Friday, 10 June 2016

ఈశాన్య ప్రకృతి అందం... సిక్కిం

ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకులను విశేషంగా ఆకర్షించే రాష్ట్రం సిక్కిం. వైశాల్యం, జనాభా పరంగా దేశంలోనే చిన్నదైనా... ఇక్కడ పర్యాటక కేంద్రాలు మాత్రం ఎక్కువే. సిక్కిం వెళ్ళడానికి రైలు మార్గంలో మొదట న్యూజలపాయిగురి అనే ఊరి వరకూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి డార్జిలింగ్ వాయువ్యంగా 95 కి.మీ. దూరంలోనూ, సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌కు ఈశాన్యంగా 125 కి.మీ. దూరంలోనూ ఉన్నాయి. డార్జిలింగ్ నుంచి గ్యాంగ్‌టక్ అయిదు గంటల ప్రయాణం. న్యూజలపాయిగురి రైల్వేస్టేషన్‌లోనే బయట హాలులో పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రపభ్రుత్వ పర్యాటక శాఖల వారి ఆఫీసు గదులు ఉన్నాయి. సిక్కిం వెళ్ళేందుకు ఆ శాఖవారి వాహనాలు ఉన్నాయి. మనకు ఒక్కరికైనా, వాహనం మొత్తం అయినా ఏర్పాటు చేస్తారు. స్టేషన్ బయట ఆవరణలోనే అన్నిరకాల వాహనాలతో ఎంతోమంది ప్రైవేటు ఆపరేటర్లు కూడా ఉంటారు. ఏమీ మోసం ఉండదు. న్యూజలపాయిగురి నుంచి గ్యాంగ్‌టక్ అయిదు లేక ఆరుగంటల ప్రయాణం. న్యూజలపాయిగురి, సిలిగురి అనే రెండూ కలసిపోయి ఉన్న రెండు పట్టణాలు. సిలిగురి ఊరి బయట బగ్‌డోగ్ర అనేచోట ఒక చిన్న విమానాశ్రయం ఉంది. కలకత్తా నుంచి బగ్‌డోగ్రకు విమాన సర్వీసు ఉంది. బగ్‌డోగ్ర నుంచి గ్యాంగ్‌టక్‌కు ప్రతిరోజూ హెలికాప్టర్ సర్వీసు ఉంది.

చూడాల్సినవివే...
గ్యాంగ్‌టక్ కొండ వాలులో పరుచుకున్న చిన్న పట్టణం. కులు, మనాలి, డార్జిలింగ్ మొదలైన వేసవి విడిది ప్రదేశాలతో పోల్చిచూస్తే గ్యాంగ్‌టక్ చాలా చౌక ప్రదేశం అని చెప్పవచ్చు. ఇక్కడ మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే హోటలు గదులు రోజుకు 300/- రూ॥లు మాత్రమే. గ్యాంగ్‌టక్ నగరం ఏ మాత్రం కాలుష్యం లేని అత్యంత పరిశుభ్రమయినదని ప్రసిద్ధి. గ్యాంగ్‌టక్‌లో చూడవలసినవి రాజవంశీయుల బౌద్ధ ఆలయం, రాజభవనం. ఇవి రెండూ ఊరిలోనే ఒక చిన్న ఎత్తయిన గుట్టమీద ఉన్నాయి. రెండవది టిబెట్ వారి గ్రంధాలయం, మ్యూజియం. ఇది టిబెట్ సంస్కృతికి సంబంధించి ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం. చార్టెన్ అనే పెద్ద స్థూపం చూడదగ్గది. ఊరిలోనే సుమారు 500 రకాల మొక్కలున్న ఒక వనం ఉంది. నగరం నుంచి 14 కి.మీ. దూరంలో - మనం వేరే ప్రదేశాలలో చూడలేని అనేకరకాల వృక్ష జాతులు, మొక్కలు ఉన్న ఒక పెద్ద బొటానికల్ గార్డెన్ ఉంది. నగరం నుంచి 24 కి.మీ. దూరంలో ఉన్న రుమ్‌టెక్ బౌద్ధ ఆలయం చారిత్రాత్మకమైనది. చైనా వారి దాడి సమయంలో టిబెట్ నుంచి తప్పించుకుని వచ్చిన కర్మపా స్వామి నివాసం, ఆయన శాఖకు సంబంధించిన కార్యాలయం అక్కడ ఉన్నాయి. సిక్కిం వెళ్ళేవారు తప్పనిసరిగా చూడవలసినది సోంగా సరస్సు. గ్యాంగ్‌టక్ నగరం నుంచి 34 కి.మీ. దూరంలో పన్నెండు వేల అడుగుల ఎత్తున ఉన్న ఈ సరస్సు దగ్గర దృశ్యం మాటలలో వర్ణించలేనిది. ఎవరికి వారు చూచి అనుభవించి, ఆనందించవలసినదే. ఇక గ్యాంగ్‌టక్ నగరం నుంచి తూర్పుగా పద్నాలుగువేల అడుగుల ఎత్తున వున్న నాధులా కనుమ ఉంది. ఇది మనదేశానికి, చైనా దేశానికి మధ్య సరిహద్దు. ఈ కనుమ దగ్గర మధ్యాహ్నంలోపే వెళ్ళాలి. మధ్యాహ్నానికి ఇక్కడ దట్టమైన పొగమంచు అల్లుకుపోతుంది. అయితే ఈ కనుమ దగ్గరకు వెళ్ళటానికి ప్రతిరోజూ 'ఇంతమంది' అని మాత్రమే అనుమతిస్తారు. ఈ అన్ని ప్రదేశాలకు ప్యాకేజీ టూర్లు నడిపేవారు కోకొల్లలుగా ఉంటారక్కడ.

No comments:

Post a Comment