Friday, 10 June 2016

మంచి కాఫీలాంటి మడికేరి

భారతదేశపు స్కాట్లాండ్‌గా పేరుగాంచిన కూర్గ్ లేదా మడికేరి, కొడగు జిల్లా కేంద్రంగా బాసిల్లుతూ ఉన్నది. సముద్ర మట్టానికి 1525 మీటర్ల ఎత్తున ప్రకృతి ఒడిలో ప్రభవించిన కూర్గ్, బెంగుళూరు నగరానికి 252 కి.మీ.ల దూరంలో ఉంది. ఏటవాలు పర్వతంపై చిక్కటి అరణ్యాన్ని పాదుకున్న కూర్గ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు, దట్టమైన అడవి, వేల ఎకరాల మేర విస్తీర్ణంలో ఆవరించుకున్న టీ మరియు కాఫీ తోటలు, నారింజ తోటలు... ఊపిరి సడలనివ్వని సుందర దృశ్యాలతో మరిచిపోలేని విరామ విడిదిగా మడికేరి అలరారుతున్నది. అంతేకాదు... ఇక్కడ స్థానికంగా గల దర్శనీయ స్థలాలు మడికేరికి అదనపు ఆకర్షణను చేకూరుస్తున్నాయి.

సూర్యాస్థమయ వీక్షణం: 
శతాబ్ద కాలానికిపైగా చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకున్న మడికేరి కోటలో దేవాలయం, ప్రార్థన మందిరం, చెరసాలలతో పాటు చిన్నపాటి పురావస్తు ప్రదర్శన శాల ఉన్నాయి. ఇక రాజాస్థానం గురించి చెప్పాలంటే, కొడగు రాజులు తమ సాయంత్రాలను ఇక్కడే గడిపేవారని వినికిడి. రాజాస్థానం నుంచి సూర్యాస్తమయాన్ని వీక్షించడం మరుపురాని అనుభూతిగా మిగిలిపోతుంది. మడికేరిలో ప్రత్యేకించి సందర్శించవలసినదిగా నాగర్‌హోళె జాతీయ ఉద్యానవనం పేరొందినది. ఏనుగులు, పులులు, చుక్కల జింకలు, అడవి దున్నపోతులు తదితర సమస్త జంతు జాలాన్ని ఇక్కడ వీక్షించవచ్చు. పర్యాటకుల సౌకర్యార్థం రాత్రిపూట కూడా బసచేసే ఏర్పాట్లు ఉద్యానవనంలో ఏర్పాటు చేశారు. మడికేరి సమీపంలో పర్యాటకులను, సినీజనాన్ని అమితంగా ఆకర్షించే అబ్బీ జలపాతం, భాగమండల మరియు కావేరీ నదీ జన్మస్థానమైన తలకావేరీలు పర్వతాలతో ఆవృతమై నేత్రానందం కలిగిస్తున్నాయి.

రామలక్ష్మణులు సంచరించిన ప్రాంతం:
సీతాదేవిని వెదుకుతూ రామలక్ష్మణులు సంచరించినదిగా చెప్పబడే ఇరుప్పు జలపాతం, అటవీశాఖకు చెందిన ఏనుగులను పట్టుట మరియు శిక్షణా కేంద్రమైన దుబరే, ఇక్కడకు 30 కి.మీల దూరంలోని కావేరీ నదీ నిలువ నీళ్ళతో మనసుకు ఉల్లాసాన్ని కలిగించే వలనూర్, కావేరి, కనిక మరియు సుజ్యోతి నదులు సంగమించే భాగమండల, ప్రశాంతతకు ఆలవాలమైన నిసర్గధామ పర్యాటక స్థలాలు ప్రకృతి రమణీయతకు పట్టం కడుతున్నాయి.

