Saturday, 11 June 2016

అంతర్వేది .. గోదావరి సంగమ ప్రదేశం !

గోదావరి తల్లి గురించి ఎంతో మంది కవులు కవితల రూపంలో, రచయితలు పాటల రూపంలో వర్ణన లు చేశారు. నదీ తీరానికి ఇరువైపులా కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, పచ్చని పంట పొలాలు ఓ వైపు కనువిందు చేస్తుంటే, మరో వైపు కనుచూపుమేర ఉన్న సముద్రం పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నది. గోదావరి నది ఉరుకులు, పరుగులు తీస్తూ బంగాళాఖాతం సముద్రం లో కలిసే దృశ్యాలు తప్పక చూడాల్సిందే .. అక్కడి సముద్ర ప్రవాహాల శబ్దాలు విని తీరాల్సిందే ..! ఆ ప్రదేశం పేరే ' అంతర్వేది' !!

అంతర్వేది, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అందమైన గ్రామం మరియు ప్రముఖ పుణ్య క్షేత్రం. ఈ గ్రామం రాజమండ్రి నగరానికి 100 కి. మీ ల దూరంలో, కాకినాడకు 111 కి. మీ ల దూరంలో .. సఖినేటి పల్లి మండలంలో కలదు. ఇక్కడ త్రికోణాకారపు దీవిపై ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం కలదు. గోదావరి నది సముద్రంలో కలిసే 'సంగమ ప్రదేశం' గా అంతర్వేది కి పేరు. ఇక్కడున్న కొన్ని సందర్శనీయ స్థలాలను గమనిస్తే ..

ఇతర సందర్శన స్థలాలు !
అన్న చెళ్ళెళ్ళ గట్టు
సముద్రములో వశిష్ట నది కలిసే చోటును 'అన్న - చెళ్ళెళ్ళ గట్టు' అంటారు. ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుకమేట వేసి ఉంటుంది. దానికి అటువైపు ఇటువైపు నీరు వేరువేరు రంగులలో ఒకవైపు స్వచ్చంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది. సముద్ర ఆటు పోటులలో కూడా ఇలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

సముద్రతీరం
వశిష్టానది సముద్రంలో కలిసే ప్రాంతం నుండి మొదలయ్యే అంతర్వేది సముద్రతీరం దాదాపు 4KM ల మేర ఉంటుంది. సర్వితోటలు, సముద్రపు మొక్కలతోనూ అందంగా ఉండే తీరం ఇది. తీరంలో వరుసగా వశిష్టాశ్రమం, అన్న చెళ్ళెళ్ళ గట్టు, దీపస్తంభం (లైట్ హౌస్), గుర్రలక్క గుడి, నరసింహస్వామి దేవస్థానాలు కొద్దికొద్ది దూరాలలో ఉంటాయి.

ఇతర ఆలయాలు
లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం పరిసరప్రాంతములలోనూ, అంతర్వేది గ్రామములోనూ, సముద్రతీరమునకు వెళ్ళు రహదారినందూ పలు చిన్నా పెద్దా ఆలయములు కలవు. వాటిలో ప్రసిద్దమైనవి. క్షేత్ర పాలకుడు నీలకంఠేశ్వర స్వామి, విఘ్నేశ్వరస్వామి, అభయాంజనేయస్వామి, షిర్డీసాయి ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు కలవు.

ఇతర విశేషాలు
అంతర్వేది, సినిమా షూటింగులకు పెట్టినపేరు. ఇక్కడ అలనాటి బ్లాక్ అండ్ వైట్ చిత్రాలైన మూగమనసులు లాంటి చిత్రాలనుండి సరిగమలు, అప్పుడప్పుడు, పెళ్ళైనకొత్తలో ఇలా ఇప్పటి వరకూ వేల సినిమాల చిత్రీకరణ జరిగినది. ఇంకా జరుగుతున్నవి.

వసతి సౌకర్యాలు
అంతర్వేదిలో వసతి కొరకు దేవస్థాన సత్రం కలదు. కుల ప్రాతిపదికన బయటి వారి ద్వారా నడుపబడు ఇతర సత్రాలు పది వరకూ కలవు. రెండు ప్రైవేటు లాడ్జిలు కలవు. ఇంకనూ మంచి వసతుల కొరకు నరసాపురం, రాజోలు పట్టణాలకు వెళ్ళవచ్చు.

రవాణా సౌకర్యాలు
బస్సు
అంతర్వేదికి పశ్చిమగోదావరి జిల్లా మరియు తూర్పు గోదావరి జిల్లా నుండి చేరవచ్చు. రాజమండ్రి (100 KM), కాకినాడ (111 KM) ల నుండి రావులపాలెం(63 KM), రాజోలు(27 KM) మీదుగా సకినేటిపల్లి(19 KM) చేరవచ్చు. విజయవాడ(200 KM), ఏలూరు(140 KM) ల నుండి నరసాపురం(21 KM) మీదుగా సఖినేటిపల్లి చేరవచ్చు. సఖినేటిపల్లి నుండి ఆటోలు, బస్సులు అంతర్వేదికి కలవు.

రైలు
అంతర్వేది కి సమీపాన నరసాపూర్ రైల్వే స్టేషన్ కలదు. రాష్ట్రంలోని ప్రధాన రైల్వే స్టేషన్ ల నుండి ఈ స్టేషన్ మీదుగా రైళ్ళు నడుస్తుంటాయి. హైదరాబాదు నుండి నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ ద్వారా డైరెక్ట్ గా నరసాపురం చేరవచ్చు. నరసాపూర్ నుండి సఖినేటిపల్లికి అలాగే అంతర్వేది కి ప్రభుత్వ బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి.

విమానం
అంతర్వేది కి సమీపాన రాజమండ్రి విమానాశ్రయం కలదు. అక్కడి నుండి రైలు లేదా బస్సులో ప్రయాణించి సఖినేటి పల్లి మీదుగా అంతర్వేది చేరుకోవచ్చు.

No comments:

Post a Comment