Sunday, 3 April 2016

మారేడుమిల్లి - రంపచోడవరం : దేవుని సృష్టించిన సొంత భూమి !

సహజ సిద్ధమైన అటవీ అందాలకు, ప్రకృతి రమణీయతలకు పుట్టినిల్లు మారేడుమిల్లి ప్రదేశం. తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రికి 84 km. దూరంలో భద్రాచలం పోయే మార్గంలో ఈ మండలం ఉన్నది. తూర్పు కనుమల అటవీ అందాలను ఇక్కడ తనివితీరా ఆస్వాదించవచ్చు. కరెక్ట్ గా చెప్పాలంటే ఇది భద్రాచలం అడవుల్లో ఉందనమాట..! మారేడుమిల్లి లో వ్యూపాంట్లు అద్భుతంగా ఉంటాయి. డీప్ ఫారెస్ట్ లోనికి వెళ్లే కొలది దారిపోడవునా అడవి జంతువులు, అరుదుగా పులులు మరియు పక్షులు కనిపిస్తాయి. మరొక విషయం ఈ మారేడుమిల్లి అడవులను ఒకప్పుడు అల్లూరి సీతారామరాజు తన స్థావరంగా ఉపయోగించేవాడట ..! ఇక్కడికి సమీపంలో 12 కి. మీ. దూరంలో రంపచోడవరం గ్రామం ఉన్నది. ఇక్కడ అల్లూరి సీతారామరాజు పూజలు చేసేవాడట. జలపాతాలు, ప్రకృతి అందాలకు ఇది కూడా మారేడుమిల్లిని ఏమాత్రం తీసిపోదు. మరి ఈ వనవిహారంలో ఏమేమి చూడాలో ఒకసారి తెలుసుకుందాం పదండి !

మారేడుమిల్లి ఎలా చేరుకోవాలి?
మారేడుమిల్లి చేరుకోవాలంటే ..
విమాన మార్గం - మారేడుమిల్లి సమీపాన రాజమండ్రి విమానాశ్రయం(82 KM) కలదు.
రైలు మార్గం - మారేడుమిల్లి కి సమీపాన రాజమండ్రి రైల్వే స్టేషన్ ప్రధాన రైల్వే స్టేషన్ గా ఉన్నది. ఇక్కడైతే అన్ని ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లు ఆగుతాయి.
రెండు రోడ్డు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటేమో రాజమండ్రి నుంచి, మరొకటేమో భద్రాచలం నుంచి.
1) ఉచిత సలహా ఏంటంటే, రాజమండ్రిలో ట్యాక్సీ లేదా ట్రావెలర్ అద్దెకు మాట్లాడుకోని వెళ్ళాలి.
2) రాజమండ్రి నుంచి వచ్చేవారు బస్ స్టాండ్ కు వెళ్ళి, భద్రాచలం అని తగిలించిన బోర్డ్ గల బస్సులో ఎక్కి, రెండు - మూడు గంటలు ప్రయాణించి మారేడుమిల్లి(85 కి.మీ) చేరుకోవాలి.
3) భద్రాచలం నుంచి వచ్చేవారు బస్ స్టాండ్ కు వెళ్ళి, రాజమండ్రి అని తగిలించిన బోర్డ్ గల బస్సులో ఎక్కి, 88 కి.మీ. దూరం ప్రయాణించి మారేడుమిల్లి చేరుకోవాలి.

ఏమేమి చూడాలి ?
మారేడుమిల్లిలో మరియు చుట్టుప్రక్కల చూడటానికి అనేక ప్రదేశాలు ఉన్నాయి. అందులో ప్రధాన ఆకర్షణ జలతరింగిని జలపాతం. ఈ జలపాతం అందమైన ప్రకృతి ప్రదేశంలో ఉన్నది. దీనిని చూడటానికి తెల్లతెల్లారుజామున వెళితే బాగుంటుంది.

నందవనం
నందవనం - బేంబూ చికెన్ మరియు ఔషధ మొక్కల తోటలకు ప్రసిద్ధి. ఇదికూడా సహజ అందాల కోవకే చెందినప్పటికీ సరైన మేంటెనెన్స్(నిర్వహణ) లేదు. తూర్పు కనుమలు, ఒరిస్సా నుంచి తీసుకొచ్చిన మొక్కలను సందర్శనకై ఉంచారు.

వాలీ సుగ్రీవ మెడిసినల్ ప్లాంట్ కన్వర్శేషన్ ఏరియా
వాలీ సుగ్రీవ మెడిసినల్ ప్లాంట్ కన్వర్శేషన్ ఏరియా ఒక ఎత్తుపల్లాల భూభాగం. సుమారు 260 హెక్టార్ లలో విస్తరించిన ఈ ఏరియాలో 230 రకాల మొక్కలు మరియు అరుదైన మొక్కలను గుర్తుంచారు. ఇది కూడా సందర్శించదగినదే ..!

