Saturday, 6 March 2010

కాశీ ప్రయాణంకాశీ ప్రయాణం మేడ్ ఈజీ


పూర్వ కాలంలో కాశీకి వెళ్ళటం కాటికి వెళ్ళటం సమానమనే వాళ్ళు. ఈ నానుడి అలవాటయ్యే కాబోలు మన వాళ్ళు చాలా మంది కాశీ వెళ్ళిరావటం కంటే అమెరికా వెళ్ళి రావటం సులువు అని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళంతా ఓస్ కాశీ ప్రయాణం అంటే ఇంతేనా వెళ్ళోచ్చేస్తే పోలా అనుకుంటారు ఇది చదివాక. ఇంత గ్యారంటీ ఇచ్చానని మూటా మల్లే కట్టేయకండి... ముందు అక్కడి విశేషాలు తెలుసుకోండి.

కాశీ చేరాం.
కాశీ వెళ్ళటానికి మరీ ఎండా, అతివృష్టీ కాకుండా అనువైన సమయం అక్టోబర్ నుంచీ ఏప్రిల్ దాకా. మా ట్రిప్ మార్చి 23 నుంచీ ఏప్రిల్ 3 దాకా. ఈ సమయంలో అక్కడా ఎండలు బాగానే వున్నాయి. తర్వాత మనం భరించలేనంత ఎండలు వుంటాయి. ఎండలు మనకలవాటేకదా అని బయల్దేరి పోయారనుకోండి... ఏ ఎండలు ఎలా వుంటాయో అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. అంతే. పైగా అక్కడ పవర్ కట్ కూడా చాలా ఎక్కువ. దాదాపు పగలంతా పవర్ వుండదు. మేమున్నచోట జనరేటర్ ద్వారా లైట్స్ మాత్రం వచ్చేవి. పగలు సగం పైగా ఫాన్ వుండేది కాదు. ఫైవ్ స్టార్ హోటల్స్ సంగతి నాకు తెలియదు. కాశీలో అవ్వికూడా వున్నాయి. నెట్ ద్వారా ముందే రిజర్వు చేసుకోవచ్చేమో చూసుకోండి.

సరే కాశీ వెళ్ళటానికి పయాణ సాధనాలు మీ ఊరి నుంచీ రైలు వుంటుంది చూడండి మేమయితే మా ఊరు (హైదరాబాదు) నుంచీ మార్చి 23వ తారీకు ఉదయం 9:50 కి పాట్నా ఎక్సప్రెస్ ఎక్కాము. దీనికి PNB ESC Express అని అన్నీ పొడక్షరాలతో కూడా ఒక పేరు వుంది. కానీ Patna Express అంటే సుభ్భరంగా అందరికీ తెలుస్తుంది కదా. ఉదయం 10 గం.ల కల్లా రైలు సికింద్రాబాద్లో బయల్దేరింది. కాజీపేట చేరేసరికి మధ్యాహ్నం 12 గంటలయింది. అక్కడ నుంచీ మా గ్రూప్ మిగతా సభ్యులు మా పిన్ని శ్రీమతి సావిత్రీ మౌళి, సత్యప్రభ, కుసుమ, శ్యామ్ కలిశారు. మా ప్రయాణం సాగీ, సాగీ, సాగీ, మధ్యలో ఇంటి నుంచీ తెచ్చుకున్న పులిహోరలూ, పెరుగన్నాలూ, చపాతీలూ, ఇంకా చాలా బోలెడు ఐటమ్స్ కి న్యాయం చేస్తూ, మర్నాడు సాయంకాలం 3 గం.లకు వారణాసి స్టేషన్ చేరాము. 29 గంటల ప్రయాణం. ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూసిన వారణాసి గాలి తగలగానే ప్రయాణ బడలిక అంతా ఎగిరి పోయింది.

సామానుతో బయటకు వచ్చి, ఒక్కో ఆటోకి 100రూ. చొప్పున 2 ఆటోల్లో మా సామానుతో సహా ఎక్కి గడోలియాలోని శ్రీ సాయి విశ్వనాధ అన్నపూర్ణ సేవా సమితి వారి సత్రంకి చేరుకున్నాము. సింపుల్ గా బనారస్ లాడ్జి అంటే చాలా మందికి అర్ధమవుతుంది. అందులో కొంత భాగం తీసుకుని ఈ సేవా సమితివారు నాలుగు నెలల క్రితం ఈ సత్రాన్ని ప్రారంభించారు. మాకు తెలిసిన వారు అంతకు ముందు అక్కడ వుండి వచ్చారు. బాగున్నదని చెప్పటంతో మా ప్రయాణం నిర్ణయమయిన రోజు నుంచీ ఫోన్ చేస్తున్నాను రూమ్స్ కోసం. మేనేజర్ శ్రీ రామకృష్ణ డోనర్స్ ఎవరన్నా వస్తే మీకివ్వలేము.. కానీ చుట్టు ప్రక్కల తెలిసిన సత్రాలుంటాయి కనుక మీ కిబ్బంది లేకుండా ఎక్కడన్నా రూమ్ ఏర్పాటు చేస్తాము... వారణాసి స్టేషన్ కి రాగానే ఫోన్ చెయ్యండి అన్నారు. అలాగే ఫోన్ చేసి వెళ్ళగానే రూమ్ ఇచ్చి ఆయన మాట నిలుపుకున్నారు. ఈ సత్రం కాశీ విశ్వనాధుని ఆలయానికి దగ్గరలో వుంది.

కాశీలో వసతికి ఇబ్బంది లేదు. అనేక సత్రాలు, హోటల్స్ వున్నాయి. సత్రాలలో కూడా ఎటాచ్డ్ బాత్ రూమ్స్, ఎసీ రూమ్స్ వుంటాయి. సత్రాలని ఫ్రీ అనుకునేరు. వాటికి అద్దెలు కూడా వుంటాయి. మేమున్నది రెండు వరస గదులు, ప్రతి గదిలో రెండు బెడ్స్, కానీ ఒకే బాత్ రూమ్, రోజుకి అద్దె 500 రూ. లు. పెద్ద వరండా. అందులోనే భోజనాలు. భోజనాలంటే గుర్తొచ్చింది. ఇక్కడ చాలా సత్రాలలో మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫెన్ ఏర్పాట్లు వుంటాయి. ఇవి ఉచితమే గానీ, కాశీలో అన్నదాన మహాత్యాన్ని గురించి కొన్నిచోట్ల ఊదరగొడుతూ వుంటారు. అర్ధమయిందిగా. మేమున్న సత్రంలో రూ. 1516 ఇస్తే సంవత్సరంలో మనం కోరుకున్న ఒక రోజు మనమేపేరు చెప్తే ఆ పేరుతో అన్నదానం జరుగుతుంది. ఆ రోజు దాతలు చాలా మంది వుండవచ్చు... వుండాలి కూడా. ఎందుకంటే మా సత్రంలో కొన్ని రోజులు రోజుకి 200, 300 మంది పైన భోజనం చేశారు. అలాంటప్పుడు అంత మందికి భోజనం పెట్టటానికి డబ్బు సరిపోవాలి కదా. పెద్ద గ్రూప్స్ వచ్చినప్పుడు మనకి ఆ హడావిడి కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు గానీ ఊళ్ళ నుంచి వచ్చిన గ్రూప్స్ అంతా ఒక చోట వుండాలంటే కొన్ని ఇబ్బందులు తప్పవు కదా.

సాయంకాలం టిఫెన్లంటే ఇడ్లీ, వడా వూహించుకోకండి. మా సత్రంలో ఇంచక్కా రోజుకోరకం ఉప్మా పెట్టాడు. రెండు రోజులు తినే సరికి ఎక్కడ ఏమున్నాయా అని వెతుక్కోవటం మొదలు పెట్టాం. కిందనే అయ్యర్స్ హోటల్ లో ఊతప్పం, ఇడ్లీ, వడ, దోశ దొరికాయి. పొద్దున్న రోడ్డు పక్కన వేడి వేడి ఇడ్లీ, దోశ తిన్నాము. కాఫీ, టీలకు లోటు లేదు. మంచి పాలు కూడా దొరుకుతాయి. ఇంచక్కా కొంచెం మీగడ వేసి చిక్కని లస్సీ దొరుకుతుంది. స్వీట్స్ కోవాతో చేసినవి బాగుంటాయి. గులాబ్ జామ్, జిలేబీ మనదగ్గరకన్నా అక్కడ రుచి ఎక్కువ. భోజన ప్రియులూ, ఆహారం గురించి కంగారు పడకండి. ఎటొచ్చీ యాత్రా స్ధలాల్లో తినటం అలవాటు చేసుకోవాలి.

సరే కాశీ చేరాము. రూమ్ దొరికింది. ఇంక కాలు నిలవలేదు. గబగబా తయారయి గంగ హారతికి బయల్దేరాము.

budugoy said...
మేము వెళ్ళినపుడు బంగాలీటోలా దగ్గర ఆంధ్రసత్రంలో దిగాం. అదీ బాగుంది. కానీ గుడికి కాస్త దూరం. కానీ అక్కడ కేదార్ ఘాట్ వద్ద లాగ తొక్కిసలాట లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. పొద్దుటే నాలుగింటికి వెళ్ళి ఘాట్ దగ్గర కూర్చుంటే దివ్యమైన సూర్యోదయాలు చూడొచ్చు.
కొండముది సాయికిరణ్ కుమార్ said...
చదవటం కన్నా, అనుభవించి తీరాల్సిన అనుభూతులు కాశీ యాత్రానుభవాలు. అదృష్టం కొద్దీ, రెండుసార్లు వెళ్ళే అవకాశం దొరికింది. మొదటిసారి శంకరమఠం వారి గెస్టు హౌసులో ఉన్నాము. అది ఘాట్ లకు చాలా దూరంలో ఉండేది. తర్వాత, కర్ణాటక సత్రంలో ఉన్నాము హనుమాన్ ఘాట్ కు దగ్గరలో. ఆ పక్కనే, హరిశ్చంద్ర ఘాట్. రాత్రి పదకొండు పన్నెండు మధ్యలో అఘోరీలు వచ్చి హరిశ్చంద్ర ఘాట్ లో పూజలు చేయటం కూడా చూసాము మా సత్రం నుంచి. అక్కడి సౌకర్యాలు ఎంత చిరాకు కలుగచేసినా, ఆధ్యాత్మిక తరంగాలు మాత్రం అత్యున్నతస్థాయిల్లో ఉంటాయి. గంగ హారతి మాత్రం అద్భుతం.

గంగ హారతి
కాశీలో వీధులు చాలా సన్నగా వుంటాయి. దానికి తోడు రోడ్డుకటూ ఇటూ షాపులు, కొనేవారు, ఎప్పుడూ రద్దీగా వుంటాయి. ఆయాసం, జన సమ్మర్దం ఎక్కువ పడని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వుండాలి. మనుషులు నడవటమే కష్టమయిన ఈ రోడ్లలో రిక్షాలు కొన్నిసార్లు దొరుకుతాయిగానీ ఆటోలకి ఆంక్షలున్నాయి. కనుక మనం సమయానికి ఎక్కడికన్నా వెళ్ళాలంటే నడకే ఉత్తమం. (మేమున్న చోటునుంచీ దేవాలయాలకీ, గంగ ఒడ్డుకీ మేము నడిచే వెళ్ళావాళ్ళం.)

మేము కాశీ శ్రీ రామ నవమి రోజు చేరాము. అక్కడవాళ్ళు నవరాత్రులు చేస్తారు. ఉత్సవాలు, ఊరేగింపులు ఎక్కువ. భక్తులు ఊరేగింపులతో తెల్లవారుఝామునుంచే బృందాలుగా దైవ దర్శనానికి వస్తారు. అలాంటి అనేక ఊరేగింపులను మా సత్రంలోంచే చూశాము కాశీ విశ్వనాధ దేవాలయ ప్రవేశ ద్వారం మా వీధిలోనే వుండటంతో.

రోజూ సాయంత్రం 7 గంటలకి దశాశ్వమేధఘాట్ లో రెండుచోట్ల గంగమ్మతల్లికి హారతి ఇస్తారు. గంగ ఒడ్డున మెట్లమీద నుంచీ, ఒక్కో చోటా 7గురు చొప్పున హారతి ఇస్తారు. 45 నిముషాలుపాటు సాగే ఈ హారతి దృశ్యం కన్నులపండుగగా వుంటుంది. దీనిని చూడటానికి జనం తండోపతండాలుగా వస్తారు. టూరిస్టులను ఆకర్షించటానికి ఒక ప్రత్యేక సౌకర్యం. బోట్ లో గంగలోంచి హారతి చూడవచ్చు. రేటంటారా, బేరమాడటంలో మీ ప్రతిభ బయటపడేది ఇలాంటిచోట్లేనండీ. ఒకళ్ళిద్దరున్నా ప్రత్యేక పడవకి రూ. 200 నుంచీ, హారతి మొదలయ్యే సమయానికి మనిషికి రూ. 20 చొప్పున కూడా ఎక్కించుకుంటారు. హారతి జరిగినంతసేపూ పడవ కదలదు. తర్వాత దానికీ కదలటం వచ్చని నిరూపించటానికి అలా తిప్పి తీసుకొస్తారు. ఏదైనా పడవలోంచి హారతి ఎదురుగా చూడవచ్చు. అదే మెట్ల మీదనుంచి అయితే వెనకనుంచో, పక్కనుంచో చూడాలి.

హారతి సమయంలో గంగ ఒడ్డున దీపాలకి గిరాకీ ఎక్కువ. యాత్రీకులంతా మగ, ఆడ తేడాలేకుండా తాముకూడా ఒడ్డున అమ్మే పూలు, దీపాలు కొని గంగకి హారతి ఇవ్వటానికి ఉత్సాహ పడతారు. దీపాల వెలుగులతో కళ కళలాడే ఆ సంబరం చూసి తీరాలి.

మేము హారతి సమయానికి ఒక బోటులో ఎక్కాము. అందులో రామకృష్ణ మఠం స్వామి శారదాత్మానంద స్వామి వున్నారు. శిష్యులతో కలిసి కాశీ యాత్రకి వచ్చారు. వేరే ప్రదేశాలు కూడా చూసుకుంటా, ఇక్కడనుండి కలకత్తాలోని బేలూరు రామకృష్ణ మఠం వారి ఈ యాత్రలో చివరి మజీలీ.

హారతి చివరలో పడవల్లో పిల్లలు రకరకాల పౌరాణిక వేషాలలో పడవలలో ఊరేగింపుగా వచ్చారు. గంగమ్మ ఒళ్ళో ఆ ఊరేగింపు కూడా అందంగా వుంది. శ్రీరామనవమి స్పెషల్ అనుకుంటా ఆ ఊరేగింపు, గంగ ఒడ్డున నాట్య ప్రదర్శనయ అవ్వన్నీ చూసిన తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ మా మజిలీ చేరాం. సత్రంవాళ్ళు పెట్టిన వేడి వేడి రైస్ పొంగలి, వడ తిని విశ్రాంతి తీసుకున్నాం.

రాజశేఖరుని విజయ్ శర్మ said...
గంగను పూజించే సమయంలో మనం ఒడ్డున ఉండి చూడడమే భావ్యమనిపిస్తోంది. నాకెందుకో గంగపై పడవలో ఆ సమయంలో ఉండడమనే భావన అంత సమంజసమనిపించడం లేదు.
psmlakshmiblogspotcom said...
విజయ్ శర్మగారూ మీ భావన సమంజసమేనండీ. గంగకి ఇస్తున్న హారతికి మనం అడ్డు వెళ్తున్నామా అని ఒక్క క్షణం ఆలోచించానుగానీ, అక్కడ వున్న జనాన్ని చూశాక వాళ్ళల్లో ఒకదాన్నయిపోయాను.


