Saturday, 11 June 2016

వేంకటేశ్వర స్వామి ఆలయాలు !


తిరుమలతో ముడిపడి ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయాలు ! 

వేంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. భక్తుల కష్టాలను పోగొట్టడంలో మరియు వెంకటేశ్వర నామాలకు ఈయన సుప్రసిద్ధుడు. ఆంధ్రప్రదేశ్‌లో వేంకటేశ్వర స్వామి ఆలయాలు ఎన్నో ఉన్నప్పటికీ తిరుపతిలో కొలువైన వేంకటాచలపతి ఆలయం ఖ్యాతి గాంచింది. దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద భక్తులు శ్రీనివాసుని దర్శనానికి క్యూ కడతారు.

ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి ఆలయానికి దగ్గరి లక్షణాలు కలిగిన ఆలయాలు మరో రెండు ఉన్నాయి. వాటిలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ద్వారకా తిరుమల ఉండగా, మరొకటి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అప్పనపల్లిలో ఉన్నది. విశేషం ఏమిటంటే రెండు ఆలయాలు కూడా ఉభయగోదావరి జిల్లాలో ఉండటం.

తిరుపతి ఆలయాన్ని దర్శించుకున్నవారు పై రెండు ఆలయాలను దర్శిస్తే సకలశుభాలు, శుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.

వెంకటేశ్వర స్వామి తీర్థయాత్రలు !
ట్రిప్ వేయండి ఇలా ..!
ముందుగా తిరుపతి దర్శనం
తిరుపతికి దేశంలోని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి బస్సు / రైలు / విమాన సౌకర్యాలు ఉన్నాయి. రోడ్డు వ్యవస్థ కూడా చక్కగా ఉన్నది. తిరుపతి చేరుకున్నాక అక్కడ గల ఆలయాలను తప్పక సందర్శించండి.

గోవిందా .. గోవిందా !
తిరుపతి, తిరుమల పేర్లు వేరేమో కానీ ... రెండింటి ఆత్మ ఒక్కటే..! వెంకటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ప్రసిద్ధి గాంచినది. ఈ ఆలయం పురాతనమైనది మరియు దీని నిర్మాణ శైలి ద్రవిడ సంప్రదాయాన్ని పోలి ఉంటుంది.

సుమారు రెండున్నర ఎకరాల్లో విస్తరించిన ఆలయంలో 8 అడుగుల పొడవైన వెంకటేశ్వర స్వామి ప్రతిమ ఉన్నది. ఈ విగ్రహం జాతి రాళ్ళతో అలంకరించబడి ఉంటుంది.

తిరుమలకు కాలినడకన వెళ్ళే వారు ఉదయాన్నే వెళితే చుట్టూ ప్రకృతి దృశ్యాలను, ఘాట్ రోడ్, కొండ చరియలు చూసి ఆనందించవచ్చు. దారి పొడవునా విష్ణువు అవతారాలను, ఆంజనేయస్వామి ప్రతిమలను గమనించవచ్చు.

కాలినడకన వెళ్ళేటప్పుడు మీకు దర్శనం కౌంటర్ కనిపిస్తుంది. అక్కడికి వెళ్లి దర్శనం టికెట్ ను కొనుగోలు చేయవచ్చు. గాలిగోపురం, శ్రీవారి పాదాలు, నారాయణ స్వామి ఆలయాలు కాస్త ముందుకు వెళితే కనిపిస్తాయి. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు సెల్ ఫోన్, కెమెరాలు లోనికి తీసుకొని వెళ్ళరాదు. అవి పూర్తిగా నిషేధం.

శ్రీవారి దర్శనం
శ్రీవారిని దర్శించుకోవటానికి భక్తులు కంపార్ట్ మెంట్ లలో, క్యూ లైన్ లలో నిల్చుంటారు. కాలినడకన వచ్చే వారికి ఒక కంపార్ట్ మెంట్, లఘు దర్శనం, సర్వ దర్శనం .. ఇలా ఎన్నో దర్శనాలకి ఇంకొన్ని కంపార్ట్ మెంట్ లు ఉంటాయి. ఎలా పోయినా దేవుణ్ణి మాత్రం దర్శించుకుంటారు. తేడా ఒక్కటే చూడటంలో దగ్గర .. దూరం అంతే ..!

వీలుంటే చూడండి
శ్రీవారి దర్శనం ముగించుకున్నాక సమయం ఉంటే కపిల తీర్థం, తలకోన చూడటం మరవద్దు. జలపాత సోయగాలు అద్భుతంగా ఉంటాయి. కపిల తీర్థంలో శివుని ఆలయం ఒక్కటే ఉంది. ఇక్కడికి ప్రవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. అలాగే తలకోనకి కూడా!

ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి)
దర్శనం అయిపోయిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో 'చిన్న తిరుపతి' గా పిలువబడే ద్వారకా తిరుమలకి వెళ్ళండి. ద్వారకా తిరుమలకి విజయవాడ (100KM), రాజమండ్రి (75KM) నగరాలు దగ్గరలో ఉన్నాయి. అక్కడి నుండి ప్రభుత్వ బస్సులు సులభంగా లభ్యమవుతాయి. ద్వారకా తిరుమల ఆలయం దేశంలోని ఆలయాలన్నింటిలోకి భిన్నంగా ఉంటుంది. తిరుమల తిరుపతి (పెద్ద తిరుపతి)లో స్వామి వారికి మొక్కిన మ్రొక్కును చిన్న తిరుపతి (ద్వారకా తిరుమల) లో తీర్చుకున్నా అదే ఫలితం లభిస్తుంది అని భక్తుల విశ్వాసం. అయితే చిన్న తిరుపతి లో మొక్కిన మొక్కులు చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలి అని భక్తులు, స్థానికుల నమ్మకం. తిరుపతితో పోలిస్తే ద్వారకా తిరుమలలో దర్శనం కాస్త త్వరగానే జరుగుతుంది. గుడిలో ప్రవేశించేటప్పుడు ముందు తిరుపతి వలే శ్రీవారి పాదాలను నమస్కరించి మెట్లు ఎక్కాలి. ప్రధాన ఆలయానికి వెళ్ళేటప్పుడు మెట్ల పొడవునా ఆళ్వారుల ప్రతిమలు, అన్నమాచార్య విగ్రహం, సత్రాలు, కళ్యాణ మండపాలు గమనించవచ్చు. ప్రధాన ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహాలు, గరుడ విగ్రహాలు ఉన్నాయి. గర్భగుడిలో స్వయంభూగా వెలసిన వేంకటేశ్వర స్వామి, ప్రతిష్టింపబడిన వేంకటేశ్వర స్వామి ప్రతిమలు దర్శనమిస్తాయి. ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేయరు. ఎందుకో అక్కడికి వెళ్ళిన తర్వాత అడగండి!

ద్వారకా తిరుమల దర్శనం
ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. ఆ రోజే స్వామి వారి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సేవలు జరుగుతాయి. ఆలయానికి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల కు మూసి 3 గంటలకు తెరుస్తారు.

బాల తిరుపతి
పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి లాగే బాల తిరుపతి కూడా. దీనికి సమాధానం వైనతేయ నదీ తీరం. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో బాల తిరుపతి దేవాలయం కలదు. దేవాలయానికి సమీపాన వైనతేయ నది ప్రవహిస్తూ ఉంటుంది. భక్తులు అందులో స్నాన మాచరించి భగవంతుని ఆశీస్సులు పొందుతారు.

అప్పనపల్లి కాకినాడ కు 70KMల దూరంలో, రాజమండ్రి కి 85KMల దూరంలో మరియు అమలాపురం కు 35KMల దూరంలో కలదు. కాకినాడ నుండి నిత్యం ఒక ప్రభుత్వ బస్సు అప్పనపల్లి వరకు (కాకినాడ వయా యానాం మరియు బోడసకుర్రు మీదుగా) నడుస్తుంది. అలాగే కాకినాడ నుండి రేవులపాలెం మీదుగా (110 KM) కూడా అప్పనపల్లి చేరుకోవచ్చు.

అమలాపురం మీదుగా వచ్చే వారు వయా అంబాజీపేట మీదుగా 35 KMల దూరం ప్రయాణించి అప్పనపల్లి చేరుకోవచ్చు. అన్నట్లు ఫెర్రీ సౌకర్యం కూడా ఉన్నది. అమలాపురం నుండి బోడసకుర్రు ఫెర్రి ఎక్కి 13KM దూరంలో ఉన్న అప్పనపల్లి చేరుకోవచ్చు.

అప్పనపల్లి దేవాలయం మూడువైపులా గోదావరి నదితో, మరోవైపు బంగాళాఖాతం సముద్రంతో చుట్టబడి ఉంటుంది. చుట్టూ అందమైన పంట పొలాలు, కొబ్బరి తోటలు, మామిడి చెట్లు, తాటి చెట్లు ఈ ప్రాంత అందాన్ని మరింత పెంచుతాయి. శ్రీ బాల బాలాజీ స్వామిని కొలిస్తే సకల శుభాలు జరుగుతాయని, అందుకే భక్తులు నిత్యం అప్పనపల్లిని దర్శించి పునీతులవుతున్నారని యాత్రికుల విశ్వాసం.No comments:

Post a Comment