Friday, 3 June 2016

శ్రీనగర్ - శ్రీన'హీ'గర!


శ్రీన'హీ'గర!
కశ్మీర్ అంటే కల్లోలాలు కాదు. ప్రకృతి అందాలకు నెలవు.
కశ్మీర్ అంటే అశాంతి కాదు. ఆనందాల కొలువు.
కశ్మీర్ అంటే తుపాకీ మోతలు, ఆర్తుల హాహాకారాలు కాదు. సరదాల సందళ్లు. సంతోషపు కేరింతలు.

సరిహద్దు తగాదాలతో అలజడితో ఉంటుందని కశ్మీర్‌కి పేరుంది. కానీ ఆ పేరును శ్రీనగర్ మార్చేసింది. వివాదాల వేడి సంగతి ఎంతా ఉన్నా... వేసవి వేడి మాత్రం శ్రీనగర్‌లో అడ్రస్ లేకుండా పోతుంది. మే నెలలో సైతం చల్లగాలులతో ఆహ్లాదాన్ని పంచుతుంది. నా పేరు శ్రీనగరం, నా దగ్గరుంటే నహీ గరం అంటుంది. మనోల్లాసాన్ని హద్దులు దాటిస్తాను రమ్మంటూ ఆహ్వానం పలుకుతుంది. అందమైన అనుభూతులను పంచిస్తానంటూ పిలుస్తుంది. మన దేశంలోని బెస్ట్ సమ్మర్ టూరిస్ట్ స్పాట్స్‌లో ఒకటైన శ్రీనగర్ పరిచయం... ఇప్పుడు మీకోసం!

ఏం చూడాలి?
శ్రీనగర్‌కు వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన టూరిస్టు స్పాట్ దాల్ లేక్. ఈ సరస్సు 22 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ సరస్సు ఫిష్షింగ్, వాటర్ ప్లాంట్ హార్వెస్టింట్ లాంటి వాటి ద్వారా శ్రీనగర్ ఆర్థికా భివృద్ధికి ఎంతో తోడ్పడుతోంది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ ‘షికారాలు’. అంటే గూటి పడవలు. అందంగా అలంకరించిన ఈ పడవల్లో ప్రయా ణించడానికి పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు. చలికాలంలో ఈ సరస్సు పూర్తిగా గడ్డ కట్టేస్తుంది. అందుకే దీన్ని చూడాలంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలోనే వెళ్లాలి.

భారతదేశంలో ఉన్న ఏకైక ఫ్లోటింగ్ మార్కెట్ శ్రీనగర్‌లోనే ఉంది. కూరగాయలు, పండ్లు, పూలు అన్నిటినీ పడవల్లోకెక్కించి, దాల్ సరస్సు నీటిపై తేలియాడుతూ అమ్ముతుంటారు. ఈ పూలు, కూరగాయలు, పండ్లు అన్నీ దాల్ లేక్ పరిసర ప్రాంతాల్లో సాగు చేసినవే. రోజూ ఉదయం 5 నుంచి 7 గంటల వరకు ఈ మార్కెట్ ఉంటుంది. పడవలో ప్రయాణిస్తూ అన్నీ కొనుక్కోవడం భలే ఉంటుంది కదూ!

శ్రీనగర్‌లో ఎన్ని గార్డెన్స్ ఉన్నాయో లెక్క లేదు. 17వ శతాబ్దంలో కట్టిన షాలిమార్ బాగ్ శ్రీనగర్‌లో ఉన్న మూడు మొఘల్ గార్డెన్స్‌లోనూ పెద్దది. మే నుంచి అక్టోబర్ నెలల మధ్య ప్రతి రోజూ సాయంత్రం ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షో జరుగుతుంది. శుక్రవారం సెలవు. నిషాత్ గార్డెన్ కూడా ఫేమస్. ఈ రెండూ పర్షియన్ పద్ధతిలో నిర్మితమయ్యాయి. శరదృతువు (ఆకులు రాలే కాలం)లో ఈ మొఘల్ గార్డెన్స్ రాలిపడిన ఎరుపు-బంగారం రంగు ఆకులతో కొత్త అందాన్ని సంతరించుకుంటాయి. ఇక మొక్కలపై ఆసక్తి ఉన్నవాళ్లెవరైనా జవహర్‌లాల్ నెహ్రూ మెమోరియల్ బొటానికల్ గార్డెన్‌ను చూడాల్సిందే. ఇక్కడ లేని మొక్క ఉండదు. 80 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండే ఈ గార్డెన్‌లో 17 హెక్టార్ల మేర ఓ అందమైన సరస్సు ఉంటుంది. అలాగే నసీం బాగ్. ఇది ప్రశాంతతకు మారు పేరు. 1586లో అక్బర్ చక్రవర్తి దీన్ని నిర్మించారట. ఇక్కడి ప్రకృతి అందాన్ని చూడటానికి, అలసిన మనసును శాంతపర్చుకోడానికి సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు.

ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉన్న వారికి శ్రీనగర్ ఎంతో నచ్చుతుంది. అక్కడ ఉన్న గుళ్లు, మసీదులు చూస్తే మనసులో భక్తి అలలై ఎగసిపడుతుంది. కశ్మీర్ మధ్య భాగంలో విస్తరించి ఉన్న జబర్‌వాన్ పర్వతాన్ని శంకరాచార్య హిల్ అంటారు. పూర్వం దీనికి ఎన్నో పేర్లుండేవి. అయితే వెయ్యేళ్ల కిందట ఆది శంకరాచార్యుడు ఇక్కడికి వచ్చి, కొన్ని రోజులు ఉన్నాడట. అందుకే ఆ కొండకు ఆయన పేరును పెట్టారు. ఈ కొండపై 11వ శతాబ్దంలో నిర్మించిన శివుడి గుడి ఉంది. ఆ గుడి ఆవరణ లోకి సెల్‌ఫోన్లను, కెమెరాలను అనుమతించరు.

అలాగే క్రీ.శ 1400లో నిర్మించిన జామియా మసీదు. ఇందులో 370 చెక్క స్తంభాలున్నాయి. ఒకేసారి 33,333 మంది నమాజ్ చేసుకునేందుకు వీలుంది ఈ మసీదులో.

ఇక ఖీర్ భవానీ టెంపుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది శ్రీనగర్ దగ్గర్లోని తుల్లా ముల్లా గ్రామంలో ఉంటుంది. ఇక్కడ కొలువై ఉన్న దేవతని దుర్గా దేవి అవతారంగా చెబుతుంటారు. నైవేద్యంగా ఖీర్ (పాయసం) పెడుతుంటారు. అందుకే ఆ ఆలయానికి ఖీర్ భవానీ టెంపుల్‌గా పేరొచ్చింది. ఈ ఆలయంలో శుక్ల పక్ష అష్టమి నాడు వేలమంది భక్తులు చేరి యాగాలు, హోమాలు చేస్తుంటారు.

శ్రీనగర్ శివార్లలో ఉంది సోనామార్గ్. అంటే అర్థం ‘మెడోస్ ఆఫ్ గోల్డ్’ అని. దీని చుట్టూ ఉండే కొండల పై ట్రెక్కింగ్ జరుగుతూ ఉంటుంది. పచ్చదనానికి, ఆల్పైన్ పూలకు ఇది ప్రసిద్ధి. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 2,740 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ మార్గ్ చుట్టుపక్కల చాలా సరస్సులు ఉంటాయి. సరదా ఉన్నవారు ఫిషింగ్ చేయవచ్చు.

శ్రీనగర్‌లోని సింథన్ టాప్ గురించి చాలామందికి తెలియదు. ఇది శ్రీనగర్ శివార్లలో ఉంటుంది. ఇక్కడ ప్రకృతి అందాలను తిలకించడానికి రెండు కళ్లూ చాలవు. సముద్ర మట్టానికి 12 వేల అడుగుల ఎత్తులో ఉండటంతో, ఆ ప్రదేశం చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మంచుతో పర్వతం మొత్తం కప్పబడి ఉండటం వల్ల మరింత అందంగా ఉంటుంది. ఇక్కడి అందాలను ఆస్వాదించాలంటే ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలమే సరైన సమయం.

చలి కాలం వస్తే మంచు విపరీతంగా కురుస్తుంది కాబట్టి పర్యాటకులను అనుమతించరు. యాపిల్ కొనుక్కు తినడమే తెలిసిన మనకు యాపిల్ పండ్ల తోటల్లో తిరుగాడుతూ, వాటిని స్వయంగా కోసుకుని తినే అవకాశం వస్తే ఎలా ఉంటుంది? ఆ అవకాశాన్ని ఎవరైనా జారవిడుచుకుంటారా? అందుకే శ్రీనగర్‌లోని యాపిల్ తోటలు ఎప్పుడూ సందర్శకులతో కిటకిటలాడుతూనే ఉంటాయి. పండ్లను కోయడం మీద ఎటువంటి ఆంక్షలూ లేకపోవడంతో అక్కడి పనివాళ్లతో పాటు సందర్శకులు కూడా కాయలను తెంపి మురిసిపోతుంటారు.

సినిమా పాటల్లో టులిప్ తోటల్ని చూసినప్పుడు... ఇలాంటి ప్రదేశానికి మనమూ వెళ్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది కదా! అయితే దానికోసం విదేశాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీనగర్ వెళ్తే చాలు. ‘ఇందిరాగాంధీ మెమోరియల్ టులిప్ గార్డెన్స్’ ఆసియాలోనే అతి పెద్ద టులిప్ గార్డెన్. ఇక్కడ మనం ఒకేసారి 20 లక్షల పూలను చూడొచ్చు. యేటా మార్చి, ఏప్రిల్ నెలల్లో ‘టులిప్ ఫెస్టివల్’ కూడా జరుగుతుంది.