గంగా స్నానం
ఉదయం 5 గం. కల్లా గంగాస్నానానికి బయల్దేరాము. సుప్రసిధ్ధ దశాశ్వమేధ ఘాట్ కి పది నిముషాల నడక. గంగ ఒడ్డుకి చేరాం. ఈ ఒడ్డున జనం ఎక్కువ వున్నారు. బోటు వాళ్ళ హడావిడి. గంగ మధ్యలో ఇసుక మేట వేసి వుంది. కొంతమంది బోట్ లో అక్కడ దాకా వెళ్ళి అక్కడ స్నానం చేస్తున్నారు. ఈ గందరగోళంలోకన్నా మధ్యదాకా వెళ్ళి అక్కడ స్నానం చేద్దామనిపించింది. బోటులో అక్కడ దాకా తీసుకెళ్ళి, దగ్గర దగ్గర ఒక గంట అక్కడ ఆగి, తిరిగి ఈ ఒడ్డుకి చేర్చటానికి మనిషికి 20 రూపాయలు తీసుకున్నాడు. అక్కడ కూడా నీళ్ళు కలుషితంగానే అనిపించాయి. కానీ ఆ బోటు అతను, మా సత్రంలోను చెప్పారు "నీళ్ళు అలా కనిపించినా చాలా స్వఛ్ఛమైనవి, చేతిలోకి తీసుకుని చూడండి. దేన్లోనన్నా పట్టి చూడండి ఏమైనా వైరస్ వగైరా వుంటుందేమో చెక్ చేసుకోండి." అని నీళ్ళు మంచివని ఘట్టిగా చెప్పారు. ఏదైనా ఇంత దూరం వచ్చి గంగ స్నానం చెయ్యకుండానా....సెంటిమెంటొకటి. సరే స్నానం చేశాం.

ఇక్కడ బయల్దేరేముందన్నారు..పెద్ద నదుల్లో స్నానం చేసేటప్పుడ ఆ చీరె నదిలో వదిలి పెట్టాలని. మా పెద్దవాళ్ళెవరూ చెప్పకపోయినా చేస్తే పోలా అనిపించి ఆ పనీ చేశాం. చక్కగా పడవతను అన్నీ తీసుకుని దాచుకున్నాడు. పోనీలే ఎవరికో ఒకరికి ఉపయోగపడతాయని సంతోషించాం. అక్కడ ఫోటోగ్రాఫర్ రెడీగా వున్నాడు. ఘాట్ కూడా వచ్చేటట్లు ఫోటో తీసి కాపీ వెంటనే ఇచ్చేస్తానన్నాడు. ఒక్కో ఫోటోకి 20 రూపాయలు. తీయించుకున్నాం. ఖాళీ బాటిల్స్ తీసుకెళ్ళి గంగ నీరు నింపుకుని అక్కడ నుండీ విశ్వనాధుని గుడికి బయల్దేరాము. పడవ దిగి ఘాట్ లో మెట్లన్నీ ఎక్కి పైకి వచ్చేసరికి కొంచెం అలసట అనిపించింది. వేడి వేడి పాలు తాగి గుడికి బయల్దేరాము.

కాశీ విశ్వనాధుని ఆలయం
సన్నటి సందులగుండా అడుగుతూ అడుగుతూ మొత్తానికి చేరాం కాశీ విశ్వనాధుని ఆలయం. ఎన్నాళ్ళనుంచో చూడాలని తపించిన ఆలయం... అతి పురాతన నగరంలోని విశ్వ విఖ్యాతి చెందిన ఆ విశ్వేశ్వరుని ఆలయం దగ్గరలో కనీసం రెండు చోట్ల సెక్యూరిటీ చెక్ వుంటుంది. సెల్ ఫోన్లు, కెమేరాలు తీసుకెళ్తే తప్పని సరిగా బయట షాపులో లాకర్ లో పెట్టి వెళ్ళాలి, అలా పెడితే ధ్యాస వాటిమీదే వుంటుంది, అవి తీసుకెళ్ళద్దని మాకు హైదరాబాదులోనే సలహాలొచ్చాయి. సలహాని పాటించి, ఇచ్చినందుకు వారికి, పాటించినందుకు మాకు శబాష్ చెప్పుకున్నాం. పెన్నులు కూడా తీసుకెళ్ళద్దు. మా పిన్నికి సెంటిమెంట్ వున్న ఒక పెన్ను లోపలకి తీసుకువెళ్ళనియ్యకుండా సెక్యూరిటీ వారి దగ్గర పెట్టుకుని తర్వాత ఇవ్వలేదు. పిన్ని ఒక పెన్ను చూసి తనదేమోనని చూడబోతుంటే, ఎప్పుడు పెట్టారు అని అడిగింది సెక్యూరిటీ లేడీ. చెబితే, ఇది మీదికాదు, అప్పుడు నేను లేను, ఎవరికిచ్చావో వాళ్ళనే అడుగు, దిక్కున్న చోట చెప్పుకో పో టైపులో మాట్లాడింది చాలా దురుసుగా. సెక్యూరిటీ వాళ్ళు డ్యూటీలు మారుతూ వుంటారుగా, ఎవరికిస్తే వాళ అడగాలంటే ఎలా పైగా కొత్త వూళ్లో కొత్త మనుష్యులని గుర్తు పెట్టుకోవటం కష్టంకదా. ఆ స్ధలంలో వున్న సెక్యూరిటీ వాళ్ళు అని గుర్తుపెట్టుకుంటారుగానీ, వాళ్ళ మొహాలు, వాళ్ళ పేర్లు ఎంతమందికి గుర్తుంటాయి.

ఈ చెక్ లు దాటుకుని వెళ్తే విశ్వనాధుని ఆలయం. "నా ఖ్యాతే విశ్వవిఖ్యాతి చెందిందిగానీ, నే వుండే స్ధలం మాత్రం ఇంతే" అనే అమాయకుడు భోళా శంకరుడి గుడి చిన్నదే. మేము తీసుకెళ్ళిన గంగ నీరు శివయ్యకి అభిషేకం చేసి తాకి నమస్కారం చేసుకున్నాము. మొత్తానికి ఆ తోపులాటనుంచి బయటపడి ప్రక్కనే వున్న ఇంకొక శివాలయంలో (ఉపాలయం) కూడా నమస్కరించి బయట పది నిముషాలు కూర్చున్నాము. ఆ పది నిముషాలు కూడా రేపు చేయించబోయే అభిషేకం గురించి అక్కడ మహారాష్ట్ర బ్రాహ్మణునితో మాట్లాడటానికి తప్పనిసరిగా ఆగవలసి వచ్చింది కనుక వుండనిచ్చారు. ప్రదేశం చిన్నదవటంతో లోపల ఎక్కువసేపు కూర్చోనివ్వరు. లోపల కూడా సెక్యూరిటీ చాలా వున్నది. సాధన చేసేవారు, ధ్యానం చేసుకునేవారు ఈ గుళ్ళో చాలా ఎక్కువ వైబ్రేషన్స్ అనుభవించగలరు.

విశాలాక్షి అమ్మవారి ఆలయం - అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి
బయటకొచ్చి 1 కి.మీ దూరంలో వున్న విశాలాక్షి గుడికి నడిచాము. ఆ సందుల్లో రిక్షాలు కూడా రాలేవు. విశాలాక్షి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఆలయం చిన్నదే. అసలు విగ్రహానికి ముందు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రతిష్టించిన విగ్రహం వెనక నుంచి వంగి చూడాలి ఒరిజనల్ అమ్మవారిని. ముందు శ్రీ చక్రం ప్రతిష్టింపబడివుంది. భక్తులు ఇక్కడ కుంకుమపూజ చేసుకోవచ్చు, అక్కడవున్న పండాకి 151 రూ. ఇస్తే పూజ రుసుంతో సహా పూజా ద్రవ్యాలు వాళ్ళే ఇస్తారు. 20 రూ. ఇస్తే అమ్మవారి ఫోటో, కుంకుమ ఇస్తారు. తర్వాత అన్నపూర్ణ తల్లి దర్శనానికి బయల్దేరాము.

అన్నపూర్ణ అమ్మవారి ఆలయం
ఎవరినడిగినా విశ్వనాధుడి గుళ్ళోనే వుంది కదా అన్నారు. (గుడిలో ఉపాలయం వుంది). చాలామంది అన్నపూర్ణా ట్రస్టుని చూపించారు. చివరికి ఒక చీరెల షాపు ఏజెంటు వెంటబెట్టుకుని తీసుకెళ్ళి చూపించాడు. సమయం ఉదయం 9-40 అయింది. ఆయన తీసుకెళ్ళినదీ అన్నపూర్ణా ట్రస్టు వాళ్ళ భోజనశాలకే. ఏం చెయ్యాలా అనుకుంటుండగానే, అక్కడున్నవాళ్ళు గుమ్మానికి అడ్డపెట్టే చిన్న గేటులాంటిది తీసి, మా పిన్నినీ నన్నూ చూసి కింద కూర్చోలేనివాళ్ళు ఇటురండి, కూర్చోగలిగినవాళ్ళు అటెళ్ళండని చూపించారు. వెళ్ళాం. అక్కడ మా ఆఫీసువాళ్ళు కనబడి పలకరించేలోపల వాళ్ళపని వాళ్ళు చేసేశారు. అదేనండీ మమ్మల్నందర్నీ కూర్చోబెట్టి వడ్డించేశారు. భోజనం ఎంత బాగున్నదంటే, భోంచెయ్యగానే మా అంతట మేమడిగి డొనేషన్ ఇచ్చి వచ్చాం, అక్కడివాళ్ళెవరూ దాని గురించి చెప్పకపోయినా. ఇంతకీ దాన్లోనే ఇంకో పక్క అన్నపూర్ణ ఆలయం అని తర్వాత తెలిసింది. చూశారా, కాశీ చేరగానే అన్నపూర్ణమ్మ ఎలా ఆదరించి భోజనం పెట్టించిందో. ఇక్కడ భోజన కార్యక్రమం ఉదయం 9 గంటలనుంచీ సాయంకాలం 4 గంటలదాకా. తర్వాత వుండదు.

కానీ మా సత్రం వాళ్ళకి కోపం వచ్చింది మామీద. వాళ్ళకి చెప్పకుండా బయట తిని వచ్చినందుకు. కాశీలో మీ పేర్లతో అన్నం వృధా అయింది. ఆ పాపం మీదేనన్నారు. అక్కడికీ జరిగిందంతా చెప్పాము. పొద్దున్న 9-30 కల్లా వెళ్ళి భోంచెయ్యంకదా అన్నా మళ్ళీ మళ్ళీ అనేసరికి కోపం వచ్చి గట్టిగా అన్నాను. కావాలని చేసింది కాదు, పైగా మీకు చెప్పాలని మాకు తెలియదు. ఇప్పుడే చెప్పారు. తెలియక చేసినదానికి ఆ దేవుడు ఏ శిక్ష వేస్తే అది మేమే అనుభవిస్తాం, ఇంక ఈ విషయం గురించి మాట్లాడద్దు అని. అప్పుడు వూరుకున్నారు. కాశీలో మన సహనానికి పరీక్ష చాలా చోట్ల వుంటుంది. దీంతో ఒక విషయం అర్ధమయివుంటుంది మీకు. మీరు దిగిన సత్రంలో భోజన, ఫలహార సదుపాయం వుంటే మీరు అక్కడ తినేది లేనిది వారికి ఏ రోజుకారోజు ముందు చెప్పి మీ పేర్లు రాయించుకోవాలి.

మధ్యాహ్నం కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం మళ్ళీ బయల్దేరాం.

శ్రీ కేదారనాధ్ మందిరం
సాయంత్రం ఆంధ్ర ఆశ్రమానికి వెళ్ళి చూసి వద్దామనుకున్నాం, కానీ అది చాలా దూరం, నడిచే వెళ్ళాలి అనేసరికి ఆ ప్రోగ్రామ్ మానుకుని రెండు రోడ్లు తిరిగి వద్దామని బయల్దేరాం. త్రోవలో లస్సి త్రాగేసరికి "కాశీలో రోడ్లంబడ తిరగటమేమిటి కేదారనాధ్ మందిరం దగ్గరయితే వెళ్ళొద్దాం." అనుకుని అక్కడవారిని అడిగాము. ఈ దోవలో వెళ్ళచ్చు, పది నిముషాలు నడక అన్నారు. ఇక బయల్దేరాము. దోవలో అన్నీ చూసుకుంటూ ఎంత నడిచినా "ఇక్కడే. పది నిముషాల్లో వెళ్ళొచ్చు." సమాధానం మారలేదు. దోవలో ఇంకో మూడు దేవాలయాలు, కరివెన వారి సత్రం చూశాం. (ఆ దగ్గలవోనే ఆంధ్రా సత్రంట తర్వాత తెలిసింది.)

నడక మొదట్లోనే శ్రీ చిమలేశ్వర్ మహాదేవ్ మందిరం. ఈ మందిరాన్ని 1808లో నిర్మించారు. దాదాపు పది సంవత్సరాల క్రితం పాలరాతితో పునర్నిర్మించారు. సన్నగా, పొడుగ్గా వున్న ఈ మందిరం అందంగా, ప్రశాంతంగా వున్నది. మందిరంలోకి వెళ్ళగానే మొదట్లో చిన్న గుంటలావుండి అందులో రెండు శివలింగాలుంటాయి. ధర్శనం చేసుకుని ముందుకు వెళ్తే గర్భగుడిలో చిమలేశ్వర్ మహాదేవ్, అమ్మవార్ల విగ్రహాలు, చిన్న శివలింగం దర్శనమిస్తాయి.

అక్కడనుంచి ఇంకొంచెం ముందుకు సాగితే పాండేఘాట్లో తారాదేవి కాళీదేవి మందిర్ అనే బోర్డు చూసి లోపలకెళ్ళాం. ఎఱ్ఱని రంగు గోడలతో 350 ఏళ్ళ క్రితం నిర్మించబడ్డ దేవాలయం ఇది. బెంగాల్ నెటోర్ రాణి రాణీ భవానీ దేవి కట్టించారు. వీరివి ఇంకా చాలా ఛారిటబుల్ ట్రస్టులున్నాయి.

తర్వాత రామ్ గులాలేశ్వర్ మహదేవ్ ఆలయం. గుడి చిన్నదయినా జేగురు రంగుతో అందంగా వున్నది. పెద్ద శివ లింగం. మేము వెళ్ళేసరికి చీకటి పడుతోంది. ఆలయ నిర్మాతల పేర్లు వగైరా లోపల బోర్డులున్నాయిటగానీ చీకట్లో కనిపించలేదు. ఆలయం ముందు బోర్డు బెంగాలీలో వుంది. పక్క షాపులో వ్యాపారి ఈ మాత్రం వివరాలు ఇచ్చారు.

ఈ ఆలయానికి ఎదురుగానే కరివెనవారి సత్రం. అక్కడ తెలిసిన వారిని పలకరించటానికి మా పిన్ని వెళ్ళి వచ్చే లోపల ఆలయం బయట అరుగు మీద కూర్చున్నాం. నాకు సంతోషం కలిగించే విశేషం. అక్కడ ఒక జంట పరిచయమయ్యారు. వారు మాకన్నా ఎక్కువగా ఎన్నో యాత్రలు చేస్తున్నారు. మాకూ ఆ అలవాటున్నదంటే "అది చూశారా, ఇది చూశారా" అంటూ ఎన్నో చెప్పారు. కొన్నింటి పేర్లుకూడా వినలేదు నేను. ఎంత వెనకబడి వున్నానో అనిపించింది.

అక్కడ నుండి నెమ్మదిగా కేదారేశ్వర్ ఆలయం చేరాం. ఆలయం విశాలంగా, బాగుంటుంది. ఇక్కడ ఘాట్ ని కేదార్ ఘాట్ అంటారు. ఆలయం వెనుక గంగ ఒడ్డుకి వెళ్తే ఆలయాన్ని ఆనుకుని వున్న ఉపాలయంలో పెద్ద శివలింగం హరిశ్చంద్ర ప్రతిష్ట అని చెప్తారు. ఇక్కడ నుంచి హరిశ్చంద్ర ఘాట్ లో (పక్కనే వున్నది) శవాలు కాలటం కనబడుతుంది.

అక్కడ నుంచి ఇంక అడుగు వేసే ఓపిక లేక పోయింది. నడిచీ నడిచీ అంత అలిసిపోయాము. కొంచెం దూరం నడిచి ఎలాగో ఒక ఆటోలో వేరే దోవలో సత్రం చేరాం.

కాశీ విశ్వనాధునికి అభిషేకాలు - పూజా కార్యక్రమాలు
కాశీ గురించి గానీ, కాశీలో దేని గురించి గానీ విమర్శించకూడదు, అలా విమర్శిస్తే శివునికి కోప కారకులమవుతామంటారు. నేను చూసింది చూసినట్లు చెబితే ఇది చదివి వెళ్ళేవాళ్ళు జాగ్రత్త పడతారు అనే ఉద్దేశ్యంతో నేను వివరంగా చెబుతున్నాను.

