Saturday, 11 June 2016

తలకోన జలపాతం - కొండల మధ్యలో ఓ అద్భుత జలపాతం !!

చుట్టూ ఎత్తైన కొండలు... 
దట్టమైన అరణ్యప్రాంతం... 
మధ్యలో ఓ జలపాతం ఉంటే ఎంత బాగుంటుందో కదా. 
అంత అందమైన ప్రకృతి ఎక్కడుందా అనుకుంటున్నారా? 
మరెక్కడో కాదు చిత్తూరు జిల్లాలో. ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న తిరుపతికి 58 కిలోమీటర్ల దూరంలోనే ఈ రమణీయ ప్రదేశం ఉంది. అదే తలకోన జలపాతం.

ఈ ప్రాంతం నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుంటుంది. సాక్షాత్తూ ఆదిశేషుడే పర్వత రూపం దాల్చాడని పురాణ గాథ. కుబేరుని అప్పు తీర్చేందుకు శ్రీనివాసుడు ధనాన్ని కొలిచి అలసిపోయి నిద్రపోయాడని చెబుతారు. అలా పడుకోవడంలో తల భాగం ఇక్కడ ఉన్న కొండ (కోన) శిఖరం మీద ఆనించాడని అందుకే ఈ ప్రదేశానికి తలకోన అనే పేరు వచ్చిందని స్థలపురాణం. మన రాష్ట్రంలో ఎత్తయిన జలపాతం కూడా ఇదే మరి!!. దీన్ని శిరోద్రోణం అని కూడా పిలుస్తారు. తలకోనలో దాగిఉన్న అందాలను ఒకసారి చూసినట్లయితే...

కొండా..కోనల్లో దాగి ఉన్న జలపాతం తలకోన జలపాతం
నల్లమల పర్వతశ్రేణుల్లో ఈ జలపాతం ఉండడం విశేషం. కొండ అంచుల్లో దట్టమైన అడవిగుండా దాదాపు రెండు కిలోమీటర్లు ముందుకు వెళ్తే అక్కడ జాలువారే జలపాతాన్ని చూడొచ్చు. చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండలు... మధ్యలో జలపాతాన్ని చూసిన పర్యాటకులకు చిత్రమైన అనుభూతి కల్గుతుంది. జలపాత దృశ్యం నయనానంద కరంగా, చాలా అకర్షణీయంగా వుంటుంది.

జలపాతం కింద తడుస్తూ..
దాదాపు అరవై మీటర్ల ఎత్తునుంచి జాలువారే జలపాతం కింద నిలబడితే శరీరమంతా చిత్రమైన జలదరింపుకు లోనవుతుంది. ఇక అక్కడినుండి కదలాలని ఎవరికైనా అనిపిస్తుందా చెప్పండి? అలాగే జలపాతం కింద పడడం వల్ల ఆ ప్రాంతంలో ఓ పెద్ద గుంటలా ఏర్పడింది. అక్కడ పర్యాటకులు హాయిగా ఈత కొడుతుంటారు.

తలకోన వద్ద ఉన్న ఆలయం
తలకోన జలపాతం ఉన్న ప్రాంతంలోనే ఓ శివాలయం ఉంది. ఇక్కడి శివుడు సిద్ధేశ్వరుని రూపాన కొలువై ఉన్నాడు.ఈ ఆలయాన్ని 1811 సంవత్సరంలో అప్పాస్వామి అనే భక్తుడు కట్టించాడని స్థానికులు చెబుతారు. శివుడితో పాటు అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు కూడా వున్నాయి. పర్యాటకులు తీసుకెళ్లే వాహనాలను ఈ దేవాలయ ప్రాంతం వరకు మాత్రమే అనుమతిస్తారు. అక్కడ్నుండి జలపాతం దగ్గరికి చేరుకోవాలంటే పాదయాత్ర చేయాల్సిందే.

నెలకోన
అలయానికి అతిసమీపంలో వాగు ప్రవహిస్తూంటుంది. ఇందులోని నీరు చాల తేటగాను చాల చల్లగాను ఉంటాయి. శివరాత్రి పర్వ దినాన ఉత్సవాలు జరుగుతాయి. తలకోన అటవీ ప్రాంతంలో తలకోన, నెలకోన అనే పేర్లున్న రెండు జలపాతాలు ఉన్నాయి. వీటిని జంట జలపాతాలని పిలుస్తారు. నెలకోన అన్నది దట్టమైన కొండల మధ్య ఉంది. ఇక్కడి రెండు కొండల నడుమ ఒక నీటి ప్రవాహము వచ్చి ఒక కొలనులో దూకుతూ ఉంటుంది. ఎంత ఎత్తునుంచి నీళ్లు జాలువారుతాయో కనిపించవు. రెండు కొండల నడుమ ఉండే పెద్ద గుండు ఎప్పడు మీద పడుతందో అని భయపడక మానరు. ఔషధ లక్షణాలు కల మొక్కలు అనేకం ఉన్నాయి. ప్రకృతిని పక్షులను జంతువులను చూడడానికి అటవీ శాఖవారు వాచ్ టవర్లను నిర్మించారు. వాటి పైకెక్కి చూడవచ్చు.

