Friday, 15 April 2016

ఒంటిమిట్ట - కోదండరామాలయంశ్రీ కోదండరామాలయం 

శ్రీ రామచంద్రుడు సీతా, లక్ష్మణ సమేతంగా వెలసిన క్షేత్రమే కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం. త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ పురుషోత్తముడే ఇక్కడ నడిచినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. కలియుగంలో స్వామివారు శ్రీ కోదండరామస్వామిగా తన భక్తులకు అభయమిస్తున్నారు. శ్రీ రామునికి అనుంగు భక్తుడైన శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ లేకపోవడం విశేషం. దీన్ని బట్టి చూస్తే ఆంజనేయుని రాకకు ముందే ఈ క్షేత్రంలో స్వామివారు విహరించినట్టు తెలుస్తోంది.

జాంబవత స్థాపితం
వానరులలో బ్రహ్మజ్ఞాని జాంబవంతుడు. ఆయన ఎన్నో యుగాలను చూశారు. అనుభవశీలి, మేధావి, శ్రీరామచంద్రుని దర్శనం చేసుకున్న అనంతరం సీతారామ, లక్షణ విగ్రహాలను ప్రతిష్టించారు. కొద్దికాలానికి సంజీవరాయ మందిరంలో ఆంజనేయవిగ్రహాన్ని నెలకొల్పారు. కలియుగంలో ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో ఒంటెడు, మిట్టడు అనే సోదరులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. వారిపేరుతోనే ఒంటిమిట్టగా ఈ గ్రామం ఖ్యాతిచెందింది. వీరి విగ్రహాలను కూడా ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు.

అద్భుతమైన ఆలయనిర్మాణం
ఆలయ నిర్మాణం విజయనగరవాస్తు శైలిలో అద్భుతంగా నిర్మితమైవుంటుంది. మూడు గోపురాలు సుందరంగా వుంటాయి. ఆలయం లోపల స్తంభాలు, గోడల పై సజీవమైన చిత్రకళను వీక్షించవచ్చు. విఘ్నేశ్వరుడు నాట్యభంగిమలో వుండి భక్తులకు ఆశీర్వచనం ఇస్తుంటాడు. 17వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో పర్యటించిన ఫ్రెంచ్‌ యాత్రీకుడు టావెర్నియర్‌ ఆలయ గోపురం దేశంలోని పొడవైన గోపురాల్లో ఒకటని పేర్కొన్నారు. ఆలయాన్ని అన్నమయ్య సందర్శించి అనేక సంకీర్తనలు రచించారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతనామాత్యులు ఆ గ్రంథాన్ని ఇక్కడే స్వామివారికి అంకితమిచ్చారు. అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన రామభద్రకవి ఈ ప్రాంతానికి చెందినవాడేనని తెలుస్తోంది. ఆంధ్ర వాల్మీకిగా ఖ్యాతిచెందిన వావిలికొలను సుబ్బారావు ఒంటిమిట్ట నివాసి కావడం విశేషం. 1

పున్నమి వెలుగుల్లో పురుషోత్తముని కల్యాణం
చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత. దీని వెనుక ఒక పురాణగాథవుంది. క్షీరసాగర మథనం తరువాత మహాలక్ష్మీదేవి అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించాడు. పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కల్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు. దాని ప్రకారమే రాత్రిళ్లు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.

రాష్ట్ర ఉత్సవంగా బ్రహ్మోత్సవాలు
రాష్ట్ర విభజన అనంతరం కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్వహణ బాధ్యతలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అప్పగించారు.

ఎలా చేరుకోవచ్చు
* కడప-తిరుపతి రహదారిపై వుంది. కడపనుంచి 26 కి.మీ.దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు.
* రైలులో రాజంపేట రైల్వేస్టేషన్‌లో దిగి బస్సులో దిగి చేరుకునే సౌలభ్యముంది.
* కడప రైల్వేస్టేషన్‌లో కూడా రైలు దిగి బస్సు లేదా ఇతర వాహనాల్లో చేరుకునే సౌలభ్యముంది.
* తిరుపతి విమానాశ్రయం 100 కి.మీ.దూరంలోవుంది.
ఒంటిమిట్ట కోదండ రామాలయం 
సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడిన ప్రసిద్ధ ఆలయం

భారతదేశంలో కొలువై వున్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కోదండ రామాలయం ఒకటి! ఇది ఎంతో ప్రాచీనమైన, విశిష్టమైన హిందూ దేవాలయం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో వుంది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే.. ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని ఇక్కడ చూడవచ్చు. ఇంకా చెప్పుకోదగ్గ ఎన్నో విశేషాలు ఈ ఆలయంలో సంతరించుకుని వున్నాయి.

రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా వున్న సమయంలో విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. అలాంటి సందర్భమే ‘సీతారామ కల్యాణం’ జరిగాక కూడా ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి దుష్టశిక్షణ కోసం రాముణ్ణి ప్రార్థించగా.. ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారు. తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ట చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం.

ఆలయ విశేషాలు :
1. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే శిలలో శ్రీరాముని, సీతను, లక్ష్మణుని విగ్రహాలు ఈ ఆలయంలో చెక్కబడ్డాయి. అంతేకాదు.. దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం దేశంలో ఇదొక్కటే.

2. ఈ కోదండ రామాలయానికి మూడు గోపుర ద్వారాలున్నాయి. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల - రథం ఉన్నాయి.