కాశీ విశ్వనాధుని ఆలయం చిన్నది. అందులో గర్భ గుడి ఇంకా చిన్నది. నాలుగు వైపులా ద్వారాలు. రెండు ద్వారాలు లోపలకి వెళ్ళటానికి, రెండు ద్వారాలు బయటకి రావటానికే కాదు, అస్మదీయులు, పూజారులు తీసుకుని వచ్చే అభిషేకం చేసుకునేవారు లోపలకు వెళ్ళటానికి కూడా ఉపయోగ పడతాయి. గర్భగుడి షుమారు 10 x 10 వైశాల్యం వుంటుంది. గర్భ గుడిలో ఒక మూలకి ఉన్నట్లు వుంటుంది లింగం. దాదాపు నేలకి సమానంగా, చతురస్రాకారం, మధ్యలో గుంట, అందులో లింగం. గుమ్మందాకా క్యూ వుంటుందిగానీ గుమ్మం దగ్గర నుంచి బలవంతులదే రాజ్యం.

తెల్లవారు ఝామున 3 గంటల నుంచి 4 గంటల దాకా హారతి వుంటుంది. దీనికి టికెట్ వుంది. 4 గంటల నుంచీ రాత్రి 11 గంటల దాకా అభిషేకాలు, దర్శనం వుంటుంది. భక్తులందరూ జిల్లేడు పూల మాలలు, మారేడు దళాలు, పూలు, అభీషేక ద్రవ్యాలు తీసుకు వచ్చి స్వహస్తాలతో స్వామికి సమర్పిస్తారు. అక్కడ పూజారి వుండి ఆయన ద్వారా పూజలు జరగటం వుండదు. మనం తీసుకెళ్ళిన ద్రవ్యాలను మనమే స్వామికి స్వయంగా సమర్పించవచ్చు, స్వామిని తాకి నమస్కరించవచ్చు. అభిషేకం కూడా మనం తీసుకెళ్ళిన నీళ్ళో, పాలో, స్వామికి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. ఆ తోపుడులో మీ మనసులో మీరనుకున్నదే మంత్రం.

అదే పూజారి ద్వారా వెళ్తే 501 రూ. చెల్లించాలి. అవసరమైన ద్రవ్యాలు వాళ్ళే ఇస్తారు. లోపల ఖాళీ వుంటే కూర్చుని అభిషేకం చెయ్యవచ్చు. లేదంటే బయటే సంకల్పం చెప్పి లోపల రెండు నిముషాలలో పూజారిచ్చిన ద్రవ్యాలు స్వామికి సమర్పించి బయటపడాలి. మనం ఏ ద్రవ్యాలతో పూజ చేస్తున్నామో కూడా తెలుసుకునేంత తెరిపి వుండదు.

మేము రెండు సార్లు అభిషేకం చేయించాము. ఒకసారి మహారాష్ట్ర బ్రాహ్మణుడు. లోపల రష్ గా వుందని బయట ఆవరణలోనే కూర్చోబెట్టి రుద్రం చదివి, తర్వాత లోపల 2 నిముషాలు చేయించారు. అక్కడ మాకు తృప్తిగా లేదనుకున్నారేమో, విశాలాక్షి అమ్మవారి దగ్గర శ్రీ చక్రానికి కూడా ఆయనే శ్రీ సూక్తంతో యధావిధిగా కుంకుమ పూజ చేయించారు. అప్పటికింకా జనాలు మొదలు కాలేదు ప్రశాంతంగా చేసుకున్నా. చాలా సంతోషం అనిపించింది. అంత కన్నా సంతోషకరమైన విషయం సరిగ్గా పూజ పూర్తయ్యే సమయానికి ఎవరో ఒకావిడ నా ప్రక్కనే నుంచుని మా అమ్మ ఎప్పుడూ పాడే రాజ రాజేశ్వరి, దేవి కన్యాకుమారి, రక్షించు జగదీశ్వరీ అనే పాట పాడటంతో మనసంతా తృప్తితో నిండిపోయింది. మా పిన్ని అయితే కళ్ళ నీళ్ళు పెట్టుకుంది మీ అమ్మే వచ్చి పాడినట్లనిపించిందే అని.

రెండవసారి తెలుగు పురోహితుల ద్వారా అభిషేకానికి ఏర్పాటు చేసుకున్నాము. ఆ రోజూ విపరీతమైన జనం ఉన్నారు. బయట ఏమీ పెద్దగా చేయించలేదు. లోపల తోపులాటలో ఏం చేయించారో తెలియలేదు. చాలా అసంతృప్తిగా అనిపించింది.

ఒక రోజు అన్నపూర్ణ ఆలయంలో కుంకుమ పూజ చేసుకున్నాను. జనం వున్నా పూజ బాగానే చేయించారు. మంత్రాలు చెప్పటంలో మధ్యలో అనేక అవరోధాలు ఉన్నా, భక్తి వుండాల్సింది మనకే, పూజారికి కాదు అని సర్ది చెప్పుకున్నాము. పూజారుల ద్వారా పూజలని సమయం వృధా చేసుకునే బదులు ప్రశాంతంగా దైవనామ స్మరణ చేస్తే మనశ్శాంతి అనే నిర్ణయానికొచ్చేశాము. కిందటేడు ఇదే సమయంలో మా వాళ్ళెళ్ళొచ్చారు. వాళ్ళు తెల్లవారుఝామున 4 గంటల కెళ్తే కూర్చుని అభిషేకం చేసుకున్నామన్నారు గానీ మేము వెళ్ళినప్పుడు ఆ సమయంలోకూడా జనం ఎక్కువగానే ఉన్నారు.

కాశీ పవిత్ర క్షేత్రమనే భావన ప్రతి భారతీయుని నర నరాన జీర్ణించుకు పోతుంది కనుక ఈ అసంతృప్తులన్నీ గంగా ప్రవాహంలో గడ్డిపోచలాగా కొట్టుకుపోనిచ్చి మనసు భగవంతుని మీద కేంద్రీకరించగలిగితే అదృష్టవంతులం.

శ్రీ కాశీ విశ్వేశ్వరునికి నిత్య హారతులు
శ్రీ కాశీ విశ్వనాధుని ఆలయంలో స్వామికి నిత్య హారతులు మూడు. తెల్లవారుఝామున 3 - 4 గంటల మధ్య ఇచ్చే హారతి మొదటిది. దీనికి టికెట్ వున్నది. ఇది మేము చూడలేదు. కనుక వివరించలేను. కానీ ఈ హారతిలో మణికర్ణిక ఘాట్ నుంచి శవ భస్మం తీసుకు వచ్చి అభిషేకం చేస్తారని అన్నారు. ఇలా ఉజ్జయినిలో చేస్తారు. మేము చూశాము.

ఇంక రెండవది సప్త ఋషి హారతి. ఇది సాయంకాలం 7 గంటల ప్రాంతంలో వుంటుంది. టికెట్ 51 రూపాయలు. హారతి మొదలు పెట్టే ముందు టికెట్ లేని వాళ్ళని బయటకి పంపుతారు కానీ, మొదలు కాగానే అందరూ వస్తారు. టికెట్ వున్న వాళ్ళని 4 గుమ్మాల దగ్గర నాలుగు బల్లలు వేసి, గుమ్మంలోనూ, వాటి మీదా కూర్చోబెడతారు. గుమ్మంలోనో, బెంచీ మీద మధ్యలోనో కూర్చున్నవారు అదృష్టవంతులు. మిగతావారికి అన్నివైపుల నుంచీ తోపుళ్ళు తప్పవు.

ఈ సప్త ఋషి హారతిలో సప్త ఋషులకు ప్రతినిధులుగా ఏడుగురు పండితులు స్వామికి అభిషేకం, అర్చన చేసి హారతి ఇస్తారు. ఈ హారతి సమయంలో అందరూ గంటలు ఎంత లయ బధ్ధంగా వాయిస్తారంటే, మనం కొంచెం మనసు లగ్నం చేస్తే ఆ పరమ శివుని ఆనంద తాండవం కళ్ళముందు గోచరిస్తుంది. అంత తన్మయత్వంలో మునుగుతాము. ఆ అపురూపమైన అనుభవాన్ని కాశీకి వెళ్ళినవాళ్ళెవరూ వదులుకోవద్దు. అది అనుభవించవలసినదే. హారతి పూర్తి అయిన తర్వాత ఆ పండితులంతా నాలుగు వైపులకూ వచ్చి, స్వామికి వేసిన పూల మాలలు, తీర్ధం బయట వున్న భక్తులకందరికీ ఇస్తారు.

దీని తర్వాత రాత్రి 8 గంటలు దాటిన తర్వాత సేజ్ హారతి వుంటుంది. ఈ రెండు హారతుల మధ్యా, రాత్రి హారతి తర్వాత 11 గంటలదాకా స్వామి దర్శనం వుంటుంది. హారతుల సమయంలో లోపలికి ఎవరినీ వెళ్ళనివ్వరు.

ఈ హారతిలో కూడా స్వామికి అభిషేకం, పూజ అంటే మంత్రాలు చదువుతూ పూల మాలలు అలంకరించటం ఎక్కువసేపు వుంటుంది. ఈ హారతి సప్త ఋషి హారతి అంత ప్రభావితంగా వుండదు. కానీ ఇదీ చూడదగ్గదీ. దీనికీ టికెట్ 51 రూపాయలు. ఈ హారతి తర్వాత కూడా బయట తీర్ధం, హారతి సమయంలో స్వామికి నివేదించిన ప్రసాదం భక్తులందరికీ ఇస్తారు.

D. Venu Gopal said...
ఉదయం 3 నుండి 4 గం వరకూ జరిగే హారతిలో మణికర్ణిక నుండి భస్మం తీసుకవచ్చి అభిషేకం చేస్తారన్నది నిజంకాదు. ఇది అపవాదు మాత్రమే. కాశీలో విశేషం ఏమిటంటే ఇక్కడ ఉన్న రెండు స్మశాన ఘట్టాలలోనూ 24 గంటలూ శహదహనం జరగుతుంది. మిగిలిన ఎక్కడా సూర్యాస్తమానం తరువాత శవదహనం జరగదు.
కాశీలో ముఖ్యంగా దర్శించవలసిన దేవతలు
కాశీలో గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనమేకాక, తప్పనిసరిగా దర్శించవలసిన ఇతర దేవతల గురించి తెలుసుకుందాం. కాశీలో చిన్నా, పెద్దా అనేక ఆలయాలున్నాయి. వీటిలో కాల చరిత్రలో శిధిలమైనవి అయిపోగా, మిగిలినవాటిని దర్శించటానికి కూడా చాలా సమయం పడుతుంది. ఎక్కువకాలం కాశీలోనే నివసించేవారికి వారి ఆసక్తినిబట్టి ఇది సానుకూలపడవచ్చు కానీ, అందరికీ సాధ్యం కాదు. తప్పనిసరిగా చూడవలసినవాటి గురించి ముందు చెప్పుకుందాం.

కాశీలో మూల విరాట్ విశ్వేశ్వరుడి ఆలయంలోనే అనేక దేవీ దేవతల ఉపాలయాలు వున్నాయి. ప్రదక్షిణ మార్గంలో పార్వతీ దేవి, అన్నపూర్ణాదేవి, కుబేరస్వామి, ఒక మందిరంలో గుంటలో కుబేరేశ్వరలింగం వుంటాయి. దాటితే ఆవముక్తేశ్వర మహాదేవుడు, నందీశ్వరుడు, ఏకాదశేశ్వర లింగం వున్నాయి. ఇంకా గణపతి, విష్ణు, మహాలక్ష్ములనుకూడా దర్శించవచ్చు.

ప్రధాన ఆలయంలో గర్భగుడి లోపల నాలుగు గోడల మీద వున్న పాలరాతి ఫలకాలలో మూర్తులను దర్శించండి. అవి సీతారామ లక్ష్మణులు, పూజారి కూర్చునే గూటి పై లక్ష్మీ నారాయణులు, ఒక గోడపై దశ భుజ వినాయకుడు, పార్వతీ పరమేశ్వరులు. ఆలయం లోపల ప్రాంగణంలో పార్వతీదేవి ఉపాలయం తర్వాత వచ్చే దోవలో బయటకు వెళ్తే అనేక శివలింగాలు, బావి, మసీదు కనబడతాయి. కొన్ని లింగాలు, విగ్రహాల దగ్గర పేర్లు వున్నాయి. పూర్వం మహమ్మదీయుల దండయాత్ర సమయంలో విశ్వేశ్వర లింగాన్ని భద్రత కోసం ఆ బావిలోనే పడవేసి తిరిగి తీసి ప్రతిష్టించారంటారు.

విశ్వేశ్వర ఆలయం బయటకురాగానే కుడివైపు శనీశ్వరాలయం కనబడుతుంది. ఇక్కడ భక్తులు నిరంతరం దీపాలు వెలిగిస్తూంటారు. దీపాలు అక్కడ లభిస్తాయి. సమీపంలోనే సాక్షి వినాయకుడు, డింఢి వినాయకుడు, అన్నపూర్ణ మందిరాలుంటాయి. ఒక కిలో మీటరు దూరంలో కాశీ విశాలాక్షి. ఆలయం వుంది. అన్నపూర్ణ, విశాలాక్షి మందిరాలలో ఉపాలయాలను కూడా దర్శించండి. ఇవ్వన్నీ తప్పక దర్శించవలసిన ఆలయాలు. ఈ సందుల్లో వాహనాలు తిరగవు. నడవవలసినదే.

ఇవి కాక కేదారేశ్వరఘాట్ లోని కేదారేశ్వర మందిరాన్ని తప్పక దర్శించండి. వీలు కుదిరితే విశాలాక్షి ఆలయానికి వెళ్ళే దోవలో (కనుక్కుంటూ వెళ్ళాల్సిందే) వారాహీ దేవి ఆలయం వుంది. ఈ దేవిని దర్శించుకోవాలంటే ఉదయం 7 గం. లోపే వెళ్ళాలి. ఈవిడ విగ్రహం భూగృహం (సెల్లార్) లో వుంటుంది. నేల పై వున్న గ్రిల్ లో నుంచి చూడాల్సిందే. ఈవిడ గ్రామదేవత. ఉగ్రదేవత. ఎప్పుడూ చాలా వేడిగా వుంటుంది. అందుకే దర్శనం ఉదయం 7 గం. లలోపే.

కాలభైరవాలయం తప్పనిసరిగా దర్శించాలి.

ఇంకా మేము చూడనివి, అవకాశం వుంటే చూడవలసినవి తిలభాండేశ్వర్ మందిర్ (ఈయన రోజూ నువ్వు గింజoత పెరుగుతాడట). ఇంకొక మందిరం భారతమాత మందిర్. ఇది కంటోన్మెంట్ ఏరియాలో రైల్వే స్టేషన్ కి 1.5 కి.మీ. దూరంలో వున్నది. పాలరాతితో చెక్కిన మొత్తం బారతదేశం పటం ఇందులో వున్నదిట.


కొండముది సాయికిరణ్ కుమార్ said...
భూగృహంలో ఉన్న వారాహిదేవి విగ్రం చాలా పెద్దది. ఆ మందిర పూజారులు తప్పించి వేరే ఎవరికీ ఆ భూగృహంలో ప్రవేశం లేదు. ఉదయం 7 గంటలలోపు ఇచ్చే హారతికి లోపలికి అనుమతించినా కిందకి మాత్రం వెళ్ళనీరు. పై భాగంలో ఉన్న రెండు రంధ్రాల ద్వారా మాత్రమే విగ్రహాన్ని చూడగలం. అమ్మవారి ముఖం, పాదాలు మాత్రమే చూడగలం. వారాహిదేవి ఉగ్రదేవతే కానీ, గ్రామ దేవత కాదు. అష్టమాతృకా దేవతలలో ఒకటి.
psmlakshmiblogspotcom said...
సాయికిరణ్ గారూ
మీ కామెంటు చూసిన తర్వాత కూడా కొంతమంది చెప్పిన కధనం ప్రకారం వారాహిదేవి అష్టమాతృకలలో ఒకరేగాక, కాశీని రక్షించే గ్రామదేవత కూడాననే కధనం వుంది.కాశీలో దర్శనీయ స్ధలాలు
కాశీలో దేవాలయాలు అనేకం. ఎన్ని చూసినా ఇంకా చూడనివి వుంటాయి. ముఖ్యమైన కొన్ని దేవాలయాలను అక్కడ ఆటోవారు, టాక్సీవారు ఒక పేకేజ్ కింద చూపిస్తారు. సమయం ఒక పూట పడుతుంది.
 1. కాలభైరవ మందిరం.
  పరమ శివుని ఆగ్రహంనుంచి పుట్టిన వాడు కాలభైరవుడు. ఆయన ఒకసారి ఆబధ్ధం చెప్పిన బ్రహ్మదేవుని ఐదవ తలని తన గోటితో తుంచేశాడు. బ్రహ్మగారిని తల తుంచటంవల్ల కాలభైరవునికి బ్రహ్మ హత్యాదోషం పట్టుకుని, ఆ బ్రహ్మగారి తెగిన తల ఈయన చేతికి అతుక్కుపోయింది. పాపం ఆయన ఆ తలను వదిలించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. లోకాలన్ని తిరిగినా పోని పాపం ఆయన కాశీకి రాగానే పోయింది. చేతికి అతుక్కున్న తల వూడి కిందపడింది. కాశీ ప్రవేశంతోనే బ్రహ్మ హత్యాది పాపాలుకూడా నశిస్తాయంటారు మరి.

