస్వామి అరగొండ గ్రామంలో చిత్తూర్ కి 20 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ గల పుష్కరిణి కి విశేష ప్రాచూర్యం ఉన్నది. తటాకములో నీరు ఎన్నటికీ చెడిపోదని అలాగే ఇప్పటివరకు చెడిపోలేదని భక్తుల విశ్వాసం. మండలం పాటు ఇక్కడి మట్టిని శరీరానికి రాసుకుంటే చర్మవ్యాధులు నయమవుతాయని నమ్మకం. అలాగే పున్నమి నాడు "ఓంకార" శబ్ధం వినపడుతుందని భక్తులు చెబుతుంటారు.

చంద్రగిరి
చంద్రగిరి లో ప్రధానంగా చూడవలసినది రాజమందిరం. పూర్వం శ్రీ కృష్ణదేవరాయలు తిరుపతి దర్శనానికి వచ్చేటప్పుడు ఈ మహల్ ను విడిదిగా ఉపయోగించేవాడు. ఇక్కడ మహల్ రెండు భాగాలుగా ఉన్నది. ఒకటేమో రాణి మహల్, మరొకటేమో రాజా మహల్. రాణి మహల్ రెండు అంతస్తులుగా, రాజమాహల్ మూడు అంతస్తులుగా ఉంటుంది. ఇక్కడ లైటింగ్ మరియు సౌండ్ సిస్టం తో ప్రదర్శనలు సైతం చేస్తారు.

తిరుమల కొండ
తిరుపతిలో ప్రధానంగా చూడవలసినది తిరుమల కొండ. ఇది సముద్ర మట్టానికి 3200 అడుగుల ఎత్తుకంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. ఇక్కడ ఏడు శిఖరాలు ఉన్నాయి. వాటిలో వేంకటాద్రి కొండ మీద శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు.

వెంకటేశ్వర ఆలయం
శ్రీ వెంకటేశ్వర ఆలయం చాలా పురాతనమైన క్షేత్రం. ఇది తిరుమల కొండపై 7 వ శిఖరం వద్ద ఉంది. ఈ ఆలయం సాంప్రదాయ ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. 2.2 ఎకరాల వైశాల్యం లో ఉన్న ఈ ఆలయంలో 8 అడుగుల పొడవైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని జాతి రాళ్లతో అలంకరించి ఉంటారు.

ఆలమేలు మంగమ్మ లేదా పద్మావతి దేవి ఆలయం
అలమేలు మంగమ్మ ఆలయం తిరుపతి సమీపంలో ఉంది. దీనిని తిరుచానూరు అనికూడా పిలుస్తారు. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి భార్య అలమేలు మంగమ్మ లేదా శ్రీ పద్మావతి దేవి విగ్రహం ఉంది. పుష్కరిణి నదిలో ఈ దేవత పుట్టిందని నమ్మకం.

గోవిందరాజస్వామి దేవాలయం
తిరుపతి లోని ప్రధాన క్షేత్రాలలో గోవిందరాజస్వామి దేవాలయం ఒకటి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ దేవాలయం నిర్మించబడింది. దక్షిణం వైపు గుడిలో పార్ధసారధి స్వామి విగ్రహం వుండగా ఉత్తరం వైపు గోవింద రాజ స్వామి గుడి వుంది.

హనుమాన్ ఆలయం
హనుమాన్ ఆలయం తిరుపతికి దగ్గరలో ఉంది. రాముడు, సీతా, లక్ష్మణుడితో పాటు హనుమంతుడు ఇక్కడ ఉన్నాడని నమ్మకం. ఈ ఆలయ ప్రాంగణంలో రామ కుండ౦ అని పిలువబడే చెరువు కూడా ఉంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారంలో వినాయకుని ఆకారంలో ఉన్న విగ్రహాన్ని చెట్టు మొదట్లో చూడవచ్చు.

ఇస్కాన్ ఆలయం
తిరుపతిలోని ఇస్కాన్ కృష్ణుడి ఆలయం తిరుమల కొండలకు వెళ్ళే దారిలో ఉంది. ఇది తెలుపు, బంగారు రంగు స్తంభాల శైలితో ప్రత్యేకమైన నిర్మాణ శైలిని కలిగిఉంటుంది. ఈ ఆలయ గోడలపై నరసింహ స్వామీ, కృష్ణుడు, కృష్ణ లీలలు, వరాహ స్వామీ విగ్రహాల అద్భుతమైన చేక్కుళ్ళు ఉన్నాయి.

కపిల తీర్ధం
తిరుపతి, తిరుమల వంటి ప్రసిద్ధ నగరాలకు దగ్గరలో శివుని విగ్రహం ఉన్న ఒకే ఒక ఆలయం కపిల తీర్ధం. ఈ పెద్ద ఆలయం తిరుమల కొండ పాదాల వద్ద పర్వత ప్రవేశ౦లో ఉంది. ఈ ఆలయ ప్రవేశం వద్ద శివుని వాహనం ‘నంది' ఉంది. శివుని విగ్రహం ముందే ఇక్కడ కపిల మహర్షి ఇక్కడ ఉన్నట్లు, ఆయన పేరుతో దీనికి ఆ పేరు వచ్చినట్లు చెప్తారు.

కోదండ రామస్వామి ఆలయం
కోదండ రామస్వామి ఆలయం చోళ రాజులచే 10 వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇక్కడ రాముని విగ్రహం ఉంది, రామునితో పాటు సీత, లక్ష్మణ విగ్రహాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. రాముడు, సీత, లక్ష్మణునితో పాటు లంక నుండి వచ్చిన తరువాత ఇక్కడే ఉండేవారని పురాణాల కధనం.

శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం
అప్పలాయగుంట లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతి నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుమలలో తన నౌకాయన సమయంలో వెంకటేశ్వర స్వామి ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నట్లుగా నమ్ముతారు. వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తరువాత ఇక్కడ శ్రీ సిద్దేశ్వర, ఇతర ఋషులను ఆశీర్వదించాడు.

పరశురామేశ్వర ఆలయం
గుడిమల్లం లోని పరశురామేశ్వర ఆలయం తిరుపతి నుండి షుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయ గర్భగృహ౦లో ఉన్న శివలింగం ప్రసిద్ది చెందింది. ఇప్పటికీ మొదటిసారిగా కనుగొనబడ్డ శివలింగంగా భావిస్తారు. ఇది 1 లేదా 2 వ శతాబ్దానికి చెందినదిగా నమ్ముతారు.

శ్రీ పద్మావతీ దేవి దేవాలయం
తిరుమల కొండ నుంచి శ్రీ పద్మావతీ దేవి దేవాలయం 5 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవేరి పద్మావతీ దేవి కొలువై వుంది. తొండమాన్ చక్రవర్తి నిర్మించిన ఈ దేవాలయాన్ని ముందుగా దర్శించాకే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలని చెప్తారు.

No comments:

Post a Comment