వసతి సౌకర్యాలు :
రోడ్డు మార్గం ద్వారా మాత్రమే ఇక్కడకు చేరుకోగలము. ఇక్కడకు రైలు మరియు విమాన సౌకర్యం లేదు. బెంగుళూరు, మైసూరు, మంగళూరు, కన్ననూరు మరియు తెల్లిచెర్రి నుంచి మడికేరికి బస్సు సౌకర్యం కలదు. సుందర పర్వత ప్రాంతమైన మడికేరిలో బస చేసేందుకు హోటళ్ళు ఉన్నాయి. కూర్గ్‌లో ఎటు చూసినా పచ్చదనం పరుచుకుపోయి కనిపిస్తుంది. గలగల పారే సెలయేర్లు, నదులు , కొండలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇక జలపాతాలంటారా మనసును ఎక్కడికో తీసుకుపోతాయి. యూత్ ఇష్టపడే ట్రెక్కింగ్, రిఫ్టింగ్, వన్యప్రాణులు, రక రకాల పక్షులను ఇక్కడ చూడొచ్చు. దేవాలయాలు, బౌద్ధ ఆరామాలు, కోటలు కూర్గ్‌లో కనిపిస్తాయి. ఇన్ని అందాలకు నెలవైన కూర్గ్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందామా...

అందమైన హిల్ స్టేషన్ కూర్గ్: 
దక్షిణ భారతదేశంలో కూర్గ్ అందమైన హిల్ స్టేషన్. బెంగుళూరుకు 252 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. సముద్రమట్టానికి 1525 మీటర్ల పైగా ఎత్తులో ఉండి దేశ విదేశాల నుంచి వస్తున్న పర్యాటకులనెందరినో ఆకట్టుకుంటోంది. కూర్గునే కొడగు అని కూడా అంటారు. నిజానికి దీనిని పూర్వం కొడైమాలనాడు అని పిలిచేవారు. ఎత్తౖన కొండమీదున్న దట్టమైన అడవులు అని దీని అర్థం. ఇది దాదాపు 3000 నుంచి 4000 అడుగుల ఎత్తు ఉంటుంది. కొడగు లేదా కూర్గ్‌కు మడికెరి హెడ్‌క్వార్టర్స్. పచ్చటి ప్రకృతి, జలపాతాలు, వన్యమృగాలు, పక్షులకు కూర్గ్ నిలయం. అంతేకాదు ఇక్కడ కాఫీ, టీ ప్లాంటేషన్లు కూడా బాగా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన కాఫీ గింజల ఉత్పత్తి ఇక్కడ నుంచే జరుగుతోంది. కొడగులో మూడు తాలుకాలున్నాయి. అవి మడికెరి, విరాజ్‌పేట్, సోమ్‌వారప్పేట్. ఈ ప్రాంతాలన్నీ పచ్చటి లోయలతో, ఎత్తౖనకొండలతో, సెలయేర్లతో కనులవిందు చేస్తాయి.

హనీమూన్ జంటలకు కనువిందు:
పొగమంచునిండిన పచ్చటి అడవుల అందాలు చెప్పనక్కర్లేదు. కూర్గ్ చరిత్ర కూడా ఎంతో విశిష్టమైంది. ఈ ప్రాంతాన్ని ఎందరో రాజవంశీయులు పరిపాలించారు. ముఖ్యంగా దక్షిణాదిన ఉన్న పలు రాజవంశస్థులు అంటే కదంబాలు, గంగాలు, చోళులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, హోయసలలు, విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పాలించిన వారిలో ఉన్నారు. కూర్గ్ హానీమూన్ జంటలకు ఎంతో బాగుంటుంది. అలాగే వేసవిలో గడపడానికి వచ్చేవారికి కూడా ఇది మంచి ప్రదేశం. ఇక సెలవులను ఎంజాయ్ చేయడానికి వచ్చే కుర్రకారైతే ఈ ప్రదేశంలో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడి జలపాతాలను జులై సెప్టెంబరు నెలల మధ్యలో చూస్తే ఎంతో బాగుంటుంది. అలాగే ఇక్కడి మాన్‌సూన్ సీజన్ సాహసప్రియులకు ఎంతో అనుకూలమైనది. ఆ టైములో రివర్ రాఫ్టింగ్ చేయొచ్చు. కూర్గ్‌కి సమీపంలో బైలకుప్పె అనే ప్రాంతం ఉంది. ఇది దక్షిణాదిలోనే అతి పెద్ద టిబెట్ సెటిల్‌మెంట్. ఇది మడికెరి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. కూర్గ్‌కు 94 కిలోమీటర ్ల దూరంలో నగర్‌హోలె నేషనల్ పార్క్ ఉంది. ఇది కూడా చూడాల్సిన ప్రాంతం. ఇది అతి పెద్ద వన్యప్రాణుల పార్కు. ఇక్కడ పులులు, ఏనుగులు, నీటిగుర్రాలు, తోడేళ్లు వంటివెన్నో జంతువులు కనిపిస్తాయి. అంతేకాదు 250 రకాల పక్షులు అందులో ఉన్నాయి. ప్రత్యేకంగా బర్డ్ వాచింగ్ చేసేందుకు ఇక్కడకు వచ్చే పర్యాటకులు ఎందరో ఉన్నారు.