3. 16వ శతాబ్దంలో ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ ఈ రామాలయాన్ని దర్శించి "భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయ గోపురం ఒకటి" అని కీర్తించాడు.

4. ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు ఈ ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

ఇమాంబేగ్ బావి కథనం :
1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ రాజుకు ప్రతినిథిగా ఇమాంబేగ్ చెలామణీ అయ్యాడు. ఒక సందర్భంలో ఇమాంబేగ్ ఈ ఆలయానికి వచ్చిన భక్తులను..

‘మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా?’’ అని ప్రశ్నించాడు.
అందుకు భక్తులు.. ‘‘చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడు’’ అని సమాధానమిచ్చారు.
దాంతో ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు.
అందుకు ప్రతిగా మూడు సార్లు ‘ఓ’ అని సమాధానం వచ్చింది.
ఆ సమాధానం విన్న ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యచకితుడయ్యాడు. వెంటనే స్వామి భక్తుడిగా మారిపోయాడు.

అలా స్వామి భక్తుడిగా మారిపోయిన ఇమాంబేగ్... అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయనపేరు మీదుగానే ఈ బావిని ‘ఇమాంబేగ్ బావి’గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించికుని, ఎందరో ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం, ఇక్కడి విశేషం. 


అందరి దేవుడు ఒంటిమిట్ట రాముడు

రఘురాముడు నడయాడిన పుణ్యభూమి ఏకశిలానగరి. దాశరథి పాద స్పర్శతో పునీతమైన ఈ ప్రదేశం ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లుతోంది. ఇక్కడి కోదండపాణి కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారమని భక్తుల విశ్వాసం.

కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం ఎంతో విశిష్టమైంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీరామనవమికి ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ సీతారాముల కల్యాణం నిర్వహిస్తోంది.

స్థల పురాణం...
జాంబవంతుడు త్రేతాయుగంలో ఒంటిమిట్టలోని శృంగిశైలంపైన ఆశ్రమం ఏర్పాటుచేసుకొని ఓ శిలలో సీతారాములను దర్శించుకుంటూ, వందేళ్లకుపైగా తపస్సు చేశాడని పురాణాలద్వారా తెలుస్తోంది. వనవాస సమయంలో రాముడు ఈ ప్రాంతంలో సంచరించి ఒంటిమిట్టకు సమీపంలో తపస్సు చేసుకుంటున్న మృకుండమహర్షికి రాక్షసుల బాధను తొలగించాడని చెబుతారు. వనవాస సమయంలో సీతమ్మకు దప్పిక అయినప్పుడు రాముడు భూమిలోకి బాణం చొప్పించాడనీ, దాంతో పాతాళం నుంచి జలం ఉబికిందనీ, ఆ నీటి బుగ్గే ప్రస్తుతం ఆలయ సమీపానున్న రామతీర్థం అని చెబుతారు. ఒంటిమిట్ట కోవెలలో సీతారామలక్ష్మణుల మూలవిరాట్టులు ఏకశిలపై కన్పిస్తాయి. అందుకే దీనికి ఏకశిలానగరం అని కూడా పేరు.

ఆలయ అభివృద్ధి
క్రీ.శ. 1336లో విజయనగర సామాజ్య్రాన్ని హరిహరరాయలు, బుక్కరాయలు స్థాపించారు. క్రీ.శ 1345 ప్రాంతంలో వీరి సోదరుడు కంపరాయలు ఉదయగిరి ప్రాంతానికి పాలకుడుగా వచ్చాడు. ఒకసారి ఒంటిమిట్టలో పర్యటించినపుడు స్థానిక బోయ నాయకులు ఒంటడు, మిట్టడు రాజుకు సదుపాయాలు కల్పించారు. వారి విన్నపం మేరకు క్రీ.శ 1355 నాటికి గుడినీ, చెరువునీ అభివృద్ధిచేశాడు. అదే సమయానికి బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. కాశీ నుంచి తమ గురువు విద్యారణ్య మహర్షిని వెంట తీసుకుని రామేశ్వరం బయలుదేరాడు. గోదావరి తీరంలోని ఇసుకపల్లి నుంచి నాలుగు విగ్రహాలు తీసుకున్నాడు. మూడు విగ్రహాలను గండికోట, పామిడి, గుత్తిలకు చేర్చి సీతాలక్ష్మణులతో శ్రీరామచంద్రుడు కొలువుదీరిన ఏకశిలామూర్తిని ఒంటిమిట్టలో నిలిపాడు. అక్కడ విద్యారణ్య మహర్షి ఆధ్వర్యంలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవాలనూ, బ్రహ్మోత్సవాలనూ నిర్వహించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఒంటిమిట్ట గుడిలో చైత్ర మాసం ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో సీతారాముల వివాహం జరుగుతూ వస్తోంది. తొలిసారి ఆ ముహూర్తం రాత్రి పూట వచ్చింది. అదే ఆనవాయితీ ప్రకారం ఇప్పటికీ రాములవారి కల్యాణం రాత్రిపూట జరుగుతోంది. క్రీ.శ.1600 నుంచి ఆలయం అభివృద్ధి చెందింది. మట్లి ఎల్లమరాజు కుమారుడు అనంతరాజు, ఆయన వారసులూ ఆలయాన్ని ఘనంగా అభివృద్ధి చేశారు.


A.సుబ్బారెడ్డి, 
న్యూస్‌టుడేNo comments:

Post a Comment