కార్తీకవనం
కార్తీకవనం మొక్కలతో నిండిన ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. ముఖ్యంగా కార్తీక మాసంలో(అక్టోబర్ నెలలో) ఇక్కడ వనభోజనాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. రావి, వేప, ఉసిరి, మర్రి మరియు బిల్వ మొక్కలు ఎక్కవగా కనిపిస్తాయి.

కాఫీ మరియు పెప్పర్ తోటలు
నందవనంలో చూడవలసిన మరో స్పాట్ కాఫీ మరియు పెప్పర్ తోటలు. వీటితో పాటు చెట్లు, పొదలు మరియు వివిధ పండ్ల తోటలు చూడవచ్చు.

మదనకున్జ్ - విహార స్థలం
మదన కున్జ్ విహార స్థలం అడవిలోకి వెళ్లే దారిలో కనిపిస్తుంది. ఇక్కడ పులులు, అడవి దున్నలు, జింకలు, నెమళ్ళు, అడవి కోళ్లు, ఎలుగు బంట్లు చూడవచ్చు. పులులు మాత్రం అరుదుగా కనిపిస్తాయి. అడవి పక్షులు, సీతాకోక చిలుకలు కూడా పర్యాటకులను ఆకర్షిస్తాయి.

క్రొకడైల్ స్పాట్
ఇక్కడ పాములేరు వాగు ఉంద. అక్కడే ఈ క్రొకడైల్స్ ఉంటాయి. ఇక్కడ స్నానాలు చేయటం నిషేధం కారణం మీకు తెలుసుగా ..?

టైగర్ స్పాట్
టైగర్ స్పాట్ మారేడుమిల్లికి 5 కి.మీ. దూరంలో అడవిలో ఉంటుంది. అక్కడికి వెళితే పులుల గాండ్రింపులు వినవచ్చు.

జంగల్ స్టార్ క్యాంప్
సైట్ జంగల్ స్టార్ క్యాంప్ సీట్ కి, రామాయణానికి మధ్య లింక్ ఉంది. ఇక్కడ రామాయణ కాలంలో యుద్ధం జరిగినట్లు భావిస్తుంటారు. క్యాంప్ సైట్ పక్కనే మూడు వైపుల నుంచి ప్రవహించే వలమూరు నది నీటి ప్రవాహాలు, గడ్డి మైదానాలు, కొండలు, అడవులు చెప్పాలంటే తూర్పు కనుమల అందాలన్నీ ఇక్కడే ఉన్నాయా? అన్నట్టు అనిపిస్తుంది.

వనవిహారి రిశార్ట్
మీరు వనవిహారి రిశార్ట్ లో బస చేసేవారితే అక్కడికి సమీపంలోని జంగల్ స్టార్ రిసార్ట్ కు వెళ్ళి, ఆ ప్రదేశ అందాలను, పాములేరు ప్రవాహాన్నీ ఆనందించవచ్చు.

మరిన్ని జలపాతాలు
స్వర్ణ ధార, అమృత ధార అనేవి మారేడుమిల్లిలో చూడవలసిన మరికొన్ని జలపాతాలు. ఇలా ఎన్నో మారేడుమిల్లిలో చూడవలసిన ఆకర్షనీయ ప్రదేశాలు ఉన్నాయి.

రంపచోడవరంలో ...
రంప జలపాతం రంపచోడవరంలో చూడవలసిన ప్రధాన టూరిస్ట్ స్పాట్. ఈ జలపాతం సంవత్సరం పొడవునా నీటి ప్రవాహాలతో పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. అలాగే పురాతన శివాలయం కూడా ఇక్కడ ప్రసిద్ధి గాంచినది. అల్లూరి సీతారామరాజు ఈ ఆలయంలోనే పూజలు చేసేవాడట ..!

రంప జలపాతం
శ్రీ నీలకంఠేశ్వర వన విహార స్థలం రంప చోడవడం గ్రామానికి 4KM దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రకృతి మాత దీవించి ప్రసాదించిన నీలకంఠేశ్వర మరియు రంప జలపాతాలు ఉన్నాయి. ప్రశాంతమైన వాతావరణంలో, అడవుల్లో ఉన్న ఈ జలపాతాల శబ్ధాలు ఒకింత అనుభూతిని, ఆనందాన్ని మిగుల్చుతుంది.

