Sunday, 3 April 2016

నల్లమల అడవుల్లో దాగున్న రహస్య జలపాతాలు, ఆలయాలు !

తూర్పు కనుమల్లో భాగంగా ఉన్న నల్లమల అడవులు ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాల్లోని 5 జిల్లాల్లో(మహబూబ్‌నగర్, కొద్ది మేర నల్గొండ జిల్లాలలో, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, కడప) విస్తరించి ఉన్నాయి. నల్లమల కొండల సరాసరి ఎత్తు 520 మీ. వీటిలో 923 మీ. ఎత్తుతో బైరానీ కొండ మరియు 903 మీ. ఎత్తుతో గుండ్ల బ్రహ్మేశ్వరం కొండ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఈ అడవుల్లో పులులు సమృద్దిగా ఉండటం వలన ఈ ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్ గా ప్రకటించారు.

నల్లమల అడవులు ఆధ్యాత్మిక పరంగా, ప్రకృతి పరంగా ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఈ దట్టమైన అడవిలో గుళ్ళు, గోపురాలు, జలపాతాలకు లెక్కలేదు. రోడ్డు ప్రక్కన ఉన్న ప్రదేశాలకు వెళ్ళవచ్చేమో కానీ అడవుల్లో దాగి ఉన్న కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలంటే దేవుడు కనిపిస్తాడు. ట్రెక్కింగ్ చేసుకుంటూ కొండలు, గుట్టలు దాటుకుంటూ రాళ్లు రప్పల మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఊకెనన్న వస్తినే అని అనిపించకమానదు. సరెలే ..! దేవుడు ఎట్ల రాసి పెట్టింటే అట్ల జరుగుతుంది కానీ ఆ ప్రదేశాలను చూసొద్దాం పదండి ..!

సలేశ్వరం క్షేత్ర్రం
నల్లమల అడవుల్లో మొదట మహబూబ్ నగర్ వద్దాం. ఇక్కడ సలేశ్వరం క్షేత్ర్రం గురించి చెప్పుకోవాలి. ఆకాశ గంగ ను తలపించే మహత్తర జలపాతం ఇక్కడ ఉంది. ఈ జలపాతం వేసవిలో చల్లగా ఉంటుంది. కొండల్లో శివుడు కొలువైఉంటాడు. చుట్టూ ఉన్న ప్రకృతి నిజంగా స్వర్గమనే చెప్పాలి.
సలేశ్వరం ఎలా చేరుకోవాలి ?
హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై ఫరహాబాద్ చౌరస్తా నుంచి 16 కి. మీ. అటవీ మార్గం గుండా ప్రయాణించి, రాంపూర్ అనే చెంచు పెంట వరకు వెళ్ళాలి. అక్కడి నుంచి 6 కి.మీ. దూరం వరకు కాలి నడకన వెళితే సలేశ్వర క్షేత్రం చేరుకోవచ్చు. ఏ మాత్రం ఎబరపాటుగా ఉన్న లోయలో కిందపడతారు సుమి !

ఉల్లెడ ఉమామహేశ్వర
స్వామి అహోబిలం చాలా మంది వెళ్లివస్తుంటారు కానీ దాని పక్కనే ఉన్న ఉల్లెడ క్షేత్రం గురించి ఎవరికీ తెలీదు. ఈ క్షేత్రంలో ఉమామహేశ్వరుడు లింగమయ్య రూపంలో పూజలందుకొంటున్నాడు. అక్కడికి వెళితే అమర్‌నాథ్ మంచు లింగాన్ని దర్శించున్నట్లుగా భావిస్తారు.
ఉల్లెడ ఉమామహేశ్వరం క్షేత్రం ఎలా చేరుకోవాలి ?
అహోబిలంకు మూడు కిలోమీటర్ల దూరంలో కొండ పక్కన దారి ఉన్నది. గతంలో అయితే కాలి నడక మార్గాన 20 కి.మీ. రాళ్లు, రప్పల నడుమ ఇరుకిరుకు కాలిబాటలో నడిస్తే గాని ఉల్లెడ మహేశ్వర స్వామి వద్దకి చేరుకోలేని పరిస్థితి ఉండేది. కానీ ఇక్కడికి వచ్చే స్థానిక ప్రజలు, భక్తులు, అడవి అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు పెరగడం తో రవాణా గతం తో పోల్చుకుంటే కాస్త బెటార్.
ఉమా మహేశ్వర స్వామి దేవస్థానం లోయ వరకు వాహనాలు వెళ్లే విధంగా చిన్న చిన్న రాళ్ళ బాటలు ఉన్నాయి. అక్కడ దిగి తాడు పట్టుకుంటూ కిందకి దిగాలి. సెలయెర్లు దాటాలి ... మాళ్ళీ తాడు పట్టుకొని పైకి ఎక్కాలి. ఇలా సాహసాలు చేస్తూ వెళితే గాని స్వామి దర్శనం అవ్వదు.