చూడాల్సిన ప్రదేశాలెన్నో :
కూర్గ్ అందాలు వర్ణించలేనంత బాగుంటాయి. అక్కడ అడుగుపెట్టగానే భూలోకస్వర్గంలా అనిపిస్తుంది. దీన్ని స్కాట్‌లాండ్ ఆఫ్ ఈస్ట్ అని కూడా అంటారు. బెంగుళూరు లేదా మంగళూరు నుంచి టాక్సీలో కూర్గ్‌కి వెడితే దారిపొడుగునా ఎన్నో ప్రకృతి అందాలను చూడొచ్చు. కూర్గ్‌లో ఎక్కడ చూసినా పచ్చదనమే. పొగమంచుతో కప్పబడిన కొండలు చూస్తుంటే మబ్బుల్లో విహరిస్తున్నట్టుగా ఉంటుంది. అంతేకాదు అక్కడ చిక్కటి అడవులు దర్శనమిస్తాయి. అడవిలోని రకరకాల మూలికా వృక్షాల వాసనలు అంతటా వ్యాపించి ఉంటాయి. ఎటు చూసినా కాఫీ ప్లాంటేషన్లు కనుల విందుగా కనిపిస్తుంటాయి. అక్కడి ప్రకృతి ఎంత స్వచ్ఛమైనదో కూర్గ్‌లోని ప్రజలు కూడా అంత స్వచ్ఛమనస్కులు. అక్కడి కొడవాలు ఎంతో స్నేహంగా ఉంటారు. విందు వినోదాలంటే వారికెంతో ఇష్టం. .

కావేరీ జన్మస్థలం:
కూర్గ్‌లో చూడాల్సిన మరో ప్రాంతం తలకావేరీ. కావేరి నదికి మూలం ఇదే. 4,500 అడుగుల ఎత్తు నుంచి ఇది ప్రవహిస్తుంది. ఇది మడికెరి నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రదేశం కన్నులు చెదిరేంత అందంగా ఉంటుంది. అబ్బీ ఫాల్స్ ఇంకొకటి. దీన్నే జెస్సీ ఫాల్స్ అని కూడా అంటారు.

అబ్బి అంటే స్థానిక కొడగు భాషలో జలపాతం అని అర్థం. మడికెరికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. కూర్గ్ హిల్‌స్టేషన్‌కు వచ్చిన పర్యాటకులు దీన్ని చూడకుండా వెళ్లరు. ఈ జలపాతంలో వేసవిలో కూడా నీరు పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు దీని శబ్దం రోడ్డు మీదకు వినిపిస్తుంది. ఇంకో ప్రసిద్ధి చెందిన జలపాతం ఇరుప్పు ఫాల్స్. నాగర్‌హోల్ వెళ్లే దారిలోని విరాజ్‌పేట నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. దానికి దగ్గరలోనే లక్ష్మీతీర్థ నది ప్రవహిస్తుంటుంది. ఇరుప్పు ఫాల్స్‌లో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని స్థానిక ప్రజల విశ్వాసం. శివరాత్రి రోజు తప్పనిసరిగా ఇక్కడకు వచ్చి స్నానాలాచరిస్తారు.