  ఆ భైరవుడిని విశ్వేశ్వరుడు కాశీ నగరాధిపతిగా నియమించాడు. ఈయనకు చాలా పెద్ద పనులున్నాయి. కాశీకి వచ్చినవారివి, అక్కడ నివసిస్తున్నవారివీ పాప పుణ్యాల చిట్టాల మైయిన్టెయిన్ చెయ్యటం ఈయన డ్యూటీనే. వీళ్ళందరి పాపాలనూ కడిగివెయ్యటం కూడా ఈయన డ్యూటీనే. కాశీలో మరణించినవారికి మరణ సమయంలో సాక్షాత్తూ ఆ విశ్వేశ్వరుడే తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి. మరి సాక్షాత్తూ భగవంతునితో తారక మంత్ర ఉపదేశం పొందాలంటే దానికి అర్హత వుండాలికదా. కాశీలో మరణించటమే ఆ అర్హత. వారి పాపాలను పటాపంచలు చేసి తారక మంత్రోపదేశానికి అర్హులైన వారిగా జీవులను తయారు చెయ్యటం కూడా భైరవులంగారు పనే. మరి మనం చేసిన దుర్మార్గాలకు శిక్షలు అనుభవించాలికదా. దానికోసం కాల భైరవుడు అతి తక్కువ సమయంలో కఠిన శిక్షలు విధిస్తాడు. అన్నట్లు యమ ధర్మరాజుకీ, చిత్ర గుప్తుడికీ కాశీలో నివసిస్తున్న వారిపైగానీ, అక్కడ మరణించిన వారిపైగానీ ఎటువంటి అధికారం లేదు. కానీ అంతకుమించి తక్కువ సమయంలో ఎక్కువ శిక్షలు అనుభవింప చేసే కాలభైరవుడిని దర్శించి సేవించటం మరువకండి.విశ్వనాధుని ఆలయం నుంచి రెండు కిలో మీటర్ల దూరంలోపే వుంది ఈ ఆలయం.
  కొండముది సాయికిరణ్ కుమార్ said...
  కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఆయన అనుజ్ఞ లేకుండా కాశీ ప్రవేశమే దుర్లభం. అందుకే కాశీ విశ్వనాధుని దర్శనం కన్నా ముందుగా కాలభైరవ దర్శనం చేసుకోవాలని చెబుతారు.


 2. గవ్వలమ్మ గుడి, భేలూపురి
  కొంచెం ఎత్తుగా వుండే చిన్ని మందిరం ఇది. అసలు కాశీలో చాలా ఆలయాలు చిన్నవే. వాటి మహత్యమే అత్యున్నతం. ఈ గవ్వలమ్మ విశ్వనాధుని సోదరి అనీ, ఆవిడకి మడీ ఆచారాలు ఎక్కువనీ, వాటితో ఆ దంపతులను విసిగిస్తుంటే స్వామి ఈవిడని ఊరు బయట దళితవాడలో వుండమని పంపాడని ఒక కధ. ఈవిడని దర్శించుకుని గవ్వలు సమర్పించుకుంటేగానీ కాశీ యాత్ర ఫలితం లభించదనీ ఒక ప్రచారం. ఇక్కడ దుకాణంలో ఐదు గవ్వలు ఒక సెట్ గా అమ్ముతారు. అందులో నాలుగు అమ్మవారికి సమర్పించి ఒకటి మనం ప్రసాదంగా తెచ్చుకోవచ్చు. లోకల్ ట్రిప్ లో చూపించే ఆలయాలన్నీ దగ్గరగానే వుంటాయి. సారనాధ్ కూడా ఈ ట్రిప్ లోనే చూపిస్తారు. 3. తులసీ మానస మందిర్
  ఇది 1964లో నిర్మింపబడిన పాలరాతి మందిరం. నిర్మాత సేఠ్ రతన్ లాల్ సురేఖా. భవనం లోపల గోడలపై తులసీ రామాయణం మొత్తం వ్రాయబడివున్నది. రామాయణంలోని కొన్ని ఘట్టాల చిత్రాలుకూడా వున్నాయి. రెండంతస్తుల ఈ భవనంలో కింద రామ మందిరం, పై భాగంలో తులసీదాసు విగ్రహాలున్నాయి. 4. దుర్గా మందిరం
  పూర్వం దుర్గుడనే రాక్షసుడు ప్రజలను పలు బాధలు పెట్టగా జగన్మాత భీకర యుధ్ధంలో అతనిని సంహరించింది. తర్వాత ఇక్కడ స్వయంభూగా వెలిసినది. దుర్గుని సంహరించినది కనుక దుర్గాదేవిగా ప్రసిధ్ధిగాంచినది. ఇక్కడ భక్తుల రద్దీ ఎల్ల వేళలా వుంటుంది. శ్రావణ మాసంలో అన్ని మంగళవారాలలో ఇక్కడ జాతర జరుగుతుంది. ఆ సమయంలో భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో దేవీ దర్శనం చేసుకుంటారు. సమీపంలో దుర్గా కుండము వున్నది.


 5. బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం
  ఆసియా ఖండంలోనే పెద్దదిగా భావించబడే ఈ విశ్వ విద్యాలయం పూర్వం కాశీ రాజుగారిచే ఇవ్వబడిన దాదాపు 2000 ఎకరాల సువిశాల క్షేత్రంలో వున్నది. దీనిని 1916లో పండిట్ మదన్ మోహనమాలవ్యాగారు స్ధాపించారు.. ఏటా 15000 మంది క్రొత్త విద్యార్ధులకి అనేక రంగాలలో ప్రవేశం కల్పించే ఈ విశ్వ విద్యాలయం పేరులో మాత్రమే హిందూ విశ్వ విద్యాలయం. భారతదేశంనుంచే కాక విదేశాలనుంచికూడా అనేక మంది విద్యార్ధులు కుల, మత ప్రసక్తి లేకుండా ఈ విశ్వ విద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు.

  ఈ ఆవరణలోనే బిర్లాలచే నిర్మింపబడిన విశ్వనాధుని ఆలయం వున్నది. బిర్లాలచే నిర్మింపబడింది కనుక దీనిని బిర్లామందిర్ గా కూడా వ్యవహరిస్తారు. ఈ పాలరాతి కట్టడం కాశీ విశ్వనాధుని ఆలయాన్ని పోలి వుంటుంది. కాశీ విశ్వనాధుని ఆలయంలోకి విదేశీయులకు అనుమతి లేదు కానీ ఈ ఆలయంలో స్వామి దర్శనం ఆసక్తిగల ఎవరైనా చేసుకోవచ్చు.

  ఇక్కడే భారత కళాభవన్ అనే మ్యూజియంకూడా వున్నది. సమయాభావంవల్ల మేము చూడలేదు. అవకాశం వున్నవారు ఉదయం 11 గం. ల నుండి సాయంత్రం 4 గం. ల వరకు దర్శించవచ్చు. అయితే విశ్వవిద్యాలయానికి సెలవు వున్న రోజుల్లో ఈ మ్యూజియం కూడా మూసివుంటుంది.

 6. వ్యాస కాశీ
  పూర్వం వ్యాస మహర్షి నివసించిన ప్రదేశమే వ్యాస కాశీ. వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలు వ్రాసిన వాడు. వేద విభాగము చేసినవాడు. అంతటి గొప్ప వ్యక్తి తన కోప కారణంగా కాశీనుంచి బహిష్కరింపబడి గంగ ఆవలి ఒడ్డున నివసించాడు. ఆ కధేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా?

  పురాణ కధనం ప్రకారం పూర్వం వ్యాసుడు తన శిష్యగణంతో కాశీలో వుండి తపస్సు చేసుకోసాగాడు. ఒకసారి పార్వతీ పరమేశ్వరులకు ఆయనని పరీక్ష చేయాలనిపించింది. మధ్యాహ్నం భిక్ష కోసం వెళ్ళిన ఆయనకు గానీ ఆయన శిష్యులకుగానీ పార్వతీ పరమేశ్వరుల ప్రభావంవల్ల కాశీలో ఎక్కడా భిక్ష దొరకలేదు. అలా మూడు రోజులయింది. ఈ మూడు రోజులూ వారికి ఏ ఆహారమూ లేదు. అలా ఎందుకు జరుగుతోందో ఆయనకు అర్ధంకాలేదు. సాక్షాత్తూ అన్నపూర్ణ నిలయమైన కాశీలో తమకు ఆహారం దొరకకపోవటమేమిటి కాశీవాసులకు ఇహంలో అన్ని సౌఖ్యాలూ వుండి అంత్యకాలంలో మోక్షం లభిస్తుంది. అందుకే వారికి అహంకారం పెరిగి తమకు భిక్ష పెట్టంలేదని కోపం వచ్చింది. ఆ కోపంలో ఆయనకి ఆలోచన రాలేదు. మూడు తరాలవరకు కాశీవాసులకు ఏమీ దొరకకూడదు అని శపించబోయాడు. అతని మనసులో మాట బయటకు రాకుండానే ఒక పెద్ద ముత్తయిదు రూపంలో పార్వతీ దేవి వచ్చి వారిని భిక్షకు పిలిచి తృప్తిగా భోజనం పెట్టింది. తర్వాత నెమ్మదిగా చివాట్లూ పెట్టింది. మూడు రోజులు అన్నం దొరకకపోతే ఆగ్రహంలో ఔచిత్యాన్నే మరచిపోయావే, అష్టాదశ పురాణాలూ ఎలా రాశావయ్యా అని నిలదీసింది. కాశీవాసులకు శాపం ఇస్తే విశ్వేశ్వరుడు వూరుకుంటాడా అని నిలదీసింది. ఇంతలో విశ్వేశ్వరుడూ ప్రత్యక్షమయి కాశీలో కోపిష్టులు వుండకూడదని వ్యాసుణ్ణి ఐదు కోసుల దూరంలో గంగకు ఆవలి ఒడ్డున నివసించమని శాసించాడు. వ్యాసుడు పశ్చాత్తాపంతో ప్రార్ధిస్తే పరవడి రోజుల్లో వచ్చి తన దర్శనం చేసుకోవచ్చని అనుమతిస్తాడు.

  తర్వాత కాలంలో కాశీ పాలించిన రాజుల కోట అక్కడ ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కోటనంతా మ్యూజియంగా మార్చి పూర్వం కాశీరాజులు వాడిన అనేక సామగ్రిని అక్కడ భద్రపరిచారు. ప్రస్తుతం ఈ మ్యూజియంకి మైంటినెన్స్ సరిగ్గా లేదనిపిస్తుంది మ్యూజియం శుభ్రత చూస్తే. మ్యూజియం సందర్శనానికి టికెట్ వుంది. సమయం ఉదయం 9 గం. ల నుంచి సాయంత్రం 5 గం. ల దాకా. మధ్యలో ఒకటి రెండు గంటల విరామం వున్నది.ప్రయాగ (అలహాబాద్) - త్రివేణీ సంగమంలో వేణీదానం
27-3-2010 ఉదయం 5 గంటలకల్లా సుమోలో బయల్దేరి 10 గంటలకు ప్రయాగ చేరాము. అశోకుడు కట్టించిన కోట దగ్గర నది ఒడ్డున మమ్మల్ని దింపి అక్కడ బోటు వాళ్ళని, పాండాలనీ మాట్లాడుకోమని మా సుమో డ్రైవరు వీలయినంత దూరం పారిపోయాడు. ఇంక చూడండి మా తిప్పలు. ఎందుకులెండి మీరెళ్ళినప్పుడు ఎటూ పడతారుగా. అవేమీ మాకొద్దంటారా, బుధ్ధిగా మీరు దిగిన సత్రం వాళ్ళు చెప్పిన తెలుగు బ్రాహ్మలు ఎవరైనా ఉంటే వారి దగ్గరకు వెళ్ళండి. మీరు నేరుగా పండాలతో మాట్లాడుకునేదానికన్నా సమయం, శ్రమ, డబ్బు ఆదా అవుతాయి.

బ్రాహ్మణుడిని, బోట్ నీ మాట్లాడుకుని ఎక్కాము. బోట్ ఎందుకంటే నీళ్ళల్లో కొంచెం దూరం తీసుకెళ్తారు. అక్కడ మూడు నదులూ, గంగా, యమునా, సరస్వతి (అంతర్వాహిని) సంగమ ప్రదేశమని. అన్నిరకాల కార్యక్రమాలు, స్నానాలు అక్కడే. పిండ ప్రదాన కార్యక్రమం చేయిస్తే బ్రాహ్మణుడికి రూ. 850, సంకల్పం, వేణీ దానాలకి రూ. 250కి మాట్లాడాము. బోటు తమాషా చూడాలి. ఒకతను తీసుకెళ్ళి, కార్యక్రమం అయ్యేదాకా అక్కడవుండి తిరిగి తీసుకు రావటానికి ఐదుగురికి రూ. 2000 అడిగాడు, మేము రూ. 1200కి బేరం కుదుర్చుకున్నాము. అతనడిగినది కాదు విడ్డూరం, ఇంకో ఇద్దరు ముగ్గురు పడవల వాళ్ళు అతను మళ్ళీ తీసుకు రాడు, ఒక సారికే ఆ డబ్బు, తీసుకురావటానికి మళ్ళీ అంత అడుగుతాడు, మేము చాలా చౌకగా రూ. 2000 కే తీసుకెళ్ళి తీసుకొస్తామని, మమ్మల్ని పెద్ద ఆపదనుంచి కాపాడే ధీరోదాత్తుల్లా మాట్లాడుతుంటే, మేము ఆ ప్రదేశానికి కొత్తవాళ్ళం, ఆ గందరగోళంతో తలవాచిపోయి వున్నవాళ్ళం, అయినా వాళ్ళ మాటల్లో పాయింటు కేచ్ చేసి, వాళ్ళు మాట్లాడుతున్నదంతా తనగురించి కాదు అని అతి మామూలుగా వున్న మా పడవతనితో ఎందకైనా మంచిదని, మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకున్న డబ్బు తీసుకెళ్ళి, అక్కడ హడావిడి చెయ్యకుండా ఆగి, తిరిగి తీసుకు రావటానికి, ఇక్కడికి వచ్చాకే డబ్బు ఇస్తాము, ముందు ఇవ్వము అని గట్టిగా చెప్పాము. ఏ మాటకామాటే చెప్పాలి. మా బోటతను చాలా నెమ్మదస్తుడు. ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. పైగా నీళ్ళల్లో దిగేటప్పుడు, పైకి రావటానికి సహాయం చేశాడు. అతనికి ఫోటోగ్రాఫీ కూడా తెలుసు, అక్కడ మా ఫోటోలు అతనే తీశాడు. చివరిగా ఒడ్డుకి చేర్చాకే డబ్బు తీసుకున్నాడు. మేము సంతోషంగా ఎక్కువ ఇచ్చింది సంతోషంగా తీసుకున్నాడు. పండా మాత్రం అక్కడ పళ్ళెం సర్దాలి (పూజా ద్రవ్యాలకి, మాట్లాడింది దానితో సహా అయినా,) అని ఒకసారి, దేనికో కావాలి అడ్వాన్సు ఇవ్వమని ఒకసారి రూ. 200 తీసుకున్నాడు. అక్కడ వాళ్ళు చేసిన హడావిడికి అవ్వి మర్చిపోయాం. ఇవ్వన్నీ ఎందుకింత వివరంగా చెబుతున్నాను అంటే మీరెళ్ళినప్పుడు మీకు కొంత తలనొప్పి తగ్గుతుందని.

