Tuesday, 7 June 2016

చిక్‌మగళూర్‌


 ప్రకృతి సోయగం, ఆధ్యాత్మిక సౌరభం చిక్‌మగళూర్‌ 

భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కాఫీ తోటలు పెంచింది ఇక్కడే. తుంగ, భద్ర నదులకు పుట్టినిల్లు ఈ ప్రదేశం. కర్ణాటక రాష్ట్రంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పర్వతశ్రేణులు ఇక్కడి ప్రత్యేకత. ప్రకృతి రమణీయ దృశ్యాలు కలిగిన కెమ్మనగుండి, కుద్రేముఖ్‌ కొండలు, మాణిక్యధార, కల్లథిగిరి జలపాతాలు పర్యాటకులకు కనువిందు కలిగిస్తాయి. శంకరాచార్యులు అద్వైత ప్రచారం కోసం స్థాపించిన శారదా పీఠం శృంగేరి ఈ జిల్లాలోనే ఉన్నది. దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పెద్ద సామ్రాజ్యాలలో ఒకటైన హొయసల రాజులు పాలించిన సుందర ప్రదేశం చిక్‌మగళూరు విశేషాలు....

చిక్‌మగళూరు పేరు జిల్లా రాజధాని చిక్‌మగళూరు పట్టణం నుండి వ్చంది. చిక్‌మగళూరు అంటే కన్నడ భాషలో చిన్న కూతురు ఊరు అని అర్థం. సేక్రపట్న రాజైన రుక్మాంగద చిన్న కూతురుకు కట్నంగా ఇవ్వబడడం వల్ల ఈ పట్టణానికి చిక్‌మగళూరు అని పేరు వచ్చిందని చెబుతారు. రుక్మాంగద పెద్ద కూతురు పేరు మీద చిక్‌మగళూరుకు 5 కి.మీ దూరంలో హిరెమగళూరు కూడా ఉన్నది.

జిల్లా చరిత్ర...
1670 సంవత్సరంలో చిక్‌మగళూరు జిల్లాలోని బాబా బుడాన్‌ గిరి కొండల పై భారతదేశంలోనే మొట్ట మెదటిసారిగా కాఫీ తోటలు పెంచారు. కాఫీ పెంపకం గురించి ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం బాబా బుడాన్‌ మక్కా యాత్రకు వెళుతూ యెమెన్‌ దేశం లోని మొఛా నౌకాశ్రయం నుండి ప్రయాణం చేస్తున్నప్పుడు మెదటిసారి కాఫీని రుచి చూశాడు. కాఫీ రుచిని భారతదేశానికి అందించే ప్రయత్నంలో ఏడు కాఫీ గింజలు తనతోబాటు అరబైఉ దేశాల నుండి తీసుకొని వచ్చాడు. బాబా బుడాన్‌ భారతదేశానికి తిరిగి వచ్చాక చిక్‌మగళూరులో ఈ గింజలు పాతాడు. బాబా బుడాన్‌ పై గౌరవానికి గుర్తుగా ఈ కొండలను బాబా బుడాన్‌ (బాబా బుర్హాన్‌) కొండలని పిలుస్తారు. 