ఓంకారేశ్వర దేవాలయం:
కూర్గ్‌లో చూడాల్సిన గుడి ఓంకారేశ్వర దేవాలయం. ఇందులో శివునికి పూజలు చేస్తారు. ఈ దేవాలయం ఇస్లామిక్, గోథిక్ స్టైల్ ఆర్కిటెక్చర్‌లో కట్టారు. గుడి గోపురం మీద వాతావరణాన్ని తెలిపే బంతి ఆకారంలో ఉన్న క్లాక్ నిర్మాణం ఉంటుంది.

ఇక రాజాస్ సీట్ వచ్చి అద్భుతమైన ప్రకృతి దృశ్యాల్ని ఆవిష్కరిస్తుంది. ఎంతో అందమైన వ్యూ పాయింట్ ఇది. దీని నుంచి చుట్టూరా పరచుకున్న అడవులు, అందమైన సూర్యాస్తమయం చూడాలంటే రెండు కళ్లు చాలవు. కొడగు రాజులు ఇక్కడకు వచ్చి సాయంత్రాలు విశ్రాంతిగా గడిపేవారట. భాగమందాలా ఇక్కడ చూడాల్సిన మరో ప్రాంతం. దీన్ని టెంపుల్ టౌన్‌గా కూడా పేర్కొంటారు. కావేరి, కనిక, సుజ్యోతులనే మూడు నదుల కలిసిన చోట భాగమందాలా ఉంది. ఇక్కడ మడికెరి ఫోర్టును కూడా చూడొచ్చు. ఈ కోటను 19వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ ఒక మ్యూజియం, జైలు, దేవాలయం, చర్చి ఉన్నాయి. కూర్గ్‌లో వెలనూర్ అనే అందమైన హామ్లెట్ ఉంది. ఇది దుబారే అడవికి సమీపంలో ఉంది. ఈ ప్రదేశం ఎంతో అందంగా ఉంటుంది.

అక్కడ ఒక వైపు అడవులుంటే మరోవైపు కావేరీనది ప్రవహిస్తుంటుంది. ప్రకృతిప్రేమికులకు, ఫిషింగ్ ఇష్టపడేవారికి ఇది ఎంతో నచ్చే ప్రదేశం. మడికెరికి 22 కిలోమీటర్ల దూరంలో అవందూర్ ఫాల్స్ ఉన్నాయి. ఎన్నో చిన్న ఏరులు కలిసిన జలపాతం ఇది. ఈ జలపాతం అవందూర్ అడవిలో ఉంది కాబట్టి దీనికి అవందూర్ ఫాల్స్ అని పేరొచ్చింది. కోటెబెట్టా కొడగు జిల్లాలోని మరో అతిపెద్ద శిఖరం. సముద్రమట్టానికి 5,400 అడుగుల ఎత్తులో ఇది ఉంది. కోటెబెట్టా మడపూర్‌లో ఉంది. మడికెరికి 22 కిలోమీటర్ల దూరంలో మడపూర్ ఉంది. కూర్గ్‌లో ఇది ట్రెక్కింగ్‌కు ఎంతో అనుకూలమైన ప్రదేశం. అక్టోబరు మార్చి నెలల మధ్యలో ఇక్కడ ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. బైలకుప్పెతోపాటు చూడాల్సిన మరో ప్రదేశం సిద్దాపురా. బైలకుప్పెలో ఎన్నో బౌద్ధ ఆరామాలు ఉన్నాయి.