పురాతన శివాలయం
స్థానిక ప్రజలు, చుట్టుప్రక్కల ప్రాంతాలైన కాకినాడ, రాజమండ్రి, భద్రాచలం నుంచి భక్తులు, పర్యాటకులు పెద్ద శివరాత్రి పర్వదినాన, సెలవు దినాల్లో జలపాతాల వద్దకి వచ్చి ఆనందంలో మునిగి తేలుతారు. స్నానాలు ఆచరించి కాలినడకన పక్కనే ఉన్న పురాతన శివాలయంలో పూజలు జరుపుతారు. అల్లూరి సీతారామరాజు కూడా ఆలయంలో పూజలు జరిపారని వినికిడి.

వాతావరణం
మామూలుగా ఐతే మారేడుమిల్లి ని మాన్సూన్ తరువాత సందర్శించాలి. మాన్సూన్ లో వర్షాలు అధికంగా ఉంటాయి కాబట్టి అడవుల్లో జారిపడే అవకాశం లేకపోలేదు..! ఈ ప్రదేశం సంవత్సరం పొడవునా రాత్రిళ్ళు చల్లగా ఉంటుంది ... ఉదయం వేడిగా ఉంటుంది. వేసవి లో సందర్శన ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది.

వసతి
మారేడుమిల్లి లో బస చేయటానికి రెండు ప్రదేశాలు అనుకూలంగా ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ అటవీ శాఖ వారు ఎకో- టూరిజం ప్రాజెక్ట్ లో భాగంగా రెండు రిసార్ట్ లను నడుపుతున్నది. ఒకటేమో వనవిహారి రిసార్ట్, మరొకటేమో జంగల్ స్టార్ రిసార్ట్.
వనవిహారి రిసార్ట్
వనవిహారి రిశార్ట్ లో చాలా గదులు అద్దెకు లభిస్తాయి. ఇందులో ఏసీ, నాన్ - ఏసీ గదులు అందుబాటులో ఉన్నాయి. జంటలకి లేదా చిన్న చిన్న గ్రూప్ లు గా వచ్చేవారికి ఈ రిశార్ట్ సూచించదగినది.
జంగల్ స్టార్ రిశార్ట్
జంగల్ స్టార్ రిశార్ట్ 10 -20 మంది కలిసి గ్రూప్ లు గా వచ్చేవారికి సూచించదగినది. టెంట్ వసతి, రాత్రుళ్ళు చలి మంటలు ఇక్కడి ప్రత్యేకతలు. ఫుడ్ మరియు ఊరికి దూరంగా ఉండటం ప్రతికూలతగా చెప్పవచ్చు.

భోజన సౌకర్యాలు
మారేడుమిల్లి లో, రంపచోడవరం లో చిన్న చిన్న హోటళ్లు అనేకం ఉన్నాయి. మారేడుమిల్లి లో తినటానికి సూచించదగిన ప్రదేశం వనవిహారి రిశార్ట్ క్యాంటీన్. ఇక్కడ ఫుడ్ అమోఘం. ఇక్కడ బేంబూ చికెన్ రుచి చూడటం మరవద్దు ..! బేంబూ తినటానికి స్పెషల్ గా హోటల్ అంటూ ఏదీ లేదు. అన్ని హోటళ్ళలో ఈ చికెన్ వండుతారు.

ట్రిప్ ఎలా సాగుతుంది ?
మొదటి రోజు
మారేడుమిల్లికి టూర్ ప్యాకేజీలు ఉన్నాయి. రాజమండ్రి, కాకినాడలో ఏ ట్రావెల్ ఏజెంట్ నైనా సంప్రదించి రెండురోజుల పాటు వనవిహారంలో ఉండవచ్చు. కొన్ని ట్రావెల్ సంస్థలు గైడ్ ను పెట్టి వసతి, భోజనాలు, రవాణా సదుపాయాలను కలిస్తున్నాయి.
రాజమండ్రిలో దిగి, టెంపో వాహనాన్ని లేదా తూఫాన్ వాహనాన్ని మాట్లాడుకోని, దారి మధ్యలో గోకవరం వద్ద అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) చేసుకొని మారేడుమిల్లి చేరుకుంటే ఆ అనుభూతే వేరు. రూమ్ లు వనవిహారిలో ముందుగానే ఆన్‌లైన్ లో బుక్ చేసుకుంటే మంచిది. అక్కడికి వెళ్ళి బుక్ చేసుకొన్నా ప్రాబ్లమ్ లేదు. చెక్ - ఇన్ అయి, వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్అప్ అయి కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు.

