Tuesday, 7 June 2016

మహాద్భుతం మహాబలిపురం

ఏడవవ శతాబ్ధంలో దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పల్లవ ప్రభువుల రాజ్యానికి ప్రముఖ తీరపట్టణం. మామల్లాపురం అనేది మహబలిపురానికి వున్న మరో పేరు. ఈ పట్టణానికి అప్పటి పల్లవ ప్రభువైన మామ్మల్ల పేరు మీద కట్ట బడిందని చరిత్రకారులు చెబుతారు. మహాబలిపురానికి ఆ పేరు రావటానికి మరొక కథనం ప్రకారం పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అని స్థానికులు అంటుంటారు. తదనంతర కాలంలోనూ పల్లవుల పరిపాలనా కాలంలోనూ ఈ ప్రాంతం స్వర్ణయుగాన్ని చూసింది. పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కొంతకాలం పాలించారు. అప్పుడు కట్టించినవే ఈ శిల్పకళా సంపద. పల్లవులు దీనిని మంచి రేవుపట్నంగా తీర్చిదిద్దారు. దానికోసం ఇక్కడ కొండమీద ఒక లైట్ హౌస్ ని కట్టారు.

చెన్నై నుండి మహాబలిపురానికి రోడ్డు మార్గంలో వెళ్లే వారికి సముద్ర దృశ్యాలు కన్నుల పండుగ చేస్తాయి. పర్యాటకులు సాధ్యమైనంత వరకు సాయంత్రాలే ఈ ప్రయాణాన్ని ఎంచుకోవలసిందిగా అనుభవజ్ఞులు సలహా ఇస్తారు. సంధ్యావేళల్లో జాలువారే సున్నితపు సూర్యకిరణాలు సృష్టించే అద్భుతాలను నీలాల అఖాతపు సోయగాలతో కలిపి చూసే అదృష్టం వారికి లభిస్తుంది. ఈ ప్రయాణం దాదాపు 20 నిముషాలు విలక్షణమైన సముద్రతీరం గుండా సాగుతుంది. సముద్ర తీరం పొడుగునా వీచే చల్లగాలులు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. కంచి రాజధానిగా పాలించిన ఆనాటి పాలకులు విదేశీ నిపుణులను రప్పించి, స్వదేశీ కళాకారుల అండదండలతో సాగరతీరంలోని ఈ ఊళ్లో అద్బుత రాతి కట్టడాలను సృష్టించారు. ఆనాటి రాజుల ఆ కళాత్మక హృదయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఇక్కడి ప్రసిద్ద ఏకశిలా దేవాలయాల అద్భుత పనితనానికి ఎందరో శిల్పులు, నిపుణులు పరవశించిపోతారు.

సముద్రతీర గోపురాలు
మహాబలిపురం అంటేనే సముద్ర తీరంలో వెలిసిన దేవాలయానికి ప్రసిద్ధి. ఈ ఆలయం నుంచే యాత్రికుల సందర్శన మొదలవుతుంది. ఎంతటి వారి దృష్టి అయినా ముంది రెండు పెద్ద గోపురాలపై పడుతుంది. భారతీయ పురాణ గాధలు, పాత్రలను తలపించే శిల్పాలను ఎన్నింటినో వాటిపైన చూస్తాం. అనేకమంది దేవతలు, దేవుళ్ల విగ్రహాలతోపాటు పలువురు నృత్య కళాకారిణుల విగ్రహాలు, పెద్ద అంగలు వేసే ఏనుగుల భారీ శిల్పాలు వంటివి అన్నీ సందర్శకులను నిల్చున్నచోటే కట్టి పడేస్తాయి. ఆ తర్వాత అక్కడి చిన్న గోపురాల పైకి యాత్రికుల దృష్టి మళ్లుతుంది. ఈ ఆలయంలో ప్రధాన దేవతలుగా శివకేశవులు ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆలయం చుట్టూ అనేక నంది విగ్రహాలు బారులు తీరి సరిహద్దు గోడలా ఏర్పడ్డాయి. గుడి వెనుక ఒక పెద్ద రాతి సింహం, దానిపై ఒక సైనికుడు స్వారీ చేస్తుండటం చూస్తాం. ఇది ఆనాటి సైనికుల స్థయిర్యాన్ని, ధైర్యాన్ని చాటిచెబుతుంది.

ఎలా వెళ్లాలి?
మహాబలిపురం చెన్నైకి సమీపంలో ఉంది. వాయు మార్గంలో వచ్చే వారికి చెన్నైనే అత్యంత సమీప విమానాశ్రయం. దేశీయ, అంతర్జాతీయ విమానాలకు ఇది మంచి కూడలి. అతి సమీప రైల్వేస్టేషన్ చెంగల్పట్టు. ఇక్కడ్నించి 29 కి.మీ.దూరం కాగా, చెన్నై నుండి నేరుగా రైలులో అయితే 58 కి.మీ.ల దూరంలో ఉంది. మహాబలిపురానికి రోడ్డు మార్గంలో చెన్నై, పాండిచ్చేరి, కంచి, చెంగల్పట్టుల నుండి బస్సు సౌకర్యాలు నిరంతరాయంగా ఉన్నాయి. టూరిస్టులు చెన్నైనుండి టాక్సీలు అద్దెకు తీసుకుని వెళ్లవచ్చు కూడా. చెన్నైలోనే కాకుండా నేరుగా మహాబలిపురంలోనూ యాత్రికులు బసచేయడానికి కావలసిన కనీస సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. పలు ప్రైవేట్ హోటళ్లు, రిసార్ట్స్, లాడ్జీలకు కొదువలేదు. పర్యాటకులు ఇక్కడ సముద్ర గవ్వల నుండి పర్సులు, పెయింటింగులు తదితర కళాత్మక, అలంకరణ వస్తువులను ఖరీదు చేసుకోవచ్చు. కాకపోతే విదేశీ యాత్రికులు కూడా వస్తుంటారు, కాబట్టి వ్యాపారులు అధిక ధరలు డిమాండ్ చేయవచ్చు. కనుక షాపింగ్స్ విషయంలో తెలివిగా వ్యవహరించవలసి ఉంటుంది.

No comments:

Post a Comment