గోల్ఫ్ కోర్సులు:
ఇక అక్కడి ల్యాండ్‌స్కేప్ అందాలైతే చూడాల్సిందే గాని చెప్పలేం. సిద్దాపురా ట్రెక్కింగ్‌కు ప్రసిద్ధి. ఇక్కడి ప్రజలు కొడవ, కన్నడ, ఇంగ్లీషు భాషలు మాట్లాడతారు. ఇంకో విశేషమేమిటంటే కూర్గ్‌లో ఇండియా మొత్తంలో అధిక సంఖ్యలో గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి. వీటన్నింటినీ మీకు చూడాలని ఉందా... మరెందుకు ఆలస్యం సెలవుల్లో కూర్గ్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి మరి....కూర్గ్‌కు ఏ సీజన్‌లోనైనా వెళ్లొచ్చు. కానీ బెస్ట్ టైమ్ అంటే మాత్రం సెప్టెంబరు, మార్చినెలల మధ్య సమయమే. అకామడేషన్‌కు కూడా ఇబ్బంది లేదు. అన్ని రకాల కస్టమర్లకు తగిన వసతి సదుపాయాలు అక్కడ లభ్యమవుతాయి. లగ్జరీ హోటల్స్‌తోపాటు హిల్ రిసార్ట్స్ కూడా ఉంటాయి. మధ్యతరగతివారికి వీలుగా మీడియం ధరలకే ఎకానమీ హోటల్స్ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా క్యాంప్స్, హోంస్టేస్ కూడా ఉన్నాయి.

చూడాల్సిన ప్రదేశాలు: 
రాజాస్ సీట్, ఓంకారేశ్వర టెంపుల్, మడికెరి కోట, అబ్బీ ఫాల్స్, గడ్డిగె, బైలెకుప్పె, తలకావేరి, బారాపోలె రివర్, సోమ్‌వారప్పేట్

కూర్గ్‌కు మార్గాలు
కూర్గ్‌కు నేరుగా ఫ్లైట్ సర్వీసులు లేవు. దీనికి 135 కిలోమీటర్ల దూరంలో మంగళూరు ఎయిర్‌పోర్ట్ ఉంది. బెంగుళూరు లేదా మంగళూరు వరకు విమానంలో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కూర్గ్‌కు సులభంగా చేరుకోవచ్చు. కూర్గ్‌కు దగ్గరలో మైసూర్ రైల్వే స్టేషన్ ఉంది. బస్సు, వాహనాల సౌకర్యం కూడా అందుబాటులో ఉంటాయి. కూర్గ్ హైదరాబాద్‌కు 797 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకూ రైలు సౌకర్యం ఉంది. మైసూర్ రైల్వే స్టేషన్ నుంచి కూర్గ్ 117 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫ్లైట్‌లో వెళ్లాలనుకుంటే హైదరాబాద్ నుంచి మంగళూరు వరకూ వెళ్లాలి. మంగళూరు నుంచి 140 కిలోమీటర్ల దూరంలో కూర్గ్ ఉంది. బెంగుళూరు నుంచి కూడా కూర్గ్‌కు వెళ్లొచ్చు. హైదరాబాద్ నుంచి కూర్గ్‌కు బస్ సౌకర్యం ఉంది. ప్రయాణం 14 గంటలు పడుతుంది.

ఇండివిడ్యువల్ ట్రావలెర్స్‌కు ఇది సౌకర్యంగా ఉంటుంది. అదే వైజాగ్ నుంచి కూర్గ్‌కు దూరం 1282 కిలోమీటర్లు. రోడ్డు ద్వారా ప్రయాణం చేయడానికి 21 గంటలు పడుతుంది. వైజాగ్ నుంచి కూర్గ్‌కు ఫ్లైట్ డిస్టెన్స్ 994 కిలోమీటర్లు. హైదరాబాద్ నుంచి బెంగుళూరు ఫ్లైట్‌లో వెళ్లాలనుకునేవాళ్లకు టికెట్ ఖర్చు 2,291 రూపాయలతో మొదలవుతుంది. అలాగే వైజాగ్ నుంచి మంగుళూరు ఫ్లైట్‌లో వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ 2,938 రూపాయల నుంచి ఉంటుంది. అదే వైజాగ్ నుంచి బెంగుళూరు వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ 3,607 రూపాయల నుంచి ఉంటుంది.

No comments:

Post a Comment