వృక్ష సంపద... వన్య ప్రాణుల నెలవు!!
తలకోన దట్టమైన అటవీ ప్రాంతం. వృక్ష సంపదకు, వన వుూలికలకు పుట్టినిల్లు. ఈ అడవుల్లో వృక్షాలు చాలా ఎత్తుగా ఉంటాయి. సూర్యరశ్మి నేలమీద పడనంత దట్టమైన అడవి కావడంతో చెట్లు సూర్యరశ్మిని అందుకోవడానికి పైకి పైపైకి పెరుగుతాయి. ఎక్కువగా ఎర్రచందనం, జాలారు, వుద్ది లాంటి చెట్లు ఉంటాయి. అడవిలో ప్రధానంగా అడవికోళ్లు, నెమెళ్లు, దేవాంగుపిల్లి, బెట్లుడుత, ఎలుగుబంట్లు, వుుచ్చకోతి, దుప్పులు, కణితులు, ఏనుగులు ఉన్నాయి.

విడిది చేసే వారి కోసం
తలకోన జలపాతానికి దగ్గర్లోని ఆలయ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకశాఖ నిర్మించిన ఓ అతిథి గృహం ఉంది. అలాగే వచ్చి విడిది చేసే వారి కోసం ఫారెస్టు శాఖ గెస్ట్‌హౌస్‌లు, తిరువుల తిరుపతి దేవస్థానం గదులు ఉన్నాయి.ఆలయానికి తలకోనకు వెళ్లే పర్యాటకులు తినే పదార్థాలను వెంట తీసుకెళ్లాలి. ఏమీ తీసుకెళ్లనివారు ఆలయం దగ్గరున్న హోటల్లో ముందుగా చెపితే భోజనం ఏర్పాటు చేస్తారు. పర్యాటకులు చెట్లపై నడవడానికి అటవీ శాఖ వినూత్న ప్రయోగం చేసింది. అదే కెనఫీవాక్. పర్యాటకులను ఆకర్షించేందుకు అటవీ శాఖ నెమళ్లను కూడా పెంచుతోంది. తలకోనలోని జలపాతాన్ని సందర్శించే పర్యాటకులు సాయంత్రం వరకు జలపాతం వద్ద గడిపి పొద్దుపోయే సమయానికి గుడిదగ్గరికి చేరుకుంటారు. మరో ప్రత్యేకత ఏమంటే ఇక్కడ సినిమా షూటింగులు నిరంతరం జరుగుతూనే వుంటాయి.

ఎలా చేరుకోవాలి?
విమానాశ్రయం
తలకోన జలపాతానికి సుమారుగా 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నది తిరుపతి విమానాశ్రయం. ఈ తిరుపతి విమానాశ్రయానికి దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, చెన్నై, ముంబై, కలకత్తా, హైదరాబాద్, బెంగళూరు మొదలగు ప్రాంతాలనుంచి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

రైల్వే స్టేషన్
తలకోనకి చేరువలో ఉన్న రైల్వే స్టేషన్ తిరుపతి. ఈ స్టేషన్ కి దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి రైళ్లు వస్తుంటాయి. తలకోనకి ఈకాక్‌ది నుంచి రావాలంటే బస్సు ద్వారా కానీ, ట్యాక్సీ ల ద్వారా కానీ లేకుంటే స్టేషన్ బయటికి వస్తే ఆటో లు దర్శనమిస్తాయి. అవి ఎక్కి కూడా రావచ్చు.

రోడ్డు మార్గం
ఒకవేళ మీరు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించాలనుకుంటే, చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెం వుండలంలో వైఎస్‌ఆర్ జిల్లా సరిహద్దుకు దగ్గరగా ఉంది తలకోన. ఇక్కడికి చేరుకోవాలంటే తిరుపతి గుండా ప్రయాణించాలి. తిరుపతి, పీలేరుల నుంచి తలకోనకు ప్రతి గంటకు ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. తిరుపతి - మదనపల్లె జాతీయు రహదారి మార్గంలోని భాకరాపేట చేరుకుంటే అక్కడ నుంచి ఆటోలు, జీపులు ఉంటాయి.

No comments:

Post a Comment