సుందర పర్వత కేంద్రాలు...
కెమ్మనగుండి:
బాబా బుడాన్‌ కొండల మధ్య చిక్‌మగళూరు పట్టణానికి 55 కి.మీ దూరంలో కెమ్మనగుండి పర్వత కేంద్రం ఉన్నది. కెమ్మనగుండి పర్వత కేంద్రంలో వాడేయార్‌ రాజు కృష్ణరాజ వాడేయార్‌ వేసవి విడిది చేసేవాడు కావున ఈ పర్వతశ్రేణులను కె.ఆర్‌. కొండలు అని కూడా పిలుస్తారు. ఈ పర్వత కేంద్రం సముద్ర మట్టానికి 1,434 మీటర్ల ఎత్తులో దట్టమైన అరణ్యాల మధ్య సంవత్సరం పొడవునా సెలయేళ్ళతో హరితంగా ఉంటుంది. పూల తోటలతో, కొండలోయలతో ఉండే ఈ పర్వత కేంద్ర సౌందర్యం వర్ణణాతీతం. అరణ్యాలు అన్వేషణ జరిపే వారికి ఈ పర్వత కేంద్రం నుండి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ కొండ ప్రాంతంలో వివిధ ప్రదేశాల నుండి సూర్యాస్తమయాన్ని తిలకించ వలసిందే. కేంద్రం పైన గులాబీ తోటలు అనేకం ఉన్నాయి. పర్వతం నడిబొడ్డు నుండి పది నిమిషాల నడకలో వచ్చే జెడ్‌-పాయింట్‌ నుండి చూస్తే రమణీయంగా ఉండే పశ్చిమ కనుమలలోని శొల గడ్డి భూములు కనిపిస్తాయి.

కుద్రేముఖ్‌...
జిల్లా రాజధాని చిక్‌మగళూరు కి 95 కి.మీల నైఋతి దిశలో ఉన్నది. కన్నడ భాషలో కుద్రేముఖ్‌ అంటే గుర్రపు ముఖం అని అర్థం. ఈ పర్వతశ్రేణులు గుర్రపుముఖం ఆకారంలో ఉండడం వల్ల కుద్రేముఖ్‌ అని పిలుస్తారు. ఈ కుద్రేముఖ్‌ పర్వతకేంద్రంలో కుద్రేముఖ్‌ జాతీయ ఉద్యానవనం ఉన్నది. అరేబియా సముద్రం వైపు ఉన్న ఈ పర్వతశ్రేణుల పరంపర లోతైన లోయలు, ఎత్తైన శిఖరాలతో చాలా సుందరంగా ఉంటుంది. సముద్రమట్టానికి 1,894.3 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వత కేంద్రం కుద్రేముఖ్‌లో అపారమైన ఇనుప గనులు ఉన్నాయి. కుద్రేముఖ్‌లో ఉన్న కుద్రేముఖ్‌ ఉక్కు కర్మాగారంలో ఉక్కు కొద్దిగా శుద్ధి చేసి గొట్టాల ద్వారా మంగళూరు పణంబూర్‌ నౌకాశ్రయానికి సరఫరా చేయబడుతుంది.

ముల్లయనగిరి:
ముల్లయనగిరి బాబు బుడాన్‌ కొండలలో ఒక భాగం. ఈ కొండ చిక్‌మగళూరు పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సముద్రమట్టానికి 1930 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతశ్రేణులు కర్ణాటక రాష్ట్రం లోనే ఎత్తైన పర్వత శ్రేణులు. ఈ పర్వత శిఖరం సూర్యాస్తమయం వీక్షించడానికి చాలా ప్రసిద్ధి. చిక్‌మగళూరు నుండి సితలయనగిరి వెళ్ళే మార్గంలో ఉన్న శివుడి గుడిలో లింగం నిరంతరం నీటిలో ఉంటుంది. నీటి మట్టం ఏ సమయంలోనైన ఒకేలాగ ఉంటుంది. అక్కడ నుండి ముల్లయనగిరికి వెళ్ళే రహదారి చాలా సన్నగా ఉండి రెండు ప్రక్కల వాహనాలు పోవడానికి వీలు లేకుండా ఉంటుంది.ముల్లయనగిరి కొండ చాలా వాలుగా ఉండడం వల్ల పైకి పూర్తిగా వాహనాల మీద చేరుకోలేరు.ముల్లయనగిరి కొండకు ఎక్కే మధ్య భాగంలో ఒక చిన్న గుడి కూడా ఉన్నది. ముల్లయనగిరి కొండల నుండి ఆకాశం నిర్మలంగా ఉన్న రోజులలో అరేబియా సముద్రం కనిపిస్తుంది. పర్వతశ్రేణులను అధిరోహించాలని ఆసక్తి ఉన్నవారికి ఈ కొండ చాలా మంచి ప్రదేశం.

