Saturday, 23 July 2016

నిష్కళంక మహదేవుడు

పాపాలనుబాపే సముద్రలింగేశ్వరుడు..
నిష్కళంక మహదేవుడు..


తెలిసీ తెలియకుండా మనం నిత్యం చేసే పాపాలను తొలగించి మనల్ని పాప ప్రాయచిత్తాల నుంచి విముక్తుల్ని చేసి నిష్కళంకులుగా మార్చే ధైవం ఎవరు అంటూ.. అదే కేవలం నిష్కళంక మహాదేవుడితోనే జరుగుతుంది, కోరిన వారికెళ్లా వరాలనిచ్చే బోలా శంకరుడు.. తనను తప్పస్సుతో అరాధించిన పరమభక్తులను నిష్కళంకులుగా మార్చి నిష్కళంక మహాదేవుడి మారి లింగస్వరూపంలో వారిన కనురించాడు. అబిషేక ప్రియుడైన ఈ మహాదేవుడ్ని రోజూ అభిషేకించే భాగ్యాన్ని సముద్రుడికి కల్పించాడు. అంతేకాదు భక్తులు కూడా అరాధించేందుకు వీలుగా రోజులో కొన్న గంటలు మాత్రం అవకాశం కల్పించాడు.గుజరాత్‌ తీరం వెంట అరేబియా సముద్రంలో ఒకటిన్నర కిలోమీటర్ల లోపలికి ఓ గడ్డమీద నిష్కళంక మహదేవ్‌గా విరాజిల్లుతున్నాడు పరమశివుడే నిష్కళండ మహాదేవుడు. రోజులో కొన్ని గంటలు మినహా మిగతా సమయంలో ఆ గుడి సముద్రంలోనే మునిగిపోయి ఉంటుంది. ఉదయం, సాయంత్రాల్లో అలలు వెనక్కు తగ్గిన కొన్ని గంటలే స్వామి దర్శనం. బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకునేందుకు రామచంద్రుడు శివుణ్ని అర్చించాడు. అలాగే కౌరవులతో జరిగిన యుద్ధంలో బంధువులను చంపిన పాపాన్ని పరిహారం చేసుకునేందుకు పాండవులూ మహాదేవుడ్నే శరణువేడారు. మహాభారత యుద్ధం తరువాత పాండవులు శివుడిని కొలిచిందీ, వాళ్లను కరుణించి పరమశివుడే ఐదు లింగ రూపాల్లో వెలసిందీ గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు ముప్ఫైకిలోమీటర్ల దూరంలో ఉన్న కొలియాక్‌ గ్రామంలోనేనని ప్రతీతి. భక్తుల దోషాలనూ, పాపాలనూ తొలగించే దేవుడిగా ఇక్కడి శివుడు పూజలందుకుంటున్నాడు.

స్థల పురాణం...
పాండవ కౌరవ యుద్ధం ముగిసింది. శ్రీకృష్ణుడి సారథ్యంలో పాండవులు జయకేతనం ఎగురవేశారు. కానీ... ఎంతోమంది రక్తసంబంధీకులనూ పెద్దలనూ ఈ యుద్ధంలో భాగంగా చంపాల్సి రావడం ఆ ఐదుగురు అన్నదమ్ములనూ కలవరపరచింది. అదే విషయాన్ని కృష్ణభగవానుడికి విన్నవించుకున్నారు. అందుకు పరిష్కారంగా ఆయన పాండవులకు ఒక నల్ల ఆవునూ, ఒక నల్ల జెండానూ ఇచ్చాడు. 'ఈ ఆవును వదిలేయండి. ఈ జెండా చేత పట్టుకొని దాని వెంట నడవండి. ఏ ప్రాంతంలో అయితే ఆ ఆవు రంగూ, జెండా రంగూ తెల్లగా మారతాయో, అక్కడే మీరు పరమశివుడిని దోష పరిహారం కోసం ప్రార్థించండి' అని చెప్పాడు.