వేణీ దానం:
ఈ వేణీ దానం ప్రక్రియ ప్రయాగలో మాత్రమే వున్నదంటారుగానీ, తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడికి కూడా ఆడవాళ్ళు సాధారణంగా మూడు కత్తెర్లనీ, ఐదు కత్తెర్లనీ, బెత్తెడనీ జుట్టు ఇస్తూ వుంటారు. అయితే అక్కడ ఏ తతంగాలు లేకుండా, కామ్ గా కానిచ్చేస్తారు. ఇక్కడ దానికో సంకల్పం, పూజ వగైరాలన్నీ. నిజం చెప్పద్దూ, నాకు మాత్రం పండా చెప్పిన మంత్రాలు అస్సలు అర్ధం కాలేదు, నన్నవ్వి చెప్పమంటే, ప్రయత్నించీ మానేశాను తప్పులు చెప్పేకన్నా చెప్పకుండా వుండటం వుత్తమమని. వాళ్ళు మాత్రం అనేక విధాల డబ్బు గుంజటానికి ప్రయత్నిస్తారు. తతంగం జరిగేటప్పుడు ఒకతన్ని పిలిచి నన్నతనికి 10 రూ. ఇమ్మన్నాడు. అది అతను నా కొంగుకి ముడి వేస్తాడని, వేసినందుకు ఆ బ్రాహ్మణుడికి ఏమైనా ఇమ్మని అన్నాడు. నాకెందుకోచాలా కోపం వచ్చింది. బ్రాహ్మణుడు వెయ్యాలంటే సంకల్పం చెప్తున్నాయన వెయ్యాలి, మధ్యలో ఎవరినో పిలిచి అతను వేసేదేంటి, ఠాట్ వల్లకాదు పొమ్మన్నా. కావాలంటే నా కొంగుకి నేనే వేసుకుంటానని నేనే వేసుకున్నా. పైగా నాకే పాపం చుట్టుకున్నాసరే, నాకనిపించింది చెబుతున్నాను. అసలు వాళ్ళు బ్రాహ్మణులేనా అనే అనుమానం కూడా. వాళ్ళ అవతారాలు అలా వున్నాయి. అదే అనేశాను కూడా. నా ఈ కాశీ ప్రయాణంవల్ల ఒక్కటి మాత్రం రూఢి అయిపోయింది. నరకం, శిక్షలు వుంటే, నా కాశీ యాత్ర నాకు పెద్ద శిక్షలు తయారుగా పెట్టి వుంటుంది.

ఆ పండా చెప్పినది నాకర్ధం కాకపోయినా ఏ దేవుడు కరుణించాడో, ఆ తతంగం కొంచెం సంతోషాన్నే మిగిల్చింది. ముందు సంగమంలో స్నానం చేశాక (నడుం లోతు నీళ్ళే వుంటాయి. నీళ్ళంత బాగాలేదు) ఎఱ్ఱ గులాబీలు దోసిటనిండా పోసి సంకల్పం చెప్పించాడు. ఆ పూలని చూసి మనసు కుదుటపడింది. రెండు పసుపు ముద్దలిచ్చి ఒకటి గౌరీ దేవి, ఒకటి మా వారిని తల్చుకుని శివుడు ఆకారం చెయ్యమన్నాడు (ఆయన రాలేదుకదా). అది ఆకులో పెట్టి, మా వారి తుండు గుడ్డ (మా పిన్ని ముందునుంచీ పోరుతోంది తీసుకురా అని) నా చీరె కొంగుకి ముడి వేసి, రెండో చివర ఆ పసుపు ముద్దకి చుట్టి పెట్టాడు. అంటే ఆయన కూడా అక్కడే వున్నట్లు. తర్వాత బొట్టు, పసుపు రాసుకుని, పారాణి పెట్టుకోమన్నాడు. జడ చివరిదాకా వేసుకుని పువ్వు పెట్టుకోమన్నాడు. తర్వాత జడ చివర కొంచెం కత్తిరించాను (ఇది భర్త చేస్తాడు. ఆయన రాలేదని వేరే ఎవరినో కట్ చెయ్యమన్నాడు నేను వద్దని నేనే చేశాను). తర్వాత ఆ వెంట్రుకలు పసుపు ముద్దలో కలిపి అదీ, 3 కొబ్బరి కాయలు, పువ్వులు, నేను తీసుకెళ్ళిన జాకెట్ బట్ట అన్నీ గంగమ్మకి సమర్పించి, మళ్ళీ స్నానం చేయమన్నాడు. (మనం కొబ్బరి కాయలు సమర్పించగానే అక్కడే కాచుకుని వుంటారు వాటిని తీసుకుని మళ్ళీ తర్వాత వాళ్ళకి ఇవ్వటానికి.) అక్కడికి కార్యక్రమం పూర్తయినట్లే. భార్యా భర్తలు ఇద్దరూ వస్తే ఈ తతంగం అంతా భర్త ఒడిలో భార్యని కూర్చో పెట్టి చేస్తారు.

మొత్తానికి త్రివేణీ సంగమంలో కార్యక్రమం పూర్తయ్యి ప్రయాగ (అలహాబాద్) లో మిగతా ప్రదేశాలు చూడటానికి బయల్దేరాము.


ప్రయాగ (అలహాబాద్)
ప్రయాగలో దర్శనీయ స్ధలాల గురించి తెలుసుకునే ముందు అసలు ప్రయాగ చరిత్రని గురించి కొంచెం చెప్తాను.

పురాతన కాలం నుంచీ ప్రయాగ తీర్ధరాజంగా కొనియాడబడుతున్నది. దీనికి ముఖ్య కారణం మూడు జీవ నదుల సంగమం ఇక్కడ వుండటం. అవి గంగ, యమున, సరస్వతి. ప్రస్తుతం సరస్వతి మనకి కనబడదు. ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘ మాసంలో "మాఘ మేలా" జరుగుతుంది. ప్రతి 12 సంవత్సరాలకీ కుంభ మేలా, 144 సంవత్సరాలకి మహా కుంభ మేలా జరుగుతాయి. భారత దేశం నలు మూలలనుంచీ అనేక మంది భక్తులు విచ్చేసి ఈ సంగమంలో స్నానం చేసి భక్తి భావనతో పునీతులవుతారు.

ఈ మేలాలు నిర్వహించటానికి వెనుక ఒక పౌరాణిక గాధ వుంది. దేవాసురులు సాగర మధనం చేసినప్పుడు అమృతం ఉద్భవించిందని అందరికీ తెలుసు. ఆ అమృతాన్ని అసురులబారినుండి రక్షించటానికి ఇంద్రుడు స్త్రీ అవతారంలో వచ్చి అమృత భాండాన్ని అసురులకు అందకుండా కాపాడబోయాడుట. ఆ సమయంలో ఇంద్రుడికీ, సురాసురులకీ మధ్య జరిగిన ఘర్షణలో అమృతభాండంలోంచి అమృతం తొణికి కొన్ని చుక్కల అమృతం నాసిక్, ఉజ్జయిని, ఋషీకేశ్ లో పడ్డాయిట. ఇంక ప్రయాగలోని ఈ త్రివేణీ సంగమంలో ఆ అమృత భాండమే పడిందిట. అందుకనే ఈ సంగమ ప్రాంతం అంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్పటినుంచీ ఈ మేలాలు జరుపబడుతున్నాయిట.

అదేమిటి అమృతం ఆవిర్భవించినప్పుడు మహా విష్ణువు మోహినీ రూపంలో వచ్చి దేవతలకి మాత్రమే అమృతం ఇచ్చాడు అంటారుకదా మరి ఇంద్రుడు స్త్రీ రూపంలో రావటమేమిటంటారా? మనవాళ్ళు చెప్పే కధ మనం విన్నాము. మరి అక్కడి కధ ఇది. నమ్మండి, నమ్మకపొండి మీ ఇష్టం.

మరి అప్పుడెప్పుడో, మనమెవ్వరం పుట్టక ముందు బ్రహ్మదేవుడు ఒక పెద్ద యజ్ఞం చేశాడుట. అప్పుడే ఆ స్ధలం పేరు ప్రయాగ అయిందిట.

రామాయణ కాలంలో శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళేటప్పుడు, దశరధ మహారాజు మంత్రి సుమంతుడు శ్రీ రామచంద్రుని, సీతా దేవిని, లక్ష్మణుడిని ఈ ప్రాంతందాకా సాగనంపాడట. వారు గంగదాటి ప్రయాగలోని భరద్వాజ ఆశ్రమాన్ని దర్శించారని ప్రతీతి. తరువాత వారు భరద్వాజ ఆశ్రమం నుంచీ అక్కడికి 131 కి.మీ. ల దూరంలో వున్న చిత్రకూట్ కి వెళ్ళారు.

సముద్రగుప్తుడు ప్రయాగలో 12 సంవత్సరాలు నిరంతరాయంగా యజ్ఞాలు నిర్వహించాడుట. ఈ యజ్ఞాలవల్ల ఋషులు, సాధువులు, భక్తులు ఇక్కడే తమ నివాసస్ధానాన్ని శాశ్వతంగా ఏర్పరుచుకోవటంతో ప్రయాగ దినదినాభివృధ్ధి చెందసాగింది.

644 బి.సి.లో చైనా యాత్రికుడు హుయాన్ స్వాంగ్ ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశం గురించి తన పుస్తకంలో వ్రాశాడు. ఇక్కడి గంగా యమునా నదుల గురించీ, అనేక ఆలయాల గురించీ, అశోక స్ధంబం గురించీ వ్రాశాడు.

ఇంకొక ఆసక్తికరమైన విషయం. 1575 సంవత్సరంలో అక్బర్ నదీ మార్గాన ప్రయాగ చేరాడు. ప్రయాగ వైభవానికి ముగ్ధుడైన అక్బరు దాని పేరు తను కొత్తగా స్ధాపించిన మతం దీన్-ఇల్-ఇలాహీ కలసి వచ్చేటట్లు అలహాబాద్ అని మార్చాడు. అప్పటినుంచీ ప్రయాగ అలహాబాదుగా కూడా పిలవబడుతోంది.

భారత దేశ స్వాతంత్ర్య సమరంలో కూడా అలహాబాద్ కి ప్రముఖ పాత్ర వున్నది. 1857లో మొదలైన భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అలహాబాద్ నుంచి శ్రీ లియాకత్ ఆలీ నాయకత్వం వహించారు. 1857 తరువాత కాంగ్రెసు పార్టీ సమావేశాలు అనేకం ఇక్కడ జరిగాయి. స్వతంత్ర భారత దేశం యొక్క మొట్టమొదటి ప్రధాన మంత్రి శ్రీ జవహర్ లాల్ నెహ్రూ తమ బాల్యాన్ని ఇక్కడి ఆనంద భవన్ లో గడిపారు. తర్వాత ప్రధాన మంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి, అలహాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయన్సీ కి చెందినవారే. అంతేకాదు, తర్వాత ప్రధాన మంత్రులైన శ్రీమతి ఇందిరా గాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ, శ్రీ వి.పీ. సింగ్ ఇక్కడ పుట్టినవారే.

సాహిత్యపరంగాకూడా వన్నెకెక్కింది ఈ అలహాబాద్. సుప్రసిధ్ధ హిందీ కవులు, రచయితలు ఇక్కడ పుట్టినవారు, తమ జీవితాలను ఇక్కడ గడిపినవారు ఎందరో. వారిలో కొందరు ఫిరాక్ గోరక్పూరీ, హరివంశరాయ్ బచ్చన్, మహాదేవీ వర్మా, డా. రామ్ కుమార్ వర్మ, సచ్చిదానంద హీరానంద్ వాత్సాయన్, భగవతీ చరన్ వర్మ, సూర్యకాంత్ త్రిపాఠీ నిరాలా.

ఇన్ని విధాల ప్రసిధ్ధికెక్కిన ప్రయాగని దర్శించటానికి అనుకూల సమయం అక్టోబర్ నుంచి మార్చి వరకు.

ప్రయాగలో దర్శనీయ స్ధలాలు
 1. పాతాళపుర మందిర్:
  త్రివేణీ సంగమం ఒడ్డునే అక్బర్ చక్రవర్తి కట్టించిన కోట వున్నది. దీనిలోకి అందరికీ ప్రవేశం లేదు. ఆర్మీ వున్నది ప్రస్తుతం ఆ కోటలో. అయితే ఈ కోటలో వున్న పాతాళ పుర మందర్ కి మాత్రం ఏ అనుమతి అవసరం లేకుండా వెళ్ళి రావచ్చు. ఫోటోలు తియ్యనియ్యరు.

  ఇక్కడ వున్న వట వృక్షం అతి పురాతనమయినది. మొదట్లో ఈ వటవృక్షం మొదలు భూమి ఉపరితలంపైనే వుండేదట. చైనా యాత్రీకుడు హుయాన్త్సాంగ్ వచ్చినప్పుడు ఈ వటవృక్షం బయట ఆవరణలోనే వుండేదిట. అక్బర్ కోట కట్టించేటప్పుడు స్ధలం ఎత్తు పెంచవలసి రావటంతో ఇవి భూ గర్భంలోకి వెళ్ళాయి. అయితే అంత పెద్ద కోట కట్టించేటప్పుడు కూడా అక్బర్ ఈ ఆలయాన్ని యధాతధంగా అట్టిపెట్టి తన మత సామరస్యాన్ని చాటుకున్నాడు.

  ప్రయాగలో మరణిస్తే మోక్షం లభిస్తుందనే నమ్మకంతో పూర్వకాలంలో ఈ చెట్టు మీద నుంచి కింద వుండే కామ్య కూపంలో దూకి ఆత్మాహుతు చేసుకునేవాళ్ళట. తన పూర్వ జన్మలో అక్బర్ చక్రవర్తి కూడా ఈ చెట్టు మీద నుంచి దూకి ప్రాణ త్యాగం చేశాడుట. అయితే ఆ సమయంలో ఆయన భారత దేశానికి చక్రవర్తిని కావాలని కోరుకున్నాడనీ అందుకే మరుజన్మలో చక్రవర్తి అయ్యాడనీ అక్కడి గాధ. హిందువులే కాదు, ముసల్మాన్ ఫకీర్లు కూడా ఈ చెట్టు నుంచీ హుక్ లకి వేళ్ళాడేవాళ్ళుట. అయితే ఇది అక్బర్ మాన్పించాడు.

  పూర్వం ఈ ఆలయంలోకి వెళ్ళే మార్గం చాలా ఇరుకుగా వుండేది. మార్గంలోను, లోపల తగిన వెలుతురు కూడా వుండేది కాదు. అయితే స్ధానికి ప్రజల పట్టుదలవల్ల సందర్శకులు తేలికగా వెళ్ళటానికి సరైన మార్గం, గాలి వెలుతురు ధారాళంగా వచ్చే ఏర్పాట్లు చెయ్యబడ్డవి. 84 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు గల పెద్ద హాలులాగా వుంటుంది ఈ పాతాళపురి మందిర్. దీనిలో ధర్మరాజు పిండప్రదానం చేస్తున్న శిల్పం, వేద వ్యాసుడు, అర్ధ నారీశ్వరుడు, వాల్మీకి, సనక సనందులు వగైరా అనేక ఋషులు, దేవతా విగ్రహాలున్నాయి. ఇవి అన్నీ అంత పురాతనంగా అనిపించలేదు.

  ఇక్కడే వట వృక్షం మొదలు కూడా వుంది. ఈ వట వృక్షానికున్న రెండు మొదళ్ళు మాతా పితరులకు ప్రతీకలని ఇక్కడ పూజారి మన గోత్ర నామాలు చెప్పి వాటిని కౌగలించుకోమంటారు. వట వృక్షం మొదలు మాత్రమే ఇక్కడ వుంటుంది. పై భాగం భూమి వుపరితలం మీదే వుంటుంది.

  శ్రీ రాముడు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చి ఈ వట వృక్షం కింద కూర్చున్నాడని, ఇక్కడ తండ్రికి శ్రాధ్ధ కర్మలు నిర్వహించాడని అంటారు. భరతుడు శ్రీ రాముని వెతుక్కుంటూ వచ్చి, ఆయన ఇక్కడ ఆగాడని తెలుసుకుని ఆ వట వృక్షానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు విగ్రహం వున్నది.