దత్త పీఠం (బాబా బుడాన్‌ గిరి):
చిక్‌మగళూరుకి ఉత్తరాన బాబా బుడాన్‌ కొండలు ఉన్నాయి. వీటికి చంద్ర ద్రోణ పర్వత అనే పేరు కూడా ఉన్నది. ఈ కొండలకు చాలా పురాతన చరిత్ర ఉన్నది. ఈ కొండలు హిమాలయాలకు నీలగిరి కొండలకు మధ్య ఉన్న ఎత్తైన కొండలలో ఇది ఒకటి. ఈ కొండకు ఈ పేరు 150 సంవత్సరాల క్రితం నివసించిన ముస్లిం ఔలియా మరియు సూఫీ అయిన బాబా బుడాన్‌ (దాదా హయాత్‌ కలందర్‌) వల్ల వచ్చింది.

జలపాతాల హొయలు...
మాణిక్యధార జలపాతం:
ఈ జలపాతం బాబా బుడాన్‌ గిరి దత్తాత్రేయ పీఠానికి దగ్గరలో ఉన్నది. ఈ జలపాతం పడేటప్పుడు నీరు ముత్యాల వలే కనిపిస్తూ చూపరులకు, జలక్రీడలు ఆడేవారికి అమిత అనందాన్ని కలిగిస్తోంది. 


కళ్ళహతిగిరి జలపాతం:
కెమ్మనగుండి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్లహతగిరి జలపాతాన్ని కాళహస్తి జలపాతం అనికూడా పిలుస్తారు. 122 మీటర్ల ఎత్తులోనున్న చంద్ర ద్రోణ పర్వతం నుండి పడే ఈ జలపాతం చాలా రమణీయంగా ఉంటుంది. జలపాతం పడే రాళ్ళ మధ్య శివునిగా అర్చించబడే వీరభద్ర దేవాలయం కూడా ఉన్నది.


హెబ్బె జలపాతం:
కెమ్మనగుండి పర్వత కేంద్రం నుండి 10 కి.మీ దూరంలో ఉన్న ఈ జలపాతం 168 మీటర్ల ఎత్తు నుండి పడుతుంది. ఈ జలపాతం రెండు గతిపథులుగా పడు తుంది. దొడ్డ హెబ్బె (పెద్ద హెబ్బె) జలపాతం, చిక్క హెబ్బె (చిన్న హెబ్బె) జలపాతం. ఇంకా ఇవేకాకుండా శాంతి, హనుమానైఉ గుండి, కదంబి జలపాతాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.

పుణ్యక్షేత్రాలకు నెలవు..
శృంగేరి:
చిక్‌మగళూరు కి 90 కిలోమీటర్ల పశ్చిమంగా తుంగ నది ఒడ్డున శంకరాచార్యులు అద్వైత ధర్మప్రచారానికి స్థాపించిన మొట్టమొదటి మఠమైన శారద పీఠానికి నిలయం శృంగేరి. శృంగేరిలో శారదాదేవి దేవాలయం ఉన్నది, శారదదేవి ఆలయానికి ప్రక్కన విద్యాశంకరులు స్మారకంగా నిర్మితమైన విద్యాశంకర్‌ దేవాలయం హొయసల రాజుల కాలంలో ప్రారంభించబడివిజయనగర రాజుల చేత పూర్తి చేయబడింది. ఈ విద్యాశంకర దేవాలయంలో 12 రాశులను సూచిస్తూ 12 స్థంభాలు ఉన్నాయి. సూర్యుడు ఏ రాశితో ఉన్నాడో సూర్యకిరణాలు ఆ స్థంభం మీద పడడం విశేషం.