ఫారెస్ట్ ట్రెక్
ఫారెస్ట్ ట్రెక్ మధ్యాహ్న సమయంలో ప్రారంభిస్తారు. వీలైతే మధ్యాహ్నం తిని కానీ లేదా రిశార్ట్ నుండి ప్యాక్ చేసుకొని గాని 12 కి. మీ. వరకు ట్రెక్ చేయవచ్చు. తిరిగి సాయంత్రం రావాలి సుమీ ..! ఈ 12 కి. మీ. ట్రెక్ లో మొదట మీరు చేరుకోవలసిన ప్రదేశం జంగల్ స్టార్ రిశార్ట్. ఇక్కడ మీరు పాములేరు ప్రవాహాన్నీదాటవలసి వస్తుంది. ఈ ప్రవాహాన్నీ దాటితే మీరు 1 కిలోమీటర్ అదనపు దూరం ట్రెక్ చేయవచ్చు. దాటే సమయంలో ఆ చల్లని నీటి ప్రవాహం కాళ్ళకు తగులుతుంటే ఆ పూల వాసనలు, మట్టి వాసనలు అహా..! ఇది తనివితీరా ఆనందం అంటే ఆ క్షణంలో బాధలు గీదలు ఏమీ గుర్తుకురావు. ప్రవాహాన్నీ దాటిన తరువాత తీసుకొచ్చిన ప్యాకెట్ ను తెరిచి భోజనం చేస్తే బాగుంటుంది. అడవిలో ట్రెక్ చేస్తున్నప్పుడు అదేదో తెలీని ఆనందం, ఉత్సాహం దరి చేరుతుంది. వివిధ పక్షుల కిలకిల రాగాలు చెవులకు ఇంపుగా అనిపిస్తాయి. దారి పొడవునా వివిధ రకాల మొక్కలను కెమరా ఉంటే ఫోటోలు తీసుకోవచ్చు. వృక్షశాస్త్రం చదివేవారికి ఉపయోగపడొచ్చు. ట్రెక్ పూర్తవగానే సాయంత్రం ఆరు లేదా ఏడు గంటల కు ఊర్లో కి వచ్చి టీ, కాఫీ, స్నాక్స్ లు తినవచ్చు. ఉదయం టిఫిన్ సప్పగానే, మధ్యాహ్నం లంచ్ సప్పగానే సాగింది. డిన్నరైనా కాస్త నాన్ - వెజ్ లాగించండి. రిసార్ట్ క్యాంటీన్ లో గాని, లేదా రిసార్ట్ కు దగ్గర్లోని షాప్ లో గాని వెళ్ళి బేంబూ చికెన్ లాగించండి. డిన్నర్ అయిన తరువాత క్యాంప్ ఫైర్ వెలిగించి ఆట పాట లతో చిందులేయండి. నిద్రవస్తే వెళ్ళి బజ్జొండీ ..!
తరువాతి రోజు
ఉదయాన్నే లేచి రూమ్ చెక్ -ఔట్ అయి (ఖాళీ చేస్తున్నట్టు), జలతరింగిని జలపాతం వైపు అడుగులు వేయాలి. అక్కడ గంట -రెండుగంటలు ఉండి చుట్టుప్రక్కల అందాలను ఆనందించవచ్చు. ఆతరువాత రంప జలపాతం వైపు ప్రయాణించాలి. సమయముంటే స్వర్ణ ధార, అమృత ధార జలపాతాలను చూడవచ్చు.
రంపచోడవరం వెళ్లే మార్గంలో భూపతి పాలెం వద్ద ఆగి, రిజర్వాయర్ అందాలనూ వీక్షించవచ్చు. రంపచోడవరం చేరుకొని, అక్కడి నుంచి 4 కి. మీ. దూరం ప్రయాణించి రంప జలపాతం చేరుకోవచ్చు. పక్కనే ఉన్న పురాతన శివాలయాన్ని దర్శించుకోవచ్చు. ఇక్కడికి వచ్చే సరికి మధ్యాహ్నం లంచ్ టైమ్ అవుతుంది. పక్కనే ఉన్న హోటళ్ళలో భోజనం లాగించవచ్చు. ఇక్కడ కాసింత విశ్రాంతి తీసుకోవటానికి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ గెస్ట్ - హౌస్ లు ఉన్నాయి. తిరుగు ప్రయాణం రంపచోడవరం నుంచి సాయంత్రం 6 గంటల సమయంలో రాజమండ్రి బయలుదేరి, అక్కడి నుంచి రాత్రి 9 గంటలకు హైదరాబాద్ బస్ ఎక్కితే ఉదయం 8 గంటలప్పుడు దింపుతుంది. రెండు రోజుల మారేడుమిల్లి - రంపచోడవరం ట్రిప్ చాలా బాగుంది కదూ ..! మీరు కూడా ఈ ట్రిప్ ని ఇంతకంటే ఎక్కువ ఆనందంతో గడిపి, మీ అనుభూతులను మాతో పంచుకోండి ..!

No comments:

Post a Comment