  ఈ కోటలోనే ప్రసిధ్ధికెక్కిన అశోక స్ధంబం వున్నది. దీనిని కౌశంబి నుంచి తెచ్చి ఇక్కడ స్ధాపించారు.

  కనీసం ఒక గంట సమయం వుంటే ఈ ఆలయాన్ని చూడవచ్చు. అంత సమయం లేనప్పుడు, వటవృక్షాన్ని చూసి ఒక్కసారి పాతాళ మందిర్ లోకి తొంగి చూసి వచ్చేయచ్చు ఆ విగ్రహాలన్నీ ఎవరివని వివరంగా చూడకుండా. మా వేన్ డ్రైవర్ దీన్ని చూడకుండా తీసుకుపోదామని చూశాడు. అది కోట. పర్మిషన్ లేకుండా వెళ్ళనవ్వరు అని. నాకు హింది చదవటం రావటం వల్ల పేరు చదివి అది మందిర్, మందిర్ కి పర్మిషన్ అక్కరలేదు ఒకసారి చూసొచ్చేస్తాము కోటలోకి వెళ్ళొచ్చినట్లుంటుందని పట్టుబట్టి వెళ్ళాను. ఇది ఎందుకు చెబుతున్నాను అంటే ఇలాంటివి వున్నాయని ఈ డ్రైవర్లల్లో కొందరికి తెలియదు, కొందరు ఈ ట్రిప్ త్వరగా పూర్తి చేసుకుని ఇంకో బేరం చూసుకుందామనే హడావిడో ఏమిటోగానీ కొన్ని ప్రదేశాలు మనల్ని చూడనివ్వరు. అలా మేము వదిలేసినవన్నీ చివరికి వ్రాస్తాను. మీకు వీలయితే చూడండి.


 2. బడా హనుమాన్ మందిర్ :
  పాతాళపుర మందిర్ నుంచి దానికి అతి సమీపంలో వున్న బడా హనుమాన్ మందిర్ కి వెళ్ళాము. ఇక్కడ ఆంజనేయస్వామి అతి పెద్ద విగ్రహం. నేలమీద పడుకున్నట్లు వుంటుంది. ఈ విగ్రహం మొగలు చక్రవర్తి అక్బరు సమయంలో స్ధాపించబడినదని కొందరంటే, కొందరు పూర్వం ఒక శైవ భక్తుని కలలో విగ్రహం ఇక్కడవున్నట్లు కనబడటంతో దానిని కనుగొని ఆలయం కట్టించారని అంటారు. ఏది ఏమైనా ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం చాలా పెద్దది.

  ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం పడుకోబెట్టినట్లు వుంటుంది. ఇదివరకు ఈ విగ్రహాన్ని వేరే చోటకి తరలించాలని (ముస్లింలని కొందరు, బ్రిటిష్ వారని కొందరు అంటారు) ప్రయత్నించారుట. విగ్రహాన్ని తవ్వటానికి ప్రయత్నించినకొద్దీ భూమిలో ఇంకా గుంటలాగా ఏర్పడి విగ్రహం ఇంకా స్ధిరంగా కాసాగింది. అందుకని అలాగే వదిలేశారు. ఇప్పుడు విగ్రహం గుంటలో వున్నట్లు వుంటుంది. చుట్టూ కట్టిన ప్లాట్ ఫారమ్ మీదనుంచి భక్తులు స్వామిని దర్శించి అర్చిస్తారు. కొందరు గంగనీరు తీసుకు వెళ్ళి పోస్తున్నారు, అలాగే పూవులు వగైరాలను సమర్పిస్తున్నారు.

  ఇంకొక విశేషమేమిటంటే వర్షాకాలంలో గంగానదికి వరదలొచ్చినప్పుడు గంగ నీరు ఈ విగ్రహాన్ని ముంచెత్తుతుందిట. చూసేవాళ్ళకి ఆంజనేయస్వామి గంగానదిలో స్నానం చేస్తున్నట్లు వుంటుంది.

  ఆలయంలో అక్కడి మహంత్ అనుమతితో ఫోటో తీసుకోవచ్చని బోర్డు చూసి ప్రయత్నించాను. మహంత్ ఆఫీసులో లేరు. వేరే ఒకాయన అక్కడ చరిత్ర ఏదో చెప్పారు కానీ నా కర్ధమయింది ఆంజనేయ స్వామి యుధ్ధానంతరం ఇక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నారు, అందుకనే విగ్రహం అలా పడుకున్నట్లుంటుంది అని. అడిగిన వెంటనే ఫోటోకి అనుమతి ఇవ్వక పోయినా ఆయనకి తెలిసిన విషయాలు చెప్పారు..అర్ధం చేసుకోలేక పోవటం నా దురదృష్టం. ఆయనకి ధన్యవాదాలు తెలిపి బయల్దేరాము చూడవలసినవి ఇంకా చాలా వున్నాయిగా మరి.


 3. శంకర విమాన మండపం:
  బడే హనుమాన్ మందిర్ నుంచి శంకర విమాన మండపం లేదా శంకర మఠం వెళ్ళాం. చాలా దగ్గరలోనే వుంది. ఈ విమాన మండపం ఇక్కడ నిర్మింపబడటానికి కారణం ఒక కధ చెప్తారు. కంచి పీఠానికి 68వ అధిపతి అయిన శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఒకసారి ప్రయాగలో వున్న సమయంలో, ఆది గురువు శ్రీ శంకరాచార్యులవారు కుమారిల భట్టు అనే విద్వాంసుని కలిసి తన అద్వైత సిధ్ధాంతాలతో ఆయన మీద విజయం పొందిన ప్రదేశంలో ఆ విజయ సూచకంగా ఒక విజయ స్తంబాన్ని స్ధాపించాలని సంకల్పించారు. 1986 లో ప్రతిష్టింపబడిన ఈ మందిరం ఎత్తు 130 అడుగులు. ఈ మందిర నిర్మాణానికి 16 సంవత్సరాల సమయం పట్టింది. ఒక కోటి రూపాయలు ఖర్చయినాయి. ద్రవిడ శైలిలో నిర్మింపబడిన ఈ మండపంలో శ్రీ కామాక్షీ అమ్మవారు, శ్రీ వెంకటేశ్వరస్వామి, శంకరుడు, శంకరాచార్యుల విగ్రహాలు ప్రతిష్టింపబడి వూజలందుకుంటున్నాయి. ఇవే కాక ఇంకా అనేక దేవీ దేవతా మూర్తుల విగ్రహాలు ప్రతిష్టింపబడ్డాయి. 4. మాధవేశ్వరీ దేవి మందిరం:
  అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ మాధవేశ్వరీ దేవి మందిరం ప్రయాగలోనే వుంది. ఇక్కడి వారు ఈ మాతని అలోపీ దేవిగా వ్యవహరిస్తారు.

  ఆహ్వానం లేకుండా దక్ష యజ్ఞానికి వెళ్ళిన పార్వతీదేవి అవమానం భరించలేక ఆత్మాహుతి చేసుకోవటం, ఆవిడని ఎత్తుకుని శంకరుడు ఉగ్రతాండవం చేయటం, ఆయనని శాంతింపచేయటానికి విష్ణుమూర్తి పార్వతీ దేవి శరీరాన్ని తన విష్ణు చక్రంతో ముక్కలు చెయ్యటం, అవి 18 ముక్కలుగా దేశంలో వివిధ ప్రదేశాల్లో పడి శక్తి పీఠాలుగా ఖ్యాతి చెందటం మీకు తెలుసుకదా.

  ఇక్కడ అమ్మవారి ముంజేయి పడ్డది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏమీ వుండదు. ఒక నలుచదరం పీఠంలాగా వుంటుంది. దానిపైన ఒక గుడ్డ హుండీ వేలాడదీసినట్లుంటుంది. దానికింద ఒక ఉయ్యాల. భక్తులు తాము తీసుకెళ్ళిన కానుకలను ఆ ఉయ్యాలలో వుంచి మొక్కుకోవాలి.

  అమ్మవారి విగ్రహం లేకపోవటంతో మన దేవాలయాలు సందర్శించిన తృప్తి వుండకపోయినా, అష్టాదశ శక్తి పీఠాలలో ఒక పీఠాన్ని దర్శించామన్న ఆనందంతో అక్కడనుండి బయల్దేరాము.

  మాధవేశ్వరీదేవి మందిరం


  పార్వతీదేవి ముంజేయి తెగి పడుతున్న దృశ్యం.


 5. భరద్వాజ ఆశ్రమం:
  అతి పురాతనమైన ఈ ఆశ్రమం ప్రస్తుత చిరునామా కలొనల్ గంజ్ లో ఆనంద భవన్ సమీపంలో. త్రేతాయుగంలో వనవాసానికి బయల్దేరిన శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడితో సహా గంగానదిని దాటి ఈ ఆశ్రమానికి వచ్చాడు. ఇక్కడ మూడు రాత్రులు వుండి, భరద్వాజ మహర్షి దగ్గర అనేక విషయాలు తెలుసుకుని, ఆయన ఆశీర్వచనంతో యమునా నదిని దాటి చిత్రకూట్ కి పయనమయ్యాడు. ఆ కాలంలో గంగానది ఈ ఆశ్రమానికి సమీపంలో ప్రవహిస్తూ వుండేది. తర్వాత కాలంలో అక్బరు నిర్మిచిన బక్షి, బేని అనే ఆనకట్టల వలన గంగా ప్రవాహ గతి మారింది అంటారు.

  ఆ కాలంలో చాలా దూర ప్రదేశాలనుంచి విద్యార్ధులు విద్యనభ్యసించటానికి ఇక్కడికి వచ్చేవారు. సందర్శకుల దర్శనార్ధం ఈ ఆశ్రమంలో శివ, కాళీమాత విగ్రహాలతోబాటు భరద్వాజ మహర్షి విగ్రహం కూడా వున్నది.

  ప్రస్తుతం ఆశ్రమానికి అతి సమీపంలో నివాస గృహాలు వచ్చాయి. ఆశ్రమానికి ఆనుకుని పార్కు అభివృధ్ధి చేస్తున్నారుట. సమయాభావంవల్ల పార్కు చూడలేదు. 6. ప్రయాగలో ఇతర సందర్శనీయ ప్రదేశాలు:
  సమయం ఉన్నవారు సందర్శించదగ్గ ఇతర ప్రదేశాలు..... స్వరాజ్ భవన్, ఆనంద భవన్. నాగ వాసుకీ దేవాలయం, మన్ కామేశ్వర్ మహా దేవ్ మందిరం (ఈ మందిరం నుంచి యమునా నది అందాలు చూడవచ్చుట. ఇక్కడ శివునికిచ్చే హారతి, వెనువెంటనే జరిగే ప్రార్ధనలు చాలా బాగుంటాయిట), వేణీ మాధవ మందిరాలున్నాయి. వీటిని మేము చూడలేదు కనుక ఇంతకన్నా చెప్పలేను.
సీతామడి
అలహబాద్ వారణాసి రహదారిలో అలహాబాద్ నుంచి సుమారు 50 కి.మీ. తర్వాత రహదారినుంచి 10 కి.మీ.లు లోపలికి వెళ్తే వస్తుంది సీతామడి. ఈ ప్రదేశాన్ని అభివృధ్ధి చేసి 15 ఏళ్ళు అవుతోంది. సీతమ్మవారు భూగర్భంలోకి వెళ్ళిన ప్రదేశం ఇదని కొందరి నమ్మిక. రెండంతస్తుల సీతమ్మవారి ఆలయంలో ఆవిడ విగ్రహాలు, వెనుక అద్దాలతో లవకుశులు, రాముడు వగైరా చిత్రాలు వున్నాయి.
ఈ ఆలయ ఆవరణలో శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయాలు వున్నాయి. ఈ రెండు ఆలయాలలో ప్రదక్షిణ మార్గాలు సొరంగ మార్గంలా ఏర్పాటు చేయబడి యాత్రీకులను ఆకర్షిస్తుంటాయి. ఆంజనేయస్వామి ఆలయం ముందు అతి పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం వుంది.
సీతాదేవి ఆలయం చుట్టూ సరస్సు వుంది. సుందర ప్రాకృతిక దృశ్యాల మధ్య లాయడ్స్ స్టీల్ గ్రూప్ వారిచే అభివృధ్ధి చెయ్యబడ్డ ఈ ఆలయాలను ప్రయాగ వెళ్ళివచ్చే యాత్రీకులంతా తప్పక దర్శిస్తారు.

సీతా దేవి ఆలయం


పై అంతస్తులో సీతాదేవి విగ్రహం


క్రింది అంతస్తులో సీతాదేవి విగ్రహం


100 అడుగుల పైన ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహం
గయ
బీహార్ రాష్ట్రంలోని గయ జిల్లా ముఖ్య కేంద్రం గయ. గయ అనగానే చాలామందికి గుర్తుకొచ్చేది పితృ కార్యాలు. చనిపోయినవారికి ఇక్కడ శ్రాధ్ధ కర్మలు చేస్తే చాలా మంచిదని, పితృదేవతలు తరిస్తారని అంటారు. కొందరైతే ఇక్కడ ఒకసారి శ్రాధ్ధ కర్మలు చేస్తే తిరిగి ప్రతి ఏడాదీ చెయ్యక్కరలేదు అంటారుగానీ అది నిజం కాదని అక్కడివారన్నారు.

గయకు చేరుకోవటానికి రైలు, బస్ సౌకర్యాలున్నాయి. సాధారణంగా కాశీ వెళ్ళినవాళ్ళు అక్కడనుండి ప్రైవేటు వాహనం మాట్లాడుకుని గయ వెళ్ళి వస్తారు. మేమూ అలాగే ఒక వాహనంలో రాత్రి 1 గం. కి బయల్దేరి ఉదయం 7 గం. లకు గయ చేరుకున్నాము. మా వేన్ డ్రైవరు సరాసరి ఒక తెలుగు బ్రాహ్మణుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇల్లు పెద్దదే. 4, 5 ఆవులు కూడా ఆ ఇంట్లో వున్నాయి.

గయలో వుండటానికి అనేక వసతులు వున్నట్లే ఈ కర్మలు చేయించే బ్రాహ్మణులుకూడా యాత్రీకుల అవసరానికి ఉచితంగా వసతి ఇస్తారు. ముందే చెప్పి డబ్బు కడితే కార్యక్రమం తర్వాత భోజనం కూడా ఏర్పాటు చేస్తారు. ఇవ్వన్నీ ఎలా వుంటాయని అడగద్దు. మన అవసరార్ధం ఒక రోజు గడిపి వచ్చెయ్యటమే.

వెళ్ళిన వెంటనే అక్కడవున్న బ్రాహ్మణుడు మా గ్రూప్ లో వారంతా వచ్చిన పని, మా కార్యక్రమాలు తెలుసుకుని మా కందరికీ ఒక గది ఇచ్చి స్నానాలు కానిచ్చి త్వరగా వస్తే కార్యక్రమాలు మొదలు పెట్టచ్చన్నారు. బయట 5, 6 స్నానాల గదులు, వాష్ బేసిన్లు, పంపులు వున్నాయి. కొందరు మగవారు పంపుల దగ్గరే స్నానాలు కానిస్తున్నారు.

అక్కడ రేట్లు బేరం ఆడటం లేదు. బాగానే వుంది. కానీ నేను ప్రాయశ్చిత్తం చేసుకుని, కూర, కాయ, పండు వదలనన్నానని నా మీద ఆ బ్రాహ్మణునికి కొంచెం కోపం వచ్చింది. అలా వదిలితే మళ్ళీ ఆ వస్తువు తిన కూడదు. మేమా దేశ దిమ్మరులం. ఏ రోజు ఎక్కడ తింటామో తెలియదు. వెళ్ళిన చోటల్లా ఆ వంటల్లో నేను వదిలేసినవి వేశారేమో ఎక్కడ కనుక్కోను. ఆ అవస్తలు పడేకన్నా ఆ పని చేయకపోవటమే నాకు ఉచితం అనిపించింది. పైగా ఈ మధ్య నలుగురూ చెప్పేవి విని కొంచెం బుఱ్ఱ పెంచుకుంటున్నానులెండి. "మన అహంకార మమకారాలన్నీ వదిలి భగవంతుని చేరుకోవటానికి చేసే ప్రయత్మంలో అలా మనకిష్టమయిన వస్తువులు వదిలిపెట్టటం మొదటి మెట్టు." అని ఎక్కడో విన్నాను. ఏదో పండూ, కూరా బదులు నా అహంకారం కొంచెంకాకపోతే కొంచెమన్నా వదలటమే నాకు తేలిక అనిపించింది.