బ్రహ్మంగారి మఠం
కడప జిల్లా బ్రహ్మంగారి మఠం వద్ద నల్లమల కొండల్లో ఉన్న దారి గుండా కొద్ది దూరం వెళితే(సుమారు రెండు మైళ్ళు వెళితే) కొన్ని గుహలు కనిపిస్తాయి. ఆ గుహలు సుమారు 100 వరకు కనిపిస్తాయి. అక్కడి గుహాల్లో శివుడు గవి మల్లేశ్వరుని గా పూజలదుకుంటున్నాడు.

నెమలిగుండం రంగనాథ స్వామి ఆలయం
ప్రకాశం జిల్లా గిద్దలూరు నుండి గంటన్నార దట్టమైన అటవీ మార్గంలో ఉన్నది నెమలిగుండం. ఇక్కడి ఆలయాన్ని శనివారం తప్ప మిగితా ఏ రోజుల్లో తెరవరు. సాయంత్రం 6 అయ్యిండంటే ఎవ్వరూ ఉండరు. పక్కనే గుండ్లకమ్మనది పై నుండి జలపాత ధారవలే కిందకు పడుతుంటుంది. ఈ జలపాతం ఏడాదంతా నీటి సవ్వడులతో చుట్టూ ప్రకృతిని ఆహ్లాదపరుస్తుంది.
నెమలిగుండం ఎలా చేరుకోవాలి ?
నెమలిగుండం వెళ్ళాలంటే గిద్దలూరు, మార్కాపురం, నంద్యాల నుండి శనివారాల్లో బస్సులు నడుస్తాయి. గిద్దలూరు నుండి షేర్ అటోల సౌకర్యం కూడా ఉన్నది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ... ఇక్కడి చేరుకోవడమే తరువాయి ...!

కొలనుభారతి
నల్లమల అడవుల్లో చాలా మందికి తెలీని మరో క్షేత్రం కొలనుభారతి. కర్నూలు జిల్లా ఆత్మకూరు శివపురం తర్వాత నల్లమల అడవుల్లో ఈ క్షేత్రం ఉన్నది. ఇక్కడి ప్రధాన దైవం సరస్వతి దేవి అయినప్పటికీ దగ్గర్లోనే సప్త శివాలయాలు ఉంటాయి.

గుండ్ల బ్రహ్మేశ్వరం
గుండ్ల బ్రహ్మేశ్వరం కర్నూలు జిల్లా నంద్యాల, ఆత్మకూరు సరిహద్దు మండలాల్లో నల్లమల అడవుల్లో ఉన్నది. ఈ ప్రాంతంలో అశ్వత్థామ (ద్రోణాచార్యుని కుమారుడు) స్వయాన శివలింగాన్ని ప్రతిష్టించాడు. అబ్బుర పరిచే ప్రకృతి సౌందర్యాలతో నిండిన ఈ క్షేత్రంలో అభయారణ్యం, రెండు చిన్న కోనేరులు, ప్రాచీన విగ్రహాలు చూడవచ్చు.
గుండ్ల బ్రహ్మేశ్వరం ఎలా చేరుకోవాలి ?
గుండ్ల బ్రహ్మేశ్వరం క్షేత్రానికి చేరుకోవాలంటే ముందుగా మీరు కర్నూలుకు గాని లేదా నంద్యాల కు గాని చేరుకోవాలి. కర్నూలు రైల్వే స్టేషన్ నుండి 100 కి. మీ. దూరంలో, నంద్యాల రైల్వే స్టేషన్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండ్ల బ్రహ్మేశ్వర క్షేత్రానికి శివరాత్రి పర్వదినాన ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది.

నిత్యపూజ కోన క్షేత్రం
కడప జిల్లా నల్లమల అడవుల్లో రాళ్లు, రప్పలు దాటుకుంటూ వెళితే చేరుకొనే మరో క్షేత్రం నిత్యపూజ కోన. ఒకవైపు లోయ, మరోవైపు బండ రాళ్ళ మధ్య నిత్య పూజా స్వామి లింగ రూపంలో దర్శనమిస్తాడు. అలాగే కొంత దూరం ముందుకు వెళితే అక్కదేవతల కోన కు చేరుకోవచ్చు.
నిత్యపూజ కోన క్షేత్రానికి ఎలా చేరుకోవాలి ?
కడప నుండి సిద్దవటం 33 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అక్కడి నుండి దట్టమైన అడవి మార్గాన వెళితే నిత్య పూజ కోన క్షేత్రానికి చేరుకోవచ్చు. కొండ కింద ఉన్న పంచలింగాల వరకు బస్సులు, షేర్ ఆటోలు తిరుగుతుంటాయి. పంచలింగాల నుండి ప్రధాన గుడి వరకు కాలినడకన వెళ్ళాలి. పెద్ద పెద్ద బండరాళ్ల మధ్యన సాగే నడక మార్గం చాలా ఆహ్లాదకరంగా ఉండి, ట్రెక్కింగ్ ను తలపిస్తుంది.

No comments:

Post a Comment