పాండవులంతా ఆ ఆవునడచిన దారిన నడిచారు. ఓ రోజు సముద్ర తీరం వెంట నల్లావు ప్రయాణించ సాగింది. అలా నడుస్తూ ఉండగా ఓ చోట ఆవురంగూ, జెండా రంగూ తెల్లగా మారిపోయాయి. అక్కడే సోదరులంతా కూర్చుని మహాదేవుడ్ని ధ్యానించారు. భోళాశంకరుడు కరిగిపోయాడు. ధ్యానముద్రలో ఉన్న ఆ ఐదుగురు అన్నదమ్ముల ముందూ ఐదుశివలింగాల రూపంలో ఉద్భవించాడు. ఆ శివలింగాలను చూసిన పాండవులు ఆనందాశ్చర్యాలకు గురయ్యారు. భక్తితో పూజించారు. వారి పాపాలను తొలగించేందుకు ఉద్భవించిన శివుడు కనుక ఆయన్ను నిష్కళంక మహదేవ్‌గా కొలుస్తారు భక్తులు.

దర్శనం ఇలా...
ఈ ఆలయాన్ని చూడాలంటే గుజరాత్‌ భావ్‌నగర్‌ నుంచి కొలియాక్‌ గ్రామానికి వెళ్లాలి. అక్కడి అరేబియా సముద్ర తీరం దగ్గర నిలుచుంటే సముద్రం లోపలికి దూరంగా రెండు స్తంభాలపై జెండాలు ఎగురుతూ కనిపిస్తాయి. అదే శివుడు వెలసిన ప్రాంతానికి గుర్తు. పోటు తగ్గినప్పుడు కాలి నడకన ఇక్కడికి వెళ్లొచ్చు. 500 అడుగుల ఎత్తులో విశాలంగా పరచుకున్న నలుచదరపు నేల కనిపిస్తుంది. ఆ ప్రాంగణంలోనే ఐదు శివలింగాలూ నందితో కలిసి వెలసి ఉంటాయి. అక్కడే ఓ పక్క పాండవ కొలను అన్న పేరుతో చిన్న సరస్సు ఉంటుంది. అందులో కాళ్లు కడుక్కుని స్వామి దర్శనానికి వెళతారు భక్తులు. పక్కనే రెండు జెండా స్తంభాలూ కనిపిస్తాయి.

ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మాత్రమే ఇక్కడి స్వామిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా గోపురంతో కూడిన గుడిలాంటి నిర్మాణమేమీ ఇక్కడ ఉండదు. పౌర్ణమి అమావాస్య సమయాల్లో సముద్రపోటు ఎక్కువగా ఉన్నా వెనక్కు వెళ్లే సమయమూ ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో ఎక్కువ మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. 17వ శతాబ్దంలో భావ్‌నగర్‌ మహారాజు భావ్‌సింగ్‌ ఈ ప్రాంతాన్ని భక్తులు పూజ చేసుకునేందుకు వీలుగా కాంక్రీటూ, నాపరాళ్లతో మలచారు. ప్రతి శ్రావణ మాసంలోని అమావాస్యనాడు భాదర్వి పేరుతో ఇక్కడ ఓ వేడుక జరుగుతుంది. దాన్ని దేవాలయ పండుగగా పిలుస్తారు. ఆ రోజు భావ్‌నగర్‌ మహారాజులు ఇక్కడి ధ్వజస్తంభం మీద కొత్త జెండాను ఉంచుతారు. వేడుకగా జరిగే ఈ ఉత్సవానికి వేల మంది భక్తులు వస్తారు.

మరుసటేడాది మళ్లీ మార్చేదాకా ఆ జెండానే అక్కడ ఉంటుంది. సముద్ర తీరంలో భూకంపం లాంటివి వచ్చిన సందర్భాలు సహా ఏనాడూ ఈ జెండా అక్కడి నుంచి కదలలేదని స్థానికులు చెబుతారు. ఉదయం ఏడు గంటలకూ, సాయంత్రం ఆరున్నర గంటల సమయంలోనూ ఇక్కడ హారతి నిర్వహిస్తారు. ఆ రోజు తిథిని బట్టి హారతి సమయాలు కాస్త అటు ఇటుగా మారుతూ ఉంటాయి. ఇక, ఇక్కడి నీళ్లలో అస్థికలు కలిపితే చనిపోయిన వాళ్లకి మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మిక. సముద్రం లోపల, ప్రశాంత వాతారణంలో హరహర మహాదేవ నాదాలు సాయంత్రం మళ్లీ సాగరుడు పలకరించే దాకా రోజూ వినిపిస్తూనే ఉంటాయిక్కడ!