అన్నట్లు గయలో పితృకార్యాలేకాక, మనం అప్పటిదాకా తెలిసీ తెలియక చేసిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవటం, పండూ, కూరా వగైరాలను వదిలి పెట్టటం చేస్తారు.

స్నానాలయ్యాక కొంచెం దూరంలో వున్న విష్ణుపాదం ఆలయానికి నడిచే వెళ్ళాము. కొంచెం ఎత్తులో ఆలయం. ఆ ఆలయానికి చేరుకునే లోపలే వున్న ఖాళీ ప్రదేశంలో ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తున్నారు పురోహితులు. చాలామందే వున్నారు. పురోహితుడు మా కార్యక్రమాలకని వెంటబెట్టుకుని తీసుకు వెళ్ళటంతో మేము గుడికి వెళ్తున్నట్లు, అక్కడ ఆలయం వున్నట్లు కూడా ముందు తెలియలేదు. మా వాళ్ళ కార్యక్రమాలయ్యాక దేవాలయానికి వెళ్ళిరమ్మని పురోహితుడు చెబితే ఇక్కడే వుందా అనుకున్నా. ఈ ప్రదేశానికి ప్రక్కనే ఫల్గుణీ నది. ఒక్క చుక్క కూడా నీరు లేదు.

దేవాలయంలో ఒక పెద్ద బేసిన్ లాంటి దాని మధ్యలో పెద్ద విష్ణు పాదం ఆకారం వుంది. ఆ బేసిన్ చుట్టూ వెండి రేకు తాపడం చేశారు. అందరూ ఆ పాదం తాకి నమస్కారం చేస్తున్నారు. మేమూ ఫాలో అయిపోయాము. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని 1787లో రాణీ అహల్యాబాయి పునర్నిర్మించారు. ప్రస్తుతం మనం చూస్తున్నది ఆ పునర్నిర్మాణమే.

ఆలయ ఆవరణలో అనేక ఉపాలయాలేకాక ఒక పెద్ద మఱ్ఱి చెట్టు వుంది. భక్తులు ఈ చెట్టుకి ముడుపులు కడుతున్నారు. ఈ వృక్షం కింద గౌతమ బుధ్ధుడు చాలాకాలం తపస్సు చేశాడుట. అందుకే ఈ క్షేత్రం హిందువులకేకాక బౌధ్ధ మతస్తులకు కూడా పుణ్య క్షేత్రం.

ఈ విష్ణుపాదం ఆలయం గురించి ఒక చిన్న కధ....
పూర్వం గయాసురుడనే రాక్షసుడుండేవాడు. శ్రీ మహావిష్ణువు గయాసురుణ్ణి తన పాదంతో తొక్కి చంపాడుట. అప్పుడు గయాసురుడి శరీరం చిన్న కొండలుగా రాళ్ళ గుట్టలుగా మారిందిట. గయాసురుడు రాక్షస శ్రేష్ఠుడు. ఆయనవంక చూసినా, ఆయనని తాకినా వారి పాపాలన్నీ పటాపంచలయిపోయేవిట. అందుకే, అంత పుణ్యాత్ముడయిన గయాసురుడి శరీరం కొండలు గుట్టలుగా మారిపోయాక అనేక దేవీ దేవతల ఆలయాలు అక్కడంతా వెలిశాయిట. ఇక్కడ అనేక ఆలయాలు వున్నాయి. సమయం వున్నవారు వాటిగురించి కనుక్కుని దర్శించవచ్చు.

ఇక్కడ షాపుల్లో విష్ణుపాదాలు అమ్ముతారు. అవి దేవుడి దగ్గర పెట్టి పూజిస్తే మంచిదని అందరూ తెచ్చుకుంటారు. కొందరు శ్రాధ్ధ కర్మ చేసేటప్పుడు పిండాలని వాటిమీద పెడతారు.

ఉదయం 11 గం. కల్లా అక్కడ కార్యక్రమం అయిపోయి మా విడిదికి వచ్చాము. భోజనం, కొంచెం విశ్రాంతి తర్వాత మధ్యాహ్నం 2 గం.లకు తిరుగు ప్రయాణం మొదలైంది.


ఫల్గుణీ నది (నీళ్ళు లేవు)


విష్ణుపాదం ఆలయం


ఆలయ ఆవరణలో వటవృక్షం (బుధ్ధుడు తపస్సు చేసినచోటు)


మంగళగౌరి ఆలయం(గయ, బీహార్)
గదాధరసహోదరి గయా గౌరి నమోస్తుతే పితృణాంచ సకర్తృణాం దేవి సద్గతిదాయిని
త్రిశక్తిరూపిణీమాతా సచ్చిదానంద రూపిణీ మహ్యంభవతు సుప్రీతా గయామాంగళ్యగౌరికా.


గయలోని మంగళగౌరి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. దక్షయజ్ఞ సమయంలో అసువులుబాసిన పార్వతీ దేవి శరీరాన్ని శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో భిన్నం చేయగా అవి అనేక చోట్ల పడిశక్తి పీఠాలుగా ఆరాధింపబడుతున్నాయి.. అందులో ముఖ్యమైన శరీర భాగాలు పడిన ప్రదేశాలు 18 అష్టాదశ శక్తి పీఠాలు. గయలో అమ్మవారి తొడ భాగం పడ్డది.

ఈ ఆలయ ప్రసక్తి పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణాలలో చేయబడింది. ప్రస్తుతం వున్న ఆలయం క్రీ.శ. 1459 లో నిర్మింపబడింది. మంగళగౌరి అనే చిన్ని కొండమీద ఇటుకలతో నిర్మింపబడిన చిన్న ఆలయం ఇది.

గర్భగుడి చాలా చిన్నది. లోపల చిన్న గుంటకి చుట్టూ చతురస్రాకారపు దిమ్మె లాగా వుంటుంది. ఆ దిమ్మె మీద మనం వెలిగించే అఖండ దీపంలాంటిది ఒకటి, ఇంకా భక్తులు వెలిగించిన దీపాలు ప్రకాశిస్తూ వుంటాయి. గుంటలో అమ్మవారి తొడ భాగానికి ప్రతీకగా సాలగ్రామంలాగా వుంది. దానినే మంగళగౌరీ దేవిగా భక్తులు పూజిస్తారు.

ఇరుకు ప్రదేశాలలోకి వెళ్ళటానికి ఇబ్బంది పడేవాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుని వెళ్ళండి.


ఎడమవైపు కనబడుతున్న గోపురం ఆమ్మవారి గుడి.(చిన్న కొండమీద వుంది.)
rameshsssbd said...
అన్నిటికన్నా ముఖ్యం గయలోని మహాశుభ్రత మరియు పండాల డబ్బు యావ. వీటి మధ్యలో అధ్యాత్మికత. ఇక మాంగల్య గౌరి గుడికి వున్న దారి గొప్పతనము చూడాలి కాని వర్ణించలేము అలా అని ఫొటోలో చూపలేము. మనం అమ్మ కొసం, విష్ణు పాదం కోసం - వారు మన దగ్గర సోమ్ము కొసం. అది సంగతి.
snkr said...
గయాలో పిండప్రదానం విశేషాలు/అనుభవాలు తెలుపండి. గయలో బ్రతికుండగానే ముందస్తు శ్రాద్ధాలు పెట్టుకోవచ్చని ఎవరో చెప్పారు. మీకు తెలిసుంటే వివరాలు చెప్పండి.
psmlakshmiblogspotcom said...
కాశీ యాత్రలో నాకు ఇబ్బంది కలిగించిన విషయాలు వున్నాయి. కానీ ఏ పుస్తకంలో చూసినా కాశీని గానీ అక్కడ పరిస్ధితులను గానీ ఏమీ విమర్శించకూడదు, చాలా పాపం వస్తుంది అనే వుంది. బహుశా అక్కడ వాళ్ళే నాలాంటి వాళ్ళ కోసం అలాంటి మాటలు చెప్పారని నా అనుమానం. ఎలాంటి పాపం వచ్చినా సరే చివరలో అక్కడ ఎదురయ్యే ఇబ్బందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పదలుచుకున్నాను. ఇప్పటికే నా ఆవేశం ఆగక చాలా చోట్ల ఇబ్బందులు చెప్పేశాను.

గయలో నేను ఏ కార్యక్రమం చేయించలేదు, మా వారు నాతో రాక పోవటంవల్ల శ్ర్రాధ్ధ కర్మలు చేయించలేదు. నా ప్రవర్తనలో మార్పు రావాలిగానీ ప్రాయశ్చిత్తం చేసుకున్నంత మాత్రాన, పండు వగైరా వదిలేసినంత మాత్రాన నేను చేసిన పాపాలేమన్నా వుంటే పోవని నమ్మకం వున్నదాన్ని. అందుకని అవి చెయ్యకుండా అక్కడ బ్రాహ్మణుని కోపానికి కూడా గురయ్యాను. "ఏం చెయ్యకపోతే ఎందుకొచ్చారు?" అన్నాడక్కడాయన.

పోయినవారికే అక్కడ శ్రాధ్ధ కర్మలు చేసినా మళ్ళీ ప్రతి ఏడాదీ చెయ్యాలన్నప్పుడు బ్రతికున్నవాళ్ల సంగతి మరి ఆలోచించాలి కదా. అయితే మేమంతా ఆడపిల్లలమవటంతో తర్వాత మా వాళ్ళకి ఎవరు చేస్తారో ఏమోనని ఇలాగే ఎవరో అంటే మా నాన్నగారిని అడిగాను నేను ఈ విషయమే (కేవలం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకూడదనే ఆలోచనతోనే). ఆయన ఏం చెప్పారంటే అలా పెట్టినప్పుడు వాళ్ళు తిరిగి ఇంటికిగానీ, మనుషుల్లోకిగానీ రాకూడదట. మహాప్రస్ధానం వెళ్ళాలట. అంటే అడవుల్లోకీ, పర్వతాల్లోకీ అలా వెళ్తూవుంటే ఎక్కడో అక్కడ ప్రాణాలు పోతాయి. ఎవరి వీలుకోసం వాళ్ళు ఏర్పరుచుకొనే ఆచారాలు కూడా వుంటాయి మరి.
said...
psmlaksmi గారూ, snkr గారూ
గయలో శ్రాద్ధ కర్మ చేసుకున్న వాళ్ళు ఆ పై ఎటువంటి మంగళ కార్యాలకు హాజరు కాకూడదు, ఆశీర్వచనాలు ఇవ్వరాదూ, తీస్కోరాదు. ఆ పై వారు అన్ని రకాల ధార్మిక నియమాలను(జప, తప, దానాలు) పాటించాలి. అందుకని ఇది దాటవేయ్యడం మంచిది. మనకు కర్మకాండ, శ్రాద్ధకర్మాలు చెయ్యటానికి వారసులు ఎవ్వరూ లేరనుకోండి అలాంటప్పుడే ఆ తంతు జరగాలి.

డబ్బుకు ఆశ పడి చాలా మంది పండాలు ఈ నియమాలు పాటించరు. పైగా మీరు అక్కడి పురోహితుల(పండాల) శుచి శుభ్రత, వాక్కు, ఆహార నియమాలు గమనిస్తే వెంటనే ఆత్మహత్య చేస్కున్నా చేస్కుంటారు. అక్కడి వారు అంతా డబ్బుకి దాసోహం. అటువంటి వారి దుర్భాషలకు పెద్ద ఎఫ్ఫెక్ట్ కూడా ఉండదులెండి.


బుధ్ధ గయ
గయనుంచి 12 కి.మీ. దూరంలో వున్న బుధ్ధగయ చేరుకున్నాము. ఇక్కడే సిధ్ధార్ధుడికి జ్ఞానోదయమైంది. భారత దేశంలో బౌధ్ధులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రాలు నాలుగు వున్నాయి. అవి గౌతమ బుధ్ధుడు జన్మించిన బినీవనం, బుధ్ధునికి జ్ఞానోదయమైన బుధ్ధ గయ, ఆయన మొదట ప్రసంగించిన సారనాధ్, చివరిది ఉత్తర ప్రదేశ్ లోని కుషినారా. బుధ్ధుడు నిర్యాణం చెందిన ప్రదేశమిది.

500 బి.సి. లో సిధ్ధార్ధుడు జ్ఞానాన్వేషణలో తిరుగుతూ గయ సమీపంలోని ఒక వృక్షం కింద ధ్యానంలో నిమగ్నమై కూర్చున్నాడు. మూడు రోజుల తర్వాత ఆయనకి జ్ఞానోదయం కలిగింది. తర్వాత ఆయన అక్కడ ఏడు వివిధ ప్రదేశాలలో ఏడు వారాలు ధ్యానంలో గడిపారు. తరువాత ఆయన సారనాధ్ చేరి తన మొదటి ప్రవచనం చేశారు.

బుధ్ధుడు ప్రవచనాలు మొదలుపెట్టిన తరువాత ఈ ప్రాంతం క్రమంగా ప్రాముఖ్యతను సంతరించుకుని గౌతమ బుధ్ధుని శిష్యులు వైశాఖ పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చేవారు. కాలక్రమంలో ఈ ప్రదేశం బుధ్ధ గయగా, వైశాఖ పౌర్ణమి బుధ్ధ పౌర్ణమిగా పేరుపొందాయి. కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ బౌధ్ధమతం విలసిల్లింది.

బుధ్ధునికి జ్ఞానోదయం అయిన 250 ఏళ్ళ తర్వాత అశోక చక్రవర్తి ఇక్కడికొచ్చాడు ఆయన గురువైన ఉప గుప్తుడు ఆయనని బౌధ్ధక్షేత్రాలు దర్శింపచేశాడని, అందులో ఇది ఒకటి అని చెబుతారు. ఇక్కడ మొదట ఆలయం నిర్మించినది కూడా అశోక చక్రవర్తే.

ప్రస్తుతం వున్న బోధి వృక్షం బుధ్ధుడి సమయంలో వున్న వృక్షంనుంచి వచ్చిదేనంటారు. అశోక చక్రవర్తి పరిపాలనలో బుధ్ధుడు జ్ఞానోదయం పొందిన అసలు వృక్షంలోని ఒక భాగాన్ని శ్రీలంకలోని అనురాధపురంలో నాటారు. తర్వాత ఆ చెట్టులో భాగాన్ని తీసుకువచ్చి తిరిగి ఇక్కడ నాటారంటారు.
బోధివృక్షం క్రింద బుధ్ధుడి విగ్రహం వుంటుంది. ఇక్కడే ఆయన తపస్సు చేసింది.
ఈ ఆలయానికి సమీపంలో భూటాన్, చైనా, శ్రీలంక, టిబెట్, జపాన్, బర్మా, మొదలగు దేశాలవారు నిర్మించిన కట్టడాలున్నాయి.
ధాయ్ వారి కట్టడం ప్రక్కనే ఉద్యానవనంలో 25 మీటర్ల ఎత్తయిన బుధ్ధుని విగ్రహం యాత్రీకులను ఆకర్షిస్తుంది.
7వ శతాబ్దంలో భారత దేశ యాత్ర చేసిన చైనా యాత్రీకుడు హుయాన్ స్వాంగ్ తన గ్రంధంలో బుధ్ధగయ గురించి రచించాడు.


సారనాధ్
సారనాధ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బౌధ్ధస్తూపం. ఇక్కడి స్తూపం ఎత్తు 143 అడుగులు. దీనిలోని రాళ్ళు ఇనప క్లాంప్స్ తో కలపబడ్డాయి.

దీన్ని ముందు నిర్మింపచేసినది మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు. 12వ శతాబ్దంవరకు అనేకసార్లు అనేక మందిచేత ఈ స్తూపం విస్తరింపబడింది. ఇక్కడ వున్న కట్టడాలు అనేక ఆక్రమణలలో విధ్వంసంగావింపబడగా, ప్రస్తుతం మనం చూస్తున్నవి తిరిగి మరమ్మత్తు చెయ్యబడ్డవి.

20వ శతాబ్దంలో ఇక్కడ ఒక బౌధ్ధ ఆలయం కొత్తగా నిర్మింపబడింది. ఇక్కడ తవ్వకాలలో దొరికిన బౌధ్ధ అవశేషాలని ఇక్కడ భద్రపరిచారు. ప్రతి సంవత్సరం బుధ్ధ పౌర్ణమినాడు వాటిని వూరేగిస్తారు.