హొరనాడు:
చిక్‌మగళూరుకు 100 కిలోమీటర్లల నైఋతి దిక్కులో ఉన్న ఈ గ్రామంలో ప్రసిద్ధమైన అన్నపూర్ణేశ్వరి దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం పునరుద్ధరణ ఇటీవలికాలంలోనే జరిగింది. ఆదిశక్తితో ప్రాణప్రతిష్ట చేసిన ఈ గుడిలో ఉన్న ఈ అమ్మవారిని ఆదిశక్త్యకాంబ శ్రీ అన్నపూర్ణేశ్వరిగా భావిస్తారు. ఈ దేవాలయంలో ప్రతి రోజు అన్న సంతర్పణ జరుగుతుంది. అమ్మవారిని దర్శించడానికి వ్చన తీర్థయాత్రీకులకు దేవస్థానం వసతి భోజన సదుపాయాలు కల్పిస్తుంది.

కలస:
చిక్‌మగళూరుకు నైఋతి దిశలో 92 కిలోమీటర్ల దూరంలో భద్ర నది ఒడ్డున కలస ఉన్నది. భద్ర నది ఒడ్డున ఉన్న పంచ క్షేత్రాలలో (ఐదు సరస్సులు) ఇది ఒకటి. దగ్గరలో ఉన్న చిన్న కొండ పై హొయసల శైలితో నిర్మితమైన శివాలయం కాళేశ్వర దేవాలయం ఉన్నది. కలసలో ఉన్న పెద్ద శిలను మధ్వాచార్య బండ అని పిలుస్తారు. ఈ బండ పై మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని బోధించాడని చెబుతారు. ఈ శిలపై ఇప్పుడు మధ్వచార్యుల విగ్రహం చెక్కబడింది.

గురు దత్తాత్రేయ, బాబా బుడాన్‌ స్వామి దర్గాహ్‌:
బాబా బుడాన్‌ గిరి కొండలపై నున్న ఇమాం దత్తాత్రేయ పీఠాన్ని హిందువులు ముస్లిములు సమానమైన పవిత్ర స్థలంగా భావిస్తారు. ఈ కొండపై నున్న లాటిరైటు (కంకర) గుహలో దత్తాత్రేయ స్వామి లేదా హజరత్‌ దాదా హయాత్‌ మీర్‌ కలందర్‌ నివసించారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. (బాబా బుర్హాన్‌ సూఫీ సంతుడిని, హిందువులు దత్తాత్రేయ స్వామి అని, ముస్లింలు హజరత్‌ దాదా హయాత్‌ మీర్‌ కలందర్‌ అని పిలుస్తారు) ప్రతి సంవత్సరం ఇక్కడి ఫకీర్లు జాతరను, ఉర్సును నిర్వహిస్తారు.

అమృత్‌పుర:
చిక్‌మగళూరు పట్టణానికి 67 కిలోమీటర్ల ఉత్తరంలో ఉన్న అమృత్‌పుర గ్రామంలో ఉన్న అమృతేశ్వర దేవాలయాన్ని క్రీ.శ. 1196 సంవత్సరంలో అమృతేశ్వర దండనాయక అని పేరు గాంచిన హొయసల రాజు రెండవ వీర బల్లాల్‌ కట్టించాడు. ఈ దేవాలయం చూస్తే హోయసల రాజుల కాలంలో శిల్ప నైపుణ్యం ఎంత ఉచ్ఛ స్థితిలో ఉండేదో అవగతమవుతుంది.

బేలవాడి:
చిక్‌మగళూరుకి ఆగ్నేయంలో 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేలవాడి గ్రామంలో ఉన్న శృంగారమైన వీరనారాయణ దేవాలయం, ఉద్భవ గణపతి దేవాలయం చాలా ప్రసిద్ధం. ఈ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలోనే హళేబీడు ఉన్నది. ఇలా ప్రకృతి రమణీయతను, ఆద్యాత్మికతను తనలో కలుపుకొని ఉన్న ఏకైక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది చిక్‌మగళూర్‌.No comments:

Post a Comment