ఏం తినాలి?
శ్రీనగర్‌లో Wazwan(వాజ్వాన్) తిని తీరాలి. Wazwan అంటే వంటకం పేరు కాదు. 36 రకాల వంటకాలతో కూడిన meals. ఇది తింటే కశ్మీర్ ఫుడ్ మొత్తాన్నీ రుచి చూసినట్టే లెక్క.
అలాగే ‘తుజ్జీ’ చాలా ఫేమస్. అంటే మటన్ బాల్స్‌ని ఐరన్ రాడ్ మీద పెట్టి కాల్చి చేసే వంటకం. దీన్ని స్థానికంగా దొరికే బ్రెడ్, చట్నీతో సర్వ్ చేస్తారు.
ఖావా అనే స్పెషల్ గ్రీన్ టీ రుచి నాలుకను వదలదు.
నూన్ చాయ్ అని పిలిచే సాల్టీ టీ అయితే ఇక్కడ తప్ప ఎక్కడా దొరకదు. పాలు, గ్రీన్ టీ, ఉప్పు, సోడా బైకార్బనేట్ కలిపి చేసే ఈ టీ గులాబి రంగులో ఉంటుంది. ఒక్కసారి దీన్ని రుచి చూస్తే జీవితంలో మర్చిపోలేం అంటారు దాన్ని టేస్ట్ చూసినవాళ్లు!

ఏం కొనాలి?
శ్రీనగర్‌లో షాపింగ్ చేయాలంటే షాపులకి వెళ్లడం కంటే... స్ట్రీట్ మార్కెట్స్‌కి వెళ్లడం మంచిది. ఎందుకంటే ఆ మార్కెట్లలో షాపుల్లో కంటే విభిన్నమైన, వైవిధ్యమైన వస్తువులు దొరుకుతాయి. పైగా వెల కూడా అందుబాటులో ఉంటుంది. అన్నిటికంటే ముందు కొనాల్సింది శాలువాలు, కార్పెట్లు. అక్కడ దొరికేంత అందమైన శాలువాలు, అద్భుతంగా రూపొందించిన కార్పెట్లు మన దేశంలో మరెక్కడా దొరకవు. లాల్ చౌక్, బాద్‌షా చౌక్ ప్రాంతాల్లో ఉన్న షాపుల్లో కని, పష్మినా శాలువాలు తప్పక కొనాల్సిందే. అలాగే పోలో వ్యూ మార్కెట్లో యాంటిక్ సిల్వర్ జ్యూయెలరీ, వూడెన్ జ్యూయెలరీ బాగా దొరుకుతుంది. ఫ్లవర్‌వాజ్‌లు, ఆర్టిఫీషియల్ పువ్వులు కూడా బాగుంటాయి. కశ్మీర్ గవర్నమెంట్ ఆర్ట్స్ ఎంపోరియంలో బ్యాగులు, టేబుల్ ల్యాంప్స్ లాంటివి అతి తక్కువ ధరకు దొరకుతాయి. ఇక రెసిడెన్సీ రోడ్‌లో అడుగుపెడితే డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసుల వాసన గుప్పుమంటుంది. ఆపైన అవి కొనకుండా రావడం మనవల్ల కాదు.


ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి శ్రీ నగర్ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్‌కి నేరుగా ఫ్లయిట్స్ ఉన్నాయి. గంటన్నర నుంచి రెండు గంటల్లో వెళ్లిపోవచ్చు. బస్సులో వెళ్తే ఇరవై గంటల పైనే పడుతుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైళ్లు ఉన్నాయి. వాటిలో వెళ్లినా బానే ఉంటుంది. అక్కడికెళ్లాక ఉండటానికి బోలెడు హోటళ్లున్నాయి. మన బడ్జెట్‌ను బట్టి ఎంచుకోవచ్చు.

ఏం చేయాలి?

ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి వింతలు, విశేషాలను చూసి రావడం అందరూ చేస్తారు. కానీ ఏదైనా కొత్తగా చేయడంలోనే ఉంటుంది మజా. శ్రీనగర్ వెళ్తే అలాంటి కొత్త అడ్వెంచర్స్ చాలా చేయవచ్చు. వాటిలో ముఖ్యమైనది పారా గ్లైడింగ్. తేలికైన గ్లైడర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను వీపునకు కట్టుకుని, గాల్లో ఎగురుతూ కశ్మీర్ అందాలను చూస్తుంటే మనసు కూడా విహంగమై ఎగిరిపోతుంది. ఎయిర్ బెలూన్స్‌లో కూర్చుని ఎగురుతూ సిటీని చూసే అవకాశం కూడా ఉంది. పర్వత సానువులపై ట్రెక్కింగ్ చేస్తూ, వాటి ఎత్తుల్ని కొలిచే అనుభూతిని మిస్సవ్వడానికి లేదు. అలాగే రివర్ ర్యాఫ్టింగ్ కూడా. నదీ అలలపై తేలియాడుతూ, చల్లగా వీచే గాలిని ఆస్వాదిస్తుంటే మనసు మరో లోకంలోకి వెళ్లిపోవడం ఖాయం.

No comments:

Post a Comment