ఇక్కడ ఆర్కయాలజీ మ్యూజియం దర్శించదగినది. మహాబోధి లైబ్రరీలో బుధ్ధుని గురించి అనేక పుస్తకాలు, వ్రాత ప్రతులు వున్నాయి.

7వ శతాబ్దంలో భారతదేశ యాత్రకు వచ్చిన చైనా యాత్రీకుడు హుయాన్స్వాంగ్ తన గ్రంధంలో ఇక్కడవున్న కట్టడాలగురించి వ్రాశాడు.

సారనాధ్ స్ధూపం

గంగా తీరంలో స్నాన ఘట్టాలు
పావన గంగా నదీ తీరాన వరుణా ఘాట్ నుంచీ అస్సిఘాట్ వరకు 64 ముఖ్యమైన స్నాన ఘాట్లు వున్నాయి. కొత్తవి ఇంకా కొన్ని చేరాయి. యాత్రీకుల సౌకర్యార్ధం పడవల వారు ఈ స్నాన ఘాట్లని చూపిస్తూ, మధ్యలో కొన్ని ముఖ్యమైన చోట స్నానానికి సమయమిస్తూ తిప్పుతారు. డబ్బు, ప్రయాణీకుల సంఖ్యమీద, వారి బేరం చేసే సామర్ధ్యం మీద ఆధారపడి వుంటుంది. మేము ముగ్గురం ఉదయం 11 గం. నుంచి మధ్యాహ్నం 12-30 దాకా ఒక బోట్ లో తిరిగాం, మధ్యలో మణికర్ణికలో మాత్రం ఆగాము. దానికి 250 రూ. తీసుకున్నాడు.

సాధారణంగా ప్రయాణీకులు సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలో ఈ ఘాట్ ల సౌందర్యం తిలకించటానికి ఇష్టపడతారుగనుక ఆ సమయంలో రేటు కొంచెం ఎక్కువ వుండవచ్చు.

ఎక్కువమంది యాత్రీకులు మణికర్ణికా ఘాట్, దశాశ్వమేధ ఘాట్, పంచ గంగలలో స్నానం చెయ్యటానికి ఆసక్తి చూపిస్తారు. వీటిని గురించి కొంచెం వివరంగా........
 • మణికర్ణికా ఘాట్
  పూర్వం మహా విష్ణు తన చక్రంతో ఒక సరస్సు తవ్వి దాని ఒడ్డున మహా శివునికోసం తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, విష్ణువుయొక్క తపస్సుని మెచ్చుకుంటూ తలాడించాడట. అంతే.. ఆయన చెవికున్న మణి కుండలం జారి ఆ తటాకంలో పడింది. సాక్షాత్తూ ఆ మహా ప్రభువు ధరించిన చెవి కుండలం పడిన తటాకం మణకర్ణికా ఘాట్ అయింది. తరువాత కాలంలో గంగానది ఆ తటాకం మీదనుంచి ప్రవహించిందని కొందరంటారు. ఈ ఘాట్ లో మెట్లు ఎక్కి పైకి వెళ్తే అక్కడ నలువైపులా రాళ్లతో కట్టబడిన పుష్కరిణి ఒకటి వున్నది. అదే మహా విష్ణువు చక్రంతో తవ్విన తటాకమని కొందరంటారు.

  ముందు గంగానదిలో మణికర్ణికా ఘాట్లో స్నానం చేసి పైకి వెళ్ళి ఆ కుండంలో స్నానం చేసి, మళ్ళీ వచ్చి మణికర్ణికా ఘాట్ లో స్నానం చెయ్యాలని మేము వెళ్ళిన బోటు అతను చెప్పాడు. ఇంకో విశేషమేమిటంటే ఈ ఘాట్ లో స్నానం చెయ్యటానికి మధ్యాహ్నం 12 గం. లకు సకల దేవతలూ వస్తారుట. అందుకని ఆ సమయంలో అక్కడ స్నానం చెయ్యటం చాలా మంచిది అని చెప్తారు. ఒడ్డున చిన్న చిన్న దేవాలయాలు వున్నాయి. కొందరు పితృకార్యాలు చేస్తున్నారు.

  మణికర్ణికా ఘాట్


  చక్ర తీర్ధం


 • దశాశ్వమేధ ఘాట్
  ఇక్కడ బ్రహ్మదేవుడు పది అశ్వమేధ యాగాలు చేశాడుట. అందుకే ఆ పేరు. ఈ ఘాట్ యాత్రీకులతో ఎప్పుడూ సందడిగా వుంటుంది. రోజూ సాయంసమయంలో ఇక్కడ గంగ హారతి ఇస్తారు.

  ప్రయాగ మరియు దశాశ్వమేధ ఘాట్స్
 • హరిశ్చంద్ర ఘాట్
  హరిశ్చంద్రుడు కాటికాపరిగా చేసింది ఇక్కడే. ఇక్కడ శవదహనాలు ఎప్పుడూ జరుగుతూనే వుంటాయి. దీని ప్రక్కనే కేదార్ ఘాట్.
 • కేదార్ ఘాట్
  ఈ ఒడ్డునే కేదారేశ్వర మందిరం వున్నది, ఈ ప్రాంతంలో తెలుగువారు ఎక్కువ వుంటారుట.

  మెట్లకి ఎదురుగా ఒడ్డున కేదారేశ్వర మందిరం (ఎఱ్ఱ బిల్డింగ్ పక్కన)


  ఇలా బోట్ లో వెళ్ళేటప్పుడు బోటతను మధ్యలో ఆపి డబ్బులడుగుతాడు, రాములవారు అక్కడే నది దాటారనీ, ఆయనని తలచుకుని అక్కడ దానమిస్తే పుణ్యమనీ. బయల్దేరగానే అలా మధ్యలో ఆపి అడిగేసరికి మాకు కోపం వచ్చి ఇవ్వలేదు. దాంతో అతనికి చాలా కోపం వచ్చి, ముందంతా అన్నీ చెప్పిన వాడు తర్వాత ఏమీ చెప్పలేదు. ఇలాంటి సమయాల్లో ఏం చేస్తారో మీ ఇష్టం. పుణ్యక్షేత్రానికి వెళ్ళారు కనుక ఎంతో కొంత ఇచ్చేయచ్చు. వాళ్ళు అల్ప సంతోషులు, పైగా బీదవారు అనుభవంతో మాకు తెలిసిందిది.

  గంగానది మీద పడవ షికారుకి తప్పక వెళ్ళండి. అన్ని ఘాట్లూ బోట్ లోంచి చూడవచ్చు. వీలయితే సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో బాగుంటుంది. సమయముంటే సాయంకాలాలు ఘాట్ లో మెట్లమీదకూర్చుని సమయం గడపవచ్చు.

ముగింపు
కాశీ క్షేత్రం గురించి ఇప్పటిదాకా నాకు తెలిసిన విశేషాలు చెప్పాను. కాశీలాంటి మోక్షదాయక క్షేత్రం ఇంకెక్కడా లేదంటారు. అన్నపూర్ణాసమేత విశ్వేశ్వరుడు కొలువుతీరిన ఈ క్షేత్రంలో అడుగు పెట్టటమే ఎన్నో జన్మల పుణ్యఫలం. అసలు కాశీ వెళ్తాను అనుకుంటేనే చాలుట.. ఎంతో పుణ్యంవస్తుందట. అలాంటి పుణ్యక్షేత్రం కాశీ వెళ్ళాలని తపించి వెళ్ళాక, ఆధ్యాత్మిక భావాలలో మునిగిపోయేవారికి అన్నిచోట్లా విశ్వేశ్వరుడూ, విశాలాక్షే కనిపిస్తారు. కానీ అంత తాదాత్మ్యం చెందలేని వారికి కాశీలో ఇరుకు సందులు, అడుగడుగునా అపరిశుభ్రత, ఏ సమయంలోనైనా రోడ్లమీద కనిపించే పశువులూ, అడుగు బయటపెడితే చాలు అడ్డంపడే బట్టల షాపులవాళ్ళూ… ఓహ్ ఇదా విశ్వేశ్వరుడి నివాసం అనిపిస్తుంది.

అవ్వన్నీ పక్కన పెట్టి నిండుమనసుతో ఒక్కసారి పావనమైన ఆ కాశీ పట్టణాన్ని, విశ్వేశ్వరుని, గంగమ్మ తల్లిని, చల్లని తల్లులు విశాలాక్షి, అన్నపూర్ణలను తల్చుకోండి. మీ మనసు భక్తి భావంతో నిండుతుంది. మనసునిండా వున్న ఆ భక్తి భావంతో కాశీని చూడండి. పురాణ ప్రాశస్త్యం పొందిన కాశీనగరం కనిపిస్తుంది. సత్య హరిశ్చంద్రుడు తన సత్యవాక్పరిపాలనను నిరూపించుకున్న పట్టణం ఇది. బుధ్ధ భగవానుడు జ్ఞానోదయం తర్వాత మొట్టమొదట ధర్మప్రబోధం చేసింది ఇక్కడికి అతి సమీపంలోను సారనాధ్ లోనే. ఆది గురువు శంకరాచార్యులవారు, ఇంకా ఎందరో మహానుభావులు ఇక్కడ విద్యాభ్యాసం చేశారు. మహాకవి తులసీదాసు తన రామాయణాన్ని ఇక్కడే రాశాడు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎందరో, ఎందరెందరో మహనీయులు ఈ కాశీక్షేత్ర మహత్యాన్ని పెంపొందించారు. అలాంటి కాశీ క్షేత్ర ఆవిర్భావం గురించి శివ పురాణంలో ఈ విధంగా వర్ణించారు.

కల్పం మొదట్లో ఎక్కడ చూసినా నీరు వుంది. బ్రహ్మ సృష్టి చెయ్యటానికి తగిన సామర్ధ్యం సంపాదించుకోవటానికి తపస్సు చెయ్యటానికి స్ధలం కోసం పరమ శివుడు తన త్రిశూలాగ్రంమీద సృష్టించిన భూ భాగమే కాశీ క్షేత్రం. బ్రహ్మ దీని మీద కూర్చుని తపస్సు చేసి పొందిన శక్తితో బ్రహ్మ అన్ని లోకాలను, గ్రహాలను, జీవజాలాన్నీ సృష్టించాడు. అన్ని గ్రహాలతో బాటు భూమిని కూడా సృష్టించాడు బ్రహ్మ. దేవతలు, ఋషులు చేసిన ప్రార్ధనను మన్నించిన శివుడు తన త్రిశూలాగ్రాన వున్న భూ భాగాన్ని అలాగే భూమిమీదకు దించాడు. అదే కాశీ క్షేత్రమనీ, కాశీ పట్టణం, స్వయంగా ఈశ్వర సృష్టేననీ, అందుకనే తర్వాత సృష్టి చేసిన బ్రహ్మదేవుడికి గానీ, ఆ సృష్టిలో ఆవిర్భవించిన ఏ దేవీ దేవతలకుగానీ అక్కడ ఏ విధమైన అధికారం లేదనీ, కేవలం శివుడు, అతని పరివార దేవతల ప్రభావం మాత్రమే ఇక్కడ వుంటుందని పురాణ కధనం. అంతేకాదు, బ్రహ్మ సృష్టించినవన్నీ ప్రళయకాలంలో నశించినా, ఆయన ప్రభావంలేని కాశీ నగరం మాత్రం ప్రళయ సమయంలో కూడా చెక్కు చెదరదని కూడా పురాణ కధనం. బ్రహ్మ, విష్ణుల కోరిక మీద శివుడు కాశీ క్షేత్రంలో భక్తులను కాపాడటం కోసం జ్యోతిర్లిగంగా వెలిశాడు. అంతే కాదు. కాశీ పట్టణంలో మరణించబోయే జీవుల కుడిచెవిలో పరమశివుడు సాక్షాత్తూ తనే మంత్రోపదేశంచేస్తాడని, అలాంటివారి జన్మ ధన్యమయి మోక్షం లభిస్తుందని నమ్మకం.

ఈ ప్రఖ్యాత పట్టణం మీదు తురుష్కులు అనేకసార్లు దండయాత్ర చేసి ఇక్కడి సిరిసంపదలను కొల్లగొట్టారు. ఈ దాడులతో విశ్వనాధ మందిరంతో సహా అనేక విగ్రహాలు, లింగాలు స్ధానభ్రంశం చెందాయి. ప్రస్తుతం వున్న మందిరం క్రీ.శ. 1785లో ఇండోర్ మహారాణి అయిన అహల్యాబాయి నిర్మించింది. ఆక్రమణలకు గురి అయిన తర్వాత ప్రస్తుతం వున్న మందిరం చిన్నదే. ఆలయం లోపల కూడా ఇరుగ్గానే వుంటుంది. కాశీలో విశాల ఆలయాలు, శిల్పకళ కనబడదు.

ఇక్కడ వసతికి హోటల్సేకాకుండా అనేక సత్రాలుకూడా వున్నాయి. వీటిలో గదులు అద్దెకు ఇవ్వబడుతాయి. చాలా చోట్ల ఉచితంగా భోజనం పెడతారు. అయితే ముందు మనం చెప్పాలి. అప్పటికప్పుడు వెళ్తే ఏర్పాటు చెయ్యలేరు. వాళ్లు ఉచితంగా పెట్టినా ఇవ్వదల్చుకున్నవారు అన్నదానానికి డబ్బు ఇచ్చిరావచ్చు.

విశ్వనాధుని దర్శనానికి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్లు, కెమేరాలు, పెన్నులు వగైరాలు తీసుకువెళ్ళద్దు. వాటిని లోపలకి తీసుకెళ్ళనివ్వరు.

శివాలయాలలో ఎక్కడైనా మీరు తీసుకెళ్లిన పూజా ద్రవ్యాలతో మీరు స్వయంగా పూజ, అభిషేకం చేసుకోవచ్చు. అమ్మవార్ల ఆలయాలలో మాత్రం పూజారులే చేస్తారు. అమ్మవార్ల ఆలయాలలో శ్రీచక్రానికి కుంకుమపూజ మనం చేసుకోవచ్చు.

మనం కాశీ వెళ్తుంటే పొలిమేరల్లోనే మన పాపాలన్నీ పటాపంచలవుతాయట. అంతేకాదు. కాశీలో చేసిన మంచికానీ, చెడుకానీ అనేక రెట్ల ఎక్కువ ఫలితాన్నిస్తుందట. అందుకే సాధ్యమైనంత ఎక్కువ దైవనామ స్మరణ, దాన ధర్మాలు, పరోపకారం చెయ్యండి. గంగా స్నానం, దైవ దర్శనం గురించి చెప్పక్కరలేదుకదా. అలాగే పితృకార్యాలు చెయ్యదల్చుకున్నవారు వాటిని చెయ్యండి. మీ కాశీయాత్రని సఫలం చేసుకోండి.


కృష్ణశ్రీ said...
"తీర్థయాత్రలకు రామేశ్వరమూ, కాశీ ప్రయాగలేలనో? ప్రేమించిన పతి యెదుటనుండగా........"
"అన్యోన్యం గా దంపతులుంటే ఇలకు స్వర్గమే దిగిరాదా!"
psmlakshmiblogspotcom said...
కృష్ణశ్రీ గారూ
అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు పెద్దలు. అలకలు లేకపోతే ప్రేమ విలువ తెలియదు కదండీ. అలాగే ప్రేమ ఒక్కటే జీవితం కూడా కాదు. జీవితం పరిపూర్ణంగా అనుభవించాలంటే అన్ని అనుభవాలూ వుండాలికదా. అంటే ఆలు మగల ప్రేమ పరిధి అనే గొడుగు నీడన సమాజాన్ని కూడా చూడాలి. గొడుగు ముఖానికి అడ్డుపెట్టుకుని ఏమీ చూడకుండా వుంటే ఆ జీవితం కూపస్ధ మండూక జీవితం కాదా. అతిగా చెప్తే క్షమించండి. మీ భావనతో నేను కొంతమటుకూ ఏకీభవిస్తాను. అన్యోన్యంగా దంపతులుంటే ఇలకు స్వర్గమే దిగి వస్తుంది. అలాగని మనం స్వర్గంలోనే వుండిపోయి ఇతర ప్రపంచాన్ని పట్టించూకోమంటే మన చుట్టూ వున్న భవసాగరాలు ఏమైపోతాయండీ.

No comments:

Post a Comment